భారతదేశంలో 1980లో దళితులు ఎదుర్కొన్న పరిస్థితులను ఇప్పుడు ముస్లింలు ఎదుర్కొంటున్నారని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరతీశాయి. అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగిన ‘మోహబ్బత్ కీ దుకాన్’ పేరుతో జరిగిన డిబేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 1980లో దళితులు ఎంతటి దీనావస్థలో ఉండేవారో ఇప్పుడు ముస్లింలు అదే దీనావస్థలో ఉన్నారని అన్నారు. కానీ 80వ దశకంలో అధికారంలో ఉంది తన నాయనమ్మ ఇందిరా గాంధీ, ఆమె తర్వాత తన తండ్రి రాజీవ్ గాంధీనే. ఈ విషయాన్ని మరచి రాహుల్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణులకు బూస్టింగ్ ఇచ్చినట్లయింది.
రాహుల్ గాంధీ ఏమన్నారంటే..
ఈరోజు భారతదేశంలో ముస్లింల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. వారి పరిస్థితి దయనీయం. ఇదే పరిస్థితిని సిక్కులు, క్రైస్తవులు,దళితులు, గిరిజనులు కూడా ఎదుర్కొంటున్నారు. చాలాకాలం క్రితం 1980ల్లో యూపీ వంటి రాష్ట్రాలకు వెళ్లి చూస్తే ఆనాడు దళితులు ఇటువంటి విపరీతమైన పరిస్థితులనే ఎదుర్కొనేవారు. ఇలాంటి సమయంలో ప్రజల్లో సామరస్యం నెలకొల్పాలంటే అది ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుంది. ప్రజల్లో వారు నింపిన ద్వేషపూరితమైన స్వభావాన్ని నిర్మూలించాలంటే ఒక్కటే మార్గం.. ప్రేమ. ద్వేషాన్ని ఎన్నటికీ ద్వేషంతో దూరం చేయలేము. కేవలం ప్రేమతోనే అది సాధ్యమవుతుందని అన్నారు.
లవ్ ఫార్ములా..
ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో కూడా రాహుల్ గాంధీ ప్రేమతోనే మనుషుల మధ్య దూరాన్ని తగ్గించవచ్చన్న మంత్రాన్ని జపించారు. ఇదే సూత్రంతో కర్ణాటకలో కాంగ్రెస్ విజయభేరి మోగించిన సంగతి తెలిసిందే. అక్కడ ఈ పాచికపారడంతో గ్లోబల్గా ఇదే సిద్ధాంతానికి ప్రచారం కల్పిస్తున్నారు రాహుల్ గాంధీ.
అందులో భాగంగానే సాన్ ఫ్రాన్సిస్కోలో జరుగుతున్న ‘మొహబ్బత్ కీ దుకాన్’ ను వేదికగా చేసుకున్నారు రాహుల్ గాంధీ. లవ్ ని ప్రమోట్ చేయడం వరకు అంతా బాగానే ఉంది కానీ పీరియాడిక్ పోలికతో రాహుల్ సెల్ఫ్ గోల్ వేసుకోవడమే కాంగ్రెస్ వర్గాలకు మింగుడుపడటం లేదు. అసలే వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్ ఇలాంటి వాక్కు దోషాలు చేస్తే బీజేపీ వాటిని గెలుపుకి సాధనాలుగా వాడుకున్నా వాడుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment