మాల్దీవ్స్‌ అధ్యక్షుడి యూటర్న్‌.. భారత్‌తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు | Maldives President U turn, Special Appeal For Indian Tourists | Sakshi
Sakshi News home page

మాల్దీవ్స్‌ అధ్యక్షుడి యూటర్న్‌.. భారత్‌తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు

Published Mon, Oct 7 2024 2:42 PM | Last Updated on Mon, Oct 7 2024 3:20 PM

Maldives President U turn, Special Appeal For Indian Tourists

న్యూఢిల్లీ: మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్‌ మయిజ్జు భారత్‌ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా భారత్‌-మాల్దీవుల సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీతో మాల్దీవులు బలమైన, వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తుందని పేర్కొన్నారు. భారత్‌ తమకు విలువైన భాగస్వామి మాత్రమే కాకుండా మంచి స్నేహితుడని తెలిపారు. పరస్పర గౌరవంతో తమ సంబంధం ఏర్పడినట్లు చెప్పారు.

తమ దేశ ‘ మాల్దీవ్స్‌ ఫస్ట్‌’ విధానం భారత్‌లో దాని దీర్ఘకాల సంబంధాలకు ఎలాంటి ఆటంకం కలిగించదని స్పష్టం చేశారు. ముఖ్యంగా భారత భద్రతా ప్రయోజనాలను దెబ్బతీసేలా మాల్దీవులు వ్యవహరించబోదని పేర్కొన్నారు. రక్షణ సహా పలు రంగాల్లో సహాకారానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.

అంతర్జాతీయ సంబంధాల్లో వైవిధ్యతను చూపడం మాల్దీవులకు చాలా అవసరమని, అలాగే ఏ ఒక్క దేశంపైనా అతిగా ఆధారపడటం తగ్గించుకోవాల్సిఉందన్నారు. అయితే దాని వల్ల భారత ప్రయోజనాలు దెబ్బతినవని తెలిపారు. ఈ సందర్భంగానే భారత టూరిస్టులకు ఆహ్వానం పలికారు. భారత టూరిస్టులు తమ దేశంలో పర్యటించాలని, వారు తమ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతున్నారని తెలిపారు.

చదవండి: ఇజ్రాయెల్‌ నగరంపై హెజ్‌బొల్లా వైమానిక దాడులు

 కాగా నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మయిజ్జు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మొహమ్మద్‌ కూడా మొయిజ్జు వెంట ఉన్నారు. సోమవారం  మధ్యాహ్నం రాష్ట్రపతి భన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజ్‌ఘట్‌ వద్ద మహాత్వాగాంధీకి నివాళులు అర్పించారు. తర్వాత హైదరాబాద్‌ హౌజ్‌లో ప్రధానితో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. కాగా నాలుగు నెలల్లో మొయిజ్జు భారత్‌కు రావడం ఇది రెండోసారి కాగా.. ఇదే తొలి ద్వైపాక్షిక పర్యటన. 

ఇక చైనా అనుకూలుడుగి పేరున్న మయిజ్జు హయాంలో రెండు దేశాల మద్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గతేడాది నవంబర్‌లో మయిజ్జు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్‌కు రావడం ఇది రెండోసారి. ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇతర దేశాధినేతలతో మయిజ్జు హాజరయ్యారు. ప్రస్తుతం మాల్దీవులు ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్నందుకున్న భారత్‌తో దెబ్బతిన్న సంబంధాలను తిరిగి గాడిన పెట్టేందుకు మయిజ్జు ప్రయత్నిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement