Bilateral relations
-
శనివారం నుంచి మోదీ కువైట్ పర్యటన
న్యూఢిల్లీ: శనివారం నుంచి ప్రధాని మోదీ కువైట్‌లో రెండ్రోజులపాటు పర్యటించనున్నారు. గత 43 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు ఈ గల్ఫ్ దేశంలో పర్యటనకు వెళ్తుండటం ఇదే తొలిసారి కావడం విశేషం. కువైట్ అమీర్ షేక్ మెషాల్ అల్ అహ్మద్ అల్ జబీర్ అల్ సబాహ్ ఆహ్వానం మేరకు ఇండియా, కువైట్ ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా ప్రధాని పర్యటిస్తున్నారని భారత విదేశాంగ శాఖ బుధవారం పేర్కొంది. పర్యటనలో భాగంగా మోదీ కువైట్ పాలకులతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. అక్కడ భారతీయ సంతతి వ్యక్తులతో భేటీ కానున్నారు. చివరిసారిగా 1981లో నాటి ప్రధాని ఇందిరా గాంధీ కువైట్‌లో పర్యటించారు. కువైట్, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2023–24లో ఏకంగా 10.47 బిలియన్ డాలర్లకు చేరుకుంది. -
గయానాతో 10 ఒప్పందాలు
జార్జిటౌన్: పలు రంగాల్లో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసుకో వాలని భారత్, గయానా నిర్ణయించాయి. వ్యవసాయం, హైడ్రోకార్బన్లు మొదలుకుని ఫార్మా, డిజిటల్ పేమెంట్ల దాకా 10 రంగాల్లో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సైనికంగా గయానాకు కీలక మద్దతు అందజేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా బుధవారం గయానా చేరుకున్న ఆయనకు అపూర్వ స్వాగతం పలికింది. జార్జిటౌన్ విమానాశ్రయంలో అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ, పలువురు మంత్రులు మోదీని స్వయంగా స్వాగతించారు. గత 56 ఏళ్లలో అక్కడ పర్యటించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. తన పర్యటనతో ఇరు దేశాల మైత్రీ బంధం సుదృఢమవుతుందని ఆయన ఆశాభావం వెలిబుచ్చారు. గయానాలో జన్ ఔషధీ కేంద్రం ఏర్పాటుకు కూడా నిర్ణయం జరిగింది. పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై నేతలిద్దరూ లోతుగా చర్చించారు. ఇరు దేశాల సంబంధాల్లో మోదీ పర్యటన ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఇర్ఫాన్ అలీ అన్నారు. ఆయన్ను నేతల్లో చాంపియన్‌గా అభివర్ణించారు. మోదీ పాలన తీరు అద్భుతమన్నారు. భేటీ అనంతరం నేతలిద్దరూ మొక్కలు నాటారు. గయానా, గ్రెనెడా, బార్బడోస్ ప్రధాను లు కూడా మోదీతో భేటీ అయ్యారు. తర్వాత గయానాలోని భారతీయులతో ప్రధాని భేటీ అయ్యారు. 185 ఏళ్ల కింద అక్కడికి వలస వెళ్లిన భారతీయులు ఇప్పటికీ దేశ పతాకను సగర్వంగా రెపరెపలాడిస్తున్నారంటూ ప్రశంసించారు. గయానాలో 3.2 లక్షల మందికి పైగా ఎన్నారైలున్నారు. -
వచ్చే ఏడాది భారత్‌లో పుతిన్ పర్యటన!
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే ఏడాది భారత్‌లో పర్యటించే వీలుంది. దశాబ్దాల స్నేహం, బలమైన రక్షణ, వాణిజ్య బంధాలు, పరస్పరసహకారాలతో ఇరుదేశాల ద్వైపాక్షిక బంధం పటిష్టంగా ఉన్న నేపథ్యంలో వార్షిక పర్యటనల్లో భాగంగా వచ్చే ఏడాది పుతిన్ భారత్‌కు రావొచ్చని దౌత్యవర్గాలు మంగళవారం వెల్లడించాయి. పుతిన్ పర్యటన వేళ రష్యా ఏఏ అంశాలపై భారత్‌తో ఒప్పందాలు చేసుకోవచ్చు అనేది ఇంకా ఖరారుకాలేదని తెలుస్తోంది. ఈ ఏడాది జూలైలో భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా రాజధాని మాస్కోలో పర్యటించి పుతిన్‌తో విస్తృతస్థాయి చర్చలు జరిపిన విషయం విదితమే. భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక బంధం మరింత బలోపేతంకానుందని మంగళవారం రష్యా అధ్యక్ష కార్యాలయం అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో పుతిన్ భారత పర్యటన ఖాయమని దాదాపు స్పష్టమైంది. మంగళవారం ఆయన భారత సీనియర్ సంపాదకులతో వర్చువల్‌గా మాట్లాడారు. ‘‘ పుతిన్ త్వరలోనే భారత్‌లో పర్యటిస్తారు. అయితే పర్యటన తేదీలపై ఇరుదేశాలు సంప్రదింపులు జరపాల్సి ఉంది’ అని పెస్కోవ్ అన్నారు. అయితే ఏ తేదీల్లో ఎన్ని రోజులు భారత్‌లో పుతిన్ పర్యటిస్తారన్న వివరాలను దిమిత్రీ వెల్లడించలేదు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు మోదీ గత నెలలో కజక్‌స్తాన్‌లో పర్యటించిన విషయం తెల్సిందే. దీర్ఘశ్రేణి క్షిపణులను ఉక్రెయిన్‌కు అందించాలని బైడెన్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెస్కోవ్ మాట్లాడారు. ‘‘అమెరికా నిర్ణయం ఉక్రెయిన్–రష్యా యుద్ధంలో మరింత ఆజ్యంపోస్తోంది. యుద్ధం మరింతగా విస్తరించడం ఖాయం. బైడెన్ ప్రభుత్వం యుద్ధానికే మద్దతు పలుకుతోంది. శాంతిస్థాపనకు కాదు. రష్యాపై అధునాతన ఆయుధాల వినియోగానికి అమెరికా పచ్చజెండా ఊపిన నేపథ్యంలో మేం కూడా మా అణ్వస్త్ర విధానాన్ని సవరించాల్సిన సమయమొచ్చింది’’ అని పెస్కోవ్ అన్నారు. అణ్వాయుధ వినియోగానికి సంబంధించిన కీలక దస్త్రంపై పుతిన్ సంతకం చేసిన వేళ పెస్కోవ్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. -
సరిహద్దు గస్తీపై కీలక పురోగతి
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ విషయమై చైనాతో నెలకొన్న నాలుగేళ్ల పై చిలుకు సైనిక వివాదం కొలిక్కి వచి్చంది. ఇరు దేశాల దౌత్య, సైనిక ఉన్నతాధికారులు కొద్ది వారాలుగా జరుపుతున్న చర్చల ఫలితంగా ఈ విషయమై కీలక ఒప్పందం కుదిరింది. విదేశాంగ కార్యదర్శి విక్రం మిస్రీ సోమవారం ఈ మేరకు ప్రకటించారు. ‘‘తాజా ఒప్పందం ఫలితంగా తూర్పు లద్దాఖ్‌లోని దెస్పాంగ్, దెమ్చోక్ తదితర ప్రాంతాల నుంచి చైనా సైన్యం వెనుదిరుగుతుంది. అక్కడ ఇకపై భారత సైన్యం 2020కి ముందు మాదిరిగా గస్తీ కాస్తుంది’’ అని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల దిశగా దీన్నో మంచి ముందడుగుగా అభివర్ణించారు. రష్యాలో జరగనున్న బ్రిక్స్ సదస్సులో భాగంగా మంగళ, బుధవారాల్లో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ప్రధాని కీలక భేటీ ఉండొచ్చన్న వార్తల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం విశేషం. ఈ వివాదానికి తెర దించేందుకు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా గత వారం చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో చర్చలు జరిపారు. చైనాతో సరిహద్దు వివాదానికి సంబంధించి 75 శాతం సమస్యలు ఇప్పటికే పరిష్కారమైనట్టు జైశంకర్ గత నెలలో పేర్కొన్నారు. -
మాల్దీవ్స్ అధ్యక్షుడి యూటర్న్.. భారత్‌తో సంబంధాలపై కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ మయిజ్జు భారత్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా భారత్-మాల్దీవుల సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. న్యూఢిల్లీతో మాల్దీవులు బలమైన, వ్యూహాత్మక సంబంధాలను కొనసాగిస్తుందని పేర్కొన్నారు. భారత్ తమకు విలువైన భాగస్వామి మాత్రమే కాకుండా మంచి స్నేహితుడని తెలిపారు. పరస్పర గౌరవంతో తమ సంబంధం ఏర్పడినట్లు చెప్పారు.తమ దేశ ‘ మాల్దీవ్స్ ఫస్ట్’ విధానం భారత్‌లో దాని దీర్ఘకాల సంబంధాలకు ఎలాంటి ఆటంకం కలిగించదని స్పష్టం చేశారు. ముఖ్యంగా భారత భద్రతా ప్రయోజనాలను దెబ్బతీసేలా మాల్దీవులు వ్యవహరించబోదని పేర్కొన్నారు. రక్షణ సహా పలు రంగాల్లో సహాకారానికి ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.అంతర్జాతీయ సంబంధాల్లో వైవిధ్యతను చూపడం మాల్దీవులకు చాలా అవసరమని, అలాగే ఏ ఒక్క దేశంపైనా అతిగా ఆధారపడటం తగ్గించుకోవాల్సిఉందన్నారు. అయితే దాని వల్ల భారత ప్రయోజనాలు దెబ్బతినవని తెలిపారు. ఈ సందర్భంగానే భారత టూరిస్టులకు ఆహ్వానం పలికారు. భారత టూరిస్టులు తమ దేశంలో పర్యటించాలని, వారు తమ ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపుతున్నారని తెలిపారు.చదవండి: ఇజ్రాయెల్ నగరంపై హెజ్బొల్లా వైమానిక దాడులు#WATCH | Delhi: Prime Minister Narendra Modi receives Maldives President Mohamed Muizzu at Hyderabad House. The two leaders are holding a meeting here.(Video: DD News) pic.twitter.com/P3oE9MVRay— ANI (@ANI) October 7, 2024 కాగా నాలుగు రోజుల పర్యటన నిమిత్తం మయిజ్జు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. మాల్దీవుల ప్రథమ మహిళ సాజిదా మొహమ్మద్ కూడా మొయిజ్జు వెంట ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం రాష్ట్రపతి భన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఘన స్వాగతం పలికారు. అనంతరం రాజ్‌ఘట్ వద్ద మహాత్వాగాంధీకి నివాళులు అర్పించారు. తర్వాత హైదరాబాద్ హౌజ్‌లో ప్రధానితో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. కాగా నాలుగు నెలల్లో మొయిజ్జు భారత్‌కు రావడం ఇది రెండోసారి కాగా.. ఇదే తొలి ద్వైపాక్షిక పర్యటన. ఇక చైనా అనుకూలుడుగి పేరున్న మయిజ్జు హయాంలో రెండు దేశాల మద్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గతేడాది నవంబర్‌లో మయిజ్జు అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్‌కు రావడం ఇది రెండోసారి. ప్రధానిగా మోదీ మూడోసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇతర దేశాధినేతలతో మయిజ్జు హాజరయ్యారు. ప్రస్తుతం మాల్దీవులు ఆర్థిక సంక్షోభంతో పోరాడుతున్నందుకున్న భారత్‌తో దెబ్బతిన్న సంబంధాలను తిరిగి గాడిన పెట్టేందుకు మయిజ్జు ప్రయత్నిస్తున్నారు. -
శాంతి, సుస్థిరతకు చర్చలే మార్గం
కీవ్/న్యూఢిల్లీ: ఉక్రెయిన్–రష్యా మధ్య సంఘర్షణకు సాధ్యమైనంత త్వరగా తెరదించాలని, ఇందుకోసం రెండు దేశాలు చర్చించుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఆయన పోలండ్ నుంచి ట్రైన్ ఫోర్స్ వన్ రైలులో బయలుదేరి, 10 గంటలపాటు సుదీర్ఘ ప్రయాణం సాగించి, శుక్రవారం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కు చేరుకున్నారు. మోదీకి ఉక్రెయిన్ ప్రభుత్వ అధికారులు, భారతీయులు ఘన స్వాగతం పలికారు. కీవ్‌లో ఆయన బస చేసిన హయత్ హోటల్ వద్దకు పెద్ద సంఖ్యలో భారతీయులు తరలివచ్చారు. వారికి మోదీ అభివాదం చేశారు. 1991 తర్వాత ఉక్రెయిన్‌లో భారత ప్రధాని పర్యటించడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర.. రష్యాపై ఉక్రెయిన్ ఎదురుదాడి ఉధృతమవుతున్న నేపథ్యంలో భారత ప్రధానమంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కీవ్‌లో అడుగుపెట్టిన తర్వాత మోదీ నేషనల్ మ్యూజియం ఆఫ్ హిస్టరీ వద్దనున్న ‘మల్టీమీడియా మారీ్టరాలజిస్టు ఎక్స్పోజిషన్’ను సందర్శించారు. యుద్ధంలో మరణించిన ఉక్రెయిన్ చిన్నారుల స్మారకార్థం ఈ కట్టడాన్ని నిర్మించారు. ఇక్కడ ప్రధాని మోదీ ఓ బొమ్మను ఉంచి, అమరులైన బాలలకు నివాళులరి్పంచారు. చేతులు జోడించి నమస్కరించారు. వారిని తలచుకొని చలించిపోయారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని మోదీ ఆలింగనం చేసుకున్నారు. కరచాలనం చేశారు. యుద్ధంలో దెబ్బతిన్న ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటిస్తూ జెలెన్స్కీ భుజంపై మోదీ ఆతీ్మయంగా చెయ్యి వేశారు. అనంతరం కీవ్ సిటీలోని ఒయాసిస్ ఆఫ్ పీస్ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మోదీ ఘనంగా నివాళులరి్పంచారు. శాంతి, సామరస్యంతో వర్ధిల్లే సమాజ నిర్మాణానికి మహాత్ముడు బోధించిన శాంతి సందేశం ఎల్లవేళలా అనుసరణీయమని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. గాం«దీజీ చూపిన ఆదర్శ మార్గం ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సంక్షోభాలకు చక్కటి పరిష్కార మార్గం అవుతుందన్నారు. కీవ్‌లో స్కూల్ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్‌లో హిందీ భాష నేర్చుకుంటున్న ఉక్రెయిన్ విద్యార్థులతో మోదీ ముచ్చటించారు. ఆచరణాత్మక సంప్రదింపులు జరగాలి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మోదీ సమావేశమయ్యారు. భారత్–ఉక్రెయిన్ మధ్య సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. వాణిజ్యం, ఆర్థికం, రక్షణ, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నారు. భారత్–ఉక్రెయిన్ మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు కూడా జరిగాయి. ఉక్రెయిన్–రష్యా మధ్య సంఘర్షణ అంతం కావాలని, ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొనాలని ప్రధానమంత్రి మోదీ ఆకాంక్షించారు. సంఘర్షణకు సాధ్యమైనంత త్వరగా ముగింపు పలికేలా ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కోవడానికి ఉక్రెయిన్, రష్యా పరస్పరం చర్చించుకోవాలని కోరారు. శాంతి, సుస్థిరత కోసం రెండు దేశాల మధ్య ఆచరణాత్మక సంప్రదింపులు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. జెలెన్స్కీతో జరిగిన చర్చలో మోదీ ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ వెల్లడించారు. ఉక్రెయిన్‌లో శాంతియుత పరిస్థితుల పునరుద్ధరణకు అన్ని రకాలుగా సాయం అందిస్తామని మోదీ హామీ ఇచి్చనట్లు తెలిపారు. మోదీ–జెలెన్స్కీ మధ్య నిర్మాణాత్మక, సమగ్ర చర్చ జరిగిందన్నారు. ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితులు, ఆహార, ఇంధన భద్రత కొరవడడంపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఉక్రెయిన్–రష్యా మధ్య చర్చలు ప్రారంభించి, ముందుకు తీసుకెళ్లడానికి అందుబాటులో ఉన్న ప్రభావవంతమైన మార్గాలపై మోదీ, జెలెన్స్కీ చర్చించుకున్నారని వివరించారు. ఆ రెండు దేశాలు కలిసి కూర్చొని చర్చించుకొని, సంఘర్షణకు పరిష్కారం కనిపెట్టాలన్నదే భారతదేశ అభిమతమని జైశంకర్ స్పష్టంచేశారు. మోదీ చేపట్టిన ఉక్రెయిన్ పర్యటనను ఒక ల్యాండ్‌మార్క్‌గా ఆయన అభివర్ణించారు. నాలుగు భీష్మ్ క్యూబ్స్ బహూకరణ ప్రధాని మోదీ ఉక్రెయిన్ ప్రభుత్వానికి నాలుగు భీష్మ్ (భారత్ హెల్త్ ఇనీíÙయేటివ్ ఫర్ సహయోగ్ హిత, మైత్రి) క్యూబ్స్‌ను బహూకరించారు. అన్ని ర కాల గాయాలకు చికిత్స అందించేందుకు అవసర మైన ఔషధాలు, పరికరాలు, వస్తువులు ఈ క్యూబ్స్ లో ఉన్నాయి. అంతేకాదు పరిమితంగా విద్యుత్, ఆ క్సిజన్‌ను ఉత్పత్తిచేసే పరికరాలు సైతం ఉన్నాయి. భారత్ మద్దతు మాకు కీలకం: జెలెన్స్కీ తమ దేశ జాతీయ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భారత్ మద్దతు ఇస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. భారత్ మద్దతును తాము అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నామని చెప్పారు. భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం జెలెన్స్కీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఈ రోజు ఒక కొత్త చరిత్ర నమోదైందని పేర్కొన్నారు. భారత్‌లో పర్యటించాలని జెలెన్స్కీని మోదీ ఆహ్వానించారు.జెలెన్స్కీ అప్పుడేమన్నారంటే... ఉక్రెయిన్ పర్యటనలో అధ్యక్షుడు జెలెన్స్కీని ప్రధాని మోదీ ఆతీ్మయంగా ఆలింగనం చేసుకోవడం, భుజంపై చెయ్యి వేయడం ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్శించింది. దీనిపై పలు వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. నరేంద్ర మోదీ ఈ ఏడాది జూలై 9వ తేదీన రష్యాలో పర్యటించారు. రష్యా అధినేత పుతిన్‌తో సమావేశమై, చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఫొటోలకు ఫోజులిచ్చారు. ఈ ఆత్మీయ కలయికపై అప్పట్లో జెలెన్స్కీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శాంతి ప్రయత్నాలకు ఇదొక ఎదురుదెబ్బ అని ఆక్షేపించారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ ప్రపంచంలో అత్యంత క్రూరమైన రక్తపిపాసి, నేరగాడు అయిన పుతిన్‌ను ఆలింగనం చేసుకున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టుచేశారు. జెలెన్స్కీ అప్పట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి తెరపైకి వచ్చాయి. నాలుగు ఒప్పందాలపై భారత్, ఉక్రెయిన్ సంతకాలు మోదీ–జెలెన్స్కీ చర్చల తర్వాత నాలుగు కీలక ఒప్పందాలపై భారత్, ఉక్రెయిన్ శుక్రవారం సంతకాలు చేశాయి. వ్యవసాయం, ఆహార పరిశ్రమ, ఔషధాలు, సాంస్కృతికం–మానవతా సాయం విషయంలో రెండు దేశాలు పరస్పరం సహకరించుకోనున్నాయి. సోషల్ మీడియాలో విశేష స్పందన మోదీ, జెలెన్స్కీ భేటీకి సోషల్ మీడియాలో విశేష స్పందన లభించింది. ఈ సమావేశం గురించి నెటిజన్లు విస్తృతంగా చర్చించుకున్నారు. తమ అభిప్రాయాలు పంచుకున్నారు. మోదీతో కలిసి ఉన్న ఫొటోలను జెలెన్స్కీ తన ఇన్‌స్టా్రగామ్ ఖాతాలో పోస్టు చేశారు. ఈ పోస్టుకు గంటల వ్యవధిలోనే 10 లక్షలకుపైగా లైక్‌లు వచ్చాయి. భారత్–ఉక్రెయిన్ అనుబంధాన్ని బలోపేతం చేసుకోవడానికి ఈ సమావేశం చాలా కీలకమని జెలెన్స్కీ ఉద్ఘాటించారు. -
అభివృద్ధి భాగస్వామి బంగ్లాదేశ్
న్యూఢిల్లీ: సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(సీఈపీఏ)పై చర్చలు ప్రారంభించాలని, ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకొనే దిశగా ప్రణాళిక రూపొందించుకోవాలని భారత్, బంగ్లాదేశ్ నిర్ణయించుకున్నాయి. రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన బంగ్లా ప్రధానమంత్రి షేక్ హసీనాతో శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార వాణిజ్యపరమైన అంశాలపై విస్తృతంగా చర్చించారు. మయన్మార్ పరిణామాలతోపాటు రోహింగ్యా కాందిశీకుల అంశంపై అభిప్రాయాలు పంచుకున్నారు. అనంతరం సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు. భారత్‌కు బంగ్లాదేశ్ అతిపెద్ద అభివృద్ధి భాగస్వామి అని మోదీ అన్నారు. బంగ్లాదేశ్‌తో సంబంధ బాంధవ్యాలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా సీఈపీఏపై చర్చలు ప్రారంభించామని నిర్ణయించినట్లు తెలిపారు. రక్షణ రంగంలో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించామన్నారు. రక్షణ ఉత్పత్తుల తయారీ, సైనిక దళాల ఆధునీకరణ విషయంలో ఇరుదేశాలు సహకరించుకోవాలని ఆకాంక్షించారు.భారత్ విశ్వసనీయ మిత్రదేశం: హసీనా ఇండో–పసిఫిక్ కార్యక్రమంలో చేరాలన్న బంగ్లాదేశ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మోదీ చెప్పారు. ‘‘ఇరు దేశాల బంధానికి పౌరుల మధ్య సంబంధాలే పునాది. వైద్య సేవల కోసం వచ్చే బంగ్లా పౌరులకు ఈ–మెడికల్ వీసా కలి్పస్తాం. బంగ్లాదేశ్‌లోని రంగపూర్‌లోని కొత్తగా అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయం ఏర్పాటు చేయనున్నాం. 1996 నాటి గంగా నది నీటి ఒప్పందాన్ని నవీకరించడానికి సాంకేతిక చర్చలు ప్రారంభిస్తాం. తీస్తా నది పరిరక్షణ, నిర్వహణపై చర్చించడానికి బంగ్లాదేశ్‌కు టెక్నికల్ టీమ్‌ను పంపుతాం’’ అని ప్రధాని వివరించారు. సుస్థిరమైన, సౌభాగ్యవంతమైన, ప్రగతిశీల బంగ్లాదేశ్‌ను బంగబంధు షేక్ ముజిబుర్ రెహా్మన్ కలలుగన్నారని, ఆ కలను నిజం చేయడానికి తమవంతు సహకారం అందిస్తామని నరేంద్ర మోదీ ప్రకటించారు. భారత్ తమకు అతిపెద్ద పొరుగు దేశమని, తమకు అత్యంత విశ్వసనీయ మిత్రదేశమని షేక్ హసీనా పునరుద్ఘాటించారు. భారత్‌తో సంబంధాలకు అత్యధిక విలువ ఇస్తున్నామని ఆమె పునరుద్ఘాటించారు.10 ఒప్పందాలపై సంతకాలు డిజిటల్, సముద్రయానం, సముద్ర వనరుల వినియోగం, రైల్వే, అంతరిక్షం, పర్యావరణ పరిరక్షణకు గ్రీన్ టెక్నాలజీ, ఆరోగ్యం, వైద్య వంటి కీలక రంగాల్లో సహకారం పెంపొందించుకోవడమే లక్ష్యంగా భారత్, బంగ్లాదేశ్ శనివారం 10 ఒప్పందాలపై సంతకాలు చేశాయి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో షేక్ హసీనా భేటీ న్యూఢిల్లీ: వేర్వేరు రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకొనే దిశగా భారత్, బంగ్లాదేశ్ వేగంగా ముందుకు సాగుతున్నాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. నూతన రంగాల్లో సహకారం పెంపొందించుకుంటున్నాయని, రానున్న రోజుల్లో ఇరు దేశాల మధ్య సంబంధాలను ఈ సహకారమే నిర్ణయిస్తుందని చెప్పారు. శనివారం రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్ముతో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా సమావేశమయ్యారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను బలోపేతం చేసుకొనేలా కలిసి పనిచేయాలని నిర్ణయానికొచ్చారు. షేక్ హసీనాను కలవడం సంతోషంగా ఉందని ముర్ము పేర్కొన్నారు. -
G7 Summit 2024: స్వేచ్ఛా వాణిజ్యంపై మోదీ, రిషీ సమీక్ష
జీ7 భేటీ కోసం వచ్చిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తోనూ మోదీ భేటీ అయ్యారు. భారత్–యూకే వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పట్టిష్టంచేస్తామని ప్రధాని మోదీ అన్నారు. బ్రిటన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలో పురోగతిపై సునాక్‌తో కలిసి మోదీ సమీక్ష చేశారు. మూడోసారి ప్రధాని అయ్యారంటూ మోదీని సునాక్ అభినందనలు తెలపగా త్వరలో జరగబోయే బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాలంటూ సునాక్‌కు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకు చేయాల్సిన కృషిపై కూలంకషంగా చర్చించారు. ‘‘ రక్షణ, భద్రత, వాణిజ్యం, ఆర్థిక లావాదేవీలు, కీలక, అధునాతన సాంకేతిక రంగాలతోపాటు ప్రజాసంబంధాల్లోనూ ఇరుదేశాల మధ్య భాగస్వామం మరింత బలపడటంపై ఇరు నేతలు చర్చించారు’’ అని భేటీ తర్వాత భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది. -
మోదీకి భూటాన్‌లో అరుదైన గౌరవం
థింపూ: భూటాన్‌లో ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. రెండు రోజుల పర్యటనకు శుక్రవారం ఉదయం భూటాన్ రాజధాని థింపూ చేరుకున్న మోదీకి ప్రధాని త్సెరింగ్ టొబ్గే స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి థింపూ దాకా 45 కిలోమీటర్ల మేర ప్రజలు రోడ్డుకు రెండువైపులా నిలబడి భారత్, టిబెట్ పతాకాలతో స్వాగతం పలికారు. కొందరు యువకులు మోదీ స్వయంగా రాసిన పాటకు భారత సంప్రదాయ దుస్తుల్లో గర్బా నృత్యం చేశారు. దాన్ని మోదీ ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. రాజు వాంగ్‌చుక్‌తో భేటీ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నంగ్యేల్ వాంగ్‌చుక్, ప్రధాని త్సెరింగ్‌లతో మోదీ సమావేశమయ్యారు. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ డ్రుక్ గ్యాల్పో’ను తొలిసారిగా మోదీకి రాజు ప్రదానం చేశారు. భారత్, భూటాన్ ప్రజల అనుబంధం ద్వైపాక్షిక సంబంధాన్ని మరింత ప్రత్యేకంగా మారుస్తోందని మోదీ అన్నారు. భూటాన్ ప్రజల గుండెల్లో భారత్ ఉంటుందన్నారు. ఈ సుందర దేశంలోకి ఎప్పటికీ గుర్తుండిపోయేలా స్వాగతం పలికిన భూటాన్ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ధన్యవాదాలని ‘ఎక్స్’లో పేర్కొన్నారు. భారత్, భూటాన్ మైత్రి మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ‘మా పెద్దన్న మోదీ జీకి భూటాన్‌లోకి స్వాగతం’అని త్సెరింగ్ టొబ్గే ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అనంతరం ప్రధానుల సమక్షంలో ఇంధనం, వాణిజ్యం, కనెక్టివిటీ, అంతరిక్షం, వ్యవసాయం వంటి రంగాల్లో పలు ఒప్పందాలు, ఎంవోయూలపై అధికార ప్రతినిధులు సంతకాలు చేశారు. రెండు దేశాల నడుమ కొక్రాఝర్– గెలెఫు, బనార్హట్–సంత్సెల మధ్య రైల్వే లైనుపై ఎంవోయూకు తుదిరూపం ఇచ్చారు. 21, 22వ తేదీల్లోనే మోదీ భూటాన్‌లో పర్యటించాల్సి ఉండగా ప్రతికూల వాతావరణం వల్ల ఒక రోజు వాయిదా పడింది. ద్వైపాక్షిక, ప్రాంతీయ విషయాలపై భాగస్వామ్యాన్ని మరింత విస్తరించుకోవడానికి ప్రధాని పర్యటన ఉపయోగపడుతుందని విదేశాంగ శాఖ తెలిపింది. నేడు డిజొంగ్ మఠ సందర్శన భూటాన్‌లోని శక్తిమంతమైన తషిఛో డిజొంగ్ బౌద్ధ మఠాన్ని మోదీ శనివారం సందర్శించనున్నారు. థింపూలో భారత్ సహకారంతో ఏర్పాటైన అత్యాధునిక మాతా శిశు ఆస్పత్రిని ప్రారంభిస్తారు. గత వారం భూటాన్ ప్రధాని త్సెరింగ్ భారత్‌లో ఐదు రోజుల పాటు పర్యటించిన విషయం తెలిసిందే. -
India-Oman Relations: సరికొత్త మలుపు
న్యూఢిల్లీ: భారత్–ఒమన్‌ల మధ్య వ్యూహాత్మక సంబంధాల్లో మరో ముందడుగు పడింది. సుమారు 10 కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకునేందుకు రూపొందించిన దార్శనిక పత్రంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఒమన్ సుల్తాన్ హయితమ్ బిన్ తారిఖ్ ఏకాభిప్రాయానికి వచ్చారు. రెండు దేశాల సంబంధాల్లో ఇది సరికొత్త మలుపు కానుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. త్వరలోనే రెండు దేశాల మధ్య కుదిరే సమగ్ర వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం(సీఈపీఏ)కి ఇది దోహదప డుతుందని భావిస్తున్నారు. మొట్టమొదటి సారిగా భారత్‌లో పర్యటిస్తున్న ఒమన్ సుల్తాన్ హయితమ్ బిన్ తారిఖ్ శుక్రవారం ఢిల్లీ చేరుకున్నారు. శనివారం ఆయన ప్రధాని మోదీని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు హమాస్–ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధంతో ఉత్పన్నమైన పరిస్థితులపై చర్చలు జరిపారు. పాలస్తీనా సమస్యకు పరిష్కారమైన రెండు దేశాల సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు సాగించాలని వారు అభిప్రాయపడినట్లు విదేశాంత శాఖ కార్యదర్శి వినయ్ క్వాత్రా చెప్పారు. అదేవిధంగా, ఇద్దరు నేతలు ఒమన్–భారత్ సంయుక్త పెట్టుబడి నిధికి మూడో విడతగా రూ.2,500 కోట్లు సమకూర్చుతామని ప్రకటించారు. ఈ మొత్తాన్ని భారత ఆర్థిక వ్యవస్థలో అత్యంత వేగంగా అభివృద్ధి నమోదు చేసుకున్న రంగాల్లో పెట్టుబడులుగా వినియోగిస్తారు. భారత్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఒమన్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ భాగస్వామ్యం కింద ఇప్పటి వరకు రెండు విడతల్లో రూ.2,500 కోట్ల మేర పెట్టుబడులు పెట్టాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్థిక నేరాలపై పోరు, సాంస్కృతిక సంబంధాలతోపాటు ఒమన్‌లోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ కార్యాలయంలో హిందీ విభాగాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించిన ఒప్పందాలపై రెండు దేశాలు సంతకాలు చేశాయని విదేశాంగ శాఖ తెలిపింది. -
అమెరికా, భారత్ బంధాలకు హద్దుల్లేవ్
వాషింగ్టన్: అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక బంధాలకు హద్దుల్లేవని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు అత్యున్నత స్థాయికి చేరుకు న్నాయని, ఇరు దేశాలు పరస్పర అవసరాలు తీర్చుకుంటూ, సౌకర్యవంతమైన, అనుకూలమైన భాగస్వామ్యులుగా మెలగుతున్నాయని పేర్కొన్నారు. చంద్రయాన్ మాదిరిగా ఇరు దేశాల మధ్య బంధాలు చంద్రుడిని తాకాయని, అంతకుమించి హద్దుల్లేకుండా సాగిపోతున్నాయని అభివర్ణించారు. అమెరికాలో పర్యటిస్తున్న జైశంకర్ శనివారం ప్రవాస భారతీయులతో ఇండియా హౌస్‌లో సమావేశమయ్యారు. ఇక్కడ నిర్వహించిన సెలబ్రేటింగ్ కలర్స్ ఆఫ్ ఫ్రెండ్షిఫ్ కార్యక్రమానికి అమెరికాలో వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో ప్రవాస భారతీయులు తరలివచ్చారు. ప్రవాస భారతీయులనుద్దేశించి జై శంకర్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సంబంధాల్ని మరో కొత్త స్థాయికి తీసుకువెళతామని చెప్పారు. ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చినా ఇరు దేశాల మధ్య సంబంధాలు పటిష్టంగా సాగుతున్నాయని, ఇక భవిష్యత్‌లో సరికొత్త రంగాల్లో అమెరికాతో కలిసి పని చేస్తామని వెల్లడించారు. భారత్‌లో నిర్వహించిన జీ–20 సదస్సుకి అమెరికా సహకారం అందించడం వల్లే విజయ వంతమైందని అన్నారు. ‘‘దేశాలు ఒకరితో ఒకరు వ్యాపారాలు చేస్తాయి. రాజకీ యాలు చేస్తాయి. మిలటరీ బంధాలు కలిగి ఉంటాయి. విన్యాసాలు నిర్వహిస్తాయి. సాంస్కృతిక బదలాయింపులు ఉంటాయి. అయి నప్పటికీ రెండు దేశాలు లోతైన మానవీయ సంబంధాలు కలిగి ఉండాలి. అప్పుడే ఆ బంధం సంపూర్ణమవుతుంది. ప్రస్తుతం భారత్, అమెరికా మధ్య అలాంటి సంబంధాలే ఉండాలి’’ అని జైశంకర్ వివరించారు. -
కేంద్రం వైఖరిని సమర్థిస్తున్నాం
లండన్: రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని పూర్తిగా సమర్థిస్తున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. విశాలమైన దేశం అయినందున ప్రపంచదేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం భారత్‌కు సహజంగానే ఉంటుందని చెప్పారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న వైఖరికి రష్యా నుంచి చమురు సరఫరాయే కారణమా అన్న మీడియా ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ‘రష్యాతో మాకు సంబంధాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషయంలో ప్రభుత్వ, ప్రతిపక్షం వైఖరి భిన్నంగా ఉంటుందని నేను భావించడం లేదు’అని వివరించారు. రష్యా నుంచి దూరంగా తమవైపు భారత్‌ను లాక్కునేందుకు పశ్చిమ దేశాల నేతలు ప్రయత్నించారా అన్న ప్రశ్నకు రాహుల్ గాంధీ.. ‘‘వాస్తవానికి భారత్‌కు రష్యాతో సత్సంబంధాలున్నాయి. అదేవిధంగా అమెరికాతోనూ సంబంధాలు న్నాయి. భారత్ విశాల దేశం. పెద్ద దేశం కావడం వల్ల అనేక ఇతర దేశాలతో వివిధ స్థాయిల్లో సంబంధాలు కొనసాగుతున్నాయి. ఎవ్వరితోనైనా సంబంధాలు కొనసాగించే హక్కు భారత్‌కు ఉంది’అని రాహుల్ చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు విషయంలో ప్రతిపక్షం వైఖరిపై ఆయన..కశ్మీర్ అభివృద్ధిని కాంగ్రెస్ గట్టిగా కోరుతోంది. అక్కడ శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తోంది’అని రాహుల్ వివరించారు. కశ్మీర్ అంశం పరిష్కారానికి అంతర్జాతీయ దౌత్యం అవసరమని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు రాహుల్ సూటిగా సమాధానమిచ్చారు. వాస్తవానికి కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. కశ్మీర్ మా సొంత విషయం. అందులో భారత్‌కు తప్ప మరెవ్వరి జోక్యం అవసరం లేదు’అని కుండబద్దలు కొట్టారు. -
India-Greece: ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం
ఏథెన్స్: తమ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవడానికి, వివిధ కీలక రంగాల్లో పరస్పరం సహకరించుకోవడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ, గ్రీసు ప్ర«దానమంత్రి కిరియాకోస్ మిత్సొటాకిస్ ఒక అవగాహనకు వచ్చారు. గ్రీసు రాజధాని ఏథెన్స్లో శుక్రవారం ఇరువురు నేతలు ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని, రెండు దేశాల మధ్య పరస్పర వాణిజ్యాన్ని 2030 నాటికి రెండింతలు చేసుకోవాలని తీర్మానించుకున్నారు. రాజకీయ, రక్షణ, ఆర్థిక అంశాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకోవాలని నిర్ణయించారు. రక్షణ, షిప్పింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ, సైబర్ స్సేస్, విద్య, సాంస్కృతికం, పర్యాటకం, వ్యవసాయం తదితర ముఖ్యమైన రంగాల్లో భారత్–గ్రీసు నడుమ మరింత సహకారం అవసరమని మోదీ, కిరియాకోస్ అభిప్రాయపడ్డారు. ఇంటర్నేషనల్ సోలార్ అలయెన్స్(ఐఎస్ఏ)లోకి గ్రీసుకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. ఈ మేరకు భారత్–గ్రీసు ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశాయి. మోదీకి ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ హానర్’ గ్రీసుకు చెందిన ప్రతిష్టాత్మక ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ హానర్’ ప్రధాని నరేంద్ర మోదీకి లభించింది. గ్రీసు అధ్యక్షురాలు కటెరీనా ఆయనను ఈ గౌరవంతో సత్కరించారు. ఈ ఆర్డర్ ఆఫ్ హానర్‌ను గ్రీసు ప్రభుత్వం 1975లో నెలకొలి్పంది. తొమ్మిదేళ్లలో వివిధ దేశాలు మోదీని అత్యున్నత పురస్కారాలతో సత్కరించాయి. ఇందులో గ్రీసు ఆర్డర్ ఆఫ్ హానర్ కూడా చేరింది. చంద్రయాన్–3.. మానవాళి విజయం చంద్రయాన్–3 విజయం కేవలం భారత్‌కే పరిమితం కాదని, ఇది ప్రపంచంలోని ప్రజలందరికీ చెందుతుందని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. ఆయన శుక్రవారం ఏథెన్స్లో గ్రీసు అధ్యక్షురాలు కాటెరీనా ఎన్ సాకెల్లారోపౌలౌతో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయానికొచ్చారు. చంద్రయాన్–3 మిషన్‌పై అధ్యక్షురాలు కటెరీనా ప్రశంసల వర్షం కురిపించారు. మోదీ ప్రతిస్పందిస్తూ.. చంద్రయాన్ ఘనత మొత్తం మానవాళికి చెందుతుందని చెప్పారు. ఏథెన్స్లో మోదీకి ఘన స్వాగతం ఒక రోజు పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ దక్షిణాఫ్రికా నుంచి శుక్రవారం గ్రీసు రాజధాని ఏథెన్స్కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో మోదీకి గ్రీసు విదేశాంగ మంత్రి జార్జి గెరాపెట్రిటైస్ ఘనంగా స్వాగతం పలికారు. గ్రీసులో నివసిస్తున్న భారతీయులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. మోదీకి సాదర స్వాగతం పలికారు. భారత ప్రధానమంత్రి గ్రీసులో పర్యటించడం గత 40 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ సంభాషణ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ శుక్రవారం ఇరాన్ అధ్యక్షుడు సయ్యద్ ఇబ్రహీం రైసీతో ఫోన్లో మాట్లాడారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై ఇరువురు నేతలు చర్చించారు. చాబర్ బహర్ నౌకాశ్రయాన్ని పూర్తి స్థాయిలో కనెక్టివిటీ హబ్‌గా మార్చడం సహా ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు కట్టుబడి ఉన్నట్లు వారు పునరుద్ఘాటించారు. బ్రిక్స్ విస్తరణ వంటి అంతర్జాతీయ వేదికలపై సహకారంపైనా వారు చర్చించారు. దక్షిణాఫ్రికాలో త్వరలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర భేటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు నేతలు పేర్కొన్నారు. -
నేపాల్ ప్రధానితో మోదీ చర్చలు
న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య పరస్పర సహకారంపై నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహాల్ (ప్రచండ)తో భారత ప్రధాని మోదీ శనివారం చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య మైత్రి బంధాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టిసారించామని ఆ తర్వాత ప్రధాని మోదీ చెప్పారు. ఈ మేరకు శనివారం ఇద్దరు నేతలు కొంతసేపు ఫోన్లో సంభాíÙంచుకున్నారు. ‘మే 31 నుంచి జూన్ మూడో తేదీ వరకు భారత్‌లో పర్యటించిన నేపాల్ ప్రధాని ప్రచండతో మోదీ పలు ద్వేపాక్షిక అంశాలపై చర్చించారు’ అని ఆ తర్వాత ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదలచేసింది. పొరుగు దేశం నేపాల్‌ను భారత్ చిరకాలంగా మిత్రదేశంగా పరిగణిస్తోంది. -
వియత్నాంకు కానుకగా మన యుద్ధనౌక
న్యూఢిల్లీ: వియత్నాంకు భారత్ అరుదైన కానుక అందించింది. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి నిదర్శనంగా ఐఎన్ఎస్ కృపాణ్ యుద్ధనౌకను బహుమతిగా ఇచి్చంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యంపై ఇరు దేశాల్లో నెలకొన్న ఆందోళనల్ని దృష్టిలో ఉంచుకొని తీర ప్రాంతంలో గస్తీని బలోపేతం చేయడం దీని ఉద్దేశమంటున్నారు. పూర్తి సామర్థ్యంతో పని చేసే యుద్ధ నౌకను ఒక మిత్రదేశానికి భారత్ కానుకగా ఇవ్వడం ఇదే తొలిసారని నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్.హరికుమార్ వెల్లడించారు. వియత్నాం పర్యటనలో ఉన్న ఆయన శనివారం బే ఆఫ్ కామ్ రన్హ్ జలాల్లో జరిగిన కార్యక్రమంలో ఐఎన్ఎస్ కృపాణ్‌ను ఆ దేశానికి అందజేశారు. పూర్తిస్థాయి ఆయుధాలతో కూడిన నౌకను ఆ దేశ నేవీకి అప్పగించినట్టు వివరించారు. భారత్ జీ20 సదస్సు ప్రధాన థీమ్ అయిన వసుధైక కుటుంబం (ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్)లో భాగంగానే ఈ కానుక ఇచ్చినట్టు తెలిపారు. ఐఎన్ఎస్ కృపాణ్ గస్తీతో దక్షిణ చైనా జలాల్లో అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా అన్ని దేశాలకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐఎన్ఎస్ కృపాణ్ జూన్ 28న విశాఖపట్నం నుంచి బయల్దేరి జూలై 8 నాటికి వియత్నాం చేరింది. -
యుద్ధనౌక ఐఎన్ఎస్ కృపాణ్:ఈ కానుక ఏ తీరాలకి..?..ప్రత్యేకతలివే..!
► పసిఫిక్ మహా సముద్రంలోని దక్షిణ చైనా సముద్రంపై గత కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. చైనా ఈ ప్రాంతంపై తన సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడాన్ని సముద్రం చుట్టూ ఉన్న దేశాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రం కేవలం డ్రాగన్దేనంటే ఊరుకోబోమని అందులో తమకూ భాగం ఉందని గళమెత్తుతున్నాయి. అలాంటి దేశాల్లో వియత్నాం కూడా ఒకటి. చైనా పొరుగునే ఉన్న వియత్నాం ఇండో పసిఫిక్ ప్రాంతంలో మనకి అత్యంత కీలక భాగస్వామిగా ఉంది. భావసారూప్యత కలిగిన భాగస్వామ్య దేశమైన వియత్నాం నౌకాదళ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశ ఆధిపత్యానికి చెక్ పెట్టాలన్నది భారత్ వ్యూహంగా ఉంది. దక్షిణ చైనా సముద్రంపై చైనా పెత్తనం పెరుగుతున్న కొద్దీ ప్రపంచ పటంలో కొత్త మార్పులు వస్తాయన్న ఆందోళనలున్నాయి. ఇటీవల కాలంలో వియత్నాంతో మన దేశానికి ద్వైపాక్షిక సంబంధాలు బలపడుతున్నాయి. రక్షణ రంగంలో సహకరించుకుంటున్నాం. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశ పెత్తనం సహించలేనిదిగా మారింది. ఈ నేపథ్యంలో వియత్నాం రక్షణ మంత్రి జనరల్ ఫాన్ వాన్ జియాంగ్ భారతదేశ పర్యటనకు వచి్చనçప్పుడు ఈ యుద్ధ నౌకను కానుకగా ఇవ్వాలని భారత్ నిర్ణయించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఇప్పటివరకు భారత్ ఎన్నో మిత్ర దేశాలకు మిలటరీ సాయాలు చేసింది. మాల్దీవులు, మారిషస్ వంటి దేశాలకు చిన్న చిన్న పడవలు, మిలటరీ పరికరాలు ఇచి్చంది. మయన్మార్‌కు ఒక జలాంతర్గామిని ఇచి్చంది. కానీ వియత్నాంకు క్షిపణిని మోసుకుపోగలిగే సామర్థ్యమున్న యుద్ధ నౌకను ఇవ్వడం వల్ల ఆ తీరంలో చైనా కార్యకలాపాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేయడానికి వీలు కలుగుతుందన్నది భారత్ ఉద్దేశంగా ఉంది. ప్రత్యేకతలివే..! ► ఐఎన్ఎస్ కృపాణ్ ఖుక్రీ క్లాస్‌కు చెందిన అతి చిన్న క్షిపణి యుద్ధనౌక. 1,350 టన్నుల బరువైన, సముద్రజలాలను పక్కకు తోసేస్తూ వేగంగా ముందుకు దూసుకెళ్లగల శక్తివంతమైన నౌక ఇది. ► పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్, ఇంజనీర్లు రూపొందించిన ఈ నౌక గత కొన్నేళ్లుగా మన నావికా దళానికి గర్వకారణంగా ఉంది. ► 1991 జనవరి 12న దీనిని నావికాదళంలోకి ప్రవేశపెట్టారు.. 25 నాట్స్ వేగంతో ప్రయాణించగలదు. ► మీడియం రేంజ్ గన్స్ అంటే 30 ఎంఎం తుపాకీలను ఈ నౌకకు అమర్చవచ్చు. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, చాఫ్ లాంచర్స్ వంటి వైవిధ్యమైన పనులు చేయగలదు. ► తీరప్రాంతాల్లో భద్రత, గస్తీ, కదనరంగంలో పాల్గొనడం, యాంటీ పైరసీ, విపత్తు సమయాల్లో మానవతా సాయం వంటివి చేయగల సామర్థ్యముంది. ► భారత్ నావికాదళంలో చురుగ్గా సేవలు అందిస్తున్న యుద్ధనౌక ఐఎన్ఎస్ కృపాణ్‌ను కేంద్ర ప్రభుత్వం వియత్నాంకు కానుకగా ఇచ్చింది. విదేశాలకు ఒక నౌకని బహుమతిగా ఇవ్వడం దేశ చరిత్రలో ఇదే మొదటి సారి. ఈ నౌక విశాఖ నుంచి ఈ నెల 28 బుధవారం వియత్నాంకు బయల్దేరి వెళ్లింది. 2016 నుంచి భారత్, వియత్నాం మధ్య సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటివరకు మనం ఎన్నో దేశాలకు మిలటరీ సాయం చేశాము. కానీ కోట్లాది రూపాయల విలువ చేసే యుద్ధ నౌకను ఇప్పటివరకు ఎవరికీ ఇవ్వలేదు ? ఎందుకీ నిర్ణయం? దీని వల్ల భారత్‌కు ఒరిగేదేంటి ? దక్షిణ చైనా సముద్రం వివాదమేంటి? ► దక్షిణ చైనా సముద్రంపై సుదీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. ఈ సముద్ర భూభాగంపై సార్వ¿ౌమాధికారాన్ని ప్రకటించుకున్న చైనా ఏకంగా కృత్రిమ దీవులను నిర్మిస్తోంది. ఈ సముద్రంలో ఎన్నో దీవులున్నాయి. మత్స్య సంపద అపారంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా చేపల ఉత్పత్తిలో 15 శాతం ఈ సముద్రంలో జరుగుతుంది. దీనిపై చైనా సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకోవడం ఇతర దేశాలకు మింగుడు పడడం లేదు.ఈ సముద్రంలో ఉన్న అన్ని ద్వీపాలను ఒకే రేఖ మీద చూపిస్తూ చైనా విడుదల చేసిన ‘‘నైన్ డ్యాష్ లైన్’ మ్యాప్‌తో తనవేనని వాదిస్తోంది. ఈ సముద్రంలో భారీగానున్న చమురు నిల్వలపై అన్వేషణ కూడా ప్రారంభం కావడంతో దేశాల మధ్య పోటీ ఎక్కువైంది. హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహా సముద్రం మధ్యలో దక్షిణ చైనా సముద్రం ఉండడం వల్ల అక్కడ చైనా జోక్యం పెరిగితే భారత్‌కూ నష్టమే. ఈ సముద్రం చుట్టూ చైనా, తైవాన్, వియత్నాం, మలేసియా, ఇండోనేసియా, బ్రూనై, ఫిలిప్పీన్స్ దేశాలున్నాయి. ఇవి కూడా సముద్రంలో తమకూ వాటా ఉందని ప్రకటించాయి. మరోవైపు చైనా కృత్రిమ దీవులు, సైనిక స్థావరాలతో ఉద్రిక్తతలు చెలరేగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య మనం పంపిన కృపాణ్ దక్షిణ చైనా జలాల్లో ఎంత మేరకు నిఘా పెడుతూ డ్రాగన్‌కు చెక్ పెడుతుందో వేచిచూడాలి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
భారత్–అమెరికా భాగస్వామ్యానికి ప్రపంచంలో ప్రాముఖ్యత: బైడెన్
వాషింగ్టన్: భారత్–అమెరికా భాగస్వామ్యానికి, స్నేహానికి ప్రపంచంలో అత్యధిక ప్రాముఖ్యత ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా, సన్నిహితంగా, స్థిరంగా ఉన్నాయని వివరించారు. వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నతస్థాయికి చేర్చాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ మేరకు బైడెన్ తాజాగా ట్వీట్ చేశారు. బైడెన్ ట్వీట్ పట్ల ప్రధాని మోదీ స్పందించారు. భారత్–అమెరికా స్నేహం ప్రపంచదేశాల అభ్యున్నతికి తోడ్పతుందని పేర్కొన్నారు. మన భూగోళం మరింత ఉత్తమంగా, స్థిరంగా మారడానికి ఇరుదేశాల భాగస్వామ్యం ఎంతగానో ఉపయోగపడుతుందని ట్విట్టర్లో స్పష్టం చేశారు. బైడెన్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానని తెలిపారు. ఇటీవల తాను చేపట్టిన పర్యటన భారత్–అమెరికా నడుమ సంబంధ బాంధవ్యాల బలోపేతానికి దోహదపడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్, అమెరికా దేశాల మధ్యనున్న సన్నిహిత, లోతైన భాగస్వామ్యాన్ని మోదీ పర్యటన మరింత దృఢతరం చేసిందని అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్‌హౌజ్ హర్షం వ్యక్తం చేసింది. -
భారత్ ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఫైనాన్షింగ్‌కు సంబంధించి ఒక కొత్త ఒప్పంద ఖరారుకు పారిస్‌లో జరుగుతున్న సదస్సులో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పలు దేశాలతో భారత్ ద్వైపాక్షిక సంబంధాల మెరుగుపై దృష్టి సారించారు. ఫ్రాన్స్, బ్రెజిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థికమంత్రులతో ఆమె వేర్వేరుగా చర్చలు జరిపారు. భారత్ ప్రెసిడెన్సీలో కీలక జీ20 దేశాల దృష్టి సారించిన అంశాలపై అభిప్రాయాలను పంచుకున్నారు. బహుపాక్షిక అభివృద్ధి బ్యాంకులను (ఎండీబీ) బలోపేతం చేయడం, రుణ సమస్యల నిర్వహణపై కూడా వీరి సమావేశంలో కీలక చర్చ జరిగినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 22–23 తేదీల్లో జరిగిన ఈసమావేశాలను భారత్, ఫ్రాన్స్, బర్బాడోస్‌లు నిర్వహించాయి. వాతావరణ మార్పు, జీవవైవిధ్య సంక్షోభం, అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడానికి బ్రెట్టన్ వుడ్స్ వ్యవస్థకు మించిన కొత్త గ్లోబల్ ఫైనాన్సింగ్ ఆర్కిటెక్చర్‌కు పునాదులు ఏర్పాటు చేయడం ’న్యూ గ్లోబల్ ఫైనాన్సింగ్ ప్యాక్ట్’ శిఖరాగ్ర సమావేశం లక్ష్యం. డీపీఐతో ప్రజా సొమ్ము ఆదా : సీతారామన్ కాగా పన్ను చెల్లింపుదారులు చెల్లించే డబ్బులు చక్కగా వినియోగించుకోవడానికి డిజిటల్ ప్రజా మౌలిక వసతులు (డీపీఐ) ఉపకరిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో పేర్కొన్నారు. భారత సర్కారు నేడు ఎన్నో రకాల ప్రయోజనాలను నేరుగా లబి్ధదారుల బ్యాంకు ఖాతాలకు అందించగలుగుతున్నట్టు చెప్పారు. ప్రభుత్వ వ్యవస్థలో డీపీఐ గొప్ప సమర్థతను తీసుకొచి్చందని, నిధులను మెరుగ్గా వినియోగించడం సాధ్యపడినట్టు తెలిపారు. డీపీఐని ప్రవేశపెట్టిన తర్వాత కేవలం ఒక రాష్ట్రంలోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ రూపంలో రూ.లక్ష కోట్లను ఆదా చేసినట్టు చెప్పారు. మహిళలకు ఇచి్చన రుణ ఖాతాల పనితీరు మెరుగ్గా ఉందన్నారు. నూతన గ్లోబల్ ఫైనాన్సింగ్ ఒప్పందం విషయమై ప్రస్తుతం నిర్మలా సీతారామన్ ప్యారిస్‌లో పర్యటిస్తున్నారు. -
మోదీ రాక కోసం ఎదురుచూస్తున్నాం
వాషింగ్టన్: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాక కోసం తాము ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని అమెరికా రక్షణ శాఖ వెల్లడించింది. మోదీ పర్యటన భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త ఒరవడిని నిర్దేశిస్తుందని ఆశిస్తున్నట్లు తెలియజేసింది. అంతేకాకుండా రక్షణ సహకారం, భారత్‌లో స్వదేశీ రక్షణ రంగ పారిశ్రామిక ప్రగతి విషయంలో భారీ, చరిత్రాత్మక, ఉత్తేజభరిత ప్రకటనలు వెలువడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ప్రధాని మోదీ ఈ నెల 21న అమెరికా పర్యటన ప్రారంభిస్తారు. నాలుగు రోజులపాటు అగ్రరాజ్యంలో పర్యటిస్తారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ పౌరురాలు జిల్ బైడెన్ ఈ నెల 22న ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. అధ్యక్షుడిగా బైడెన్ పగ్గాలు చేపట్టిన తర్వాత మోదీ అమెరికాలో అధికారికంగా పర్యటిస్తుండడం ఇదే మొదటిసారి. మోదీ రాకవల్ల భారత్, అమెరికా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని భావిస్తున్నట్లు అమెరికా రక్షణ శాఖ సహాయ మంత్రి (ఇండో–పసిఫిక్ భద్రతా వ్యవహారాలు) ఎలీ రట్నార్ చెప్పారు. ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాల్లో ఇదొక చరిత్రాత్మక సందర్భం అవుతుందన్నారు. -
భారత్-పాక్ సంబంధాలపై అమెరికా కీలక వ్యాఖ్యలు
వాషింగ్టన్: భారత్-అమెరికా సంబంధాలపై అగ్రరాజ్యం అమెరికా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ రెండు దేశాల మధ్య తాము మాటల యుద్ధం కోరుకోవటం లేదని చెప్పింది. సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక చర్చలు చేపట్టాలని సూచించింది. అగ్రరాజ్యం విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ ఈమేరకు సోమవారం మీడియాతో మాట్లాడారు. భారత్‌తో అమెరికాకు అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యం ఉందని, అటు పాకిస్తాన్‌తోనూ తమకు బలమైన సంబంధాలు ఉన్నాయని ప్రైస్ పేర్కొన్నారు. ఈ రెండు దేశాలతో సంబంధాలను ఒకదానికొకటి ముడిపెట్టలేమని వివరించారు. భారత్-పాక్ మధ్య మాటల యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదన్నారు. ప్రధానీ మోదీపై పాక్ మంత్రి బిలావల్ భుట్టో చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి ప్రస్తావించగా ఈమేరకు బదులిచ్చారు. రెండు దేశాలతోనూ ద్వైపాక్షిక సంబంధాలు తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. భారత్-పాక్ నిర్మాణాత్మక చర్చలతో సమస్యలు పరిష్కరించుకుంటే రెండు దేశాల ప్రజలకు శ్రేయస్కరం అని పేర్కొన్నారు. 2019 ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసినప్పటి నుంచి భారత్‌పై పాకిస్తాన్ అక్కసు వెళ్లగక్కుతోంది. పలుమార్లు అంతర్జాతీయ వేదికలపై భారత్‌కు వ్యతిరేకంగా కశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీపై పాక్ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. ఈ వ్యవహారంపై రెండు దేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సమయంలోనే అమెరికా స్పందించింది. చదవండి: షాకింగ్.. మరికొన్ని రోజుల్లో ఊహించని రీతిలో కరోనా కేసులు..! -
భారత్ అగ్రరాజ్యానికి మిత్ర పక్షం కాదు..వైట్‌హౌస్ అధికారి షాకింగ్ వ్యాఖ్యలు
భారత్ అగ్రరాజ్యానికి మిత్రపక్షంగా ఉండబోదంటూ వైట్‌హౌస్ ఉన్నతాధికారి కర్ట్ క్యాంప్‌బెల్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ఆయన గురువారం ఆస్పెన్ సెక్యూరిటీ ఫోరమ్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా..భారత్ గురించి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేగాదు విశిష్ట వ్యూహాత్మక స్వభావాన్ని కలిగి ఉన్న భారత్, అమెరికాకు మిత్రపక్షంగా ఉండదని, ఒక గొప్ప శక్తిగా ఉంటుందని అన్నారు. గత 20 ఏళ్లో భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు చాలా బలోపేతంగా వేగంగా ఏర్పడ్డాయని అన్నారు. అమెరికాకు భారత్ అత్యంత ముఖ్యమైన ద్వైపాక్షిక సంబంధం అని కూడా చెప్పారు. అలాగే అమెరికా తన సామర్ధ్యానికి అనుగుణంగా ఇంకా ఎక్కువ పెట్టుబడి పెట్టాలి, సాంకేతికంగా ఇతర సమస్యలపై కలిసి పనిచేయడం ద్వారా ప్రజలతో సంబంధాలను పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అదీగాక ఇరు దేశాల్లోని కేంద్రీకృత ప్రభుత్వ విధానాల్లో పలు సవాళ్లు ఉన్నాయన్నారు. అయినప్పటికీ ఇరు దేశాలు కలిసి పనిచేసే అంశాలపై దృష్టి పెట్టాలి. ముఖ్యంగా అంతరిక్షం, విద్య, వాతావరణం, సాంకేతికత తదితర వాటిల్లో ఇరు దేశాలు సమన్వయంగా ముందుకు సాగాలని చెప్పారు. అలాగే భారత్ అమెరికా సంబంధాలు కేవలం చైనా చుట్టూ ఉన్న ఆందోళనలతో ఏర్పడలేదని నొక్కి చెప్పారు. వనరులు అధికంగా ఉన్న బీజింగ్ దక్షిణ చైనా సముద్రంలో కృత్రిమ ద్వీపాలు ఏర్పరచి సైనిక స్థావరాలను నిర్మించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా క్యాంప్‌బెల్ ప్రస్తావించారు. ఈ విషయంలో తైవాన్, ఫిలిప్పీన్స్, బ్రూనై, మలేషియా, వియత్నాం తదితర దేశాలు చైనాను తప్పుపట్టాయన్నారు. చైనాకు జపాన్‌తో కూడా ప్రాదేశిక వివాదాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయం గురించి మోదీతో చర్చించినప్పుడూ చైనా తన ప్రయోజనాల కోసం నిర్మించుకున్నారంటూ... కొట్టిపారేశారని చెప్పారు. కాగా, బైడెన్ తన పరిపాలను క్వాడ్ లీడర్ స్థాయికి తీసుకువెళ్లాలని యోచిస్తున్నట్లు కూడా తెలిపారు. ఈ మేరకు ఆయన ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి (ఆంథోనీ) అల్బనీస్ 2023లో ఒక ప్రధాన క్వాడ్ సమావేశానికి అమెరికాను ఆహ్వానించిన సంగతిని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ క్వాడ్ సమావేశం నాలుగు కీలక దేశాల మధ్య సమన్వయ సహకారాన్ని చాలా స్ట్రాంగ్‌గా బలోపేతం చేస్తోందని క్యాంప్‌బెల్ విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరీన జీన్ పియర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ...భారత్, యునైటెడ్ స్టేల్స్‌ల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని చెప్పారు. జీ20లో భారత్ నాయకత్వం వహించినందుకు కృతజ్ఞతలు తెలియజేయడమే గాక భారత్‌తో మరింత సన్నిహితంగా పనిచేసేందుకు ఎదురు చూస్తున్నాం అని చెప్పారు. ఇదిలా ఉండగా, లాస్ ఏంజిల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టిని భారతదేశంలోని యుఎస్ రాయబారిగా నియమించాలని బైడెన్ పరిపాలన చూస్తున్నట్లు కూడా జీన్ పియర్ తెలిపారు. (చదవండి: అమెరికాలో ఉద్యోగాలు కోరుకునే భారతీయులకు గుడ్‌న్యూస్) -
‘డర్టీ బాంబ్’ ఆందోళనల వేళ రష్యాకు జైశంకర్
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌పై రష్యా సేనలు భీకర దాడులు చేస్తున్నాయి. అణ్యవాయుధాల వినియోగం ఆందోళనకు నెలకొన్న వేళ రష్యా పర్యటన చేపట్టనున్నారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. నవంబర్ 8న మాస్కో పర్యటనకు వెళ్లనున్నారని విదేశాంగ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ టూర్లో రష్యా విదేశాంగ మంత్రి సర్గే లావ్రోవ్తో సమావేశం కానున్నారు. జైశంకర్ పర్యటనలో ఇరు దేశాల మధ్య ధ్వైపాక్షిక సంబంధాలు, ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల వంటి అంశాలపై చర్చించనున్నట్లు రష్యా తెలిపింది. డర్టీ బాంబు వినియోగంపై రష్యా, ఉక్రెయిన్లు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న క్రమంలో జైశంకర్ మాస్కో పర్యటన చేపట్టటం ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం రష్యా రక్షణ మంత్రి సర్గీ షోయ్‌గూతో మాట్లాడిన భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. అణ్వాయుధాలు ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదని సూచించారు. ఇదీ చదవండి: రష్యా ఆరోపణ.. భద్రతా మండలికి డర్టీ బాంబ్ పంచాయితీ! ఖేర్సన్ ఖాళీ!! -
భారత్‌లో అవకాశాలు అపారం
కోపెన్హగెన్/పారిస్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరప్ పర్యటన బుధవారం మూడోరోజుకు చేరుకుంది. డెన్మార్క్ రాజధాని కోపెన్‌హగెన్‌లో నార్డిక్ దేశాలైన నార్వే, స్వీడన్, ఐస్లాండ్, ఫిన్‌ల్యాండ్ దేశాల అధినేతలతో వేర్వేరుగా సమావేశమయ్యారు. భారత్–ఆయా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై చర్చించారు. భారత్‌లో అపారమైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని నార్డిక్ దేశాల పెట్టుబడిదారులను కోరారు. భారత కంపెనీలతో జట్టుకట్టాలన్నారు. ప్రధానంగా టెలికాం, డిజిటల్ రంగాల్లో అద్భుత అవకాశాలు ఎదురు చూస్తున్నాయని తెలిపారు. నరేంద్ర మోదీ తొలుత నార్వే ప్రధాని జోనాస్ గాహ్ర్‌స్టోర్‌తో భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య తొలిభేటీ ఇదే కావడం విశేషం. బ్లూ ఎకానమీ, క్లీన్ ఎనర్జీ, స్పేస్ హెల్త్‌కేర్ తదితర కీలక అంశాలపై జోనాస్‌తో ఫలవంతమైన చర్చలు జరిపినట్లు మోదీ ట్వీట్ చేశారు. భారత్ ఇటీవల ప్రకటించిన ఆర్కిటిక్ పాలసీలో నార్వే ఒక మూలస్తంభం అని కొనియాడారు. స్వీడన్ ప్రధానమంత్రి మాగ్డలినా ఆండర్సన్, ఐస్‌ల్యాండ్ ప్రధానమంత్రి కాట్రిన్ జాకబ్స్‌డాటిర్, ఫిన్లాండ్ ప్రధానమంత్రి సనా మారిన్‌తోనూ మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నాలుగు దేశాల ప్రధానులతో సంతృప్తికరమైన చర్చలు జరిగినట్లు మోదీ వెల్లడించారు. రెండో ఇండియా–నార్డిక్ సదస్సు కోపెన్‌హగెన్‌లో బుధవారం నిర్వహించిన రెండో ఇండియా–నార్డిక్ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఫిన్లాండ్, ఐస్‌ల్యాండ్, స్వీడన్, నార్వే, డెన్మార్క్ ప్రధానమంత్రులు పాల్గొన్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, పరిణామాలు, ప్రపంచంపై దాని ప్రతికూల ప్రభావాలపై ప్రధానంగా చర్చించారు. అనంతరం ఉమ్మడి ప్రకటన జారీ చేశారు. ఉక్రెయిన్‌లో కొనసాగతున్న సంక్షోభం, సామాన్య ప్రజల అగచాట్లపై ఆందోళన వ్యక్తం చేశారు. పౌరుల మరణాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. పౌరులు క్షేమంగా బయటకు వెళ్లేందుకు, సురక్షిత ప్రాంతాలకు చేరుకొనేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఉక్రెయిన్, రష్యాను కోరారు. ప్రపంచంలో చాలాదేశాలు ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం నడుచుకోవడం లేదని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం లేదని ప్రధానమంత్రులు ఆక్షేపించారు. ఉక్రెయిన్‌పై చట్టవిరుద్ధంగా రష్యా సేనలు సాగిస్తున్న దాడులను నిరసిస్తున్నట్లు ఉమ్మడి ప్రకటనలో వెల్లడించారు. నిబంధనల ఆధారిత ఇంటర్నేషనల్ ఆర్డర్‌కు తాము మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా మార్చాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం సంస్కరణలు చేపట్టాలని కోరారు. ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)లోనూ సంస్కరణలు అవసరమన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని, అందుకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని నార్డిక్ దేశాల అధినేతలు ఉద్ఘాటించారు. పారిస్‌లో మాక్రాన్‌తో భేటీ ప్రధాని బుధవారం సాయంత్రం ఫ్రాన్స్ చేరుకున్నారు. పారిస్‌లో ల్యాండయ్యానంటూ ట్వీట్ చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక, వ్యూహాత్మక అంశాలపై చర్చించుకున్నారు. -
బలమైన బంధం!
భారత, జపాన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఏడు పదుల వసంతాల వేళ ఇది. ఈ సందర్భంలో జపనీస్ ప్రధానమంత్రి ఫ్యుమియో కిషీదా భారత సందర్శన పలు కారణాల రీత్యా కీలకమైనది. గత ఏడాది అక్టోబర్‌లో ఆ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఆయన పర్యటించిన తొలి దేశం మనదే. ఢిల్లీతో ద్వైపాక్షిక సంబంధాలకు టోక్యో ఇస్తున్న ప్రాధాన్యానికి ఇది ఓ తార్కాణం. రెండు దేశాల మధ్య ఏటా జరిగే వార్షిక శిఖరాగ్ర సమావేశాలు మూడేళ్ళుగా సాధ్యం కాలేదు. కోవిడ్ కారణంగా గత రెండేళ్ళు సమావేశాలు కుదరలేదు. అంతకు ముందు 2019లో భారత పౌరసత్వ చట్టంలో సవరణలపై నిరసనలతో అప్పటి ప్రధాని షింజో ఆబేతో సమావేశం రద్దయింది. చివరకు ఇన్నేళ్ళ తర్వాత జరగడంతో తాజా సమావేశానికి అంత ప్రత్యేకత. వర్తమాన భౌగోళిక రాజకీయ సంక్షోభ పరిస్థితులు సైతం ఏమవుతుందనే ఆసక్తిని పెంచాయి. భారత, జపాన్ల మైత్రీ బంధ పునరుద్ఘాటనలో ఇది కీలక ఘట్టం అంటున్నది అందుకే! ఏడు దశకాలుగా ద్వైపాక్షిక సంబంధాలున్నప్పటికీ, కారణాలు ఏమైనా వివిధ రంగాల్లో రెండు దేశాలూ ఇప్పటికీ అవ్వాల్సినంత సన్నిహితం కాలేకపోయాయి. 2006 నుంచి మరింత లోతైన సంబంధాలతో పరిస్థితి మారుతూ వచ్చింది. అప్పట్లో మన రెండు దేశాలూ ‘వ్యూహాత్మక, ప్రపంచ భాగస్వామ్యాన్ని’ ఏర్పాటు చేసుకున్నాయి. అప్పటి నుంచి వాణిజ్యం, సైనిక విన్యాసాలు, నియమానుసారమైన సముద్ర జల వ్యవస్థ లాంటి వాటిలో రెండూ బాగా దగ్గరయ్యాయి. జపాన్ ప్రధాని తాజా పర్యటన రెండు దేశాల మధ్య ఆర్థిక, వ్యూహాత్మక సంబంధాల సాన్నిహిత్యాన్ని మరోసారి చాటిచెప్పింది. 2014 నాటి పెట్టుబడుల ప్రోత్సాహక భాగస్వామ్యం కింద అనుకున్న 3.5 లక్షల కోట్ల జపనీస్ యెన్ల లక్ష్యాన్ని జపాన్ నిలబెట్టుకోవడం విశేషం. ఇక ఇప్పుడు 5 లక్షల కోట్ల జపనీస్ యెన్ల మేరకు పెట్టుబడులు పెట్టనుంది. అంటే, జపాన్ ప్రభుత్వం, జపనీస్ సంస్థలు నేటికీ తమ పెట్టుబడులకు భారత్ స్వర్గధామమని చెప్పకనే చెబుతున్నాయన్న మాట. చైనా ప్రాబల్యం పెరుగుతున్న ప్రస్తుత సమయంలో మరింత క్రియాశీలంగా కలసి పనిచేయ డానికి ఉన్న అవకాశాలను ఆసియాలోని రెండవ, మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థలు రెండూ గుర్తిస్తు న్నాయి. డిజిటల్ సెక్యూరిటీ, హరిత సాంకేతిక పరిజ్ఞానాల్లోనూ సహకరించు కోవాలని నిశ్చయించు కున్నాయి. జపాన్ ప్రధాని తాజా పర్యటనలో వెలువడ్డ సంయుక్త ప్రకటనలు అందుకు తగ్గట్టే ఉన్నాయి. వ్యూహాత్మకంగానూ ముందడుగు కనిపించింది. భారత భూభాగంపై పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాద దాడులను సంయుక్త ప్రకటన ఖండించింది. అలాగే, అఫ్గానిస్తాన్‌లో శాంతి, సుస్థిరతలకై కలసి పనిచేయడానికి కంకణబద్ధులమై ఉన్నట్టు రెండు దేశాలూ మరోసారి నొక్కిచెప్పాయి. ఇటీవల కొద్దివారాలుగా ఉక్రెయిన్ సంక్షోభంతో పాశ్చాత్య ప్రపంచం, జపాన్‌తో సహా దాని మిత్రపక్షాలు భారత వైఖరిని నిశితంగా గమనిస్తున్నాయి. కర్ర విరగకుండా, పాము చావకుండా ఈ సంక్షోభం విషయంలో భారత్ అనుసరిస్తున్న వైఖరి పట్ల పాశ్చాత్య దేశాల్లో సహజంగానే అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లోనూ భిన్నమైన వైఖరితో ఉన్న మిత్రదేశంతో భారత సమా వేశం ఆసక్తికరమే. అయితే, ఉక్రెయిన్‌లో తాజా పరిణామాలు ఏమైనప్పటికీ చైనా వైఖరికి భిన్నంగా భారత, జపాన్‌లు కలసికట్టుగా నిలవడం విశేషం. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని జపాన్ ప్రధాని ఖండించగా, భారత్ చర్చలు, శాంతి మంత్రం పఠించింది. వ్యక్తిగత వ్యూహాత్మక అవసరాలకు తగ్గట్టుగా రెండు దేశాలు స్వతంత్ర వైఖరులను అవలంబిస్తూనే, ఐక్యంగా నిలబడడం గమనార్హం. ఇరుదేశాల మధ్య ఈ విషయంలో అభిప్రాయ భేదాలున్నాయనే చర్చ జరుగుతున్న సందర్భంలో సంయుక్త ప్రకటన దానికి స్వస్తి పలికింది. ఉక్రెయిన్ లాంటి అంశాలపై పరస్పర భిన్న వైఖరులు ఉన్నప్పటికీ, చాలామంది ఆశించినదానికి భిన్నంగా మిత్ర దేశాలు ఇలా ఎప్పటిలానే దౌత్యం కొనసాగిస్తాయనే సంకేతాలు రావడం భారత్‌కు పెద్ద సాంత్వన. ఇన్నేళ్ళుగా అల్లుకున్న స్నేహలతకు దక్కిన సాఫల్యం. మయన్మార్‌లో గత ఏడాది సైనిక కుట్రతో వచ్చిపడ్డ సంక్షోభం విషయంలోనూ పాశ్చాత్య ప్రపంచానికి భిన్నంగా రెండు దేశాల స్పందన జాగరూక ధోరణిలో సాగింది. దౌత్య ప్రయత్నాలు, సంక్షోభానికి రాజకీయ పరిష్కారమే శరణ్యమని పేర్కొనడం విశేషం. ఐరాస భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం మునుపటి లానే పరస్పరం సహకరించుకోవ డానికే కట్టుబడినట్టు తెలిపాయి. ఇండో – పసిఫిక్‌లో చైనా దూకుడు వైఖరినీ చర్చించాయి. అయితే, ఈ తాజా సమావేశంలో ఒకటి రెండు అసంతృప్తులు లేకపోలేదు. ఆఫ్రికాలో మౌలిక వసతుల కల్పనకు ఉద్దేశించిన భారత – జపనీస్ సంయుక్త ప్రయత్నం ‘ఆసియా – ఆఫ్రికా గ్రోత్ కారిడార్’ (ఆగ్)పై చర్చించలేదు. అలాగే, 2011లో సంతకాలు చేసుకున్న ‘సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం’ (సీఈపీఏ)ను పరిస్థితులకు తగ్గట్టు మార్చుకోవడంలోనూ పెద్దగా పురోగతి కనిపించలేదు. నిజానికి, ఆ ఒప్పందంతో ఢిల్లీ, టోక్యోల వాణిజ్య బంధాన్ని పెంచుకోవడం అవసరం. ఏమైనా, కిషీదా భారత సందర్శనతో పాత స్నేహం బలపడిందనే చెప్పాలి. ఈ సౌహార్దం పురోగమించాలి. రానున్న రోజుల్లో రెండు దేశాల మధ్య మంత్రిత్వ స్థాయి సమావేశంలోనూ పరస్పర సహకారం వెల్లివిరియాలి. ఇలా ఆసియా ఖండంలోని ఈ ప్రాంతంలో మరో సన్నిహిత మిత్రుడు భారత్‌కు సైదోడు కావడం దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా ఎప్పటికైనా అవసరమే మరి! -
భారత్‌లో 3.2 లక్షల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: భారత్‌లో వచ్చే ఐదేళ్లలో రూ.3.2 లక్షల కోట్ల మేర పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిడా ప్రకటించారు. కిషిడా నేతృత్వంలోని జపాన్ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం శనివారం ఢిల్లీ చేరుకుంది. ఈ సందర్భంగా జరిగిన భారత్–జపాన్ 14వ వార్షిక శిఖరాగ్ర భేటీలో ప్రధాని మోదీ, కిషిడా సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాలను మరింత సుదృఢం చేసుకునేందుకు గల అవకాశాలను చర్చించారు. సహజ ఇంధన వనరుల అభివృద్ధికి సంబంధించి భాగస్వామ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయించారు. అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. భారత్, జపాన్ల సంబంధాలు ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత, అభివృద్ధికి దోహదం చేస్తాయన్నారు. వచ్చే ఐదేళ్లలో భారత్‌లో రూ.3.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కిషిడా ప్రకటించారు. ఉక్రెయిన్‌పై దాడి తీవ్రమైన అంశమని, ఈ చర్యతో అంతర్జాతీయ ప్రాథమిక సంప్రదాయాలను సైతం రష్యా తుంగలోకి తొక్కిందన్నారు. యథాతథ స్థితిని మార్చేందుకు ఏకపక్ష బలప్రయోగాన్ని ఏమాత్రం సహించబోమన్నారు. అన్ని రంగాల్లో సహకారాన్ని విస్తృతం చేసుకోవాల్సిన అవసరాన్ని రెండు దేశాలు గుర్తించాయని మోదీ చెప్పారు. ఇరు దేశాల ప్రతినిధులు వివిధ రంగాల్లో సహకారానికి మరింత బలోపేతం చేసుకునేందుకు సంబంధించి ఆరు ఒప్పందాలపై సంతకాలు చేశారన్నారు. కిషిడా ఆదివారం ఉదయం 8 గంటలకు బయలుదేరి కాంబోడియాకు వెళ్తారని అధికార వర్గాలు తెలిపాయి. -
భారత్–చైనా మధ్య 15వ దఫా చర్చలకు రంగం సిద్ధం
బీజింగ్/న్యూఢిల్లీ: భారత్–చైనా మధ్య ఈ నెల 11న జరగబోయే 15వ దఫా చర్చలు ఫలవంతమవుతాయని ఆశిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ చెప్పారు. తూర్పు లద్దాఖ్‌లో ఉద్రిక్తతలకు ముగింపు పలకడమే ఈ ఉన్నత స్థాయి సైనిక చర్చల లక్ష్యమని అన్నారు. శుక్రవారం లద్దాఖ్‌లోని చుషూల్ మాల్డో మీటింగ్ పాయింట్ వద్ద ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారులు భేటీ కానున్నారు. భారత్–చైనా మధ్య పూర్తిస్థాయిలో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం కావాలంటే సరిహద్దుల్లో శాంతి తప్పనిసరిగా నెలకొనాలని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్దన్ శ్రింగ్లా చెప్పారు. (చదవండి: దక్షిణ కొరియా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ) -
భారత్–యూఏఈ బంధం బలోపేతం
న్యూఢిల్లీ: భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టమయ్యే కీలక ఒప్పందం శుక్రవారం జరిగింది. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) పేరుతో జరిగిన స్వేచ్చా వాణిజ్య ఒప్పంద (ఎఫ్‌టీఏ) పత్రాలపై భారత్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్, యూఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మరీ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సంతకాలు చేశారు. ఒప్పంద పత్రాలను ఒకరికొకరు మార్చుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, ఈ ఒప్పందం వల్ల రెండు దేశాలకూ బహుళ ప్రయోజనాలు ఒనగూరుతాయని పేర్కొన్నారు.వస్తువులు, సేవలు, నిబంధనలు, కస్టమ్స్ విధానాలు, ప్రభుత్వ సేకరణ, మేధో సంపత్తి హక్కులు, ఈ–కామర్స్‌తో సహా పలు అంశాలు తాజా ఒప్పందం పరిధిలోకి వస్తాయని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఒప్పందం ప్రకారం రెండు దేశాలు గరిష్ట స్థాయి ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలు తగ్గుతాయి. సేవలు, పెట్టుబడులకు సంబంధించి పలు నిబంధనలను సరళతరం అవుతాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో రెండు దేశాలు వాణిజ్య ఒప్పంద చర్చలను లాంఛనంగా ప్రారంభించాయి. కాగా, తాజా ఒప్పందంపై సంతకాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌లు ఒక వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ‘‘భారతదేశం–యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం: కొత్త హద్దులు, మైలురాయి‘ అనే పేరుతో సంయుక్త విజన్ ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుతం 2 దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ దాదాపు 60 బిలియన్ డాల ర్లు ఉంటే, ఇది వచ్చే ఐదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ప్రపంచంలోని ఇతర దేశాలకు యూఏఈ ఒక గేట్వేగా ఉండడం మరో కీలక అంశం. స్మారక స్టాంప్ ఆవిష్కరణ: కాగా భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవడం, యూఏఈ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇరు దేశాల నాయకులు సంయుక్త స్మారక స్టాంప్‌ను విడుదల చేశాయి. అపార వాణిజ్య అవకాశాలు ఇది ఒక సమగ్ర, సమతౌల్య వాణిజ్య ఒప్పందం. దీనివల్ల రెండు దేశాలకూ అపార వాణిజ్య అవకాశాలు ఏర్పడతాయి. దైపాక్షిక వాణిజ్య సంబంధాలు రెట్టింపు అవుతాయి. – పీయూష్ గోయెల్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి -
భారత్ – మధ్య ఆసియా దేశాల సహకారమే కీలకం!
న్యూఢిల్లీ: మధ్యఆసియా దేశాలు, భారత్ మధ్య సహకారం ప్రాంతీయ భద్రతకు ఎంతో కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా అఫ్గాన్‌లో పరిణామాల దృష్ట్యా ఈ ప్రాంతానికి భారత్‌కు మధ్య బంధం మరింత బలపడాలని కోరారు. ఈ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలకు 30 ఏళ్లైన సందర్భంగా గురువారం ఆయన ఐదు మధ్య ఆసియా దేశాలతో తొలి ఉమ్మడి సదస్సును ప్రారంభించారు. సుస్థిరమైన ఇరుగుపొరుగు ఉండాలనే భారత ఆలోచనకు మధ్య ఆసియా ప్రాంతం కీలకమని ఆయన చెప్పారు. వచ్చే 30 ఏళ్లకు కావాల్సిన సమీకృత విధానాన్ని ఇరు పక్షాలు రూపొందించుకోవాలని ఆయన సూచించారు. సదస్సులో కజకిస్తాన్ అధ్యక్షుడు కాసెమ్ జోమార్ట్ టొకయేవ్, ఉజ్బెకిస్తాన్ అధిపతి షావక్త్ మిర్జియోయేవ్, తజ్బకిస్తాన్ నేత ఇమోమాలి రహమన్, టర్కెమెనిస్తాన్ అధ్యక్షుడు గుర్బంగ్లీ బెర్డిముహమెదోవ్, కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు సడేర్ జపరోవ్ పాల్గొన్నారు. అఫ్గాన్ భూభాగాన్ని ఎలాంటి ఉగ్ర కార్యక్రమాలకు అనుమతించకూడదన్న తమ అభిప్రాయాన్ని ప్రధాని మోదీ మరోమారు వెల్లడించారు. ఇరు పక్షాల మధ్య సహకారం పెంపొందించడం, ఇందుకు తగిన విధానాలు రూపొందించడం సదస్సు లక్ష్యమన్నారు. ఇంధన భద్రతలో కజ్బెకిస్తాన్ ఇండియాకు ముఖ్యమైన భాగస్వామి అని చెప్పారు. ఉజ్బకిస్తాన్తో గుజరాత్ సహా పలు రాష్ట్రాలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయన్నారు. ఉన్నత చదువుల కోసం పలువురు భారతీయులు కిర్గిజ్‌కు వెళ్తుంటారని చెప్పారు. రక్షణ విషయంలో తజ్బెక్తో మరింత బలమైన బంధం ఏర్పడాలని ఆకాంక్షించారు. ప్రాంతీయ కనెక్టివిటీలో టర్కెమెనిస్తాన్ది కీలకపాత్రన్నారు. సదస్సు ఏర్పాటుపై ఐదుగురు అధ్యక్షులు ప్రధానిని ప్రశంసించారు. 2015లో మోదీ ఈ దేశాల్లో పర్యటించారు. -
బైడెన్–జిన్‌పింగ్ వర్చువల్ సమావేశం
బీజింగ్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య మంగళవారం వర్చువల్ సమావేశం జరగనుంది. రెండు అగ్ర రాజ్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ భేటీ జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ హయాం నుంచి అమెరికాతో దెబ్బతిన్న వాణిజ్య సంబంధాలు, తైవాన్ అంశం, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య హక్కులు, ఉయ్గుర్లపై అణచివేత తదితర అంశాలు వీరిద్దరి మధ్య చర్చకు వచ్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. -
ఫ్రాన్స్ అధ్యక్షుడు, సింగపూర్ ప్రధానితో మోదీ భేటీ
జి–20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం రోమ్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో భేటీ అయ్యారు. భారత్–ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మాక ద్వైపాక్షిక సంబంధాలు, పరస్పర, అంతర్జాతీయ ప్రయోజనాలతో ముడిపడి ఉన్న అంశాలపై ఇరువురు నేతలు విస్తృత స్థాయిలో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మోదీ వెంట విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భదత్రా సలహాదారు అజిత్ దోవల్ ఉన్నారు. మోదీ, మాక్రాన్ నడుమ ఫలవంతమైన చర్చలు జరిగాయని భారత విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువరూ అభిప్రాయాలను పంచుకున్నారని వెల్లడించింది. ఈ చర్చలు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి దోహదపడనున్నాయని పేర్కొంది. నరేంద్ర మోదీ రోమ్‌లో సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్‌తోనూ సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలను ఈ సందర్భంగా సమీక్షించారు. లూంగ్‌తో మోదీ ఫలవంతమైన చర్చలు జరిపారని భారత ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) ట్విట్టర్లో వెల్లడించింది. భారత సంతతి ప్రజలతో సమావేశం ఇటలీలోని పలువురు భారత సంతతి ప్రజలు, భారతీయులను కూడా ప్రధాని మోదీ కలుసుకున్నారు. ఈ మేరకు ఫొటోలను మోదీ ట్విట్టర్లో పంచుకున్నారు. -
అమెరికాపై ఫ్రాన్స్ ఆగ్రహం
పారిస్: సాంప్రదాయక జలాంతర్గాముల కొనుగోలు వ్యవహారం అమెరికా, ఫ్రాన్స్ ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. 66 బిలియన్ డాలర్ల విలువైన 12 డీజిల్–ఎలక్ట్రిక్ జలాంతర్గాముల కొనుగోలుకు సంబంధించి 2016లో ఆస్ట్రేలియా ఫ్రాన్స్‌తో భారీ కొనుగోలు ఒప్పందం కుదర్చుకుంది. అయితే, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియాల కొత్త ‘ఆకస్’ కూటమి పరోక్షంగా ఈ కొనుగోలు ఒప్పందం రద్దుకు దారితీసింది. సంప్రదాయక జలాంతర్గాములు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయబోమని, ఆ ఒప్పందాన్ని రద్దుచేసుకుంటున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్‌కు లేఖ రాశారు. ఫ్రాన్స్‌కు బదులుగా అమెరికా నుంచి అత్యాధునిక అణు జలాంతర్గాములను ఆస్ట్రేలియా కొనుగోలుచేయనుంది. తమతో ఒప్పందం రద్దుకు అమెరికానే ప్రధాన కారణమని ఫ్రాన్స్ ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇందుకు నిరసన అమెరికాలో తమ రాయబారి ఫిలిప్ ఎతీన్ను ఫ్రాన్స్ వెనక్కి పిలిపించింది. ఆస్ట్రేలియా వైఖరిని తూర్పారబడుతూ అక్కడి తమ రాయబారి జీన్ పియర్ థబాల్ట్ను ఫ్రాన్స్ వెనక్కి పిలిపించింది. -
తూర్పు లద్దాఖ్‌లో శాంతితోనే సత్సంబంధాలు
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో యథాతథ స్థితి కొనసాగుతుండడం, బలగాల ఉపసంహరణ విషయంలో చైనా సానుకూల చర్యలు చేపట్టకపోవడం వల్ల ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ప్రతికూలతలు నెలకొన్నాయని భారత్ చైనాకు స్పష్టం చేసింది. షాంఘై కోఆపరేషన్ కార్పొరేషన్(ఎస్సీఓ) సదస్సు సందర్బంగా బుధవారం దుషాంబెలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ల మధ్య ప్రత్యేకంగా సమావేశం జరిగింది. వాస్తవాధీన రేఖ వెంట ఎలాంటి ఏకపక్ష మార్పులను భారత్ అంగీకరించబోదని ఈ సందర్భంగా జై శంకర్ వాంగ్ యికి స్పష్టం చేశారు. తూర్పు లద్దాఖ్‌లో పూర్తి స్థాయిలో శాంతి నెలకొన్న తరువాతనే ఇరుదేశాల మధ్య సానుకూల సంబంధాలు సాధ్యమవుతాయన్నారు . రెండు దేశాల మధ్య మిలటరీ స్థాయిలో తదుపరి దశ చర్చలు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ఇరువురు నేతలు నిర్ణయించారు. ప్యాంగ్యాంగ్ సరస్సు ప్రాంతం నుంచి ఫిబ్రవరిలో ఇరుదేశాల బలగాలు వెనక్కు వెళ్లిన తరువాత.. ఇతర వివాదాస్పద ప్రదేశాల నుంచి బలగాలను ఉపసంహరించే ప్రక్రియలో ప్రతిష్టంభన నెలకొంది. తూర్పు లద్దాఖ్‌లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నించడంతో ఇరుదేశాల సంబంధాలు దిగజారిన విషయాన్ని జైశంకర్ ప్రస్తావించారు. ‘తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి నెలకొని ఉన్న మిగతా అన్ని సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కారం సాధించాల్సిన అవసరం ఉంది’ అని జై శంకర్ స్పష్టం చేశారని విదేశాంగ శాఖ తెలిపింది. అఫ్గాన్‌లో శాంతి స్థాపనే లక్ష్యం ఉగ్రవాదాన్ని కలసికట్టుగా ఎదుర్కోవడం, ఉగ్ర సంస్థలకు ఆర్థిక సహకారాన్ని ఆపేయడం షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీఓ) తప్పనిసరిగా చేయాలని జై శంకర్ అన్నారు. రష్యా, పాకిస్తాన్, చైనా విదేశాంగ మంత్రులతో కలిసి బుధవారం ఆయన ఎనిమిది సభ్య దేశాలు ఉన్న ఎస్సీఓ కీలక సదస్సులో పాల్గొన్నారు. -
తీస్తా ఒప్పందానికి కట్టుబడి ఉన్నాం
ఢాకా: తీస్తా నదీ జలాల పంపకంపై బంగ్లాదేశ్‌తో కుదుర్చుకున్న ఒప్పందం అమలుకు కట్టుబడి ఉన్నట్లు భారత ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ విషయమై బంగ్లా ప్రధాని హసీనాతో రెండు రోజుల పర్యనటలో భాగంగా మోదీ చర్చలు జరిపారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. విదేశాంగశాఖ కార్యదర్శి హర్షవర్థన్ ష్రింగ్లా శనివారం మీడియాకు ఈ విషయం వెల్లడించారు. ఫెని నదీ జలాల పంపిణీ ముసాయిదాను రూపొందించాలని షేక్ హసీనాను మోదీ కోరారని ఆయన చెప్పారు. రెండు దేశాలు 56 నదుల జలాలను పంచుకుంటున్నాయి..మున్ముందూ కూడా ఇదే సహకారం కొనసాగుతుందని ఆయన అన్నారు. తీస్తా సహా నదీ జలాల విభజనపై రెండు దేశాల ఉన్నతాధికారుల మధ్య ఇటీవలే ఢిల్లీలో జరిగిన భేటీ ఫలప్రదంగా ముగిసిందన్నారు. సిక్కింలో ప్రారంభమయ్యే తీస్తా నది పశ్చిమబెంగాల్ గుండా ప్రవహించి బంగ్లాదేశ్‌లో ప్రవేశించడానికి ముందు బ్రహ్మపుత్ర నదిలో కలుస్తుంది. ఈ నదీ జలాల పంపకంపై 2011లో కుదిరిన ఒప్పందం పశ్చిమబెంగాల్ సీఎం మమత అభ్యంతరాలతో అమలు కాకుండా నిలిచిపోయింది. బంగ్లాదేశ్‌లో రెండు రోజుల పర్యటన ముగించుకుని మోదీ శనివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఇద్దరు ప్రధానుల చర్చలు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, భారత ప్రధాని మోదీ శనివారం ద్వైపాక్షిక సంబంధాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. కనెక్టివిటీ, వాణిజ్యం, ఇంధనం, ఆరోగ్య రంగాలపై వారు ప్రధానంగా దృష్టి సారించారు. ఈ సందర్భంగా మోదీ హసీనాకు 12 లక్షల కోవిడ్ వ్యాక్సిన్ డోసులకు సంబంధించిన ఒక బాక్సును బహూకరించారు. శాంతి, ప్రేమ, సుస్థిరత కోరుకుంటున్నాం భారత్, బంగ్లాదేశ్‌లు అస్థిరత, అలజడులు, ఉగ్రవాదం బదులు శాంతి, ప్రేమ, సుస్థిరత ఆకాంక్షిస్తున్నాయని ప్రధాని మోదీ ప్రకటించారు. గోపాల్‌గంజ్‌లోని ఒరకండిలో మతువా వర్గం హిందువుల ఆరాధ్యుడు హరిచంద్ ఠాకూర్ ఆలయాన్ని సందర్శించిన అనంతరం అక్కడి వారితో మాట్లాడారు. భారత్ నుంచి ఒరకండికి సులువుగా చేరుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. పశ్చిమబెంగాల్లోని అత్యంత కీలకమైన మతువా వర్గం ఓటర్లను ఆకట్టుకునేందుకే ప్రత్యేకంగా మోదీ ఈ పర్యటన చేపట్టారని విశ్లేషకులు అంటున్నారు. సరిహద్దులకు సమీపంలో ఉన్న 16వ శతాబ్దం నాటి జెషోరేశ్వరి కాళీ ఆలయాన్ని శనివారం ప్రధాని మోదీ దర్శించుకున్నారు. అమ్మ వారికి వెండితో తయారుచేసిన, బంగారు పూత కలిగిన మకుటాన్ని సమర్పించుకున్నారు. తుంగిపరాలోని షేక్ ముజిబుర్ రహ్మాన్ మాసోలియాన్ని ప్రధాని మోదీ సందర్శించారు. బంగబంధుకు పుష్పాలతో నివాళులర్పించారు. ముజిబుర్ మాసోలియంను సందర్శించిన ఏకైక విదేశీ ప్రభుత్వ నేతగా మోదీ నిలిచారు. -
భారత్ మాకు బలమైన భాగస్వామి
న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, అమెరికా తీర్మానించుకున్నాయి. ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా రక్షణ సంబంధాలను విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉందని, పరస్పర సహకారంతోనే ఇది సాధ్యమని నిర్ణయానికొచ్చాయి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు బలమైన భాగస్వామి అని అమెరికా ఉద్ఘాటించింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ అస్టిన్ శనివారం పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. ఇండో–యూఎస్ రక్షణ భాగస్వామ్యానికి జో బైడెన్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని లాయిడ్ అస్టిన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. అంతర్జాతీయంగా పరిణామాలు వేగంగా మారిపోతున్న నేపథ్యంలో భారత్ తమకు ముఖ్యమైన భాగస్వామిగా మారుతోందని తెలిపారు. ఇండో–పసిఫిక్ రీజియన్‌లో అమెరికాకు ఇండియా ఒక మూలస్తంభం అని వ్యాఖ్యానించారు. ఇండియాతో సమగ్రమైన రక్షణ భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని వివరించారు. తద్వారా జో బైడెన్ ప్రభుత్వ విదేశాంగ విధానంలోని ప్రాధాన్యతలపై అస్టిన్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. చైనా ఆగడాలపై చర్చ అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ అస్టిన్‌తో చర్చలు సమగ్రంగా, ఫలవంతంగా జరిగాయని రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. భారత సైన్యం, అమెరికాకు చెందిన ఇండో–పసిఫిక్ కమాండ్, సెంట్రల్ కమాండ్, ఆఫ్రికా కమాండ్ మధ్య సహకారం పెంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఇండియా–అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కలిసి పని చేసేందుకు ఇరు దేశాలు ఆసక్తిగా ఉన్నాయన్నారు. తూర్పు లద్దాఖ్‌లో చైనా సాగిస్తున్న ఆగడాలు కూడా తమ మధ్య చర్చకు వచ్చాయన్నారు. రక్షణ సహకారంపై ఇండియా–అమెరికా మధ్య గతంలో కొన్ని ఒప్పందాలు కుదిరాయని, వాటిని పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకురావడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపైనా చర్చించామని పేర్కొన్నారు. భారత్–అమెరికా భాగస్వామ్యం 21వ శతాబ్దంలో నిర్ణయాత్మక భాగస్వామ్యాల్లో ఒకటిగా నిలిచిపోవాలని రాజ్‌నాథ్‌సింగ్ ఆకాంక్షించారు. త్రివిధ దళాల అవసరాల కోసం అమెరికా నుంచి 3 బిలియన్ డాలర్ల విలువైన 30 మల్టీ–మిషన్ ఆర్మ్డ్ ప్రిడేటర్ డ్రోన్లు కొనుగోలు చేయాలని భారత్ నిర్ణయించినట్లు తెలిసింది. దీనిపై రాజ్‌నాథ్ సింగ్, లాయిడ్ అస్టిన్ చర్చించినట్లు సమాచారం. మీడియం–ఆల్టిట్యూడ్ లాండ్ ఎండ్యురెన్స్ (ఎంఏఎల్‌ఈ) ప్రిడేటర్–బి డ్రోన్లుగా పిలిచే ఈ డ్రోన్లు ఏకంగా 35 గంటలపాటు గాలిలో సంచరించగలవు. భూమిపై, సముద్రంపై ఉన్న లక్ష్యాలను వేటాడే సామర్థ్యం వీటి సొంతం. రాజ్‌నాథ్‌తో చర్చల అనంతరం లాయిడ్ అస్టిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. -
విదేశీ సంబంధాలపై బైడెన్ దృష్టి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విదేశాలతో సంబంధాలపై దృష్టి సారించారు. విదేశీ నేతల్లో తొలిసారిగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఫోన్ చేసి మాట్లాడారు. కరోనాపై కలసికట్టుగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, రక్షణ సంబంధాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్నారు. వాతావరణ మార్పులపై కలసికట్టుగా పోరాటం చేయాల్సి ఉందని బైడెన్ చెప్పారు. కెనడా ప్రధానితో పాటు మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రాడర్తో బైడెన్ మాట్లాడారు. ఈ వారంలో మరికొంత మంది విదేశీ నాయకులతో బైడెన్ మాట్లాడతారని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. రక్షణ మంత్రిగా నల్లజాతీయుడు అస్టిన్ అమెరికా రక్షణ మంత్రిగా రిటైర్డ్ జనరల్ అస్టిన్ నియమితులయ్యారు. అగ్రరాజ్యానికి నల్లజాతీయుడు ఒకరు రక్షణ మంత్రి పదవి చేపట్టడం ఇదే తొలిసారి. అమెరికా కాంగ్రెస్‌లోని ఎగువ సభ అయిన సెనేట్ రక్షణ మంత్రిగా అస్టిన్ నామినేషన్‌ను రికార్డు స్థాయిలో 93–2 ఓట్ల తేడాతో బలపరిచింది. ఆ వెంటనే ఆయన చేత ప్రస్తుతం అమెరికా బలగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న డైరెక్టర్ టామ్ మూయిర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ వెను వెంటనే అస్టిన్ విధుల్లో చేరారు. ట్రంప్ అభిశంసనపై ఫిబ్రవరి 8న సెనేట్‌లో విచారణ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనపై ఫిబ్రవరి 8నుంచి సెనేట్‌లో విచారణ మొదలు కానుంది. ఈ నెల 6న క్యాపిటల్ భవనంపై దాడికి అనుచరుల్ని ఉసిగొల్పి అరాచకం సృష్టించడమే కాకుండా అయిదు నిండు ప్రాణాలు బలైపోవడానికి పరోక్షంగా కారణమవడంతో ట్రంప్‌పై ఇప్పటికే అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, దానిని ప్రతినిధుల సభ ఆమోదించడం తెలిసిందే. ట్రంప్ ప్రస్తుతం గద్దె దిగిపోయినప్పటికీ అభిశంసన ప్రక్రియను అధికారికంగా ముగించాలన్న గట్టి పట్టదలతో డెమొక్రాట్లు ఉన్నారు. ఫిబ్రవరి 8 సోమవారం సభ ప్రారంభం కాగానే ట్రంప్ అభిశంసనే ప్రధాన ఎజెండగా ఉంటుంది. ఆయనపై నమోదు చేసిన అభియోగాలను చదువుతారు. ఆ మర్నాడు కొత్త సెనేట్ సభ్యులు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. 100 మంది సభ్యుల బలం ఉండే సెనేట్‌లో డెమొక్రాట్లు, రిపబ్లికన్లకు సరిసమానంగా చెరి 50 స్థానాలున్నాయి. సెనేట్ చైర్మన్, దేశ ఉపాధ్యక్షురాలు కమల ఓటుతో డెమొక్రాట్లదే సభలో ఆధిక్యం ఉంటుంది. -
భారత్, బంగ్లా మధ్య ఏడు ఒప్పందాలు
ఢాకా: భారత్, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడనున్నాయి. మొత్తం ఏడు రంగాల్లో పరస్పర సహకారం కోసం ఇరుపక్షాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య గురువారం జరిగిన ఆన్లైన్ సదస్సులో ఈ మేరకు ఒప్పందాలు కుదిరాయి. ఇరు దేశాల మధ్య గత 55 ఏళ్లుగా నిలిచిపోయిన రైలు మార్గాన్ని సైతం పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. పాక్‌పై జరిగిన యుద్ధంలో బంగ్లాదేశ్ విజయం సాధించి 50 ఏళ్లవుతున్న సందర్భంగా విజయ్ దివస్ జరుపుకుంటున్న వేళ భారత్, బంగ్లాల మధ్య ఒప్పందాలు కుదరడం గర్వకారణమని ప్రధాని మోదీ చెప్పారు. భారత జాతిపిత మహాత్మాగాంధీ, బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబీర్ రెహ్మాన్ జీవితాలను ఆవిష్కరించే డిజిటల్ ఎగ్జిబిషన్‌ను ప్రధానులిద్దరూ సంయుక్తంగా ప్రారంభించారు. హైడ్రోకార్బన్స్, వ్యవసాయం, ఇంధనం, టెక్స్టైల్స్ రంగాల్లో పరస్పర సహకారంతో పాటు సరిహద్దుల్లో ఏనుగుల సంరక్షణ, బంగ్లాకు చెత్తను శుద్ధి చేసే పరికరాల ఎగుమతి వంటి వాటిపై ఒక అవగాహనకు వచ్చాయి. భారత్‌కు కృతజ్ఞతలు: హసీనా భారత్ తమకు అసలైన మిత్రదేశమని షేక్ హసీనా అన్నారు. 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో అండదండలు అందించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
చైనా ఆరోపణలు అవాస్తవం: భారత్
న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తైన సందర్భంగా స్మారక స్టాంపుల విడుదల అంశంలో చైనా ఆరోపణలను భారత్ కొట్టిపారేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించి డ్రాగన్ చేస్తున్న ప్రకటనలు అవాస్తవాలు అని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘భారత్-చైనా దౌత్య బంధానికి డెబ్బై ఏళ్లు నిండిన సందర్భాన్ని పురస్కరించుకుని ఉమ్మడిగా స్మారక స్టాంపులు విడుదల చేసే విషయంపై గతేడాది డ్రాగన్ దేశంతో ఒప్పందం కుదిరింది. అయితే అప్పటి నుంచి ఈ కార్యక్రమ ఆరంభోత్సవం గురించి చైనీస్ అధికారులతో ఎటువంటి చర్చ జరుగలేదు. కానీ భారత్ నుంచి సరైన స్పందన లేనందు వల్లే దీనిని రద్దు చేసినట్లు చైనా రాయబార కార్యాలయం ట్వీట్ చేసింది. ఇది ఈ ట్వీట్ సరైంది కాదు. పూర్తిగా అవాస్తవం’’ అని పేర్కొన్నారు.(చదవండి: భారత్‌తో చర్చలు జరుగుతున్నాయి: చైనా) అదే విధంగా.. ‘‘నిజానికి ఇంతవరకు 70వ వార్షికోత్సవానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలు మొదలుకాలేదు. అలాంటప్పుడు ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణ అనే ప్రస్తావన ఎలా వస్తుంది’’ అని అనురాగ్ శ్రీవాస్తవ డ్రాగన్ తీరును ఆక్షేపించారు. కాగా బ్యూటిఫుల్ ఇండియా, బ్యూటిఫుల్ చైనా పేరిట మంగళవారం నిర్వహించిన ఆన్లైన్ ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభవోత్సవంలో చైనా రాయబారి సన్ వెడాంగ్ పాల్గొన్న నేపథ్యంలో స్టాంపుల విడుదలకు సంబంధించి వివాదం చెలరేగింది. వార్షికోత్సవ వేడుకలకు ఇది ఆరంభమని ఆయన పేర్కొనగా.. భారత్ మాత్రం వేడుకలు ఇంకా మొదలుకాలేదని పేర్కొంది. ఇక గల్వాన్‌లోయలో చైనా ఆర్మీ ఘాతుకానికి సుమారు 20 మంది భారత జవాన్లు అమరులైన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో ప్రతిష్టంభన తొలగిపోయేలా ఇప్పటికే పలుమార్లు దైత్య, మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. -
అమెరికా విదేశాంగమంత్రిగా బ్లింకెన్!
వాషింగ్టన్: యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్(విదేశాంగ మంత్రిగా) ఆంటోనీ బ్లింకెన్‌ను జోబైడెన్ ఎంచుకోబోతున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. చాలా కాలంగా బైడెన్‌కు బ్లింకెన్ విదేశీ వ్యవహారాల్లో సలహాదారుగా ఉన్నారు. జాతీయ సెక్యూరిటీ సలహాదారుగా జేక్ సల్లివాన్ను బైడెన్ నియమించవచ్చని అంచనా. మంగళవారం బైడెన్ తన కేబినెట్ నియామకాలను వెల్లడించనున్నారు. ఒబామా రెండోమారు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బ్లింకెన్ డిప్యుటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా వ్యవహరించారు. బైడెన్ ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనకు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా పనిచేశారు. ఆదినుంచి బ్లింకెన్ భారత్‌కు గట్టి మద్దతుదారుగా ఉన్నారు. బ్లింకెన్‌ను బైడెన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా నియమించే యోచనలో ఉన్నారని వాల్‌స్ట్రీట్ జర్నల్, వాషింగ్టన్పోస్ట్, ద డైలీ కథనాలు వెలువరించాయి. మంగళవారం ఈ ప్రకటన అధికారికంగా వెలువడవచ్చన్నాయి. ఈ ఏడాది భారత స్వాతంత్య్ర సంబరాల సమయంలో బైడెన్ బృందం ఏర్పాటు చేసిన ఆన్లైన్ సదస్సులో బ్లింకెన్ భారత్ పక్షాన మాట్లాడారు. ఇరుదేశాల మధ్య బలమైన సంబంధాలను బైడెన్ కోరుతున్నారన్నారు. భారత్‌పై అణుపరీక్షల సమయంలో విధించిన ఆంక్షల తొలగింపులో బైడెన్ చేసిన కృషిని గుర్తు చేశారు. అదేవిధంగా ఇరుదేశాల మధ్య సివిల్న్యూక్లియర్ డీల్ కుదరడంలో కూడా బైడెన్ కీలక పాత్ర పోషించారన్నారు. మరోవైపు ఐరాసలో లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్‌ను నియమించాలని బైడెన్ భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బాధ్యతల బరువు ట్రంప్ హయంలో పలు దేశాలతో యూఎస్ ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో తిరిగి ఆయాదేశాలతో సంబంధాలను గాడిన పెట్టాల్సిన పెద్ద బాధ్యత బ్లింకెన్‌పై ఉండనుంది. అలాగే డబ్లు్యహెచ్‌ఓ, పారిస్ ఒప్పందం, ఇరాన్ ఒప్పందం నుంచి ఏకపక్షంగా అమెరికా వైదొలగడం పలు దేశాలకు విముఖత కలిగించింది. ఈ పరిస్థితులను బ్లింకెన్ చక్కదిద్దాల్సిఉంటుంది. ముఖ్యంగా చైనాకు వ్యతిరేకంగా.. ఇతర దేశాలను సహాయ సహకారాలందించడం ద్వారా అమెరికావైపు ఆకర్షిస్తామని బ్లింకెన్ గతంలో చెప్పారు. బైడెన్ బలహీనుడు: చైనా బీజింగ్: జో బైడెన్ అమెరికా అధ్యక్షుడయితే రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగవుతాయన్న భ్రమల నుంచి చైనా బయటకు రావాలని చైనా ప్రభుత్వ సలహాదారు ఒకరు పేర్కొన్నారు. అమెరికా తీసుకునే మరింత కఠిన వైఖరికి సిద్ధం కావాలని చైనా ప్రభుత్వాన్ని కోరారు. షెన్జెన్లోని అడ్వాన్స్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ అండ్ కాంటెంపరరీ చైనా స్టడీస్‌కు డీన్‌గా ఉన్న ఝెంగ్ యొంగ్నియన్ ఇటీవల సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ మేరకు పేర్కొన్నారు. బైడెన్ చాలా బలహీన అధ్యక్షుడు. అమెరికా సమాజంలో చైనా పట్ల ఉన్న వ్యతిరేకతను అవకాశంగా తీసుకుని, యుద్ధానికీ దిగుతారు’అని ఝెంగ్ విశ్లేషించారు. -
ద్వైపాక్షిక బంధాలు బలపడతాయ్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ఎన్నికవడాన్ని భారత పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. భారత్, అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇది తోడ్పడగలదని ఆకాంక్షించాయి. ‘రెండు దేశాల మధ్య వాణిజ్య, పెట్టుబడుల బంధాలు పెరుగుతున్నాయి. ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన, చిన్న వ్యాపారాలకు ఊతమివ్వడం వంటి ఉమ్మడి ఎజెండా అమలుకు ఇరు పక్షాలు కలిసి పనిచేయాలి‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ ఉదయ్ కొటక్ తెలిపారు. ‘బైడెన్–కమలా సారథ్యంలో భారత్–అమెరికా ఆర్థిక సంబంధాలు మరింతగా బలపడగలవు. అధునాతన శాస్త్రీయ పరిశోధనలు.. అభివృద్ధి కార్యకలాపాలు, వ్యూహాత్మక రంగాల్లో వ్యాపార వర్గాల మధ్య సహకారం పెరగగలదు‘ అని అసోచాం సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ తెలిపారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన భారత్, అమెరికా మధ్య పటిష్టమైన సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలు ఉన్నాయని .. ఇవి మరింత బలోపేతం కాగలవని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్ చెప్పారు. నాయకత్వం అంటే విధానాలతో పాటు వ్యక్తిత్వం కూడా అన్న పాఠాన్ని అమెరికా ఎన్నికలు తెలియజేశాయని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా అభిప్రాయపడ్డారు. 2019లో భారత్, అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 150 బిలియన్ డాలర్లుగా నమోదైంది. పరస్పర ఆర్థిక సహకారంతో దీన్ని 500 బిలియన్ డాలర్ల లక్ష్యానికి చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవచ్చని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. స్వాగతించిన ఐటీ పరిశ్రమ..: జో బైడెన్ ఎన్నికపై దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ హర్షం వ్యక్తం చేసింది. ‘స్థానికంగా పెట్టుబడులు, ఉపాధి కల్పన వంటి చర్యల ద్వారా అమెరికా ఆర్థిక వ్యవస్థకు భార త టెక్నాలజీ రంగం కీలక తోడ్పాటు అందిస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో నైపుణ్యాలను మెరుగుపర్చడం, మరిన్ని ఉద్యోగాలు కల్పించడం వంటి అంశాల్లో అమెరికా కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేయడంపై నాస్కామ్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది‘ అని పేర్కొంది. ‘ఇది చారిత్రకమైన రోజు. అవరోధాలన్నీ తొలగిపోవడం హర్షించతగ్గ పరిణామం. ఏకత్వానికి, సమిష్టి తత్వానికి ఇది గెలుపు‘ అని సైయంట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ బీవీఆర్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ప్రజాస్వామ్యం గెలిచింది‘ అని టెక్ మహీంద్రా ఎండీ సీపీ గుర్ణానీ ట్వీట్ చేశారు. -
నేడు అత్యంత కీలక రక్షణ ఒప్పందం
న్యూఢిల్లీ/వాషింగ్టన్: భారత్, అమెరికాల మధ్య నేడు ఒక కీలకమైన రక్షణ రంగ ఒప్పందం కుదరనుంది. అమెరికా నుంచి అత్యాధునిక మిలటరీ టెక్నాలజీ బదిలీ సహా ఇరుదేశాల సరఫరా వ్యవస్థ, భూభౌగోళిక చిత్రాల వినియోగానికి సంబంధించిన ఒప్పందం ఇది అని సంబంధిత వర్గాలు సోమవారం వెల్లడించాయి. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా రక్షణ శాఖ మంత్రి మార్క్ టీ ఎస్పర్ మధ్య సోమవారం జరిగిన చర్చల సందర్భంగా దీనిపై ఒక అంగీకారం కుదిరినట్లు తెలిపాయి. ఇరుదేశాల మధ్య రక్షణ సహా వ్యూహాత్మక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం, రెండు దేశాల మధ్య సైన్యాల మధ్య సహకారం పెంపొందించుకోవడం మొదలైన అంశాలపై ఇరు దేశాల రక్షణ మంత్రులు చర్చలు జరిపారని, చైనాతో సరిహద్దు వివాదం అంశం కూడా వారిమధ్య చర్చకు వచ్చిందని వెల్లడించాయి. ఇరుదేశాల మధ్య ‘బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్(బీఈసీఏ)’ ఒప్పందం కుదరడంపై రాజ్‌నాథ్, ఎస్పర్ సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపాయి. మరోవైపు, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, యూఎస్ విదేశాంగ మంత్రి మైక్ పాంపియొ సోమవారం పరస్పర విస్తృత ప్రయోజనకర అంశాలపై చర్చలు జరిపారు. ఈ చర్చల్లో పాల్గొన్న భారత ప్రతినిధి బృందంలో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్, త్రివిధ దళాధిపతులు జనరల్ ఎంఎం నరవణె(ఆర్మీ), అడ్మిరల్ కరమ్‌బీర్‌సింగ్(నేవీ), ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్కేఎస్ బధౌరియా(ఎయిర్‌ఫోర్స్), డీఆర్డీఓ చైర్మన్ సతీశ్ రెడ్డి తదితరులున్నారు. భారత్, అమెరికాల మధ్య నేడు(మంగళవారం) ప్రారంభం కానున్న 2+2 కీలక మంత్రిత్వ స్థాయి చర్చల కోసం మార్క్ ఎస్పర్, మైక్ పాంపియో సోమవారం ఢిల్లీ చేరుకున్నారు. ఈ 2+2 చర్చల్లో భారత రక్షణ, విదేశాంగ మంత్రులు రాజ్‌నాథ్, జైశంకర్ పాల్గొననున్నారు. ద్వైపాక్షిక సహకారంతో పాటు ఇండో పసిఫిక్ ప్రాంతం విషయంలో పరస్పర సహకారం అంశంపై కూడా వారు చర్చించనున్నారు. అమెరికా మంత్రులు పాంపియో, ఎస్పర్ ప్రధాన మంత్రి నరేంద్రమోదీని, జాతీయ భద్రత సలహాదారు అజిత్ ధోవల్‌ను కూడా కలవనున్నారు. యూఎస్ రక్షణ మంత్రి ఎస్పర్‌కు రైసినా హిల్స్‌లోని సౌత్ బ్లాక్ వద్ద త్రివిధ దళాలు గౌరవ వందనంతో ఘనంగా స్వాగతం పలికాయి. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భార త్, చైనాల మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితుల్లో ఈ 2+2 చర్చలు జరుగుతుండటం గమనార్హం. భారత్‌తో సరిహద్దు ఘర్షణలు, దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యానికి ప్రయత్నాలు, హాంకాంగ్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలను ఎదుర్కొన్న తీరు.. తదితర అంశాలపై అమెరికా ఇప్పటికే పలుమార్లు చైనాను తీవ్రంగా ఆక్షేపించిన విషయం తెలిసిందే. రక్షణ, విదేశాంగ మంత్రుల భారత పర్యటనకు ముందు.. ‘ప్రాంతీయ, ప్రపం చ శక్తిగా భారత్ ఎదగడాన్ని అమెరికా స్వాగతిస్తోంది’ అని యూఎస్ విదేశాంగ శాఖ ప్రకటించింది. 2016లో అమెరికా భారత్‌ను ‘ప్రధాన రక్షణ రంగ భాగస్వామి’గా ప్రకటించి, రక్షణ రంగ సహకారంలో విశ్వసనీయ మిత్రదేశం హోదా కల్పించింది. ఎస్పర్‌కు స్వాగతం పలుకుతున్న రాజ్‌నాథ్ -
భారత్- అమెరికాల మధ్య కీలక ఒప్పందం
న్యూఢిల్లీ: సైన్య సహకారం, పరస్పర సమాచార మార్పిడి తదితర అంశాలకు సంబంధించిన కీలక ఒప్పందం గురించి భారత్- అమెరికాల మధ్య త్వరలోనే 2+2 చర్చలు జరుగనున్నాయి. ఈ మేరకు ఈనెల 26, 27 తేదీల్లో ఇరు దేశాల ప్రతినిధులు సమావేశమై పెండింగ్‌లో ఉన్న ఒప్పందాల గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా బేసిక్ ఎక్స్స్ఛేంజ్ అండ్ కో-ఆపరేషన్ అగ్రిమెంట్(బీఈసీఏ)పై భారత్ సంతకం చేయనుంది. శత్రు దేశాలకు దీటుగా బదులిచ్చే క్రమంలో వారి స్థావరాలను గుర్తించి, దాడి చేసేందుకు ఉద్దేశించిన ఎంక్యూ- 9బి వంటి ఆర్మ్డ్ డ్రోన్స్ దిగుమతి తదితర అంశాల గురించి ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదరనుంది. (చదవండి: చైనాకు చెక్ పెట్టేందుకు ఆ 4 దేశాలు..) టోక్యోలో సమావేశమై.. కాగా భారత్- చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడటం సహా ఇండో- ఫసిఫిక్ సముద్రజలాలపై ఆధిపత్యం ప్రదర్శించేందుకు డ్రాగన్ దేశం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టే క్రమంలో అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా క్వాడ్(క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్) గురించి చర్చించేందుకు జపాన్‌లో సమావేశం కానున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు దేశాల విదేశాంగ మంత్రులు టక్యోలో సమావేశమై క్వాడ్ వ్యూహంపై చర్చలు జరుపనున్నారు. ఈ సందర్భంగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోతో అక్టోబర్ 6న భేటీ కానున్నారు. అక్కడే బీసీఈఏ గురించి కూడా ప్రస్తావించి చర్చలు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చైనా వైఖరిపై చర్చ ఈ క్రమంలో ఈనెల 15 తర్వాత యూఎస్ డిప్యూటీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ స్టీఫెన్ బీగన్, రక్షణ మంత్రి మార్క్ ఎస్పర్ రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ అయిన తర్వాత నెలాఖరులోగా మిలిటరీ ఒప్పందంపై ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉంది. అదే విధంగా 2+2 చర్చల్లో భాగంగా భారత పర్యటనకు వచ్చే అమెరికా మంత్రులు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తోనూ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. లదాఖ్ సరిహద్దులో చైనా దుందుడుకు వైఖరి, దక్షిణ చైనా సముద్రంపై పైచేయి సాధించేందుకు చేపడతున్న చర్యలు, తైవాన్ విషయంలో డ్రాగన్ దేశ వైఖరి తదితర అంశాల గురించి చర్చించనున్నారు. అంతేగాకుండా తాలిబన్లతో అమెరికా చారిత్రక ఒప్పందం, అఫ్గనిస్తాన్‌లో బలగాల ఉపసంహరణకై నిర్ణయం, శాంతి స్థాపన, పాకిస్తాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న తీరు, సీమాంతర ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు చేపట్టాల్సిన చర్యలు తదితర అంశాల గురించి కూడా భారత్- అమెరికా ప్రతినిధుల భేటీ సందర్భంగా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా భారత్‌పై విషం చిమ్మే పాకిస్తాన్ మిత్రదేశం చైనా సాయంతో ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) గ్రే జాబితా నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రయత్నాలు, టర్కీ సాయంతో అజర్బైజాన్ గుండా జిహాదీలు యథేచ్ఛగా సాగిస్తున్న చొరబాట్లు తదితర విషయాల గురించి చర్చించనున్నట్లు సమాచారం. చర్చలు పూర్తయినట్లయితే ఇక ఈ 2+2 చర్చలు విజయవంతంగా పూర్తైనట్లయితే యూఎస్ గ్లోబల్ జియో- స్పేషియల్ మ్యాపులు ఉపయోగించి క్రూయిజ్ మిసైల్స్, బాలిస్టిక్ క్షిపణుల కచ్చితమైన జాడను తెలుసుకునే వీలు కలుగుతుంది. దీంతో దొంగ దెబ్బ తీయాలనుకునే శత్రు దేశాల వ్యూహాలను చిత్తు చేసి వారికి దీటుగా బదులిచ్చే అవకాశం లభిస్తుంది. కాగా పరస్పర సైన్య సహకారం, ఇండో- పసిఫిక్ జలాల్లో నిర్మాణాలు చేపట్టకుండా, అక్కడ జరుగుతున్న పరిణామాలపై ఓ కన్నేసి ఉంచి, పరస్పరం సహకరించుకునే క్రమంలో సమాచార మార్పిడి తదితర అంశాల్లో భారత్- అమెరికా ఇప్పటికే మూడు ప్రాథమిక ఒప్పందాలు కుదిరిన విషయం తెలిసిందే. కాగా చైనీస్ కమ్యూనిస్టు పార్టీ ప్లీనరీ జరుగనున్న తేదీల్లోనే ఈ మేరకు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగడం విశేషం. ప్లీనరీలో భాగంగా 370 సెంట్రల్ కమిటీ సభ్యులు అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో దౌత్య, సైనిక, విదేశాంగ తదితర కీలక అంశాల్లో ప్రభుత్వ విధానాలు, రానున్న ఐదేళ్లలో అనుసరించాల్సిన వ్యూహాలు తదితర అంశాల గురించి చర్చించనున్నారు. -
విస్తృత బంధాల్లో సరిహద్దు ఒక భాగం
న్యూఢిల్లీ: భారత్, చైనాలు పరస్పరం మునుపెన్నడూ ఎరగని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని సరిహద్దు వివాదాన్ని ప్రస్తావిస్తూ విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. అయితే, ఇరుదేశాల మధ్య ఉన్న విస్తృత ద్వైపాక్షిక సంబంధాల్లో సరిహద్దు సమస్య ఒక భాగం మాత్రమేనని స్పష్టం చేశారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో గురువారం వర్చువల్‌గా ఆయన పాల్గొన్నారు. అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో రెండు దేశాలు సర్దుబాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే వివాద పరిష్కారం సాధ్యమవుతుందన్నారు. ‘మునుపెన్నడూ లేని పరిస్థితిని రెండు దేశాలు ఎదుర్కొంటున్నాయన్నది వాస్తవం. అయితే, దీర్ఘకాలిక దృష్టితో చూస్తే.. ఇరు దేశాల మధ్య నెలకొన్న విస్తృత ద్వైపాక్షిక సంబంధాల్లో సరిహద్దు సమస్య ఒక భాగం మాత్రమేనని అర్థమవుతుంది’ అని జైశంకర్ వ్యాఖ్యానించారు. మరోవైపు, చైనాతో సరిహద్దు వివాదం ముగిసేందుకు ముందుగా, క్షేత్రస్థాయిలో శాంతి, సుస్థిరత నెలకొనాల్సిన అవసరం ఉందని భారత్ స్పష్టం చేసింది. తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో ఉన్న అన్ని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి బలగాల ఉపసంహరణ ప్రక్రియ కొంత సంక్లిష్టమైందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం పేర్కొన్నారు. ఇందుకు పరస్పర ఆమోదనీయ నిర్ణయాలు తీసుకోవడంతో పాటు, యథాతథ స్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలను విరమించుకోవాల్సి ఉందన్నారు. ఇరు దేశాల మధ్య ‘వర్కింగ్ మెకానిజం ఫర్ కన్సల్టేషన్ అండ్ కోఆర్డినేషన్’ కింద మరో విడత చర్చలు త్వరలో జరుగుతాయని తెలిపారు. తదుపరి రౌండ్ కమాండర్ స్థాయి చర్చల కన్నా ముందే అవి ఉంటాయన్నారు. ఇరుదేశాల కమాండర్ స్థాయి 6వ విడత చర్చలు సోమవారం జరిగిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లోని పరస్పర సమీప ప్రాంతాల వద్దకు మరిన్ని బలగాలను పంపకూడదని, ఉద్రిక్తతలు పెరిగే చర్యలు చేపట్టవద్దని ఆ చర్చల్లో నిర్ణయించారు. చైనా ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతోంది: తైవాన్ తైపీ: తమ దేశ ఎయిర్ డిఫెన్సు జోన్లోకి చైనా నిఘా విమానాలు అక్రమంగా ప్రవేశించడంతో తైవాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా తమను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతోందని తైవాన్ డిప్యూటీ మినిస్టర్ చియ్ చుయ్ షెంగ్ వ్యాఖ్యానించారు. తమకు వ్యతిరేకంగా సైనిక శక్తిని ప్రయోగించాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు. భావసారుప్యత ఉన్నదేశాలతో కలిసి పని చేస్తామని అన్నారు. ద్వీప దేశమైన తైవాన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. కానీ, తైవాన్ తమ దేశంలో అంతర్భాగమేనని చైనా వాదిస్తోంది. -
గల్వాన్ ఘటన దురదృష్టకరం: చైనా
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి గల్వాన్ ప్రాంతంలో భారత్, చైనా మధ్య జూన్‌లో జరిగిన ఘర్షణలపై డ్రాగన్ దేశం విచారం వ్యక్తం చేసింది. ఆ ఘటన అత్యంత దురదృష్టకరమైనదని పేర్కొంది. అలా జరిగి ఉండాల్సింది కాదంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. చైనా, భారత్ యువత పాల్గొన్న ఒక వెబినార్‌కు బుధవారం హాజరైన భారత్‌లో చైనా రాయబారి సన్ వీడాంగ్ చరిత్ర పరంగా చూస్తే ఇది చాలా చిన్న ఘటన అని వ్యాఖ్యానించారు. రెండు దేశాలు ఘర్షణాత్మక వాతావరణాన్ని చూడాలని అనుకోవడం లేదని, ఇక మీదట ఇలా జరగకుండా రెండు దేశాలు సరైన దారిలో ప్రయాణిస్తున్నాయని అన్నారు. భారత్, చైనా సరిహద్దుల్లో ఏప్రిల్ నుంచి అడపాదడపా మొదలైన ఉద్రిక్తతలు జూన్‌లో తారస్థాయికి వెళ్లాయి. అప్పుడు చోటు చేసుకున్న ఘటనలో భారత్ సైనికులు 20 మంది ప్రాణాలు కోల్పోతే, చైనా వైపు ప్రాణ నష్టం ఎంత జరిగిందో ఆ దేశం అధికారికంగా వెల్లడించలేదు. భారత్, చైనా మధ్య 70 ఏళ్లుగా దౌత్య సంబంధాలు కొనసాగుతు న్నాయని, ఎన్ని పరీక్షలు , అడ్డంకులు ఎదురైనా మళ్లీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు బలోపేతమవుతున్నాయని సన్ వీడాంగ్ అన్నారు. చర్చల ద్వారా సమస్యల పరిష్కారం ఏ సమస్యకైనా చర్చల ద్వారా సరైన పరిష్కారం లభిస్తుందని రాయబారి వీడాంగ్ అన్నారు. చైనా భారత్‌ని ప్రత్యర్థి కంటే భాగస్వామిగానే చూస్తుందని, పొరుగు దేశం నుంచి ప్రమాదాలని కాకుండా అవకాశాలనే రాబట్టుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. భారత్, చైనా మధ్య ఆర్థికంగా కూడా సంబంధాలు అత్యంత దృఢంగా ఉన్నాయని సన్ వీడాంగ్ వివరించారు. -
భారత్‌తో విభేదాల పరిష్కారానికి సిద్ధం
బీజింగ్: ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోవడానికి, విభేదాల ను సామరస్యంగా పరిష్కరించుకోవ డానికి, పరస్పర రాజకీయ విశ్వాసాలను అభివృద్ధి చేసుకొనేందుకు భారత్‌తో కలిసి పనిచేయ డానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా ప్రకటించింది. భారత దేశ సార్వభౌమాధికారానికి సవాల్ విసురుతోన్న శక్తులకు భారత సాయుధ దళాలు తగు రీతిలో బుద్ధిచెప్పాయని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై మాట్లాడుతూ చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియన్ పై విధంగా వ్యాఖ్యానించారు. ఎర్రకోటపై నుంచి 74వ స్వాతంత్య్రదినోత్సవ సందేశాన్నిస్తూ ఎల్ఓసీ నుంచి ఎల్ఏసీ వరకు మా దేశంపై సవాల్ విసురుతోన్న వారికి బుద్ధి చెప్పామని పాకిస్తాన్, చైనాలను ఉద్దేశించి మోదీ మాట్లాడారు. తూర్పు లద్ధాఖ్ సరిహద్దు ప్రాంతంలో చైనాతో ఉన్న ఘర్షణ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని, పాకిస్తాన్ పదే పదే కాల్పుల విరమణని అతిక్రమిస్తూ ఉండడంతో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ప్రధాని నరేంద్ర మోదీ ఉపన్యాసాన్ని మేము గమనించాం. మేం ఇరుగుపొరుగు దేశాల వాళ్ళం. వందకోట్లకుపైగా జనాభాతో అభివృద్ధి చెందుతోన్న దేశాలు మావి. ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల మెరుగుదల ఇరు దేశాల ప్రజల ప్రయోజనాలకే కాకుండా, ఈ ప్రాంతపు శాంతి, అభివృద్ధి, స్థిరత్వం యావత్ ప్రపంచానికే మేలు చేస్తుందని ఝావో అన్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల రీత్యా, ఒకరినొకరు పరస్పరం గౌరవించుకోవడం, సహకరించు కోవడం, సరైన మార్గమని ఝావో ఈ సందర్భంగా అన్నారు. -
ద్వైపాక్షిక బంధంపై తీవ్ర ప్రభావం
న్యూఢిల్లీ/బీజింగ్: గాల్వన్ లోయ ఘర్షణ ద్వైపాక్షిక సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని భారత్ చైనాకు స్పష్టం చేసింది. ఈ ఘర్షణకు, సైనికుల మరణాలకు కారణం చైనా వ్యవహరించిన తీరేనని పేర్కొంది. క్షేత్రస్థాయిలో మార్పులు చేయాలన్న ముందస్తు ఆలోచనతో చైనా వ్యవహరించిందని, ఇది గతంలో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలకు వ్యతిరేకమని తేల్చి చెప్పింది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత విదేశాంగ మంత్రి జై శంకర్‌కు ఫోన్ చేసిన సందర్భంగా భారత్ పై విధంగా స్పందించింది. ఈ సందర్భంగా.. గాల్వన్ లోయలో చైనా సైనికుల ఘాతుకాన్ని జై శంకర్ తీవ్ర స్థాయిలో ఖండించారు. జూన్ 6న రెండు దేశాల కమాండింగ్ అధికారుల స్థాయి చర్చల్లో కుదిరిన ఒప్పందాన్ని ఇరుదేశాలు నిజాయితీగా, నిక్కచ్చిగా అమలు చేయాలని చైనాకు తేల్చిచెప్పారు. తమ చర్యలను సమీక్షించుకుని, దిద్దుబాటు చర్యలు చేపట్టాలని హితవు పలికారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. బాధ్యతాయుత విధానంలో సమస్యను పరిష్కరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించినట్లు పేర్కొంది. మరోవైపు, ఇరుదేశాల విదేశాంగ మంత్రుల ఫోన్‌కాల్‌పై చైనా కూడా ఒక అధికారిక ప్రకటన వెలువరించింది. సాధ్యమైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గించుకోవాలని భారత్, చైనా నిర్ణయించుకున్నాయని ఆ ప్రకటనలో చైనా పేర్కొంది. తూర్పు లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద ఇరుదేశాల సైనికుల మధ్య తీవ్రస్థాయి హింసాత్మక ఘర్షణలు చోటు చేసుకోవడం, వాటిలో రెండు దేశాలకు భారీగా ప్రాణ నష్టం సంభవించిన తరువాత తొలిసారి ఈ విదేశాంగ మంత్రుల చర్చలు చోటు చేసుకున్నాయి. సరిహద్దుల్లో శాంతి నెలకొనేలా ఇరుదేశాలు సరిహద్దు సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా వాంగ్ సూచించినట్లు చైనా పేర్కొంది. మరోవైపు, గాల్వన్ లోయలో ఘర్షణలకు భారతే కారణమని చైనా మరోసారి ఆరోపించింది. -
అమెరికాలో రాజకీయ వైరస్ వ్యాపిస్తోంది
బీజింగ్: అమెరికా, చైనా మధ్య సంబంధాలు రోజు రోజుకి క్షీణిస్తున్నట్టే కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ పుట్టుకపై అసత్యాలు ప్రచారం చేస్తూ ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బ తీయడానికి అమెరికా ప్రయత్నిస్తోందని చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ ఆరోపించారు. నేషనల్ పీపుల్స్ కాన్ఫరెన్స్ (ఎన్పీసీ) వార్షిక సమావేశాల సందర్భంగా ఆదివారం వాంగ్ వీడియో ద్వారా మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ వ్యాప్తిపై నిజాలు నిగ్గు తీయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అమెరికా, చైనా మధ్య సంబంధాలను దెబ్బ తీయడానికి అమెరికాలో కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయని, రెండు దేశాలను కోల్డ్ వార్ దిశగా నెట్టేయాలని చూస్తున్నాయని వ్యాఖ్యానించారు. ‘‘ఈ పొలిటికల్ వైరస్ ప్రతీ దానికి చైనాను వేలెత్తి చూపిస్తోంది. చైనాను దుయ్యబట్టడానికి వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటోంది. కొంత మంది రాజకీయ నాయకులు వాస్తవాలను చూడడానికి ఇష్టపడడం లేదు. వాస్తవాలను వక్రీకరిస్తూ మా దేశాన్ని టార్గెట్ చేస్తూ నిందలు మోపుతున్నారు. ఎన్నో కుట్రలు పన్నుతున్నారు’’అని యాంగ్ అన్నారు. కరోనా వైరస్ పుట్టుక, హాంగ్‌కాంగ్ స్వతంత్ర ప్రతిపత్తి దెబ్బతీసేలా చైనా పార్లమెంటులో బిల్లు పెట్టడం, వాణిజ్య ఒప్పందాల రగడ, మానవహక్కులు వంటి అంశాల్లో అమెరికా అ«ధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై మాటల దాడిని పెంచిన నేపథ్యంలోనే వాంగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బాధితుల్ని బ్లాక్ మెయిల్ చేస్తారా ? మిగిలిన దేశాల మాదిరిగానే తాము కూడా కరోనా వైరస్ బాధితులమేనన్న వాంగ్ చైనా నుంచి నష్టపరిహారాన్ని కోరుతూ అమెరికా కోర్టుల్లో దావాలు వేయడాన్ని తప్పు పట్టారు. అమెరికా తప్పుడు ఆధారాలతో బాధితుల్ని బ్లాక్ మెయిల్ చేస్తోందని మండిపడ్డారు. కరోనా వైరస్ అమెరికాలో విధ్వంసం సృష్టిస్తుంటే, మరోవైపు పొలిటికల్ వైరస్ కూడా దేశమంతా వ్యాపించిందని ఆయన విమర్శించారు. ఇది ఇరు దేశాలకు మంచిది కాదని హితవు పలికారు. కరోనా ఉమ్మడి శత్రువన్న వాంగ్ వైరస్‌పై తాము అమెరికాతో కలిసి పోరాడడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రపంచ దేశాలు విపత్తులో ఉన్న వేళ సమయాన్ని వృథా చేయకూడదని హితవు పలికారు. అమెరికా, చైనా కలసికట్టుగా తమ వ్యూహాలను పంచుకుంటూ కరోనాపై పోరాడాలని సూచించారు. -
భారత్‌తో బలపడిన బంధం
వాషింగ్టన్: భారత్ వంటి అద్భుతమైన దేశంలో తన పర్యటనతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతమయ్యాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ద్వైపాక్షిక సంబంధాల్లో అనూహ్యమైన పురోగతిని సాధించామని చెప్పారు. భారత్‌తో ఎన్నో వాణిజ్య కార్యకలాపాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. భారత్ పర్యటన ముగించుకొని అమెరికా చేరుకున్న ట్రంప్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. భారత్‌తో వందల కోట్ల డాలర్ల వ్యాపారాలు చేయనున్నట్టు ట్రంప్ వెల్లడించారు. ఢిల్లీ ఘర్షణలు భారత్ అంతర్గత వ్యవహారమని, అందుకే మోదీతో దానిపై చర్చించలేదని మరోసారి స్పష్టం చేశారు. కరోనాతో కంగారు లేదు: ట్రంప్ అమెరికాలో కరోనా వైరస్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతూ ఉండడంతో అధ్యక్షుడు ట్రంప్ అప్రమత్తమయ్యారు. ఈ వ్యాధితో కంగారు పడాల్సిన పనేమీ లేదని అన్నారు. సంక్షోభ సమయాల్ని తాను అద్భుతంగా పరిష్కరించగలనని ట్రంప్ చెప్పారు. కోవిడ్–19 దాడి చేసినా ఎదుర్కోవడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ వైరస్ కాస్త భయానకమైనదని, కానీ దాని గురించి కంగారు పడాల్సిన పని లేదని అన్నారు. నమస్తే ట్రంప్ ‘టీవీ’క్షకులు 4.60 కోట్లు! న్యూఢిల్లీ: భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాల్గొన్న ‘నమస్తే ట్రంప్’ కార్యక్రమాన్ని 4.60 కోట్ల మంది టీవీల ద్వారా తిలకించారు. ఈ నెల 24వ తేదీన అహ్మదాబాద్‌లోని మొతెరా స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని 180 టీవీ చానెళ్లు ప్రసారం చేశాయని బ్రాడ్కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్(బీఏఆర్సీ) తెలిపింది. దేశవ్యాప్తంగా 4.60 కోట్ల మంది ఈ కార్యక్రమాన్ని తిలకించారని, 1,169 కోట్ల వ్యూయింగ్ మినిట్స్ నమోదైనట్లు ప్రభుత్వానికి బీఏఆర్సీ సమాచారమిచ్చింది. -
ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కోవాలి
న్యూఢిల్లీ: భారత్, జర్మనీ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, ప్రధాని మోదీ మరిన్ని చర్యలు తీసుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన మెర్కెల్ శుక్రవారం మోదీతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఉగ్రవాదం పీచమణచడానికి ఉమ్మడిగా పోరాటం సాగించాలని నిర్ణయించారు. వ్యూహాత్మక భాగస్వామ్యంతో సాగే పలు రంగాలైన రక్షణ, ఇంధనం, కృత్రిమ మేధ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఒక అవగాహనకు వచ్చారు. అయిదవ అంతర్ ప్రభుత్వ సంప్రదింపులకు (ఐజీసీ) నేతృత్వం వహించిన ఇరువురు పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరికలే పంపారు. ఇతర దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి తమ భూభాగాన్ని వాడుకుంటే చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జర్మనీ చాన్స్‌లర్‌తో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేయాలి : మోదీ నరేంద్రమోదీ, ఏంజెలా మెర్కెల్ చర్చలు పూర్తయ్యాక ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ దేశాలకు ఒక శాపంలా మారిన ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ఇరు దేశాలు ఉమ్మడి పోరాటం చేస్తాయని, ప్రపంచ దేశాలన్నీ తమతో చేతులు కలపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేయడానికి ప్రపంచదేశాలన్నీ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని, అంతర్జాతీయ చట్టాలను, మానవ హక్కుల చట్టాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే ప్రాంతాలను, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను, వారి నెట్‌వర్క్‌లను, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందించే సంస్థలను సర్వనాశనం చేయాలన్నారు. జర్మనీ వంటి సాంకేతిక, ఆర్థిక పరిపుష్టి కలిగిన దేశాల సహకారంతోనే భారత నవనిర్మాణం సాధ్యమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఇరుదేశాలు అంతరిక్షం, పౌరవిమానయానం, విద్య, వైద్యం, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ వంటి 17 రంగాల్లో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆర్థిక సహకారం మరింత బలోపేతం కావాలి : మెర్కెల్ 5జీ, కృత్రిమ మేధ వంటి రంగాల్లో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని వాటిని సమర్థంగా ఎదుర్కోవడానికి ఇరు దేశాలు మరింతగా సహకరించుకోవాలని ఏంజెలా మెర్కెల్ అన్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కావాలన్నారు. మేకిన్ ఇండియా కోసం భారత్ చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పదని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మోదీ సర్కార్ ఎంత కష్టపడుతోందో తెలుస్తుందని ఆమె కొనియాడారు. భారత్ జర్మనీ సహకారం తీసుకోవడం హర్షణీయమని వ్యాఖ్యానించారు. -
పల్లవించిన స్నేహగీతం
సాక్షి ప్రతినిధి, చెన్నై: బంగాళాఖాతం తీరంలో, ఏడవ శతాబ్దపు అద్భుత శిల్పకళా నిర్మాణాల నేపథ్యంలో మామల్లపురం(మహాబలిపురం)లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య రెండో అనధికార భేటీ శుక్రవారం సానుకూల వాతావరణం మధ్య ప్రారంభమైంది. చెన్నై నుంచి ప్రత్యేక వాహన శ్రేణిలో మామల్లపురం వచ్చిన జిన్‌పింగ్‌కు మోదీ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు పల్లవ రాజులు నిర్మించిన అత్యద్భుత కట్టడాలను సందర్శించారు. సంప్రదాయ తమిళ వస్త్రధారణలో ఉన్న మోదీ.. జిన్‌పింగ్‌కు ప్రపంచ పురావస్తు నిర్మాణాలుగా యునెస్కో గుర్తింపు పొందిన ఆ శిల్పకళా సంపద చారిత్రక ప్రాధాన్యతను, పౌరాణిక ప్రాశస్త్యాన్ని, నిర్మాణ కౌశలాన్ని ఒక గైడ్ తరహాలో వివరించారు. అర్జునుడు తపస్సు చేసినట్లుగా భావిస్తున్న ప్రాంతంలో ఏకశిలపై నిర్మితమైన కట్టడాన్ని, పంచ రథ రాతి(పాండవ రథాలు) నిర్మాణాన్ని, శ్రీకృష్ణుడి వెన్నముద్ద బంతి(గుండ్రని పెద్దబండరాయి)ని సందర్శించారు. వీటి వివరాలను జిన్‌పింగ్ ఆసక్తిగా విన్నారు. పంచ రథ నిర్మాణ ప్రాంతంలో కొబ్బరి నీరు తాగి కాసేపు సేద తీరారు. ఆ సమయంలో అనువాదకుల సాయంతో ఇరువురు నేతలు ముచ్చటించుకున్నారు. అనంతరం సముద్ర తీరంలో నిర్మితమైన శివ విష్ణు రాతి దేవాలయాన్ని సందర్శించారు. సూర్యాస్తమయం వేళ అక్కడి ప్రకృతి దృశ్యాలను కాసేపు ఆస్వాదించారు. చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని సందర్శన సందర్భంగా ఆ దేవాలయాన్ని దీపకాంతులతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఆ ఆలయ నేపథ్యంలో ఏర్పాటు చేసిన వేదికపై కళాక్షేత్ర ఫౌండేషన్ కళాకారుల బృందం ప్రదర్శించిన భరతనాట్యం, కథాకళి నృత్య ప్రదర్శనలను వీక్షించారు. ఇరువురు నేతలు పలు సందర్భాల్లో షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం, నవ్వుతూ మాట్లాడుకోవడం కనిపించింది. అన్ని సందర్భాల్లోనూ ఇరువురి నేతల మధ్య నెలకొన్న స్నేహానుబంధం స్పష్టంగా కనిపించింది. నేడు(శనివారం) ఇరువురు నేతలు, రెండు దేశాల ప్రతినిధి బృందాల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఉగ్రవాదంపై పోరు, వాణిజ్యం, 3500 కి.మీల సరిహద్దు వెంబడి ఉన్న ఇరుదేశాల సైనిక సహకారం.. తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. సాంస్కృతిక ప్రదర్శనలు ముగిసిన తరువాత, చైనా అధ్యక్షుడి గౌరవార్థం ఆలయ ప్రాంగణ ప్రాంతంలోనే మోదీ విందు ఏర్పాటు చేశారు. చెన్నైలో ఘన స్వాగతం అంతకుముందు, శుక్రవారం మధ్యాహ్నం చెన్నై విమానాశ్రయంలో తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్, ముఖ్యమంత్రి పళనిసామి, ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్రీ తదితరులు జిన్‌పింగ్‌కు స్వాగతం పలికారు. జిన్‌పింగ్‌తో పాటు 90 మంది సభ్యులతో చైనా ప్రతినిధి బృందం కూడా చెన్నై చేరుకుంది. అదే సమయంలో ‘వెల్కమ్ ఇండియా.. ప్రెసిడెంట్ జిన్‌పింగ్’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. విమానాశ్రయంలో జిన్‌పింగ్‌కు స్వాగతం పలుకుతూ కళాకారులు తమిళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే చిన్న సాంస్కృతిక ప్రదర్శన ఇచ్చారు. అనంతరం, చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్‌కు జిన్‌పింగ్ వెళ్లారు. అక్కడ కాసేపున్న తరువాత సాయంత్రం మహాబలిపురం బయల్దేరారు. జిన్‌పింగ్ కాన్వాయ్ సాగిన మార్గంలో దారిపొడవునా విద్యార్థులు, ప్రజలు భారత్, చైనా జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ స్వాగతం పలికారు. ప్రకటన ఉండొచ్చు గత సంవత్సరం చైనాలోని వుహాన్‌లో జరిగిన అనధికార భేటీ తరహాలోనే.. ఈ భేటీ అనంతరం ఇరుదేశాలు వేరువేరుగా ప్రకటనలు విడుదల చేస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. శనివారం ఉదయం నుంచి దాదాపు ఆరు గంటల పాటు ఇరువురు నేతలు ముఖాముఖి, ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారని పేర్కొన్నాయి. ‘భవిష్యత్తు ద్వైపాక్షిక సంబంధాలకు నూతన మార్గం చూపే పరస్పర ఆమోదిత మార్గదర్శకాలు ఈ భేటీ ద్వారా నిర్ణయమయ్యే అవకాశముంది’ అని భారత్‌లో చైనా రాయబారి సున్ వీడాంగ్ పేర్కొన్నారు. విందు సందర్భంగా చర్చలు విందు సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పలు అంశాలపై చర్చలు జరిపారని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు. ఇరువురు నేతలు వాణిజ్య లోటుపై చర్చించారని, ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటును తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారని గోఖలే వెల్లడించారు. ఉగ్రవాదం, తీవ్రవాదంపై ఇద్దరూ ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు. అన్ని అంశాలపై ప్రధాని మోదీతో కలసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నానని జిన్‌పింగ్ తెలిపారని గోఖలే పేర్కన్నారు. విందు సమయంలో ఇద్దరు నేతలు రెండున్నర గంటల పాటు మాట్లాడుకున్నారని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత శక్తిమంతం చేసుకోవాలని, వివాదాస్పద అంశాల కన్నా సంబంధాల బలోపేతానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఇరువురు నేతలు నిర్ణయించారని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. అయతే, వారిమధ్య కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చినదా? లేదా? అన్న విషయం తెలియలేదు. ‘తొలిరోజు అనధికార సమావేశం ఫలప్రదంగా జరిగింది’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ ట్వీట్ చేశారు. జిన్‌పింగ్‌కు తమిళ రుచులు చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఆయనకు ఇష్టమైన మాంసాహార వంటకాలతో పాటు సంప్రదాయ తమిళ వంటకాలను అందించారు. జిన్‌పింగ్‌కు ఇష్టమైన మాంసం, ఉల్లిగడ్డలతో ఓ కర్రీ.. క్యారెట్, క్యాబేజీ, లివర్లతో మరో కూర, నూడుల్స్, సూప్‌లను అందించారు. అవికాకుండా, అన్నం, బిర్యానీ, సాంబారు, టమాట రసం, చపాతీ, బటర నాన్, పులావ్, టమాటా–క్యారెట్ సూప్‌లను కూడా ఆ మెనూలో చేర్చారు. శనివారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశ, వడ, సాంబారు, చట్నీ, పొంగల్ తదితర తమిళ రుచులను ఆయనకు చూపనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం జిన్‌పింగ్ కోసం మోదీ ఏర్పాటు చేసిన విందులోనూ తమిళ రుచులను ఏర్పాటు చేశారు. పప్పు, మసాలాలు, కొబ్బరి వేసి చేసిన తమిళ ప్రత్యేక సాంబారును జిన్‌పింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. టమాట రసం, కూర్మా, హల్వాలను మెనూలో చేర్చారు. జిన్‌పింగ్‌కు ఇష్టమైన మాంసాహార వంటకాలనూ అందించారు. తమిళ వస్త్రధారణలో మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మామల్లపురం(మహాబలిపురం) పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు. పొట్టి చేతుల తెలుపు రంగు చొక్కా, దానిపై అంగవస్త్రం, ఆకుపచ్చ బోర్డరున్న సంప్రదాయ తమిళ లుంగీని ధరించారు. జిన్‌పింగ్ వైట్ షర్ట్‌ను డార్క్ కలర్ ప్యాంట్‌లోకి ఇన్ చేసుకుని సింపుల్‌గా కనిపించారు. మహాబలిపురంలోని సముద్ర తీరంలోని రాతి దేవాలయం, పంచ రథాలు, అర్జునుడు తపస్సు చేశాడని భావించే ప్రదేశంలోని 73 అడుగుల ఎత్తైన భారీ కళాత్మక నిర్మాణం.. తదితరాలను వారు సందర్శించారు. ఆ సందర్భంగా ఆ ప్రాంత ప్రాముఖ్యతను, ఆ దేవాలయ చరిత్రను, నిర్మాణ విశిష్టతను జిన్‌పింగ్‌కు మోదీ వివరించారు. అనంతరం వారిరువురు కొబ్బరి బోండాలను సేవించి సేదతీరారు. తమిళ సంప్రదాయ వస్త్రాలను మోదీ ధరించడంపై పలు తమిళ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. ‘తమిళ సంప్రదాయాన్ని ప్రధాని ప్రపంచానికి చూపారు’ అని పట్టలి మక్కల్ కచ్చి వ్యవస్థాపకుడు ఎస్ రామ్‌దాస్ ట్వీట్ చేశారు. ‘ఏ ప్రాంతానికి వెళ్తే, ఆ ప్రాంత సంప్రదాయాలను గౌరవించడం ప్రధాని మోదీకి బాగా తెలుసు. తమిళ పంచెకట్టులో ఆయన సౌకర్యవంతంగా కనిపించారు’ అని తమిళనాడు మంత్రి సీటీ రవి వ్యాఖ్యానించారు. జిన్‌పింగ్‌కు ఆలయ గొప్పదనాన్ని వివరిస్తున్న మోదీ మామల్లపురంలో సముద్ర తీరంలో వారసత్వ కట్టడం -
బంగ్లాదేశ్‌తో మరింత సహకారం
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తృతం చేసుకునేందుకు భారత్, బంగ్లాదేశ్ అంగీకరించాయి. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో సుదీర్ఘ చర్చలు జరిపారు. అనంతరం రెండు దేశాల అధికారులు ఏడు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. తీరం ప్రాంతంలో ఉమ్మడి గస్తీ సహా మూడు ప్రాజెక్టుల ప్రారంభానికి అంగీకరించారు. కాగా, చర్చల సందర్భంగా అస్సాం ఎన్నార్సీ అంశాన్ని బంగ్లాదేశ్ ప్రధాని ప్రస్తావించారు. నాలుగు రోజుల పర్యటనకు ఈ నెల 3వ తేదీన భారత్ చేరుకున్న ప్రధాని హసీనా 3, 4 తేదీల్లో ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్నారు. చర్చల సందర్భంగా ఇద్దరు ప్రధానులు వీడియో లింకేజీ ద్వారా.. బంగ్లాదేశ్ నుంచి ఎల్పీజీ గ్యాస్‌ను ఈశాన్య రాష్ట్రాలకు తరలించేందుకు ఉద్దేశించిన ప్రాజెక్టును, బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో నిర్మించిన వివేకానంద భవన్‌ను, ఖుల్నాలో స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించారు. అనంతరం ఇద్దరు ప్రధానులు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఏడాది కాలంలో రెండు దేశాలు 12 ఉమ్మడి ప్రాజెక్టులను ప్రారంభించడం మైత్రీబంధాన్ని ప్రతిఫలిస్తోందని వారు పేర్కొన్నారు. ఎన్నార్సీపై ప్రధాని హసీనా ఆరా అక్రమంగా వలస వచ్చిన బంగ్లా దేశీయులను గుర్తించేందుకు ఉద్దేశించిన అస్సాం ఎన్నార్సీ విషయాన్ని ప్రధాని మోదీతో చర్చల సందర్భంగా హసీనా ప్రస్తావించారు. అయితే, అస్సాంలో ఎన్నార్సీ ప్రచురణ ప్రక్రియ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సాగుతున్న కార్యక్రమమని, దీనిపై తుది ఫలితం ఏమిటనేది తేల్చాల్సి ఉందని ప్రధాని వివరించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే, మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం నుంచి వచ్చిన రొహింగ్యా శరణార్థుల సమస్యను కూడా ప్రధానులిద్దరూ చర్చించారు. శరణార్థులను వీలైనంత ఎక్కువ మంది, సత్వరమే, సురక్షితంగా వెనక్కి పంపించాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు. తీస్తా జలాల పంపిణీపై 2011లో రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంపై తొందరగా సంతకాలు తాము కోరుకుంటున్నామని హసీనా పేర్కొనగా ఇందుకు సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ప్రధాని మోదీ తెలిపారని అధికారులు వెల్లడించారు. భారత్ నుంచి సరుకు రవాణాకు వీలుగా చట్టోగ్రామ్, మోంగ్లా నౌకాశ్రయాలను వాడుకునేందుకు బంగ్లాదేశ్ అంగీకరించింది. త్రిపురలోని సబ్రూమ్ పట్టణానికి అవసరమైన 1.82 క్యూసెక్కుల తాగు నీటిని బంగ్లా దేశంలోని ఫెని నది నుంచి తీసుకునేందుకు కూడా ఒప్పందం కుదిరింది. తీరప్రాంత భద్రతకు సంబంధించిన ఒప్పందం కీలకమైందని, ఇందులో భాగంగా భారత్ తీరం వెంబడి 25 వరకు రాడార్ స్టేషన్లను ఏర్పాటు చేయనుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్, బంగ్లాదేశ్ మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకునే విషయమై అధ్యయనం చేసేందుకు కమిషన్ ఏర్పాటు చేయాలని కూడా అంగీకారానికి వచ్చారని తెలిపారు. -
బంధానికి ఆంక్షలు అడ్డుకావు
వ్లాడివోస్టోక్: రష్యాపై అమెరికా విధించిన ఆంక్షల ప్రభావం భారత్–రష్యాల, వ్యూహాత్మకమైన ఇంధనం, రక్షణ రంగాలు, ఇరుదేశాల బంధంపై ఉండబోదని ప్రధాని మోదీ అన్నారు. ‘భారత్ కంపెనీలు రష్యాలోని ఆయిల్, గ్యాస్ రంగాల్లోనూ, రష్యా సంస్థలు భారత్‌లోని ఇంధనం, రక్షణ, సాంకేతిక పరిజ్ఞానం బదిలీపై పెట్టుబడులు పెట్టాయన్నారు. వీటిపై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు అడ్డంకిగా మారబోవు’ అని తెలిపారు. క్రిమియా కలిపేసుకోవటాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా, దాని మిత్ర దేశాలు రష్యాపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. వీటి ప్రభావం రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే దేశాలపైనా పడుతోంది. టాల్‌స్టాయ్– గాంధీజీ స్నేహమే స్ఫూర్తి ప్రముఖ రష్యా రచయిత, తత్వవేత్త లియో టాల్‌స్టాయ్, గాంధీజీల మైత్రి వారిద్దరిపైనా చెరగని ముద్ర వేసిందని ప్రధాని మోదీ అన్నారు. టాల్‌స్టాయ్ రాసిన ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ వితిన్ యూ’ పుస్తకం తన జీవితాన్ని మార్చివేసిందని గాంధీజీ తన ఆత్మకథలో రాసుకున్నారని మోదీ తెలిపారు. వారి స్నేహం స్ఫూర్తిగా రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. అభివృద్ధిలో రెండు దేశాలు పరస్పరం కీలక వాటాదారులు కావాలన్నారు. వ్లాడివోస్టోక్‌లో జరుగుతున్న 5వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరం(ఈఈఎఫ్) ప్లీనరీలో ప్రధాని గురువారం మాట్లాడారు. ‘రష్యా తూర్పు ప్రాంతాన్ని పెట్టుబడులకు వేదికగా భావిస్తున్నాం. ఈ ప్రాంత అభివృద్ధికి అధ్యక్షుడు పుతిన్ చేస్తున్న ప్రయత్నాలకు అండగా ఉంటాం’అని తెలిపారు. ‘రష్యా తూర్పు ప్రాంత అభివృద్ధికి రూ.7వేల కోట్లను భారత్ రుణంగా అందజేయనుంది. మరో దేశానికి భారత్ ఇలా రుణం ఇవ్వడం ‘ఒక ప్రత్యేక సందర్భం’ అని తెలిపారు. ఈ సందర్భంగా మోదీ ‘యాక్ట్ ఫార్ ఈస్ట్’ విధానాన్ని ఆవిష్కరించారు. ఈఈఎఫ్ వేదికగా రూ.36 వేల కోట్ల విలువైన 50 ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు తెలిపారు. సమ్మిళిత ‘ఇండో–పసిఫిక్’ ప్రాంతం భారత్, రష్యాల మధ్య బలపడిన మైత్రితో ఇండో–పసిఫిక్ ప్రాంతాన్ని ‘ఆటంకాలు లేని, స్వేచ్ఛాయుత, సమ్మిళిత’ ప్రాంతంగా మార్చే నూతన శకం ప్రారంభమైందన్నారు. ‘ఈ విధానం నిబంధనలను, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలను గౌరవించడంతో పాటు, ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడాన్ని నిరోధిస్తుంది’ అని తెలిపారు. చైనా ఈ ప్రాంతంలో సైనిక బలం పెంచుకోవడం, దక్షిణ చైనా సముద్ర ప్రాంతంపై తమదే పెత్తనమనడంపై మోదీ పైవిధంగా మాట్లాడారు. -
కొత్త శిఖరాలకు సంబంధాలు
ఒసాకా: అమెరికాలో ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలపర్చుకునేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ తెలిపారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వ్యూహాత్మక సంబంధాలను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. జపాన్‌లోని ఒసాకాలో జీ20 సదస్సు సందర్భంగా శుక్రవారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోదీ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఇరాన్–అమెరికా వివాదం, భారత్‌లో 5జీ సాంకేతికతను ప్రవేశపెట్టడం సహా పలు అంశాలపై ఇరువురూ చర్చించుకున్నారు. ఈ సమావేశం అనంతరం ప్రధాని మోదీ స్పందిస్తూ..‘ట్రంప్‌తో పలు అంశాలపై చర్చించా. టెక్నాలజీ, రక్షణ, భద్రత రంగాల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలను పటిష్టం చేసుకోవాలని ఈ భేటీలో నిర్ణయించాం’ అని తెలిపారు. కలసి ముందుకెళతాం: ట్రంప్ ‘ప్రధాని మోదీ, నేను చాలామంచి స్నేహితులయ్యాం. భారత్–అమెరికాల మధ్య ఇప్పుడున్నంత సత్సంబంధాలు చరిత్రలో ఎన్నడూ లేవు. మిలటరీ సహా పలు రంగాల్లో కలిసి ముందుకెళ్లాలని మేం నిర్ణయించాం. ఈరోజు మాత్రం వాణిజ్యంపై చర్చించాం’ అని ట్రంప్ తెలిపారు. ఈ సందర్భంగా అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ నుంచి చమురు దిగుమతుల్ని ఆపేశామని మోదీ ట్రంప్ దృష్టికి తీసుకొచ్చారు. హోర్ముజ్ జలసంధిలో భారత చమురు ట్యాంకర్లపై దాడులు జరగకుండా యుద్ధనౌకలను మోహరించామని వెల్లడించారు. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరల్లో స్థిరత్వాన్ని, గల్ఫ్ ప్రాంతంలో పనిచేన్తున్న భారత సంతతి ప్రజల రక్షణను తాము కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. దీంతో చమురు ధరలు స్థిరంగా ఉండేలా తామూ చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ట్రంప్–అబేలతో త్రైపాక్షిక భేటీ జీ20 సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబేలతో త్రైపాక్షిక భేటీలో పాల్గొన్నారు. జపాన్–అమెరికా–ఇండియా(జయ్)గా వ్యవహరించే మూడు దేశాల భేటీలో ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం, శాంతిస్థాపన కోసం తీసుకోవాల్సిన చర్యలపై మోదీ, ట్రంప్ అబేలు చర్చించారు. మరోవైపు జపాన్ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ దక్షిణకొరియా అధ్యక్షుడు మూన్–జే–ఇన్‌తో సమావేశమయ్యారు.‘స్నేహితుడైన మూన్–జే–ఇన్ను కలవడం ఎప్పుడూ ప్రత్యేకమే. దక్షిణకొరియా–భారత్‌ల మధ్య ద్వైపాక్షిక బంధాన్ని పటిష్టపరిచేందుకు మూన్ కృషిచేస్తూనే ఉంటారు’ అని మోదీ ట్వీట్ చేశారు. ఈ పర్యటనలో భాగంగా జర్మనీ ఛాన్స్లర్ ఏంజెలా మెర్కల్తో మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సైబర్ భద్రత, కృత్రిమ మేధ(ఏఐ) రంగాల్లో పరస్పర సహకారం పెంపొందించుకోవాలని నిర్ణయించారు. సమ్మిళితవృద్ధికి ఏకాభిప్రాయం.. సమ్మిళిత, సుస్థిర ప్రపంచాభివృద్ధి కోసం అన్నిదేశాల మధ్య ఏకాభిప్రాయం అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఇందుకోసం ప్రపంచదేశాలన్నీ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సాంకేతిక ఫలాలు సామాన్యులకు చేరేలా తమ ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకుందని ఆయన వెల్లడించారు. డిజిటల్ సాంకేతికతను పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం ద్వారా ప్రజలకు లబ్ధి చేకూర్చడానికి ఐదు ‘ఐ’లు అవసరమని పేర్కొన్నారు. జపాన్‌లోని ఒసాకా నగరంలో శుక్రవారం ప్రారంభమైన జీ20 దేశాల సదస్సులో మోదీ మాట్లాడుతూ..‘భారత్‌లో టెక్నాలజీ ఫలాలు సామాన్యులకు అందేలా మా ప్రభుత్వం విప్లవాత్మకమైన చర్యలు తీసుకుంది. 120 కోట్ల మంది ప్రజలకు ఆర్థిక సేవలను చేరువ చేయడంలో భాగంగా పీఎం జన్‌ధన్ యోజన(పీఎంజేడీవై), ప్రత్యక్ష నగదు బదిలీ(డీబీటీ)ని తీసుకొచ్చాం. బ్యాంకింగ్ సేవలు, ఇన్సూరెన్స్ పెన్షన్లు, రుణాలు, రెమిటెన్సులు పొందడం వంటి ఆర్థిక సేవలను ప్రజలు పొందేందుకు జన్‌ధన్ యోజన ఎంతగానో ఉపకరించింది’ అని చెప్పారు. టెక్నాలజీ సాయంతో సమాజానికి గరిష్ట లబ్ధిచేకూర్చడానికి ఐదు ‘ఐ’లు అంటే.. అందర్ని కలుపుకుపోవడం(ఇన్‌క్లూజివ్‌నెస్), స్వదేశీకరణ(ఇండిజినైజేషన్), నవకల్పన(ఇన్నొవేషన్), పెట్టుబడులు–మౌలికవసతులు(ఇన్వెస్ట్మెంట్–ఇన్ఫ్రా), అంతర్జాతీయ సహకారం(ఇంటర్నేషనల్ కోఆపరేషన్) అవసరమని మోదీ తెలిపారు. పుతిన్‌తో జోక్ వేసిన ట్రంప్ అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యంపై మీడియాప్రతినిధులు ప్రశ్నలతో ట్రంప్‌ను ఇబ్బంది పెట్టారు. దీంతో ట్రంప్ పుతిన్‌వైపు వేలు చూపిస్తూ..‘ఎన్నికల్లో జోక్యం చేసుకోవద్దు’ అని జోక్ వేశారు. దీంతో పుతిన్, మీడియా ప్రతినిధులు నవ్వుల్లో మునిగిపోయారు. పుతిన్‌తో సత్సంబంధాలున్నాయనీ, భవిష్యత్‌లో మంచి ఫలితాలొస్తాయని ట్రంప్ అన్నారు. రెండో ప్రపంచయుద్ధం ముగిసి 75 ఏళ్లయిన సందర్భంగా రష్యాలో వేడుకలకు రావాలని పుతిన్ ట్రంప్‌ను కోరారు. ‘ఎస్–400’పై చర్చించని నేతలు.. ట్రంప్–మోదీల భేటీ సందర్భంగా రష్యా నుంచి కొనుగోలు చేస్తున్న ఎస్–400 క్షిపణి నిరోధక వ్యవస్థ ప్రస్తావన రాలేదని భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ తెలిపారు. ఇరుదేశాల మధ్య రక్షణ రంగ సహకారం బలోపేతం చేసుకోవడంపై చర్చ జరిగిందన్నారు. 2014లో 5 బిలియన్ డాలర్లతో ఎస్–400 వ్యవస్థ కొనుగోలుకు భారత్ రష్యాతో ఒప్పందం చేసుకుంది. ప్రజల సమాచారాన్ని(డేటా) సరికొత్త సంపదగా ఆయన అభివర్ణించారు. డేటా ఫ్లో విషయంలో అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను కంపెనీలు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. తమ పౌరుల సమాచారాన్ని స్థానికంగానే భద్రపరచాలని భారత్ సహా పలుదేశాలు కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే దీన్ని గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి దిగ్గజ కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. జీ20 సదస్సు సందర్భంగా డేటాను స్థానికంగా భద్రపరచడాన్ని అమెరికా వ్యతిరేకిస్తుందని ట్రంప్ స్పష్టం చేశారు. -
దేశ ప్రయోజనాలే ముఖ్యం
న్యూఢిల్లీ: రక్షణ, ఇంధనం, వాణిజ్యం, ఉగ్రవాదంపై పోరు సహా వేర్వేరు రంగాల్లో భారత్‌తో బలమైన ద్వైపాక్షిక సంబంధాలను కోరుకుంటున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత సమర్థతను ఆయన కొనియాడారు. ఇరాన్ మధ్యప్రాచ్యంలో ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందనీ, దీనిపై అమెరికా ఆందోళన చెందుతోందని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి భారత్‌కు చేరుకున్న పాంపియో ప్రధాని మోదీతో బుధవారం భేటీ అయ్యారు. ఇరుదేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్‌తో సమావేశమయ్యారు. మాకోసం భారత్ చాలా చేసింది పాంపియోతో భేటీ సందర్భంగా జైశంకర్ స్పందిస్తూ.. ఇతర దేశాలతో వ్యవహరించే విషయంలో తమకు భారత ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. రష్యా నుంచి ఎస్–400 క్షిపణి వ్యవస్థల కొనుగోలు విషయంలో అమెరికా ఆందోళనలను కొట్టిపడేశారు. ‘రష్యా నుంచి ఆయుధాలు, సాఫ్ట్వేర్ కొనుగోలు చేసే దేశాలపై అమెరికా కాంగ్రెస్ కాట్సా చట్టం (కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్) తెచ్చింది. దీని కారణంగా భారత్‌పై కూడా ప్రభావం పడుతోంది. భారత్‌కు రష్యా సహా పలుదేశాలతో చారిత్రక సంబంధాలు ఉన్నాయి. అమెరికా వీటిని గౌరవించాలి’ అని సూచించారు. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలపై మాట్లాడుతూ.. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు స్థిరంగా ఉండాలన్నది తమ అభిప్రాయమని స్పష్టం చేశారు. వెంటనే పాంపియో స్పందిస్తూ..‘మా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్, వెనిజులా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ వెనక్కుతగ్గింది. ఇది మామూలు విషయం కాదు. ఈ నేపథ్యంలో ఇండియాకు ఇంధన కొరత రాకుండా ఏమేం చేయాలో అన్నీ చేస్తున్నాం. ఇరాన్ మధ్యప్రాచ్యంలో ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. హోర్ముజ్ జలసంధిలో చమురు నౌకలపై ఇరానే దాడిచేసింది. ఈ విషయంలో అమెరికా తీవ్రంగా ఆందోళన చెందుతోంది. నిఘా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంలో, ఉగ్రవాద వ్యతిరేకపోరులో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భారత్–అమెరికాలు నిర్ణయించాయి’ అని పేర్కొన్నారు. వాణిజ్యంపై ఏకాభిప్రాయం అవసరం అమెరికా, భారత్‌ల మధ్య జరుగుతున్న సుంకాల యుద్ధంపై పాంపియో మాట్లాడారు. ‘పరస్పర సుంకాలను విధించుకోవడంపై భారత్–అమెరికాలు ఓ అంగీకారానికి రాగలవు. కానీ మనం కూడా అవతలివారి కోణం నుంచి ఆలోచించినప్పుడు బంధాలు బలపడతాయి. భారత్ తన సమగ్రతను కాపాడుకునేందుకు అవసరమైన అత్యాధునిక ఆయుధాలను అందించేందుకు, రక్షణ అవసరాలను తీర్చేందుకు అమెరికా సిద్ధంగా ఉంది’ అని తెలిపారు. వాణిజ్యం విషయంలో భారత్–అమెరికాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్న విషయాన్ని జైశంకర్ కూడా అంగీకరించారు. వాణిజ్య భాగస్వాములు అన్నాక పరిష్కరించుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయన్నారు. మతస్వేచ్ఛ లేకుంటే వినాశనమే.. మతస్వేచ్ఛను కాలరాస్తే ప్రపంచం దారుణంగా తయారవుతుందని మైక్ పాంపియో హెచ్చరించారు. భారత్‌లో ఇటీవలికాలంలో మైనారిటీలపై హిందుత్వ మూకల దాడులు పెరిగిపోయిన విషయాన్ని పాంపియో పరోక్షంగా ప్రస్తావించారు. బుధవారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..‘ప్రపంచంలోని నాలుగు ప్రధాన మతాలకు భారత్ పుట్టినిల్లు. కాబట్టి మతస్వేచ్ఛకు అందరం మరోసారి కంకణబద్ధులం అవుదాం. జైషే అధినేత మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి గుర్తించడం పట్ల అమెరికా హర్షం వ్యక్తం చేస్తోంది. అమెరికా తీసుకుంటున్న కీలక నిర్ణయాలకు అంతర్జాతీయ వేదికలపై భారత్ మద్దతు పలుకుతోంది. దీన్ని మేం స్వాగతిస్తున్నాం. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానానికి అమెరికా కట్టుబడి ఉంది’ అని స్పష్టం చేశారు. మరోవైపు జపాన్‌లోని ఒసాకాలో జూన్28–29 తేదీల్లో జరిగే జీ–20 శిఖరాగ్ర సదస్సులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ సమావేశమవుతారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. భేటీ సందర్భంగా పాంపియోతో జైశంకర్ కరచాలనం -
మాల్దీవులు, శ్రీలంకకు అధిక ప్రాధాన్యం
న్యూఢిల్లీ: శ్రీలంక, మాల్దీవులకు భారత్ అధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పొరుగుదేశాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్న విధానంలో భాగంగా రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక మొట్టమొదటగా మాల్దీవులు, శ్రీలంక దేశాల్లో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. మాల్దీవులు, శ్రీలంక పర్యటనకు శుక్రవారం బయలుదేరిన సందర్భంగా ప్రధాని మీడియాతో మాట్లాడారు. ‘నా మాల్దీవులు, శ్రీలంక పర్యటనల ద్వారా ఇరుదేశాలతో భారత ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడతాయని నమ్ముతున్నా. ఈ ప్రాంత భద్రత, అభివృద్ధి కోసం కలసికట్టుగా పనిచేస్తాం’ అని మోదీ తెలిపారు. శ్రీలంకలో ఈస్టర్ రోజున ఉగ్రమూకల బీభత్సానికి ప్రాణాలు కోల్పోయిన అమాయకులకు నివాళులు అర్పించేందుకే తాను శ్రీలంకకు వెళుతున్నట్లు మోదీ స్పష్టం చేశారు. ‘ఈస్టర్ ఉగ్రదాడులతో తీవ్రంగా కలత చెందిన శ్రీలంక ప్రజలకు భారత్ అండగా ఉంటుంది. ఉగ్రవాదంపై పోరాటంలో శ్రీలంకకు అన్నిరకాలుగా సహాయసహకారాలు అందిస్తాం’ అని వెల్లడించారు. ఉగ్రదాడుల తర్వాత శ్రీలంకను సందర్శిస్తున్న తొలి విదేశీ అధినేత మోదీయే కావడం గమనార్హం. కాగా, మాల్దీవుల పర్యటనలో భాగంగా మోదీ తీరప్రాంత రాడార్ నిఘా వ్యవస్థతో పాటు మాల్దీవుల జాతీయ రక్షణ దళం(ఎంఎన్‌డీఎఫ్) శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తారని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. ఈ పర్యటనలోనే మాల్దీవుల ప్రభుత్వం మోదీకి ప్రతిష్టాత్మక పురస్కారం ‘ఆర్డర్ ఆఫ్ నిషానిజ్జుద్దీన్’ను ప్రకటించే అవకాశముందని వెల్లడించాయి. అనంతరం ఆదివారం శ్రీలంకలకు చేరుకోనున్న మోదీ.. ఆ దేశపు అధ్యక్షుడు సిరిసేన, ప్రధాని రణిల్ విక్రమసింఘేతో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చిస్తారని పేర్కొన్నాయి. 12న మంత్రిమండలి భేటీ.. సార్వత్రిక ఎన్నికల అనంతరం 57 మందితో ఏర్పాటైన కేంద్ర మంత్రిమండలి తొలి సమావేశం జూన్ 12న జరుగుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రాబోయే ఐదేళ్లలో చేపట్టాల్సిన సంస్కరణలు, పథకాలు, ఇతర ముఖ్య నిర్ణయాలపై చర్చిస్తారని వెల్లడించాయి. అదే రోజున కేంద్ర కేబినెట్ కూడా సమావేశమవుతుందని పేర్కొన్నాయి. సిన్హా పదవీకాలం మూడోసారి పొడిగింపు కేబినెట్ కార్యదర్శి ప్రదీప్‌కుమార్ సిన్హా పదవీ కాలాన్ని కేంద్రం మరో మూడు నెలలు పొడిగించింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని నియామకాల కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. సిన్హా పదవీకాలాన్ని పొడిగించడం ఇది మూడోసారి. కాగా తాజా పొడిగింపుతో గత ఏడు దశాబ్దాల్లో కేబినెట్ కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పనిచేసిన అధికారిగా సిన్హా గుర్తింపు పొందనున్నారు. -
సంబంధాలు పునర్నిర్మించుకుందాం!
మాలె: మాల్దీవుల నూతన అధ్యక్షుడు ఇబ్రహీం మహ్మద్ సోలితో కలసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల్ని పునర్నిర్మించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. శనివారం సోలి ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన మోదీ.. ఆ వెంటనే ఆయనతో సమావేశమై చర్చలు జరిపారు. అభివృద్ధి, శాంతి కోసం మాల్దీవులు చేస్తున్న ప్రతి ప్రయత్నానికి అండగా ఉంటామని మోదీ హామీ ఇచ్చారు. హిందూ మహా సముద్ర తీర ప్రాంతంలో శాంతి, భద్రతల పరిరక్షణకు, ఒకరి ఆశయాలు, ప్రయోజనాల్ని మరొకరు గౌరవించుకునేందుకు ఇద్దరు నేతలు అంగీకరించారు. మాల్దీవుల్లో అధికార మార్పిడి అనంతరం ఇరు దేశాల సంబంధాలు తిరిగి పూర్వ స్థితికి చేరుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఉగ్రపోరులో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించారు. దేశం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సమస్యల్ని సోలి మోదీ దృష్టికి తీసుకొచ్చారు. గృహ, మౌలిక వసతుల అభివృద్ధితో పాటు తాగు నీరు, మురుగు నీటి నిర్వహణ తదితర సౌకర్యాల్ని వెంటనే మెరుగుపరచాల్సి ఉందని చెప్పారు. పదవి నుంచి దిగిపోయిన అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ హయాంలో రెండు దేశాల సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. చైనాకు అనుకూల వ్యక్తిగా పేరొందిన యామీన్.. ఆ దేశంలో అత్యవసర పరిస్థితి విధించడాన్ని భారత్ వ్యతిరేకించింది. విమానాశ్రయంలో ఘన స్వాగతం.. అంతకుముందు, మాల్దీవుల రాజధాని మాలె చేరుకున్న ప్రధాని మోదీకి విమానాశ్రయంలో రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. సోలి ప్రమాణస్వీకారం సందర్భంగా మాల్దీవుల మాజీ అధ్యక్షులు అబ్దుల్ గయూమ్, మహ్మద్ నషీద్‌ల మధ్య కూర్చున్న మోదీ..వారిని హత్తుకున్నారు. శ్రీలంక మాజీ అధ్యక్షురాలు చంద్రికా కుమారతుంగతోనూ ముచ్చటించారు. సోలి ప్రమాణానికి హాజరైన అత్యున్నత స్థాయి ప్రభుత్వాధినేత మోదీనే కావడం గమనార్హం. ప్రధాని హోదాలో మోదీ ఆ దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. -
శాంతి, ప్రగతి మా ప్రాథమ్యాలు
సింగపూర్: ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. సభ్య దేశాల మధ్య బహుళ రంగాల్లో సహకారం, సంబంధాలు పరిపుష్టం కావాలని ఆకాంక్షించారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన గురువారం జరిగిన 13వ తూర్పు ఆసియా దేశాల సదస్సులో పాల్గొన్నారు. తూర్పు ఆసియా సమావేశానికి మోదీ హాజరుకావడం ఇది 5వ సారి. ‘సభ్య దేశాల మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలతో పాటు బహుళ రంగాల్లో సహకారం పెరగాలని తూర్పు ఆసియా దేశాల సదస్సు(ఈఏఎస్)లో నా ఆలోచనలు పంచుకున్నా. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో శాంతి, అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశా’ అని మోదీ ఆ తరువాత ట్వీట్ చేశారు. అంతకుముందు, జపాన్ ప్రధాని షింజో అబేతో పాటు పలువురు దేశాధినేతలతో మోదీ సమావేశమై ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. దానికి ముందు జరిగిన ఆసియాన్–ఇండియా అల్పాహార సమావేశంలో మోదీ మాట్లాడుతూ..వ్యూహాత్మక ఇండో–పసిఫిక్ ప్రాంత అభివృద్ధికి తీర భద్రతలో సహకారం, వాణిజ్య వికేంద్రీకరణ కీలకమని నొక్కిచెప్పారు. కేడెట్ మార్పిడి కార్యక్రమంలో భాగంగా సింగపూర్‌లో పర్యటిస్తున్న ఎన్సీసీ కేడట్లను కలుసుకున్న మోదీ వారితో కాసేపు ముచ్చటించారు. మోదీ రెండు రోజుల సింగపూర్ పర్యటన ముగించుకొని సాయంత్రం తిరుగు పయనమయ్యారు. హ్యాకథాన్ విజేతలకు సత్కారం.. ఇండియా, సింగపూర్ సంయుక్తంగా నిర్వహించిన తొలి హ్యాకథాన్ విజేతల్ని మోదీ సత్కరించారు. 36 గంటల పాటు జరిగిన గ్రాండ్ ఫినాలేలో రెండు దేశాల నుంచి మూడేసి చొప్పున జట్లు ఈ పోటీలో గెలుపొందాయి. భారత్ నుంచి విజేతలుగా నిలిచిన జట్లలో ఐఐ టీ ఖరగ్‌పూర్, ఎన్ఐటీ తిరుచ్చి, పుణే ఎంఐటీ ఇంజినీరింగ్ కాలేజ్ బృందాలున్నాయి. సింగ పూర్ మంత్రి ఓంగ్ యే కుంగ్‌తో కలసి మోదీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. -
భారత్‌కు 5 వేల కోట్ల క్షిపణి వ్యవస్థ
జెరూసలెం: భారత్‌కు అదనంగా దాదాపు రూ.5,683 కోట్ల విలువ చేసే శక్తిమంతమైన బరాక్–8 క్షిపణులను ఇజ్రాయెల్ అందించబోతోంది. ఈ మేరకు రక్షణ పరికరాలు తయారుచేసే ఇజ్రాయెల్‌కు చెందిన సంస్థతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. భారత నావికాదళానికి బరాక్ 8 (ఎస్ఏఎం) క్షిపణులను సరఫరా చేయనుందని ఆ సంస్థ ప్రకటించింది. భారత్, ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా ఈ క్షిపణి వ్యవస్థను అభివృద్ధిపరిచాయి. రక్షణ రంగంలో భారత్, ఇజ్రాయెల్‌ల బలమైన ద్వైపాక్షిక సంబంధాలున్నాయనేందుకు బరాక్–8 క్షిపణి వ్యవస్థ ఓ సంకేతం అని ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ పేర్కొంది. గత కొద్ది సంవత్సరాలుగా ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందాల విలువ దాదాపు రూ.4 లక్షల కోట్లకు పైగా పెరిగింది. గగన, సముద్ర, భూతలం నుంచి వచ్చే ప్రమాదాలను ఈ క్షిపణి వ్యవస్థ సమర్థంగా ఎదుర్కొంటుంది. ఈ వ్యవస్థలో చాలా ఆధునికమైన వ్యవస్థలను పొందుపరిచారు. డిజిటల్ రాడార్, కమాండ్, కంట్రోల్, లాంచర్లు, ఇంటర్‌సెప్టార్లు, డేటా లింక్ తదితర ఆధునిక వ్యవస్థలు ఉంటాయి. -
భారత్–ఉజ్బెకిస్తాన్ల మధ్య 17 ఒప్పందాలు
న్యూఢిల్లీ: భారత్–ఉజ్బెకిస్తాన్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలకఘట్టం చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయెవ్ రక్షణ, వైద్యం, విద్య, సైన్స్, టెక్నాలజీ సహా 17 కీలక రంగాల్లో భారత్‌తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ప్రసుత్తం భారత పర్యటనలో ఉన్న మిర్జియోయెవ్ ప్రధాని మోదీతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు దేశాధినేతలు ఉమ్మడి దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. ఇందులో భాగంగా ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ల కోసం సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. అలాగే రక్షణ, విద్య, వైద్య రంగాల్లో పరస్పరం సహకరించుకునేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. వ్యూహాత్మక భాగస్వామ్యం: మోదీ సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘మేం పలు అంశాలపై విస్తృతంగా చర్చించాం. దీర్ఘకాల ప్రయోజ నాల దృష్ట్యా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేయాలని నిర్ణయించుకున్నాం. శాంతియుత, ప్రజాస్వామ్య, సుసంపన్న అఫ్గానిస్తాన్తోనే అందరికీ లాభం కలుగుతుంది’ అని ఈ విషయంలో సహకరించుకోవాలని భారత్, ఉజ్బెకిస్తాన్‌లో ఓ అంగీకారానికి వచ్చాయి’ అని తెలిపారు. -
ట్రంప్, పుతిన్‌ను ఆ దేశం నవ్వించలేకపోయింది!
ఇద్దరిలోనూ నిరుత్సాహం, నిర్వేదం ఐక్యరాజ్యసమితి సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఫిన్లాండే కావొచ్చు. ట్రంప్, పుతిన్‌లను మాత్రం ఆ దేశం కనీసం నవ్వించలేక పోయింది. శిఖరాగ్ర భేటీ సందర్భంగా ఈ ఇరువురి మొహాల్లో సంతోషమే కనిపించలేదు. తొలుత భేటీ కోసం ఎదురెదురుగా వచ్చినప్పుడు వారు ఒకరికొకరు చేతులు కూడా కలుపుకోలేదు. ఏ కోలాహలం లేకుండా నిశ్శబ్ధంగానే చర్చల గదిలోకి వెళ్లారు. తర్వాత తమ తమ కుర్చీల్లో కూర్చున్నాకనే ముభావంగానే షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అమెరికా అధికారులు కూడా అంతా గంభీరంగానే కనిపించారు. శ్వేతసౌధం అధికార ప్రతినిధి సారా శాండర్స్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఓ ఫొటోలో కూడా.. పుతిన్ తల దించుకుని నీరసంగా కూర్చోగా ట్రంప్ కూడా నిరుత్సాహంగా, కోపంగా కనిపించారు. అయితే ఆ తర్వాత వచ్చిన ఓ వీడియో ఫుటేజ్‌లో మాత్రం పుతిన్‌కు ట్రంప్ కన్ను కొడుతున్నట్లుగా కనిపించింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ను ట్రంప్ సింగపూర్‌లో కలిసినప్పుడు ఉన్న సందడి ఫిన్లాండ్లో ఏ మాత్రం కనిపించలేదు. కాగా, సాధారణంగా అమెరికా, రష్యా నేతలు ఎప్పుడు కలిసినా ఫిన్లాండ్‌నే అందుకు వేదికగా ఎంచుకుంటూ ఉంటారు. చివరిగా 1997లో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్ట్సిన్లు హెల్సింకిలోనే భేటీ అయ్యారు. ఈ భేటీపై వార్తలనందించేందుకు వివిధ దేశాల నుంచి 2 వేల మంది విలేకరులు కూడా హెల్సింకికి వచ్చారు. హెల్సింకి: 18 నెలల క్రితం దేశాధ్యక్షుడయిన వారొకరు, 18 సంవత్సరాలుగా దేశాన్ని నడుపుతున్న వారొకరు. ఆ ఇద్దరు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన రెండు దేశాలకు అధిపతులు. అనేక అంశాల్లో పోటీ కారణంగా ఈ రెండు దేశాల మధ్య గత కొన్ని దశాబ్దాలుగా ఘర్షణాత్మక వాతావరణమే నెలకొంది. అయితే ఇప్పడు కొత్తగా మైత్రి కోసం ఇరు దేశాధినేతలూ ప్రయత్నించారు. ఆ ఇద్దరే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. వివిధ అంశాలపై చర్చల కోసం వీరిద్దరూ తొలిసారిగా ఫిన్లాండ్ రాజధాని హెల్సింకిలో సోమవారం భేటీ అయ్యారు. అమెరికా, రష్యాల మధ్య సంబంధాల ప్రభావం ప్రపంచంలోని మిగతా దేశాలపై కూడా ఉంటుంది కాబట్టి వీరి భేటీకి అంత ర్జాతీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. భేటీ అనంతరం ఇద్దరు నేతలూ సానుకూలంగా స్పందించారు. పూర్తిగా దెబ్బతిన్న సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా అమెరికా, రష్యాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్‌ల శిఖరాగ్ర భేటీ సోమవారం ఫిన్లాండ్లోని హెల్సింకిలో జరిగింది. సమావేశం అనంతరం ట్రంప్ మాట్లాడుతూ ‘ఇదొక మంచి ఆరంభమని నేననుకుంటున్నా. అందరికీ చాలా చాలా మంచి ఆరంభం’ అని అన్నారు. అటు పుతిన్ కూడా ట్రంప్‌తో తన చర్చలు ‘చాలా విజయవంతంగా, ఉపయోగకరంగా’ సాగాయని తెలిపారు. ఫిన్లాండ్ అధ్యక్ష భవనంలోని ఓ గదిలో ఇద్దరు నేతలు రహస్యంగా భేటీ అయ్యి రెండు గంటలకు పైగా మాట్లాడుకున్నారు. ఆ సమయంలో గదిలో అనువాదకులు తప్ప మరెవరూ లేరు. ట్రంప్, పుతిన్‌లు ఒకరితో ఒకరు ఏకాంతంగా మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. పుతిన్‌తో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న ట్రంప్.. భేటీ కోసం గదిలోకి వెళ్లడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ ‘రష్యాతో అమెరికా సంబంధాలు ప్రస్తుత అధమ స్థాయికి పడిపోవడానికి గత అమెరికా ప్రభుత్వాలే కారణం’ అని నిందించారు. చర్చల ప్రారంభానికి లోనికి వెళ్లే ముం దు ఇద్దరూ ముభావంగానే మీడియాతో మాట్లాడారు. ఇద్దరి ముఖాల్లోనూ పెద్ద ఉత్సాహం కనిపించలేదు. బంధాల బలోపేతానికి కృషి అమెరికా, రష్యా మధ్య సంబంధాలను బలోపేతం చేయడం కోసం తాము కృషి చేస్తామని ట్రంప్, పుతిన్‌లు భేటీ అనంతరం సంయుక్త విలేకరుల సమావేశంలో ప్రకటించారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న పలు సవాళ్లను అధిగమించడం కోసం సహకారంతో పనిచేయాలని అనుకుంటున్నట్లు చెప్పారు. సిరియా, ఉక్రెయిన్, చైనా, అంతర్జాతీయ వ్యాపారంలో సుంకాలు, అణ్వాయుధ సంపత్తి తదితరాలపై తాము చర్చించామన్నారు. ‘మా బంధాలు ఇప్పుడున్నంత బలహీనంగా గతంలో ఎప్పుడూ లేవు. అయితే నాలుగు గంటల క్రితం పరిస్థితి మారిందని నేను నమ్ముతున్నా. ఇదొక మలుపు’ అని ట్రంప్ అన్నారు. రష్యాతో సత్సంబంధాలు నెలకొల్పడంలో ఇది ఆరంభం మాత్రమేనన్నారు. పుతిన్ మాట్లాడుతూ ‘మా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగా లేవన్నది అందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుత ఉద్రిక్త వాతావరణానికి పెద్ద కారణాలేవీ లేవు’ అని అన్నారు. రష్యా నుంచి గ్యాస్, ముడి చమురును జర్మనీకి తరలించేందుకు నార్డ్ స్ట్రీమ్2 పైప్‌లైన్‌ను నిర్మించినప్పటికీ ఉక్రెయిన్ మీదుగా తమ గ్యాస్ సరఫరా కొనసాగుతుందని ట్రంప్‌కు తాను హామీనిచ్చినట్లు చెప్పారు. నార్డ్ స్ట్రీమ్2 వల్ల అమెరికా, ఉక్రెయిన్ సంబంధాలు దెబ్బతింటాయా? అన్న ప్రశ్నకు ఆయన ఈ బదులిచ్చారు. జోక్యంపై చాలా సేపు మాట్లాడాం: ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం గురించి కూడా తాము చాలా సమయమే మాట్లాడామని ట్రంప్ చెప్పారు. అయితే ఇందుకు సంబంధించి ఇతర వివరాలను వెల్లడించని ఆయన.. రష్యా జోక్యం లేదంటూ బహిరంగంగా చెప్పనూలేదు. అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకున్నారంటూ ఇటీవల అమెరికా 12 మంది రష్యా నిఘా అధికారులపై అభియోగం మోపడాన్ని విలేకరులు ప్రస్తావించగా, రష్యా జోక్యం ఎంత మాత్రం లేనట్లు పుతిన్ తనకు చెప్పారనీ, ఈ అంశంలో రాబర్ట్ ముల్లర్ చేసిన విచారణ విఫలమైందని ట్రంప్ పేర్కొన్నారు. తన ప్రచార బృందానికి రష్యాతో ఏ సంబంధాలూ లేవని ట్రంప్ పునరుద్ఘాటించారు. అటు పుతిన్ కూడా ‘అమెరికా అంతర్గత వ్యవహారాల్లో రష్యా ఎప్పడూ తలదూర్చలేదు. భవిష్యత్తులో ఆ పని చేసే ప్రణాళికలూ లేవు’ అని తెలిపారు. అలాగే ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లను, ముడి చమురు ధరలను నియంత్రించడం కోసం అమెరికాతో కలిసి పనిచేసేందుకు తాము సిద్ధమని పుతిన్ ప్రకటించారు. ట్రంప్‌కు సంబంధించిన రహస్య సమాచారమేదో రష్యా వద్ద ఉందన్న వాదనలను పుతిన్ కొట్టిపారేశారు. ట్రంప్ తన వ్యాపార అవసరాల కోసం మాస్కోకు వచ్చినప్పుడు ఆ విషయం కూడా తనకు తెలిసేది కాదన్నారు. ఇద్దరిలోనూ నిరుత్సాహం, నిర్వేదం ఐక్యరాజ్యసమితి సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంతోషకరమైన దేశం ఫిన్లాండే కావొచ్చు. ట్రంప్, పుతిన్‌లను మాత్రం ఆ దేశం కనీసం నవ్వించలేక పోయింది. శిఖరాగ్ర భేటీ సందర్భంగా ఈ ఇరువురి మొహాల్లో సంతోషమే కనిపించలేదు. తొలుత భేటీ కోసం ఎదురెదురుగా వచ్చినప్పుడు వారు ఒకరికొకరు చేతులు కూడా కలుపుకోలేదు. ఏ కోలాహలం లేకుండా నిశ్శబ్ధంగానే చర్చల గదిలోకి వెళ్లారు. తర్వాత తమ తమ కుర్చీల్లో కూర్చున్నాకనే ముభావంగానే షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అమెరికా అధికారులు కూడా అంతా గంభీరంగానే కనిపించారు. శ్వేతసౌధం అధికార ప్రతినిధి సారా శాండర్స్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఓ ఫొటోలో కూడా.. పుతిన్ తల దించుకుని నీరసంగా కూర్చోగా ట్రంప్ కూడా నిరుత్సాహంగా, కోపంగా కనిపించారు. అయితే ఆ తర్వాత వచ్చిన ఓ వీడియో ఫుటేజ్‌లో మాత్రం పుతిన్‌కు ట్రంప్ కన్ను కొడుతున్నట్లుగా కనిపించింది. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ను ట్రంప్ సింగపూర్‌లో కలిసినప్పుడు ఉన్న సందడి ఫిన్లాండ్లో ఏ మాత్రం కనిపించలేదు. కాగా, సాధారణంగా అమెరికా, రష్యా నేతలు ఎప్పుడు కలిసినా ఫిన్లాండ్‌నే అందుకు వేదికగా ఎంచుకుంటూ ఉంటారు. చివరిగా 1997లో అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్, రష్యా అధ్యక్షుడు బోరిస్ ఎల్ట్సిన్లు హెల్సింకిలోనే భేటీ అయ్యారు. ఈ భేటీపై వార్తలనందించేందుకు వివిధ దేశాల నుంచి 2 వేల మంది విలేకరులు కూడా హెల్సింకికి వచ్చారు. ఆధిపత్యం.. నిస్సహాయత లండన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ల భేటీ సందర్భంగా వారి శరీర కదలికలు, హావభావాలపై ఓ బ్రిటన్‌కు చెందిన సైకాలజిస్ట్ పీటర్ కొల్లెట్ ఆసక్తికరమైన విశ్లేషణ చేశారు. హెల్సింకీలో జరిగిన ఈ సమావేశంలో ఇద్దరు నేతలు కొద్దిసేపు ఆధిపత్య ధోరణితో ప్రవర్తించారనీ, మరికాసేటికే నిస్సహాయంగా కన్పించారని వెల్లడించారు. ‘ఇద్దరు నేతలు ఒకరి సమక్షంగా మరొకరు అంత రిలాక్స్‌గా కన్పించలేదు. చర్చల గదిలోకి ట్రంప్ దర్జాగా ప్రవేశిస్తే, పుతిన్ మాత్రం గొప్ప ఆత్మవిశ్వాసంతో లోపలకు వచ్చారు. ఈ సమావేశం లో కుడివైపు కూర్చున్న ట్రంప్.. పుతిన్‌కు తలొగ్గుతున్నట్లు అరచేతిని సాధారణం కంటే కొంచెం పైకెత్తి ఆయనతో కరచాలనం చేశారు. తద్వారా చర్చల్లో మరింత చొరవ తీసుకోవాలని పుతిన్‌ను పరోక్షంగా కోరినట్లయింది. అంతలోనే పుతిన్‌ను కూర్చోవాల్సిందిగా కుర్చీ చూపించడం ద్వారా మొత్తం పరిస్థితిని అదుపులోకి తెచ్చుకునేందుకు ట్రంప్ యత్నించారు’ అని కొల్లెట్ తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్ చేతుల్ని గోపురం ఆకారంలో ఉంచడంపై స్పందిస్తూ.. ‘చుట్టూ ఉన్నవారి కంటే తాను గొప్పవాడినని భావించే లేదా ఆత్మన్యూనతాభావంతో ఉండే వ్యక్తులే ఇలా చేతుల్ని పెడతారు. పుతిన్‌తో కరచాలనం సమయంలో ట్రంప్ ఇబ్బందిగా కన్పించారు. సమావేశంలో అధిక్యం ప్రదర్శించేందుకు అవకాశం రాకపోవడమే ఇందుకు కారణం కావొచ్చు. భేటీ సందర్భంగా ట్రంప్ మాటలు, హావభావాలకు పుతిన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు’ అని అన్నారు. -
భారత్‌తో సహకారం అవసరం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో శాంతి నెలకొనాలంటే భారత్‌లో పరస్పర సహకారం అవసరమని పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఆ దేశ పార్లమెంటు ఎన్నికలకోసం తమ పార్టీ మేనిఫెస్టోను సోమవారం ప్రకటించిన ఇమ్రాన్ ఖాన్.. ఇస్లామిక్ సంక్షేమ దేశంగా పాక్‌ను మారుస్తానని హామీ ఇచ్చారు. కశ్మీర్ సమస్యకు పరిష్కారానికి బ్లూప్రింట్ తమ వద్ద ఉందన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానాలకు పాటిస్తామన్నారు. తమపార్టీ అధికారంలోకి వస్తే పాకిస్తాన్ ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు, పాలనాపరమైన ఇబ్బందులను 100 రోజుల్లోనే పరిష్కరించేందుకు అవసరమైన వ్యూహాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ‘పాకిస్తాన్లో శాంతి నెలకొనేందుకు మన సరిహద్దుదేశమైన భారత్‌తో సహకారాత్మక సత్సంబంధాలు అవసరం. పాకిస్తాన్ ప్రాధాన్యాలను గుర్తిస్తూ.. సరిహద్దు దేశాలతో ఘర్షణలేకుండా పరస్పర సానుకూల వాతావరణాన్ని నిర్మిస్తాం’ అని మేనిఫెస్టోలో ఇమ్రాన్ పేర్కొన్నారు. భారత్, చైనా, రష్యా సహా పలు దేశాలతో ద్వైపాక్షిక, బహుపాక్షిక సంబంధాలు ఏర్పర్చుకుంటామన్నారు. జూలై 25న పాకిస్తాన్ పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. -
16న ట్రంప్, పుతిన్ భేటీ
వాషింగ్టన్/మాస్కో: అమెరికా, రష్యాల మధ్య నెలకొన్న సమస్యల పరిష్కారంతోపాటు ద్వైపాక్షిక బంధాల బలోపేతానికి ఇరుదేశాల అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్‌లు శిఖరాగ్ర సమావేశంలో పాల్గొననున్నారు. ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో జూలై 16న ఈ భేటీ జరగనుందని శ్వేతసౌధం, క్రెమ్లిన్ (రష్యా అధ్యక్ష భవనం) గురువారం ప్రకటించాయి. ‘పరస్పర జాతీయ భద్రతాంశాలతో సహా ద్వైపాక్షికాంశాలపై ట్రంప్, పుతిన్‌లు చర్చలు జరుపుతారు’ అని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ సారా శాండర్స్ వెల్లడించారు. ‘ట్రంప్, పుతిన్‌లు అమెరికా–రష్యా సంబంధాల్లోని ప్రస్తుత పరిస్థితిని, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు, పలు కీలక అంతర్జాతీయ అంశాలను చర్చిస్తారు’ అని క్రెమ్లిన్ కూడా ఒక ప్రకటనలో తెలిపింది. బుధవారం మాస్కోలో పుతిన్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ల సమావేశం తర్వాతే జూలై 16న సమావేశం తేదీ ఖరారైంది. ఇద్దరు దేశాధ్యక్షుల మధ్య చర్చలు, అనంతరం సంయుక్త మీడియా సమావేశం ఉంటుంది. వీరిద్దరూ కలిసి సంయుక్త మీడియా ప్రకటన కూడా విడుదల చేస్తారని క్రెమ్లిన్ వెల్లడించింది. బోల్టన్‌తో సమావేశం సుహృద్భావపూర్వకంగా జరిగిందని.. అమెరికా–రష్యాల ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతితోపాటు.. ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వానికి ఈ సమావేశం బాటలువేస్తుందని భావిస్తున్నట్లు పుతిన్ వెల్లడించారు. జూలై 11,12 తేదీల్లో బెల్జియంలోని బ్రసెల్స్‌లో నాటో సదస్సు జరిగిన నాలుగురోజుల తర్వాత వీరిద్దరి మధ్య భేటీ జరగనుంది. 2017 జూలైలో జీ–20 సదస్సు సందర్భంగా జర్మనీలో ట్రంప్, పుతిన్‌లు తొలిసారి కలుసుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో చర్చలు జరగలేదు. -
భారత్, చైనాలు కలసి పనిచేస్తే ఆసియాకు మేలు
సింగపూర్: భారత్, చైనాలు పరస్పర విశ్వాసంతో కలసి పనిచేస్తే ఆసియాకు మెరుగైన భవిష్యత్తు ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. సరిహద్దుల్లో ప్రశాంతత నెలకొనేలా సమస్యలు పరిష్కరించుకోవడంలో ఇరు దేశాలు గొప్ప పరిపక్వత, విజ్ఞానాన్ని ప్రదర్శించాయని తెలిపారు. సింగపూర్ పర్యటనలో ఉన్న మోదీ శుక్రవారం ‘షాంగ్రి–లా’ సమావేశంలో కీలకోపన్యాసం చేశారు. 28 ఆసియా–పసిఫిక్ దేశాల అంతర ప్రభుత్వ భద్రతా వేదిక అయిన ఈ కార్యక్రమాన్ని 2002 నుంచి సింగపూర్‌లోని షాంగ్రి–లా అనే హోటల్లో ఏటా నిర్వహిస్తున్నారు. విభేదాలు, స్పర్థలను పక్కనపెట్టి ఈ ప్రాంత దేశాలన్నీ కలసి పనిచేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రాంతీయ సముద్ర తీర వివాదాలను ప్రస్తావిస్తూ..ఇండో–పసిఫిక్ ప్రాంతాన్ని భారత్ ఓ వ్యూహంగానో, కొందరి సభ్యుల క్లబ్గానో చూడదని ఉద్ఘాటించారు. ‘చర్చలు, ఉమ్మడి నిబంధనల ఆధారిత విధానాల ఆధారంగానే ఈ ప్రాంత అభివృద్ధి, భద్రత సాధ్యమని విశ్వసిస్తున్నాం. స్థిరమైన, వివక్షలేని అంతర్జాతీయ వాణిజ్య విధానాలకే భారత్ మద్దతిస్తుంది. పోటీ ఎక్కడైనా ఉంటుంది. కానీ పోటీ ఘర్షణగా, విభేదాలు వివాదాలుగా మారకూడదు’ అని వాణిజ్యంలో పెరిగిపోతున్న రక్షణాత్మక ధోరణులను పరోక్షంగా ప్రస్తావించారు. ఇండో–పసిఫిక్ ప్రాంత భవిష్యత్తుకు ఆసియాన్ కేంద్ర బిందువుగా ఉండబోతోందని జోస్యం చెప్పారు. ప్రాంతీయ అనుసంధానత వ్యాపారాభివృద్ధిని మించి వేర్వేరు దేశాలను చేరువ చేస్తోందని అన్నారు. అంతకు ముందు, మోదీ సింగపూర్ అధ్యక్షురాలు హలీమా యాకూబ్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అంతరాలను చెరిపేస్తున్న సాంకేతికత: మోదీ సాంకేతికత ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందికి గొంతుకగా మారి, సామాజిక అడ్డంకులను తొలగిస్తోందని మోదీ అన్నారు. సృజనాత్మకతకు మానవీయ విలువలు జోడించి ఈ శతాబ్దపు సవాళ్లను అధిగమించాలని పిలుపునిచ్చారు. సింగపూర్‌లోని ప్రతిష్టాత్మక నన్యంగ్ టెక్నలాజికల్ యూనివర్సిటీ(ఎన్టీయూ)లో నిర్వహించిన ట్రాన్స్ఫార్మింగ్ ఆసియా త్రూ ఇన్నోవేషన్’ అనే సదస్సులో మోదీ ప్రసంగించారు. మార్పును వినాశకారిగా చూడొద్దని, సాంకేతికత ఆధారిత సమాజం వల్లే అంతరాలు నశిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. పాశ్చాత్య దేశాల ఆధిపత్యం 300 ఏళ్ల నుంచే.. ‘21వ శతాబ్దం ఆసియాదే. మరి మనకు ఈ సెంటిమెంట్ ఉందా అన్నదే అతిపెద్ద సవాలని అనుకుంటున్నా. ప్రతి సృజనాత్మకత తొలుత అవాంతరంగా కనిపిస్తుంది. సమాజంలోని అంతరాలను సాంకేతికత సాయంతో పారదోలొచ్చు. సాంకేతికత అందరికీ అందుబాటులో ఉంటూ వినియోగదారుడికి అనుకూలంగా ఉండాలి. డిజిటల్ యుగానికి తగినట్లుగా నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగాల కల్పన, వ్యవసాయ ఉత్పాదకత పెంపు, నీరు, గాలి కాలుష్యం, శరవేగంగా పెరుగుతున్న పట్ణణీకరణ, వాతావరణ మార్పులు, ఎక్కువ కాలం నిలిచే మౌలిక వసతుల నిర్మాణం, సముద్ర వనరుల పరిరక్షణ తదితరాలు నేడు మనకు సవాళ్లు విసురుతున్నాయి. సుమారు 1600 ఏళ్ల పాటు ప్రపంచ జీడీపీలో భారత్, చైనాల వాటానే 50 శాతంగా ఉండేది. గత 300 ఏళ్ల నుంచే పాశ్చాత్య దేశాల ఆధిపత్యం మొదలైంది. సాంకేతికతను ఆయుధాల తయారీకి వినియోగిస్తే ప్రపంచ దేశాల మధ్య ఘర్షణలు తప్పవు’ అని మోదీ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎన్టీయూ, భారత వర్సిటీల మధ్య విద్య, పారిశ్రామిక భాగస్వామ్యానికి సంబంధించి ఆరు ఒప్పందాలు కుదిరాయి. ఇక్కడ నిర్వహించిన ఎగ్జిబిషన్‌కు హాజరైన మోదీ..మనుషులతో సంభాషించే ఓ రోబోతో మాట్లాడారు. లూంగ్‌కు బౌద్ధ జ్ఞాపిక ప్రదానం.. చర్చల సందర్భంగా లూంగ్‌కు మోదీ 6వ శతాబ్దం నాటి బౌద్ధగుప్త జ్ఞాపిక నమూనాను కానుకగా ఇచ్చా రు. బౌద్ధమతం భారత్ నుంచి ఆగ్నేయాసియాకు వ్యాపించిందనడానికి సాక్ష్యంగా భావిస్తున్న ఈ జ్ఞాపికపై సంస్కృత వాక్యాలున్నాయి. అలాగే, సింగపూర్ మాజీ రాయబారి టామీ కోహ్(80)కు ప్రధాని మోదీ పద్మశ్రీ పురస్కారాన్ని అందజేశారు. ఈ ఏడాది పద్మశ్రీ పొందిన ఆసియాన్ దేశాలకు చెందిన 10 మందిలో కోహ్ ఒకరు. కోహ్ గతంలో అమెరికా, ఐక్యరాజ్య సమితిలో రాయబారిగా చేశారు. 8 ఒప్పందాలపై సంతకాలు ఆర్థిక, రక్షణ సంబంధాలను బలోపేతం చేసుకోవాలని భారత్, సింగపూర్ నిర్ణయించాయి. నావికా దళాల మధ్య రవాణా సహకారం సహా ఇరు దేశాల మధ్య 8 ఒప్పందాలు కుదిరాయి. ప్రధాని మోదీ, సింగపూర్ ప్రధాని లూంగ్‌తో చర్చలు జరిపారు. ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై చర్చించారు. సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం(సీఈసీఏ)పై రెండో సమీక్ష సమావేశం విజయవంతమైందని మోదీ తెలిపారు. లూంగ్ మాట్లాడుతూ.. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు పటిష్టమయ్యాయని అన్నారు. సింగపూర్ కంపెనీల సహకారంతో నిర్మిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, పుణే విమానాశ్రయ అభివృద్ధిని ప్రస్తావించారు. -
‘ప్రత్యేక భాగస్వామ్యం’ మనది
సోచి: భారత్, రష్యాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ‘ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి చేరాయని, ఇది ఇరు దేశాలు సాధించిన భారీ విజయమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి, రష్యా అధ్యక్షుడు పుతిన్‌లు నాటిన వ్యూహాత్మక భాగస్వామ్యమనే విత్తనాలు ఇప్పుడు మంచి ఫలితాలు ఇస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పుతిన్‌తో చర్చలు విజయవంతంగా సాగాయని, భారత్–రష్యాల మధ్య సంబంధాలతో పాటు అంతర్జాతీయ అంశాలు ప్రస్తావనకు వచ్చాయని మోదీ తెలిపారు. రష్యాలోని నల్లసముద్ర తీరప్రాంత నగరమైన సోచిలో ఆ దేశాధ్యక్షుడు పుతిన్‌తో సోమవారం మోదీ అనధికారికంగా భేటీ అయ్యారు. ప్రధాని మోదీని పుతిన్ ఆహ్వానిస్తూ.. మోదీ పర్యటన ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో నూతనోత్సాహాన్ని నింపుతుందన్నారు. నాలుగు నుంచి ఆరు గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాల కంటే అంతర్జాతీయ ప్రాధాన్యమున్న అంశాలపైనే ఎక్కువ సమయం చర్చించారు. ఇరాన్ అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగడం, అఫ్గానిస్తాన్, సిరియాల్లో పరిస్థితి, ఉగ్రవాద ముప్పు, త్వరలో జరగనున్న ఎస్సీవో, బ్రిక్స్ సదస్సులు సహా పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై మోదీ, పుతిన్‌ల మధ్య చర్చ జరిగింది. పుతిన్‌కు ప్రత్యేక స్థానం: మోదీ భేటీ అనంతరం మోదీ మాట్లాడుతూ.. 2001లో అప్పటి ప్రధాని వాజ్‌పేయితో కలిసి రష్యాలో పర్యటించడాన్ని గుర్తు చేసుకున్నారు. ‘నేను గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక కలుసుకున్న మొట్టమొదటి ప్రపంచ నాయకుడు పుతిన్. నా రాజకీయ జీవితంలో పుతిన్, రష్యాలకు ప్రత్యేక స్థానం ఉంది’ అని మోదీ పేర్కొన్నారు. ‘భారత్, రష్యాలు ఎప్పటినుంచో మిత్రదేశాలు., ఆ రెండింటి మధ్య ఇంతవరకూ విభేదాలు లేని మైత్రి కొనసాగింది. ఇరు దేశాల మధ్య ఎన్నో ఏళ్ల స్నేహ సంబంధాల్లో ఈ అనధికారిక భేటీ ఒక కొత్త కోణం. దీనిని ప్రత్యేక సందర్భంగా భావిస్తున్నాను’ అని మోదీ చెప్పారు. భారత్, రష్యాల మధ్య సంబంధాల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో భాగంగా గత 18 ఏళ్లలో అనేక అంశాలపై పుతిన్‌తో చర్చించే అవకాశం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవల నాలుగోసారి రష్యా అధ్యక్షుడిగా ఎన్నికైన పుతిన్‌ను అభినందించారు. 2000లో పుతిన్ రష్యా అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి ఇరు దేశాల సంబంధాలు చరిత్రాత్మక స్థాయికి చేరాయని మోదీ ప్రశంసిం చారు. సోచిలో బొకారెవ్ క్రీక్ నుంచి ఒలింపిక్ పార్కు వరకూ ఇరువురు బోటు షికారు చేశారు. ఇరు దేశాలకు ప్రయోజకరంగా..: రష్యా సోమవారం నాటి చర్చలు చాలా ఉత్సుకతతో, ఇరు దేశాలకు ఉపయోగకరంగా సాగాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ను ఉద్దేశించి ఆ దేశ అధికారిక వార్తాపత్రిక టాస్ పేర్కొంది. రష్యాపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో రష్యా–భారత్ మధ్య సైనిక సహకారంపై చర్చలు జరుగుతాయని పెస్కోవ్ చెప్పారు. రష్యా పర్యటనను ముగించుకున్న ప్రధాని మోదీ సోమవారం రాత్రి భారత్‌కు పయనమయ్యారు. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చి పుతిన్ వీడ్కోలు పలికారు. -
సరిహద్దుల్లో స్నేహగీతం..
వుహాన్: సరిహద్దు అంశాల్లో నమ్మకం, అవగాహన నెలకొల్పే లక్ష్యంతో పరస్పరం సమాచార మార్పిడిని పటిష్టం చేసేందుకు ఇరు దేశాల సైన్యాలకు వ్యూహాత్మక మార్గనిర్దేశనం చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌లు నిర్ణయించారు. భవిష్యత్తులో డోక్లాం తరహా సంఘటనలు ఉత్పన్నం కాకుండా చర్యలు చేపట్టేందుకు ఇరువురు నేతలు అవగాహనకు వచ్చారు. మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య వుహాన్‌లో జరుగుతున్న అనధికారిక సదస్సు చివరిరోజైన శనివారం సరిహద్దుల్లో ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు చేపట్టాల్సిన అంశాలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం భారత్–చైనా సరిహద్దులకు సంబంధించిన అన్ని అంశాల్లో శాంతి, స్థిరత్వం కొనసాగాల్సిన అవసరాన్ని ఉద్ఘాటించారు. జిన్‌పింగ్‌తో చర్చల సందర్భంగా విభిన్న రంగాల్లో భారత్–చైనా సహకారంపై దృష్టిసారించామని మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. ‘ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఊతమిచ్చే మార్గాలు, ప్రజల మధ్య సంబంధాల్ని పెంపొందించే అంశాలపై మేం చర్చించాం. వ్యవసాయం, సాంకేతికత, ఇంధనం, పర్యాటక రంగాలపైనా మాట్లాడాం. మా ఇద్దరి మధ్య చర్చలు ఫలప్రదంగా సాగాయి. భారత్, చైనాల మధ్య దృఢమైన స్నేహం రెండు దేశాల ప్రజలకే కాకుండా, మొత్తం ప్రపంచానికే లాభదాయకం’ అని ట్వీట్ చేశారు. మోదీ, జిన్‌పింగ్‌లు చర్చలు, ఇతర కార్యక్రమాల్లో భాగంగా దాదాపు 9 గంటల పాటు కలిసి గడిపారని చైనా దౌత్యాధికారి ఒకరు తెలిపారు. కాగా రెండ్రోజుల చైనా పర్యటన ముగించుకున్న మోదీ భారత్‌కు చేరుకున్నారు. గతేడాది 73 రోజుల పాటు కొనసాగిన డోక్లాం వివాదంతో దెబ్బతిన్న సంబంధాల్ని పునఃనిర్మించే దిశగా శనివారం మోదీ, జిన్‌పింగ్ చర్చలు కొనసాగాయి. ఇరువురి మధ్య అనధికారిక సమావేశం వివరాల్ని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే వెల్లడిస్తూ..‘సరిహద్దు అంశాల పరిష్కారంలో నమ్మకం, పరస్పర అవగాహన నెలకొల్పేందుకు రెండు దేశాల సైన్యాలు సమాచార మార్పిడిని బలోపేతం చేసేందుకు మార్గదర్శకాలను జారీ చేశారు. నమ్మకాన్ని పెంపొందించే దిశగా ఇప్పటికే ఇరు వైపులా ఆమోదించిన నిర్ణయాల్ని నిజాయతీతో అమలు చేయాలని వారి సైన్యాలను రెండు దేశాల అధినేతలు నిర్దేశించారు’ అని చెప్పారు. సరిహద్దు అంశంలో సముచితం, అంగీకారయోగ్యం, పరస్పర ఆమోదనీయమైన ఒప్పందం కోసం పత్యేక ప్రతినిధుల ప్రయత్నాల్ని మోదీ, జిన్‌పింగ్‌లు ఆమోదించారని గోఖలే తెలిపారు. ఉగ్రవాద నిరోధంలో సహకరించుకుందాం.. ‘శాంతిపూర్వక చర్చల ద్వారా విభేదాల్ని పరిష్కరించుకునేందుకు ఇరుదేశాలకు తగిన పరిణతి, అవగాహన ఉందనే అభిప్రాయంతో ఇరువురు నేతలు ఏకీభవించారు. ఆందోళనలు, ఆకాంక్షలు, సున్నితమైన అంశాల్లో ఇరు దేశాలు ఒకరినొకరు గౌరవించుకోవాలనే విషయాన్ని మోదీ, జిన్‌పింగ్‌లు గుర్తు చేసుకున్నారు. భారత్, చైనాల మధ్య ప్రాంతీయ, అంతర్జాతీయ ఆసక్తులు ఇమిడి ఉన్నాయని, ఆ అంశాలపై విస్తృత స్థాయి సంప్రదింపుల ద్వారా వ్యూహాత్మక చర్యల్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరముందని వారిద్దరు అంగీకరించారు. పరస్పర అవగాహనను పెంపొందించుకునే క్రమంలో ఆ సంప్రదింపులు సానుకూల ప్రభావాన్ని చూపుతాయని మోదీ, జిన్‌పింగ్‌లు విశ్వసించారు’ అని గోఖలే తెలిపారు. ఉగ్రవాదంతో పొంచి ఉన్న ముప్పును గుర్తించిన ఇద్దరు నేతలు ఉగ్రవాద నిరోధక చర్యల్లో సహకరించుకోవాలని నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిష్పాక్షికంగా సాగాల్సిన అవసరంతో పాటు దానిని కొనసాగించాలని ఇరు నేతలు నొక్కిచెప్పారు. ‘రెండు దేశాల మధ్య వాణిజ్యం సమతూకంతో సాగాలని మోదీ అభిలషించారు. చైనాకు వ్యవసాయ, ఫార్మాస్యూటికల్స్ ఎగుమతులకున్న అవకాశాల్ని ప్రధాని ప్రస్తావించారు’ అని తెలిపారు. ప్రపంచాన్ని మార్చగల శక్తులుగా.. భారత్, చైనాల మధ్య సంబంధాలు స్థిరంగా కొనసాగాల్సిన అవసరముందని, పరస్పర విశ్వాసం ఆధారంగా అభివృద్ధి కొనసాగాలని జిన్‌పింగ్ ఆకాక్షించారు. భేటీ వివరాల్ని చైనా ప్రభుత్వ వార్తా సంస్థజిన్హుహ వెల్లడిస్తూ ‘చైనా భారత్‌లు మంచి పొరుగు దేశాలే కాకుండా మిత్ర దేశాలు కూడా.. ప్రపంచాన్ని మార్చగల కీలక శక్తులుగా ఒకరినొకరు పరిగణించుకోవాలి. సానుకూల, న్యాయబద్ధమైన, కలుపుగోలు ప్రవర్తనను తప్పకుండా అలవరచుకోవాలి.అదే సమయంలో పరస్పర ప్రయోజనాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. సమగ్ర సహకారం కోసం ఇరు దేశాలు కలిసి పనిచేయాలి. భారత్, చైనాలు సన్నిహిత వ్యూహాత్మక చర్చలు కొనసాగించాల్సిన అవసరముంది’ అని మోదీతో చైనా అధ్యక్షుడు తన అభిప్రాయాల్ని పంచుకున్నారు. ఇరుదేశాలు మరింత పరిణతితో విభేదాల్ని పరిష్కరించుకోవాలని, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల్లో సమన్వయం, సహకారం బలోపేతం చేసుకోవాలని.. ప్రాంతీయ ఆర్థిక ఏకీకరణ కోసం కృషిచేయాలని జిన్‌పింగ్ సూచించినట్లు చైనా మీడియా పేర్కొంది. ఇద్దరు నేతలు వాతావరణ మార్పులు, స్థిరమైన అభివృద్ధి, ఆహార భద్రత అంశాలపై కూడా చర్చించారు. చైనాలోని అతిపెద్ద నది యాంగ్జీ, భారత్‌లో అతిపెద్ద నది గంగా నదుల్ని పరిరక్షణలో తమ అనుభవాల్ని పంచుకున్నారు. ఇరుదేశాల మధ్య క్రీడల ప్రోత్సాహం, బౌద్ధ మతం కేంద్రంగా పర్యాటక అభివృద్ధిపై కూడా మోదీ, జిన్‌పింగ్‌లు చర్చలు జరిపారు. మోదీ, జిన్‌పింగ్ బోటు షికారు వుహాన్‌లోని సుందరమైన ఈస్ట్ లేక్ తీరం వెంట మోదీ, జిన్‌పింగ్‌లు శనివారం విహరించారు. తర్వాత బోటు షికారు చేశారు. ఆ సమయంలో ఇద్దరూ ఎంతో ఆహ్లాదంగా కనిపించారు. ‘ఈస్ట్ లేక్‌లో బోటు షికారు గుర్తుండిపోయేలా సాగింది’ అని మోదీ ట్వీట్ చేశారు. శాంతి, సామరస్యం, అభివృద్ధి కోసం ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌లు ఒకే బోటులో షికారు చేశారు అని భారత విదేశాంగ ప్రతినిధి రవీశ్ ట్వీట్ చేశారు. దంగల్ బాగా నచ్చింది: జిన్‌పింగ్ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఆమిర్ ఖాన్ దంగల్ సినిమా బాగా నచ్చిందట.. గతేడాది చైనాలో దాదాపు 1,100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఆ సినిమాను చూసినట్లు మోదీతో జిన్‌పింగ్ చెప్పారు. గతంలో ఎన్నో భారతీయ సినిమాలు చూశానని, వాటిలో హిందీ, ఇతర ప్రాంతీయ భాషా చిత్రాలు ఉన్నాయని చైనా అధ్యక్షుడు చెప్పడం విశేషం. ‘మరిన్ని భారతీయ సినిమాలు చైనాలో, చైనా సినిమాలు భారత్‌లో ప్రదర్శిస్తే బాగుంటుందని జిన్‌పింగ్ ఆకాంక్షించారు’ అని విదేశాంగ కార్యదర్శి గోఖలే చెప్పారు. శుక్రవారం తొలిరోజు భేటీ అనంతరం 1982ల నాటి బాలీవుడ్ సినిమా ‘యే వదా రహా’లోని ‘తు హై వహీ దిల్ నే జిసే అప్నా కహా..’ పాటను చైనా వాద్యకారులు వినిపించారు. వుహాన్‌లోని ఈస్ట్‌లేక్ వద్ద సంభాషించుకుంటున్న మోదీ, జిన్‌పింగ్ ఈస్ట్లేక్లోని బోటులో మోదీ, జిన్‌పింగ్ -
భారత్–చైనా బంధాల్లో నవశకం!
వుహాన్: ఆసియాలో, వివిధ ప్రపంచ వేదికలపై కీలక శక్తులుగా ఉన్న భారత్, చైనాలు తమమధ్యనున్న విభేదాలను చెరిపేసుకుని నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నాయి. ఇందులో భాగంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య శుక్రవారం నుంచి రెండ్రోజులపాటు చైనాలోని వుహాన్‌లో విస్తృతమైన చర్చలు జరగనున్నాయి. ఈ అనధికార సదస్సులో ఇరువురు నేతలు పలు అంతర్జాతీయ, ఆసియా ప్రాంత, ద్వైపాక్షిక అంశాలపై చర్చించనున్నారని భారత విదేశాంగ శాఖ తెలిపింది. 73 రోజుల పాటు డోక్లాంలో ఇరుదేశాల సైన్యాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ద్వైపాక్షిక సమస్యలను పరిష్కరించుకుని పరస్పర విశ్వాసం పెంచుకునే దిశగా భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. వ్యూహాత్మక, ప్రాధాన్యతాంశాలపై చర్చ ఈ సదస్సులో పాల్గొనేందుకు మోదీ గురువారం బీజింగ్‌కు బయలుదేరారు. జిన్‌పింగ్‌తో ఇరుదేశాల మధ్య సంబంధాలు వ్యూహాత్మక అంశాలపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. ‘జిన్‌పింగ్, నేను ద్వైపాక్షిక, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటాం. భారత్–చైనా సంబంధాల్లో వ్యూహాత్మక, ద్వైపాక్షిక అంశాల్లో ప్రగతిని దీర్ఘకాల దృష్టికోణంలో సమీక్షిస్తాం’ అని చైనా పర్యటనకు బయలుదేరే ముందు మోదీ అన్నారు. శుక్ర, శనివారాల్లో వీరిద్దరి మధ్య చర్చలు జరగనున్నాయి. డోక్లాంతోపాటుగా జైషే మహ్మద్ చీఫ్ అజర్‌పై ఐరాస నిషేధం, ఎన్ఎస్జీలో భారత సభ్యత్వానికి చైనా అడ్డుపడటం తదితర అంశాల్లో ఇరుదేశాల మధ్య స్పష్టమైన విభేదాలున్న సంగతి తెలిసిందే. మోదీ–జిన్‌పింగ్ మధ్య జరగనున్న అనధికార సదస్సులో ద్వైపాక్షిక అంశాల్లో నెలకొన్న సమస్యలు, సరిహద్దు వివాదాలు, వాణిజ్యపరమైన అంశాల్లో ఏకాభిప్రాయం సాధ్యమైతే.. వీరి భేటీ అంతర్జాతీయంగా ఓ గేమ్‌చేంజర్ కావొచ్చని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. మోదీ కోసం వుహాన్‌లో చేస్తున్న ఏర్పాట్లు భారత్ అంచనాలకు అందనంత గొప్పగా ఉన్నాయని చైనా పేర్కొంది. వుహాన్.. అందమైన పర్యాటక క్షేత్రం చైనా చరిత్రలో వుహాన్‌కు గొప్ప స్థానం ఉంది. ఆధునిక చైనా నిర్మాత మావో జెడాంగ్‌కు అత్యంత ఇష్టమైన విడిది వుహాన్. మధ్య చైనాలోని వుహాన్‌లో యాంగ్జే నదిలోని ప్రఖ్యాతిచెందిన ఈస్ట్‌లేక్ ఒడ్డున మోదీ–జిన్‌పింగ్‌ల భేటీ జరగనుంది. జెడాంగ్ అప్పట్లో ఉండే భవనాన్ని ఆయన స్మృతి భవనంగా మార్చారు. ఇక్కడే ఇరువురు దేశాధినేతలు చర్చలు జరపనున్నారు. ఈస్ట్ లేక్ వెంబడి వీరిద్దరు నడుచుకుంటూ వెళ్తూ మాట్లాడుకుంటారని నదిలో బోట్ రైడ్ సందర్భంగా చర్చలు జరుగుతాయని తెలిసింది. -
27న మోదీ, జిన్‌పింగ్ భేటీ
బీజింగ్: చైనాతో సుహృద్భావ సంబంధాల దిశగా మరో అడుగు పడింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ల మధ్య భేటీకి ముహూర్తం కుదిరింది. ఈ నెల 27, 28 తేదీల్లో వారిరువురు సమావేశం కానున్నారు. చైనాలోని హుబీ ప్రావిన్సులోని వుహన్ నగరంలో ఈ అనధికార శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ భేటీలో ఇరువురు నేతలు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, వివాదాస్పద అంశాల పరిష్కారం, అంతర్జాతీయ సమస్యలు.. తదితర అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. రెండు దేశాలకు దీర్ఘకాలిక, వ్యూహాత్మక ప్రయోజనాలకు వీలు కల్పించే దిశగా చర్చలు కొనసాగనున్నాయి. అయితే, ఈ సందర్భంగా ఎలాంటి ప్రతినిధుల స్థాయి చర్చలుండబోవని, ఎలాంటి ఒప్పందాలు కుదరబోవని, కేవలం ఇద్దరు నేతలు ఏకాంతంగా చర్చలు జరుపుతారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. డోక్లాం సహా పలు సరిహద్దు వివాదాలు, ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వాన్ని చైనా అడ్డుకోవడం, ఉగ్రవాది మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో చైనా మోకాలడ్డడం తదితర అంశాల్లో ఇరుదేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు మోదీ చైనా పర్యటనకు వస్తున్నారని భారత్, చైనాల విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్, వాంగ్ యి ఆదివారం సంయుక్తంగా ప్రకటించారు. ‘భారత్, చైనాల మధ్య విబేధాల కన్నా ప్రయోజనాలే ముఖ్యమైనవి. పరస్పర ప్రయోజనపూరిత అభివృద్ధికి రెండు దేశాల మధ్య సహకారం అవసరం’ అని వాంగ్ యి పేర్కొన్నారు. మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య భేటీ ఏర్పాట్లపై వాంగ్ యితో చర్చించినట్లు సుష్మాస్వరాజ్ తెలిపారు. షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు ప్రస్తుతం సుష్మ చైనాలో పర్యటిస్తున్నారు. జూన్ 9, 10 తేదీల్లోనూ ఎస్సీవో సదస్సులో పాల్గొనేందుకు మోదీ చైనా వెళ్తారు. మానస సరోవర యాత్రకు చైనా ఓకే వాంగ్ యితో భేటీ అనంతరం సుష్మ మాట్లాడుతూ సిక్కింలోని నాథూ లా కనుమ మార్గంలో కైలాశ్ మానస సరోవర యాత్రను తిరిగి ప్రారంభించేందుకు ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరిందన్నారు. డోక్లాం వివాదం తర్వాత నాథూ లా మార్గం గుండా మానస సరోవర యాత్రను నిలిపివేయడం తెలిసిందే. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో సుష్మ కరచాలనం -
భారత్–ఫ్రాన్స్ మధ్య 14 ఒప్పందాలు
న్యూఢిల్లీ: భారత్–ఫ్రాన్స్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బలపడే దిశగా ఇరు దేశాలు అడుగులు వేశాయి. అత్యంత కీలకమైన రక్షణ, భద్రత, అణు ఇంధనం, రహస్య సమాచార రక్షణతో పాటు మొత్తం 14 అంశాలపై భారత్–ఫ్రాన్స్ కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఇండో–పసిఫిక్ రీజియన్‌లో సహకారాన్ని విస్తృతం చేయాలని, ఉగ్రవాదం కట్టడికి ఉమ్మడి చర్యలను పెంచాలని నిర్ణయించాయి. శనివారం ఢిల్లీలో ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ మధ్య ద్వైపాక్షిక చర్చల తర్వాత ఇరు దేశాల ఉన్నతాధికారులు ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఒప్పందాల్లో సాయుధ దళాల పరస్పర సహకారం, రహస్య సమాచార రక్షణ, జైతాపూర్ అణు విద్యుత్ ప్రాజెక్టు, రైల్వేలు, సౌరశక్తి, సముద్రతీర అవగాహన, మాదక ద్రవ్యాల నియంత్రణ మొదలైనవి ఉన్నాయి. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి జరిగిన వేల కోట్ల రూపాయల విలువైన ఒప్పందం వివరాలను భారత్ వెల్లడించలేదు. 2016లో భారత్–ఫ్రాన్స్ మధ్య 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ.58 వేల కోట్లు. ఒప్పందానికి సంబంధించిన వివరాలు వెల్లడించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. మోదీ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం కంటే దీని విలువ తక్కువే ఉంటుందని ఆరోపించింది. మరోవైపు సాయుధ దళాల పరస్పర సహకార ఒప్పందం ప్రకారం ఒకరి మిలిటరీ బేస్‌లను మరొకరు వాడొచ్చు. అత్యంత నమ్మకమైన రక్షణ భాగస్వామి ఫ్రాన్స్ అనంతరం సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రధాని మోదీ, మాక్రాన్ మాట్లాడారు. ‘మా రక్షణ సహకారం పటిష్టమైనది. భారత్‌కు అత్యంత నమ్మకమైన రక్షణ భాగస్వామి ఫ్రాన్స్’ అని మోదీ అన్నారు. ఇరు దేశాల సాయుధ దళాల మధ్యా పరస్పర లాజిస్టిక్ సహకారం రక్షణ సంబంధాల్లో కొత్త శకమన్నారు. ప్రాంతీయ సుస్థిరత, శాంతికి హిందూ మహా సముద్రం కీలకపాత్ర పోషించనుందని స్పష్టం చేశారు. రక్షణ సంబంధాల్లో నూతన శకం.. స్కార్పీన్ జలాంతర్గాముల ప్రాజెక్టు, ఫైటర్ జెట్ల ఒప్పందం నేపథ్యంలో ఇరుదేశాల మధ్యా రక్షణ సంబంధాల్లో నూతన శకం ఆరంభమైందని మాక్రాన్ అన్నారు. యుద్ధ విమానాల ఒప్పంద పురోగతిని తాము స్వయంగా పర్యవేక్షిస్తానని, ఈ ప్రాజెక్టు కొనసాగాలని తాము భావిస్తున్నామని, ఇరు దేశాలకు లబ్ధి చేకూర్చే దీర్ఘాకాలిక ఒప్పందం ఇదని చెప్పారు. భారత్ తమ మొదటి వ్యూహాత్మక భాగస్వామి కావాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. సముద్ర తీరాలు ఆధిపత్యపోరాటానికి వేదికలు కాదని, పరోక్షంగా చైనాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఏటా రక్షణ రంగానికి సంబంధించి మంత్రుల స్థాయిలో చర్చలు జరపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. రక్షణ మంత్రి సీతారామన్, ఫ్రాన్స్ రక్షణ మంత్రి పార్లే చర్చించారు -
దలైలామా పర్యటనతో సంబంధాలకు చేటు
బీజింగ్: టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా అరుణాచల్‌ప్రదేశ్ పర్యటించడం వల్ల ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బ తింటాయని భారత్‌ను చైనా హెచ్చరించింది. అరుణాచల్‌ను దక్షిణ టిబెట్‌లో భూభాగంగా పేర్కొంటున్న చైనా ఆ ప్రాంతంలోకి దలైలామాను ఆహ్వానిస్తే సరిహద్దుల్లో శాంతి సుస్థిరతలు దెబ్బతినే అవకాశం ఉందని, ఈ విషయాన్ని చైనా తీవ్రంగా పరిగణిస్తుందని ఆ దేశ ప్రతినిధి లు కాంగ్ చెప్పారు. చైనాలో వేర్పాటువాదాన్ని దలైలామా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. -
రక్షణ బంధం బలోపేతం
వాషింగ్టన్: భారత-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యేలా.. ఇరు దేశాలు మంగళవారం కీలకమైన రక్షణ వ్యూహరచన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీనిద్వారా ఇరు దేశాలు.. ఒకరి మిలటరీ, రక్షణ రంగ ఆస్తులు, ఎయిర్ బేస్‌లను మరొకరు వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఇరు దేశాల మిలటరీ సంయుక్తంగా సమర్థవంతమైన ఆపరేషన్లు చేపట్టవచ్చు. వాషింగ్టన్లో భారత రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, అమెరికా రక్షణ సెక్రటరీ ఆష్టన్ కార్టర్ మధ్య ‘లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమొరాండం ఆఫ్ అగ్రీమెంట్’ (ఎల్ఈఎమ్ఓఏ)పై ఒప్పందం జరిగింది. ఇరుదేశాల మిలటరీ మధ్య రక్షణ రంగంలో సాయం, ఆయుధాల సరఫరా, సేవలు వంటివి తిరిగి చెల్లించే పద్ధతిలో వినియోగించుకోవచ్చు. ఈ ఒప్పందం ద్వారా అమెరికా తన మిత్ర, సన్నిహిత దేశాలతో రక్షణ రంగంలో ఉన్న సాంకేతికత, వ్యాపార సహకార సంబంధాలను ఇకపై భారత్‌తోనూ కొనసాగించనుందని.. ఒప్పందం తర్వాత సంయుక్త ప్రకటనలో అమెరికా వెల్లడించింది. ఈ ఒప్పందం ద్వారా భారత్‌లో అమెరికా ఎయిర్‌బేస్‌లను నిర్మించుకోదని.. కేవలం ఇక్కడి సేవలను అమెరికా మిలటరీ వినియోగించుకుంటుందని పరీకర్ తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతం చేయటంలో ఈ ఒప్పందం కీలకమన్నారు. మరో రెండు ఒప్పందాలకు (సీఐఎస్ఎమ్ఓఏ, బీఈఏసీఏ) అమెరికా పట్టుపడుతున్నా సంతకాలు చేసేందుకు భారత్ తొందర పడటం లేదని పరీకర్ తెలిపారు. -
ఫ్లీట్ రివ్యూ అంటే
విశాఖపట్నం : దేశంలోని యుద్ధ నౌకల పాటవాన్ని నిర్ధేశిత ప్రాంతంలో సమీక్షించే కార్యక్రమమే ఫ్లీట్ రివ్యూ. దేశ సార్వభౌమత్వవానికి అది ప్రతీకగా నిలుస్తుంది. ఫ్లీట్లోనే కాకుండా దేశ ప్రజలల్లోనూ అత్మవిశ్వాసాన్ని నెలకొల్పుతుంది. ఆ దేశ శక్తిసామర్ధ్యాలను ప్రపంచ దేశాలకు తేటతెల్లం చేయడం దీనిలో అంశమైంది. దేశాధ్యక్షుని గౌరవార్థం నిర్వహించే ఈ నౌకా ప్రదర్శనలో ఆయనే సమీక్ష చేస్తారు. ఆయా దేశాలతో సత్సంబంధాలు నెరుపుతున్న దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, విమానాలు ఫ్లీట్‌లో పాల్గొనడంతో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూగా మారింది. భారత్ సైతం విదేశాల్లో జరిగే ఫ్లీట్ రివ్యూల్లో పాల్గొంది. ద్వైపాక్షిక సంబంధాల్లో భాగంగా పలు దేశాల్లోనూ భారత యుద్ధనౌకలు పాల్గొన్నాయి. తొలిసారిగా... ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ(పిఎఫ్ఆర్) తొలిసారిగా దేశాధ్యక్షుడు బాబూ రాజేంద్రప్రసాద్ గౌరవార్దం 1953 అక్టోబర్ 19న ముంబయ్‌లో జరిగింది. అలాగే నాటి దేశాధ్యక్షులు రాధాకృష్ణన్, వివి గిరి, అహ్వాద్, జ్ఞాని జైల్‌సింగ్, ఆర్.వెంకటరామన్‌ల గౌరవార్దం ముంబయ్‌లో జరిగాయి. కె.ఆర్.నారాయణన్ దేశాధ్యక్షునిగా పదవీకాలంలో 2001 ఫిబ్రవరి 12న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను భారత్ విజయవంతంగా నిర్వహించింది. అనంతరం అబ్దుల్ కలాం హయాంలో 2006 ఫిబ్రవరి 13న తొలిసారిగా పీఎఫ్ఆర్ విశాఖ తీరంలోనే జరిగింది. ప్రతిభాపాటిల్ గౌరవార్థం 2011 డిసెంబర్ 20న ముంబయ్ వేదికగా ఫ్లీట్ రివ్యూ జరిగింది. ప్రస్తుత దేశాధ్యక్షుడు ప్రణబ్‌ముఖర్జీ గౌరవార్థం విశాఖలో ఐఎఫ్ఆర్ జరగనుంది. ఐఎఫ్ఆర్లో పాల్గొనేందుకు దాదాపు 70 దేశాల నౌకలు రానున్నాయి. ఇప్పటికే కొన్ని దేశాల యుద్ధనౌకలు ఇక్కడికి చేరుకున్నాయి. పదిసార్లు... స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం భారత్ సైతం పదిసార్లు ఫ్లీట్ రివ్యూ నిర్వహించింది. వాటిలో పదిహేనేళ్ళ క్రితం ముంబయ్ తీరంలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ జరిగింది. ఇదే తొలిసారి భారత్ అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ నిర్వహించడం. 29 దేశాలకు చెందిన యుద్ధ నౌకలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి. దేశాధ్యక్షుని పదవీకాలంలో ఓసారి మాత్రమే ఈ రివ్యూ జరుగుతుంది. అలా భారత్‌లో పదిసార్లు ప్రెసిడెంట్ రివ్యూగా నిర్వహించారు. అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ తూర్పు తీరంలో నిర్వహించడం మాత్రం ఇదే తొలిసారి. విశిష్ట గౌరవం విశాఖలో తొలిసారిగా జరిగిన ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ(2006)లో రక్షణ మంత్రిగా ప్రణబ్‌ముఖర్జీ హాజరయ్యారు. విశాఖలోనే తొలిసారిగా జరగనున్న అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ(2016)కి నేడు ఆయన దేశాధ్యక్షుని హోదాలో హాజరుకానుండడం మరో విశేషం. ఇప్పటి వరకు ఫ్లీట్ రివ్యూల్లో ఇలాంటి గౌరవం ఇదే తొలిసారి. సమీక్షలో... ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూల్లో పలు యుద్ధ నౌకలు పాల్గొంటాయి. ఇందులో ఒక నౌకను ప్రెసిడెంట్ యాచ్‌గా పేర్కొంటారు. ఆ నౌకను అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనే అన్ని దేశాల జెండాలతో అలంకరిస్తారు. గౌరవ సూచకంగా ఆ నౌక చుట్టూ వలయాకారంలో ఆయా దేశాల నౌకలు ఫార్మేషన్తో ముందుకు కదులుతారయి. లంగర్ వేసిన విదేశీ యుద్ధ నౌకలు పలు ఖండాలకు చెందిన దేశాల యుద్ధ నౌకలు విశాఖ తీరం వైపు కదులుతున్నాయి. కెనడా, యూఎస్ఏ, కొలంబియా, ఆంటిగ్వా, బ్రెజిల్, పెరూ, చిలీ, స్వీడన్, బెల్జియం, ఫ్రాన్స్, స్పెయిన్, తునిషియా, సెనెగల్, సౌతాఫ్రికా, మెంజాబిక్, టాంజానియా, కెన్యా, సూడాన్, టర్కీ, ఈజిప్ట్, బెహ్రాన్, సౌదీఅరేబియా, ఓమన్, టుర్కుమెనిస్తాన్, ఇజ్రాయిల్, శ్రీలంక, మాల్దీవులు, మారిషన్, చైనా, బంగ్లాదేశ్, మయన్మార్, థాయ్‌లాండ్, ఇండోనేషియా, మలేషియా, ఆస్ట్రేలియా, వియత్నాం, రష్యా, సౌత్‌కొరియా, జపాన్, బ్రనయ్ తదితర దేశాలకు చెందిన యుద్ధ నౌకలు, విమానాలు సముద్ర, గగనతలం విన్యాసాలు ప్రదర్శించనున్నాయి. చివరిరోజు టాల్ షిప్స్ తెరచాపలతో సెయిల్ ఇన్ కంపెనీగా విశాఖ నుంచి చెన్నయ్ తీరంవైపు కదలనున్నాయి. ఫ్లీట్ రివ్యూలో ఇదో ప్రత్యేక ఆకర్షణ. భారత్‌లో 18వ శతాబ్దిలోనే భారత ఫ్లీట్ రివ్యూ 18వ శతాబ్దంలోనే జరిగినట్లు చరిత్ర చెబుతోంది. మరాటా నౌకాదళ శక్తిసామర్ద్యాల ప్రదర్శన మహారాజ్ శివాజీ ఆధ్వర్యంలో జరిగింది. బ్రిటన్‌లో సెయిల్ ఫర్ వార్ సందర్భంగానూ, యూఎస్ఎలో గ్రేట్ వైట్ ఫ్లీట్ పేరిట తొలిసారిగా జరిగాయి. -
‘దక్షిణాఫ్రికా-రాష్ట్రం మధ్య వాణిజ్యం బలపడాలి’
సాక్షి, హైదరాబాద్: దక్షిణాఫ్రికాతో భారత ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకాంక్షించారు. సోమవారం దక్షిణాఫ్రికా పరిశ్రమలు, వాణిజ్య శాఖ ఉప మంత్రి మ్వన్‌డిలే మసికా సచివాలయంలో జూపల్లితో భేటీ అయ్యారు. దక్షిణాఫ్రికా, తెలంగాణాల మధ్య వ్యాపార, వాణిజ్య రంగాల్లో సహకారంపై చర్చించారు. టీఎస్-ఐపాస్ ద్వారా సింగిల్ విండో పద్ధతిలో వేగంగా పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేస్తున్న విషయాన్ని జూపల్లి ఆయనకు వివరించారు. పరిశ్రమల ఏర్పాటుకు వచ్చే ఔత్సాహికులకు పలు రాయితీలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మ్వన్‌డిలే మసికా మాట్లాడుతూ దక్షిణాఫ్రికాలో విలువైన ఖనిజ సంపద ఉన్నందున భారత పారిశ్రామిక వేత్తలకు మంచి అవకాశమన్నారు. తెలంగాణలో వ్యాపార అవకాశాలు గుర్తించి ఆయా రంగాల్లో పరస్పర సహకారంతో ముందుకు వెళ్తామని పేర్కొన్నారు. -
మోదీ పర్యటనకు చైనా నిరసన
షాంగై: ప్రధాని నరేంద్ర మోదీ అరుణాచల్ ప్రదేశ్ పర్యటనను ఇరుదేశాల మధ్య సంబంధాల కోసం కాదని దీనికి చైనా అధికారికంగానే నిరసన తెలిపినట్టు ఆ దేశం శుక్రవారం ప్రకటించింది. మనదేశానికి చైనాతో అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు సమస్యలున్నాయి. వారు ఆ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్ గా పిలుస్తారు. అక్కడి తవాంగ్ ప్రాంతం టిబెట్ బుద్ధిజానికి ముఖ్యప్రదేశం. చైనా ఆ ప్రాంతాన్ని 1962 యుద్దం సందర్భంగా ఆక్రమించిన విషయం తెలిసిందే. భారత్, చైనాల మధ్య సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు మోదీ ఈ పర్యటనకు రావడం లేదని చైనా పేర్కొంటుంది. ప్రధాని మోదీ శుక్రవారం అరుణాచల్ ప్రదేశ్ లో ఓ రైల్వే లైన్, పవర్ స్టేషన్ లను ప్రారంభించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో మౌలికవసతుల కల్పనకు, అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తామని చెప్పారు. 'గత 28 ఏళ్లలో ఎప్పుడు జరగని అభివృద్ధి కార్యక్రమాలను కేవలం ఈ ఐదేళ్లలో చేసి చూపిస్తాం' అని ఈ సందర్భంగా మోదీ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడంతో పాటు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు ఆ ప్రాంత అభివృద్దికి దోహదం చేస్తాయన్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా గత జనవరిలో భారత్ పర్యటనతో ప్రధాని మోదీతో సన్నిహిత సంబంధాలు మెరుగైనట్టు కనిపిస్తున్నాయి. ఒబామా పర్యటన చైనాపై చాలా ప్రభావం చూపించింది. దీంతో చైనా నౌకా దళాలు హిందూ మహాసముద్రంపై తమ ఆధిక్యం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు కనపిస్తోంది. -
ఇంధన రంగంలో సహకారమే కీలకం
ఢిల్లీ చేరుకున్న పుతిన్ న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో వార్షిక శిఖరాగ్ర సదస్సులో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అణు ఇంధనం, రక్షణ, హైడ్రోకార్బన్ల వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల విస్తరణపై వారివురూ ప్రధానంగా చర్చించనున్నారు. శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు పుతిన్ బుధవారం రాత్రి న్యూఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆయనకు స్వాగతం పలికారు. గురువారం ఉదయం హైదరాబాద్ హౌస్‌లో సమావేశం జరగనుంది. పుతిన్ పర్యటనతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ముఖ్యంగా ఉక్రెయిన్ వ్యవహారంపై అమెరికా సహా ఇతర పశ్చిమ దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన నేపథ్యంలో భారత్‌తో ఆర్థిక బంధాన్ని పరిపుష్టం చేసుకోవాలని పుతిన్ భావిస్తున్నారు. శిఖరాగ్ర భేటీ సందర్భంగా ఇరు దేశాలు 15-20 ఒప్పందాలను కుదుర్చుకునే అవకాశం ఉంది. భారత్‌కు లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఎగుమతులతోపాటు ఆర్కిటిక్ మహాసముద్రంలో చమురు అన్వేషణలో ఓఎన్జీసీని భాగస్వామిని చేసేందుకు సానుకూలంగా ఉన్నట్లు పుతిన్ ఇప్పటికే ప్రకటించారు. అణు ఇంధన రంగంలో 14-16 అణు ప్లాంట్ల ఏర్పాటుకు బదులు 20-24 ప్లాంట్ల ఏర్పాటుకు రష్యా ప్రతిపాదించే అవకాశం ఉంది. -
నేపాల్‌కు రూ. 6 వేల కోట్ల రుణం
మొత్తం 10 ఒప్పందాలపై ఎంవోయూలు నేపాల్ ప్రధాని కోయిరాలాతో భారత ప్రధాని మోదీ భేటీ రక్షణ సహా కీలకాంశాలపై చర్చ ఇరు దేశాల మధ్య బస్సు సర్వీసు ప్రారంభం నేపాల్‌లో రూ. 500, రూ.1000 నోట్లపై నిషేధం ఎత్తివేత కఠ్మాండు: ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో భాగంగా నేపాల్‌లో మౌలిక వసతుల అభివృద్ధికి భారత్ సుమారు రూ.6,100 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చింది. అలాగే వివిధ రంగాల్లో పొరుగు దేశంతో కలసి పనిచేసేందుకు 10 ఒప్పందాలు కుదుర్చుకుంది. బుధవారం నుంచి నేపాల్‌లో రెండు రోజుల పాటు జరగనున్న సార్క్ దేశాల సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం కఠ్మాండు చేరుకున్న భారత ప్రధాని మోదీ... నేపాల్ ప్రధాని సుశీల్ కోయిరాలాతో సమావేశమై వ్యూహాత్మక అంశాలపై చర్చించారు. సుమారు 40 నిమిషాలపాటు జరిగిన ఈ భేటీలో ఇరు దేశాల మధ్య రక్షణ సహా కీలక రంగాల్లో సహకారం గురించి ఆయనతో మోదీ మాట్లాడారు. అనంతరం 10 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇందులో నేపాల్‌కు సుమారు రూ. 6,100 కోట్ల ఆర్థిక సాయం పై షరతుల ఖరారు ముఖ్యమైనది. నిర్దేశిత ప్రాంతాల్లో వాహన ప్రయాణాలకు అనుమతినిచ్చే మోటారు వాహనాల ఒప్పందంతోపాటు, కఠ్మాండు-వారణాసి, జానక్‌పూర్-అయోధ్య, లుంబినీ-బోధ్ గయ మధ్య ట్విన్ సిటీ ఒప్పందాలు, పర్యాటక, పోలీసు, సంప్రదాయ ఔషధాల వాడకం, అరుణ్ నదిపై 900 మెగావాట్లతో జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం తదితర ఒప్పందాలపై ఇరు దేశాల అధికారులు ఎంవోయూలు కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కఠ్మాండులోని బార్ ఆస్పత్రిలో భారత్ రూ. 150 కోట్ల వ్యయంతో నిర్మించిన ట్రామా సెంటర్‌ను మోదీ ప్రారంభించారు. అలాగే నేపాల్‌కు ధ్రువ్ హెలికాప్టర్‌తోపాటు బోధి వృక్షం నుంచి సేకరించిన మొక్కను, మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్‌ను నేపాల్ ప్రధానికి కానుకలుగా ఇచ్చారు. కఠ్మాండు-ఢిల్లీ మధ్య పశుపతినాథ్ ఎక్స్‌ప్రెస్ పేరిట బస్సు సర్వీసును కోయిరాలాతో కలసి జెండా ఊపి ప్రారంభించారు. ఇరు దేశాల మధ్య 25 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టుల్లో కదలిక రావడం సంతోషంగా ఉందని మోదీ చెప్పారు. పరస్పర విశ్వాసం ఉన్నప్పుడు ఇరు దేశాలు సత్వర ముందడుగు వేయగలుగుతాయన్నారు. ముఖ్యంగా నేపాల్‌లో భారత కరెన్సీ రూ. 500, రూ. 1,000 నోట్ల వాడకంపై పదేళ్లుగా ఉన్న నిషేధాన్ని ఎత్తేస్తూ ఒప్పందం చేసుకున్నామన్నారు. ఇకపై నేపాల్‌కు వెళ్లే పర్యాటకులు ఈ నోట్లతో కూడిన రూ. 25 వేల విలువైన కరెన్సీని వెంట తీసుకెళ్లొచ్చు. ట్రామా సెంటర్ ప్రారంభం: భారత ప్రభుత్వం రూ. 150 కోట్ల వ్యయంతో కఠ్మాండులోని బీర్ ఆస్పత్రిలో నిర్మించిన 200 పడకల ట్రామా సెంటర్ (అత్యవసర చికిత్సా కేంద్రం)ను మోదీ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టేలా ఏకాభిప్రాయ సాధన ద్వారా నేపాల్ రాజ్యాంగాన్ని వచ్చే ఏడాది తొలినాళ్లలోగా రాసుకోవాలని అన్ని రాజకీయ పక్షాలను కోరారు. ఈ విషయంలో తమకు ఎంతో నైపుణ్యం ఉన్నప్పటికీ నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేకపోవడం వల్ల సాయం చేయలేకపోతున్నందుకు విచారిస్తున్నామన్నారు. ఈ ట్రామా సెంటర్లో 14 ఐసీయూ లు, ట్రామా వార్డులో 150 పడకలు, ఆరు ఆపరేషన్ థియేటర్లు మొదలైనవి ఉన్నాయి. నేపాల్‌కు బోధి వృక్షం మొక్క, ధ్రువ్ హెలికాప్టర్ భారత్, నేపాల్‌లు పంచుకుంటున్న బౌద్ధ వారసత్వానికి ప్రతీకగా భారత్‌లోని గయలో బుద్ధ భగవానుడు 2,600 ఏళ్ల క్రితం జ్ఞానం పొందిన బోధి వృక్షం నుంచి సేకరించిన మొక్కను ప్రధాని మోదీ మంగళవారం నేపాల్‌కు కానుకగా ఇచ్చారు. ట్రామా సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ ఈ విషయాన్ని వెల్లడించారు. బుద్ధుడు పుట్టిన లుంబినీలో ఉన్న మాయాదేవి ఆలయం ఆవరణలో ఈ మొక్కను తమ దేశ రాయబారి ఈ నెల 28న నాటుతారన్నారు. అలాగే నేపాల్‌తో సంబంధాల బలోపేతం విషయంలో భారత్ నిబద్ధతను చాటుతూ ప్రధాని మోదీ ఆ దేశానికి ధ్రువ్ మార్క్-3 రకానికి చెందిన అత్యుధునిక తేలికపాటి హెలికాప్టర్ (ఏఎల్‌హెచ్)ను బహూకరించారు. కఠ్మాండులోని నేపాల్ సైనిక పెవిలియన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నేపాల్ ప్రధాని, రక్షణ మంత్రి అయిన సుశీల్ కోయిరాలాకు దీన్ని అందించారు. సుమారు రూ. 60 కోట్ల నుంచి రూ. 80 కోట్ల మధ్య ఖరీదు చేసే ఈ హెలికాప్టర్ ఇద్దరు పైలట్లు, 14 మంది ప్రయాణికులతో ప్రయాణించగలదు. -
నరేంద్ర మోడీ సమర్థుడు!
అమెరికా కాంగ్రెస్ నివేదికలో వ్యాఖ్య వాషింగ్టన్: గత మూడు దశాబ్దాల్లో లేనంతగా పూర్తి మెజారిటీ సాధించిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ సమర్థ పాలకుడని.. భారత్-అమెరికాల మధ్య ఆయన సరికొత్త సంబంధాలను నెలకొల్పగలరని అమెరికా ప్రతినిధుల సభ కాంగ్రెస్ పేర్కొంది. ఆయన హయాంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగవుతాయని.. వాణిజ్యం, రక్షణ సహకారం బలోపేతమవుతుందని వ్యాఖ్యానించింది. త్వరలో ప్రధాని మోడీ అమెరికాలో పర్యటించనున్న నేపథ్యంలో... ఆ దేశ ప్రతినిధుల సభ కాంగ్రెస్ ఒక నివేదికను రూపొందించి.. దానిని సభ్యులకు అందజేసింది. మోడీ వ్యాఖ్యలు దురదృష్టకరం: పాక్ ఇస్లామాబాద్: భారత్‌పై పాకిస్థాన్ పరోక్ష యుద్ధానికి పాల్పడుతోందన్న మోడీ ఆరోపణలను పాకిస్థాన్ ఖండించింది. భారత్‌తో తామ సత్సంబంధాలను కోరుకుంటున్న తరుణంలో ఆయన వ్యాఖ్యలు దురదృష్టకరమని పేర్కొంది. -
ద్వైపాక్షిక సహకారానికి ఊతం!
-
ద్వైపాక్షిక సహకారానికి ఊతం!
భారత్, బ్రెజిల్‌ల నిర్ణయం బ్రెజిల్ ప్రెసిడెంట్, భారత్ పీఎంల తొలి భేటీ నరేంద్ర మోడీకి ఘన స్వాగతం బ్రసీలియా/ఫోర్టెలెజా: ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకునే దిశగా భారత్, బ్రెజిల్ దేశాలు పలు ఒప్పందాలు చేసుకున్నాయి. వాణిజ్యం, పెట్టుబడుల రంగంలో సహకారాన్ని విసృ్తతం చేసుకోవాలని.. వ్యవసాయం, అంతరిక్ష పరిశోధన, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, రక్షణ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని నిర్ణయించాయి. బ్రెజిల్ రాజధాని బ్రసిలియాలో భారత ప్రధాని నరేంద్రమోడీ, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ల మధ్య బుధవారం తొలి ద్వైపాక్షిక సమావేశం జరిగింది. వీరి సమక్షంలో పర్యావరణ పరిరక్షణ, అంతరిక్ష రంగాల్లో సహకారం, దౌత్య వ్యవహారాల్లో సంప్రదింపుల యంత్రాంగం ఏర్పాటు.. ఈ మూడింటికి సంబంధించి ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా బ్రెజిల్ అధ్యక్ష భవనంలో భారత ప్రధానికి ఘన స్వాగతం లభించింది. బ్రెజిల్ పర్యటన కోసమే ప్రత్యేకంగా రానప్పటికీ.. అధ్యక్ష భవనంలో మోడీకి పూర్తి సైనిక మర్యాదలతో స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఐక్యరాజ్య సమితి 70వ వార్షికోత్సవాలు జరిగే 2015 నాటికి భద్రతామండలిలో సంస్కరణలను వేగవంతం చేయాలని జీ 4 కూటమి నేతలుగా మోడీ, రౌసెఫ్‌లు డిమాండ్ చేశారు. జీ 20 సహా అన్ని అంతర్జాతీయ వేదికలపై పరస్పర సహకారాన్ని పెంచుకోవాలని ఇరుదేశాల నేతలు నిర్ణయించారు. బ్రిక్స్ సదస్సును, సాకర్ వరల్డ్ కప్ వేడుకలను ఘనంగా, విజయవంతంగా నిర్వహించిన బ్రెజిల్‌ను ఈ సందర్భంగా మోడీ ప్రశంసించారు. ఆరో బ్రిక్స్ సదస్సు చరిత్రాత్మకమైనదని, దీన్ని దిల్మా రౌసెఫ్ అద్భుతంగా నిర్వహించారని మోడీ కొనియాడారు. స్నేహ బంధాన్ని పటిష్టం చేస్తాం అణు, రక్షణ, విద్యుత్ తదితర రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని భారత్, రష్యా నిర్ణయించాయి. నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ మంగళవారం రాత్రి 40 నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రష్యా, ఇండియా సంబంధాలను బలోపేతం చేసే చర్యలపై చర్చించామని, మా స్నేహాన్ని మరింత వృద్ధి చేసుకున్నామని భేటీ అనంతరం మోడీ ట్విట్టర్లో పేర్కొన్నారు. మన దేశానికి స్నేహితుడు ఎవరు అని భారత్‌లో చిన్న పిల్లాడిని అడిగినా.. రష్యా అని ఠక్కున చెబుతాడని, ఎందుకంటే పలు సంక్షోభాల్లో భారత్‌కు రష్యా బాసటగా నిలిచిందని మోడీ పేర్కొన్నారు. విద్యార్థులకు వీసాలు మరింత సులువుగా అందేలా చూడాలన్న మోడీ విజ్ఞప్తిపై పుతిన్ సానుకూలంగా స్పందించారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అక్బరుద్దీన్ తెలిపారు. భారత పర్యటన సందర్భంగా కూడంకుళం అణువిద్యుత్ కేంద్రాన్ని సందర్శించాలన్న మోడీ ఆహ్వానానికి పుతిన్ సానుకూలంగా స్పందించారన్నారు. కూడంకుళం ప్లాంట్‌లోని 1, 2 యూనిట్లు రష్యా సహకారంతో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. -
సంపన్న భారత్ తో 'సార్క్' కు మేలు
భూటాన్ పార్లమెంటులో మోడీ ప్రసంగం భారత్‌లో ప్రభుత్వ మార్పు భూటాన్‌తో బంధంపై ప్రభావం చూపదు గతంలో భారత్ ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తామన్న ప్రధానమంత్రి ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతానికి ఇరు దేశాల నిర్ణయం మోడీ పర్యటన దిగ్విజయం: విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ థింపు: బలమైన, సుసంపన్నమైన భారతదేశం.. భూటాన్ సహా పొరుగు దేశాల అభివృద్ధికి సాయపడగలదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఉద్ఘాటించారు. భారత్ సుసంపన్నమైతే సార్క్ దేశాలన్నిటికీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. మోడీ రెండు రోజుల భూటాన్ పర్యటన సోమవారం ముగిసింది. పర్యటన ముగించే ముందు ఆయన భూటాన్ పార్లమెంటు సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. భారత్‌లో ప్రభుత్వం మారిపోయినప్పటికీ.. భూటాన్‌తో సంబంధాలపై ఆ ప్రభావం ఉండబోదని.. తమ దేశం గతంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని మోడీ స్పష్టంచేశారు. భూటాన్ జాతీయ శాసనసభ స్పీకర్ జిగ్మేజాంగ్పో ఆహ్వాన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. భారత్ ఎంత బలంగా ఉంటే.. భూటాన్‌కు అంత మంచిదని పేర్కొన్నారు. బలమైన, సుసంపన్నమైన భారత్ ఈ ప్రాంతంలోని చిన్న దేశాలకు సాయపడగలదని చెప్పారు. తన అంతరాత్మ ప్రబోధం మేరకే భారత ప్రధానమంత్రిగా తన తొలి పర్యటనకు భూటాన్‌ను ఎంపిక చేసుకున్నానని మోడీ తెలిపారు. ‘‘ఇంత గొప్ప విజయం (ఎన్నికల్లో) తర్వాత.. ఏదైనా పెద్ద బలమైన దేశంలో ముందుగా పర్యటించాలని, తద్వారా చాలా కీర్తి వస్తుందనే ఆలోచన సాధారణంగా ఉంటుంది. కానీ.. నేను ముందు భూటాన్‌ను సందర్శించాలని నా అంతరాత్మ చెప్పింది. ఇందుకు ప్రణాళిక ఏదీ లేదు. అది మామూలు చర్య’’ అని ఆయన పేర్కొన్నారు. ఇదిలావుంటే.. తమ భూభాగాన్ని భారత్‌కు వ్యతిరేకంగా వినియోగించుకునేందుకు అనుమతించబోమని భూటాన్ కూడా హామీ ఇచ్చింది. ఈశాన్య భారత్ మిలిటెంట్లు భూటాన్‌లో తలదాచుకుంటున్న నేపథ్యంలో ఆ దేశం ఈ హామీ ఇచ్చింది. ద్వైపాక్షిక సంబంధాలు మరింత పెంపు... మోడీ పర్యటన సందర్భంగా.. రెండు దేశాలూ ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచుకోవాలని నిర్ణయించాయని అనంతరం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపాయి. భూటాన్, భారత్ ఈశాన్య రాష్ట్రాల మధ్య క్రీడల నిర్వహణ, సంయుక్త పరిశోధన కోసం హిమాలయ విశ్వవిద్యాలయం ఏర్పాటు వంటి చర్యలతో ఈ బంధాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించాయి. పాల పొడి, గోధుమలు, ఆహార నూనెలు, పప్పుధాన్యాలు, బాస్మతియేతర బియ్యం వంటి ఎగుమతులపై భూటాన్‌కు నిషేధం నుంచి, పరిమితుల నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు భారత్ తెలియజేసింది. అలాగే.. భారత్‌లో చదువుకునే భూటాన్ విద్యార్థులకు ఇచ్చే నెహ్రూ - వాంగ్‌చుక్ స్కాలర్షిప్ను ఏడాదికి రూ. 2 కోట్ల నుంచి రూ. 4 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఖోలాంగ్చు విద్యుత్ ప్రాజెక్టుకు మోడీ శంకుస్థాపన భారత్ - భూటాన్ భాగస్వామ్యంతో భూటాన్‌లో నిర్మిస్తున్న 600 మెగావాట్ల సామర్థ్యం గల ఖోలాంగ్చు జల విద్యుత్ ప్రాజెక్టుకు ప్రధాని మోడీ సోమవారం శంకుస్థాపన చేశారు. భూటాన్ పార్లమెంటులో ప్రసంగించిన అనంతరం.. ఆయన పార్లమెంటు ఆవరణ నుంచే ఎలక్ట్రానిక్ మీట నొక్కటం ద్వారా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఇటీవలే భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోడీ తొలి విదేశీ పర్యటనకు ఎంచుకున్న భూటాన్ పర్యటన దిగ్విజయమయిందని.. ఆయనతో పాటు పర్యటనకు వెళ్లిన భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్ మీడియాతో పేర్కొన్నారు. భూటాన్‌తో సంబంధాలు మెరుగుపరచుకోవాలని పొరుగు దేశం చైనా ఇటీవలి కాలంలో తీవ్ర యత్నాలు చేస్తున్న నేపథ్యంలో మోడీ తొలిసారిగా భూటాన్ పర్యటనకు వెళ్లి ఆ దేశంతో భారత్ మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నించటం విశేషం. ఈ పర్యటనలో మోడీ వెంట జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌దోవల్, విదేశాంగ కార్యదర్శి సుజాతాసింగ్లు కూడా ఉన్నారు. భూటాన్ - భారత్ మైత్రి సంతోషకరం: చైనా భారత్ - భూటాన్‌ల మధ్య సంబంధాలు మోడీ పర్యటనతో బలోపేతం అవటం సంతోషకరమని చైనా స్పందించింది. భూటాన్‌తో తాము దౌత్య సంబంధాలు నెలకొల్పలేదని.. అయితే రెండు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, పర్యటనలు ఉన్నాయని చైనా విదేశాంగ ప్రతినిధి హువాచున్యింగ్ పేర్కొన్నారు. భారత్-టిబెట్ల మధ్య వ్యూహాత్మక ప్రాంతంలో ఉన్న భూటాన్ 1951 నుంచి ఒంటరిగా ఉంది. చైనాతో సరిహద్దు వివాదం నేపధ్యంలో భూటాన్ - చైనాల మధ్య చాలా కాలంగా సత్సంబంధాలు లేవు. మోడీ ప్రసంగానికి చప్పట్లు ప్రధాని మోడీకి భూటాన్ పార్లమెంటులో అరుదైన గౌరవం లభించింది. మోడీ 45 నిమిషాల ప్రసంగం ముగిసిన తర్వాత.. ఆ దేశ ఎంపీలు తమ సంప్రదాయాన్ని పక్కనపెట్టి చప్పట్లతో అభినందనలు తెలిపారు. భూటాన్‌లో దుష్టాత్మలను తరిమివేయటానికి (దెయ్యాలను) చప్పట్లు కొడతారు కానీ.. అభినందనలు తెలిపేందుకు కాదు. కానీ మోడీ ప్రసంగం తర్వాత ఉభయసభల ఎంపీలందరూ చప్పట్లతో అభినందించటం విశేషం. మోడీ హిందీలో ప్రసంగించగా.. స్థానిక దుబాసీ ఆయన ప్రసంగాన్ని భూటానీస్లోకి తర్జుమా చేసి వినిపించారు. భారత్ నుంచి తెప్పించిన వాహనంలోనే.. భారత ప్రధాని నరేంద్రమోడీ థింపులో సైతం భారత్ నుంచి విమానంలో తెప్పించుకున్న ప్రత్యేక వాహనంలోనే ప్రయాణించారు. భద్రత రీత్యా ప్రత్యేకంగా రూపొందించిన బీఎండబ్ల్యూ 7 కారులోనే ఆయన ప్రయాణించారని.. అది భారత్‌లోకెల్లా అత్యంత భద్రమైన వాహనమని స్థానిక మీడియా పేర్కొంది. -
చైనాతో చెలిమి!
సంపాదకీయం కొన్నేళ్లక్రితం మన అధికారులతో చర్చల సందర్భంగా చైనా మంత్రి ఒక హితబోధలాంటి హెచ్చరిక చేశారు. ‘ఎక్కడో వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న అంకుల్‌పై ఆధారపడేకంటే మీ పొరుగుతో సఖ్యంగా ఉండటమే మీకు మేల’న్నది ఆ హితబోధ సారాంశం. ఆయన అంకుల్ అన్నది ‘అంకుల్ శామ్’నుద్దేశించేనని... మంచిగా ఉండమంటున్నది తనతోనేనని వేరే చెప్పనవసరం లేదు. మనం అమెరికా ఆసరాతో ప్రాంతీయ శక్తిగా ఎదుగుతామేమోనన్న భయం చైనాకు చాన్నాళ్లనుంచి ఉంది. అందువల్లే మనతోగల 4,057 కిలోమీటర్ల పొడవునా అప్పుడప్పుడు ఏదో ఒకచోట అతిక్రమణలకు పాల్పడటం, ఏదో ప్రాంతంలోకొచ్చి చిన్న గుడారంవేసి హడావుడిచేయడం దానికి అలవాటైన పని. అలాగని ఆ దేశం మనతో కరచాలనమూ ఆపదు...కబుర్లు చెప్పడమూ మానదు. సరిహద్దు సమస్యకు సానుకూల పరిష్కారం వెదికేలోగా దాంతో సంబంధం లేకుండానే ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకుందామని, సరిహద్దుల్లో ఎవరమూ హద్దు మీరవద్దని రెండు దేశాలూ నిర్ణయించుకున్నాయి. అందుకనుగుణంగా సంబంధాలు బలపడుతూ వస్తున్నాయి. దానికి సమాంతరంగా చిన్నా చితకా సమస్యలూ ఉంటున్నాయి. యూపీఏ ప్రభుత్వ హయాంలో అన్నిటిలాగే నిస్తేజంగా పడివున్న విదేశాంగ విధానానికి ప్రధాని నరేంద్ర మోడీ తొలిరోజునుంచే కాయకల్ప చికిత్స ప్రారంభించారు. ఎంతసేపూ పాశ్చాత్య దేశాలపై దృష్టిసారించి, వారితో స్నేహబంధానికి తహతహలాడే తీరును మార్చి ఇరుగుపొరుగుకు దగ్గరయ్యే విధానానికి తెరతీశారు. ప్రమాణస్వీకారం పూర్తయిన వెంటనే ఆ ఉత్సవానికి అతిథులుగా వచ్చిన సార్క్ దేశాల అధినేతలతో విడివిడిగా సంప్రదింపులు జరిపారు. ఇప్పుడు ఫోన్‌ద్వారా తనను అభినందించిన చైనా ప్రధాని లీ కెకియాంగ్‌తో ఆయన సంభాషించారు. భారత్‌తో దృఢమైన భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నట్టు కెకియాంగ్ చెప్పగా, అన్ని ‘అపరిష్కృత సమస్యల’పైనా ఆ దేశంతో కలిసిపని చేయాలన్న ఆకాంక్షను మోడీ వ్యక్తంచేశారు. ఇరుదేశాల ఉన్నతస్థాయి బృందాలు రెండు దేశాల్లోనూ తరచు పర్యటిస్తూ స్నేహ సంబంధాలను పెంచుకోవాలని ఇద్దరూ నిర్ణయించారు. ఇందుకనుగుణంగా చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ ఈ నెల 8న భారత్ పర్యటనకు వస్తున్నారు. మోడీ పాలనాపగ్గాలు చేపట్టాక వస్తున్న తొలి విదేశీ అతిథి వాంగ్. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ 2006 సంవత్సరంలో మొదలెట్టి వివిధ సందర్భాల్లో మూడుసార్లు చైనాను సందర్శించారు. 2011లో వెళ్లినప్పుడైతే మోడీకి ‘గ్రేట్ హాల్ ఆఫ్ చైనా’వద్ద స్వాగతసత్కారాలు ఏర్పాటు చేయడంద్వారా దేశాధినేతలకు వర్తించే ప్రొటోకాల్‌ను అమలుచేసి చైనా ఆయనను గౌరవించింది. కనుక ఆ దేశంతో మోడీకి ఇప్పటికే మంచి అనుబంధం ఉన్నదని చెప్పవచ్చు. కనుక మన విదేశాంగ విధానానికి ఎప్పటినుంచో పెద్ద సవాల్‌గా ఉన్న భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల పటిష్టతకు ఈ అనుబంధం మరింతగా దోహదపడుతుందనుకోవాలి. 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకున్న ‘లుక్ ఈస్ట్’(తూర్పు దేశాలపై దృష్టి) విధానం తనకు వ్యతిరేకంగా ఎక్కుపెట్టిందేనన్న శంక చైనాలో ఉన్నది. ఆ దేశం వెన్నుపోటు పొడిచిన పర్యవసానంగానే 1962లో యుద్ధం వచ్చిందని మనం ఎంతగా అనుకుంటున్నా అది మన పొరుగు దేశం. పైగా ఆర్ధికంగా మనకంటే చాలా ముందున్న దేశం. అలాంటి దేశాన్ని విస్మరించి మన ఆర్ధిక వ్యవస్థను పటిష్టంగా నిర్మించుకోవడం కుదరని పని. అందువల్ల సరిహద్దు సమస్యల పరిష్కారానికి ఒక పక్క కృషి చేస్తూనే ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య బంధాలను విస్తరింపజేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. 2015నాటికి ఆ దేశంతో మన ద్వైపాక్షిక వాణిజ్యం వంద బిలియన్ డాలర్లకు చేరుతుందని ఒక అంచనా. ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ అయిన చైనాకు ఫార్మా రంగంలోనూ, సేవా రంగంలోనూ ఎగుమతులు పెరిగితే... మౌలిక సదుపాయాల రంగంలోకి చైనా పెట్టుబడులనూ, సాంకేతికతనూ ఆహ్వానిస్తే అది మన ఆర్ధిక వ్యవస్థ బలపడటానికి ఎంతగానో దోహదం చేస్తుంది. అదే సమయంలో పాకిస్థాన్‌తో సాన్నిహిత్యం నెరపుతున్న చైనాను తటస్థపరచడానికి కొంతలో కొంత ఉపయోగపడుతుంది. సమూల ఆర్ధిక సంస్కరణలపై దృష్టిపెట్టాలని, 2020కల్లా లక్ష్యాలన్నిటినీ సాధించాలని నిరుడు జరిగిన చైనా కమ్యూనిస్టు పార్టీ ప్లీనరీ నిర్ణయించింది. ఇప్పటికే ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థగా రూపుదిద్దుకున్నా, విదేశీ మారకద్రవ్య నిల్వలు ఆ దేశం వద్ద దండిగానే ఉన్నా ఇటీవలికాలంలో వృద్ధిరేటు మందగిస్తున్న తీరు దాన్ని ఆందోళనపరుస్తోంది. అందువల్లే అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్‌ను మరింత సన్నిహితం చేసుకోవాలన్న తపన చైనాకు ఉంది. గతంలో బీజేపీ అగ్రనేత వాజపేయి విదేశాంగ మంత్రిగా పనిచేసినప్పుడూ, ఆయన ప్రధానిగా ఉన్నప్పుడూ చైనాతో మన సంబంధాలు గణనీయంగా మెరుగయ్యాయి. ఇప్పుడు నరేంద్రమోడీ నాయకత్వంలో అవి మరింత విస్తరించగలవనుకోవచ్చు. అంతమాత్రంచేత వాస్తవాధీన రేఖవద్ద మన దళాల మోహరింపు విషయంలో రాజీపడనవసరంలేదు. ఎన్నో ఏళ్లుగా సరైన గస్తీలేని ఆ ప్రాంతంలో అదనంగా 50,000 అదనపు దళాలను మోహరించాలని, పర్వతప్రాంతాల్లో శత్రువుతో తలపడగల ప్రత్యేక దళాలను ఏర్పాటుచేయాలని నిరుడు మన ప్రభుత్వం నిర్ణయించింది. అలాంటి జాగ్రత్తలు తీసుకుంటూనే, మన ప్రయోజనాల విషయంలో రాజీపడకుండానే చైనాతో చెలిమిని పటిష్టపరుచుకోవాలి. గత అనుభవాలరీత్యా ఇది తప్పనిసరి.