
మారుతున్న ప్రపంచక్రమంలో ఇదే మంత్రం
తద్వారా వాణిజ్యం, పెట్టుబడులు ఇతోధికం
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: భారత్ వాణిజ్యం, పెట్టుబడుల కోసం ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తృతం చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ద్వైపాక్షికవాదం కొత్త ఉ్రత్పేరకంగా కనిపిస్తుందన్నారు. బీఎస్ మంథన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె మాట్లాడారు. సవాళ్లతో కూడిన కాలంలో భారత్‌ను ప్రపంచ ఆర్థిక శక్తిగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటున్నట్ట చెప్పారు.
‘‘ద్వైపాక్షికవాదం ఇప్పుడు ప్రముఖ అజెండాగా మారుతోంది. చాలా దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను ఇతోధికం చేసుకోవాల్సి ఉంది. కేవలం వాణిజ్యం లేదా పెట్టుబడుల కోసమే కాదు, వ్యూహాత్మక సంబంధాల దృష్ట్యా కూడా అవసరమే. కొత్త ప్రపంచ క్రమంలో భారత్ తనకున్న టెక్నాలజీ, నిపుణుల బలంతో అంతర్జాతీయ ఆర్థిక వృద్ధికి చోదకంగా మారగలదు’’అని వివరించారు. మల్టీలేటరల్ ఇనిస్టిట్యూషన్స్ క్రమంగా కనుమరుగవుతున్నాయంటూ.. వాటి పునరుద్ధరణకు చేసే ప్రతి ప్రయత్నం ఆశించిన ఫలితాన్నివ్వడం లేదన్నారు.
ప్రపంచ వాణిజ్య విధానాల్లో మార్పులు..
ప్రపంచ వాణిజ్యం పూర్తిగా మార్పునకు గురవుతోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘‘మల్టీలేటరల్ ఇనిస్టిట్యూషన్లు, వాటి సేవలు ఉనికిని కోల్పోతున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) సమర్థంగా పని చేయడం లేదు. ప్రాధాన్య దేశం హోదా (ఎంఎఫ్‌ఎన్) అన్నదానికి అర్థం లేకుండా పోయింది. ప్రతి దేశం తమను ప్రత్యేకంగా చూడాలని కోరుకుంటోంది. ఒకవేళ డబ్ల్యూటీవో బలహీనపడితే లేదా మల్టీ లేటరల్ ఇనిస్టిట్యూషన్లు సమర్థవంతంగా పనిచేయకపోతే.. అప్పుడు వాణిజ్యం విషయంలో ద్వైపాక్షిక ఒప్పందాలే కీలకంగా మారతాయి’’అని మంత్రి చెప్పారు.
ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై దృష్టి
బ్రిటన్ (యూకే) సహా పలు దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల దిశగా భారత్ చర్చలు ప్రారంభించినట్టు మంత్రి సీతారామన్ తెలిపారు. అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు తెలిపారు. 27 దేశాల సమూహం అయిన ఐరోపా యూనియన్ (ఈయూ)తోనూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం సంప్రదింపులు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. రుణ నిర్వహణ, ద్రవ్య క్రమశిక్షణ పరంగా ప్రభుత్వం మరింత కృషి చేయాల్సి ఉందన్నారు. ‘‘సంస్కరణలన్నవి కేవలం కేంద్ర ప్రభుత్వ అజెండాగానే ఉండిపోకూడదు. ప్రతి రాష్ట్రం దీన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ఈ విషయంలో రాష్ట్రాలు పోటీ పడాలని కోరుకుంటున్నాను’’అని మంత్రి సీతారామన్ చెప్పారు.
పోటీతత్వాన్ని పెంచుకోవాలి
స్వీయ శక్తి సామర్థ్యాలపై దృష్టి పెట్టాలి
పరిశ్రమలకు వాణిజ్య మంత్రి గోయల్ పిలుపు
ముంబై: పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ సహకారంపై ఆధారపడకుండా.. తమ శక్తి సామర్థ్యాలపై దృష్టి పెట్టి, మరింత పోటీతత్వంతో ముందుకు రావాలని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. ఐఎంసీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా గోయల్ మాట్లాడారు.
‘‘ప్రభుత్వ సహకారం కోసం ఎంత కాలం పాటు చూస్తారు? లేదా సబ్సిడీలు, సహకారం, ప్రోత్సాహకాలు, అధిక దిగుమతి సుంకాలు ఎంతకాలం పాటు కోరుకుంటారు? ప్రపంచంతో రక్షణాత్మక వైఖరి ఎంత కాలం? ఈ తరహా రక్షణాత్మక మనస్తత్వం, బలహీన ఆలోచనా ధోరణి నుంచి బయటకు రావడంపై నిర్ణయం తీసుకోవాలి’’అంటూ దేశీ పరిశ్రమ స్వీయ సామర్థ్యాలతో ఎదగాలన్న సంకేతం ఇచ్చారు.
ఆవిష్కరణలు, తయారీ విధానాల నవీకరణ, నైపుణ్యాలు, సామర్థ్యాల నుంచే పోటీతత్వం వస్తుందన్నారు. పోటీతత్వంతో ఎదగనంత వరకు 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేరవని, ప్రపంచంతో వాణిజ్య సంబంధాలను పటిష్టం చేసుకోకపోతే అభివృద్ధి చెందిన దేశంగా అవతరించలేమన్న అభిప్రాయాన్ని మంత్రి వ్యక్తం చేశారు. చమురు, రక్షణ, ఆహారం వంటి కొన్ని రంగాల్లోనే కొన్ని మినహాయింపులు ఉన్నట్టు చెప్పారు.
సమావేశానికి ఆలస్యంగా వచ్చిన మంత్రి పీయూష్ గోయల్.. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అల్లకల్లోల పరిస్థితుల్లో ఎన్నో ముఖ్యమైన కార్యకలాపాల నడుమ తీరిక లేకుండా ఉన్నట్టు చెప్పారు. ట్రంప్ విధానాలతో దేశాల మధ్య పెద్ద ఎత్తున చర్చలు మొదలైనట్టు తెలిపారు. భారత్–యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలను ప్రారంభించినట్టు చెప్పారు. నాణ్యత భారత్‌కు దీర్ఘకాలిక సవాలుగా ఉన్నట్టు గోయల్ గుర్తు చేశారు. ఫార్మాలో తగిన అనుమతులు ఉన్న బడా సంస్థలు చిన్న కంపెనీలకు మద్దతుగా నిలవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment