piyush goel
-
పోర్టుల్లో చార్జీల తగ్గింపు
న్యూఢిల్లీ: ఎగుమతి, దిగుమతిదారులు ఎదుర్కొంటున్న నౌకా రవాణా సంబంధిత సమస్యల పరిష్కారానికి కేంద్రం ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా పోర్టుల్లో కొన్ని రకాల చార్జీలు తగ్గించింది. అలాగే, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్సీఐ) ద్వారా ఐదు సెకండ్ హ్యాండ్ కంటెయినర్ వెసెల్స్ (సరుకులు, ఉత్పత్తుల రవాణాకు ఉపయోగించే) కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది.వాణిజ్య, పరిశ్రమలు, షిప్పింగ్, పోర్టులు, ఫైనాన్స్, పౌర విమానయాన, రైల్వే తదితర శాఖల సీనియర్ అధికారులు, ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్ఐఈవో, కస్టమర్స్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు, షిప్పింగ్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం తర్వాత కేంద్రం ఈ చర్యలు ప్రకటించింది. సమావేశం అనంతరం వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు వివరించారు. ‘తాజాగా తీసుకున్న చర్యలు రవాణా వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తాయి. అలాగే, ఖాళీ కంటెయినర్ల లభ్యత పెరుగుతుంది. సరుకులు వేగంగా ఎగుమతి చేసేందుకు వీలవుతుంది. పోర్టుల్లో రద్దీ గణనీయంగా తగ్గుతుంది’ అన్నారు. చర్యలు ఇవీ.. » కార్గో రవాణా సామర్థ్యం పెంచేందుకు వీలుగా ఎస్సీఐ అదనంగా 5 సెకండ్ హ్యాండ్ కంటెయినర్ నౌకలను కొనుగోలు చేస్తుంది. » రైల్వే బోర్డు, కంటెయినర్ కార్పొరేషన్ ఖాళీగా ఉన్న కంటెయినర్లను యార్డులో 90 రోజుల పాటు చార్జీల్లేకుండా అందుబాటులో ఉంచుతా యి. 90 రోజుల తర్వాత రూ.3,000గా వసూ లు చేస్తున్న చార్జీని రూ.1,500కు తగ్గించారు. » కంటెయినర్ సామర్థ్యాన్ని 9,000 టీఈయూల మేర పెంచుతున్నట్టు ఎస్సీఐ ప్రకటించింది. » 40 అడుగుల కంటెయినర్‌కు రేట్లను రూ.9,000 నుంచి రూ.2,000కు తగ్గించారు. 20 అడుగుల కంటెయినర్ చార్జీలు రూ.6,000 నుంచి రూ.1,000కు దిగొచ్చాయి. -
ఎకానమీకి అమెజాన్ చేసిందేమీ లేదు
న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపారం కొనసాగించడానికే అమెజాన్ తాజా పెట్టుబడులు చేస్తుందని, ఇందులో సంబరపడాల్సిందేమీ లేదని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెజాన్ తన పెట్టుబడులతో భారత్‌లోని సేవల రంగానికి, ఆర్థిక వ్యవస్థకు చేసిందేమీ లేదన్నారు. పనిలో పనిగా ఈ–కామర్స్ పరిశ్రమ లక్షలాది రిటైలర్ల ఉపాధిని దెబ్బతీస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో బిలియన్ డాలర్లు (సుమారు రూ.8,300 కోట్లు) ఇన్వెస్ట్ చేస్తున్నట్టు అమెజాన్ చేసిన ప్రకటన పట్ల సంతోషించాల్సిందేమీ లేదన్నారు. భారత వ్యాపారంలో నష్టాలను పూడ్చుకోవడానికే తాజా పెట్టుబడులను తీసుకొస్తున్నట్టు వ్యాఖ్యానించారు. కొల్లగొట్టే ధరల విధానాన్ని ఈ నష్టాలు సూచిస్తున్నాయంటూ.. ఇది భారత్‌కు ఎంత మాత్రం మేలు చేయబోదని, చిన్న వర్తకులను దెబ్బతీస్తుందన్నారు. ‘ఉపాధి అవకాశాలు, వినియోగదారుల సంక్షేమంపై ఈ–కామర్స్ రంగం చూపించే నికర ప్రభావం’ పేరుతో ఓ నివేదికను మంత్రి బుధవారం ఢిల్లీలో విడుదల చేశారు. దేశంలో చిన్న రిటైలర్ల ఉపాధిని దెబ్బతీసే ఈ–కామర్స్ కంపెనీల వ్యాపార నమూనాను మంత్రి ప్రశ్నించారు.ఈ–రిటైలర్లతో 1.58 కోట్ల ఉద్యోగాలు ఆన్లైన్ వర్తకులు దేశంలో 1.58 కోట్ల మందికి ఉపాధి కల్పించినట్టు మంత్రి గోయల్ విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. ఇందులో 35 లక్షల మంది మహిళలు ఉన్నట్టు, 17.6 లక్షల రిటైల్ సంస్థలు ఈ –కామర్స్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తెలిపింది. ఈ నివేదికను పహలే ఇండియా ఫౌండేషన్ (పీఐఎఫ్) విడుదల చేసింది. భారత్‌లో ఉపాధి కల్పన పరంగా, కస్టమర్ల సంక్షేమం పరంగా (మెరుగైన అనుభవం) ఈ–కామర్స్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ–కామర్స్ తృతీయ శ్రేణి పట్టణాల్లోకి విస్తరిస్తున్నట్టు వెల్లడించింది. టైర్–3 పట్టణాల్లోని వినియోగదారులు నెలవారీగా రూ.5,000కు పైనే ఆన్లైన్ షాపింగ్‌పై ఖర్చు చేస్తున్నట్టు వివరించింది. ఉపాధిపై ఈ–కామర్స్ రంగం చూపిస్తున్న ప్రభావాన్ని తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా 2,062 మంది ఆన్లైన్ వర్తకులు, 2,031 ఆఫ్‌లైన్ వర్తకులు, 8,209 మంది వినియోగదారుల అభిప్రాయాలను పీఐఎఫ్ తెలుసుకుంది. -
మహారాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పు?
ముంబై: మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో ఎంపీ సీట్లు గెలుచుకోలేకపోయింది. సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండనున్న క్రమంలో బీజేపీ మహారాష్ట్రపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షత మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులుపై మంగళవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న పీయూష్ గోయల్ కొన్ని రోజులుగా మహారాష్ట్ర బీజేపీ చీఫ్ మార్పుపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘మహారాష్ట్ర బీజేపీ న్యాయకత్వంలో ఎటువంటి మార్పు ఉండదు. బీజేపీ నేతలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (శివసేన (షిండే వర్గం)-బీజేపీ-ఎన్సీపీ( అజిత్ వర్గం) సంకీర్ణం ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా ఆచరించే వ్యూహాలపై కోర్ కమిటీ భేటీలో చర్చించాం’ అని అన్నారు.లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి మహారాష్ట్రతో పేలవ ప్రదర్శన ఇచ్చింది. బీజేపీ-9, ఎన్సీపీ (అజిత్ వర్గం)-1, శివసేన (షిండే వర్గం)-7 సీట్లతో మొత్త 17 స్థానాలకే పరిమితమైంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి మొత్తం 48 స్థానాలకు 41 సీట్లు గెలుచకున్న విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ దేవేంద్ర ఫడ్నవిస్ తన డిప్యూటీ సీఎం పదివికిఈ రాజీనామా చేయాలని భావించగా.. బీజేపీ అగ్రనేతల సూచన మేరకు వెనక్కి తగ్గారు. అయితే అప్పటి నుంచి బీజేపీ చీఫ్‌ను మార్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే స్థానంలో రావు సాహెబ్ పాటిల్‌ను మహారాష్ట్ర బీజేపీ కొత్త చీఫ్‌గా ఎంపిక చేయనున్నట్లు వార్తలు కూడా వ్యాప్తిచెందాయి. ‘మహాయుతి కూటమి పార్టీలతో కలిసి.. అసెంబ్లీ ఎన్నికల గెలుపు కోసం బ్లూప్రింట్ తయారు చేయటంపై చర్చించాం’డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నివిస్ భేటీ ముగిసిన తర్వాత మీడియాకు తెలిపారు. దీంతో మహారాష్ట్ర బీజేపీ చీఫ్ మార్పుపై పార్టీనేతల్లో నెలకొన్న ఊహాగానాలకు తెరపడినట్లు అయింది. -
ఈఎఫ్‌టీఏతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
న్యూఢిల్లీ: యూరప్‌లోని నాలుగు దేశాల కూటమి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకుంది. దీని ప్రకారం వచ్చే 15 ఏళ్లలో 100 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు దేశంలోకి రానున్నాయి. తద్వారా పది లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగనుంది. అలాగే, దశల వారీగా పలు ఉత్పత్తులపై సుంకాల తొలగింపు, కొన్నింటిపై మినహాయింపు నిబంధనల కారణంగా స్విస్ వాచీలు, చాక్లెట్లు మొదలైనవి భారత్ కొంత చౌకగా లభించగలవు. లక్ష్యాల ఆధారిత పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉండేలా ఒక ఎఫ్‌టీఏకి చట్టబద్ధత కల్పించడం చరిత్రలో ఇదే తొలిసారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది అమల్లోకి రావడానికి దాదాపు ఏడాది సమయం పడుతుంది. ఈఎఫ్టీఏ కూటమిలో స్విట్జర్లాండ్, నార్వే, ఐస్‌ల్యాండ్, లీచ్టెన్స్టెయిన్ దేశాలు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం చాలా మటుకు భారతీయ పారిశ్రామిక ఉత్పత్తులకు ఈఎఫ్టీఏ దేశాల్లో సుంకాలు ఉండవు. పలు ప్రాసెస్డ్ వ్యవసాయోత్పత్తుల మీద సుంకాలపై మినహాయింపులు లభిస్తాయి. ప్రతిగా దాదాపు 82.7 శాతం ఈఎఫ్టీఏ ఉత్పత్తుల కేటగిరీలపై భారత్ సుంకాలపరమైన ప్రయోజనాలు కలి్పంచనుంది. అలాగే, ఇరు పక్షాల సరీ్వసు రంగాల్లోనూ పరస్పర ప్రయోజనకర పరిణామాలు ఉండనున్నాయి. ఒక సంపన్న దేశాల కూటమితో ఎఫ్‌టీఏ కుదుర్చుకోవడం కీలక మైలురాయి కాగలదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ వ్యాఖ్యానించారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్–ఈఎఫ్టీఏ మధ్య 18.65 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం నమోదైంది. -
Lok Sabha elections 2024: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 4 శాతం పెంపు
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని(డీఏ), పెన్షనర్లకు కరువు సహాయాన్ని(డీఆర్) బేసిక్ పే/పెన్షన్‌పై మరో 4 శాతం పెంచింది. ప్రస్తుతం డీఏ/డీఆర్ 46 శాతం ఉంది. తాజా పెంపుతో ఇది 50 శాతానికి చేరింది. పెంచిన భత్యం ఈ ఏడాది జనవరి 1 నుంచే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. దీనివల్ల కోటి మందికిపైగా ఉద్యోగులకు, పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుందని తెలియజేసింది. ఉద్యోగులకు డీఏ అదనపు వాయిదా సొమ్ము, పెన్షనర్లకు కరువు సహాయం(డీఆర్) సొమ్ము ఈ ఏడాది జనవరి 1 నుంచి చెల్లించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ధరలు పెరగడంతో ఉద్యోగులకు, పెన్షనర్లకు డీఏను 50 శాతానికి పెంచినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ పెంపు వల్ల ఖజానాపై ప్రతిఏటా రూ.12,869 కోట్ల భారం పడనుంది. 2024 జవవరి నుంచి 2025 ఫిబ్రవరి వరకు ప్రభుత్వం రూ.15,014 కోట్లు చెల్లించనుంది. డీఏ పెంపుతో ఉద్యోగులకు ఇతర భత్యాలు, గ్రాట్యుటీ సైతం పెరుగుతాయి. డీఏ/డీఆర్ కాకుండా ఇతర భత్యాల పెంపు కారణంగా ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.9,400 కోట్ల భారం పడుతుంది. ఏడో కేంద్ర వేతన కమిషన్ సిఫార్సుల ప్రకారమే డీఏ/డీఆర్‌ను కేంద్రం పెంచింది. ఉజ్వల రాయితీ గడువు పెంపు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద పేద మహిళలకు వంట గ్యాస్ సిలిండర్లపై రూ.300 చొప్పున ఇస్తున్న రాయితీ గడువును కేంద్రం మరో ఏడాది పెంచింది. వాస్తవానికి ఈ గడువు ఈ ఏడాది మార్చి 31న ముగియనుంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరంలోనూ రాయితీని వర్తింపజేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రతిఏటా 12 సిలిండర్లకు ఈ రాయితీ వర్తిస్తుంది. ముడి జనపనారకు మరో రూ.285 ముడి జనపనారకు కనీస మద్దతు ధరను కేంద్రం మరో రూ.285 పెంచింది. దీనివల్ల క్వింటాల్ ముడి జనపనార ధర రూ.5,335కు చేరుకుంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఈ కనీస మద్దతు ధర వర్తిస్తుంది. రూ.10,037 కోట్లతో ‘ఉన్నతి’ ఈశాన్య రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధి, ఉద్యోగాల సృష్టికి ప్రోత్సాహం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం ‘ఉన్నతి’కి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. ఈ పథకం రూ.10,037 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో పరిశ్రమలు స్థాపించే పెట్టుబడిదారులకు ప్రోత్సాహకాలు ఇస్తారు. 2034 మార్చి 31 దాకా ఈ పథకం అమల్లో ఉంటుంది. రూ.10,372 కోట్లతో కృత్రిమ మేధ ఐదేళ్ల పాటు అమలు చేసే ఇండియా కృత్రిమ మేధ(ఏఐ) మిషన్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఈ మిషన్‌కు ప్రభుత్వం రూ.10,373 కోట్లు కేటాయించింది. ఈ మిషన్‌లో భాగంగా 10,000 జీపీయూ సూపర్ కంప్యూటింగ్ కెపాసిటీని అందుబాటులోకి తీసుకొస్తారు. -
Parliament Winter sessions 2023: రేపు అఖిలపక్ష భేటీ
న్యూఢిల్లీ: డిసెంబర్ నాలుగో తేదీ నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మొదలుకానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చింది. డిసెంబర్ రెండో తేదీన(శనివారం) అఖిలపక్ష సమావేశానికి హాజరుకావాలని సంబంధిత రాజకీయ పార్టీలకు కేంద్రం ఆహ్వానం పంపింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రల్హాద్ జోషీ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో కేంద్రం తరఫున రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, వాణిజ్య మంత్రి పియూశ్ గోయల్‌తోపాటు రాజకీయ పార్టీల లోక్‌సభ, రాజ్యసభ పక్ష నేతలు పాల్గొంటారు. ప్రస్తుతం పార్లమెంట్ వద్ద 37 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సారి సెషన్లో ఏడు బిల్లులను ప్రవేశపెట్టాలని, 12 బిల్లులను ఆమోదింపజేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన గ్రాంట్ల తొలి అదనపు బిల్లులను ప్రవేశపెట్టాలని సర్కార్ భావిస్తోంది. లోక్‌సభలో ‘నగదుకు ప్రశ్నలు’ ఉదంతంలో టీఎంసీ మహిళా ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు వేయాలంటూ నైతికవిలువల కమిటీ ఇచ్చిన సిఫార్సును ఈసారి సభలో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తోంది. భారతీయ శిక్షా స్మృతి, నేర శిక్షా స్మృతి, సాక్ష్యాధారాల చట్టాల స్థానంలో కొత్త బిల్లులను సభ ముందు ఉంచాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఎలక్షన్ కమిషనర్ల నియామక బిల్లునూ ప్రవేశపెట్టే అవకాశముంది. -
సుస్థిరమైన ఆవిష్కరణలు, ఉత్పత్తులు రావాలి
సాక్షి, హైదరాబాద్: మన దేశంలోని అతి పెద్ద మార్కెట్ లక్ష్యంగా వివిధ రంగాల్లో కొత్త ఆవిష్కరణలు, సుస్థిరమైన ఉత్పత్తులు తీసుకురావాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పిలుపునిచ్చారు. వివిధ రంగాల పరస్పర సహకారం, వినూత్న విధానాలతో వచ్చే 25 ఏళ్లలో భారత్ అభివృద్ధి చెందిన దేశాల శక్తికేంద్రంగా నిలుస్తుందనే ధీమా వ్యక్తంచేశారు. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిఫ్ట్, ఎఫ్డీఐఐ, ఎన్ఐడి, ఐఐఎఫ్టి, ఐఐపి విద్యార్థుల సమావేశం శిల్పకళావేదికలో శనివారం జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన నిర్మలా సీతారామన్ ‘డిజిటలైజేషన్, ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్: భారత ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలు’ అనే అంశంపై మాట్లాడారు. ఆగస్టు 15 ప్రసంగంలో ప్రధాని మోదీ సూచించిన పంచ సూత్రాల(పంచ పరిష్కారాలు) అమలుతో దేశం మరింత బలోపేతం అవుతోందన్నారు. ఇప్పటికే భారత్ అభివృద్ధి చేసిన స్థిరమైన డిజైన్ల గురించి తెలుసుకొని, వాటిని ఈ తరానికి సౌకర్యంగా ఉండేలా మెరుగుపరచాలని విద్యార్థులకు సలహా ఇచ్చారు. మార్పును స్వీకరించి, కొనసాగించే వారధులుగా విద్యార్థులు ఉండాలని సీతారామన్ వ్యాఖ్యానించారు. ఆశాకిరణంగా భారత్ ఆర్థిక వ్యవస్థ : పీయూష్ గోయల్ ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ప్రపంచానికి భారత్ ఆర్థికవ్యవస్థ ఒక ఆశాకిరణంగా ఉందని కేంద్ర పరిశ్రమలు, ప్రజా పంపిణీ, జౌళి శాఖల మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఉత్తమ డిజైన్లను రూపొందించి, ఖర్చు తగ్గించే అంశాలపై దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు. సభికులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ.. పేటెంట్ల కోసం ఆన్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. డిజిటలైజేషన్ ద్వారా అవినీతిని రూపుమాపామని, మధ్యవర్తులను దూరం చేయగలిగామని, పోటీతత్వం పెంచగలిగామని తెలిపారు. నూతన ఆవిష్కరణలకు కేంద్రం నుంచి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ఐదు విద్యాసంస్థల విద్యార్థుల (పూర్వవిద్యార్థులుసహా) సమ్మేళనం తొలిసారిగా హైదరాబాద్‌లో జరుగుతోందని, రాబోయే రోజుల్లో దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటివి నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో కేంద్రవాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి రాజీవ్ సింగ్ ఠాకూర్, ఎఫ్‌డీడీఐ ఎండీ అరుణ్ కుమార్ సిన్హా, నిఫ్ట్ డైరెక్టర్ విజయ్ కుమార్ మంత్రి, ఎన్ఐడి ప్రొఫెసర్ శేఖర్ ముఖర్జీ, ఎఫ్డిఐఐ హైదరాబాద్ సెంటర్ ఇంచార్జ్ దీపక్ చౌదరి, ఐఐఎఫ్టి డీన్ డాక్టర్ సతీందర్ భాటియా, ఐఐపీ చైర్మన్ వాగీ దీక్షిత్ పాల్గొన్నారు. -
దేశానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలి
శాన్ ఫ్రాన్సిస్కో: ’బ్రాండ్ ఇండియా’కు ప్రచారకర్తలుగా వ్యవహరించాలని భారతీయ చార్టర్డ్ అకౌంటెంట్లకు (సీఏ) కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్ గోయల్ సూచించారు. దేశంలోకి పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలని, దేశ ఆర్థిక వృద్ధికి తోడ్పాటు అందించాలని ఆయన పేర్కొన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ప్రస్తుతం 3.3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఉన్న భారత్ వచ్చే 30 ఏళ్లలో 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతోందని గోయల్ చెప్పారు. ‘భారత్‌లో పెట్టుబడుల అవకాశాల గురించి మీరు అంతర్జాతీయ క్లయింట్లకు వివరించండి. ఆ విధంగా అమెరికాలోను ఇతర ప్రాంతాల్లోను ఉన్న భారతీయ సీఏలు ఆయా దేశాలకు, భారత్‌కు మధ్య వారధిగా నిల్చినవారవుతారు‘ అని ఆయన పేర్కొన్నారు. అలాగే అత్యంత నాణ్యమైన ఉత్పత్తులు, సేవలను భారత్ అందుబాటు ధరల్లోనే అందిస్తున్న విషయాన్ని కూడా ఇతర దేశాలకు తెలియజేయాలని గోయల్ సూచించారు. ఐసీఏఐ సభ్యులు పండుగలు మొదలైన సందర్భాల్లో బహుమతులు ఇచ్చేందుకు మేడిన్ ఇండియా ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. దేశీ సీఏ సంస్థలు అంతర్జాతీయ స్థాయి దిగ్గజాలుగా ఎదిగే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. -
భారత్–యూఏఈ బంధం బలోపేతం
న్యూఢిల్లీ: భారత్–యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టమయ్యే కీలక ఒప్పందం శుక్రవారం జరిగింది. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) పేరుతో జరిగిన స్వేచ్చా వాణిజ్య ఒప్పంద (ఎఫ్‌టీఏ) పత్రాలపై భారత్ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్, యూఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మరీ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సంతకాలు చేశారు. ఒప్పంద పత్రాలను ఒకరికొకరు మార్చుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, ఈ ఒప్పందం వల్ల రెండు దేశాలకూ బహుళ ప్రయోజనాలు ఒనగూరుతాయని పేర్కొన్నారు.వస్తువులు, సేవలు, నిబంధనలు, కస్టమ్స్ విధానాలు, ప్రభుత్వ సేకరణ, మేధో సంపత్తి హక్కులు, ఈ–కామర్స్‌తో సహా పలు అంశాలు తాజా ఒప్పందం పరిధిలోకి వస్తాయని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఒప్పందం ప్రకారం రెండు దేశాలు గరిష్ట స్థాయి ఉత్పత్తులపై కస్టమ్స్ సుంకాలు తగ్గుతాయి. సేవలు, పెట్టుబడులకు సంబంధించి పలు నిబంధనలను సరళతరం అవుతాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో రెండు దేశాలు వాణిజ్య ఒప్పంద చర్చలను లాంఛనంగా ప్రారంభించాయి. కాగా, తాజా ఒప్పందంపై సంతకాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌లు ఒక వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ‘‘భారతదేశం–యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం: కొత్త హద్దులు, మైలురాయి‘ అనే పేరుతో సంయుక్త విజన్ ప్రకటనను విడుదల చేశారు. ప్రస్తుతం 2 దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ దాదాపు 60 బిలియన్ డాల ర్లు ఉంటే, ఇది వచ్చే ఐదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ప్రపంచంలోని ఇతర దేశాలకు యూఏఈ ఒక గేట్వేగా ఉండడం మరో కీలక అంశం. స్మారక స్టాంప్ ఆవిష్కరణ: కాగా భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవడం, యూఏఈ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇరు దేశాల నాయకులు సంయుక్త స్మారక స్టాంప్‌ను విడుదల చేశాయి. అపార వాణిజ్య అవకాశాలు ఇది ఒక సమగ్ర, సమతౌల్య వాణిజ్య ఒప్పందం. దీనివల్ల రెండు దేశాలకూ అపార వాణిజ్య అవకాశాలు ఏర్పడతాయి. దైపాక్షిక వాణిజ్య సంబంధాలు రెట్టింపు అవుతాయి. – పీయూష్ గోయెల్, వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి -
చిన్న పట్టణాల్లోని స్టార్టప్‌లకు చేయూతనివ్వాలి
న్యూఢిల్లీ: గ్లోబల్ వెంచర్ క్యాపిటల్ ఫండ్స్ (వీసీలు) భారత్‌లోని చిన్న పట్టణాల్లో (ద్వితీయ, తృతీయ శ్రేణి) స్టార్టప్‌లకు నిధుల చేయూతనివ్వాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. గ్లోబల్ వీసీలతో రౌండ్‌టేబుల్ సమావేశాన్ని ఆయన నిర్వహించారు. స్టార్టప్‌లకు మద్దతుగా తమ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో చర్యలు తీసుకుందని, భవిష్యత్తులోనూ తీసుకుంటుందని భరోసా కల్పించారు. పెట్టుబడులు పెట్టేందుకు కొత్త రంగాలను గుర్తించాలని సూచించారు. ‘‘భారత యువ వ్యాపారవేత్తలు పొందిన మేధో సంపత్తి హక్కులను కాపాడాలి. ప్రోత్సహించేందుకు ముందుకు రావాలి. వారికి మీ అనుభవం అందించడం ద్వారా మరింత విస్తరించేందుకు, మరిన్ని పెట్టుబడులతో సహకారాన్ని విస్తృతం చేయాలి’’ అని వీసీలను కోరారు. స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో వ్యాపార నిర్వహణ, నిధుల సమీకరణను సులభతరం చేసేందుకు 49 నియంత్రణ సంస్కరణలను అమలు చేసినట్టు మంత్రి చెప్పారు. నిబంధనల అమలు భారాన్ని తగ్గించినట్టు పేర్కొన్నారు. మంత్రి నిర్వహించిన స్టార్టప్‌ల సమావేశంలో అమెరికా, జపాన్, కొరియా, సింగపూర్ తదితర దేశాల నుంచి 75కు పైగా వీసీ ఫండ్స్ ఇన్వెస్టర్లు పాల్గొన్నారు. వీటి నిర్వహణలో ప్రపంచవ్యాప్తంగా 30 బిలియన్ డాలర్ల నిధులున్నాయి. -
దివాలా చట్టంతో రుణ వ్యవస్థలో మార్పు
న్యూఢిల్లీ: దివాలా చట్టం (ఐబీసీ)తో రుణ వ్యవస్థలో పెను సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయని కేంద్రం వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయెల్ పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం తీసుకువచ్చిన ఈ చట్టంతో రుణ దాతలు, రుణ గ్రహీతల వైఖరిలో కూడా మార్పు చోటుచేసుకుందని అన్నారు. ఇచ్చిన రుణం తిరిగి వస్తుందన్న భరోసా రుణదాతకు, తీసుకున్న రుణం తప్పనిసరిగా తీర్చాలన్న అభిప్రాయం రుణ గ్రహీతకు కలిగినట్లు పేర్కొన్నారు. ఆయా అంశాలు దేశంలో సరళతర వ్యాపార వృద్ధికి (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) దోహదపడుతున్నట్లు వివరించారు. రుణ వ్యవస్థకు సంబంధించి ఐబీసీ ఒక పెద్ద సంస్కరణ అని పేర్కొన్నారు. రుణ పరిష్కారానికి గతంలో దశాబ్దాలు పట్టేదని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని అన్నారు. ప్రతి దశ దివాలా వ్యవహారం నిర్దిష్ట కాల వ్యవధిలో పూర్తయ్యే వ్యవస్థ ప్రస్తుతం నెలకొందని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ ప్రొఫెషనల్స్ ఆఫ్ ఐసీఏఐ (ఐఐఐపీఐ) ఐదవ వ్యవస్థాపక దినోత్సవంలో గోయెల్ ఈ కీలక ప్రసంగం చేశారు. రానున్న కాలంలో భారత్ విశ్వసనీయత, దేశ ఫైనాన్షియల్ నిర్మాణం మరింత బలపడతాయని గోయెల్ అన్నారు. ఐఐఐపీఐకు ఐదు మార్గదర్శకాలు... పనిలో సమగ్రత, నిష్పాక్షికత, వృత్తిపరమైన సామర్థ్యం, గోప్యత, పారదర్శకత అనే ఐదు మార్గదర్శక సూత్రాలను అనుసరించాలని మంత్రి ఐఐఐపీఐ సభ్యులకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ ఐదు సూత్రాలను అనుసరిస్తే, నిపుణులు ఆశించే వృత్తిపరమైన ప్రవర్తన మరింత ఇనుమడిస్తుందని అన్నారు. వీటితోపాటు మరే ఇతర తరహా విధినిర్వహణ తమ సామర్థ్యాన్ని, పనితీరును పెంచుతుందన్న విషయాన్ని సభ్యులు గుర్తించాలన్నారు. మొండి బకాయిల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం చాలా ముఖ్యమని అన్నారు. వ్యాపార సంస్థల ఏర్పాటు, నిర్వహణలో విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఐఐఐపీఐ తనవంతు కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. కోవిడ్–19 కాలంలో వ్యాపారాలను కష్టాల నుండి రక్షించడానికి, 2020 మార్చి నుండి 2021 మార్చి వరకు డిఫాల్ట్‌ల నుండి ఉత్పన్నమయ్యే దివాలా చర్యలను తాత్కాలికంగా నిలిపివేయడానికి ప్రభుత్వం చురుకైన చర్యలు తీసుకుందని మంత్రి తెలిపారు. -
ప్రోత్సాహక పథకంలో మార్పులు అవసరం
సాక్షి, హైదరాబాద్: వస్త్రోత్పత్తి రంగంలో కేంద్రప్రభుత్వం ప్రకటించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్)లో మరిన్ని మార్పులు చేయడంతోపాటు సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి మరిన్ని అంశాలను జోడిస్తే వస్త్రోత్పత్తి రంగం మరింత బలోపేతమవుతుందని కేంద్రమంత్రి పీయూష్ గోయెల్‌కు శనివారం రాసిన లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం కృత్రిమ దారాలకు (మాన్ మేడ్ ఫైబర్) మాత్రమే ప్రోత్సాహకాలు వర్తిస్తాయని, ఇవే ప్రోత్సాహకాలను పత్తి ఆధారిత వస్త్రోత్పత్తులు చేసే వారికి కూడా వర్తింపజేస్తే జౌళి పరిశ్రమతో పాటు పత్తి పంటను ఎక్కువగా సాగు చేసే తెలంగాణ వంటి రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి వివరించారు. అన్ని రకాల ఫైబర్ వస్త్రోత్పత్తిని ప్రోత్సహిస్తే ఈ రంగంలో 7.5లక్షల మం దికి ఉద్యోగావకాశాలు వస్తాయన్నారు. కనీస పెట్టుబడిని తగ్గించండి కృత్రిమ ఫైబర్ సెగ్మెంట్లో రూ.300 కోట్ల కనీస పెట్టుబడులు పెడితేనే కేంద్రం ప్రకటించిన ప్రోత్సాహకాలు పొందే వీలుంటుందని, చైనా లాంటి దేశాలతో పోటీ పడేందుకు కనీస పెట్టుబడిని తగ్గించాలని కేటీఆర్ కోరారు. గార్మెంట్ రంగంలో కనీస పెట్టుబడిని రూ.100 కోట్ల నుంచి రూ.50కోట్లకు తగ్గిస్తే మరింతమంది యూనిట్లు స్థాపించేందుకు ముందుకు వస్తారన్నారు. భారీ టెక్స్టైల్ పార్కుల ఏర్పాటుకు భూమి, ఇతర మౌలిక వసతుల కల్పన అవసరమవుతుందని, తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌లో యాంగ్వాన్, కైటెక్స్ వంటి పెద్ద సంస్థలు ఇప్పటికే కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. -
టెక్స్‌టైల్స్‌కు ‘పీఎల్ఐ’ బూస్ట్!
సాక్షి, న్యూఢిల్లీ: వస్త్ర పరిశ్రమ (టెక్స్టైల్స్)ను ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కిందకు తీసుకువస్తూ కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ రంగానికి రానున్న ఐదేళ్లలో రూ.10,683 కోట్లు కేటాయించింది. పరిశ్రమ పురోభివృద్ధి, ఎగుమతులు లక్ష్యంగా ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాణిజ్య, పరిశ్రమలు, టెక్స్టైల్స్ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ విలేకరులకు తెలిపారు. ఎంఎంఎఫ్ (మేన్–మేడ్ ఫైబర్) దుస్తులు, ఎంఎంఎఫ్ వస్త్రాలు, టెక్నికల్ టెక్స్‌టైల్స్‌కు సంబంధించిన 10 విభాగాలు/ఉత్పత్తులకు తాజా నిర్ణయం వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. 13 రంగాలకు వర్తించే విధంగా పీఎల్ఐ స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం 2021–22 ఏడాది బడ్జెట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి మొత్తంగా రూ.1.97 లక్షల కోట్ల కేటాయింపులు జరిపింది. ఉపాధి, వాణిజ్య అవకాశాల మెరుగుదల ఈ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు, పత్తి, సహజ ఫైబర్ ఆధారిత వస్త్ర పరిశ్రమలో కొత్తగా ఉపాధి, వాణిజ్య అవకాశాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం దోహదపడనుంది. కొన్ని నిర్దిష్ట జిల్లాలతోపాటు, టైర్–3, టైర్– 4 పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ రంగంలో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు కేంద్రం తెలిపింది. వస్త్ర పరిశ్రమకు పీఎల్ఐ స్కీమ్ వర్తింపు వల్ల తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, యూపీ, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, ఒడిశా తదితర రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుంనది వివరించింది. ఐదేళ్లలో ఈ స్కీమ్ వల్ల రూ. 19,000 కోట్లకు పైగా కొత్త పెట్టుబడులు వస్తాయని అంచనా వేసింది. రూ. 3 లక్షల కోట్లకు పైగా టర్నోవర్ సాధ్యమవుతుందని పేర్కొంది. ప్రత్యేకించి ఈ పథకం మహిళలకు సాధికారతనిస్తుందని, ఆర్థిక వ్యవస్థలో వారి భాగస్వామ్యాన్ని పెంచుతుందని వివరించింది. ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్స్‌కు మెరుపు కేంద్రం తీసుకున్న తాజా నిర్ణయం భారత వస్త్ర పరిశ్రమలో కీలక పరిణామం. ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్ భారత తయారీ సామర్థ్యం పటిష్టతకు ఈ నిర్ణయం దోహదపడుతుంది. ఎంఎంఎఫ్ ఫ్యాబ్రిక్, దారం సరఫరాలను భారత్ కలిగి ఉంది. అయితే అయితే నాణ్యమైన ఎంఎంఎఫ్ వస్త్ర ఉత్పత్తి తగినంతగా లేదు. ఈ సమస్యను అధిగమించడానికి తాజా కేబినెట్ నిర్ణయం సహాయపడుతుంది. భారత్ మొత్తం వస్త్ర ఉత్పత్తిలో ఎంఎంఎఫ్ ఆధారిత దుస్తుల వాటా 20 శాతం మాత్రమే. ఈ నిర్ణయం వల్ల ఎంఎంఎఫ్ ఆధారిత దుస్తులు ఇకపై ప్రతి ఏడాదీ పెరుగుతాయి. వచ్చే మూడేళ్లలో వస్త్ర ఎగుమతులూ రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయి. – ఏ శక్తివేల్, ఏఈపీసీ చైర్మన్ -
ట్విటర్లో కీలక మైలురాయి దాటిన ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాకర్షక నాయకుడిగా ప్రధానమంత్రి ఒకరిగా ఉన్నారు. మోదీకి దేశంలో అత్యంత ప్రజాదరణ ఉంది. ప్రధానమంత్రి హోదాలో ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రధాని నరేంద్రమోదీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. వివిధ అంశాలపై స్పందిస్తుంటారు. పలు ఆసక్తికరమైన పోస్టులు కూడా చేస్తుంటారు. ఇప్పుడు ప్రధాని మోదీ మరో అరుదైన ఘనతను సాధించారు. సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్లో ఏడు కోట్ల మంది ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుని అగ్రభాగాన నిలిచారు. మొత్తం 70 మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుని కీలక మైలురాయిని దాటేశారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్రమోదీ 2009లో ట్విటర్ ఖాతా తెరిచారు. 2010 వరకు ఆయన ఫాలోవర్లు లక్షకే పరిమితమయ్యారు. పదకొండేళ్ల అనంతరం అంటే 2021కి ఏకంగా ఏడు కోట్లకు పైగా ఫాలోవర్స్‌ను పెంచుకున్నారు. ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాక నరేంద్రమోదీని ఫాలో అయ్యేవారి సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ప్రజలకు చేరువ అయ్యేందుకు మోదీ సోషల్ మీడియాను ఒక వేదికగా చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పథకాలతో పాటు దేశం, ప్రపంచంలో జరుగుతున్న పలు అంశాలపై స్పందిస్తుంటారు. పలుసార్లు సామాన్య ప్రజలను కూడా ట్విటర్ ద్వారా పలకరించి ఆశ్చర్యపరుస్తుంటారు. అందుకే ప్రధాని మోదీకి ట్విటర్లో ఫాలోవర్స్ భారీగా పెరుగుతున్నారు. ప్రధాని ఈ మైలురాయిని అధిగమించడంపై కేంద్ర మంత్రి పీయూశ్ గోయల్ స్పందించారు. ‘ప్రధాని మోదీ దూరదృష్టి, నిర్ణయాత్మక చర్యలు ప్రజాదరణను మరింత పెంచుతోంది. ఏడుకోట్ల ఫాలోవర్లను సంపాదించుకుని మరో మైలురాయి దాటిన ప్రధానికి నా శుభాకాంక్షలు. మీ నాయకత్వంతో మేం గర్వంగా ఉన్నాం’ అని ట్వీట్ చేశారు. PM @NarendraModi ji's personal connect, vision and decisive actions keep adding to his surging global popularity. Congratulations to our Prime Minister on another milestone of 7 crore twitter followers. We are proud of and inspired by your leadership. pic.twitter.com/xSKFMzHmSm — Piyush Goyal (@PiyushGoyal) July 29, 2021 -
దూసుకొచ్చిన మహిళా ‘ఆక్సిజన్’ రైలు
బెంగళూరు: కరోనా వ్యాప్తి బాధితులకు అందించేందుకు చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో ఇతర ప్రాంతాల నుంచి ప్రాణవాయువు సరఫరా చేస్తున్నారు. ముఖ్యంగా ఒడిశా, జార్ఖండ్‌ల నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా అవుతోంది. అయితే తాజాగా చేసిన ఆక్సిజన్ సరఫరా ఎంతో ప్రత్యేకతతో కూడుకున్నది. ఎందుకంటే ఆ ఆక్సిజన్ ట్యాంకర్లతో కూడిన ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడిపిన వారంతా మహిళలే. మహిళా పైలెట్లే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపి ప్రత్యేకత చాటారు. జార్ఖండ్‌లోని జంషెడ్పూర్ టాటానగర్ నుంచి బయల్దేరిన 7వ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం కర్నాటకలోని బెంగళూరుకు చేరింది. ఆ రైల్లో సిబ్బందితో పాటు పైలెట్లంతా మహిళలు ఉండడం విశేషం. ఈ విషయాన్ని తెలుపుతూ రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. 120 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ బెంగళూరు చేరుకుందని తెలిపారు. -
ఇంట్లోనూ మాస్క్ ధరించండి..ఎందుకంటే ?
న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకండ్ వేవ్‌పై ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాందోళనలకు పారదోలేందుకు, అప్రమత్తం చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా ఇళ్లలోనే ఉండి, ఇంట్లోనూ మాస్క్ ధరించి కరోనా కట్టడికి సహకరించాలని ప్రజలను కోరింది. కేసుల తీవ్రత గురించి ఎలాంటి భయానికి గురి కావద్దని తెలిపింది అనవసర ఆందోళనతో మంచి కంటే చెడే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని పేర్కొంది. దేశంలో అవసరానికి సరిపోను ఆక్సిజన్ నిల్వలున్నాయని, రవాణాలోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని, వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. కోవిడ్ బాధితుల్లో అత్యధికులు ఇంట్లో ఉండే చికిత్స పొందవచ్చనీ, డాక్టర్లు సూచిస్తేనే ఆస్పత్రుల్లో చేరాలంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, హోం శాఖ అదనపు కార్యదర్శి పియూష్ గోయెల్, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్, ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు పరిస్థితుల తీవ్రతపై ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు ప్రజల్లో తలెత్తుతున్న భయాందోళనలను, అనుమానాలను నివృత్తి చేసేందుకు ప్రయత్నించారు. ఈ అంటువ్యాధిని ఎదుర్కోవడంలో రెమిడెసివిర్, తోసిలిజుమాబ్ వంటి ముఖ్యమైన ఔషధాల వినియోగానికి సరైన ప్రిస్క్రిప్షన్ అవసరమని ఆరోగ్య శాఖ తెలిపింది. రెమిడెసివిర్, తోసిలిజుమాబ్ మాదిరిగా ప్రభావం చూపే చౌకైన, తేలిగ్గా అందుబాటులో మందులు చాలానే ఉన్నాయి. వాటిని వాడటం మంచిది. మెడికల్∙ఆక్సిజన్ దేశంలో వైద్య వినియోగానికి తగినంత ఉన్నప్పటికీ, దానిని ఆసుపత్రులకు రవాణా చేయడం సవాలుగా మారిందని పేర్కొంది. ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లకు, ఆక్సిజన్ డిమాండ్ ఉన్న ప్రాంతాలకు దూరం ఎక్కువగా ఉందని వివరించింది. న్యాయమైన పద్ధతిలో ఆక్సిజన్ వాడాలని, దాని వృథాను ఆపాలని కేంద్రం రాష్ట్రాలు, ఆసుపత్రుల యాజమాన్యాలను కోరింది.వైద్యేతర అవసరాలకు లిక్విడ్ ఆక్సిజన్‌ను వాడరాదంటూ ఆదివారం కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ నిషేధం నుంచి యాంపుల్స్, వయెల్స్, ఫార్మాస్యూటికల్, రక్షణ బలగాలు అనే మూడు రంగాలను మినహాయిస్తూ సోమవారం మరో ఉత్తర్వు వెలువరించింది. ఒక్కో వ్యక్తి నుంచి 406 మందికి.. గత ఏడాది మొదటి వేవ్‌తో పోలిస్తే ఈసారి వ్యాప్తి చాలా రాష్ట్రాల్లో తీవ్రంగా ఉంది. మహారాష్ట్రలో గత ఏడాది కంటే 2.25 రెట్లు ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. అదే సమయంలో, కర్ణాటకలో 3.3 రెట్లు, ఉత్తరప్రదేశ్‌లో 5 రెట్లు ఎక్కువగా కేసులుండటం ఆందోళన కలిగిస్తోంది. భౌతిక దూరం పాటించకుంటే ఒక్కో బాధితుడి ద్వారా 30 రోజుల్లో 406 మందికి ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలిందని డాక్టర్ పాల్ తెలిపారు. భౌతికదూరం 50% పాటించినట్లయితే, ఒక్కో వ్యక్తి ద్వారా 15 మందికి మాత్రమే కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు రుజువైంది. భౌతిక దూరాన్ని 75% పాటించిన బాధితుడి ద్వారా 30 రోజుల్లో 2.5 మందికే వైరస్ సోకుతుంది. వ్యాక్సినేషన్‌కు, మహిళల పీరియడ్స్‌కు సంబంధంలేదని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్‌కు కొత్త విధానం కొత్త వ్యాక్సినేషన్ విధానం అమల్లోకి వచ్చింది. ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఉందంటూ ఎక్కువ మంది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బాధితుల్లో 90 శాతం మందికి జ్వరం, ఒళ్లునొప్పుల వంటి వాటితో స్వల్ప అనారోగ్యానికి గురవుతారు. వీరికి జ్వరానికి ఇచ్చే మందులు, ఆవిరి పట్టడంతో వ్యాధిని తగ్గించవచ్చు. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన తర్వాత ఆక్సిజన్ సంతృప్తికర స్థాయిలో ఉండి, స్వల్ప లక్షణాలే ఉన్నప్పటికీ ఆస్పత్రుల్లో జాయినవ్వాలని కోరుకుంటున్నారు. మధ్యస్త, తీవ్ర స్థాయి కేసుల్లో 5వ రోజు నుంచి 7వ రోజు తర్వాత మాత్రమే ఆక్సిజన్‌తో అవసరం ఉంటుంది. అంతకంటే ముందుగా ఇవ్వడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. మొదటి, రెండో రోజే చికిత్స సమయంలో ఆక్సిజన్ అందిస్తే సైడ్ ఎఫెక్ట్సు తలెత్తే ప్రమాదం ఉంది. కోవిడ్ బాధితులకు అందజేసే రెమిడెసివిర్, టొసిలిజుమాబ్ వంటి ఔషధాలను హేతుబద్ధంగా ఆస్పత్రులు వాడాలి. పరిస్థితి విషమంగా ఉన్న పేషెంట్లపై రెమిడెసివిర్ ప్రభావం ఇంకా నిర్థారణ కానందున, బదులుగా వేరే మందులను వాడుకోవచ్చు. ఆక్సిజన్ ట్యాంకులకు జీపీఎస్ దేశంలో మెడికల్ ఆక్సిజన్ నిల్వలు చాలినన్ని ఉన్నాయని కేంద్రం స్పష్టత ఇచ్చింది. అయితే, ఉత్పత్తి అవుతున్న రాష్ట్రాల నుంచి తక్షణం అవసరం ఉన్న చోటికి ఆక్సిజన్ తరలింపు సమస్యగా మారింది. భారత వైమానిక దళ విమానాల్లో ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లను తరలించడం ద్వారా రవాణా సమయం తగ్గింది. కేసులు ఒక్కసారిగా పెరగడంతో దేశంలో ఆక్సిజన్‌కు డిమాండ్ పెరిగింది. ఆక్సిజన్ ట్యాంకర్ల కదలికలను జీపీఎస్ ద్వారా కేంద్రం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ కొరత తీరుస్తున్నాం. స్థానిక కంటెయిన్మెంట్ విధానం కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించేందుకు గుర్తించిన జిల్లాలు, ప్రాంతాల్లో స్థానిక ప్రాతిపదికన కంటెయిన్మెంట్ ప్రణాళికలను అమలు చేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. దీనికి సంబంధించి ఈ నెల 25న కేంద్ర కుటుంబ ఆరోగ్య శాఖ వెలువరించిన మార్గదర్శకాలను పాటించాలంది. కంటెయిన్మెంట్ వ్యూహాలకు సంబంధించి జిల్లా యంత్రాంగానికి స్వేచ్ఛ కల్పించి, పక్కాగా అమలయ్యేలా చూడాలి. ప్రస్తుత వేవ్‌ను ఒక స్థాయికి నియంత్రించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం లకి‡్ష్యత కార్యాచరణకు పూనుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రం తెలిపింది. ఇందుకోసం, గత వారం రోజులుగా పాజిటివిటీ రేటు 10 శాతం, అంతకంటే ఎక్కువ నమోదవుతున్న ప్రాంతాలను, కోవిడ్ బాధితుల్లో 60 శాతం కంటే మించి ఆక్సిజన్ అవసరమయ్యే లేదా ఐసీయూలో చేరిన వారున్న ప్రాంతాలను గుర్తించాలని కోరింది. ఈ రెండు అంశాల్లో ఏ ఒక్కటి సరిపోలినా సంబంధిత జిల్లాలో కంటెయిన్మెంట్ చర్యలను తక్షణం తీసుకోవాలని తెలిపింది. ఆ ప్రాంతంలోని ప్రజలు 14 రోజులపాటు కలుసుకోకుండా చూడటం ద్వారా వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చంది. కాగా, కోవిడ్ తీవ్రత కట్టడి వ్యూహాలను సమన్వయం చేసుకునేందుకు నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ఆధ్వర్యంలో ఎంపవర్డ్ గ్రూప్–3 సోమవారం లక్షమందికి పైగా పౌర సంస్థల సభ్యులతో సమావేశమైంది. ఇంట్లోనూ మాస్క్ ఎందుకు? ప్రజలు ఇళ్లలో ఉన్న సమయంలోనూ మాస్క్‌లు ధరించాల్సిన సమయం వచ్చింది. గాలి ద్వారా ఈ వైరస్ సోకుతుందని రుజువైనందున.. ఇప్పటి వరకు బయటకు వెళ్లినప్పుడు మాత్రమే మాస్క్ ధరించాలని చెప్పాం. ప్రస్తుతం వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ఇంట్లో ఉన్నప్పుడు మాస్క్ ధరించాలని కోరుతున్నాం. ఇంట్లో ఇతరులతో కలిసి కూర్చున్నప్పుడు మాస్క్ ధరిస్తే వైరస్ వ్యాప్తి చెందదు. ఇంటికి అతిథులను ఆహ్వానించవద్దు. పాజిటివ్‌గా తేలిన వారు ఆస్పత్రుల్లోనే చేరాల్సిన అవసరం లేదు. వారిని వేరుగా గదిలో ఉంచవచ్చు. వారి ద్వారా ఇతర కుటుంబసభ్యులకు వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో వసతులు లేకుంటే ఐసోలేషన్ కేం ద్రాలకు వెళ్లవచ్చు. -
తిరుపతి, రేణిగుంట మీదుగా 45 ప్రత్యేక రైళ్లు
సాక్షి , న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో తిరుపతి, రేణిగుంటలను దేశంలోని వివిధ ప్రాంతాలకు కలిపేలా 45 ప్రత్యేక రైళ్లు (డైలీ, నాన్‌డైలీ) నడపుతున్నట్లు కేంద్రం తెలిపింది. ఇవి కాకుండా తిరుమల, తిరుపతి దర్శనానికి ఐఆర్సీటీసీ రైలు, రోడ్డు, విమానాల ద్వారా టూర్ ప్యాకేజీలు నిర్వహిస్తోందని వైఎస్సార్సీపీ సభ్యులు గొడ్డేటి మాధవి, విుథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ బుధవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. కొత్త ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రతిపాదన లేదు దేశవ్యాప్తంగా ఎక్కడా కొత్త ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ప్రతిపాదన లేదని కేంద్రం పేర్కొంది. గడిచిన ఐదేళ్లలో దేశంలో ఎక్కడా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదని వైఎస్సార్సీపీ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద నాయక్ లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీలో 13, తెలంగాణలో 30 డిజిటల్ విలేజ్ పథకంలో భాగంగా ఏపీలో 13, తెలంగాణలో 30 గ్రామాలు గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. వైఎస్సార్సీపీ సభ్యుడు వైఎస్ అవినాష్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఐటీశాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఏపీకి 20,28,899 ఇళ్లు మంజూరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన (అర్బన్) కింద, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 20,28,899 ఇళ్లు మంజూరు చేశామని, ఈ ఏడాది మార్చి 1వ తేదీ నాటికి 3,60,325 ఇళ్ల నిర్మాణం పూర్తయిందని కేంద్రం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం కోసం రూ.89,377 కోట్ల పెట్టుబడిలో కేంద్ర వాటా రూ.30,731 కోట్లుగా ఉందని, అందులో ఇప్పటి వరకు కేంద్ర వాటా రూ.9,311 కోట్లు విడుదల చేశామని రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఉడాన్‌లో సాగర్, ప్రకాశం బ్యారేజీలు ఉడాన్ పథకంలో భాగంగా వాటర్ ఏరో డ్రోమ్ నిర్మాణానికి నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజీలను గుర్తించినట్లు కేంద్రం వెల్లడించింది. టీఆర్ఎస్ ఎంపీ బండ ప్రకాశ్ ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్సింగ్ పూరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. -
హైదరాబాద్ వరకు హైస్పీడ్ కారిడార్
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఏడు నూతన హైస్పీడ్ రైల్ కారిడార్లను ఎంపిక చేసినట్లు కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. అందులో ముంబై నుంచి పుణే మీదుగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ వరకు ఈ హైస్పీడ్ కారిడార్‌ను ఎంపిక చేశామని లోక్‌సభలో ఎంపీ జ్ఞానతి రవియం అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఎంపిక చేసిన ఏడు నూతన హై స్పీడ్ రైల్ కారిడార్ల సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు భారతీయ రైల్వేకు బాధ్యతలు అప్పగించామని, అయితే ఇప్పటివరకు ఏ కారిడార్ డీపీఆర్ పూర్తి కాలేదని కేంద్ర మంత్రి వెల్లడించారు. డీపీఆర్‌లోని అంశాల ఆధారంగా ఒక్కో కారిడార్‌కు ఆమోదం తెలుపుతామని మంత్రి స్పష్టం చేశారు. దేశంలో మరో 8 సైనిక్ స్కూళ్లు.. దేశంలో మొత్తం 33 సైనిక్ స్కూళ్లు ఉన్నాయని, మరో 8 సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ తెలిపారు. తెలంగాణలో ఇప్పటివరకు ఒక్క సైనిక్ స్కూల్ లేకపోవడంతో, వరంగల్ జిల్లాలో సైనిక్ స్కూల్ ఏర్పాటుకు రక్షణ శాఖ 2017 మార్చి 2న సూత్రప్రాయ ఆమోదం తెలిపి, ఒప్పందం చేసుకుందని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని ఎంపీలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, రంజిత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. -
ఏపీ అనుకూలం.. పెట్టుబడులు పెట్టండి
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సువిశాలమైన తీర ప్రాంతముందని.. పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతమని కేంద్ర రైల్వే, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. పెట్టుబడులు పెట్టి ఏపీలోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. మారిటైమ్ ఇండియా సమ్మిట్–2021లో భాగంగా ‘ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అవకాశాలు’ అనే అంశంపై బుధవారం జరిగిన సదస్సులో పీయూష్ గోయల్ వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రహదారులు, రైళ్లు, పోర్టుల్లో మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు పారిశ్రామిక పార్కులు నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే సరుకు రవాణా వ్యయం తగ్గించేందుకు.. ఏపీలో ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లను కూడా నిర్మిస్తున్నామని వివరించారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పారిశ్రామికవేత్తలకు ఆయన సూచించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. రాష్ట్ర పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్ మాట్లాడుతూ.. పెట్టుబడులకు అవసరమైన సహజసిద్ధమైన వనరులన్నీ ఏపీలో అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల ద్వారా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. క్రూజ్ టూరిజం ద్వారా ఈ రేవులను అనుసంధానం చేస్తామన్నారు. సదస్సులో విశాఖ పోర్టు ట్రస్ట్ చైర్మన్ కె.రామ్మోహనరావు, ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఆధునిక రైళ్లు.. పూర్తి వివరాలు
సాక్షి, న్యూఢిల్లీ: పెట్టుబడులను ఆకర్షించడానికి 150కిపైగా మార్గాల్లో పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ)లో ఆధునిక రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ నవంబర్ 2020లో ప్రతిపాదనలు చేసిందని కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. బీజేపీ సభ్యుడు సతీశ్‌చంద్ర దూబే ప్రశ్నకు ఆయన శుక్రవారం రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 12 క్లస్టర్లలో పీపీపీ పద్ధతిలో నడిచే రైళ్లు ఎంపిక చేశామన్నారు. సికింద్రాబాద్ తదితర క్లస్టర్లలో తెలుగు రాష్ట్రాలోని పలు ప్రాంతాల మీదుగా పీపీపీ పద్ధతిలో 25 మార్గాల్లో 50 ఆధునిక రైళ్ల సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. -
కరోనా కల్లోలంలోనూ ఎఫ్‌డీఐల జోరు..!
న్యూఢిల్లీ: భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ)జోరు కొనసాగుతోందని వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ పేర్కొన్నారు. విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షించేలా తమ ప్రభుత్వ విధానాలు ఉన్నాయని వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి ఎఫ్‌డీఐలు 13% వృద్ధితో 4,000 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం నెలకొన్నా, మ న దేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం ఆ గలేదని వ్యాఖ్యానించారు. ఇక్కడ సీఐఐ నిర్వహిం చిన భాగస్వామ్య సదస్సులో ఆయన మాట్లాడారు. పూర్తి సహకారం.. భారత్‌లో వివిధ రంగాల్లో అవకాశాలు అపారంగా ఉన్నాయని, ఇక్కడ ఇన్వెస్ట్ చేయాల్సిందిగా విదేశీ ఇ న్వెస్టర్లను గోయెల్ ఆహ్వానించారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సాదరంగా ఆహ్వానిస్తున్నామని, పూర్తి సహకారం అందిస్తామన్నారు. మరిన్ని సంస్కరణలు... భారత్ మరిన్ని ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలని ఈ సమావేశంలో పాల్గొన్న ఫిన్లాండ్ విదేశీ వాణిజ్య మంత్రి విల్లె టపియో స్కిన్నారి వ్యాఖ్యానించారు. యూరోపియన్ యూనియన్, భారత్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సాకారం కావడం కోసం ఒక గడువును నిర్దేశించుకోవాలని పేర్కొన్నారు. ఈ ఒప్పందం విషయమై వీలైనంత త్వరగా సంప్రదింపులు పూర్తి చేయాలని సూచించారు. ఈ ఒప్పందం విషయమై 2013 నుంచి ప్రతిష్టంభన నెలకొన్నది. తొమ్మిది రంగాల్లో నిషేధం అన్ని రంగాల్లో ఆటోమేటిక్ మార్గంలో వంద శాతం ఎఫ్‌డీఐలను అనుమతిస్తున్నామని గోయెల్ పేర్కొన్నారు. టెలికం, మీడియా, ఫార్మా, బీమా, రంగాల్లో విదేశీ పెట్టుబడులకు ప్రభుత్వ ఆమోదం అవసరమని వివరించారు. లాటరీ వ్యాపారం, గ్యాంబ్లింగ్, బెట్టింగ్, చిట్ ఫండ్స్, నిధి కంపెనీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, పొగాకు ఉపయోగించే సిగరెట్లు, సిగార్లు తయారు చేసే వ్యాపారాలు... వీటిల్లో ఎఫ్‌డీఐలపై నిషేధం ఉందని వివరించారు. -
రైతన్నలూ.. చర్చలకు రండి
సాక్షి, న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతు సంఘాల నేతలతో తదుపరి చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. రాతపూర్వకంగా ఇస్తామన్న హామీలను పరిశీలించాలని కోరారు. చర్చల తేదీని వారే నిర్ణయించవచ్చని అన్నారు. వ్యవసాయ చట్టాల్లోని కొన్ని నిబంధనలను సవరిస్తామంటూ ప్రభుత్వం ఇచ్చిన హామీని తిరస్కరిస్తూ రైతు సంఘాలు తదుపరి ఆందోళనకు కార్యాచరణ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తోమర్ గురువారం ఢిల్లీలో రైల్వే, ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయెల్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘‘రైతులకు అభ్యంతరాలు ఉంటే కొత్త చట్టాల్లో ఏవైనా నిబంధనలను విశాల దృక్పథంతో పరిశీలించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతుల అనుమానాలను నివృత్తి చేస్తాం. వారి సమస్యలను పరిష్కరించడానికి రైతు సంఘాల నాయకుల సలహాల కోసం ఎదురుచూస్తున్నాం. కానీ, కొత్త చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌తో వారు మళ్లీ మొదటికొస్తున్నారు’’ అని తోమర్ వ్యాఖ్యానించారు. చట్టాలను పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్‌ను తోసిపుచ్చారు. ‘‘తీవ్రమైన చలి వాతావరణంలో, కోవిడ్ మహమ్మారి వ్యాప్తి సమయంలో రైతులు నిరసన వ్యక్తం చేస్తుండడం పట్ల ఆందోళన చెందుతున్నాం. ప్రభుత్వ ప్రతిపాదనను రైతు సంఘాలు పరిగణనలోకి తీసుకోవాలి’’ అని తోమర్ చెప్పారు. సమస్య పరిష్కారంపై తాను అశాభావంతో ఉన్నానన్నారు. చర్చలు పురోగతిలో ఉండగానే రైతు సంఘాలు తదుపరి దశ పోరాట కార్యాచరణను ప్రకటించడం సరైంది కాదని తోమర్ ఆక్షేపించారు. కొత్త చట్టాలతో ఎంఎస్పీకి ఢోకా లేదు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) అమలు కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది. దీనిపై రాతపూర్వక హామీ ఇస్తామని బుధవారం ప్రతిపాదించింది. అయితే, ఈ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. రైతుల భయాందోళనలు తొలగించడానికి కనీసం 7 సమస్యలపై అవసరమైన సవరణలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. వీటికి రైతు సంఘాలు ససేమిరా అనడంతో చర్చలకు విఘాతం ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు తదుపరి చర్చలకు పిలుపునిచ్చారు. కొత్త చట్టాలు ఎంఎస్పీని ప్రభావితం చేయవని, పైగా రక్షణగా ఉంటుందని పీయూష్ గోయెల్ అన్నారు. రైతులు తమ ఉత్పత్తులను ప్రైవేట్ మార్కెట్లలో విక్రయించడానికి అదనపు ఎంపికను మాత్రమే ఈ చట్టం ఇస్తుందని వివరించారు. సివిల్ కోర్టుల్లో అప్పీల్ చేసుకోవచ్చు రైతుల అభ్యంతరాలపై ప్రభుత్వం ముసాయిదా ప్రతిపాదనను పంపుతుందని 13 యూనియన్ నాయకులతో మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో హోం మంత్రి అమిత్ షా చెప్పగా.. ఈ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాల నేతలు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం జరగాల్సిన చర్చలు రద్దయ్యాయి. కొత్త చట్టాల తరువాత వ్యవసాయ మార్కెట్లు బలహీనపడతాయన్న రైతుల ఆందోళనకు పరిష్కారంగా.. సవరణలు చేయవచ్చని, రాష్ట్ర ప్రభుత్వాలు మండీల వెలుపల పనిచేసే వ్యాపారులను నమోదు చేయవచ్చని కేంద్రం ప్రతిపాదించిందని తాజాగా మంత్రులు గుర్తుచేశారు. రాష్ట్రాలు వాటిపై కూడా ఏపీఎంసీ మండీల తరహాలో పన్ను, సెస్ విధించవచ్చని వివరించారు. వివాదాల పరిష్కారం కోసం సివిల్ కోర్టుల్లో అప్పీల్ చేసే హక్కు రైతులకు లభించకపోవడాన్ని రైతులు ప్రశ్నిస్తున్నారు. అందుకే సివిల్ కోర్టుల్లో అప్పీల్ చేయడానికి వీలుగా నిబంధనల్లో సవరణలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రులు చెప్పారు. కార్పొరేట్ సంస్థలు సాగు భూములను స్వాధీనం చేసుకుంటాయన్న భయాన్ని తొలగించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ కింద సాగు భూములను అటాచ్ చేయడంపై ఇంకా స్పష్టత ఇస్తామన్నారు. ప్రస్తుత కనీస మద్దతు ధర అమలు ప్రక్రియ కొనసాగుతుందని లిఖితపూర్వక హామీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమేనన్నారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలన్న డిమాండ్లపై స్పందిస్తూ.. రైతుల విషయంలో ప్రస్తుత విద్యుత్ బిల్లు చెల్లింపు విధానంలో ఎటువంటి మార్పు ఉండదని మంత్రులు వెల్లడించారు. రైతుల వెనుక ఎవరున్నారో తేల్చండి ఢిల్లీలో ఆందోళన కొనసాగిస్తున్న రైతుల వెనుక ఏయే శక్తుల ఉన్నాయో నిగ్గు తేల్చాలని నరేంద్ర సింగ్ తోమర్, పీయూస్ గోయెల్ ప్రసార మాధ్యమాలను కోరారు. ‘‘మీడియా కళ్లు చురుగ్గా ఉంటాయి. మీ దర్యాప్తు నైపుణ్యాలను ఉపయోగించండి. రైతుల ఆందోళన వెనుక ఉన్న శక్తులు ఏమిటో బయటపెట్టండి. చర్చల కోసం రైతులు ముందుకు రాకుండా వెనక్కి లాగుతున్న అంశమేమిటో గుర్తించండి’’ అని పేర్కొన్నారు. కార్పొరేట్ల కోసమే.. కొత్త చట్టాలను రైతులు స్వాగతిస్తున్నారంటూ వ్యవసాయ మంత్రి తోమర్ చేసిన ప్రకటనను అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి (ఏఐకేఎస్‌సీసీ) తప్పుపట్టింది. ఈ చట్టాల విషయంలో కేంద్ర మంత్రులు తప్పుడు వాదనలు వినిపిస్తున్నారని, బహిరంగంగా అసత్యాలు వల్లెవేస్తున్నారని విమర్శించింది. బడా కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసమే కొత్త చట్టాలు తెచ్చారని ఆరోపించింది. ఈ విషయాన్ని సామాన్య ప్రజలు సైతం అర్థం చేసుకుని రైతుల పోరాటానికి మద్దతు ఇస్తున్నారని గుర్తుచేసింది. 14 రోజుల్లో 15 మంది.. చండీగఢ్: సాగు చట్టాలపై ఢిల్లీలో, నగర శివార్లలో 14 రోజులుగా ఉద్యమిస్తున్న రైతుల్లో 15 మంది వేర్వేరు కారణాలతో ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను సహచర రైతులు పంజాబ్‌లోని స్వస్థలాలకు చేరుస్తున్నారు. ప్రతి రోజూ ఒక్క మృతదేహమైనా ఢిల్లీ నుంచి పంజాబ్‌కు చేరుకుంటోందని వారు చెప్పారు. రోడ్డు ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు. గుండెపోటుతో 10 మంది రైతన్నలు తనువు చాలించారు. చలిని తట్టుకోలేక మరో రైతు మరణించాడు. మృతుల్లో మహిళలూ ఉన్నారు. రైలు పట్టాలపై పోరాటం! సా గుచట్టాలను తక్షణమే రద్దు చేయాలనే తమ డిమాండ్‌ను నెరవేర్చకపోతే ఇకపై దేశవ్యాప్తంగా రైలు పట్టాలపై పోరాటం సాగిస్తామని హెచ్చరించారు. ఈ ఉద్యమ కార్యాచరణ తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. సింఘు వద్ద ఆందోళన కొనసాగిస్తున్న రైతులు గురువారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం దిగి రాకపోతే ఢిల్లీకి దారితీసే అన్ని ప్రధాన రహదారులను దిగ్బంధిస్తామని పేర్కొన్నారు. సర్కారు మొండి వైఖరి అవలంబిస్తే రైల్వే ట్రాక్‌లపై పోరాటం తప్పదని, ఇది పంజాబ్, హరియాణాల్లోనే కాదు, దేశమంతటా జరుగుతుందని రైతు సంఘం నాయకుడు బూటా సింగ్ స్పష్టం చేశారు. -
మైనస్‌లోనే కొనసాగుతున్న ఎగుమతులు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు వరుసగా రెండవనెలా నవంబర్లోనూ క్షీణతనే నమోదుచేశాయి. 2019 ఇదే నెలతో పోల్చి 2020 నవంబర్‌లో 9 శాతం పడిపోయి 23.43 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక దిగుమతులూ ఇదే నెలలో 13.33 శాతం పడిపోయి 33.39 బిలియన్ డాలర్లకు తగ్గాయి. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య వాణిజ్యలోటు 9.96 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. నిజానికి మార్చి నుంచి ఆగస్టు వరకూ వరుసగా ఆరు నెలలు క్షీణ బాటన పయనించిన ఎగుమతుల విలువ సెప్టెంబర్‌లో తిరిగి వృద్ధి బాటకు మళ్లింది. 5.99 శాతం వృద్ధితో 27.58 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. అయితే ఆ మరుసటి నెల– అక్టోబర్‌లోనే తిరిగి పతనం నమోదయ్యింది. ఇప్పుడు వరుసగా రెండవనెల– నవంబర్లోనూ క్షీణతే నమోదుచేసుకోవడం గమనార్హం. ఎనిమిది నెలల్లో 18 శాతం క్షీణత ఇక 2020–21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలాన్ని చూస్తే, ఎగుమతులు 173.49 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంలో ఈ పరిమాణం 211 బిలియన్ డాలర్లు. అంటే 18 శాతం క్షీణత నమోదయ్యిందన్నమాట. ఇక ఇదే ఎనిమిది నెలల సమయంలో దిగుమతులు 33.56 శాతం పడిపోయి 215.67 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ట్రిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాలకు చేరుతాం: కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ ఆశాభావం కాగా, భారత్æ ఎగుమతులు 2025 నాటికి ట్రిలియన్ డాలర్ల (1000 బిలియన్ డాలర్లు– డాలర్ మారకంలో రూపాయి విలువ స్థిరంగా 75 చొప్పున చూస్తే, రూ.75,00,000 కోట్లు) లక్ష్యాన్ని చేరుకుంటాయన్న విశ్వాసాన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయెల్ వ్యక్తంచేశారు. ఇందుకు అన్ని అవకాశాలూ ఉన్నాయని బుధవారం జరిగిన ట్రేడ్ బోర్డ్ సమావేశంలో అన్నారు. ‘‘కోవిడ్–19 ప్రతికూల పరిస్థితుల నుంచి దేశం వేగంగా రికవరీ అవుతోంది. పారిశ్రామిక రంగం సవాళ్లను తట్టుకుని నిలబడగలుగుతోంది. అంతర్జాతీయంగా సప్రై చైన్స్ భారత్ వైపు చూస్తున్నాయి. భారత్ పురోగతి దిశలో ఇది ఎంతో ప్రోత్సాహకర అంశం’’ అని ఆయన అన్నారు. భారత్ ప్రయోజనం పొందేందుకు వీలుగా ప్రోత్సాహం అందించాల్సిన వివిధ రంగాలను ప్రభుత్వం గుర్తిస్తోందని కూడా ఆయన ఈ సందర్భంగా తెలిపారు. చక్కటి ప్రతిభ కనబరచడానికి వీలున్న 24 పారిశ్రామిక రంగాలను ఇప్పటికే గుర్తించడం జరిగిందన్నారు. -
రైతులతో కొలిక్కిరాని చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలు సహా రైతులు లేవనెత్తిన అన్ని అంశాల అధ్యయనానికి కమిటీని ఏర్పాటు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ సూచనను రైతు సంఘాలు తోసిపుచ్చాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం ముగ్గురు సీనియర్ కేంద్ర మంత్రులతో 35 రైతు సంఘాల ప్రతినిధులు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కమిటీ ఏర్పాటు చేస్తామన్న సూచనను కేంద్ర మంత్రులు ముందుకు తెచ్చారు. కానీ, ఆ ప్రతిపాదనను రైతు సంఘాలు తిరస్కరించాయి. రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమొక్కటే తమ నిరసనను ముగించేందుకు ఏకైక మార్గమని తేల్చి చెప్పాయి. దాంతో, ఎలాంటి పురోగతి లేకుండానే చర్చలు ముగిశాయి. మరో విడత చర్చలు గురువారం జరగనున్నాయి. కొత్త సాగు చట్టాల వల్ల కనీస మద్దతు ధర వ్యవస్థ రద్దయిపోతుందని, కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలపై రైతులు ఆధారపడే పరిస్థితి వస్తుందన్న రైతుల ఆందోళనను సంఘాల ప్రతినిధులు కేంద్ర మంత్రులకు వివరించారు. ఈ చర్చల్లో కేంద్రం తరఫున వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, రైల్వే, కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రి పీయూష్ గోయల్, వాణిజ్య శాఖ సహాయమంత్రి సోమ్ ప్రకాశ్ పాల్గొన్నారు. సోమ్‌ప్రకాశ్ పంజాబ్‌కు చెందిన ఎంపీ. కొత్త చట్టాల్లోని అభ్యంతరకర అంశాలను తమ ముందుకు తీసుకు రావాలని కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గోయల్ ప్రతిపాదించారు. చర్చల కోసం చిన్న బృందంతో కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించారు. అందులో ఆరుగురు రైతు సంఘాల ప్రతినిధులు, వ్యవసాయ రంగ నిపుణులు, ప్రభుత్వ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారన్నారు. ఈ ప్రతిపాదనతో రైతు సంఘాల నేతలు విభేదించారు. 35కు పైగా ఉన్న రైతు సంఘాల ప్రతినిధులను ఆరుగురికి కుదించడం ద్వారా రైతు సంఘాల ఐక్యతను ప్రభుత్వం విచ్చిన్నం చేసే ప్రయత్నం చేస్తోందని రైతు సంఘాల నాయకులు ఆరోపించారు. ‘చిన్న కమిటీని ఏర్పాటు చేసేందుకు వీలుగా 5 నుంచి 7 మంది సభ్యుల పేర్లను సూచించాలని మంత్రులు కోరారు. ఆ ప్రతిపాదనను మేం తిరస్కరించాం’ అని భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత బల్దేవ్ సింగ్ తెలిపారు. మరోసారి గురువారం చర్చలు జరుగుతాయని నరేంద్ర సింగ్ తోమర్ మీడియాకు వెల్లడించారు. సాగు చట్టాలపై అభ్యంతరాలను స్పష్టంగా చెబితే చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారికి చెప్పామన్నారు. భారతీయ కిసాన్ యూనియన్ నేతలతో ప్రత్యేకంగా ఎందుకు చర్చలు జరుపుతున్నారన్న ప్రశ్నకు.. చర్చలకు వారు ముందుకు వచ్చారని, ఎవరు వచ్చినా చర్చలు జరుపుతామని తోమర్ జవాబిచ్చారు. మూడు సాగు చట్టాల్లోని తమ అభ్యంతరాలను ప్రత్యేకంగా గుర్తించి, వాటితో గురువారం నాటి చర్చలకు రావాలని రైతు సంఘాల ప్రతినిధులకు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో సూచించింది. మరోవైపు, ఢిల్లీ శివార్లలోని సింఘు, టిక్రీల్లో రైతుల శాంతియుత నిరసన కొనసాగుతోంది. ఘాజీపూర్ శివార్ల వద్ద జరుగుతున్న ఆందోళనల్లో రైతుల సంఖ్య భారీగా పెరింది. లిఖితపూర్వక హామీ ఇవ్వండి కనీస మద్దతు ధర(ఎమ్ఎస్పీ) వ్యవస్థ కొనసాగుతుందని రైతులకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని హరియాణా బీజేపీ అధికార కూటమిలోని పార్టీ ‘జన నాయక జనతా పార్టీ(జేజేపీ)’ కేంద్రానికి సూచించింది. ఎమ్ఎస్పీ కొనసాగుతుందని ప్రధాని మోదీ, వ్యవసాయ మంత్రి తోమర్ పదేపదే చెబుతున్నారని, అదే విషయాన్ని లిఖితపూర్వకంగా ఇస్తే బావుంటుందని జేజేపీ అధ్యక్షుడు అజయ్ సింగ్ చౌతాలా పేర్కొన్నారు. మరోవైపు, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపిస్తూ హరియాణా ప్రభుత్వానికి స్వతంత్ర ఎమ్మెల్యే సోంబిర్ సాంగ్వన్ మద్దతు ఉపసంహరించారు. రైతులను బాధిస్తోందని ఆయన ఆరోపించారు. -
ఎగుమతులకు 12 రంగాల ఎంపిక
న్యూఢిల్లీ: దేశీయ అవసరాలను స్థానికం గానే తీర్చుకోవడంతోపాటు (స్వీయ సమృద్ధి), ఎగుమతులకు అవకాశమున్న 12 రంగాలను ఎంపిక చేసినట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ తెలిపారు. భారత్‌లో తయారీ కార్యక్రమం కింద ఈ 12 రంగాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. భారత్ తన అవసరాలకు తనపైనే ఆధారపడడం వల్ల నాణ్యమైన ఉత్పత్తులను పెద్ద ఎత్తున తయారు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఆహార శుద్ధి, సహజ సాగు, ఐరన్, అల్యూమినియం, కాపర్, ఆగ్రో కెమికల్స్, ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ మెషినరీ, ఫర్నిచర్, లెదర్ అండ్ షూ, ఆటో విడిభాగాలు, టెక్స్టైల్స్, కవరాల్స్, మాస్క్‌లు, శానిటైజర్లు, వెంటిలేటర్ల విషయంలో భారత్ అంతర్జాతీయ సరఫరాదారుగా అవతరించగలదని మంత్రి చెప్పారు. ఈ రంగాల్లో భారత్ పోటీ పడగలదని, ఇతర దేశాలతో పలిస్తే మన దేశానికి సానుకూలతలు ఉన్నట్టు పేర్కొన్నారు. నేడు బ్యాంకర్లతో ఆర్థిక మంత్రి సమావేశం ప్యాకేజీలోని పథకాల అమలుపై చర్చ న్యూఢిల్లీ: దేశీ ప్రభుత్వ రంగ బ్యాంకు (పీఎస్‌యూ)ల చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు (శుక్రవారం) సమావేశంకానున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రూ. 21 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా అమలుకానున్న పలు పథకాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా జరిగే ఈ మీటింగ్‌లో రుణాల జారీ, తగ్గిన వడ్డీ రేట్ల ప్రయోజనం బదలాయింపు, మారటోరియం వంటి పలు ఇతరాత్ర అంశాలపై చర్చించనున్నారు. -
అనేకచోట్ల టికెట్ బుకింగ్ కౌంటర్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న 1.7 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లలో శుక్రవారం నుంచి రైలు టికెట్ల బుకింగ్ పునఃప్రారంభం కానుందని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ప్రకటించారు. ఇందులో భాగంగా కంప్యూటర్లు, ఇంటర్నెట్ సరిగ్గా అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లోనూ కామన్ సర్వీస్ సెంటర్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రత్యేకంగా గుర్తించిన మరికొన్ని రైల్వే స్టేషన్లలోనూ రెండు, మూడు రోజుల్లో టికెట్ బుకింగ్ కౌంటర్లు ప్రారంభం కానున్నాయన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కౌంటర్ల వద్ద జనం గుమికూడరాదన్నదే తమ లక్ష్యమని, ఇందుకు అవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. త్వరలోనే మరిన్ని రైళ్లను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. జూన్ 1వ తేదీ నుంచి నడిచే 200 ఏసీ, నాన్ ఏసీ రైళ్ల కోసం గురువారం బుకింగ్స్ ప్రారంభమైన రెండున్నర గంటల్లోనే 4 లక్షల మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి దాకా 2,050 శ్రామిక్ రైళ్ల ద్వారా 30 లక్షల మంది వలస కార్మికులను స్వస్థలాలకు తరలించినట్లు తెలిపారు. శ్రామిక్ రైళ్ల విషయంలో పశ్చిమబెంగాల్, జార్ఖండ్ ప్రభుత్వాలు సహకరించడం లేదని ఆరోపించారు. అన్ని రాష్ట్రాలు తమ కార్మికులు సొంతూళ్లకు చేరుకునేందుకు సహకరించాలన్నారు. రైల్వే శాఖ ఇప్పటిదాకా 225 స్టేషన్లలో ఉన్న 5 వేల బోగీలను కోవిడ్–19 కేర్ సెంటర్లుగా మార్చిందని తెలిపారు. -
విమాన టికెట్ ధరలకు పోటీగా..
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఏసీ మొదటి, రెండో తరగతి వెయిటింగ్ లిస్ట్ 50కు మించి ఉంది. తత్కాల్లో కూడా టికెట్లు లభించక ప్రయాణికులు ఉసూరుమన్నారు. కిక్కిరిసి ఆ రైలు ఢిల్లీకి పరుగుపెట్టింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ మీదుగా ఢిల్లీ వెళ్లే రాజధాని ఎక్స్‌ప్రెస్ హైదరాబాద్ వచ్చింది. ఫస్ట్ క్లాస్ బోగీలో ఐదుగురు, సెకండ్ క్లాస్ బోగీల్లో 15 మంది ఉన్నారు. మిగతా సీట్లన్నీ ఖాళీ. వెలవెలబోతూ ఈ ప్రీమియం ఎక్స్‌ప్రెస్ ఢిల్లీ బయల్దేరింది. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ దొరకని ప్రయాణికులు ‘రాజధాని’ వైపు ఎందుకు చూడలేదు. ప్రత్యామ్నాయంగా అదేరోజు ఈ ప్రీమియం ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉన్నా.. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్ బుక్ చేసుకునేందుకే ఎందుకు మొగ్గు చూపారు. ఎందుకంటే ఆదాయ వేటలో రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాలే కారణం. సాక్షి, హైదరాబాద్: విమానయాన సంస్థలో అమల్లో ఉన్న డైనమిక్ ఫేర్ విధానాన్ని ప్రారంభించిన రైల్వే శాఖ ఇప్పుడు చేతులు కాల్చుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డిమాండ్‌ను బట్టి టికెట్ ధరను సవరించటమే ఈ విధానం. ఎక్కువ డిమాండ్ ఉన్న రోజులు, అప్పటికప్పుడు బుక్ చేసుకున్న సందర్భంలో టికెట్ ధర అమాంతం పెరుగుతుంది. ఇంతకాలం పట్టించుకోకుండా మొండిగా ముందుకెళ్లాలన్న ఆ శాఖ ఇప్పుడు ఈ విధానాన్ని పునఃసమీక్షించుకోవాలని చూస్తోంది. ఇటీవల రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ హైదరాబాద్ పర్యటనలో ఈ అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఆయన దాన్ని సమీక్షించేందుకు ఢిల్లీలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని హైదరాబాద్ నుంచే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదీ సంగతి.. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి డిమాండ్ లేని సాధారణ రోజుల్లో అడ్వాన్సుగా టికెట్ బుక్ చేసుకుంటే విమాన చార్జీ రూ.4 వేల లోపు ఉంటుంది. అప్పటికప్పుడు బుక్ చేసుకుంటే రూ.ఐదున్నర వేల నుంచి మొదలవుతుంది. రాజధాని, శతాబ్ది, దురంతో లాంటి ప్రీమి యం రైళ్లలో మొదటి శ్రేణి, రెండో శ్రేణి టికెట్ ధర కూడా విమాన టికెట్‌కు దగ్గరగా ఉంటోంది. కొన్ని సందర్భాల్లో ఎక్కువే. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో సెకండ్ ఏసీ ధర (డైనమిక్‌లో నిలకడ ఉండదు) దాదాపు రూ.4,800 ఉంటోంది. కొన్నిమార్లు రూ.5 వేలు మించుతోంది. పీక్ డిమాండ్‌లో ఫస్ట్‌క్లాస్ చార్జి రూ.7 వేలు పలుకుతోంది. ఈ రైలు ప్రయాణ సమయం 22 గంటలు. అంత చార్జి భరించి ఇన్ని గంటలు ప్రయాణించే బదులు, అంతే చార్జి ఉండే విమానంలో 2 గంటల్లో వెళ్లిపోవచ్చు. దీంతో డబ్బున్న వాళ్లు, విమానాల వైపు, సాధారణ ప్రజలు మరో రైలువైపు చూస్తున్నారు. ఇలా రైల్వేకు భారీ నష్టం వాటిల్లుతోంది. రైలు నిర్వహణ ఖర్చులు యథావిధిగా ఉంటుం డగా, టికెట్ ఆదాయం నామమాత్రంగా ఉంటోంది.ఆ రైలు వల్ల మరో రైలును అదే సమయంలో నడిపే అవకాశం లేక ప్రయాణ అవకాశాన్ని కూడా ప్రయాణికులు కోల్పోవాల్సి వస్తోంది. ఆ విధానాన్ని మార్చాలి.. ఈ సమస్యకు కారణమవుతున్న డైనమిక్ ఫేర్ విధానాన్ని మార్చాలన్న డిమాండ్ పెరుగుతోంది. తాజాగా రైల్వే బోర్డు పరిధిలోని ఆలిండియా రైల్వే ప్యాసింజర్స్ సర్వీస్ కమిటీ సభ్యుడు వెంకటరమణి, రైల్వే ప్యాసింజర్స్ ఎమినిటీస్ కమిటీ సభ్యుడు ప్రేమేందర్‌రెడ్డితో కలసి మంగళవారం రైల్వే మంత్రి పీయూష్ గోయెల్‌తో దీనిపై చర్చించారు. తాము ఈ కేటగిరీ రైళ్ల తీరును అధ్యయనం చేసి వాస్తవాలు గుర్తించామని, ఈ రైళ్లు ఖాళీగా వెళ్లడం వల్ల నష్టం వాటిల్లుతోందని, డైనమిక్ ఫేర్ విధానాన్ని సడలిస్తే ఆ రైళ్లు కూడా నిండుతాయని పేర్కొన్నారు. -
బాబు ‘ప్యాకేజీ లేఖ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నారని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ స్పష్టం చేశారు. ప్యాకేజీకి అంగీకారం తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర సర్కారుకు చంద్రబాబు రాసిన లేఖను ఆయన బయటపెట్టారు. చంద్రబాబే స్వయంగా సంతకం చేసి ఆ లేఖను పంపారని పేర్కొన్నారు. ప్యాకేజీకి అంగీకరిస్తూ 2016 అక్టోబర్ 24న రాసిన లేఖతోపాటు ఎన్డీయే ప్రభుత్వం నుంచి తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చాక కూడా ప్యాకేజీని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 2018 జూలై 5న రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి రాసిన మరో లేఖను కూడా పీయూష్ గోయెల్ మీడియా ముందు పెట్టారు. ప్యాకేజీ కింద రాష్ట్రానికి ఎంత మొత్తం ఇవ్వాలన్నది కూడా రాష్ట్ర ప్రభుత్వమే తమ అధికారుల ద్వారా లెక్కించి, ఆ వివరాలను కేంద్రానికి నివేదించిందని వెల్లడించారు. ప్యాకేజీకి ఒప్పుకుని, ఇప్పుడు ప్రత్యేక హోదా పేరుతో రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారని చంద్రబాబుపై మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయడానికి పీయూష్ గోయెల్ మంగళవారం విజయవాడకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్యాకేజీ కింద రూ.17,500 కోట్లు ఇవ్వాలన్నారు ప్రత్యేక ప్యాకేజీ కింద ఏపీకి ఎన్ని నిధులు ఇవ్వాలన్నది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కాదని.. ప్యాకేజీగా రూ.17,500 కోట్ల ఆర్థిక సహాయం చేయాలని చంద్రబాబే తన రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ద్వారా లెక్కలు వేయించి పంపారని పీయూష్ గోయెల్ చెప్పారు. రాష్ట్రంలో అమలు చేసే పథకాలకు కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులు ఇస్తుంది, ప్రత్యేక హోదా ఉంటే 90 శాతం నిధులను కేటాయిస్తుంది. హోదా ద్వారా 90 శాతం నిధులు రాష్ట్రానికి వస్తే ప్రతిఏటా ఏపీకి రూ.3,500 కోట్లు అదనం వస్తాయని కేంద్రానికి నివేదించారని పేర్కొన్నారు. అవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వివరాలేనని, కావాలంటే లేఖలో చూసుకోవచ్చంటూ ఆ ప్రతులను మీడియాకు విడుదల చేశారు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల అనంతరం ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చే నిధులను రెవెన్యూ లోటు భర్తీ రూపంలో అందజేయాలని కేంద్రం నిర్ణయించిందని గుర్తుచేశారు. ఈ మేరకు ఈశాన్య రాష్ట్రాలు, జమ్ముకశ్మీర్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌కు రెవెన్యూ లోటు భర్తీ కింద నిధులు అందజేస్తుందని చెప్పారు. రెవెన్యూ లోటు భర్తీ రూపంలో రూ.22,113 కోట్లు ఇస్తూనే, ఏపీ అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ కట్టుబడి ఉండడం వల్లే ప్రత్యేక ప్యాకేజీ కింద మరో రూ.17,500 కోట్లు ఇవ్వడానికి ముందుకొచ్చారని వివరించారు. చంద్రబాబుకు సవాల్ విసురుతున్నా.. ప్రత్యేక హోదా అంశంతోపాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, మంజూరు చేసిన సంస్థల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని పీయూష్ గోయల్ తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి మంజూరు నిధుల గురించి అరగంట పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. చంద్రబాబుకు సవాల్ విసురుతున్నానని, బహిరంగ చర్చకు ఆయన ఎప్పుడైనా ఢిల్లీకి రావచ్చని, చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ‘‘ఏపీ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ఏం చేశారో దేశ ప్రజలందరికీ తెలియాలి. బహిరంగ చర్చకు రండి’’ అని పీయూష్ గోయెల్ సవాల్ విసిరారు. రాజధానిలో అంతా అవినీతే.. ఐదేళ్లలో కేంద్ర పన్నులో రాష్ట్ర వాటాగా ఇచ్చే రూ.2.42 లక్షల కోట్లకు తోడు వివిధ అభివృద్ధి కార్యక్రమాల కింద మరో రూ.5 లక్షల కోట్ల విలువైన పనులను కేంద్రం ఆంధ్రప్రదేశ్‌కు మంజూరు చేసిందని పీయూష్ గోయెల్ చెప్పారు. రాజధాని నిర్మాణానికి రూ.3,500 కోట్లు మంజూరు చేసి, అందులో రూ.2,500 కోట్లు విడుదల చేసినప్పటికీ అమరావతిలో ఇప్పటిదాకా ఒక్క శాశ్వత భవన నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవని విమర్శించారు. ఆ డబ్బులు ఏం చేశారో తెలియదన్నారు. రాజధానిలో చిన్న వర్షానికే లీకయ్యే తాత్కాలిక భవనాలను చదరపు అడుగుకు రూ.10 వేలు ఖర్చు పెట్టి నిర్మించారని ఆక్షేపించారు. అంతా అవినీతేనని దుయ్యబట్టారు. విశాఖపట్నంలో కొత్త రైల్వేజోన్‌తో పాటు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీనివల్ల రైల్వేలో తెలుగువారికి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర పథకాలకు బాబు స్టిక్కర్ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏపీ ప్రజలకు ఎంతో చేసిందని, రాష్ట్రంలో చంద్రబాబు ఏం చేశారో ప్రజలకు చెప్పాలని పీయూష్ గోయెల్ డిమాండ్ చేశారు. విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని, కేంద్ర పథకాల పేర్లు మార్చి అవి చంద్రన్న పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర పథకాలకు చంద్రబాబు తన స్టిక్కర్లు వేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇప్పుడు మిగులు విద్యుత్ ఉందంటే.. అది కేంద్రం సహకారం వల్లేనని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి నరేంద్ర మోదీ కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం చేస్తున్న సహాయంపై చంద్రబాబు ప్రభుత్వం, అధికార తెలుగుదేశం పార్టీ అబద్ధపు ప్రచారం సాగిస్తున్నాయని తప్పుపట్టారు. దుగరాజపట్నం పోర్టు బదులు మేజరు పోర్టు నిర్మాణానికి ప్రత్యామ్నాయ స్థలం చూపాలని అడిగితే.. రామాయపట్నంలో మైనర్ పోర్టు నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వమే శంకుస్థాపన చేసుకుని ప్రజలను మోసం చేయాలని చూస్తోందని మండిపడ్డారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం విషయంలో మరో నాటకం మొదలుపెట్టి, శంకుస్థాపన చేశారని అన్నారు. ఇవన్నీ ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేయడానికి ఆడుతున్న డ్రామాలని దుయ్యబట్టారు. ఎన్టీఆర్‌ను కూలదోసిన వారితో దోస్తీనా? బీజేపీతో తెలుగుదేశం పార్టీ కలిసి ఉన్నా లేకున్నా 2019లో కేంద్రంలో మరోసారి నరేంద్ర మోదీ ప్రభుత్వం రాబోతోందని పీయూష్ గోయెల్ చెప్పారు. పార్టీలను మార్చడంలో చంద్రబాబు గత చరిత్రను అందరూ గమనించాలని అన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావును ముఖ్యమంత్రి పదవి నుంచి కూలదోసిన పార్టీతో, అందుకు కారణమైన కుటుంబ వ్యక్తులతోనే ఇప్పుడు చంద్రబాబు దోస్తీ చేస్తూ, కౌగిలింతలు చేసుకుంటున్నారని విమర్శించారు. ఇలాంటివి చంద్రబాబుకు కొత్త కాదన్నారు. వాజ్‌పేయ్‌తో చేతులు కలిపి మోసం చేశారని, మోదీతో జట్టుకట్టి మోసం చేశారని, ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్‌తో జత కలిశారని అన్నారు. అవినీతి, కుటుంబ పాలన సాగిస్తున్న చంద్రబాబును ఈ ఎన్నికల్లో ప్రజలు దూరం పెట్టడం ఖాయమని పేర్కొన్నారు. టీడీపీ రాజకీయ పార్టీ స్థాయి నుంచి ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్థాయికి పడిపోయిందన్నారు. పార్టీ ద్వారా పదవులు సంపాదించుకుంటున్నారని, అవినీతి చేసి లాభాలు పొందుతున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్, బావమరిది బాలకృష్ణ, బావమరిది చిన్న అల్లుడితోపాటు ఆ కుటుంబం నుంచి ఇంకెంత మంది పోటీ చేస్తున్నారో తనకు తెలియదని పీయూష్ గోయెల్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఐటీ, ఈడీ దాడులు జరిగినా చంద్రబాబు భయపడుతున్నారంటే ఆయన ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారో ఊహించుకోవచ్చని చెప్పారు. దేశ భద్రతను కాపాడే ప్రభుత్వం అవసరమని, నరేంద్ర మోదీతోనే ఇది సాధ్యమని పునరుద్ఘాటించారు. ఏపీలో అవినీతి రహిత పాలనకు బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలను కోరారు. ప్రత్యేక ప్యాకేజీ కోసం 2016 అక్టోబర్ 24న అరుణ్ జైట్లీకి సీఎం చంద్రబాబు రాసిన లేఖ ఎన్ని హామీలు అమలు చేశావు బాబూ: కన్నా రాష్ట్రంలో గత ఐదేళ్లలో తాను చేసింది ఏమిటో చెప్పుకోలేక సీఎం చంద్రబాబు రోజూ ఎవరో ఒకరిని తిడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు 600కిపైగా హామీలిచ్చారని, వాటిలో ఎన్ని అమలు చేశారో చెప్పాలన్నారు. చంద్రబాబు తన ప్యాలెస్‌ను హైదరాబాద్‌లో నిర్మించుకొని, ఇంకెవరినో హైదరాబాద్‌లో ఉంటున్నారని విమర్శలు చేస్తున్నారని అన్నారు. పీయూష్ గోయెల్‌తో చర్చకు చంద్రబాబు సిద్ధపడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ ఐవైఆర్ కృష్ణారావు, ఎంపీ గోకరాజు గంగరాజు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మురళీధరన్, సహ ఇన్చార్జి సునీల్ దియోధర్, కేంద్ర సంఘటనా కార్యదర్వి సతీష్జీ, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు, ఎమ్మెల్సీ మాధవ్, దాసరి శ్రీనివాస్, విజయబాబు, తురగా నాగభూషణం, సుధీష్ రాంబొట్ల తదితరులు పాల్గొన్నారు. -
‘జోన్ ఇవ్వడం బాబుకు ఇష్టం లేదేమో’
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై రైల్వే శాఖా మంత్రి పీయూష్ గోయల్ మండిపడ్డారు. ఢిల్లీలో గోయల్ విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేస్తున్న విమర్శలపై తీవ్రంగా స్పందించారు. మా ఉద్దేశాలు ప్రశ్నించే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశాలేంటో బయటకు చెప్పాలని హితవు పలికారు. వారం రోజుల క్రితం కూడా జోన్ ఇవ్వాలంటూ బాబు లేఖ రాశారని.. ఇచ్చిన తర్వాత ఇప్పుడెందుకు ఇలా విమర్శలు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇవ్వనంతకాలం మాపై విష ప్రచారం చేశారని ఆరోపించారు. అసలు విశాఖ జోన్ ఇవ్వడం చంద్రబాబు అండ్ పార్టీకి ఇష్టం లేదేమోనని సందేహం వ్యక్తం చేశారు. అందుకే విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌కు విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా(సౌత్ కోస్ట్)జోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే. -
ద్రవ్యలోటు భయపెడుతోంది..!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు – వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు లెక్కలు ప్రస్తుతానికి ఆందోళన సృష్టిస్తున్నాయి. కేంద్రం మంగళవారం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే... ►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్ – 2019 మార్చి) మధ్య ద్రవ్యలోటు 6.24 లక్షల కోట్లుగా ఉండాలని సంబంధిత బడ్జెట్ నిర్దేశించింది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 3.3 శాతం. ►అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి పీయూష్ గోయెల్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ, 2018–19లో ద్రవ్యలోటు అంచనాలను 6.24 లక్షల కోట్ల నుంచి రూ.6.34 లక్షల కోట్లకు (జీడీపీలో 3.4%) పెంచారు. చిన్న, సన్నకారు రైతుల ఆదాయ పథకానికి ఫండింగ్ వల్ల ద్రవ్యలోటు లక్ష్యాన్ని పెంచాల్సి వచ్చిందని బడ్జెట్లో గోయెల్ తెలిపారు. ►అయితే జనవరి ముగిసే నాటికి (ఆర్థిక సంవత్సరం ఇంకా 2 నెలలు మిగిలి ఉండగానే) లోటు రూ.7.70 లక్షల కోట్లకు చేరింది. అంటే లక్ష్యం (రూ.6.34 లక్షల కోట్లు)లో 100% దాటిపోయి మరో 21.5% (121.5%) పెరిగిందన్నమాట. ►అయితే కేంద్రం మాత్రం ద్రవ్యలోటును సవరిత అంచనాలను (రూ.6.34 లక్షల కోట్లు) ఎంతమాత్రం దాటనివ్వమని స్పష్టం చేస్తోంది. ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లో (ఫిబ్రవరి, మార్చి) కేంద్ర ఖజానాకు రానున్న ఆదాయం లోటును కట్టడి చేస్తుందన్న అభిప్రాయాన్ని ఆర్థికశాఖ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ►2018–19కు సంబంధించి మధ్యంతర బడ్జెట్ సవరించిన అంచనాల ప్రకారం ఆదాయ లక్ష్యం రూ.17.29 లక్షల కోట్లు. అయితే జనవరి నాటికి ఈ వసూళ్లు రూ.11.81 లక్షల కోట్లు. అంటే లక్ష్యంలో 68.3 శాతమన్నమాట. ►అలాగే వ్యయాల మొత్తం రూ.24.57 లక్షల కోట్లయితే జనవరి ముగిసే నాటికి రూ.20.01 లక్షల కోట్లకు చేరింది. అంటే ఈ పరిమాణం వ్యయాలు బడ్జెట్‌తో పోల్చితే 81.5 శాతం. ఆర్బీఐ నిధులపై ఆధారపడక తప్పదా? ద్రవ్యలోటును ఎలా పూడ్చుకోవాలన్న అంశంపై సర్వత్రా ఇప్పుడు చర్చ నెలకొంది. ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు ఆర్బీఐ వద్ద ఉన్న నిధుల్లో మెజారిటీ వాటాను పొందాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆర్బీఐ వద్ద జూన్ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఇందులో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో– డిసెంబర్ 10వ తేదీన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ప్రకటించారు. ఈ నిధుల నిర్వహణను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అంతకుముందు నవంబర్ 19న జరిగిన ఆర్బీఐ బోర్డ్ సమావేశం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా జలాన్ నేతృత్వంలో కమిటీ కూడా ఏర్పాటయ్యింది. ఏప్రిల్‌లో ఈ కమిటీ తన నివేదికను సమర్పించే అవకాశం ఉంది. గతంలోనూ ఆర్బీఐ నిల్వలపై మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి. వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్ (2004), వైహెచ్ మాలేగామ్ (2013) ఈ కమిటీలకు నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12 శాతం వరకూ ఆర్బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, ఉషా థోరట్ కమిటీ దీనిని 18 శాతంగా పేర్కొంది. అయితే, ఆర్బీఐ ఉషా థోరట్ కమిటీ సిఫారసులను తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారుల మేరకు నడుచుకోవాలని నిర్ణయం తీసుకుంది. కాగా, ఆర్బీఐ లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం స్థూల రుణాల్లో 28 శాతం నిష్పత్తిలో ఆర్బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ఆర్థిక ప్రమాణాల ప్రకారం 14 శాతం నిధులు సరిపోతాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ భావిస్తున్నట్లు సమాచారం. -
ఎన్నికల వేళ సంచలనాత్మక బడ్జెట్!
సాక్షి, న్యూఢిల్లీ: ఊహించినట్టుగానే ఎన్నికల వేళ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో నరేంద్రమోదీ సర్కారు పలు ప్రజాకార్షక పథకాలకు పెద్దపీట వేసింది. అన్ని వర్గాల ఓటర్లను ఆకట్టుకునేవిధంగా సంచలనాత్మకరీతిలో మధ్యంతర బడ్జెట్‌ను కేంద్రం ప్రవేశపెట్టింది. తాత్కాలికంగా ఆర్థికమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్న పీయూష్ గోయల్ శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక చిట్టాలో ఆద్యంతం ఓటర్ల మనోభావాలను సంతృప్తి పరిచేలా ప్రతిపాదనలు చేశారు. ఎన్నికల వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఓటర్లపై వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా మధ్యతరగతి వేతనజీవులు, రైతులు, అసంఘటిత రంగ కార్మికులు, అంగన్వాడీ టీచర్లు.. ఇలా అన్ని వర్గాలను ఆకర్షించేవిధంగా.. గోయల్ తన బడ్జెట్లో తాయిలాలు కురిపించారు. నూటికి నూరుశాతం ఎన్నికల బడ్జెట్‌ను తలపించేలా గోయల్ చిట్టాపద్దులు సాగాయి. ఎన్నికల ముందు వేతన జీవులకు మోదీ సర్కారు భారీ ఊరటనిచ్చింది. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని ఏకంగా రెట్టింపు చేస్తూ.. మధ్యతరగతి ఉద్యోగులపై వరాల జల్లు కురిపించింది. ఇప్పటివరకు వార్షికాదాయం రూ. 2.50 లక్షలు దాటితే ఉద్యోగులు పన్ను కట్టాల్సి ఉండగా.. ఇప్పుడు ఆ పరిమితిని ఏకంగా రూ. 5 లక్షలకు పెంచుతూ మోదీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక, అదేవిధంగా గృహరుణాలు, ఇంటి అద్దెలు, ఇన్సురెన్స్‌లు కలిపి 6.50 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్ను ఉండబోదని స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న మూడు కోట్ల మంది మధ్యతరగతి ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఇక, స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేలకు పెంచినట్టు ప్రకటించిన గోయల్.. పొదుపు ఖాతాలపై వచ్చే వడ్డీ 10 వేల నుంచి 40 వేలకు పెంచుతున్నట్టు తెలిపారు. నెలకు 50 వేల జీతం వరకు టీడీఎస్ వర్తించబోదని, సొంతిల్లు అద్దెకు ఇస్తే వచ్చే ఆదాయంపై రూ. 2.50 లక్షల వరకు పన్ను ఉండదని స్పష్టం చేశారు. ఇవన్నీ మధ్యతరగతి ఓటర్లను సంతృప్తిపరిచే నిర్ణయాలే కావడం గమనార్హం. రైతులకు ఆర్థిక చేయూత వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు మోదీ సర్కారు ముందుకొచ్చింది. ఎన్నికల నేపథ్యంలో అన్నదాతలను తమవైపు తిప్పుకునేందుకు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా చిన్నసన్నకారు రైతులకు ఏడాదికి రూ. 6వేల నగద సాయం నేరుగా అందజేస్తామని, ఐదెకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాలకు ఈ నగదును మళ్లిస్తామని గోయల్ తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. ఈ పథకం కోసం రూ. 75 వేల కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు తెలిపారు. మూడు విడతల్లో నగదు అందజేస్తామని, 2018 డిసెంబర్ నుంచి ఈ పథకం అమల్లో ఉంటుందని, తొలి విడతగా రూ.2వేల సాయం తక్షణమే రైతులకు అందజేస్తామని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధం లేకుండా ఈ నగదు నేరుగా రైతుల ఖాతాలోకి మళ్లిస్తామని చెప్పారు. ఈ పథకంతో దేశవ్యాప్తంగా ఉన్న 12 కోట్ల రైతులకు లబ్ధి చేకూరనుంది. ఇక, కిసాన్ క్రెడిట్ కార్డుల కింద రుణాలు అందిస్తామని, రుణాలు సకాలంలో చెల్లించినవారికి రాయితీలు చెల్లిస్తామని పేర్కొంది. ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన రైతుల రుణాల రీషెడ్యూల్ చేస్తామని హామీ ఇచ్చింది. పాడి పరిశ్రమ రుణాలు సకాలంలో చెల్లించే వారికి అదనంగా మూడు శాతం వడ్డీ రాయితీ ఇస్తామని చెప్పారు. అసంఘటిత రంగ కార్మికులకూ భారీ ఊరట.. దేశంలోని అసంఘటితరంగ కార్మికులకూ మోదీ సర్కారు తన మధ్యంతర బడ్జెట్లో భారీ ఊరటనిచ్చింది. ప్రధానమంత్రి శ్రమయోగి బంధన్ పేరుతో అసంఘటిత కార్మికులకు పింఛన్ పథకాన్ని కేంద్రం ప్రకటించింది. 60 ఏళ్లు నిండిన వారందరికీ ప్రతి నెలా రూ.3వేలు పింఛన్ వచ్చే విధంగా ఈ పథకం రూపొందించారు. ఈ పథకంలో భాగంగా నెలకు రూ.100 చొప్పున ప్రీమియం చెల్లిస్తే 60 ఏళ్ల దాటిన తర్వాత రూ.3వేల పింఛన్ పొందవచ్చు. అసంఘటిత రంగంలోని 10 కోట్లమంది కార్మికులకు ఈ పథకం వర్తించనుంది. ఇక ఉపాధి అవకాశాలు మెరుగుపరడటంతో ఈపీఎఫ్‌వో సభ్యులు పెరిగారని, ఈపీఎఫ్‌వో బోనస్ పరిమితిని 21వేలకు పెంచుతున్నట్టు గోయల్ తెలిపారు. గ్రాట్యూటీ పరిధిని 10 లక్షల నుంచి 30 లక్షల పెంచారు. ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు కార్మికులు, ఉద్యోగులకు అందాలని ఈ సందర్భంగా గోయల్ పేర్కొన్నారు. ఎన్పీఎస్ విధానంలో ప్రభుత్వ వాటాను 14 శాతానికి పెంచుతున్నట్టు తెలిపారు. అదేవిధంగా 2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇళ్లు, దేశవ్యాప్తంగా అత్యంత వెనుకబడిన 150 జిల్లాలపై ప్రత్యేక దృష్టి, దేశంలో ప్రస్తుతం 21 ఎయిమ్స్, త్వరలోనే హరియాణలో 22వ ఎయిమ్స్ ఏర్పాటు, అంగన్వాడీ టీచర్ల జీతం 50 శాతం పెంపు, ఈఎస్ఐ పరిధి 15 వేల నుంచి 21 వేలకు పెంపు తదితర ప్రతిపాదనల ద్వారా మధ్యంతర బడ్జెట్లో మోదీ సర్కారు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసినట్టు కనిపిస్తోంది. అయితే, ఇది నూటికి నూరుపాళ్లు ఎన్నికల బడ్జెట్ అని, నాలుగేళ్లు ప్రజాసంక్షేమ పథకాలు అమలు చేయని మోదీ సర్కారు.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే.. ఈ విధంగా అన్నివర్గాల వారికీ తాయిలాలు ప్రకటించిందని, ఇది ఎన్నికల గిమ్మిక్కు అని విపక్షాలు కొట్టిపారేస్తున్నాయి. -
వ్యవసాయం, చిన్న పరిశ్రమల వృద్ధి ఎలా?
న్యూఢిల్లీ: వ్యవసాయం, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల పురోగతికి తీసుకోవాల్సిన చర్యలపై ఆర్థికమంత్రి పియుష్ గోయెల్ దృష్టి సారించారు. ఈ అంశంపై ఆయన ప్రభుత్వ రంగ బ్యాంకుల చీఫ్‌లతో సమావేశమయ్యారు. ఆయా రంగాలకు రుణాల లభ్యత మెరుగుపడేందుకు చర్యలు అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన మద్దతుసహా అవసరమైన సహకారాన్ని అందిం చడానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. మున్ముందు రోజుల్లో ప్రభుత్వ బ్యాంకులు మరింత క్రియాశీలంగా, లాభదాయకంగా రూపొందుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వ్యవసాయం, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమలతో పాటు గృహ రుణాలపై కూడా చర్చ జరిగినట్లు సమావేశం అనంతరం మంత్రి విలేకరులకు తెలిపారు. -
ఈ నెల 3వ వారంలో జైట్లీ తిరిగి బాధ్యతలు!
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రిగా అరుణ్‌జైట్లీ ఈ నెల 3వ వారం నుంచీ తిరిగి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స కారణంగా ఏప్రిల్ ప్రారంభం నుంచీ ఆయన ఆర్థిక శాఖ కార్యాలయానికి రాలేదు. అప్పుడప్పుడూ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ట్వీట్స్ చేస్తున్నప్పటికీ, తాత్కాలికంగా ఆ బాధ్యతలను రైల్వే, బొగ్గు శాఖల మంత్రి పీయూష్ గోయెల్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం జైట్లీ ఆరోగ్యం కోలుకుంటోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. పోర్టిఫోలియో లేనప్పటికీ క్యాబినెట్ మంత్రిగానే ఆయన కొనసాగుతున్నందువల్ల, ఆర్థికశాఖ బాధ్యతలు చేపట్టగానే జైట్లీ తిరిగి పదవీ ప్రమాణం చేయాల్సిన పనిఉండదు. ప్రభుత్వ సూచనల మేరకు ఆర్థిక శాఖను జైట్లీకి కేటాయిస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఒక ఉత్తర్వు జారీ అయితే సరిపోతుందని సంబంధిత వర్గాలు విశ్లేషించాయి. -
మూడు కోట్ల మంది ముందుకొచ్చారు..
సాక్షి, న్యూఢిల్లీ : గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయ పన్ను (ఐటీ) రిటన్స్ దాఖలు చేసిన వారి సంఖ్య రెట్టింపై దాదాపు 3 కోట్లకు పెరిగింది. పరిష్కరించిన రిఫండ్ కేసుల సంఖ్య కూడా 81 శాతం పెరిగి 65 లక్షలకు చేరుకున్నట్టు సమాచారం. ఈ ఏడాది 60 శాతం వరకూ ఆన్లైన్లో రిటన్స్ దాఖలు కాగా వాటి ప్రాసెసింగ్ కూడా ఇప్పటికే చేపట్టినట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. మరోవైపు సామాన్య ప్రజలకు ఊరటగా ఆదాయ పన్ను శాఖ పన్ను రిటన్స్ దాఖలు చేసే తుది గడువును నెల రోజులు పొడిగించింది. ఆగస్టు 31 వరకూ ఐటీ రిటన్స్ దాఖలు చేసేందుకు డెడ్‌లైన్‌గా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) వెల్లడించింది. ఐటీ రిటన్స్ దాఖలు చేసేందుకు తుది గడువును జులై 31 నుంచి ఆగస్ట్ 31 వరకూ పొడిగించిన నేపథ్యంలో పన్ను చెల్లింపులో జాప్యం చేయకుండా చట్టాన్ని గౌరవించే పౌరులుగా సకాలంలో పన్నులు చెల్లించి దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. -
రూపాయిపై తక్షణ జోక్యం ఉండదు
న్యూఢిల్లీ: డాలర్ మారకంలో రూపాయి భారీ పతనం నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయెల్ కీలక ప్రకటన చేశారు. పడిపోతున్న రూపాయిని అడ్డుకోడానికి కేంద్రం తక్షణం చర్యలేవీ తీసుకోదని, ఆ అవసరం కూడా లేదని స్పష్టంచేశారు. అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తరువాత తగిన చర్యలుంటాయని చెప్పారాయన. గురువారం నాడు రూపాయి ఇంట్రాబ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 69.10 కనిష్ట స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. తర్వాత ఆల్‌టైమ్ కనిష్ఠం 68.79 వద్ద ముగిసింది. ద్రవ్యోల్బణం, చమురు ధరలు, వాణిజ్య యుద్ధం భయాలు దీనికి కారణం. అయితే శుక్రవారం కొంత కోలుకుని 68.46 వద్ద ముగిసింది. డాలర్ల భారీ విక్రయాల ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చేసుకున్న జోక్యంతో ఒక దశలో 68.35 స్థాయిని కూడా రూపాయి చూసింది. నాలుగురోజుల్లో రూపాయి బలపడ్డం ఇదే తొలిసారి. ఆరు కరెన్సీల బాస్కెట్ మారకం విలువతో పోల్చి చూసే డాలర్ ఇండెక్స్ ప్రస్తుతం 95 స్థాయికి చేరి కిందకు పడిపోతోంది. ఆ స్థాయిదాటి నిలబడితే, రూపాయి తక్షణం 72కు చేరడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆర్బీఐపై విశ్వాసం ఇక్కడ జరిగిన సదస్సులో కేంద్ర మంత్రి గోయెల్ మాట్లాడుతూ, ‘‘విదేశీ మారక ద్రవ్యం, రేట్లను నిర్వహించే ఆర్బీఐపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. కేంద్రం ఆర్బీఐతో ఆయా అంశాలపై చర్చించి తగిన సమయంలో తగిన చర్యలు తీసుకుంటుంది. 2013లో రూపాయి 68ని తాకినపుడు నాటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఫారిన్ కరెన్సీ నాన్– రెసిడెంట్ బ్యాంక్ (ఎఫ్సీఎన్ఆర్–బీ) డిపాజిట్లను ప్రవేశపెట్టారు. ఈ సమీకరణల ద్వారా అటు తర్వాత మూడేళ్లలో 32 బిలియన్ డాలర్లు దేశానికి వచ్చాయి. అటు తర్వాత రేట్లు స్థిరపడ్డాయి. అప్పట్లో వచ్చిన 32 బిలియన్ డాలర్ల డిపాజిట్లను మనం తిరిగి చెల్లించేశాము. గడిచిన ఐదేళ్లూ చూస్తే, రూపాయి బలహీనత సమస్య తలెత్తలేదు.’’ అని అన్నారు. అప్పుడు దేశీయం... ఇప్పుడు అంతర్జాతీయం ‘‘స్థూల ఆర్థిక గణాంకాలను పరిశీలిస్తే, 2013 సంవత్సరంలో భారత్ వద్ద విదేశీ మారక నిల్వలు 304 బిలియన్ డాలర్లే ఉండేవి. 2017–18 నాటికి ఈ నిల్వలు 425 బిలియన్ డాలర్లకు పెరిగాయి’’ అని గోయెల్ ఒక సమావేశంలో చెప్పారు. ‘‘ఇక 2012–13లో కరెంట్ అకౌంట్ లోటు (ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీలు మినహా దేశానికి వచ్చీ వెళ్లే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం) కూడా 4.8 శాతంగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం ఇది 1.9 శాతమే. అదే విధంగా ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం కూడా ఈ కాలంలో 4.5% నుంచి 3.5%కి తగ్గింది’’ అని కేంద్ర మంత్రి వివరించారు. వీటి ప్రకారం.. మన స్థూల ఆర్థిక పరిస్థితులు ఇప్పుడు 2013తో పోల్చితే ఎంతో మెరుగ్గా ఉన్నాయని మంత్రి అన్నారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా కొంత ప్రతికూల పరిస్థితి ఉందన్నారు. ప్రత్యేకించి ఇప్పుడు చమురు ధరలు తీవ్ర స్థాయికి చేరాయని ఈ సందర్భంగా తెలిపారు. అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ వడ్డీరేట్ల పెంపుదల సమస్యా ఉందన్నారు. దీనివల్ల దేశం నుంచి మూలధన పెట్టుబడులు వెనక్కు మళ్లుతున్నాయని వివరించారు. రూపాయి కుదుపులను అడ్డుకోగలం:గార్గ్ ఇదిలావుండగా, ప్రస్తుత రూపాయి ఒడిదుడుకులను ఎదుర్కొనగల శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్సీ గార్గ్ పేర్కొన్నారు. ఇందుకు తగిన విదేశీ మారకద్రవ్య నిల్వలు దేశం వద్ద ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 2013 సంవత్సరంలో ఉన్నదాని కన్నా భిన్నమైన ధోరణి ఉందని అన్నారు. నల్లధనం అని తేలితే కఠిన చర్యలు గత ప్రభుత్వం వల్లే స్విస్ డిపాజిట్ల పెరుగుదల స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు పెరగడానికి మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రవేశపెట్టిన ఉదారవాద రెమిటెన్స్ స్కీమ్ కారణం అయి ఉండొచ్చని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పీయూష్ గోయల్ అభిప్రాయపడ్డారు. స్విస్ బ్యాంకుల్లో ఉన్నదంతా నల్లధనం అని ఎలా చెప్పగలమని ప్రశ్నించారు. భారతీయల డిపాజిట్ల వివరాలను ద్వైపాక్షిక పన్ను ఒప్పందం కింద వచ్చే ఏడాది నుంచి తీసుకోవడం ప్రారంభిస్తామని, ఏవైనా అవకతవకలుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్విట్జర్లాండ్‌లోని బ్యాంకుల్లో భారతీయుల డిపాజిట్లు 2017లో 50 శాతం పెరిగి రూ.7,000 కోట్లుగా నమోదయినట్లు గురువారం స్విస్ నేషనల్ బ్యాంకు విడుదల చేసిన గణాంకాలు తెలియజేశాయి. అంతకు ముందు వరుసగా మూడేళ్లు భారతీయుల డిపాజిట్లు తగ్గగా... గతేడాది మళ్లీ పెరగడం గమనార్హం. దీంతో మీడియా ప్రశ్నలకు పీయూష్ గోయల్ స్పందించారు. ‘‘మీరు ప్రస్తావించిన డేటా మా దృష్టికి రావాల్సి ఉంది. దీన్ని నల్లధనం లేదా అక్రమ లావాదేవీలని ఎలా చెప్పగలరు?’’ అని మంత్రి ప్రశ్నించారు. మీడియా నివేదికలను ప్రస్తావించిన ఆయన, 40% డిపాజిట్లు చిదంబరం ప్రవేశపెట్టిన రెమిటెన్స్ స్కీమ్ వల్లే పెరిగాయని చెప్పారు. ఉదారవాద రెమిటెన్స్ స్కీమ్ కింద ఒక్కో వ్యక్తి ఒక ఏడాదిలో 2.5 లక్షల డాలర్లను విదేశాలకు పంపుకోవచ్చని మంత్రి చెప్పారు. ‘‘సమాచారమంతా మా చేతికి వస్తుంది. ఎవరైనా నేరం చేసినట్టు తేలితే ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది’’ అని పీయూష్ గోయల్ తెలిపారు. -
రైల్వేలు: ఫిర్యాదులు, ఫుడ్ ఆర్డర్ ఈజీ
సాక్షి, చెన్నై: దేశంలో రైల్వే వ్యవస్థను ప్రయాణీకులు మరింత చేరువ దిశగా రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్తగా రెండు మొబైల్ యాప్‌లను కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ చెన్నైలో లాంచ్ చేశారు. ‘రైల్ మదద్’, ‘మెనూ ఆన్ రైల్స్’ పేరిట రెండు రైల్వే యాప్‌లు తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. ప్రయాణీకులు ఫిర్యాదులను సమర్పించటానికి రైల్ మదద్ అనుమతినిస్తుండగా, మెనూ ఆన్ రైల్స్ ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి ఉపయోగడనుంది. రైలు మదద్: ప్రయాణికుల ఫిర్యాదుల కుద్దేశించింది ‘రైల్ మదద్’ యాప్. ఈ మొబైల్ యాప్ ద్వార సమస్యలపై ప్రయాణికులు రైల్వే శాఖకు ఫిర్యాదు చేయవచ్చు. ప్రయాణికుల భద్రత, ఛైల్డ్ హెల్ప్ లైన్ నంబర్లను అనుసంధానం చేస్తూ ఈ యాప్ ను రూపొందించామని రైల్వే మంత్రి ప్రకటించారు. మెనూ ఆన్ రైల్స్: మెనూ యాప్ సాయంతో ప్రయాణికులు తమకిష్టమైన ఆహారం, పానీయాలు, వాటి ధరలను తెలుసుకోవచ్చు. 96 రకాల బ్రేక్ ఫాస్ట్, ఆహార పదార్థాలు మెనూలో అందుబాటులో ఉన్నాయి. జైన్ ఫుడ్, డయాబెటిక్ ఫుడ్, బ్రేక్ ఫాస్ట్ లు అందుబాటులో ఉంచారు. శతాబ్ది, రాజధాని, దురంతో రైళ్లలో ముందుగా ఆర్డరిస్తే అన్నిరకాల ఆహారపదార్థాలు సప్లయి చేస్తామని రైల్వే అధికారులు చెప్పారు. గత నాలుగేళ్ళలో రైల్వేల అభివృద్ధి గురించి కేంద్రమంత్రి గోయల్, రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా మీడియాతోమాట్లాడారు. 'సాఫ్ నియత్, సహీ వికాస్' అనే దృక్పథంతో పని చేస్తున్నామని, ముఖ్యంగా రైల్వేలో భద్రతకు ప్రాధాన్యమిచ్చామని పేర్కొన్నారు. తద్వారా రైలు ప్రమాదాల సంఖ్యను తగ్గించామని పీయూష్ గోయల్ వెల్లడించారు. 2013-14లో 118 రైలు ప్రమాదాలు జరగ్గా 2017-18లో వీటి సంఖ్యను 73కు తగ్గించామని మంత్రి వివరించారు. -
బ్యాంకుల్లో పర్యవేక్షక కమిటీలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పేరుకుపోతున్న నిరర్థక ఆస్తులు, రుణ బకాయిలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్పీఏలను సమర్థంగా ఎదుర్కోవడంపై బ్యాంకులు దృష్టిసారించాయి. ఒత్తిడికి లోనయ్యే రుణాలు, ఆస్తుల విషయంలో సత్వర నిర్ణాయక వ్యవస్థ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బ్యాంకుల్లో సత్వర నిర్ణయాల కోసం రిటైర్డ్ జడ్జీలు, విజిలెన్స్ అధికారులు, ఇతర నిపుణులతో కూడిన పర్యవేక్షక కమిటీల నియామకాన్ని పలు బ్యాంకులు పరిశీలిస్తున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. సుదీర్ఘ అనుభవం కలిగిన ఎస్బీఐ ప్రతిపాదనను పలు బ్యాంకులు పరిశీలిస్తున్నాయని, బ్యాంకుల వద్ద పేరుకుపోయిన నిరర్థక ఆస్తులు, ఖాతాలను సమర్ధవంతంగా, పారదర్శకంగా పరిష్కరించడంలో పర్యవేక్షక కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని గోయల్ చెప్పారు. ఎస్బీఐ దశాబ్ధాల అనుభవంతో పరపతి నిర్ణయాలను అత్యంత పారదర్శకంగా, సత్వరం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఒత్తిడికి గురయ్యే ఆస్తుల నిర్వహణలోనూ పకడ్బందీగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. -
మంత్రికి వీడియో ట్యాగ్.. నటి క్షమాపణలు
సాక్షి, న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో కారణంగా బాలీవుడ్ సీనియర్ నటి షబానా అజ్మీ రైల్వే మంత్రిత్వ శాఖకు క్షమాపణలు చెప్పారు. ఇద్దరు వ్యక్తులు.. మురికి నీటిలో భోజనం తినే ప్లేట్లను కడుగుతున్న 30 సెకన్ల వీడియోను చూసిన షబానా.. వారిని రైల్వే సిబ్బందిగా భావించారు. దాంతో వెంటనే ఆ వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ, మంత్రి పీయూష్ గోయల్‌కు ట్యాగ్ చేసి.. ‘ఈ వీడియోను మీరొకసారి వీక్షించాల్సిందే’ అంటూ ట్వీట్ చేశారు. షబానా ట్వీట్‌కు స్పందించిన రైల్వే శాఖ.. ‘మేడమ్ ఈ వీడియో ఒక మలేషియన్ రెస్టారెంట్లో.. మురికి నీళ్లలో ప్లేట్లను కడుగుతున్న వర్కర్లకు సంబంధించినదంటూ’.. అందుకు సంబంధించిన వార్తా కథనాన్ని కూడా ట్విటర్లో పోస్ట్ చేశారు. వెంటనే స్పందించిన షబానా.. ‘నా క్షమాపణలు స్వీకరించండి. పొరపాటును సరిదిద్దుకున్నానంటూ’ క్షమాణలు తెలిపారు. అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న కొందరు నెటిజన్లు... రైల్వే శాఖ షబానాపై పరువు నష్టం దావా వేయాలంటూ ట్రోల్ చేశారు. దీంతో మరోసారి ఆమె.. ‘మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానంటూ’ ట్వీట్ చేశారు. Mam, video is of Malaysian eatery which faces closure after video shows workers washing dishes in puddle of murky water: Link News is https://t.co/n6U2f9fMP0 — Ministry of Railways (@RailMinIndia) June 5, 2018 -
పథకం ఇండియాది.. ఫోటో రష్యాది...
న్యూఢిల్లీ: సోషల్ మీడియా ఇప్పుడు ప్రతీ ఒక్కరి జీవితంలో భాగస్వామిగా మారిపోయింది. ఏ విషయాన్నైనా సరే క్షణాల్లో వ్యాపింపజేసేందుకు వేదికలుగా మారుతున్నాయి. ఇక ప్రజలతో నేరుగా కలిసే వీలులేని కొందరు నేతలు, తమ అభివృద్ధిని ప్రచారం చేసుకునేందుకు సంధానకర్తగా వీటిని ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో దొరితే తప్పులు వారి పరువును తీసిపడేస్తున్నాయి. కేంద్ర సహాయ మంత్రి పీయూష్ ఘోయల్ తాజాగా చేసిన ఓ ట్వీట్ ఆయన్ని ట్రోల్ చేసి పడేస్తోంది. జాతీయ వీధి దీపాల మిషన్ కార్యక్రమంలో భాగంగా , కేంద్ర ప్రభుత్వం 50,000 కిలోమీటర్ల రహదారి గుండా ఎల్ఈడీ లైట్లను అమర్చినట్లు పేర్కొంటూ ఆయన పోస్ట్ చేశారు. ఎక్కడో రష్యా దేశానికి చెందిన ఓ ఫోటోను మన దేశానికి చెందిందిగా పేర్కొంటూ ఫోటోను ఆయన ట్వీట్ చేశారు. అంతే ముందు వెనకా చూడకుండా ఆయన్ని పలువురు ఏకీపడేశారు. వెంటనే తన తప్పును గమనించిన పీయూష్ తర్వాత ఆ ఫోటోను డిలీట్ చేసి మన వీధులకు చెందిన ఫోటోను తిరిగి ట్వీట్ చేశారు. అంతేకాదు సోషల్ మీడియా వల్ల ఇలాంటి తప్పులు కూడా సవరించుకునే వీలు కలుగుతుందంటూ తన తప్పును సర్దిపుచ్చుకునే యత్నం చేశారు. గతంలో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో రాజ్ కోట్ లోని ఓ బస్‌స్టాప్ ఫోటోను అప్పుడే ఆవిష్కరించినట్లు తప్పుడు ట్వీట్ చేయగా, బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి ఓ ఫోటోను బెంగాల్ అల్లర్లకు చెందిందంటూ షేర్ చేసి విమర్శలపాలయ్యాడు. -
‘భద్రాద్రి’కి అడ్డంకిని తొలగించండి
కేంద్ర విద్యుత్ మంత్రికి సీఎం కేసీఆర్ విజ్ఞప్తి సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: కొత్తగూడెం జిల్లా మణుగూరులో జెన్కో ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన 1080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ పవర్‌ప్లాంటుకు పర్యావరణ అనుమతులిచ్చేందుకు సహకరించాలని కేం ద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయె ల్కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చేందుకు చేపట్టిన ఈ విద్యుత్ కేంద్రాన్ని సబ్ క్రిటికల్ పరిజ్ఞానంతో నిర్మించేందుకు నిబంధనలు సడలించాలని కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం ఆదివారం పీయూష్ గోయెల్‌తో సమావేశమయ్యారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న థర్మల్ పవర్ ప్రాజెక్టులు, సోలార్ ప్లాంట్లు, ఉదయ్ పథకం, డిస్కంల పనితీరు తదితర అంశాలపై గంటపాటు చర్చించారు. భద్రాద్రి విద్యుత్ కేంద్ర నిర్మాణం, ముడి యంత్రాల సరఫరా కోసం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్కు రూ.987 కోట్లు చెల్లించామని, భూసేకరణ కోసం రూ.69.5 కోట్లు ఖర్చు చేశామని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర విద్యుత్ శాఖ మార్గదర్శకాలకు లోబడి 12వ పంచవర్ష ప్రణాళిక (2012-17) కాలం ముగిసేలోపే కేవలం 24 నెలల్లో భద్రాద్రి విద్యుత్ ప్లాంటును నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించామని వివరించారు. అరుుతే పర్యావరణ అనుమతులు రాకపోవడంతో నిర్మాణంలో జాప్యం జరుగుతోందన్నారు. రూ.5,044 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన ఈ ప్రాజెక్టుకు అనుమతులు రాకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందని వివరించారు. దేశవ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న మరో 36 సబ్ క్రిటికల్ విద్యుత్‌ప్లాంట్లు 13వ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే పూర్తవుతాయని, భద్రాద్రి ప్రాజెక్టును కూడా ఆ కోవలోనే చూడాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. సమావేశ నేపథ్యం.. 13వ పంచవర్ష ప్రణాళిక కాలం (2017-2022)లో సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని మాత్రమే అనుమతిం చాలని కేంద్ర విద్యుత్ శాఖ గతంలో తీసుకున్న నిర్ణయం తాజాగా భద్రాద్రి సబ్ క్రిటికల్ విద్యుత్ కేంద్రం నిర్మాణానికి అడ్డంకిగా మారింది. దీనివల్ల ప్లాంటుకు పర్యావరణ అనుమతుల జారీని పరిశీలించలేమని కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ ఈ నెల 4న నిర్ణరుుంచిన విషయం తెలిసిందే. పర్యావరణ అనుమతుల కోసం పరిశీలనలో ఉన్న ప్రాజెక్టుల జాబితా నుంచి భద్రాద్రి ప్లాంటు పేరును కూడా తొలగించింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్ర విద్యుత్ మంత్రిని కలిశారు. శాశ్వత బొగ్గు కేటాయింపులు చేయండి నల్లగొండ జిల్లా దామరచర్లలో 4,000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంటుకు శాశ్వత బొగ్గు కేటాయింపులు జరపాలని సీఎం కోరా రు. తెలంగాణను విద్యుత్ మిగులు రా ష్ట్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందుకు అనుగుణంగా కేం ద్రం నుంచి సహకరించాలని విజ్ఞప్తి చేశా రు. భద్రాద్రి ప్లాంట్‌కు ప్రత్యేక సడలింపులతో పాటు ఇతర అంశాలపై సీఎం చేసిన విజ్ఞప్తిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఈ అంశాన్ని పరిశీలించి త్వరలో చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే డిస్కంల ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్రం ప్రవేశపెట్టిన ఉజ్వల్ డిస్కంల యోజన (ఉదయ్) పథకంలో చేరాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. సీఎంతో పాటు మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, కె.కేశవరావు, వినోద్ కుమార్, బాల్క సుమన్, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు వేణుగోపాలచారి, రామచంద్ర తేజోవత్, జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావు ఉన్నారు. -
‘జింక్’లో మైనారిటీ వాటాతో ప్రయోజనం లేదు..
న్యూఢిల్లీ: హిందుస్తాన్ జింక్ (హెచ్‌జెడ్‌ఎల్)లో ప్రభుత్వం మైనారిటీ వాటా (29.54 శాతం) కొనసాగించేందుకు తగిన కారణం ఏదీ కనిపించడం లేదని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయెల్ కీలక వ్యాఖ్య చేశారు. ‘హెచ్‌జెడ్‌ఎల్‌లో మెజారిటీ వాటా ప్రైవేటు కంపెనీకి ఇచ్చేసిన తర్వాత ఆ కంపెనీలో ప్రభుత్వానికి ఇక ఎటువంటి వ్యూహాత్మక ప్రయోజనం లేదు. నా అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం తనకున్న మైనారిటీ వాటా కొనసాగించేందుకు ఎటువంటి వాస్తవిక కారణం కనిపించడం లేదు’ అని గోయెల్ పీటీఐ వార్తా సంస్థతో అన్నారు. వాటా విక్రయంపై స్పందిస్తూ... చట్టపరమైన అవసరాలుంటే వాటిని నెరవేరుస్తామని తుది నిర్ణయం మాత్రం పెట్టుబడుల ఉపసంహరణ విభాగం చేతిలోనే ఉందన్నారు. కాగా, హెచ్‌జెడ్‌ఎల్‌లో వాటా విక్రయానికి అంత తొందరేమిటంటూ సుప్రీంకోర్టు ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడంతోపాటు తదుపరి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. 2002లో కేంద్ర ప్రభుత్వం హెచ్‌జెడ్‌ఎల్‌లో 26 శాతం వాటాను రూ.445 కోట్లకు వేదాంత గ్రూప్‌నకు విక్రయించింది. ఆ తర్వాత వేదాంత మరో 20 శాతం సాధారణ వాటాదారుల నుంచి కొనుగోలు చేసింది. 2003లో కాల్ ఆప్షన్ ద్వారా మరో 18.92 శాతం వాటాను కూడా కొనుగోలు చేసింది. ఇంకా 29.54 శాతం వాటా కేంద్రం చేతిలో ఉంది. -
బాబుకు ఖరారుకాని మోడీ అపాయింట్మెంట్
హైదరాబాద్: నూతన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గురువారం ఢిల్లీకి పయనమవుతున్నారు. రేపు, ఎల్లుండి ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 6.30 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక ప్యాకేజీ, నిధుల గురించి పలువురు కేంద్ర మంత్రులతో ఆయన చర్చలు జరపనున్నారు. కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, ఉమాభారతి, వెంకయ్యనాయుడు, స్మృతి ఇరానీ, అరుణ్‌జైట్లీ, సదానంద గౌడతో రేపు చంద్రబాబు వేర్వేరుగా సమావేశమవుతారు. 27న నితిన్ గడ్కరీ, దేవేందర్ ప్రధాన్‌తో భేటీ అవుతారు. ప్రధాని నరేంద్ర మోడీతో ఎప్పుడు భేటీ అవుతారనేది ఇంకా ఖరారు కాలేదు.