ద్రవ్యలోటు భయపెడుతోంది..! | The fiscal deficit is currently creating anxiety | Sakshi
Sakshi News home page

ద్రవ్యలోటు భయపెడుతోంది..!

Published Wed, Feb 27 2019 12:24 AM | Last Updated on Wed, Feb 27 2019 12:25 AM

The fiscal deficit is currently creating anxiety - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు – వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం– ద్రవ్యలోటు లెక్కలు ప్రస్తుతానికి ఆందోళన సృష్టిస్తున్నాయి. కేంద్రం మంగళవారం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే...

►ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్‌ – 2019 మార్చి) మధ్య  ద్రవ్యలోటు 6.24 లక్షల కోట్లుగా ఉండాలని సంబంధిత బడ్జెట్‌ నిర్దేశించింది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ఇది 3.3 శాతం.

►అయితే ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి పీయూష్‌ గోయెల్‌ వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ, 2018–19లో ద్రవ్యలోటు అంచనాలను 6.24 లక్షల కోట్ల నుంచి రూ.6.34 లక్షల కోట్లకు (జీడీపీలో 3.4%) పెంచారు. చిన్న, సన్నకారు రైతుల ఆదాయ పథకానికి ఫండింగ్‌ వల్ల ద్రవ్యలోటు లక్ష్యాన్ని పెంచాల్సి వచ్చిందని బడ్జెట్‌లో గోయెల్‌ తెలిపారు. 

►అయితే జనవరి ముగిసే నాటికి (ఆర్థిక సంవత్సరం ఇంకా 2 నెలలు మిగిలి ఉండగానే) లోటు రూ.7.70 లక్షల కోట్లకు చేరింది. అంటే లక్ష్యం (రూ.6.34 లక్షల కోట్లు)లో 100% దాటిపోయి మరో 21.5% (121.5%) పెరిగిందన్నమాట. 

►అయితే కేంద్రం మాత్రం ద్రవ్యలోటును సవరిత అంచనాలను (రూ.6.34 లక్షల కోట్లు) ఎంతమాత్రం దాటనివ్వమని స్పష్టం చేస్తోంది. ఆర్థిక సంవత్సరం రెండు నెలల్లో (ఫిబ్రవరి, మార్చి) కేంద్ర ఖజానాకు రానున్న ఆదాయం లోటును కట్టడి చేస్తుందన్న అభిప్రాయాన్ని ఆర్థికశాఖ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

►2018–19కు సంబంధించి మధ్యంతర బడ్జెట్‌ సవరించిన అంచనాల ప్రకారం ఆదాయ లక్ష్యం రూ.17.29 లక్షల కోట్లు. అయితే జనవరి నాటికి ఈ వసూళ్లు రూ.11.81 లక్షల కోట్లు. అంటే లక్ష్యంలో 68.3 శాతమన్నమాట. 

►అలాగే వ్యయాల మొత్తం రూ.24.57 లక్షల కోట్లయితే జనవరి ముగిసే నాటికి రూ.20.01 లక్షల కోట్లకు చేరింది. అంటే ఈ పరిమాణం వ్యయాలు బడ్జెట్‌తో పోల్చితే 81.5 శాతం.

ఆర్‌బీఐ నిధులపై ఆధారపడక తప్పదా?

ద్రవ్యలోటును ఎలా పూడ్చుకోవాలన్న అంశంపై సర్వత్రా ఇప్పుడు చర్చ నెలకొంది.  ద్రవ్యలోటును పూడ్చుకునేందుకు ఆర్‌బీఐ వద్ద ఉన్న నిధుల్లో మెజారిటీ వాటాను పొందాలని కేంద్రం భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఆర్‌బీఐ వద్ద జూన్‌ నాటికి రూ.9.43 లక్షల కోట్ల అదనపు నిల్వలున్నాయి. నగదు, బంగారం రీవాల్యుయేషన్‌ (రూ.6.91 లక్షల కోట్లు), కంటెంజెన్సీ ఫండ్‌ (రూ.2.32 లక్షల కోట్లు) ద్వారా ఈ నిధులు సమకూరాయి. ఇందులో అధిక మొత్తాన్ని కేంద్రం కోరుతోందన్న వార్తల నేపథ్యంలో– డిసెంబర్‌ 10వ తేదీన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ప్రకటించారు.  ఈ నిధుల నిర్వహణను పరిశీలించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అంతకుముందు నవంబర్‌ 19న జరిగిన ఆర్‌బీఐ బోర్డ్‌ సమావేశం నిర్ణయించింది.  ఇందుకు అనుగుణంగా జలాన్‌ నేతృత్వంలో కమిటీ కూడా ఏర్పాటయ్యింది. ఏప్రిల్‌లో ఈ కమిటీ తన నివేదికను సమర్పించే అవకాశం ఉంది. గతంలోనూ ఆర్‌బీఐ నిల్వలపై మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి.

వి.సుబ్రమణ్యం (1997), ఉషా థోరట్‌ (2004), వైహెచ్‌ మాలేగామ్‌ (2013) ఈ కమిటీలకు నేతృత్వం వహించారు. మొత్తం రుణాల్లో 12 శాతం వరకూ ఆర్‌బీఐ నిల్వల రూపంలో ఉండాలని సుబ్రమణ్యం కమిటీ సిఫారసు చేస్తే, ఉషా థోరట్‌ కమిటీ దీనిని 18 శాతంగా పేర్కొంది. అయితే, ఆర్‌బీఐ ఉషా థోరట్‌ కమిటీ సిఫారసులను తోసిపుచ్చింది. సుబ్రమణ్యం కమిటీ సిఫారుల మేరకు నడుచుకోవాలని నిర్ణయం తీసుకుంది. కాగా, ఆర్‌బీఐ లాభాల్లో తగిన మొత్తాన్ని ఏటా కంటింజెన్సీ నిల్వలకు బదలాయించాలని మాలేగామ్‌ కమిటీ సిఫారసు చేసింది. ప్రస్తుతం స్థూల రుణాల్లో 28 శాతం నిష్పత్తిలో ఆర్‌బీఐ వద్ద మిగులు నిల్వలు ఉన్నాయి. అయితే అంతర్జాతీయ ఆర్థిక ప్రమాణాల ప్రకారం 14 శాతం నిధులు సరిపోతాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ భావిస్తున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement