ద్రవ్యలోటు విధాన సమీక్షకు త్వరలో కమిటీ!
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయ-వ్యయాల మధ్య వ్యత్యాసానికి సంబంధించిన ద్రవ్యలోటు లక్ష్య నిర్దేశ విధానాన్ని సమీక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అసోచామ్ బుధవారం ఇక్కడ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ద్రవ్యలోటు నిర్దిష్టంగా ‘ఇంత’ శాతం ఉండాలన్నది ప్రస్తుత విధానం. ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్ట నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రక్రియ అమలు జరుగుతోంది. ఇలా ఒకే ఒక్క అంకె కాకుండా- (శాతంలో) దీనికి ఒక శ్రేణిని నిర్దేశించుకునే విధాన రూపకల్పన సాధ్యాసాధ్యాలను ప్రతిపాదిత కమిటీ పరిశీలిస్తుందని శక్తికాంత దాస్ తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యం 3.9ు. 2016-17లో ఈ లక్ష్యం 3.5%. ఈ లక్ష్యాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి జైట్లీ పేర్కొన్నారు.