Assocham
-
ఎంఎస్ఎంఈలకు కేంద్రీకృత ఫిర్యాదుల పోర్టల్
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈలు) కేంద్రీకృత ఫిర్యాదుల పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని అసోచామ్ డిమాండ్ చేసింది. ఆర్బీఐ అంబుడ్స్‌మన్ తరహాలో ఇది ఉండాని.. పలు శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలు ఈ పోర్టల్ ద్వారా లేవనెత్తేందుకు అవకాశం ఉండాలని కోరింది. ఫిర్యాదుల దాఖలు, పరిష్కారం విషయంలో ఎంఎస్ఎంఈలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయంటూ ఈ కీలక సూచన చేసింది. వ్యాపార నిర్వహణలో ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈగ్రోవ్ ఫౌండేష్ సాయంతో అసోచామ్ సర్వే నిర్వహించింది. ఎంఎస్ఎంఈ సమస్యల పరిష్కారం, వాటి బలోపేతానికి సూచనలతో ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించే లక్ష్యంలో భాగంగా ఎంఎస్ఎంఈలకు సంబంధించి వ్యూహాత్మక ప్రణాళిక, కార్యాచరణను ఈ నివేదిక తెలియజేస్తుంది. సంఘటిత, అసంఘటిత రంగంలోని మన ఎంఎస్ఎంఈలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంక్‌లు, దిగ్గజ కంపెనీల నుంచి మద్దతు అవసరం’’అని అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నయ్యర్ పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలకు కార్పొరేట్ ఆదాయపన్ను రేటును 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని, సులభతర జీఎస్టీ వ్యవస్థను తీసుకురావాలని అసోచామ్ కోరింది. కేంద్రీకృత పోర్టల్.. ఎంఎస్ఎంఈల నమోదు, వ్యాపారానికి సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లను ఎలక్ట్రానిక్ రూపంలో సమర్పించేందుకు ఆన్లైన్ పోర్టల్ తీసుకురావాలని అసోచామ్ తన నివేదికలో కోరింది. జీఎస్టీ రిజి్రస్టేషన్, నిబంధనల అమలు ప్రక్రియలను సైతం సులభతరంగా మార్చాలని పేర్కొంది. స్పష్టమైన నిబంధనలతో మద్దతుగా నిలవాలని కోరింది. సహేతుక కారణాలున్నప్పటికీ సకాలంలో జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్, చెల్లింపులు చేయని ఎంఎస్ఎంఈలపై కఠిన జరిమానాలు విధిస్తున్నట్టు పేర్కొంది. జాప్యం తీవ్రత, కారణాలకు అనుగుణంగా పెనాల్టీలో మార్పులు ఉండాలని సూచించింది. జరిమానాలు ఎంఎస్ఎంఈలకు భారంగా మారరాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం సాకారం కావాలంటే వ్యాపార నమూనాలో నిర్మాణాత్మక మార్పు అవసరమని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ అన్నారు. ‘‘ఈ నిర్మాణాత్మక మార్పులో ఎంస్ఎంఈలు భాగంగా ఉండాలి. అభివృద్ధి చెందిన భారత్‌లో ఎంఎస్ఎంఈలు గొప్ప పాత్ర పోషించాలి. మా అధ్యయనం ఇదే అంశాన్ని బలంగా చెప్పింది’’అని సూద్ వివరించారు. పెరుగుతున్న కారి్మక శక్తికి ఎంఎస్ఎంఈలు పరిష్కారం చూపించగలవని, ఉత్పాదకతతో కూడిన ఉపాధిని అందించగలవని ఈగ్రోవ్ వ్యవస్థాపక చైర్మన్ చరణ్‌సింగ్ అన్నారు. వ్యవసాయ యూనివర్సిటీల మాదిరే ప్రతీ రాష్ట్రంలోనూ ఎంఎస్ఎంఈ యూనివర్సిటీ ఏర్పాటును పరిశీలించాలని, ఎంఎస్ఎంఈల ఉత్పత్తులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకంగా సమన్వయ మండలిని ఏర్పాటు చేసి, పథకాల అమలు సాఫీగా సాగేలా చూడాలని, రాష్ట్రాల పరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఈ నివేదిక సూచించింది. జీడీపీలో 30 శాతం వాటా, తయారీ రంగంలో 45 శాతం వాటా, ఎగుమతుల్లో 46 శాతం వాటా కలిగిన ఎంఎస్ఎంఈలు దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఈ నివేదిక గుర్తు చేసింది. -
అన్నింటికీ ఒక్కటే టీడీఎస్
న్యూఢిల్లీ: అన్ని రకాల చెల్లింపులకు 1 శాతం లేదా 2 శాతం టీడీఎస్ (మూలం వద్దే పన్ను కోత) అమలు చేయాలని వాణిజ్య మండలి ‘అసోచామ్’ ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. వివాదాల నివారణకు, పన్ను నిబంధనల అమలును సులభతరం చేసేందుకు ఇలా కోరింది. బడ్జెట్‌కు ముందు కేంద్ర ఆర్థిక శాఖకు పలు సూచనలతో కూడిన వినతిపత్రాన్ని అందించింది. కొన్ని రకాల టీడీఎస్ వైఫల్యాలను నేరంగా పరిగణించరాదని కూడా కోరింది. కొన్ని రకాల చెల్లింపులకు టీడీఎస్ అమలు చేయకపోవడాన్ని నేరంగా చూడరాదని, ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించడం ద్వారా పన్ను చెల్లింపుదారు ప్రయోజనం పొందిన కేసుల్లోనే ఇలా చేయాలని అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నాయర్ సూచించారు. ‘‘వివాదాలను తగ్గించడం, నిబంధనల అమలు మెరుగుపరచడం పన్ను సంస్కరణల లక్ష్యం అవుతుందని భావిస్తున్నాం. ఈ దిశగా కార్పొరేట్ రంగం నిర్మాణాత్మక సూచనలు చేసింది. పెట్టుబడులు, వినియోగాన్ని పెంచే చర్యల కోసం కూడా కార్పొరేట్ ఇండియా చూస్తోంది’’అని చెప్పారు. కంపెనీల విలీనాలు, వేరు చేయడాలకు పన్ను న్యూట్రాలిటీని అందించాలని కూడా అసోచామ్ కోరింది. పన్ను అంశాల్లో సమానత్వాన్ని ట్యాక్స్ న్యూట్రాలిటీగా చెబుతారు. మూలధన లాభాల మినహాయింపులు లేదా నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకునే విషయంలో, విలీనాలు, డీమెర్జర్లు (వేరు చేయడం), గుంపగుత్తగా విక్రయించడంలో ప్రస్తుతం నిబంధనల పరంగా అంతరాలు ఉండడంతో అసోచామ్ ఇలా కోరింది. బైబ్యాక్‌ల రూపంలో వచి్చన దాన్ని డివిడెండ్‌గా పరిగణించాలని సూచించింది. -
పన్ను రేట్లు తగ్గించాలి.. వచ్చే బడ్జెట్‌పై కోర్కెల చిట్టా
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కి సంబంధించి కేంద్రానికి కార్పొరేట్లు తమ వినతులను అందజేశారు. కస్టమ్స్‌కి సంబంధించి వన్–టైమ్ సెటిల్మెంట్ రూపంలో గత బాకీలను చెల్లించేసేందుకు ఆమ్నెస్టీ పథకాన్ని ప్రకటించాలని పరిశ్రమల సమాఖ్యలు ఫిక్కీ, అసోచాం కోరాయి.బాకీ పరిమాణాన్ని బట్టి పాక్షికంగా సుంకాలను తగ్గించడం లేదా వడ్డీ అలాగే పెనాల్టీని పూర్తిగా మినహాయించడం రూపంలో ఊరటనివ్వొచ్చని పేర్కొన్నాయి. దీనితో పరిశ్రమపై లిటిగేషన్ల భారం తగ్గుతుందని తెలిపాయి.మరోవైపు, వ్యక్తులు, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ సంస్థల ట్యాక్సేషన్ విషయంలో పన్ను రేట్లను తగ్గించాలని, ఫేస్‌లెస్ అప్పీళ్లను ఫాస్ట్ ట్రాక్ చేయాలని పీహెచ్‌డీసీసీఐ విజ్ఞప్తి చేసింది. -
2024లో మరింత వేగంగా భారత్ వృద్ధి - అసోచామ్
ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో అగ్రగామిగా ఉన్న భారత్ 2024లో కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందనున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని అసోచామ్ ఈ రోజు (గురువారం) ఒక ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రైల్వేలు, విమానయానం, అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీతో సహా నిర్మాణం, ఆతిథ్యం, మౌలిక సదుపాయాలు వంటి రంగాలలో పెట్టుబడులు పెరగడానికి దారితీసే బలమైన వినియోగదారుల డిమాండ్ నేపథ్యంలో 2024లో భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని అసోచామ్ వెల్లడించింది. 2023 జులై - సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రభుత్వ వ్యయం మాత్రమే కాకుండా తయారీ పరంగా బూస్టర్ షాట్లతో GDP ఊహించిన దానికంటే వేగంగా 7.6 శాతం వృద్ధి చెందడంతో భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందింది. దీంతో ఆర్థిక వ్యవస్థ మరింత పెరుగుతుందని, మెరుగైన అవకాశాలు లభిస్తాయని అసోచామ్ సెక్రటరీ జనరల్ 'దీపక్ సూద్' అన్నారు. ఇదీ చదవండి: ఇషితా సల్గావ్కర్ ఎవరు.. అంబానీతో సంబంధం ఏంటి? భారతదేశ GDP వృద్ధి జూలై-సెప్టెంబర్‌లో చైనా కంటే ఎక్కువైనట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆర్థిక, నిర్మాణ, హోటళ్లు, ఏవియేషన్, ఆటో, ఎలక్ట్రానిక్స్ వంటి తయారీ రంగాల ఆధ్వర్యంలో దేశీయ కంపెనీల పనితీరు మరింత మెరుగుపడనుందని అసోచామ్ సెక్రటరీ అభిప్రాయపడ్డారు. -
పెట్టుబడి అవకాశాలు గురించి తెలుసుకోవడానికి చక్కని అవకాశం
అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్), ఒమన్‌లోని సోహార్ పోర్ట్ అండ్ ఫ్రీజోన్ ప్రతినిధి బృందంతో వ్యాపార కార్యక్రమంలో భాగంగా ఇంటరాక్టివ్ సెషన్, B2B సమావేశాలను ప్రకటించింది. ఈ కార్యక్రమం 2023 నవంబర్ 23, 24 తేదీల్లో హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో జరగనుంది. ప్రపంచ మార్కెట్లో తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా సంస్థ 23 తేదీ సాయంత్రం ఇంటరాక్టివ్ సెషన్‌తో కార్యక్రమం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత B2B సమావేశాలు జరుగుతాయి. ఒమన్ అండ్ మిడిల్ ఈస్ట్‌లోని అనేక వ్యాపారాలు, పెట్టుబడి అవకాశాలను గురించి నగరంలోని వ్యాపార వేత్తలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం. ఈ సమావేశాలకు హాజరయ్యేవారు సోహార్ పోర్ట్ అండ్ ఫ్రీజోన్ అందించే ప్రయోజనాలు, వాటి ప్రోత్సాహకాల గురించి తెలుసుకుంటారు. ఇందులో పాల్గొనాలంటే తప్పకుండా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ కోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అసోచామ్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా డెవలప్మెంట్ కౌన్సిల్ చైర్మన్, యాక్సిస్ ఎనర్జీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ 'రవి కుమార్ రెడ్డి కటారు' మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ కీలకమైన ఆర్థిక, పారిశ్రామిక రంగాలకు మూలస్తంభంగా నిలుస్తుందని, ముఖ్యంగా ఔషధ పరిశ్రమకు బలమైన కేంద్రమవుతుందని వ్యాఖ్యానించారు. గత కొన్ని సంవత్సరాలుగా నగరం నుంచి ఎగుమతులు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో వీటిని మరింత పెంచడంలో ద్రుష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించారు. యూరోప్, ఆఫ్రికాలలో మాత్రమే కాకుండా మధ్యప్రాచ్య ప్రాంతంలోని వ్యాపారాల కోసం ఒమన్ దక్షిణ భారతదేశాన్ని ఇష్టపడుతోంది. ఇప్పటికే ఈ సంస్థలకు అమెరికా, సింగపూర్ దేశాల్లో కూడా వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. అయితే త్వరలో జరిగే ఈ కార్యక్రమం ఒమన్‌లోకి ప్రవేశించడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి భారతీయ వ్యాపారులకు అవగాహన కల్పించడానికి సహాయపడుతుంది. అసోచామ్ ఈ కార్యక్రమానికి పరిశ్రమల ప్రతినిధులను ఆహ్వానిస్తోంది. -
ప్రైవేట్ పెట్టుబడులూ కీలకమే
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రైవేటు పెట్టుబడులు పెరగవలసి ఉన్నట్లు పారిశ్రామిక సమాఖ్య అసోచామ్ తాజాగా అభిప్రాయపడింది. ప్రభుత్వ పెట్టుబడులతోనే మూలధన వ్యయాలు పుంజుకోవని, ప్రైవేటు రంగం సైతం ఇందుకు దన్నుగా నిలవాలని పేర్కొంది. రానున్న రెండు, మూడేళ్లలో ప్రైవేటు పెట్టుబడులు ఊపందుకోనున్నట్లు అసోచామ్‌కు కొత్తగా ఎంపికైన ప్రెసిడెంట్ అజయ్ సింగ్ అంచనా వేశారు. ఇందుకు కేంద్రం నుంచి లభిస్తున్న పెట్టుబడి వ్యయాల ప్రోత్సాహం దోహదపడగలదని తెలియజేశారు. జోరందుకున్న ప్రభుత్వ పెట్టుబడులతో సమానంగా దేశీ కార్పొరేట్ పెట్టుబడులూ పెరగవలసి ఉన్నదని గత నెలలో ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. తద్వారా 2023–24 కేంద్ర బడ్జెట్లో పేర్కొన్న అవకాశాలను అందిపుచ్చుకోవాలని ప్రధాని సూచించారు. కాగా.. ఒక ఆర్థిక వ్యవస్థలో అధిక భాగం ప్రభుత్వ పెట్టుబడులే ఉండవని, ప్రైవేటు రంగం సైతం భాగస్వామి కావలసి ఉంటుందని అజయ్ తెలియజేశారు. మౌలిక సదుపాయాలపై ప్రభుత్వ పెట్టుబడుల కారణంగా ప్రస్తుతం ప్రోత్సాహక వాతావరణం నెలకొందని పేర్కొన్నారు. దీంతో కంపెనీలకు దేశ, విదేశాలలో పలు అవకాశాలు అందుబాటులోకి వచ్చాయని తెలియజేశారు. -
పదేళ్ల కనిష్టానికి బ్యాంకుల ఎన్పీఏలు
న్యూఢిల్లీ: దేశ బ్యాంకింగ్ రంగం ఎన్పీఏలు (వసూలు కాని రుణాలు) 2024 మార్చి నాటికి 4 శాతంలోపునకు దిగొస్తాయని అసోచామ్–క్రిసిల్ అధ్యయన నివేదిక తెలిపింది. ఇది దశాబ్ద కనిష్ట స్థాయి అని పేర్కొంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో 0.90 శాతం తగ్గి స్థూల ఎన్‌పీలు 5 శాతంలోపుగా ఉండొచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి అనంతరం ఆర్థిక రంగ కార్యకలాపాలు కోలుకోవడం, రుణాల్లో అధిక వృద్ధి ఎన్పీఏలు తగ్గేందుకు అనుకూలించినట్టు వివరించింది. ప్రధానంగా కార్పొరేట్ రుణాల వైపు ఎంతో పురోగతి ఉన్నట్టు తెలిపింది. కార్పొరేట్ రుణాల్లో స్థూల ఎన్పీఏలు 2024 మార్చి నాటికి 2 శాతంలోపు ఉంటాయని పేర్కొంది. 2018 మార్చి నాటికి కార్పొరేట్ ఎన్పీఏలు 16 శాతంగా ఉన్నట్టు గుర్తు చేసింది. ‘‘ఇటీవలి సంవత్సరాల్లో బ్యాంకులు తమ పుస్తకాలను ప్రక్షాళన చేసుకున్నాయి. రిస్క్ నిర్వహణ, అండర్ రైటింగ్‌ను బలోపేతం చేసుకున్నాయి. ఈ చర్యల నేపథ్యంలో క్రెడిట్ ప్రొఫైల్ మెరుగ్గా ఉన్న రుణ గ్రహీతలకు బ్యాంకులు ప్రాధాన్యం ఇవ్వడం మొదలు పెట్టాయి. కార్పొరేట్ రుణ ఆస్తుల నాణ్యత అదే పనిగా మెరుగు పడుతూ రావడం అన్నది బ్యాంకుల రుణాల నాణ్యతను తెలియజేస్తోంది’’అని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ వివరించారు. బహుళ బ్యాలన్స్‌షీట్ సమస్య దాదాపుగా పరిష్కారమైనట్టేనని, రుణాల వృద్ధి గణనీయంగా మెరుగుపడడం మొదలైనట్టు చెప్పారు. అంతర్జాతీయ సవాళ్ల మధ్య మన బ్యాంకింగ్ రంగం ఎంతో బలంగా ఉన్నట్టు సూద్ గుర్తు చేశారు. కరోనా వల్ల ఎక్కువగా దెబ్బతిన్న ఎంఎస్ఎంఈ రంగానికి సంబంధించి రుణాల్లో ఎన్పీఏలు.. 2022 మార్చి నాటికి ఉన్న 9.3 శాతం నుంచి 2024 మార్చి నాటికి 10–11 శాతానికి పెరుగుతాయని ఈ నివేదిక తెలిపింది. -
కష్ట కాలంలోనూ భారత్ ఎకానమీ దూకుడు
న్యూఢిల్లీ: క్లిష్టతరమైన ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లోనూ భారత్ 2023 సంవత్సరాలన్ని నెట్టుకురాగలుగుతుందన్న విశ్వాసాన్ని పారిశ్రామిక వేదిక– అసోచామ్ వ్యక్తం చేసింది. పటిష్ట వినియోగ డిమాండ్, మెరుగైన కార్పొరేట్ పనితీరు, తగ్గుముఖం పడుతున్న ద్రవ్యోల్బణం వంటి అంశాలు తమ అంచనాలకు కారణంగా పేర్కొంది. అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ ఈ మేరకు చేసిన ప్రకటనలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► గ్లోబల్ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ, బలమైన దేశీయ డిమాండ్, పటిష్ట ఆర్థిక రంగం, మెరుగైన కార్పొరేట్ బ్యాలెన్స్ షీట్ల సహాయంతో భారత ఆర్థిక వ్యవస్థ స్థిరమైన బాటలో నిలుస్తుందని విశ్వసిస్తున్నాం. ► రబీ పంటలు బాగుంటాయని తొలి సంకేతాలు వెల్లడిస్తున్నాయి. వ్యవసాయ రంగం సానుకూల పనితీరును ఇది సూచిస్తోంది. ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ). ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలు, ప్రత్యేక రసాయనాలు– ఎరువులు వంటి అనేక పరిశ్రమల పనితీరు బాగుంది. ► పర్యాటకం, హోటళ్లు రవాణా, గృహ కొనుగోళ్లు, విద్యుత్, ఎలక్ట్రానిక్స్, విచక్షణతో కూడిన వినియోగదారు వస్తువుల కొనుగోళ్లు, ఆటోమొబైల్స్ విభాగాల్లోనూ చక్కటి వినియోగ డిమాండ్ కనిపిస్తోంది. ► అయితే, అంతర్జాతీయ కరెన్సీ హెచ్చుతగ్గుల గురించి, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల పనితీరు, పర్యవసానాలపై భారత్ జాగరూకతలో ఉండాల్సిన అవసరం ఉంది. ► అభివృద్ధి చెందిన కొన్ని కీలకమైన ఆర్థిక వ్యవస్థలు మాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానాలతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని, ఈ నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కేవలం 2.7 శాతం మాత్రమే వృద్ధి చెందుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవలే అంచనా వేసింది. అధిక వడ్డీ ప్రభావం భారత్ కార్పొరేట్ల బ్యాలెన్స్ షీట్లపై కూడా ప్రతిబింబిస్తోంది. అయితే ఆయా ప్రతికూలతలను భారత్ కార్పొరేట్ రంగం అధిగమిస్తోంది. ► ఇన్ని క్లిష్ట పరిస్థితుల్లోనూ భారత్ ఎకానమీ 2022–23లో 6.8 శాతం నుంచి 7 శాతం పురోగమిస్తుందని భావిస్తున్నాం. 2023–24లో కూడా ఇదే సానుకూలత కొనసాగే అవకాశాలూ ఉన్నాయి. -
కేంద్రం దీనికి ఓకే అంటే.. పన్ను చెల్లింపుదారులకు పండగే!
మరి కొన్ని రోజుల్లో న్యూ ఇయర్ రాబోతోంది. ప్రతి సంవత్సరం మాదిరే ఈ సారి కేంద్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ ఏడాది బడ్జెట్లో వివిధ రంగాలకు చెందిన నిపుణులు తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే పరిశ్రమల సంస్థ అసోచామ్ తన ప్రీ-బడ్జెట్ సిఫార్సులలో కేంద్రానికి ఓ కీలక అంశాన్ని నివేదించింది. అది కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులపై ప్రభావం చూపుతుందని తెలిపింది. ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రాబోయే బడ్జెట్లో రూ. 5 లక్షలు చేయాలని పరిశ్రమల సంఘం అసోచామ్ తమ బలమైన వాదనను కేంద్రానికి వినిపించింది. తద్వారా ఆర్థిక వ్యవస్థ వినియోగ వృద్ధిని పొందుతుందని పేర్కొంది. ప్రస్తుతం ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం గరిష్ట ఆదాయం రూ. 2.5 లక్షలు వరకు ఎటువంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. 60-80 సంవత్సరాల వయస్సు గల వ్యక్తుల విషయంలో, ఇది రూ. 3 లక్షలు ఉండగా 80 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు రూ. 5 లక్షలు ఉంది. ఈ సందర్భంగా అసోచామ్ ప్రెసిడెంట్ సుమంత్ సిన్హా మీడియాతో మాట్లాడుతూ.. స్టీల్, సిమెంట్ వంటి రంగాలలోని కంపెనీలు ప్రస్తుత సామర్థ్యాలను పెంచుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం ప్రారంభించాయని అభిప్రాయపడ్డారు. ప్రతికూల నష్టాల గురించి మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా, ప్రపంచం మాంద్యంలోకి వెళ్లవచ్చని, అది బాహ్య రంగాన్ని ప్రభావితం చేస్తుందని, అందువల్ల భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (GDP)పై ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నులు రెండింటిలోనూ ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని పెంచేందుకు ప్రభుత్వానికి తగినంత సమయం ఇవ్వాలన్నారు. భారత్ ప్రధాన ఇంధన ఉత్పత్తిదారుగా అవతరించేందుకు కృషి చేస్తున్నందున గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి మద్దతుగా ఇతర దేశాలు తీసుకుంటున్న క్రియాశీల చర్యలకు ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించాలని చెప్పారు. చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
ఆర్బీఐ.. రేట్ల పెంపుపై దూకుడు వద్దు
బ్యాంకులకు తానిచ్చే రుణాలపై సెంట్రల్ బ్యాంక్ వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 5.9 శాతం)ను తదుపరి దశల్లో పెంచే విషయంలో దూకుడు ధోరణిని ప్రదర్శించవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ( ఆర్బీఐ)కు పారిశ్రామిక వేదిక అసోచామ్ విజ్ఞప్తి చేసింది. నెమ్మదిగా కోలుకుంటున్న ఎకానమీ రికవరీకి భారీ రేటు పెంపు సరికాదని పేర్కొంది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశం నేపథ్యంలో అసోచామ్ గవర్నర్ శక్తికాంత్ దాస్‌కు ఒక లేఖ రాస్తూ, కొత్త రేటు పెంపు 25 నుంచి 35 బేసిస్ పాయింట్ల శ్రేణిలో ఉండేలా నిర్ణయం తీసుకోవాలని, అంతకు మించి పెంపు వద్దని విజ్ఞప్తి చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు సంబంధించి రిటైల్ రుణాలను ప్రాధాన్యతా రంగ రుణాలుగా పరిగణించాలని, రాయితీ వడ్డీ రేటును అందించాలని తన సిఫారసుల్లో అసోచామ్ ఆర్బీఐకి విజ్ఞప్తి చేసింది. చదవండి: 17 బ్యాంకులు, 5వేల కోట్లు.. ప్రపంచంలోనే ధనిక గ్రామం మన భారత్‌లోనే.. ఎక్కడో తెలుసా! -
భారత్ ఎందుకొద్దు?
న్యూఢిల్లీ : ఆరేళ్లుగా కీలక రంగాల్లో తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో భారత్ పట్ల ప్రపంచ దేశాల దృక్పథం పూర్తిగా మారిపోయిందని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. గతంలో ఇండియా ఎందుకు? అని ప్రశ్నించిన వాళ్లు ఇప్పుడు ఇండియా ఎందుకొద్దు? అని అడుగుతున్నారని చెప్పారు. తాము చేపట్టిన సంస్కరణ ఫలాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. ప్రధాని శనివారం ‘అసోచామ్ ఫౌండేషన్ వీక్–2020’ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రసంగించారు. వ్యవసాయ సంస్కరణలు, కొత్త చట్టాలతో రైతన్నలు ప్రయోజనం పొందడం మొదలైందని వెల్లడించారు. ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే... ‘ఎందుకు’ నుంచి ఎందుకొద్దు దాకా.. ‘మనం చేపట్టిన సంస్కరణలు పారిశ్రామిక రంగం ఆలోచనా ధోరణిని మార్చాయి. పెట్టుబడులు పెట్టే విషయంలో భారత్ ఎందుకు? నుంచి భారత్ ఎందుకొద్దు? అనే దాకా పరిస్థితి మారిపోయింది. గతంలో పారిశ్రామికవేత్తలు మన దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు సందేహించేవారు. సంస్కరణలు, వాటి ప్రభావం వల్ల వారు ఉత్సాహం ముందుకొస్తున్నారు. 1,500 పాత, కాలం చెల్లిన చట్టాలను రద్దు చేశాం. పెట్టుబడుల అంశంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త చట్టాలు తీసుకొచ్చాం. ప్రభుత్వ ముందుచూపునకు ఇదొక ఉదాహరణ. గతంలో పెట్టుబడిదారులు ఇండియాలో ఉన్న అధిక పన్ను రేట్లను ప్రస్తావించేవారు. ఇండియా ఎందుకు? అని ప్రశ్నించేవారు. మన ప్రభుత్వం పన్ను రేట్లను సరళీకరించడంతో ఇప్పుడు ఇండియా ఎందుకొద్దు? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. గతంలో భారత్‌లోని కఠిన నిబంధనలు, నియంత్రణలను చూసి పెట్టుబడిదారులు వెనక్కి తగ్గేవారు. మన ప్రభుత్వం అలాంటి నిబంధనలు, నియంత్రణల భారాన్ని తొలగించడంతో ఇప్పుడు ఇండియా ఎందుకొద్దు? అంటున్నారు’. మా మద్దతును విజయంగా మార్చండి ‘అన్ని రంగాల్లో లోకల్ నుంచి గ్లోబల్ స్థాయికి ఎదగాలి. ఇందుకోసం మిషన్ మోడ్‌లో పని చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికప్పుడు రూపురేఖలు మార్చుకునే భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా మనం వేగంగా ప్రతిస్పందించాలి. గ్లోబల్ సప్లై చైన్ విషయంలో జరిగే మార్పులను పసిగట్టడానికి ఒక యంత్రాంగాన్ని అభివృద్ధి చేసుకోవాల్సి ఉంది. ప్రభుత్వం అందించే మద్దతును ఒక విజయంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పారిశ్రామికవేత్తలదే. భారత ఆర్థి క వ్యవస్థను ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. అత్యుత్తమ కార్పొరేట్ పరిపాలనా విధానాలు, లాభాలు పంచుకొనే విధానాలను పారిశ్రామిక రంగం అందిపుచ్చుకోవాలి. ఇక పరిశోధన, అభివృద్ధి(ఆర్అండ్డీ)లోనూ పెట్టుబడులు భారీగా పెరగాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రైవేట్ రంగం చొరవ తీసుకోవాలి’. రైతుల పోరాటం మరింత ఉధృతం న్యూఢిల్లీ: కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదని రైతు సంఘాల నేతలు పునరుద్ఘాటించారు. తమ పోరాటాన్ని మరింత ఉధృత చేస్తామన్నారు. తదుపరి కార్యాచరణను వచ్చే రెండు–మూడు రోజుల్లో ఖరారు చేస్తామని తెలిపారు. కొత్త చట్టాలు, పోరాటంపై న్యాయ సలహా తీసుకుంటామని రైతు సంఘం నాయకుడు శివకుమార్ కక్కా శనివారం చెప్పారు. సమస్య పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ఏర్పాటు చేస్తామన్న కమిటీలో చేరాలా? వద్దా? అనే దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వం దిగివచ్చేదాకా పోరాటం విరమించే ప్రసక్తే లేదని మరో నేత బల్బీర్‌సింగ్ తేల్చిచెప్పారు. వేలాది మంది రైతులు ఢిల్లీ శివార్లలోనే గత 23 రోజులుగా నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ పోరాటంలో పాల్గొంటున్నవారిలో ఇప్పటిదాకా 23 మంది రైతులు మరణించారని ఆలిండియా కిసాన్ సభ(ఏఐకేఎస్) వెల్లడించింది. -
15 రకాల వస్తు దిగుమతులను నివారించొచ్చు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి పిలుపునిచ్చిన ఆత్మ నిర్భర్ (స్వీయ సమృద్ధి) సాధన కోసం భారీగా దిగుమతి చేసుకుంటున్న 15 వస్తువులను అసోచామ్ గుర్తించింది. దేశీయంగా ఉత్పత్తిని పెంచడం ద్వారా వీటి విషయంలో స్వావలంబన సాధించొచ్చని పేర్కొంది. వీటిల్లో ఎలక్ట్రానిక్స్, బొగ్గు, ఐరన్–స్టీల్, నాన్ ఫెర్రస్ మెటల్స్, వంటనూనెలు, తదితర ఉత్పత్తులున్నాయి. ప్రతి నెలా 5 బిలియన్ డాలర్ల విలువైన (37,500 కోట్లు) ఈ వస్తువులను దిగుమతి చేసుకుంటున్నామని.. విదేశీ మారక నిల్వలకు భారీగా చిల్లు పెడుతున్న ఈ దిగుమతులకు వెంటనే కళ్లెం వేయాలని అసోచామ్ సూచించింది. దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న మే నెలలో 2.8 బిలియన్ డాలర్ల విలువైన (రూ.21,000 కోట్లు) ఎలక్ట్రానిక్ వస్తు దిగుమతులు నమోదయ్యాయి. హెచ్ఎంఏ ప్రెసిడెంట్‌గా సంజయ్ కపూర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ (హెచ్ఎంఏ) నూతన ప్రెసిడెంట్‌గా సంజయ్ కపూర్ ఎన్నికయ్యారు. 2020–21 కాలానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. పలు మల్టీనేషనల్ కంపెనీలకు ఆయన కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు. -
ఐదారేళ్ల క్రితమే ప్రమాదంలో పడింది
సాక్షి, న్యూఢిల్లీ: పరిశ్రమల సమాఖ్య అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా(అసోచామ్) వందేళ్ల ఉత్సవాల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఈ ప్రారంభ సమావేశాల సందర్బంగా అసోచామ్‌కు ప్రత్యేక శుభాకాంక్షలు అందచేసిన మోదీ ఐదారు సంవత్సరాల క్రితమే భారత ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడిందనీ, అయితే తమ సర్కారు దానికి కాపాడుకుందని మోదీ ప్రకటించారు. అయితే ప్రస్తుతం దేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన దిశగా పరుగులు తీస్తోందన్నారు. అయితే ఈ వృద్ధి ఇప్పటికిపుడు వచ్చింది కాదనీ గత అయిదేళ్లుగా చేసిన కృషి ఫలితమేనని తెలిపారు. భారతదేశ జీడీపీ వృద్ధి రేటు వరుసగా ఆరు త్రైమాసికాలుగా పడిపోతున్న తరుణంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థను అనేక సంస్కరణలతో చక్కదిద్దుకుంటూ వచ్చామని, ఆర్థిక వృద్ధికి అన్నిరకాలుగా కృషి చేశామని మోదీ వెల్లడించారు. 5-6 సంవత్సరాల వెనక్కిపోతున్న విపత్తునుంచి తమ సర్కారు ఆర్థిక వ్యవస్థను రక్షించిందనీ మోదీ తెలిపారు. దానికి స్థిరీకరించడమే కాక, క్రమశిక్షణ తీసుకొచ్చామన్నారు. అలాగే దశాబ్దాల కాలంగా పరిశ్రమ పెండింగ్ డిమాండ్లను తీర్చేందుకు శ్రద్ధపెట్టామన్నారు. ఈ నేపథ్యంలోనే 5 ట్రిలియన్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధనకు రోడ్ మ్యాప్ సిద్ధమైందన్నారు. ఈ లక్ష్యాన్ని ఛేదించే దిశగా అడుగులు వేగవంతమైనాయని మోదీ చెప్పారు. ఈ క్రమంలో పారిశ్రామిక వర్గాలనుంచి సానుకూల స్పందన లభిస్తోందన్నారు. రాత్రింబవళ్లు కష్టపడి ప్రజల డిమాండ్‌ను ఒక్కొక్కటిగా నెరవేర్చాం, జీఎస్టీని తీసుకు రావడంతోపాటు విప్లవాత్మకంగా అమలు చేశామని ఆయన తెలిపారు. ఈ శ్రమ ఫలితంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్‌లో భారత దేశ ర్యాంక్ మెరుగుపడిందని మోదీ తెలిపారు. అలాగే ఆర్థికవ్యవస్థ వృద్దితోపాటు, ఆధునికతను జోడించామని, ముఖ్యంగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థకోసం ఆధునిక, వేగవంతమైన డిజిటల్ నగదు లావాదేవీలను అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. మరోవైపు వ్యాపార వైఫల్యాలన్నీ అక్రమాలు, మోసాల వల్ల వచ్చినవి కాదనీ.. వ్యాపార వైఫల్యాలను నేరంగా పరిగణించలేమని ఈ సందర్భంగా ప్రధాని వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఇక కశ్మీర్లో పెట్టుబడుల జోరు..
న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభలో కూడా అమోదం పొందడాన్ని పరిశ్రమవర్గాలు స్వాగతించాయి. ఇది సాహసోపేతమైన నిర్ణయంగా పేర్కొన్నాయి. దీనితో అక్కడ పెట్టుబడులకు అవకాశం లభిస్తుందని, ఉద్యోగాల కల్పన కూడా జరుగుతుందని పేర్కొన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దుచేయడం చరిత్రాత్మకమైనదని అసోచాం ప్రెసిడెంట్ బీకే గోయెంకా చెప్పారు. దేశమంతటా ఒకే రాజ్యాంగం అమలయ్యేందుకు ఇది దోహదపడగలదన్నారు. దీనితో జమ్మూ కశ్మీర్‌లోని టూరిజం, రియల్ ఎస్టేట్, హస్తకళలు, హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర రంగాల్లోకి పెట్టుబడులు రాగలవన్నారు. అపార సహజ వనరులు, ప్రతిభావంతులు ఉన్న జమ్మూ కశ్మీర్ సమగ్ర అభివృద్ధికి తాజా పరిణామాలు దోహదపడగలవని సీఐఐ ప్రెసిడెంట్‌గా ఎంపికైన ఉదయ్ కొటక్ తెలిపారు. ఇక జమ్మూ కశ్మీర్లో పెట్టుబడులపై కార్పొరేట్ వర్గాలు దృష్టి పెడతాయని, దీనితో రాబోయే అయిదేళ్లలో స్థానిక యువతకు గణనీయంగా ఉద్యోగావకాశాలు లభించగలవని దాల్మియా భారత్ గ్రూప్ ఎండీ పునీత్ దాల్మియా చెప్పారు. -
అమెరికా వృద్ధి, రూపాయి పతనం.. ఎగుమతులకు అవకాశాలే: అసోచామ్
న్యూఢిల్లీ: అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి నాలుగేళ్లలోనే మెరుగైన స్థాయికి చేరడం, అదే సమయంలో రూపాయి విలువ పతనం అన్నవి మన దేశ ఎగుమతులకు మంచి అవకాశమని, నికర ఆదాయాలు పెరుగుతాయని అసోచామ్ అభిప్రాయపడింది. భారత్‌కు అమెరికా అతిపెద్ద ఎగుమతి కేంద్రంగా ఉన్న విషయం తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలో 47.9 బిలియన్ డాలర్ల (రూ.3.35 లక్షల కోట్లు)విలువైన ఎగుమతులు అమెరికాకు జరిగినట్టు వాణిజ్య శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో అమెరికా జీడీపీ 4.2 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత నాలుగేళ్లలోనే అధిక వృద్ధి రేటు ఇది. ‘‘2017–18 ఆర్థిక సంవత్సరంలో భారత దేశ ఎగుమతులు 303 బిలియన్ డాలర్లలో 16% అమెరికాకు వెళ్లినవే. వార్షికంగా 13.42% పెరిగాయి. భారతదేశ ఎగుమతులు... వస్తువులైనా, సేవలు అయినా అమెరికా అతిపెద్ద మార్కెట్. మరి అమెరికా ప్రస్తుత స్థాయిలోనే వృద్ధి చెందితే అది కచ్చితంగా భారత ఎగుమతులకు మంచిదే’’అని అసోచామ్ నివేదిక తెలిపింది. అయితే, రూపాయి విలువ వేగంగా క్షీణించడం వల్ల దేశ దిగుమతుల బిల్లుపై భారం పడుతుందని, కానీ అదే సమయంలో ఎగుమతుల ద్వారా నికర ఆదాయాలు పెరుగుతాయని అసోచామ్ వివరించింది. ఎగుమతులు మరింత గాడిన పడడం, జీఎస్టీ రిఫండ్లతో ఎగుమతిదారుల పోటీతత్వం ఇనుమడిస్తుందని, అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడేందుకు వీలు కలుగుతుందని అసోచామ్ తెలిపింది. ఇంజనీరింగ్, కెమికల్స్, జెమ్స్, జ్యుయలరీ ఎగుమతులు మన దేశం నుంచి అమెరికాకు ఎక్కువగా జరుగుతున్నాయి. -
ఈ కామర్స్‌పై అతి నియంత్రణతో నష్టమే!
హైదరాబాద్: ఈ కామర్స్ రంగంపై అతి నియంత్రణ దేశంలో నూతన వ్యాపారాల ఏర్పాటు వాతావరణాన్ని దెబ్బతీస్తుందని పారిశ్రామిక సంఘం అసోచామ్ ఆందోళన వ్యక్తం చేసింది. ధరల్ని ప్రభుత్వం నియంత్రించడమనేది తిరిగి ఇన్స్పెక్టర్ రాజ్‌కు దారితీస్తుందని వ్యాఖ్యానించింది. ఈ కామర్స్, మొత్తం ఆన్లైన్ విభాగం ఇప్పడిప్పుడే ఎదుగుతోందని, దీని విస్తరణకు ఎంతో అవకాశం ఉందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు. ‘‘ఏ వాణిజ్యానికి అయినా నిబంధనలన్నవి ఉండాల్సిందే. కానీ, అతి నిబంధనలు, అతి నియంత్రణలన్నవి అమలు చేయరాదు. ఇది వ్యాపార స్థాపన వృద్ధిని అణచివేస్తుంది’’ అని రావత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ఈ కామర్స్ విధానాన్ని తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఈ విధాన ముసాయిదాపై భాగస్వాముల అభిప్రాయాలను కోరింది. దీంతో అసోచామ్ గట్టిగా స్పందించడం గమనార్హం. వివిధ రకాల ధరల్ని అమలు చేయడం లేదా భారీ తగ్గింపులకు కాల పరిమితి విధింపు కూడా ఈ కామర్స్ విధానంలో ఉంది. ఈ కామర్స్ కంపెనీలు భారీ డిస్కౌంట్లు ఇస్తూ సంప్రదాయ వ్యాపారాలను దెబ్బతీస్తున్నాయన్న ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ నూతన విధానంపై దృష్టి సారించింది. కానీ భారీ తగ్గింపులన్నవి లేదా అసలు తగ్గింపులు లేకపోవడం అన్నది వ్యాపార పరమైన నిర్ణయాలని రావత్ పేర్కొన్నారు. భారీ తగ్గింపులపై ఆందోళన ప్రమోటర్లకు, వెంచర్ క్యాపిటలిస్టులు, ప్రైవేటు ఈక్విటీ ఫండ్స్‌కే ఉండాలన్నారు. -
రైతుల ఆదాయం, వృద్ధికి బలం
న్యూఢిల్లీ: ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్పీ) పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతుల ఆదాయం, వృద్ధి పెరిగేందుకు తోడ్పడుతుందని అసోచామ్ అభిప్రాయపడింది. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో 14 ఖరీఫ్ పంటలకు 50 శాతం మేర మద్దతు ధరల్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గత వారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వరి మద్దతు ధరను క్వింటాలుకు రూ.200 పెంచగా, ఒక్క దీనివల్లే ప్రభుత్వ ఖజానాపై రూ.15,000 కోట్ల భారం పడుతుంది. అయితే, ఉత్పత్తి వ్యయంపై 50 శాతం అదనపు ఆదాయం అందేలా చూస్తామని బీజేపీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ దిశగా ఈ నిర్ణయం ఉండడం గమనార్హం. ‘‘రైతుల సమస్యల నివారణకు మద్దతు ధరల పెంపు కచ్చితమైన లేదా సరైన పరిష్కారం కాదు. కానీ, దీర్ఘకాలిక సంస్కరణలకు ఎక్కువ సమయం తీసుకుంటుంది. అంతకాలం పాటు రైతులను కష్టాల్లో ఉండనీయకూడదు. మొత్తం వినియోగంలో గ్రామీణ ప్రాంతం 70% వాటా కలిగి ఉంది. గ్రామీణులకు తగినంత కొనుగోలు శక్తి రానంత వరకు భారత పరిశ్రమలకు డిమాండ్ పుంజుకోదు’’ అని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ అన్నారు. ధరల పెంపుతో ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న ఆందోళనను ధాన్యం, కూరగాయల మార్కెట్లలో యంత్రాంగాన్ని మెరుగుపరచడం ద్వారా పరిష్కరించొచ్చని రావత్ సూచించారు. వ్యవసాయ ఉత్పత్తుల ధరల పెంపునకు కారణమయ్యే మార్కెట్ దళారులకు కళ్లెం వేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించగలవన్నారు. ద్రవ్యోల్బణం, జీడీపీపై ప్రభావం: డీబీఎస్ న్యూఢిల్లీ: ఖరీఫ్ పంటలకు మద్దతు ధరల పెంపు వల్ల జీడీపీపై 0.1– 0.2% వరకు ప్రభావం పడుతుందని, దీనికి తోడు ద్రవ్యోల్బణంపైనా దీని ప్రభావం ఉంటుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల సంస్థ డీబీఎస్ ఓ నివేదిక విడుదల చేసింది. ద్రవ్య పరమైన వ్యయాల పెరుగుదలకు దారితీస్తుందని అభిప్రాయపడింది. జీడీపీపై ప్రభావం నేపథ్యంలో అధిక ఆదాయ మద్దతు అవసరమని లేదా మూలధన వ్యయాలను తగ్గించుకుంటేనే 2018–19లో ద్రవ్యలోటు లక్ష్యాలపై ప్రభావం పడకుండా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆహార సబ్సిడీ కోసం ప్రభుత్వం బడ్జెట్లో రూ.1.70 లక్షల కోట్లు కేటాయించగా, మద్దతు ధరల పెంపు వల్ల సబ్సిడీ బిల్లు రూ.2లక్షల కోట్లు దాటిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. మద్దతు ధరల పెంపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలి ఉన్న కాలంలో ద్రవ్యోల్బణంపై 25–30 బేసిస్ పాయింట్ల మేర ప్రభావం ఉంటుందని డీబీఎస్ నివేదిక తెలియజేసింది. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు ఒత్తిళ్ల నేపథ్యంలో ఆర్బీఐ మరో విడత రేట్లను పెంచొచ్చని అంచనా వేసింది. -
‘జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులు’
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమనడంతో వీటిపై ఎక్సైజ్ సుంకాలను తగ్గించాలని, జీఎస్టీ పరిధిలోకి పెట్రో ఉత్పత్తులను తీసుకురావాలని పరిశ్రమ సంస్థలు ఫిక్కీ, అసోచామ్ కేంద్రాన్ని కోరాయి. పెట్రో ధరల రోజువారీ సవరణలో భాగంగా తాజా పెంపుతో పెట్రోల్ లీటర్ రూ 80 దాటి అత్యంత గరిష్టస్థాయిని నమోదు చేసింది. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న క్రమంలో పెట్రో ఉత్పత్తుల ధరలు ఆకాశానికి అంటడం ఆందోళనకరమని ఫిక్కీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా, దేశ రాజధాని సహా పలు ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు గరిష్టస్ధాయిలకు చేరాయి. మరోవైపు పెట్రో ఉత్పత్తుల ధరలు రికార్డు స్ధాయికి చేరడంతో చమురు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు. ఇంధన ధరలు పెరగడం పట్ల ప్రభుత్వం ఆందోళన చెందుతోందని, దీన్ని నివారించేందుకు పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామని, దీనిపై త్వరలోనే ఓ పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకంలో కోత విధించడం ద్వారా వినియోగదారులకు తాత్కాలికంగా ఊరట లభిస్తుందని, అయితే పెట్రో ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవడం ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని అసోచామ్ సెక్రటరీ జనవర్ డీఎస్ రావత్ అన్నారు. ఇంధన భద్రతపై భారత్ దృష్టి కోణం మారాలని, వీటిని భారీ ఆదాయ వనరుగా ప్రభుత్వాలు పరిగణించరాదని సూచించారు. -
వాణిజ్య యుద్ధంతో భారత్‌కు దెబ్బ!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమైతే భారత్‌పై ప్రతికూల ప్రభావం ఉంటుందని, ముఖ్యంగా ఎగుమతులు దెబ్బతింటాయని పారిశ్రామిక మండలి అసోచామ్ పేర్కొంది. ‘ఇప్పుడు మొదలైన వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తే, భారత్ ఆర్థిక వ్యవస్థకు నష్టం వాటిల్లుతుంది. ఎగుమతులు పడిపోవడంతోపాటు కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) ఎగబాకేందుకు దారితీయొచ్చు. దీంతో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి రేటు దిగజారే ప్రమాదం ఉంటుంది’ అని అసోచామ్ ఒక ప్రకటనలో తెలిపింది. అమెరికా మొదలుపెట్టిన ఈ రక్షణాత్మక చర్యలతో భారత్‌లో కూడా ఆర్థికపరమైన సెటిమెంట్ తీవ్రంగా దెబ్బతింటుందని అభిప్రాయపడింది. ఒకవేళ భారత్ కూడా దిగుమతులపై ఇలాంటి ప్రతిచర్యలకు దిగితే... ఎగుమతులపై ప్రభావం పడుతుందని, విదేశీ మారకం రేట్లలో తీవ్ర కుదుపులను చవిచూడాల్సి వస్తుందని పేర్కొంది. ఈ ముప్పునుంచి తప్పించుకోవడం కోసం ఒక నిర్ధిష్ట ప్రణాళికను ముందుగానే రూపొందించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ రక్షణాత్మక చర్యల ప్రభావం నుంచి తప్పించుకోవడం కోసం కీలక వాణిజ్య భాగస్వామ్య దేశాలతో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని మరింత పెంపొందించుకోవాలని అభిప్రాయపడింది. మన క్యాపిటల్ మార్కెట్లో ఇన్వెస్టర్ల విశ్వాసం దెబ్బతింటే.. పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు తిరోగమన బాటపడతాయని.. దీనివల్ల డాలరుతో రూపాయి మారకం విలువపై తీవ్ర ప్రతికూలత తప్పదని అసోచామ్ పేర్కొంది. -
వాణిజ్య యుద్ధం మనకొద్దు
న్యూఢ్లిలీ: అమెరికా సర్కారు ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై పన్ను విధిస్తూ అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధానికి ఆజ్యం పోసిన నేపథ్యంలో, కీలకమైన భాగస్వామ్య దేశాలతో ద్వైపాక్షిక సహకారం ద్వారా ఎగుమతుల పెంపుపై దృష్టి సారించాలని పారిశ్రామిక సంఘం అసోచామ్ సూచించింది. అమెరికా ఒక్క దేశంతోనే మనకు 150 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటు ఉందని, ఈ నేపథ్యంలో ప్రతీకార చర్యలు సరికాదని పేర్కొంది. ఎందుకంటే మన దిగుమతులు అన్నీ కూడా సహజ అవసరాలేనని గుర్తు చేసింది. మన ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువని, ఈ దృష్ట్యా ప్రతిఘటనకు అవకాశం లేదని పేర్కొంది. మన దిగుమతుల్లో చాలా వరకు అనివార్యమైనవని తెలియజేసింది. ఈ నేపథ్యంలో మన ఎగుమతులపై ప్రభావం పడితే ద్వైపాక్షిక సహకారం ద్వారా, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) చానల్‌ను నిబంధనలకు అనుగుణంగా వినియోగించుకోవాలని ఓ ప్రకటనలో ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన ఎగుమతుల బిల్లు 300 బిలియన్ డాలర్లుగా, దిగుమతుల బిల్లు 450 బిలియన్ డాలర్ల మేర ఉంటుందని పేర్కొంది. దిగుమతుల్లోనూ ఒక వంతు చమురు ఉత్పత్తులేనని గుర్తు చేసింది. ప్లాస్టిక్, ఫెర్టిలైజర్ తదితర దేశీయంగా తగినంత ఉత్పత్తి లేని కమోడిటీలేనని తెలియజేసింది. అమెరికా అధిక పన్నులు వేసినందున స్టీల్ దిగుమతుల్లో ఉన్నట్టుండి పెరుగుదల ఉంటుందేమో దృష్టి పెట్టాలని సూచించింది. స్టీల్ దిగుమతులపై 25 శాతం, అల్యూమినియం దిగుమతులపై 10 శాతం సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. అవసరమైతే మరిన్ని ఉత్పత్తులను అధిక టారిఫ్ పరిధిలోకి తీసుకొస్తామ ని, అమెరికా ప్రయోజనాల పరిరక్షణకు వాణిజ్య యుద్ధానికి సైతం సిద్ధమేనని ఆయన పేర్కొనడం తెలిసిందే. -
ఆధార్ లింక్ గడువు పెంపు?
న్యూఢిల్లీ: ఆధార్‌తో బ్యాంకు ఖాతాల అనుసంధానికి ఇచ్చిన గడువును పొడిగించాలని, ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంకులకు ఇది అవసరమని పరిశ్రమల సమాఖ్య అసోచామ్ సూచించింది. పీఎన్బీ స్కామ్ అనంతరం ప్రభుత్వరంగ బ్యాంకుల (పీఎస్బీ) సిబ్బంది తమ ప్రధాన వ్యాపారాన్ని కాపాడుకునే క్రమంలో ఉన్నారని, ఆధార్ అనుసంధానం కోసం వారిపై ఒత్తిడి తీసుకురావడం తగదని అభిప్రాయపడింది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ తాలూకు ప్రభావాల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా బయటకు రాలేదని, మార్చి 31 తర్వాత బ్యాంకు ఖాతాలు నిర్వహణ రహితంగా మారిపోయే రూపంలో ఎదురయ్యే మరో సవాలుకు సిద్ధంగా లేదని పేర్కొంది. ఆధార్‌తో బ్యాంకు ఖాతాల అనుసంధానానికి ఈ ఏడాది మార్చి 31 వరకు గడువు ఉంది. అయితే, కస్టమర్ల ఖాతాలన్నింటినీ మార్చి 31లోపు ఆధార్‌తో అనుసంధానించడం సవాలుతో కూడుకున్నదని, కనుక గడువును పొడిగించాల్సిన అవసరం ఉందని సూచించింది. ఆధార్‌తో అనుసంధాన లక్ష్యాన్ని చేరేకంటే ముందుగానే బ్యాంకులు ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు అవకాశం ఇవ్వాలని కోరింది. -
విస్తరిస్తున్న విలాస మార్కెట్
ముంబై: ఖరీదైన బ్రాండెడ్ ఉత్పత్తుల వినియోగం పట్ల మక్కువ చూపే వారి సంఖ్య పెరుగుతోంది. అంతర్జాతీయ బ్రాండెడ్ ఉత్పాదనలు అందుబాటులోకి వస్తుండడంతో ఈ మార్కెట్ 30 శాతం వృద్ధితో డిసెంబర్ నాటికి 30 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా. ప్రస్తుత దేశీయంగా సంపన్న ఉత్పత్తుల మార్కెట్ విలువ 23.8 బిలియన్ డాలర్ల మేర ఉంది. ‘‘యువతలో అంతర్జాతీయ బ్రాండ్ల వినియోగం పెరుగుతుండటం, చిన్న పట్టణాల్లో ఉన్నత తరగతి ప్రజలు కొనుగోలు శక్తితో లగ్జరీ కార్లు, బైక్‌లు, విదేశీ పర్యటనలు, దూర ప్రాంత వివాహాలు తదితర వాటితో ఈ మార్కెట్ ఈ ఏడాది చివరికి 30 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది’’ అని అసోచామ్ తన నివేదికలో పేర్కొంది. రానున్న మూడేళ్లలో ఈ మార్కెట్ ఐదు రెట్ల మేర వృద్ధి చెందుతుందని అంచనా వేసింది. వృద్ధికి కారకాలు... ∙మిలియనీర్ల సంఖ్య వచ్చే ఐదేళ్లలో మూడు రెట్లు పెరగనుండటం. ∙ఆర్థిక వృద్ధి పట్టణీకరణకు దారితీయడం, ఆదాయం పెరుగుతుండటం. ∙విలాస ఉత్పత్తుల అందుబాటు, మరిన్ని విలాస బ్రాండ్లు దేశంలోకి ప్రవేశించడం. ∙చిన్న పట్టణాల్లో ఇంటర్నెట్ వ్యాప్తి, ఖర్చు చేసే ఆదాయం పెరగడం వల్ల 2020 నాటి కి ఇంటర్నెట్పై 10 కోట్ల లావాదేవీలు జరుగుతాయి. దీంతో ఖరీదైన ఉత్పత్తుల వినియోగం ఎన్నో రెట్లు పెరగనుంది. ∙వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా బ్రాండ్లను ప్రమోట్ చేసుకోవడం. ∙రిటైల్ పరిశ్రమకు సంబంధించి సానుకూల విధానాల ఫలితంగా అంతర్జాతీయ బ్రాండ్లకు ఆకర్షణీయంగా మారిన భారత్ మార్కెట్. -
టార్గెట్లతో ఉద్యోగుల ఉక్కిరిబిక్కిరి
సాక్షి, మంగళూరు : కార్పొరేట్ ఉద్యోగులు పని ఒత్తిళ్లతో సతమతమవుతున్నారని, రోజుకు 6 గంటలకన్నా తక్కువగా నిద్రిస్తున్నారని అసోచామ్ హెల్త్‌కేర్ కమిటీ నివేదిక వెల్లడించింది. యాజమాన్యాల ఒత్తిళ్లతో ఉద్యోగులు రక్తపోటు, మధుమేహం వంటి జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. అసంబద్ధ టార్గెట్లను నిర్ధేశిస్తుండటంతో ఉద్యోగులు నిద్ర సమస్యలతో పాటు, భౌతిక, మానసిక రుగ్మతలను ఎదుర్కొంటున్నారని, చివరకు విధులకు గైర్హాజరయ్యే పరిస్థితి ఎదురవుతోందని నివేదిక పేర్కొంది. నిద్ర కొరవడటం ఉత్పాదకతపై ప్రభావం చూపుతోందని నివేదికను విడుదల చేస్తూ అసోచామ్ వివరించింది. పనిప్రదేశాల్లో ఒత్తిళ్లు, పై అధికారుల వేధింపులతో ఉద్యోగుల శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని తెలిపింది. కార్యాలయంలో ఒత్తిళ్ల కారణంగా తాము సరిగ్గా పనిచేయలేకపోతున్నామని, పలు రుగ్మతలు ఎదుర్కొంటున్నామని సర్వేలో పాల్గొన్నవారిలో 46 శాతం మంది వెల్లడించినట్టు తేలింది. ఇక విధినిర్వహణలో ఒత్తిళ్ల కారణంగా తాము తరచూ తలనొప్పితో బాధపడుతున్నామని మరో 42 శాతం మంది పేర్కొనగా, నిద్ర సమస్యలతో తాము కుంగుబాటుకు లోనవుతున్నామని 49 శాతం మంది చెప్పుకొచ్చారు. ఇక సర్వేలో పలకరించిన ఉద్యోగుల్లో 16 శాతం మంది ఒబెసిటీతో బాధపడుతున్నామని చెప్పగా, 11 శాతం మంది డిప్రెషన్‌తో సతమతమవుతున్నామని తెలిపారు. ఇక హైబీపీతో 9 శాతం మంది, డయాబెటిస్తో 8 శాతం మంది బాధపడుతున్నట్టు తెలిసింది. స్పాండిలైసిస్తో 5.5 శాతం, గుండెజబ్బులతో 4 శాతం కార్పొరేట్ ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నట్టు చెప్పుకొచ్చారు. -
రుణ వృద్ధి 8 శాతమే: అసోచామ్
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దాదాపు ఎనిమిది శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని అసోచామ్ అధ్యయనం ఒకటి పేర్కొంది. ఆర్థిక వ్యవస్థలో మందగమనం, ఇప్పటికే మొండి బకాయిల సమస్యతో సతమతం అవుతున్న బ్యాంకింగ్ వంటి అంశాలు రుణ వృద్ధి మందగమనానికి ప్రధాన కారణంగా విశ్లేషించింది. 2017 మా ర్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆహారేతర వి భాగ రుణ వృద్ధి కేవలం 5.1 శాతం. ఇది 50 సంవత్సరాల కనిష్టస్థాయి. అయితే తాజా అధ్యయనం ప్రకారం– ఈ రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొంత మెరుగుపడుతుండడం కొంత ఆశావహ పరిణామం. రిటైల్, వ్యవసాయ రంగాల నుంచి రుణ డిమాండ్ కొంత మెరుగుపడుతుండడం దీనికి కారణం. -
ఈ–కామర్స్ మార్కెట్@ 50 బిలియన్ డాలర్లు
ముంబై: దేశీ ఈ–కామర్స్ మార్కెట్ వచ్చే ఏడాది 50 బిలియన్ డాలర్ల స్థాయిని అధిగమించనుంది. ఇంటర్నెట్ వినియోగం, ఆన్లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య పెరుగుతుండటం ఇందుకు తోడ్పడనుంది. దేశీ డిజిటల్ కామర్స్ మార్కెట్ ప్రస్తుతం 38.5 బిలియన్ డాలర్లుగా ఉంది. పరిశ్రమల సమాఖ్య అసోచామ్–కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్ సంయుక్తంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నివేదిక ప్రకారం 2013లో 13.6 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీ ఈ–కామర్స్ మార్కెట్ 2015లో 19.7 బిలియన్ డాలర్లకు పెరిగింది. మొబైల్స్.. ఇంటర్నెట్ వినియోగం, ఎం–కామర్స్ అమ్మకాలు పెరగడం, రవాణా.. చెల్లింపులకోసం అత్యాధునిక ఆప్షన్స్ అందుబాటులో ఉండటం, ఆకర్షణీయమైన డిస్కౌంట్లు మొదలైనవి ఈ–కామర్స్ అసాధారణ వృద్ధికి ఊతమిస్తున్నాయని నివేదిక వివరించింది. సీవోడీకే ప్రాధాన్యం.. ►ఆన్లైన్ చెల్లింపులకు బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు సురక్షితమైన విధానాలను అందుబాటులోకి తెచ్చినా .. కొనుగోలుదారులు ఎక్కువగా క్యాష్ ఆన్ డెలివరీ (సీవోడీ) విధానాన్నే ఎంచుకుంటున్నట్లు వెల్లడైంది. ► ఆన్లైన్ చెల్లింపు విధానాలపై నమ్మకం లేకపోవడం, క్రెడిట్.. డెబిట్ కార్డుల వినియోగం తక్కువగా ఉండటం, భద్రతపరమైన అంశాలపై సందేహాలు మొదలైనవి ఇందుకు కారణం. ►50 శాతం పైచిలుకు ఆన్లైన్ లావాదేవీలు సీవోడీ విధానంలోనే ఉంటున్నాయి. మరోవైపు ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లో ప్రతి ముగ్గురు కస్టమర్లలో ఒకరు మొబైల్స్ ద్వారా కొనుగోళ్లు జరుపుతున్నారని, మొబైల్ లావాదేవీల పెరుగుదలకు ఇది నిదర్శనమని నివేదిక పేర్కొంది. ►ఆన్లైన్ షాపర్స్‌లో 65% మంది పురుషులే ఉంటుండగా, 35% మహిళలు ఉంటున్నారు. ►2017లో అత్యధికంగా అమ్ముడైన ఉత్పత్తుల్లో మొబైల్ ఫోన్స్, దుస్తులు, ఆహార ఉత్పత్తులు, ఆభరణాలు మొదలైనవి ఉన్నాయి. ► తరచూ షాపింగ్ చేసే వారిలో 28 శాతం మంది 18–25 సంవత్సరాల మధ్య వయస్సుగలవారు కాగా, 42 శాతం మంది 26–35 సంవత్సరాల గ్రూప్‌లో ఉన్నా రు. 36–45 సంవత్సరాల గ్రూప్ వారు 28 శాతం మంది, 45–60 ఏళ్ల మధ్య వారు 2% మంది ఉంటున్నారు.