4జీతో నాలుగేళ్లలో రూ.79,000ఆదాయం: అసోచామ్
న్యూఢిల్లీ: హై స్పీడ్ 4జీ కనెక్షన్‌లు 2020 నాటికి దేశ మొత్తం యూజర్ బేస్‌లో 17 శాతానికి చేరే అవకాశం ఉందని అసోచామ్‌కేపీఎంజీ అధ్యయన పత్రం ఒకటి తెలిపింది. ఇదే కాలానికి ఆదాయం రూ.79,580 కోట్లకు పెరుగుతుందని కూడా వెల్లడించింది. పవరింగ్ డిజిటల్ ఇండియా పేరుతో ఈ అధ్యయన పత్రం రూపొందింది. డిజిటల్ ఇండియా, స్మార్ సిటీస్ వంటి కీలక చొరవల నుంచి అధిక స్పీడ్ ఇంటర్‌నెట్ సేవలకు మంచి డిమాండ్ ఉంటుందని అధ్యయనం తెలిపింది.
దీనితోపాటు ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, వేగంగా సామాజిక పథకాల అమల్లో కూడా 4జీ సేవలు కీలకం కానున్నట్లు వెల్లడించింది. అయితే రిలయన్స్ జియో గానీ లేక ప్రస్తుతం సేవలు అందిస్తున్న ఇతర ఆపరేటర్లపేరుకానీ ప్రస్తావించని అధ్యయన పత్రం, ఉమ్మడి లక్ష్యాల దిశగా పనిచేయడానికి పరిశ్రమలోని వివిధ వర్గాల మధ్య పరస్పర సహకారం అవసరమని పేర్కొంది. వ్యాపార విస్తరణకు ఆపరేటర్లు అందరికీ తగిన అవకాశం ఉంటుందని నివేదిక పేర్కొంది. అయితే తగిన ధరలవైపే వినియోగదారులు మొగ్గుచూపుతారని నివేదిక పత్రంలో అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ పేర్కొన్నారు.