బ్యాంకింగ్‌కు రూ.5 లక్షల కోట్లు అవసరం: అసోచామ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ బ్యాంకింగ్ ప్రమాణాలకు సంబంధించి బాసెల్ 3 అమలుకు భారత్ బ్యాంకులకు రూ. 5 లక్షల కోట్ల మూలధనం అవసరమవుతుందని అసోచామ్-ఎన్‌ఐబీఎం అధ్యయనం ఒకటి తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన ప్రకారం.. బాసెల్ ప్రమాణాల అమలుకుగాను 2019 మార్చి నాటికి ఈ నిధుల అవసరం ఏర్పడుతుందని సోమవారం విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది.
సమీప కాలంలో భారీగా 20 శాతం రుణ వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని కూడా అంచనావేసింది. ఇప్పటికే తీవ్రంగా ఉన్న మొండి బకాయిల భారం, స్టాక్ మార్కెట్ల ఒడిదుడుకులు వంటి అంశాల నేపథ్యంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు భారీ మూలధనం సమకూర్చుకోవడం సవాలేనని కూడా పేర్కొంది.