
ఏఐ అమలుతో 10 శాతం మందికి ఉద్వాసన
సంస్థ సీఈవో పీయూష్ గుప్తా
ముంబై: అంతర్జాతీయ బ్యాంకింగ్ సంస్థ డీబీఎస్ గ్రూప్ కృత్రిమ మేధ (ఏఐ) అమలుతో వచ్చే మూడేళ్లలో 10 శాతం మేర సిబ్బందిని తగ్గించుకోనున్నట్టు ప్రకటించింది. తమ కార్యకలాపాల్లో ఏఐని మరింత పెద్ద ఎత్తున వినియోగించనున్నట్టు సంస్థ సీఈవో పీయూష్ గుప్తా తెలిపారు. డీబీఎస్ గ్రూప్‌లో 15 ఏళ్ల తన పదవీ కాలంలో మొదటిసారి ఉద్యోగాల సృష్టి పరంగా ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్టు చెప్పారు.
ఏఐ అన్నది భిన్నమైనదని, గతంలో వచ్చిన మరే ఇతర సాంకేతిక పరిజ్ఞానం మాదిరి కాదన్నారు. వచ్చే మూడేళ్లలో 4,000 మంది (10 శాతం) సిబ్బంది తగ్గిపోనున్నట్టు తన ప్రస్తుత అంచనాగా చెప్పారు. నాస్కామ్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడారు. ‘‘ఏఐ ఎంతో శక్తిమంతమైనది. తనను తాను సొంతంగా ఆవిష్కరించుకోగలదు. మరొకరిని అనుసరించగలదు. ఇది ఎంతో భిన్నమైనది.
గత పదేళ్లలో గ్రూప్‌లో ఉద్యోగాల కోత అన్నదే లేదు’’అని గుప్తా ఏఐ రాకతో గ్రూప్ స్థాయిలో చోటుచేసుకోనున్న మార్పులను వివరించారు. డీబీఎస్ గ్రూప్ రెండేళ్ల క్రితమే జెనరేటివ్ ఏఐ సొల్యూషన్లను అమలు చేయడం ప్రారంభించిందని, ఇందుకు సంబంధించి పూర్తి ప్రయోజనాలను ఇంకా చవిచూడాల్సి ఉందన్నారు. కస్టమర్లను చేరుకోవడం, క్రెడిట్ అండర్‌రైటింగ్ (రుణ వితరణ), నియామకాల్లో ఏఐని డీబీఎస్ గ్రూపు అమలు చేస్తోంది.
కాంట్రాక్టు సిబ్బందే..
వచ్చే మూడేళ్లలో 4,000 మందితగ్గింపు అన్నది ప్రధానంగా కాంట్రాక్టు, తాత్కాలిక సిబ్బంది రూపంలోనే ఉంటుందని డీబీఎస్ గ్రూప్ వివరణ ఇచ్చింది. సహజంగా కంపెనీ నుంచి వెళ్లిపోయే ఉద్యోగుల రూపంలోనూ సిబ్బంది తగ్గనున్నట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment