Artificial Intelligence To Predict Court Judgments - Sakshi
Sakshi News home page

30 కోట్ల ఉద్యోగాలకు ఎసరు తప్పదా?.. ఏఐ ప్రతికూల ప్రభావం ఎంత?

Published Tue, Jul 4 2023 9:22 AM | Last Updated on Tue, Jul 4 2023 3:05 PM

Artificial Intelligence To Predict Court Judgments - Sakshi

(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి): కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా అన్ని రంగాల్లోకి విస్తరించడం మొదలైంది! ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రాకతో కార్యాలయాల పని తీరు, జీవన విధానాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ఐటీ) తీసుకొచ్చిన మార్పులు 50 ఏళ్ల క్రితం ఊహాతీతమైన అంశాలే. ఇప్పుడున్న అంచనాల మేరకు ఏఐని అన్ని రంగాలకు విస్తరిస్తే ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల ఉద్యోగాలకు ఎసరు తప్పదని నిపుణుల నివేదిక అంచనా వేస్తోంది. అయితే సరికొత్త అవకాశాలు ప్రపంచం ముందు ఆవిష్కృతమవుతాయని పేర్కొంటున్నారు.

ఏఐ రాకతో గ్లోబల్‌ జీడీపీ 7 శాతం పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు. అమెరికాలో పారిశ్రామిక అవసరాలు, నైపుణ్యాలు, ప్రజల అవసరాలకు అనుగుణంగా 900 రకాల ఉద్యోగాలకు సంబంధించి ‘ఓనెట్‌’ డేటాబేస్‌ను రూపొందించింది. ఈ ఉద్యోగాలపై ‘ఏఐ’ ప్రభావం ఎంత మేరకు ఉంటుందనే అంశాన్ని ‘గోల్డ్‌మాన్‌ శాక్స్‌ గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌’ తాజా నివేదికలో విశ్లేషించింది. ‘ద పొటెన్షియల్లీ లార్జ్‌ ఎఫెక్టస్‌ ఆఫ్‌ ఏఐ ఆన్‌ ఎకనమిక్‌ గ్రోత్‌’ పేరిట వెలువరించిన ఈ  నివేదికలో ఏఐ రాకతో పరిశ్రమల స్వరూపం, ఉద్యోగాల తీరుతెన్నులూ మారతాయని అంచనా వేసింది. కొత్త నైపుణ్యాలు అవసరమని పేర్కొంటూ ఇప్పుడున్న ఉద్యోగాలపై  ప్రతికూల ప్రభావం తప్పదనే విషయాన్ని ప్రస్తావించింది.  

కోర్టు తీర్పులను అంచనా వేసే స్థాయికి.. 
ఏఐ ప్రతికూల ప్రభావం చూపే తదుపరి రంగం లీగల్‌. కాంట్రాక్ట్‌ ఒప్పందాల విశ్లేషణ లాంటి చాలా అంశాలు ‘ఆటోమేషన్‌’ పరిధిలోకి వస్తాయని నివేదిక పేర్కొంది. ఇంకో అడుగు ముందుకేసి న్యాయస్థానాల్లో గతంలో వెలువడ్డ తీర్పు­ల ఆధారంగా తాజా కేసులో ఎలాంటి తీర్పు వస్తుందనే విషయాన్ని ముందుగానే అంచనా వేసే స్థాయి ఏఐకి ఉందని నివేదికలో పేర్కొనడం గమనార్హం.

కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే రంగాల్లో మాత్రం ఏఐ ప్రభావం పెద్దగా ఉండదని నివేదిక పేర్కొంది. ఏఐ ఇప్పటికి కొత్త సాంకేతిక పరిజ్ఞానమే! అభివృద్ధి చెందే సామర్థ్యం, వివిధ రంగాలు ఏఐని వినియోగించుకొనే శక్తిపై భవిష్యత్తు మార్పు­లు ఆధారపడి ఉంటాయి. కొత్త సాంకేతికతను ఆహ్వానించే తీరు అన్ని దేశాలు, రంగాలకు ఒకే రకంగా లేదని, కొన్ని మాత్రం ఏఐని ఆహ్వానించేందుకు తహతహలాడు తున్నాయని నివేదిక పేర్కొంది.

సగం ఉద్యోగాలకు కోత! 
ఏఐ ప్రవేశంతో గరిష్టంగా ఆఫీస్, అడ్మిని‍స్ట్రేటివ్‌ సపోర్ట్‌ ఉద్యోగాల్లో 46 శాతం కోత ప్రభావం ఉంటుందని గోల్డ్‌మాన్‌ శాక్స్‌ నివేదిక అంచనా వేసింది. సమావేశాలను షెడ్యూ ల్‌ చేయడం, నివేదికలు రూపొందించడం, డేటా సిద్ధం చేసి అందించడం లాంటివి ఈ ఉద్యోగాలను నిర్వర్తించే వారి ప్రధాన విధు లు. ఏఐ వల్ల ఇలాంటి ఉద్యోగుల అవసరం దాదాపు సగం తగ్గుతుందని అంచనా.

ముందు వరుసలో చైనా, సౌదీ, భారత్‌ 
ఏఐ రాకతో సేవలు, ఉత్పాదకత మరింత మెరుగుపడతాయా? క్షీణిస్తాయా? అనే అంశంపై మల్టీ నేషనల్‌ మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ ‘ఐపీఎస్‌వోఎస్‌’ వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం కోసం పలు దేశాల్లో సర్వే చేసింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలున్న దేశా­ల్లో ప్రజలు కృత్రిమ మేధను ఆహ్వానించడానికి సానుకూలంగా ఉండగా ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో అంత సానుకూలంగా లేరని పేర్కొంది. చైనాలో 78 శాతం మంది, సౌదీ అరేబియాలో 76 శాతం, భారత్‌లో 71 శాతం మంది ఏఐ పట్ల సానుకూలంగా స్పందించారు. బ్రిటన్‌లో 38 శాతం, జర్మనీ, ఆ్రస్టేలియాలో 37 శాతం, అమెరికాలో 35 శాతం, కెనడాలో 32, ఫ్రాన్స్‌­లో 31 శాతం మంది మాత్రమే ఏఐ పట్ల సానుకూలత వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement