
ఆ టెక్నాలజీ తెలుసుకుని ఉండటం అవసరం
రైతన్నకూ ఏఐ అవసరం పడుతుంది..
ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్–2025 నివేదికలో వెల్లడి
ఏఐతో కొన్ని ఉద్యోగాలు పెరుగుతాయి.. మరికొన్ని తగ్గుతాయని స్పష్టీకరణ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ ఆర్థిక వేదిక ఇటీవల విడుదల చేసిన ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్–2025’ఉద్యోగాలకు సంబంధించి పలు ఆసక్తికరమైన వివరాలు వెల్లడించింది. కిందిస్థాయి ఉద్యోగాల్లోకి సైతం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చొరబడుతోందని, ఫలితంగా 2030 నాటికి కొన్ని రంగాల్లో ఉద్యోగాలు పెరుగుతాయని, మరికొన్ని రంగాల్లో ఉద్యోగాలు క్రమంగా కనుమరుగయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
2030 నాటికి బస్ కండక్టర్ వంటి ఉద్యోగానికి కూడా ఏఐ టెక్నాలజీ తెలుసుకుని ఉండటం అవసరమని, ఆఖరుకు వ్యవసాయం చేసే వాళ్ళకూ ఏఐ టెక్నాలజీ అవసరం ఏర్పడుతుందని ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ (ఉద్యోగాల భవిష్యత్తు) రిపోర్టు పేర్కొంది. జాబ్ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కోర్సుల్లో సీట్లు పెంచాలని, విద్యార్థుల్లో ఆ మేరకు నైపుణ్యం పెంచాలని సూచించింది.
2023లో సేకరించిన లెక్కల ప్రకారం భారత్‌లో 4.16 లక్షల మంది మాత్రమే ఏఐ నిపుణులు ఉన్నారు. కాగా 2025 చివరి నాటికి 6.29 లక్షలు 2026 నాటికి 10 లక్షల ఏఐ నిపుణులు అవసరమని పేర్కొంది. ఈ మేరకు కంప్యూటర్ కోర్సుల్లో సిలబస్‌ను మార్చాలని ఏఐ ఆధారిత పరిశ్రమల తోడ్పాటుతో సిలబస్‌కు రూపకల్పన చేయాలని సూచిస్తోంది.
అంతర్జాతీయ యూనివర్శిటీలు ఇప్పటికే ఈ బాటలో పయనిస్తున్నాయి. అమెరికా స్కూల్ స్థాయి నుంచే ఏఐపై బోధన చేస్తోంది. భారత్ కూడా ఈ దిశగా పయనించాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు.