కనిపెట్టేందుకు సిద్ధమైన మెటా
వయసుకు తగ్గ కంటెంట్ అందించే యత్నం
టీనేజీ యూజర్లు అసభ్య, అనవసర కంటెంట్ బారిన పడకుండా, వాటిని చూడకుండా కట్టడిచేసేందుకు, వారి మానసిక ఆరోగ్యం బాగుకోసం సామాజికమాధ్యమం ఇన్‌స్టా గ్రామ్ నడుం బిగించింది. ఇందుకోసం ఆయా టీనేజర్ల వయసును కనిపెట్టే పనిలో పడింది. తప్పుడు క్రిడెన్షియల్స్, సమాచారంతో లాగిన్ అయినాసరే ఇన్‌స్టా గ్రామ్ యాప్‌ను వాడుతున్నాసరే దానిని కనిపెట్టి అడ్డుకునేందుకు కృత్రిమ మేథ సాయం తీసుకుంటామని దాని మాతృసంస్థ ‘మెటా’వెల్లడించింది.
ఎలా కనిపెడతారు?
అడల్ట్ క్లాసిఫయర్ పేరిట కొత్త ఏఐ టూల్‌ను మెటా వినియోగించనుంది. దీంతో యూజర్ల వయసును అత్యంత ఖచ్చితత్వంతో నిర్ధారించుకోవచ్చు. ఆన్‌లైన్‌లో ఎలాంటి కంటెంట్‌ను యూజర్ వీక్షిస్తున్నాడు?, ఆ యూజర్ ప్రొఫైల్‌లో పొందుపరిచిన వివరాలతో వయసుపై తొలుత ప్రాథమిక అంచనాకొస్తారు. తర్వాత ఈ యూజర్‌ను ఏఏ వయసు వాళ్లు ఫాలో అవుతున్నారు?, ఈ యూజర్‌తో ఎలాంటి కంటెంట్‌ను పంచుకుంటున్నారు?, ఎలాంటి అంశాలపై ఛాటింగ్ చేస్తున్నారు? ఏం ఛాటింగ్ చేస్తున్నారు? వంటి విషయాలను వడబోయనున్నారు.
ఫ్రెండ్స్ నుంచి ఈ యూజర్లకు ఎలాంటి బర్త్‌డే పోస్ట్‌లు వస్తున్నాయి వంటివి జల్లెడపట్టి యూజర్ వయసును నిర్ధారిస్తారు. ఆ యూజర్ 18 ఏళ్ల లోపు వయసున్న టీనేజర్‌గా తేలితే ఆ అకౌంట్‌ను వెంటనే టీన్ అకౌంట్‌గా మారుస్తారు. ఈ అకౌంట్ల వ్యక్తిగత గోప్యత సెట్టింగ్స్ ఆటోమేటిక్‌గా మారిపోతాయి. ఈ యూజర్లకు ఏ వయసు వారు మెసేజ్ పంపొచ్చు? అనేది ఏఐ టూల్ నిర్ణయిస్తుంది. ఈ టీనేజర్లు ఎలాంటి కంటెంట్‌ను యాక్సెస్ చేయొచ్చు అనే దానిపై కృత్రిమ మేథ టూల్‌దే తుది నిర్ణయం. ప్రస్తుతం చాలా మంది టీనేజర్లు లైంగికసంబంధ కంటెంట్‌ను వీక్షించేందుకు, తల్లిదండ్రులకు తెలీకుండా చూసేందుకు తప్పుడు క్రిడెన్షియల్స్, సమాచారం ఇచ్చి లాగిన్ అవుతున్నారు. వీటికి త్వరలో అడ్డుకట్ట పడనుంది.
వచ్చే ఏడాది షురూ
అడల్ట్ క్లాసిఫయర్‌ను వచ్చే ఏడాది నుంచి అమలుచేసే వీలుంది. 18 ఏళ్లలోపు టీనేజర్ల ఖాతాలను టీన్ అకౌంట్లుగా మారుస్తాయి. అయితే త్వరలో 18 ఏళ్లు నిండబోయే 17, 16 ఏళ్ల వయసు వారికి కొంత వెసులుబాటు కల్పించే వీలుంది. అంటే నియంత్రణ సెట్టింగ్‌లను మార్చుకోవచ్చు. అయితే ఇది కూడా కాస్తంత కష్టంగా మార్చొచ్చు. సామాజికమాధ్యమ వేదికపై హానికర అంశాలను పిల్లలు చూసి వారి మానసిక ఆరోగ్యం దెబ్బతింటోందని ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో మెటా ఈ దిశగా యాప్‌లో మార్పులు చేస్తోంది.
టీనేజీ అమ్మాయిలపై ఇన్‌స్టా గ్రామ్ పెను దుష్ప్రభావాలు చూపుతోందని ప్రజావేగు ఫ్రాన్సెస్ హాగెన్ సంబంధిత అంతర్గత పత్రాలను బహిర్గతం చేయడంతో ఇన్‌స్టా గ్రామ్ నిర్లక్ష్య ధోరణిపై సర్వత్రా విమర్శలు అధికమయ్యాయి. కొత్త టూల్ కారణంగా టీనేజీ యూజర్ల సంఖ్య తగ్గుముఖం పట్టొచ్చేమోగానీ సమస్యకు పూర్తి పరిష్కారం లభించకపోవచ్చని స్వయంగా మెటానే భావిస్తోంది. ఎవరైనా యూజర్ తాను టీనేజర్‌ను కాదు అని చెప్పి టీన్‌అకౌంట్‌ను మార్చాలనుకుంటే ఆ మేరకు లైవ్‌లో నిరూపించుకునేలా కొత్త నిబంధన తేవాలని చూస్తున్నారు. బయటి సంస్థకు ఈ బాధ్యతలు అప్పజెప్పనున్నారు. సంబంధిత యూజర్ వీడియో సెల్ఫీ లైవ్‌లో తీసి పంపితే ఈ బయటి సంస్థ వీడియోను సరిచూసి అకౌంట్ స్టేటస్‌పై తుది నిర్ణయం తీసుకుంటుంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment