Court judgments
-
Hindustan Times Leadership Summit: కోర్టు తీర్పులను చట్టసభలు పక్కన పెట్టజాలవు
న్యూఢిల్లీ: కోర్టు తీర్పుల విషయంలో చట్టసభలు ఏం చేయగలవు, ఏం చేయలేవనే విషయంలో స్పష్టమైన విభజన రేఖ ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ‘‘తీర్పులు ఏమైనా చట్టపరమైన లోపాలను ఎత్తి చూపితే వాటిని సవరించేందుకు, సరిచేసేందుకు చట్టసభలు కొత్త చట్టాలను చేయవచ్చు. అంతే తప్ప తీర్పులు తప్పనే అభిప్రాయంతో వాటిని నేరుగా, పూర్తిగా పక్కన పెట్టేయజాలవు’’ అని స్పష్టం చేశారు. శనివారం ఇక్కడ హిందూస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్‌లో ఆయన మాట్లాడారు. పలు అంశాలపై తీర్పులిచ్చేటప్పుడు ప్రభుత్వ విభాగాల మాదిరిగా వాటిపై సమాజం ఎలా స్పందిస్తుందని న్యాయమూర్తులు ఆలోచించరన్నారు. వారు రాజ్యాంగ నైతికతకు కట్టుబడి పని చేస్తారే తప్ప ప్రజల నైతికతకు కాదని చెప్పారు. మన దేశంలో జడ్జిలకు ఎన్నిక జరగదన్నది లోపం కాదని, మన వ్యవస్థ తాలూకు బలమని సీజేఐ అన్నారు. ‘‘మన సుప్రీంకోర్టు ప్రజల కోర్టు. అమెరికా సుప్రీంకోర్టు ఏటా పరిష్కరించే కేసుల సంఖ్య కేవలం 80. కానీ మన సుప్రీంకోర్టు ఈ ఏడాది ఇప్పటికే ఏకంగా 72 వేల కేసులను పరిష్కరించింది. ప్రజలకు చేరువయే లక్ష్యంతో సుప్రీంకోర్టు తీర్పులను భారతీయ భాషల్లోకి అనువదింపజేస్తున్నాం. అలా ఇప్పటిదాకా 31 వేల తీర్పులను అనువదించారు’’ అని చెప్పారు. -
30 కోట్ల ఉద్యోగాలకు ఎసరు తప్పదా?.. ఏఐ ప్రతికూల ప్రభావం ఎంత?
(ఎం.విశ్వనాథరెడ్డి, సాక్షి ప్రతినిధి): కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా అన్ని రంగాల్లోకి విస్తరించడం మొదలైంది! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో కార్యాలయాల పని తీరు, జీవన విధానాల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి. సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ఐటీ) తీసుకొచ్చిన మార్పులు 50 ఏళ్ల క్రితం ఊహాతీతమైన అంశాలే. ఇప్పుడున్న అంచనాల మేరకు ఏఐని అన్ని రంగాలకు విస్తరిస్తే ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల ఉద్యోగాలకు ఎసరు తప్పదని నిపుణుల నివేదిక అంచనా వేస్తోంది. అయితే సరికొత్త అవకాశాలు ప్రపంచం ముందు ఆవిష్కృతమవుతాయని పేర్కొంటున్నారు. ఏఐ రాకతో గ్లోబల్ జీడీపీ 7 శాతం పెరుగుతుందని విశ్లేషిస్తున్నారు. అమెరికాలో పారిశ్రామిక అవసరాలు, నైపుణ్యాలు, ప్రజల అవసరాలకు అనుగుణంగా 900 రకాల ఉద్యోగాలకు సంబంధించి ‘ఓనెట్’ డేటాబేస్‌ను రూపొందించింది. ఈ ఉద్యోగాలపై ‘ఏఐ’ ప్రభావం ఎంత మేరకు ఉంటుందనే అంశాన్ని ‘గోల్డ్‌మాన్ శాక్స్ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్’ తాజా నివేదికలో విశ్లేషించింది. ‘ద పొటెన్షియల్లీ లార్జ్ ఎఫెక్టస్ ఆఫ్ ఏఐ ఆన్ ఎకనమిక్ గ్రోత్’ పేరిట వెలువరించిన ఈ నివేదికలో ఏఐ రాకతో పరిశ్రమల స్వరూపం, ఉద్యోగాల తీరుతెన్నులూ మారతాయని అంచనా వేసింది. కొత్త నైపుణ్యాలు అవసరమని పేర్కొంటూ ఇప్పుడున్న ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం తప్పదనే విషయాన్ని ప్రస్తావించింది. కోర్టు తీర్పులను అంచనా వేసే స్థాయికి.. ఏఐ ప్రతికూల ప్రభావం చూపే తదుపరి రంగం లీగల్. కాంట్రాక్ట్ ఒప్పందాల విశ్లేషణ లాంటి చాలా అంశాలు ‘ఆటోమేషన్’ పరిధిలోకి వస్తాయని నివేదిక పేర్కొంది. ఇంకో అడుగు ముందుకేసి న్యాయస్థానాల్లో గతంలో వెలువడ్డ తీర్పుల ఆధారంగా తాజా కేసులో ఎలాంటి తీర్పు వస్తుందనే విషయాన్ని ముందుగానే అంచనా వేసే స్థాయి ఏఐకి ఉందని నివేదికలో పేర్కొనడం గమనార్హం. కార్మికులు ఎక్కువగా అవసరమయ్యే రంగాల్లో మాత్రం ఏఐ ప్రభావం పెద్దగా ఉండదని నివేదిక పేర్కొంది. ఏఐ ఇప్పటికి కొత్త సాంకేతిక పరిజ్ఞానమే! అభివృద్ధి చెందే సామర్థ్యం, వివిధ రంగాలు ఏఐని వినియోగించుకొనే శక్తిపై భవిష్యత్తు మార్పులు ఆధారపడి ఉంటాయి. కొత్త సాంకేతికతను ఆహ్వానించే తీరు అన్ని దేశాలు, రంగాలకు ఒకే రకంగా లేదని, కొన్ని మాత్రం ఏఐని ఆహ్వానించేందుకు తహతహలాడు తున్నాయని నివేదిక పేర్కొంది. సగం ఉద్యోగాలకు కోత! ఏఐ ప్రవేశంతో గరిష్టంగా ఆఫీస్, అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ ఉద్యోగాల్లో 46 శాతం కోత ప్రభావం ఉంటుందని గోల్డ్‌మాన్ శాక్స్ నివేదిక అంచనా వేసింది. సమావేశాలను షెడ్యూ ల్ చేయడం, నివేదికలు రూపొందించడం, డేటా సిద్ధం చేసి అందించడం లాంటివి ఈ ఉద్యోగాలను నిర్వర్తించే వారి ప్రధాన విధు లు. ఏఐ వల్ల ఇలాంటి ఉద్యోగుల అవసరం దాదాపు సగం తగ్గుతుందని అంచనా. ముందు వరుసలో చైనా, సౌదీ, భారత్ ఏఐ రాకతో సేవలు, ఉత్పాదకత మరింత మెరుగుపడతాయా? క్షీణిస్తాయా? అనే అంశంపై మల్టీ నేషనల్ మార్కెట్ రీసెర్చ్ సంస్థ ‘ఐపీఎస్వోఎస్’ వరల్డ్ ఎకనమిక్ ఫోరం కోసం పలు దేశాల్లో సర్వే చేసింది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలున్న దేశాల్లో ప్రజలు కృత్రిమ మేధను ఆహ్వానించడానికి సానుకూలంగా ఉండగా ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో అంత సానుకూలంగా లేరని పేర్కొంది. చైనాలో 78 శాతం మంది, సౌదీ అరేబియాలో 76 శాతం, భారత్‌లో 71 శాతం మంది ఏఐ పట్ల సానుకూలంగా స్పందించారు. బ్రిటన్‌లో 38 శాతం, జర్మనీ, ఆ్రస్టేలియాలో 37 శాతం, అమెరికాలో 35 శాతం, కెనడాలో 32, ఫ్రాన్స్‌లో 31 శాతం మంది మాత్రమే ఏఐ పట్ల సానుకూలత వ్యక్తం చేశారు. -
భారతీయ భాషల్లోకి తీర్పుల కాపీలు: సీజేఐ
ముంబై: కోర్టు తీర్పులను అన్ని భారతీయ భాషల్లోకి అందుబాటులోకి తెచ్చేందుకు కృత్రిమ మేథ(ఏఐ)ను వినియోగించుకుంటామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ చెప్పారు. సమాచార అంతరాలను తొలగించడంలో సాంకేతికత చాలా కీలకమైందని ఆయన అన్నారు. ఇంగ్లిష్‌లో ఉండే కొన్ని చక్కని అంశాలు గ్రామీణ ప్రాంతాల లాయర్లు ఆకళింపు చేసుకోలేరు. లాయర్లందరికీ ఉచితంగా సమాచారాన్ని అందుబాటులో ఉంచాలన్నదే నా ఉద్దేశం. ఇందుకోసం తీర్పుల ప్రతులను ఏఐను వినియోగించుకుని అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయిస్తాం’అని చెప్పారు. శనివారం బార్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర, గోవా నిర్వహించిన కార్యక్రమంలో సీజేఐ మాట్లాడారు. విచారణల లైవ్ స్ట్రీమింగ్ ద్వారా లా విద్యార్థులు, టీచర్లు కోర్టుల కార్యకలాపాలను ప్రత్యక్షంగా తెలుసుకునే వీలుంటుందన్నారు. తద్వారా సమాజంలో జరుగుతున్న అన్యాయాలను గుర్తించగలుగుతారని చెప్పారు. -
న్యాయస్థానాల తీర్పులను విమర్శించడం తప్పేమీ కాదు
సాక్షి, అమరావతి: న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను విమర్శించడంలో ఎలాంటి తప్పులేదని హైకోర్టు స్పష్టం చేసింది. తీర్పులిచ్చిన న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించకుండా, తీర్పుల గురించి చర్చించడం, విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయవచ్చని పేర్కొంది. మీడియా, సోషల్ మీడియా ముందు వ్యక్తులు, నాయకులు చేసే వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదంది. తమ ఆదేశాలు అమలయ్యాయా? లేదా? అన్నదే చూస్తామంది. చట్టం చెప్పేదే తమకు ముఖ్యమని పేర్కొంది. అమరావతి రాజధాని అభివృద్ధి విషయంలో తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వ స్పందన అవసరమని స్పష్టం చేసింది. రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని, అమరావతిలో అభివృద్ధి పనులకు సంబంధించి స్థాయీ నివేదిక (స్టేటస్ రిపోర్ట్)ను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 12కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరునెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని, వీరి చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి, వారిని శిక్షించాలంటూ రాజధాని రైతులు దోనె సాంబశివరావు, తాటి శ్రీనివాసరావు హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ఇప్పటికీ ఒక్కపని కూడా మొదలుపెట్టలేదు.. పిటిషనర్ల న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని అన్ని మౌలిక వసతులతో ఆరునెలల్లో అభివృద్ధి చేయాలని ఈ ధర్మాసనం ఈ ఏడాది మార్చి 3న తీర్పునిచ్చిందన్నారు. ఈ తీర్పు అమలుకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఒక్కపని కూడా మొదలు పెట్టలేదన్నారు. అభివృద్ధి నిరంతరం ప్రక్రియ అని, అందువల్ల తీర్పులో నిర్దేశించిన గడువులను తొలగించాలని కోరుతూ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం మినహా ఏమీ చేయలేదని పేర్కొన్నారు. అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం గడువుల తొలగింపు కోసం ఎలాంటి అనుబంధ పిటిషన్ దాఖలు చేయలేదన్నారు. కోర్టు తీర్పు తరువాత అధికార పార్టీ నేతలు పలువురు మీడియా, సోషల్ మీడియాలో మాట్లాడారన్న మురళీధరరావు ఆ వివరాలను చదవడం ప్రారంభించారు. ఈ సమయంలో ధర్మాసనం ఆయన్ని వారిస్తూ.. మీడియా, సోషల్ మీడియా ముందు ఎవరు ఏం మాట్లాడారో తమకు సంబంధం లేదని తేల్చిచెప్పింది. తమ ఆదేశాలు అమలయ్యాయా లేదా అన్నదే తమకు ముఖ్యమని పేర్కొంది. కోర్టు తీర్పులను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయవచ్చంది. కోర్టులకు, న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించకుండా ఏమైనా మాట్లాడవచ్చని తెలిపింది. తమకు కావాల్సింది కోర్టు ఆదేశాల అమలు మాత్రమేనని, గతంలో ఇదే విషయం చెప్పామని, ఇప్పుడు కూడా అదే చెబుతున్నామని పేర్కొంది. కోర్టు ఆదేశాల ఉల్లంఘనలకు మాత్రమే పరిమితం కావాలని ధర్మాసనం తెలిపింది. తాము కూడా ప్రస్తుతం అదే చూస్తామంటూ ఉత్తర్వుల జారీకి సిద్ధమైంది. ముఖ్యమంత్రిని ప్రతివాదిగా చేర్చడంపై ఏజీ అభ్యంతరం ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ.. ఈ ధిక్కార వ్యాజ్యంలో ముఖ్యమంత్రిని ప్రతివాదిగా చేర్చారంటూ అభ్యంతరం తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. తామూ చూశామని, ముందు తమ ఉత్తర్వులను విని ఆ తరువాత స్పందించాలని పేర్కొంది. రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకునేముందు ప్రభుత్వ స్పందన తెలుసుకోవాల్సి ఉందంది. ఈ ధిక్కార పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని, అలాగే రాజధానిలో పనులకు సంబంధించి స్టేటస్ నివేదికను కూడా తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
ప్రభుత్వ హామీలు బుట్టదాఖలు
కోర్టు తీర్పులను ధిక్కరిస్తున్న వివిధ శాఖలు నిరాశ్రయులుగా మారుతున్న అంతర్గాం కార్మికులు రామగుండం : ప్రభుత్వాలు మారుతున్నా మండలంలోని అంతర్గాం స్పిన్నింగ్, వీవింగ్ మిల్లు కార్మికుల తలరాతలు మాత్రం మారడం లేదు. స్పిన్నింగ్, వీవింగ్ మిల్లు లాకౌట్ అరుు ఏళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ కార్మికులకు వీఆర్ఎస్ మాత్రం చెల్లించలేదు. అలాగే సొసైటీకి డిపాజిట్ చేసిన నిధులకు 10 గుంటల నివేశన స్థలాలు కార్మికులకు అప్పగించాల్సి ఉన్నా.. తమ సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 1966లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బర్మా, కాందీశీకులకు (శరణార్థులు) ఉపాధి నిమిత్తం ప్రతి కార్మికుడిని మిల్లులో షేర్ హోల్డర్‌గా చేర్చుకునేందుకు రూ.7,200 డిపాజిట్ చేసి దశల వారీగా వేతనాల్లో కోత విధించారు. ఇందులో ప్రతి కార్మికుడికీ 10 గుంటల విస్తీర్ణంలో క్వార్టర్ సౌకర్యం కల్పించారు. సుమారు 500 ఎకరాల్లో వెయ్యి క్వార్టర్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ ఐదు వందల క్వార్టర్లు మాత్రమే నిర్మించారు. 1966లో 96 ఎకరాల్లో వీవింగ్ మిల్లు, 53 ఎకరాల్లో స్పిన్నింగ్ మిల్లును నిర్మించారు. 28 ఏళ్ల క్రితమే మిల్లుల్లో నష్టాలు రావడంతో లాకౌట్ ప్రకటించారు. దీంతో స్పిన్నింగ్ మిల్లు కార్మికులకు వీఆర్ఎస్ కింద ఫైనల్ బిల్లు ఇచ్చినప్పటికీ వీవింగ్ మిల్లు కార్మికులకు మాత్రం ఎలాంటి బకాయిలూ చెల్లించలేదు. మూడేళ్ల క్రితం ఉమ్మడి ప్రభుత్వం హయూంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రి నేతృత్వంలో ప్ర తి కుటుంబానికీ ఐదు గుంటల స్థలం ఇవ్వాలని ఆదేశాలు జారీచేశా రు. అది ఇప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. మిల్లు భూములను విక్రయించేందుకు జేసీ (జాయింట్ కలెక్టర్) స్థాయి అధికారిని లిక్విడేటర్‌గా నియమించినప్పటికీ ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదు. శిథిలావస్థలో క్వార్టర్లు 50 ఏళ క్రితం నిర్మించిన క్వార్టర్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. వర్షాకాలంలో వరద నీరు పైకప్పు నుంచి ఇంట్లోకి రావడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. మిల్లులు ప్రారంభ సమయంలో తమను షేర్ హోల్డర్లుగా చేర్చుకొని ఇప్పుడు కనీసం తమ క్వార్టర్లకు పట్టాలు ఇవ్వడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్య ధోరణి కనబరుస్తున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30 ఏళ్లుగా ఎదురుచూస్తున్నం ఇళ్ల స్థలాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నాం. మా కుటుంబాల్లో పెళ్లీడుకొచ్చిన యువతీ, యువకులకు సంబంధాలు రావడం లేదు. ఒకవేళ వచ్చినా అంతర్గాం అని చెప్పగానే వెనుకడగు వేస్తున్నారు. మాకు క్వార్టర్లు ఇచ్చిన అధికారులు.. వాటిపై అధికారం మాత్రం ఇవ్వకపోవడం శోచనీయం. - ఇండిబిల్లి నూకాలమ్మ, స్పిన్నింగ్ మిల్లు బాధితురాలు ఇల్లు సొంతమని చెప్పులేకపోతున్నం నలభై ఏళ్ల క్రితం ఇక్కడికి వలస వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాం. మాకు పిల్లలు ఇక్కడే పుట్టారు. ఇక్కడ ఉపాధి కరువైనా ఇక్కడినుంచి వెళ్లలేకపోతున్నాం. మా కొడుకులే ఉపాధి నిమిత్తం వేరే చోటికి వెళ్లి రాత్రికి తిరిగి వస్తున్నారు. ఇక్కడి వాతావరణానికి మరోచోటికి వెళ్లలేకపోతున్నాం. - కె.పేరమ్మ, వీవింగ్ మిల్లు బాధితురాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి మిల్లు భూములను ముందుగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అప్పుడే లిక్విడేటర్‌కు వాటిని విక్రయించే అధికారం ఉంటుంది. లేదంటే వాటిని విక్రయించే అధికారం ప్రభుత్వానికి ఉండదు. ఇప్పటికీ వీవింగ్ మిల్లు కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల ఊసే లేదు. ఉద్యమాలు చేసినా కాందీశీక కార్మిక కుటుంబాలు నిరాశ్రయులవుతున్నారుు. - జయకుమార్, స్పిన్నింగ్ మిల్లు కార్మికుడు ప్రభుత్వాలు మారుతూనే ఉన్నారు.. ఇరవై ఏళ్లుగా ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా నివాసముంటు న్న భూములకు హక్కుదారులుగా గుర్తించడం లేదు. ప్రతి రాజకీయ పార్టీ మమ్మల్ని ఓటుబ్యాంకుగానే గుర్తిస్తున్నారు తప్పా తమ సమస్యలపై స్పందించే నాయకుడు కరువయ్యాడు. ప్రభుత్వ ఆదేశాలను సైతం అధికారులు అమలుచేయకపోవడం దురదృష్టకరం - ఇండిబిల్లి రవీందర్‌కుమార్, కాందీశీకుల సంఘం ఉపాధ్యక్షుడు