సాక్షి, అమరావతి: న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను విమర్శించడంలో ఎలాంటి తప్పులేదని హైకోర్టు స్పష్టం చేసింది. తీర్పులిచ్చిన న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించకుండా, తీర్పుల గురించి చర్చించడం, విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయవచ్చని పేర్కొంది. మీడియా, సోషల్ మీడియా ముందు వ్యక్తులు, నాయకులు చేసే వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదంది. తమ ఆదేశాలు అమలయ్యాయా? లేదా? అన్నదే చూస్తామంది. చట్టం చెప్పేదే తమకు ముఖ్యమని పేర్కొంది. అమరావతి రాజధాని అభివృద్ధి విషయంలో తామిచ్చిన ఆదేశాలను అమలు చేయకపోవడంపై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకునే ముందు రాష్ట్ర ప్రభుత్వ స్పందన అవసరమని స్పష్టం చేసింది.
రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌లో కౌంటర్ దాఖలు చేయాలని, అమరావతిలో అభివృద్ధి పనులకు సంబంధించి స్థాయీ నివేదిక (స్టేటస్ రిపోర్ట్)ను తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 12కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్, న్యాయమూర్తులు జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ డి.వి.ఎస్.ఎస్.సోమయాజులతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని ఆరునెలల్లో అభివృద్ధి చేయాలంటూ ఇచ్చిన తీర్పును ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర అధికారులు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని, వీరి చర్యలను కోర్టు ధిక్కారంగా పరిగణించి, వారిని శిక్షించాలంటూ రాజధాని రైతులు దోనె సాంబశివరావు, తాటి శ్రీనివాసరావు హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై గురువారం సీజే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
ఇప్పటికీ ఒక్కపని కూడా మొదలుపెట్టలేదు..
పిటిషనర్ల న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. రాజధాని నగరాన్ని, రాజధాని ప్రాంతాన్ని అన్ని మౌలిక వసతులతో ఆరునెలల్లో అభివృద్ధి చేయాలని ఈ ధర్మాసనం ఈ ఏడాది మార్చి 3న తీర్పునిచ్చిందన్నారు. ఈ తీర్పు అమలుకు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఒక్కపని కూడా మొదలు పెట్టలేదన్నారు. అభివృద్ధి నిరంతరం ప్రక్రియ అని, అందువల్ల తీర్పులో నిర్దేశించిన గడువులను తొలగించాలని కోరుతూ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం మినహా ఏమీ చేయలేదని పేర్కొన్నారు. అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం గడువుల తొలగింపు కోసం ఎలాంటి అనుబంధ పిటిషన్ దాఖలు చేయలేదన్నారు.
కోర్టు తీర్పు తరువాత అధికార పార్టీ నేతలు పలువురు మీడియా, సోషల్ మీడియాలో మాట్లాడారన్న మురళీధరరావు ఆ వివరాలను చదవడం ప్రారంభించారు. ఈ సమయంలో ధర్మాసనం ఆయన్ని వారిస్తూ.. మీడియా, సోషల్ మీడియా ముందు ఎవరు ఏం మాట్లాడారో తమకు సంబంధం లేదని తేల్చిచెప్పింది. తమ ఆదేశాలు అమలయ్యాయా లేదా అన్నదే తమకు ముఖ్యమని పేర్కొంది. కోర్టు తీర్పులను విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయవచ్చంది. కోర్టులకు, న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదించకుండా ఏమైనా మాట్లాడవచ్చని తెలిపింది. తమకు కావాల్సింది కోర్టు ఆదేశాల అమలు మాత్రమేనని, గతంలో ఇదే విషయం చెప్పామని, ఇప్పుడు కూడా అదే చెబుతున్నామని పేర్కొంది. కోర్టు ఆదేశాల ఉల్లంఘనలకు మాత్రమే పరిమితం కావాలని ధర్మాసనం తెలిపింది. తాము కూడా ప్రస్తుతం అదే చూస్తామంటూ ఉత్తర్వుల జారీకి సిద్ధమైంది.
ముఖ్యమంత్రిని ప్రతివాదిగా చేర్చడంపై ఏజీ అభ్యంతరం
ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ.. ఈ ధిక్కార వ్యాజ్యంలో ముఖ్యమంత్రిని ప్రతివాదిగా చేర్చారంటూ అభ్యంతరం తెలిపారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. తామూ చూశామని, ముందు తమ ఉత్తర్వులను విని ఆ తరువాత స్పందించాలని పేర్కొంది. రైతులు దాఖలు చేసిన కోర్టు ధిక్కార పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకునేముందు ప్రభుత్వ స్పందన తెలుసుకోవాల్సి ఉందంది. ఈ ధిక్కార పిటిషన్‌లో కౌంటర్ దాఖలు చేయాలని, అలాగే రాజధానిలో పనులకు సంబంధించి స్టేటస్ నివేదికను కూడా తమ ముందుంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
న్యాయస్థానాల తీర్పులను విమర్శించడం తప్పేమీ కాదు
Published Fri, May 6 2022 3:25 AM | Last Updated on Fri, May 6 2022 2:55 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment