న్యూఢిల్లీ: కోర్టు తీర్పుల విషయంలో చట్టసభలు ఏం చేయగలవు, ఏం చేయలేవనే విషయంలో స్పష్టమైన విభజన రేఖ ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ‘‘తీర్పులు ఏమైనా చట్టపరమైన లోపాలను ఎత్తి చూపితే వాటిని సవరించేందుకు, సరిచేసేందుకు చట్టసభలు కొత్త చట్టాలను చేయవచ్చు. అంతే తప్ప తీర్పులు తప్పనే అభిప్రాయంతో వాటిని నేరుగా, పూర్తిగా పక్కన పెట్టేయజాలవు’’ అని స్పష్టం చేశారు.
శనివారం ఇక్కడ హిందూస్తాన్ టైమ్స్ లీడర్‌షిప్ సమిట్‌లో ఆయన మాట్లాడారు. పలు అంశాలపై తీర్పులిచ్చేటప్పుడు ప్రభుత్వ విభాగాల మాదిరిగా వాటిపై సమాజం ఎలా స్పందిస్తుందని న్యాయమూర్తులు ఆలోచించరన్నారు. వారు రాజ్యాంగ నైతికతకు కట్టుబడి పని చేస్తారే తప్ప ప్రజల నైతికతకు కాదని చెప్పారు.
మన దేశంలో జడ్జిలకు ఎన్నిక జరగదన్నది లోపం కాదని, మన వ్యవస్థ తాలూకు బలమని సీజేఐ అన్నారు. ‘‘మన సుప్రీంకోర్టు ప్రజల కోర్టు. అమెరికా సుప్రీంకోర్టు ఏటా పరిష్కరించే కేసుల సంఖ్య కేవలం 80. కానీ మన సుప్రీంకోర్టు ఈ ఏడాది ఇప్పటికే ఏకంగా 72 వేల కేసులను పరిష్కరించింది. ప్రజలకు చేరువయే లక్ష్యంతో సుప్రీంకోర్టు తీర్పులను భారతీయ భాషల్లోకి అనువదింపజేస్తున్నాం. అలా ఇప్పటిదాకా 31 వేల తీర్పులను అనువదించారు’’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment