సీజేఐగా తండ్రి తీర్పులనే తిప్పికొట్టి.. డీవై చంద్రచూడ్‌ వెల్లడించిన టాప్‌ 10 తీర్పులివే | Poll Bonds To Article 370: 10 Key Judgments By Chief Justice DY Chandrachud | Sakshi
Sakshi News home page

సీజేఐగా తండ్రి తీర్పులనే తిప్పికొట్టి.. డీవై చంద్రచూడ్‌ వెల్లడించిన టాప్‌ 10 తీర్పులివే

Published Fri, Nov 8 2024 7:33 PM | Last Updated on Fri, Nov 8 2024 8:14 PM

Poll Bonds To Article 370: 10 Key Judgments By Chief Justice DY Chandrachud

న్యూఢిల్లీ:  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ధనుంజయ యశ్వంత్‌(డీవై) చంద్రచూడ్‌కు శుక్రవారం లాస్ట్‌ వర్కింగ్‌ డే. ఆదివారం( నవంబర్ 10) ఆయన సీజేఐగా పదవీ విరమణ చేయనున్నారు. వృత్తిపరంగా తాను  చాలా సంతృప్తి చెందానని, తన వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమించాలని కోరారు. 

2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్నికైనప్పటి నుంచి ఎన్నో కేసుల పరిష్కారాల్లో డీవై చంద్రచూడ్‌ తనదైన ముద్ర వేశారు. అనేక మైలురాయి తీర్పులు వెల్లడించారు. అంతేగాక చంద్రచూడ్‌..భారతదేశ చరిత్రలో ఎక్కువ కాలం సీజేఐగా పనిచేసిన యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ తనయుడు కూడా. తండ్రికి తగ్గ తనయుడిగానే కాదు.. చీఫ్‌ జస్టిస్‌గా తండ్రి ఇచ్చిన తీర్పులనే తిరగరాశారు డీవై చంద్రచూడ్‌.  

వైవీ చంద్రచూడ్‌ 2017-18లో తీసుకున్న అడల్టరీ చట్టం, శివకాంత్‌ శుక్లా వర్సెస్‌ ఏడీఎం జబల్‌పూర్‌ కేసుల్లో తీసుకున్న నిర్ణయాలను కుమారుడు డీవై చంద్రచూడ్‌ తోసిపుచ్చారు. 

👉1985లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్‌ ధర్మాసనం.. సౌమిత్ర విష్ణు కేసులో ఐపీసీ సెక్షన్‌ 497ను సమర్థించింది. సంబంధం కలిగి ఉండటానికి ప్రలోభాలకు లోనయ్యే వ్యక్తి పురుషుడే కానీ, స్త్రీ కాదని సాధారణంగా అంగీకరించబడింది అని ధర్మాసనం తన తీర్పులో రాసింది. ఈ నిర్ణయాన్ని 2018 లో జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం రద్దు చేసింది. 

‘వ్యభిచార చట్టం అనేది పితృస్వామ్య నియమం. లైంగిక స్వయంప్రతిపత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని ధర్మాసనం చెప్పింది. 

👉 1976 లో శివకాంత్ శుక్లా వర్సెస్‌ ఏడీఎం జబల్‌పూర్ కేసులో, గోప్యతను ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పరిగణించలేమని పేర్కొన్నది. ఈ బెంచ్‌లో అప్పటి సీజేఐ వైవీ చంద్రచూడ్ ఉన్నారు. కాగా, 2017 లో గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఈ బెంచ్‌లో డీవై చంద్రచూడ్‌ ఉన్నారు. 

‘ఏడీఎం జబల్‌పూర్ కేసులో మెజారిటీ నిర్ణయంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయి. రాజ్యాంగాన్ని అంగీకరించడం ద్వారా భారతదేశ ప్రజలు తమ జీవితాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వానికి అప్పగించలేదు’ అని డీవై చంద్రచూడ్‌ తన నిర్ణయాన్ని రాశారు. 

కాగా 2022 నవంబర్ 9న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రచూడ్.. ఆయన పదవీకాలంలో ఎన్నో చారిత్రక తీర్పులు వెల్లడించారు. ఆర్టికల్ 370, స్వలింగ సంపర్కుల వివాహం, రామ మందిరం, డ్రైవింగ్ లైసెన్స్‌, బుల్డోజర్ చర్య, ఉమర్ ఖలీద్, స్టాన్ స్వామి, జీఎన్ సాయిబాబా బెయిల్‌కు సంబంధించి తన తీర్పును ఇచ్చారు. నోయిడా ట్విన్‌ టవర్స్‌ కూల్చివేత కేసు, కేరళకు చెందిన హదియా కేసు, అవివాహితల అబార్షన్‌ హక్కు కేసుల్లో.. తండ్రికి తగ్గ తనయుడిగా ఎంతో పరిణతి చెందిన తీర్పులను వెలువరించారు. వాటిని ఓసారి పరిశీలిస్తే.. 

ఎలక్టోరల్ బాండ్స్ కేసు
రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల వివాదంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. 2018 నుంచి అమలులో ఉన్న ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని కేంద్రం రద్దు చేసింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్దమని, ఏకపక్షమని వాదించింది.  రాజకీయ పార్టీలు, దాతల మధ్య క్విడ్ ప్రోకో ఏర్పాటుకు దారితీయవచ్చని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ మేరకు జస్టిస్ బిఆర్ గవాయ్, సంజీవ్ ఖన్నా, జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం.. ఎలక్టోరల్ బాండ్ల జారీని తక్షణమే నిలిపివేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. అలాగే ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీలు పొందిన విరాళాల వివరాలను ప్రచురించాలని భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.

ప్రైవేట్ ఆస్తి వివాదం..
ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకొనే విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యంలోని ఆస్తులన్నీ సమాజ ఉమ్మడి వనరులు కావని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. ప్రజల ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు వాటిని ఏకపక్షంగా పంపిణీ చేయలేవని స్పష్టం చేసింది. అయితే, కొన్నింటిలో మాత్రం మినహాయింపు ఉంటుందని 7:2 మెజారిటీతో వెలువడిన తీర్పులో పేర్కొంది. సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని 9 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు భిన్నాభిప్రాయంతో కూడిన తీర్పును  వెలువరించింది.

ఆర్టికల్ 370
2023 డిసెంబర్‌లో  జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జమ్ముకశ్మీర్‌కు  ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ‍ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని.. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఆర్టికల్ 370 యుద్ధ నేపథ్యంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, జమ్మూ కశ్మీర్ కు సార్వభౌమాధికారం లేదని, భారత రాజ్యాంగమే ఫైనల్ అని స్పష్టం చేసింది.

జమ్మూకశ్మీర్‌ నుంచి లద్దాఖ్‌ను పూర్తిగా విభజించి, దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతున్న జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదాను త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. జమ్మూకశ్మీర్‌లో 2024 సెప్టెంబరు 30వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ  చేసింది.

స్వలింగ వివాహం
2023 అక్టోబర్‌లో స్వలింగ వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వలేమని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది, స్వలింగ సంపర్కాలపై భిన్నాభిప్రాయాలున్నాయని, స్వలింగ వివాహనికి చట్టబద్దత కల్పించలేమని తెలిపింది స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని సీజేఐ పేర్కొన్నారు. వివాహం చేసుకోవడం ప్రాధమిక హక్కు కాదని,  ఈ కేసుపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. అది న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ మేరకు  3:2 మెజారిటీతో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.

సెక్షన్ 6A
గత నెల అక్టోబర్‌లో అస్సాం వలసలకు సంబంధించి ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం  కీలక తీర్పును వెలువరించించింది. భారత పౌరసత్వ చట్టం-1955లోని సెక్షన్‌ 6(ఎ)కు రాజ్యాంగబద్ధత ఉందని స్పష్టం చేసింది. 1996-71 మధ్య అస్సాంలోకి ప్రవేశించిన  బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్తాన్) శరణార్థులను భారత పౌరసత్వం పొందేందుకు 1985లో తీసుకొచ్చిన రాజ్యంగ సవరణ రాజ్యాంగ బద్దమేనని 4:1 తీర్పులో వెల్లడించింది. ఇది కేవలం అస్సాం రాష్ట్రానికి మాత్రమే వర్తించేలా చేసిన ఈ సవరణ రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగ పీఠికలోని సౌభ్రాతృత్వ భావనకు వ్యతిరేకమని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌ను  భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రల ధర్మాసనం తిరస్కరించింది.

జైళ్లలో కుల ఆధారిత వివక్ష
కుల ఆధారంగా జైల్లోని ఖైదీలపై వివక్ష చూపడడం తగదని సుప్రీంకోర్టు పేర్కొంది. జైలు మాన్యువల్స్‌లో క్యాస్ట్ కాలమ్‌ను తొలగించాలని కేంద్రం, రాష్ట్రాలను  ఆదేశించింది. చిన్న కులాల ఖైదీలతో మరుగుదొడ్లు కడిగించడం వంటి స్కావెంజింగ్ పనులు, అగ్ర కులాల వారికి వంట పనుల కేటాయింపు వివక్షే అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. 

వివిధ రాష్ట్రాల్లోని కారాగారాల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, కులం ఆధారంగా ఖైదీలపై వివక్ష చూపుతున్నారని పేర్కొంటూ మహారాష్ట్రలోని కల్యాణ్‌ ప్రాంతానికి చెందిన జర్నలిస్టు సుకన్య శాంత సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిట్‌) దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్‌ జేపీ పార్దివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఖైదీలను కులం ఆధారంగా విభజిస్తున్న మాన్యువల్‌లోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. మూడు నెలల్లోగా నిబంధనల్లో సవరణలు చేయాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.

యూపీ మదరసా చట్టం
ఉత్తరప్రదేశ్‌ బోర్డు ఆఫ్‌ మదర్సా- 2004 ఎడ్యుకేషన్‌ చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, బోర్డు లౌకిక న్యాయ సూత్రాలను ఉల్లంఘించిందంటూ దానిని రద్దు చేస్తూ అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును  సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. ఈ చట్టం లౌకిక వాద సూత్రాన్ని ఉల్లంఘించిందని హైకోర్టు తప్పుగా అభిప్రాయపడిందని చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

నీట్‌ వివాదం
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌-యూజీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నీట్‌ యూజీ పరీక్షను మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ప్రశ్నాపత్రం లీకైందని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవని సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. పాట్నా, హజారీబాగ్‌లలో మాత్రమే పేపర్‌ లీక్‌ అయిందని పేర్కొన్నది. నీట్‌ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశిస్తే, గతంలో పరీక్ష రాసిన దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులపై ప్రభావం చూపుతుందని పేర్కొంది.

ఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసు
ఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. చట్ట సభల్లో లంచం తీసుకుంటే రాజ్యాంగ రక్షణ కల్పించలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. చట్టసభల్లో డబ్బులు తీసుకొని ఓటు వేసే ఎంపీ, ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ ఉండాలా ? లేదా అన్న దానిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. శాసనసభ్యులు, ఎంపీలు లంచం తీసుకోవడమనేది భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తోందని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు.

బాల్య వివాహం
బాల్య వివాహాల నిషేద చట్టం-2006ను  సమర్థవంతంగా అమలు చేసేందుకు  సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలను జారీ చేసింది. పర్సనల్ లాతో సంబంధం లేకుండా బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అమలుచేయాలని సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని పర్సనల్ లాతో తగ్గించవద్దని వెల్లడించింది. అలాగే ఇలాంటి వివాహాలతో మైనర్లకు వారి జీవితాన్ని ఎంచుకొనే స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. బాల్యవివాహాల నిరోధం, మైనర్‌ల రక్షణపై అధికారులు దృష్టిసారించాలని, చివరి ప్రయత్నంగా నిందితులకు జరిమానా విధించాలని తెలిపింది.

తన పదవీకాలం చివరి రోజు సైతం. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అలీగఢ్‌ ముస్లిం విశ్వవిద్యాలయానికి మైనారిటీ హోదాపై కీలక తీర్పును వెలువరించింది. దీనిని మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేమంటూ 1967లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును  రద్దు చేయాలని బెంచ్ నిర్ణయించింది. అయితే, దీనికి మైనార్టీ హోదా ఉండాలా? వద్దా? అన్న అంశాన్ని తేల్చేందుకు ఈ పిటిషన్లను కొత్త బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈమేరకు 4:3 మెజార్టీతో తీర్పు వెలువరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement