ఆమె అతనికి ఓ ఆట బొమ్మ మాత్రమే... ప్రతి రాత్రి ఆమెతో ఆమె జీవితంతో ఆడుకోవాలని చూస్తాడు.. చిన్నదైనా..పెద్దదైనా ఇద్దరి మధ్యా ఎప్పుడైనా గొడవ జరిగితే... ఆ ప్రతీకారాన్ని రాత్రి మంచంపై తీర్చుకోవడం అతనికి అలవాటు. ఆమె ఆరోగ్యం బాగోలేకున్నా అతనికి ఏమీ పట్టదు. కేవలం కోరికలు తీర్చే ఓ యంత్రంలా మాత్రమే ఆమెను చూస్తాడు. ఆరోగ్యం బాగోలేదు.. ఇవాళ శారీరంగా కలిసే శక్తి లేదని ఎప్పుడైనా చెబితే... ఇక ఆ రాత్రి పిడి గుద్దులు కురిపించి.. నరకం చూపిస్తాడు.. బలవంతంగా అనుభవించి పక్కకు జరుగుతాడు..
" తన వైవాహిక జీవితానికి సంబంధించి ఇటీవల ఓ మహిళ సుప్రీంకోర్టు ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పిన మాటలివి. ఆమె చెప్పినదంతా వింటే మీకేం అనిపిస్తుంది? ఓ అత్యాచార బాధితురాలి మాటలు లాగా అనిపించడంలేదా? అయితే కేంద్రానికి మాత్రం దీన్ని రేప్ లాగా భావించడంలేదు.. కారణం ఒక్కటే.. వారిద్దరూ భార్యభర్తలు! అదేంటి.. దంపతులైతే మాత్రం బలవంతంగా భార్యపై ఓ మృగంలా పడిపోవచ్చా అని అడిగితే మాత్రం కేంద్రం దగ్గర సమాధానం ఉండదు..
ఈ తరహా వైఖరి కేవలం కేంద్ర ప్రభుత్వానిది మాత్రమే కాదు .. భార్య శరీరాన్ని సొంత ఆస్తిగా భావించే భర్తలకు కూడా వైవాహిక అత్యాచారం ఓ నేరంలా అనిపించదు..! ఇంతకీ మ్యారిటల్ రేప్‌ను కేంద్ర ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తోంది? ఈ వైవాహిత అత్యాచార బాధితుల బాధ ఎలాంటిది? దేశంలో మ్యారిటల్ రేప్ బాధితులు ఎంతమంది ఉన్నారు?
'పురుషుడు పురుషుడే.. చట్టం చట్టమే.. స్త్రీపై పురుషుడు అత్యాచారం చేసినా, భార్యపై భర్త అత్యాచారం చేసినా అది అత్యాచారమే..' కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న రెండేళ్ళ క్రితం ఒక కేసులో ఇచ్చిన తీర్పులో భాగంగా చేసిన వ్యాఖ్యలు ఇవి! అయితే చట్టాలు మాత్రం ఆయన మాటలకు విరుద్ధంగా ఉన్నాయి. అటు కేంద్రం కూడా మ్యారిటల్ రేప్‌ను నేరంగా అసలు అంగీకరించడంలేదు. భార్యతో ఆమె ఇష్టానికి విరుద్ధంగా భర్త సంభోగంలో పాల్గొనడాన్ని నేరంగా పరిగణించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా మరోసారి స్పష్టం చేసింది. భార్య వయసు 18 ఏళ్లు దాటి ఉంటే ఆమెతో భర్త బలవంతంగా లైంగిక కార్యం జరిపినా నేరం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
👉ఇక భారత న్యాయ సంహిత-BNS ప్రకారం వైవాహిక అత్యాచారం నేరం కాదు. ఈ మ్యారిటల్ రేప్‌ను నేరంగా గుర్తించడం కారణంగా వివాహ వ్యవస్థ దెబ్బతింటుందని కేంద్రం అనేకసార్లు కోర్టుల్లో వాదిస్తూ వచ్చింది. వైవాహిక అత్యాచారాన్ని క్రిమినలైజ్ చేయడం వివాహబంధాలకు హాని కలుగుతుందన్నది వారి ప్రధాన వాదన. అయితే వివాహ వ్యవస్థను ఓ sacred institutionగా భావించడం కారణంగానే కేంద్రం ఈ విధంగా మాట్లాడుతోందని మహిళా సంఘాలు చెబుతుంటాయి. Consent.. అంటే అనుమతి లేకుండా శృంగారంలో పాల్గొనడం మహిళా హక్కులకు పూర్తి వ్యతిరేకమంటారు. నిజానికి కేవలం భార్య అయినంతా మాత్రనా ఏ మహిళా కూడా తన హక్కులను కోల్పోదు. అందుకే Marriage is not an excuse for any kind of rape అని చెబుతారు మహిళా సంఘాల నేతలు!
👉అయితే కేంద్రం మాత్రం వివాహ వ్యవస్థ రక్షణ కోసమే మ్యారిటల్ రేప్‌ను క్రిమినలైజ్ చేయడం లేదని పదేపదే చెబుతుంటుంది. ఒకవేళ వైవాహిక అత్యాచారాన్ని నేరంగా గుర్తిస్తే ఫేక్ కేసులు పెట్టేవారు పెరుగుతారని.. ఇది ఓవరాల్‌గా వివాహ వ్యవస్థకు హాని చేస్తుందని వాదిస్తుంటుంది. అటు ఈ మ్యారిటల్ రేప్‌ని నేరంగా పరిగణించాలని పోరాడే వారు మాత్రం కేంద్రం వాదనలో ఎలాంటి హేతుబద్ధత లేదంటారు. చట్టాల చాటున ఫేక్ కేసులు పెట్టే వారూ ఎక్కడైనా ఉంటారని.. అలాంటి ఘటనలు జరుగుతున్నాయని అసలు మొత్తానికే చట్టం లేకుండా చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు.
👉నిజానికి అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, దక్షిణ ఆఫ్రికా లాంటి అనేక దేశాలు మ్యారిటల్ రేప్‌ను నేరంగా గుర్తించాయి. ఇటు ఇండియాలో మాత్రం మ్యారిటల్ రేప్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. 2018లో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారం, వివాహితులలో 29శాతం మంది శారీరక లేదా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారు. వైవాహిక అత్యాచారం కారణంగా మహిళలు ఎదుర్కొనే బాధ భరించరానిది. మానసికంగా ఎంతో కుంగిపోతారు. డిప్రెషన్ లాంటి సమస్యలు వేధిస్తాయి. అటు శారీరక హింస ఎలాగో ఉంటుంది. ఇటు సామాజికంగానూ ఎన్నో సవాళ్లు ఫేస్ చేయాల్సి వస్తుంది.
👉గృహ హింస, మహిళలపై లైంగిక వేధింపుల కట్టడికి సంబంధించిన చట్టాలను తీసుకురావడంలో ఇండియా కాస్త పురోగతిని సాధించింది కానీ ఈ వైవాహిక అత్యాచార విషయంలో మాత్రం సాంప్రదాయ ఆలోచనలతో అసలు నేరాన్ని నేరంకాదని చెబుతుండడం బాధకరమని బాధితులు వాపోతుంటారు.
నిజానికి గృహ హింస వివిధ రూపాల్లో ఉంది. భర్తకు భార్య పగలంతా ఒక యంత్రంలా పని చేయాలి. రాత్రికి కోరికలు తీర్చే బొమ్మలా సిద్ధం కావాలి. నిద్ర, అలసట ఉండకూడదు. పీరియడ్స్, జ్వరం ఏమీ అనకూడదు. ఇవే చాలా మంది మ్యారిటల్ రేప్ బాధితులు చెప్పే మాటలు..! వాస్తవానికి ఇలాంటి కేసులు బయటకు రావడమే చాలా అరుదు. కుటుంబం విచ్ఛిన్నమవుతుందనే భయాలు, బెదిరింపులు వల్ల వైవాహిక హింస భారతీయ సమాజంలో ఎక్కువగా బహిర్గతం కాదు. అటు కేంద్రం మాత్రం ఇది అసలు నేరమే కాదంటోంది..!
:::త్రినాథ్ బండారు, సాక్షి డిజిటల్
Comments
Please login to add a commentAdd a comment