Web Special
-
వయనాడ్ బరిలో సత్తా చాటేదెవరో?
కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి రేపు (బుధవారం) పోలింగ్ జరగనుంది. నిన్న(సోమవారం) వయనాడ్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజు మూడు ప్రధాన రాజకీయ కూటములు రోడ్‌షోలు నిర్వహించాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ.. సోదరి ప్రియాంకా గాంధీ ప్రచారం చేశారు. 14 లక్షల మంది ఓటర్ల మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రియాంక గాంధీ వాద్రా, సీపీఐకి చెందిన సత్యన్ మొకేరి, బీజేపీకి చెందిన నవ్య హరిదాస్‌లతో సహా మొత్తం 16 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ ఏడాది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. మరోసారి ఇక్కడి నుంచి పోటీ చేసి 3.5 లక్షల ఓట్ల ఆధిక్యతతో గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే.. ఆయన మరో నియోజకవర్గం రాయ్‌బరేలి నుంచి కూడా విజయం సాధించడంతో.. నిబంధనల రిత్యా వయనాడ్‌ను వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యం కాగా.. కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబం నుంచే ప్రియాంకా గాంధీని ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దింపింది. రాహుల్ సోదరిని పోటీకి దింపడం ద్వారా యూడీఎఫ్ కంచుకోటగా భావించే సీటును నిలుపుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. మరోవైపు.. సీపీఐ, బీజేపీ సైతం ఈ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి.2019 నుంచి 2024 వరకు వయనాడ్ ఎంపీగా రాహుల్ పదవీకాలం, వయనాడ్ ప్రజల్లో ఆయనకున్న ఆదరణపై కాంగ్రెస్ దృష్టి సారించింది. మరోవైపు.. ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడం కోసం రాహుల్ గాంధీ వయనాడ్ నియోజకవర్గాన్ని వదులుకున్నారని ఎల్డీఎఫ్, బీజేపీలు కాంగ్రెస్‌పై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ప్రియాంకా గాంధీ గెలిస్తే.. ఆమె కూడా తన సోదరుడిలాగా నియోజకవర్గంలో అందుబాటులో లేకుండా పోతారని బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ విమర్శలకు చెక్ పెడుతూ ప్రియాంకా గాంధీ.. తను క్రమం తప్పకుండా వయనాడ్‌కు వస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంలో మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉననా మనంతవాడి (ST), సుల్తాన్ బతేరి (ST), వయనాడ్ జిల్లాలోని కల్పెట్ట, కోజికోడ్ జిల్లాలోని తిరువంబాడి, మలప్పురం జిల్లాలోని ఎరనాడ్, నిలంబూర్, వండూర్. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల విధుల కోసం సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), సాయుధ పోలీసు బెటాలియన్‌కు చెందిన పలు కంపెనీల సిబ్బందితో భద్రత కల్పించినున్నారు. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌కు ముందు 24 గంటల కంట్రోల్ రూమ్‌లు, పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక.. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు జరగనుంది.ప్రియాంకా గాంధీ నేపథ్యం..మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కుమార్తె, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ప్రియాంకా గాంధీ వాద్రా తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. 1972, జనవరి 12న పుట్టింది ప్రియాంక గాంధీ. మనస్తత్వశాస్త్రంలో డిగ్రీని, బౌద్ధ స్టడీస్‌లో మాస్టర్స్ పూర్తి చేసింది. 2019లో ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. గత 80 ఏళ్లుగా కాంగ్రెస్ కంచుకోట అయిన రాయ్‌బరేలీలో ఆమె తన తల్లి స్థానంలో నిలబడతారనే అంచనాలు ఒక రేంజ్లో వ్యాపించాయి. వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై పోటీ చేస్తారని చాలామంది ఊహించారు. కానీ అవి ఊహాగానాలుగానే మిగిలాయి. 2022లో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపలేక పోయింది. దీంతో ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలంటూ పోస్టర్లు వెలిశాయి.తనకు రూ.12 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ వాద్రా స్పష్టం చేశారు. ఆస్తులు, అప్పుల వివరాలను ఆమె తన అఫిడవిట్‌తో ప్రస్తావించారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో అద్దెలు, బ్యాంకు ఖాతాల్లోని నగదుపై వడ్డీ, ఇతర పెట్టుబడుల ద్వారా మొత్తం రూ.46.39 లక్షల ఆదాయం లభించినట్లు తెలిపారు. రూ.4.24 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని, తన భర్త రాబర్ట్ వాద్రా బహుమతిగా ఇచ్చిన హోండా సీఆర్వీ కారు ఉందని తెలియజేశారు.భర్త రాబర్ట్ వాద్రా ఆస్తుల వివరాలను సైతం ప్రియాం తన అఫిడవిట్లో వెల్లడించారు. దీన్నిబట్టి రాబర్ట్‌కు రూ.37.9 కోట్ల విలువైన చరాస్తులు, రూ.27.64 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు స్పష్టమవుతోంది. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ నేపథ్యం..నవ్య 2007లో కాలికట్ యూనివర్సిటీలోని కేఎంసీటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. బీటెక్ తర్వాత మెకానికల్ ఇంజనీర్‌గా కొన్నాళ్లు ఉద్యోగం చేశారు. పాలిటిక్స్‌పై ఆసక్తి ఉండటంతో రాజకీయాల్లోకి వచ్చారు. నవ్య హరిదాస్ కోజికోడ్ కార్పొరేషన్లో రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేశారు. బీజేపీలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నవ్వ ఎన్డీఏ అభ్యర్థిగా కొజికోడ్ దక్షిణ నియోజకవర్గం నుంచి పోటీ. కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓటమి. అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ADR) ప్రకారం నవ్య హరిదాస్‌పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. నవ్యకు రూ.1,29,56,264 విలువైన ఆస్తులు ఉన్నాయని, మొత్తం రూ.1,64,978 అప్పులు ఉన్నాయని ఏడీఆర్ తెలిపింది.సత్యన్ మొకేరి నేపథ్యం..సత్యన్ మొకేరి సీపీఐకి చెందిన ప్రముఖ నాయకుడు. కోజికోడ్ జిల్లాలోని నాదపురం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే. 2014లో వయనాడ్ లోక్‌సభ స్థానంలో పోటీ చేసి ఓడిపోయారు. మొకేరి 1987 నుంచి 2001 వరకు కేరళ శాసనసభలో నాదాపురం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2015లో ఆయన సీపీఐ కేరళ రాష్ట్ర కమిటీకి సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. రైతు సంఘాలతో మొకేరికి మంచి అనుబంధం ఉంది. ఆయన సుదీర్ఘ అనుభవం, వ్యవసాయ సమస్యల పట్ల నిబద్ధత వయనాడ్ ఓటర్లకు ప్రతిధ్వనిస్తుందని ఎల్డీఎఫ్ భావిస్తోంది.:::సాక్షి వెబ్ డెస్క్ -
HYD: వ్యాలీ ఆఫ్ స్పోర్ట్స్
హైదరాబాద్ అంటే బిర్యానీ, బాహుబలి, బ్యాడ్మింటన్..!! గతంలో అప్పటి రాష్ట్రపతి నగరానికి విచ్చేసిన సందర్భంలో అన్న మాటలివి. అంటే నగరంలో అంతర్జాతీయ క్రీడలు అంతటి ప్రశస్తిని సాధించుకున్నాయి. బ్యాడ్మింటన్ మాత్రమే కాదు హాకీ, టెన్నిస్, క్రికెట్, చెస్, రన్నింగ్ ఈ మధ్య కాలంలో రెజ్లింగ్ వంటి విభిన్న క్రీడాంశాల్లో హైదరాబాద్ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించారు. అనాదిగా కొనసాగుతున్న ఈ ఆనవాయితీని ప్రస్తుత తరం క్రీడాకారులు కూడా కొనసాగిస్తున్నారు. ఇప్పటికే గుర్తింపు పొందిన క్రీడల్లోనే కాకుండా తమకంటూ ప్రత్యేక గుర్తింపును పొందేందుకు వినూత్న క్రీడలు, అథ్లెటిక్స్ను ఎంచుకుని ఆయా విభాగాల్లో రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తు తరం దృష్టి సారించిన క్రీడలు, అందులోని ప్రత్యేకతలను ఓసారి తెలుసుకుందామా..!! అంతర్జాతీయ క్రీడలకు హైదరాబాద్ నగరానికి ఆనాటి నుంచే అవినాభావ సంబంధముంది. దేశ ఖ్యాతిని ప్రపంచదేశాల సరసన అగ్ర స్థానంలో నిలబెట్టిన హైదరాబాదీయులు, ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు ఎందరో ఉన్నారు. క్రికెట్లో అజహరుద్దిన్, వెంకటపతిరాజు, వీవీఎస్ లక్ష్మణ్, మిథాలీరాజ్ ప్రస్తుతం మహ్మద్ సిరాజ్, టెన్నిస్‌లో సానియా మీర్జా, బ్యాడ్మింటన్‌లో పీవీ సింధూ, సైనా నేహ్వాల్, రన్నింగ్‌లో పీటీ ఉష, చెస్‌లో ద్రోణవ్లలి హారిక, రెజ్లింగ్‌లో నిఖత్ జరీనా ఇలా ఒక్కొక్కరూ ఒక్కో క్రీడలో అత్యత్తమ నైపుణ్యాలను కనబర్చి ఆయా క్రీడాంశాల్లో భారత్‌కు అంతర్జాతీయ స్థాయి గుర్తింపును తీసుకొచ్చారు. అదే విధంగా వ్యక్తిగతంగానూ చరిత్రలో తమకంటూ కొన్ని పేజీలను రాసుకుని భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలిచారు. ఇదే తరహాలో ఈ తరం క్రీడాకారులు ఇప్పటికే గుర్తింపు పొందిన క్రీడలు కాకుండా వినూత్నంగా ఎంపిక చేసుకుని ఒలింపిక్స్ స్థాయిలో క్రీడా నైపుణ్యాలను కనబరుస్తున్నారు. సెయిలింగ్ టాప్.. స్కేటింగ్ రాక్.. ప్రస్తుత తరం.. హైదరాబాదీ క్రీడాకారులు ఆర్చరీ పై ప్రత్యేక దృష్టి సారించారు. నగరం వేదికగా ఈ వారసత్వ క్రీడపై పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. అంతేకాకుండా ఈ సారి జరిగిన ఒలింపిక్స్‌లో తెలుగు కుర్రాడు ధీరజ్ ఆర్చరీలో నాలుగో స్థానంలో నిలిచి భవిష్యత్ ఆర్చరీని శాసించేది మేమేనని హింట్ ఇచ్చాడు. నగరం వేదికగా 150 మంది ఆర్చరీ అథ్లెట్లు ఉన్నారని ఓ అంచనా. జాతీయ స్థాయిలో హైదరాబాద్ ఆర్చరీ టీం ద్వితీయ స్థానంలో ఉందని క్రీడారంగ నిపుణులు పేర్కొన్నారు. 2028 ఒలింపిక్సే లక్ష్యంగా ఈ క్రీడాకారులు సన్నద్ధమవుతున్నారు.రోయింగ్‌లోనూ రాణిస్తూ..ఇదే కోవలో రోయింగ్ కూడా రాణిస్తుంది. రోయింగ్ క్రీడాకారులు జాతీయ స్థాయిలో తమ సత్తా చాటుతున్నారు. అంతాగా ప్రచారంలోకి రాకపోయినప్పటికీ.. స్కేటింగ్‌లో కూడా హైదరాబాదీలు అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధిస్తున్నారు. వీటితో పాటు రైఫిల్ షూటింగ్లో కూడా నగరవాసులు గురి పెట్టారు. ఇప్పటికే నేషనల్స్‌లో పతకాలు సాధించడమే కాకుండా గ్లోబల్ వేదికపై మరోసారి గురి చూసి షూట్ చేయడానికి సన్నద్ధమౌతున్నారు. మరో వైపు స్విమ్మింగ్‌లోనూ మనం ముందంజలో ఉన్నాం. గత ఐదేళ్లలో నగరానికి చెందిన స్విమ్మర్లు జాతీయ స్థాయిలో పతకాల పంట పండిస్తున్నారు. అయితే వినూత్నంగా పికిల్ బాల్ వంటి సరికొత్త క్రీడలను నగరవాసులు తెరపైకి తీసుకొస్తున్నారు. సెయిలింగ్‌లోనూ..దీంతో పాటు సెయిలింగ్‌లోనూ హైదరాబాద్ భవిష్యత్ ఆశాకిరణంగా కనిపిస్తుంది. ఈ ఏడాది నేషనల్స్‌లో హైదరాబాదీ సెయిలర్స్ గోవర్ధన్, దీక్షిత కొమురవెళ్లి వంటి సెయిలర్స్ టాప్–1లో కొనసాగుతుండటం విశేషం. అంతేకాకుండా ప్రతీ కొంగర వంటి నావికులు ఒలింపిక్సే లక్ష్యంగా శిక్షణ పొందుతున్నారు.నూతనోత్సాహంతో గుర్తింపు.. క్రీడలో రాణించాలనే తపనకు నూతనోత్సాహాన్ని, అంతకు మించిన గుర్తింపును తెస్తున్నారు. ఇందులో భాగంగానే సెయిలింగ్‌లో ఎంతో శ్రమించి జాతీయ. అంతర్జాతీయ స్థాయిలో రాణించాను. వైఏఐ జూనియర్ నేషనల్స్ 2022 ఆప్టిమిస్టిక్ బాలికల విభాగంలో కాంస్యం, మాన్సూన్ రేగట్టా 2023 ఇదే విభాగంలో బంగారు పతకంతో వివిధ జాతీయ స్థాయి పోటీల్లో పతకాలను సాధించాను. పీవీ సింధూ, సానిమా మీర్జాలాగే నేను అంతర్జాతీయ స్థాయి పతకాలను సాధించి దేశానికి, నగరానికి గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో ఉన్నాను. :::దీక్షిత కొమురవెళ్లినా విద్యార్థులే నిదర్శనం.. రానున్న కాలంలో ఆర్చరీలో హైదరాబాద్ క్రీడాకారులు టాప్‌లో ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి నిదర్శనం నా విద్యార్థులే.. నా వద్ద శిక్షణ పొందుతున్న విద్యార్థులు జాతీయ స్థాయిలో టాప్ 2లో ఉన్నారు. 2028 ఒలింపిక్సే లక్ష్యంగా ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలను సన్నద్ధం చేస్తున్నాను. :::రాజు, ప్రముఖ కోచ్, ఆర్చరీ నేషనల్ చాంపియన్:::సాక్షి, సిటీబ్యూరో -
సీజేఐగా తండ్రి తీర్పులనే తిప్పికొట్టి.. డీవై చంద్రచూడ్ వెల్లడించిన టాప్ 10 తీర్పులివే
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ధనుంజయ యశ్వంత్(డీవై) చంద్రచూడ్‌కు శుక్రవారం లాస్ట్ వర్కింగ్ డే. ఆదివారం( నవంబర్ 10) ఆయన సీజేఐగా పదవీ విరమణ చేయనున్నారు. వృత్తిపరంగా తాను చాలా సంతృప్తి చెందానని, తన వల్ల ఎవరికైనా బాధ కలిగితే క్షమించాలని కోరారు. 2016లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఎన్నికైనప్పటి నుంచి ఎన్నో కేసుల పరిష్కారాల్లో డీవై చంద్రచూడ్ తనదైన ముద్ర వేశారు. అనేక మైలురాయి తీర్పులు వెల్లడించారు. అంతేగాక చంద్రచూడ్..భారతదేశ చరిత్రలో ఎక్కువ కాలం సీజేఐగా పనిచేసిన యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ తనయుడు కూడా. తండ్రికి తగ్గ తనయుడిగానే కాదు.. చీఫ్ జస్టిస్‌గా తండ్రి ఇచ్చిన తీర్పులనే తిరగరాశారు డీవై చంద్రచూడ్. వైవీ చంద్రచూడ్ 2017-18లో తీసుకున్న అడల్టరీ చట్టం, శివకాంత్ శుక్లా వర్సెస్ ఏడీఎం జబల్పూర్ కేసుల్లో తీసుకున్న నిర్ణయాలను కుమారుడు డీవై చంద్రచూడ్ తోసిపుచ్చారు. 👉1985లో అప్పటి ప్రధాన న్యాయమూర్తి వైవీ చంద్రచూడ్ ధర్మాసనం.. సౌమిత్ర విష్ణు కేసులో ఐపీసీ సెక్షన్ 497ను సమర్థించింది. సంబంధం కలిగి ఉండటానికి ప్రలోభాలకు లోనయ్యే వ్యక్తి పురుషుడే కానీ, స్త్రీ కాదని సాధారణంగా అంగీకరించబడింది అని ధర్మాసనం తన తీర్పులో రాసింది. ఈ నిర్ణయాన్ని 2018 లో జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం రద్దు చేసింది. ‘వ్యభిచార చట్టం అనేది పితృస్వామ్య నియమం. లైంగిక స్వయంప్రతిపత్తికి ప్రాధాన్యత ఇవ్వాలని ధర్మాసనం చెప్పింది. 👉 1976 లో శివకాంత్ శుక్లా వర్సెస్ ఏడీఎం జబల్పూర్ కేసులో, గోప్యతను ప్రాథమిక హక్కుగా సుప్రీంకోర్టు పరిగణించలేమని పేర్కొన్నది. ఈ బెంచ్‌లో అప్పటి సీజేఐ వైవీ చంద్రచూడ్ ఉన్నారు. కాగా, 2017 లో గోప్యతను ప్రాథమిక హక్కుగా గుర్తించింది. ఈ బెంచ్‌లో డీవై చంద్రచూడ్ ఉన్నారు. ‘ఏడీఎం జబల్పూర్ కేసులో మెజారిటీ నిర్ణయంలో తీవ్రమైన లోపాలు ఉన్నాయి. రాజ్యాంగాన్ని అంగీకరించడం ద్వారా భారతదేశ ప్రజలు తమ జీవితాన్ని, వ్యక్తిగత స్వేచ్ఛను ప్రభుత్వానికి అప్పగించలేదు’ అని డీవై చంద్రచూడ్ తన నిర్ణయాన్ని రాశారు. కాగా 2022 నవంబర్ 9న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రచూడ్.. ఆయన పదవీకాలంలో ఎన్నో చారిత్రక తీర్పులు వెల్లడించారు. ఆర్టికల్ 370, స్వలింగ సంపర్కుల వివాహం, రామ మందిరం, డ్రైవింగ్ లైసెన్స్, బుల్డోజర్ చర్య, ఉమర్ ఖలీద్, స్టాన్ స్వామి, జీఎన్ సాయిబాబా బెయిల్‌కు సంబంధించి తన తీర్పును ఇచ్చారు. నోయిడా ట్విన్ టవర్స్ కూల్చివేత కేసు, కేరళకు చెందిన హదియా కేసు, అవివాహితల అబార్షన్ హక్కు కేసుల్లో.. తండ్రికి తగ్గ తనయుడిగా ఎంతో పరిణతి చెందిన తీర్పులను వెలువరించారు. వాటిని ఓసారి పరిశీలిస్తే.. ఎలక్టోరల్ బాండ్స్ కేసురాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎలక్టోరల్ బాండ్ల వివాదంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. 2018 నుంచి అమలులో ఉన్న ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని కేంద్రం రద్దు చేసింది. ఈ పథకం రాజ్యాంగ విరుద్దమని, ఏకపక్షమని వాదించింది. రాజకీయ పార్టీలు, దాతల మధ్య క్విడ్ ప్రోకో ఏర్పాటుకు దారితీయవచ్చని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ మేరకు జస్టిస్ బిఆర్ గవాయ్, సంజీవ్ ఖన్నా, జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం.. ఎలక్టోరల్ బాండ్ల జారీని తక్షణమే నిలిపివేయాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. అలాగే ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీలు పొందిన విరాళాల వివరాలను ప్రచురించాలని భారత ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.ప్రైవేట్ ఆస్తి వివాదం..ప్రైవేటు ఆస్తులను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకొనే విషయంలో సుప్రీంకోర్టు ఇటీవల చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రైవేటు వ్యక్తుల యాజమాన్యంలోని ఆస్తులన్నీ సమాజ ఉమ్మడి వనరులు కావని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తెలిపింది. ప్రజల ఉమ్మడి ప్రయోజనాల కోసం ప్రభుత్వాలు వాటిని ఏకపక్షంగా పంపిణీ చేయలేవని స్పష్టం చేసింది. అయితే, కొన్నింటిలో మాత్రం మినహాయింపు ఉంటుందని 7:2 మెజారిటీతో వెలువడిన తీర్పులో పేర్కొంది. సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని 9 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు భిన్నాభిప్రాయంతో కూడిన తీర్పును వెలువరించింది.ఆర్టికల్ 3702023 డిసెంబర్లో జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జమ్ముకశ్మీర్‌కు ఆర్టికల్ 370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనని.. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. కేంద్ర నిర్ణయంలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. ఆర్టికల్ 370 యుద్ధ నేపథ్యంలో కుదుర్చుకున్న తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని, జమ్మూ కశ్మీర్ కు సార్వభౌమాధికారం లేదని, భారత రాజ్యాంగమే ఫైనల్ అని స్పష్టం చేసింది.జమ్మూకశ్మీర్ నుంచి లద్దాఖ్‌ను పూర్తిగా విభజించి, దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగుతున్న జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదాను త్వరగా పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఆదేశించింది. జమ్మూకశ్మీర్‌లో 2024 సెప్టెంబరు 30వ తేదీలోగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.స్వలింగ వివాహం2023 అక్టోబర్‌లో స్వలింగ వివాహానికి చట్టబద్ధమైన గుర్తింపు ఇవ్వలేమని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది, స్వలింగ సంపర్కాలపై భిన్నాభిప్రాయాలున్నాయని, స్వలింగ వివాహనికి చట్టబద్దత కల్పించలేమని తెలిపింది స్వలింగ వివాహం చేసుకున్న వారిని దంపతులుగా గుర్తించలేమని సీజేఐ పేర్కొన్నారు. వివాహం చేసుకోవడం ప్రాధమిక హక్కు కాదని, ఈ కేసుపై పార్లమెంటే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. అది న్యాయ సమీక్షకు లోబడి ఉండాలని తీర్పులో పేర్కొన్నారు. ఈ మేరకు 3:2 మెజారిటీతో రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది.సెక్షన్ 6Aగత నెల అక్టోబర్‌లో అస్సాం వలసలకు సంబంధించి ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం కీలక తీర్పును వెలువరించించింది. భారత పౌరసత్వ చట్టం-1955లోని సెక్షన్ 6(ఎ)కు రాజ్యాంగబద్ధత ఉందని స్పష్టం చేసింది. 1996-71 మధ్య అస్సాంలోకి ప్రవేశించిన బంగ్లాదేశ్ (అప్పటి తూర్పు పాకిస్తాన్) శరణార్థులను భారత పౌరసత్వం పొందేందుకు 1985లో తీసుకొచ్చిన రాజ్యంగ సవరణ రాజ్యాంగ బద్దమేనని 4:1 తీర్పులో వెల్లడించింది. ఇది కేవలం అస్సాం రాష్ట్రానికి మాత్రమే వర్తించేలా చేసిన ఈ సవరణ రాజ్యాంగ విరుద్ధమని, రాజ్యాంగ పీఠికలోని సౌభ్రాతృత్వ భావనకు వ్యతిరేకమని పేర్కొంటూ దాఖలైన పిటిషన్‌ను భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్, జస్టిస్ మనోజ్ మిశ్రల ధర్మాసనం తిరస్కరించింది.జైళ్లలో కుల ఆధారిత వివక్షకుల ఆధారంగా జైల్లోని ఖైదీలపై వివక్ష చూపడడం తగదని సుప్రీంకోర్టు పేర్కొంది. జైలు మాన్యువల్స్‌లో క్యాస్ట్ కాలమ్‌ను తొలగించాలని కేంద్రం, రాష్ట్రాలను ఆదేశించింది. చిన్న కులాల ఖైదీలతో మరుగుదొడ్లు కడిగించడం వంటి స్కావెంజింగ్ పనులు, అగ్ర కులాల వారికి వంట పనుల కేటాయింపు వివక్షే అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లోని కారాగారాల్లో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, కులం ఆధారంగా ఖైదీలపై వివక్ష చూపుతున్నారని పేర్కొంటూ మహారాష్ట్రలోని కల్యాణ్ ప్రాంతానికి చెందిన జర్నలిస్టు సుకన్య శాంత సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిట్) దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేపీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఖైదీలను కులం ఆధారంగా విభజిస్తున్న మాన్యువల్‌లోని నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పింది. మూడు నెలల్లోగా నిబంధనల్లో సవరణలు చేయాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.యూపీ మదరసా చట్టంఉత్తరప్రదేశ్ బోర్డు ఆఫ్ మదర్సా- 2004 ఎడ్యుకేషన్ చట్టాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, బోర్డు లౌకిక న్యాయ సూత్రాలను ఉల్లంఘించిందంటూ దానిని రద్దు చేస్తూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు పక్కన పెట్టింది. ఈ చట్టం లౌకిక వాద సూత్రాన్ని ఉల్లంఘించిందని హైకోర్టు తప్పుగా అభిప్రాయపడిందని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.నీట్ వివాదందేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్-యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. నీట్ యూజీ పరీక్షను మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ప్రశ్నాపత్రం లీకైందని చెప్పేందుకు తగిన ఆధారాలు లేవని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. పాట్నా, హజారీబాగ్‌లలో మాత్రమే పేపర్ లీక్ అయిందని పేర్కొన్నది. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశిస్తే, గతంలో పరీక్ష రాసిన దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులపై ప్రభావం చూపుతుందని పేర్కొంది.ఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసుఎంపీ, ఎమ్మెల్యేల లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. చట్ట సభల్లో లంచం తీసుకుంటే రాజ్యాంగ రక్షణ కల్పించలేమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చి చెప్పింది. ఏడుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవ తీర్పును వెలువరించింది. చట్టసభల్లో డబ్బులు తీసుకొని ఓటు వేసే ఎంపీ, ఎమ్మెల్యేలకు రాజ్యాంగ రక్షణ ఉండాలా ? లేదా అన్న దానిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. శాసనసభ్యులు, ఎంపీలు లంచం తీసుకోవడమనేది భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పనితీరును నాశనం చేస్తోందని సీజేఐ డీవై చంద్రచూడ్ తెలిపారు.బాల్య వివాహంబాల్య వివాహాల నిషేద చట్టం-2006ను సమర్థవంతంగా అమలు చేసేందుకు సర్వోన్నత న్యాయస్థానం మార్గదర్శకాలను జారీ చేసింది. పర్సనల్ లాతో సంబంధం లేకుండా బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని అమలుచేయాలని సూచించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని పర్సనల్ లాతో తగ్గించవద్దని వెల్లడించింది. అలాగే ఇలాంటి వివాహాలతో మైనర్లకు వారి జీవితాన్ని ఎంచుకొనే స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించింది. బాల్యవివాహాల నిరోధం, మైనర్ల రక్షణపై అధికారులు దృష్టిసారించాలని, చివరి ప్రయత్నంగా నిందితులకు జరిమానా విధించాలని తెలిపింది.తన పదవీకాలం చివరి రోజు సైతం. జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి మైనారిటీ హోదాపై కీలక తీర్పును వెలువరించింది. దీనిని మైనార్టీ విద్యాసంస్థగా పరిగణించలేమంటూ 1967లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని బెంచ్ నిర్ణయించింది. అయితే, దీనికి మైనార్టీ హోదా ఉండాలా? వద్దా? అన్న అంశాన్ని తేల్చేందుకు ఈ పిటిషన్లను కొత్త బెంచ్‌కు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈమేరకు 4:3 మెజార్టీతో తీర్పు వెలువరించింది. -
ట్రంప్‌కే పట్టం: ఎదురుదెబ్బలను తట్టుకుని పైకిలేచి రెండోసారి వైట్‌హౌజ్‌కు..
కొందరు ఆయన్ను ప్రేమిస్తారు.. మరికొందరు ఆయన్ను ద్వేషిస్తారు.. కానీ ఆయన్ను విస్మరించడం మాత్రం ఎవరి వల్లా కాదు.. ఆయనే డొనాల్డ్ ట్రంప్. అమెరికా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు సార్లు అభిశంసనకు గురైన మిస్టర్ ట్రంప్..రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ వైట్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ గతంలో ట్విట్టర్ ఆయన్ను వెలివేసింది.. 2020 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన తర్వాత ఆయన పడిన పాట్లు అన్నీఇన్నీ కావు.. అయినా ఎక్కడా వెనక్కి తగ్గలేదు.. తలదించలేదు.. వెన్నుచూపని వీరుడిలా మరోసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచారు. ఎదురుగా బలమైన ప్రత్యర్థి కమల హారీస్ ఉన్నా ఏ మాత్రం బెదరలేదు... వణకలేదు..! డొంక తిరుగుడు మాటలు ఏ మాత్రం తెలియని ట్రంప్.. తన ముక్కుసూటితనంతోనే ఓటర్ల మనసును గెలిచి 47వ ప్రెసిడెంట్‌గా 2025 జనవరి 20న రెండోసారి ప్రమాణస్వీకారానికి సిద్ధమయ్యారు. పడి చోటే లేచిన ట్రంప్ తన జీవిత ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. రెండోసారి వైట్ హౌస్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు బిలియనీర్ ట్రంప్నేపథ్యం..డోనాల్డ్ ట్రంప్ జూన్ 14, 1946న న్యూయార్క్‌లోని ఓ సంపన్న కుటుంబంలో పుట్టారు.ట్రంప్ తండ్రి ఫ్రెడ్ విజయవంతమైన రియల్ ఎస్టేట్ వ్యాపారి. న్యూయార్క్‌తో పాటు అమెరికాలోని వివిధ నగరాల్లో ట్రంప్ కుటుంబానికి చాలా అపార్ట్మెంట్లు, ఆస్తులు ఉన్నా...ట్రంప్ జీవితం ఏమాత్రం సాఫీగా సాగలేదు. ఆయన కుటుంబానికి ఉన్న డబ్బే ట్రంప్‌కు స్కూల్లో శాపంగా మారింది. ట్రంప్‌ను చాలా మంది వేరుగా చూసేవారు. అందరిలో ఒకడిలా ట్రంప్‌ని ఉండనివ్వలేదు. ఇదే ఆయన్ను స్కూల్లో క్రమశిక్షణ తప్పేలా చేసింది. పదేపదే స్కూల్ టీచర్ల నుంచి కంప్లైంట్ వస్తుండడంతో ట్రంప్‌ను మిలటరీ స్కూల్‌కు పంపారు తల్లిదండ్రులు. అక్కడే ట్రంప్‌కు డిసిప్లెన్ అలవాటైంది. అయితే అదే స్కూల్ ఆయన్ను తల్లిదండ్రుల నుంచి దూరంగా పెరిగేలా చేసింది. అటు తండ్రి ఫ్రెడ్ కూడా చాలా స్ట్రిక్ట్. దీంతో ట్రంప్ బాల్యం ఆంక్షలు మధ్య ఏ మాత్రం స్వేచ్ఛ లేనట్టే గడిచింది.వ్యాపారవేత్తగా..చదువులు పూర్తి చేసిన తర్వాత ట్రంప్ తన తండ్రి లాగే రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వెళ్లారు. తండ్రిలా కాకుండా వ్యాపారంలో రిస్క్ చేయాలన్నది ట్రంప్ ఆలోచన. బోల్డ్‌గా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్లిన ట్రంప్ చాలాసార్లు వ్యాపారంలో ఘోరంగా దెబ్బతిన్నారు. 1980లలో విలాసవంతమైన భవనాలు, హోటళ్ళు, కాసినోలలో భారీగా పెట్టుబడి పెట్టారు. అయితే 1990ల ప్రారంభంలో అమెరికాను చుట్టేసిన మాంద్యం ట్రంప్ కు నష్టాలను తెచ్చిపెట్టింది. భారీ అప్పులు ఆయన నెత్తిమీద వచ్చి పడ్డాయి. కొన్నాళ్లపాటు దివాలా అంచు వరకు ఉన్న ట్రంప్ 2000వ సంవత్సరం తర్వాత కోలుకున్నారు. నాడు రియాలిటీ టీవీ షోలలో కనిపించి మెరిశారు. ది అప్రెంటిస్ అనే బిజినెస్ పోటీ షోతో ప్రజలకు దగ్గరయ్యారు . ఈ ప్రొగ్రామ్‌లో 'యు ఆర్ ఫైర్' అని ట్రంప్ చెప్పే డైలాగ్ నాడు అమెరికాలో మారుమోగింది. ఇలా తనకంటూ ఓ సపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ట్రంప్ మరోసారి విజయవంతమైన వ్యాపారవేత్తగా మారారు. రాజకీయాల్లోనూ..ఇలా 2015 వరకు వివిధ వ్యాపారాల్లో బిజీగా ఉన్న ట్రంప్ అదే సంవత్సరం నుండి ఎవరూ ఊహించని విధంగా రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు.రిపబ్లికన్ పార్టీ నుంచి అధ్యక్ష అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని ట్రంప్ చెప్పినప్పుడు అంతా నవ్వారు. పిచ్చోడు ఏదో మాట్లాడుతున్నాడని ఎగతాళి చేసినవారు కూడా ఉన్నారు. అయితే ట్రంప్ ఎవరి మాటలు పట్టించుకోలేదు.. చేయాల్సింది చేశారు.. నామినేషన్ వేయడమే కాదు.. 2016ఎన్నికల్లో గెలిచి అమెరికా 45వ అధ్యక్షుడిగా వైట్ హౌస్ మెట్లెక్కారు. అధ్యక్షుడిగా ఎన్నికయ్యారే కానీ ఎన్నో సమస్యలు ఆయన్ను చుట్టుముట్టాయి. ఎన్నో వివాదాల్లో ఆయన చిక్కుకున్నారు. వివిధ అంశాల్లో ఆయన విధానాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఇమ్మిగ్రేషన్ విధానాలను మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముస్లిం వ్యతిరేకి అంటూ దుయ్యబట్టాయి. అంతేకాదు అనేకసార్లు నల్లజాతీయులకు వ్యతిరేకంగా విద్వేష వ్యాఖ్యలు చేసిన ట్రంప్ అపఖ్యాతి మూటగట్టుకున్నారు.ఆయన హయంలోనే ప్రపంచాన్ని కుదిపేసిన జార్జ్ ఫ్లాయిడ్ హత్య జరిగింది.ట్రంప్ పాలనలో పోలీసులు కర్కశంగా వ్యవహరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి.అటు NATO మిత్రదేశాలతోనూ అమెరికా సంబంధాలు ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే దెబ్బతిన్నాయి. ఓటమి తర్వాత..2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన ట్రంప్ ఆ తర్వాత మరిన్ని వివాదాల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా 2021 జనవరి 6న క్యాపిటల్ హిల్ భవనంపై ఆయన మద్దతుదారులు దాడి చేయడం, అక్కడి పరిసరాలకు నిప్పు పెట్టడం అమెరికాను ఉలిక్కిపడేలా చేసింది. నాడు ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ట్రంప్ తన సపోర్టర్స్‌ను ప్రసంగాలతో రెచ్చగొట్టడం కారణంగానే వారంతా విధ్వంసానికి దిగారని నాటి సైనికాధికారులే ప్రకటించారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటెటివ్స్ నుంచి ట్రంప్ అభిశసంనలకు గురవడంతో ఆయన రాజకీయ జీవితం ముగిసినట్టేనని అంతా భావించారు. అయితే అందరి ఆలోచనలకు తగ్గట్టుగా నడుచుకుంటే ఆయన ట్రంప్ ఎందుకవుతారు.. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి గెలిచి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించేందుకు రెడీ అయ్యారు. పడిలేచిన కెరటంలా..భారీ సంపద, హోదా ఉన్నప్పటికీ ఆయన ఎదుర్కొన్న ఎదురుదెబ్బలు, కిందపడి మళ్లీ లేచి గెలిచిన నైజం ఆయనలోని పోరాటయోధుడిని కళ్లకు కడుతోంది. ఎన్నో కష్టమైన ఆర్థిక, రాజకీయ క్షణాలను ఒంటరిగానే ఎదుర్కొన్న ట్రంప్ వ్యక్తిగతంగానూ ఎన్నో బాధలు పడ్డారు. ట్రంప్‌ని ఎన్నో అంశాల్లో తిట్టేవారు ఉండొచ్చు కానీ ఆయన్ను మెచ్చుకోకుండా ఉండలేని విషయం ఒకటుంది. ఆయన మందు తాగరు.. అల్కహాల్‌కు చాలా దూరంగా ఉంటారు. 1981లో తన సోదరుడు అల్కహాల్ అలవాటు కారణంగానే అనారోగ్యంతో చనిపోయాడు. ఇది ట్రంప్‌ను ఎంతగానో కుంగదీసింది. అందుకే మద్యాన్ని పుచ్చుకోని ట్రంప్ తన తోటివారికి కూడా మందు తాగవద్దని చెబుతుంటారు. అటు ట్రంప్ వైవాహిక జీవితం కూడా ఎన్నో వివాదాలతో ముడిపడి ఉంది. 1990లో మొదటి భార్య ఇవానాతో విడాకులు ట్రంప్‌ను మానసికంగా కుమిలిపోయేలా చేసింది. అటు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇలా వ్యక్తిగతంగా, రాజకీయపరంగా ఎన్నో కష్టనష్టాలను అనుభవించిన ట్రంప్ మరోసారి అధ్యక్షుడిగా గెలవడాన్ని ఒక ఏడాది ముందు వరకు ఎవరు ఊహించి ఉండరు కూడా. అత్యంత శక్తివంతమైన వ్యక్తులు కూడా తమతో తామే మూసివేసిన తలుపుల లోపల సొంత యుద్ధాలను ఎదుర్కొంటారని చెప్పేందుకే ట్రంప్ జీవితమే ప్రత్యక్ష సాక్ష్యం.. మరి అగ్రరాజ్యపు అధ్యక్షునిగా మున్ముందు ప్రపంచానికి ఎటువంటి దక్షత ప్రదర్శిస్తాడో ఈ మొక్కవోని వ్యాపారి ట్రంప్. తన టెంపరితనంతో ప్రత్యర్ధులకు టెంపరేచర్ పెంచి ఎదురులేని విక్టరీ సాధించిన ట్రంప్ వచ్చే నాలుగేళ్లు ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపిస్తారో చూడాలి:::నాగ త్రినాథ్ బండారు , సాక్షి డిజిటల్ -
Who is Nasrallah: ఇజ్రాయెల్ మోస్ట్‌వాంటెడ్ ఇతనే!
పశ్చిమాసియాలో ఇప్పుడు ఇజ్రాయెల్-లెబనాన్ యుద్ధ వాతావరణం కనిపిస్తోంది. పాలస్తీనా అనుకూల.. ఇరాన్ మద్దతు ఉన్న హెజ్బొల్లాను సమూలంగా తుడిచిపెట్టేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ రక్షణ బలగాలు(IDF) భీకర దాడులు కొనసాగిస్తోంది. మరీ ముఖ్యంగా ఆ సంస్థ చీఫ్ హసన్ నస్రల్లాను లక్ష్య్ంగా చేసుకుని బీరుట్‌లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంలో బాంబులు కుమ్మరించింది. అయితే ఆయన సురక్షితంగా ఉన్నారని హెజ్బొల్లా ప్రకటించుకున్నప్పటికీ.. ఆయన కుమార్తె జైనబ్ మరణించారనే వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ నజ్రల్లా ఎవరు?. ఆయన బ్యాక్‌గ్రౌండ్ ఏంటన్నది పరిశీలిస్తే..పాలస్తీనియన్ లిబరేషన్ ఆర్గనైజేషన్ (పీఎల్‌వో) నిర్మూలనే లక్ష్యంగా 1980లో లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేసింది. రాజధాని బీరుట్ నుంచి పీఎల్‌వోను తరిమికొట్టి విజయం సాధించింది. అయితే, ఎలాగైనా కక్ష తీర్చుకోవాలని ప్రయత్నంచిన పీఎల్ఓలోని కొందరు 1982 జూన్‌లో ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ప్రధాన కార్యాలయం షైన్ బెట్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో దాదాపు 91 మంది ఇజ్రాయెల్ అధికారులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి తామే కారణమని షియా ఇస్లామిస్టులు ప్రకటించుకున్నారు. ఆ తర్వాత వారంతా కలిసి హెజ్బొల్లాగా ఏర్పాటయ్యారు. ఈ సంస్థ ఏర్పాటులో ముసావితో కలిసి నస్రల్లా కీలక పాత్ర పోషించాడు.1992లో అప్పటి హెజ్బొల్లా అధినేత అబ్బాస్ అల్ ముసావి హెలికాఫ్టర్‌లో వెళ్తుండగా ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. దీంతో సంస్థ పగ్గాలను తన మార్గదర్శి స్థానం నుంచి నస్రల్లా అందుకున్నాడు. అప్పటికి అతడి వయసు 32 ఏళ్లే. అతడి నాయకత్వంలో హెజ్బొల్లా ఇంతలా బలపడి ఉంటుందని బహుశా అప్పుడు ఇజ్రాయెల్ మిలిటరీ దళాలు ఊహించకపోవచ్చు.పశ్చిమాసియాలో సంస్థను బలోపేతం చేయడంతో పాటు లెబనాన్ ప్రభుత్వంలోనూ భాగస్వామిగా మార్చాడు. హెజ్బొల్లా ప్రభావాన్ని దేశ సరిహద్దులు దాటి విస్తరించగలిగాడు. 2011లో సిరియాలో ప్రభుత్వ వ్యతిరేక తిరుగుబాటుదారులకు ఈ సంస్థ సాయం చేసింది.దాదాపు రెండు దశాబ్దాల క్రితం ఇజ్రాయెల్‌తో హెజ్బొల్లా చేసిన భీకర పోరాటం తర్వాత నస్రల్లా పేరను అరబ్ దేశాల్లో మార్మోగింది. 2006లో లెబనాన్‌లో 34 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్‌ను ఓడించడంలో అతడు కీలక ప్రాత పోషించాడు. అప్పటి నుంచే ఇజ్రాయెల్‌కు బద్ధ శత్రువుగా మారాడు.నస్రల్లా కేవలం హెజ్బొల్లా చీఫ్‌గా మాత్రమే గుర్తింపు లేదు. బీరుట్ శివారులోని బుర్జ్ హమ్ముద్ ప్రాంతంలో 1960లో నస్రల్లా జన్మించాడు. అతని తండ్రి ఓ చిరు కూరగాయల వ్యాపారి. షియా కుటుంబంలో తొమ్మిది మంది తోబుట్టువుల్లో ఒకడైన నస్రల్లా.. చిన్నప్పుడే మత విద్యను అభ్యసించాడు. 16 ఏళ్ల వయసులోనే షియా పొలిటికల్, పారామిలిటరీ గ్రూప్ అయిన అమల్ ఉద్యమంలో చేరాడు. అప్పటి హెజ్బొల్లా సారథి అబ్బాస్ అల్ ముసావి దృష్టిలో పడడంతో ఆయన జీవితమే మలుపు తిరిగింది. నస్రల్లా భార్య ఫాతిమా యాసిన్. నలుగురు పిల్లలు. 1997లో ఇజ్రాయెల్ యుద్ధంలో తన పెద్ద కొడుకు హదీని కోల్పోయాడాయన. తాజాగా దక్షిణ లెబనాన్‌లోని దాహియా ప్రాంతంలోని హెజ్బొల్లా హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్ బలగాల దాడుల్లో నస్రల్లా కూతురు కుమార్తె జైనబ్ మృతిచెందినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇజ్రాయెల్ మీడియా సంస్థల్లో కథనాలు వస్తున్నా.. ఆమె మృతిని హెజ్బొల్లా గానీ, లెబనాన్ అధికారులు గానీ ధ్రువీకరించలేదు. హెజ్బొల్లాలో జైనబ్ కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తోంది. జైనబ్ మృతి నిజమైతే గనుక.. ప్రతీకారంగా హెజ్బొల్లా దాడులను తీవ్రతరం చేసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఇజ్రాయెల్ భూభాగాలను లక్ష్యంగా చేసుకుని 65 రాకెట్లతో విరుచుకుపడింది కూడా. ఇంతకీ నస్రల్లా ఎక్కడ?నస్రల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు జరుపుతోంది. తాజా దాడుల్లో నస్రల్లా మరణించాడా? లేదా సురక్షితంగానే ఉన్నాడా? అన్నదానిపై స్పష్టత లేదు. తాము జరిపిన దాడుల్లో అతడు బతికే అవకాశాలు లేవని ఇజ్రాయెల్ అంటోంది. మరోవైపు, హెజ్బొల్లా వర్గాలు మాత్రం తమ నాయకుడు ప్రాణాలతో ఉన్నట్లు చెబుతున్నాయి. ప్రస్తుతానికి నస్రల్లా ఎక్కడ ఉన్నాడన్నది తెలియరాలేదు. కానీ, కమ్యూనికేషన్ కట్ అయ్యినట్లు సమాచారం. మరోవైపు, హెజ్బొల్లా స్థావరాలపైకి యాంటీషిప్ క్షిపణులతో ఐడీఎఫ్ దాడులు కొనసాగిస్తోంది. దీంతో బీరుట్ సహా లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో సైరెన్ల మోత మోగుతోంది. -
వయనాడ్ విషాదం: ఈ తరహా విపత్తుల్ని ముందుగా గుర్తించలేమా? మానవ తప్పిదాలతోనే..
కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన తీవ్ర బీభత్సం సృష్టించింది. ఈ ప్రకృత్తి విపత్తు కారణంగా వరద, బురద వెల్లువెత్తాయి. వాటి ప్రవాహ మార్గంలో ఉన్న ముందక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ తదితర కుగ్రామాలు సమాధయ్యాయి. సోమవారం అర్థరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘటనతో అసులు కొండచరియలు ఎందుకు విరిగిపడతాయి? వాటికి గల కారణాలేంటీ? ఏంటీ అనే దానిపై అందరూ చర్చిస్తున్నారు.. సహజంగా సంభవించే ప్రకృతి విపత్తుల్లో కొండచరియలు విరిగిపడటం ఒకటి. వానకాలంలో భారీ వర్షాల కారణంగా కొండప్రాంతం నుంచి రాళ్లు, మట్టిపెళ్లలు కిందకు పడటాన్ని కొండచరియలు విరిగిపడటం అంటాం. మన దేశంలో హిమాలయ ప్రాంతం, పశ్చిమ కనుమలు, నీలగిరి కొండల ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా సంభవిస్తోంది. ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఇవి చోటుచేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. కొండచరియలు విరిగిపడటానికి సహజమైన కారణాలు కంటే మానవ చర్యలే ఎక్కువ ప్రభావం చూపుతాయి. కొండ ప్రాంతాల్లో నిర్మాణాల సమయంలో ఏటవాలు(స్లోప్) సరిగా ప్లాన్ చేయకపోవటం, వృక్ష సంపదను భారీగా తొలగించటం, కొండపై పడి కిందకు జాలువారే నీరు వెళ్లే వ్యవస్థలో ఆటంకాలు.. కారణాల వల్ల కొండచరియలు విరిగిపడుతుంటాయి.సరైన గ్రేడింగ్ లేకుండా వాలు నిర్మాణం: ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో రోడ్డు, భవన నిర్మాణాల్లో ఏటవాలుకు సరైన గ్రేడింగ్ లేకుండా నిర్మించినప్పుడు అవి పటిష్టంగా ఉండవు. దీంతో కొండప్రాంతాల్లో సమానంగా లేని భూమి ఉపరితలం అధికం అవుతుంది. ఈ కారణంగా కొండచరియలు విరిగిపడతాయి. నీళ్లు వెళ్లే మార్గాల్లో..: సహజంగా కొండల మీద వాన పడినప్పుడు.. ఆ నీరు పల్లానికి వెళ్తుంది. అందుకోసం సహజంగా మార్గాలు ఏర్పడతాయి. అయితే ఆ వ్యవస్థల దిశ మార్చడం, అందులో ఏమైనా మార్పులు చేయడంతో ఆ నీరు కిందకు వెళ్లేందుకు ఆటంకాలు ఏర్పడతాయి. ఫలితంగా.. ఆ వాననీరుతో ల మట్టి, రాళ్లు బలహీనపడి కొండచరియలు హఠాత్తుగా విరిగిపడతాయి.పాత కొండచరియల్లో తవ్వకాలు: పాత కొండచరిచయలు ఉన్న ప్రాంతాల్లో తవ్వకాలు, భారీ నిర్మాణాలు చేపట్టం వల్ల కూడా వర్షాకాలంలో అవి విరిగిపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక.. వీటితో పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడం, అధిక వర్షపాతం, కొండ ప్రాంతాల్లో అడవుల నరికివేత, కొండ దిగువ ప్రాంతాల్లో గనులు, క్వారీల తవ్వకాలు వంటివి చేయటం కారణంగా తరచూ కొండచరియలు విరగిపడతాయి. మానవులు చేసే ఈ చర్యలు వల్ల కొండ పైభాగాల్లో ఉండే రాళ్లు, మట్టిలో పటుత్వం తగ్గడంతో అకస్మాత్తుగా ఈ ఘటనలు జరుగుతాయి. భూకంపాల వల్ల కూడా తరచుగా కొండచరియలు విరిగి పడుతుంటాయి.తేడాలు ఇవే..ఎక్కువగా మట్టి, ఇసుక, బండరాళ్ల మిశ్రమాలతో వదులుగా ఉంటుంది. ఫలితంగా వర్షం నీరు వదులుగా ఉండే భాగాల్లోకి సులభంగా చొచ్చుకొనిపోతుంది. అడుగున ఉండే మట్టి నీటితో తడుస్తుంది. తద్వారా కొండవాలు వెంబడి రాళ్లు దిగువ వైపు సులువుగా జారిపోతాయి. ఉత్తర భారత భూభాగం ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక.. భూభాగం శిలలతో కూడి ఉంటే ఇలాంటి ముప్పు తక్కువగా జరగొచ్చు. ఉదాహరణకు.. తెలంగాణ ప్రాంతాల్లో ఉండే గ్రానైట్ లాంటి శిలల్లో సిలికా ధాతువు ఎక్కువగా ఉంటుంది. దానివల్ల శిలల్లో కాఠిన్యత పెరిగి గట్టిగా ఉంటాయి. పగుళ్లు సులువుగా ఏర్పడవు. అయితే..ఉదాహరణకు.. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఖోండలైట్ లాంటి శిలల్లో అల్యూమినియం ధాతువు ఎక్కువుగా ఉండటం వల్ల శిలల్లో కాఠిన్యత తగ్గి గట్టిగా ఉండవు. పగుళ్లు సులభంగా ఏర్పడతాయి. రసానిక చర్యలతో క్రమేణా మట్టిలా మార్పు చెందుతాయి. ఈ మట్టి శిలల పగుళ్ల మధ్య కూడా ఉంటుంది. వర్షాలు పడ్డప్పుడు మట్టి తడిసి శిలలు కొండవాలు వెంబడి దిగువ భాగానికి జారడానికి దోహదపడుతుంది.ముందస్తు సూచనలుకొండచరియలు విరిగి పడటం వంటి విపత్తులు సంభవించే ముందుగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇంట్లోని తలుపులు, కిటికీలు వాటంతటవే బిగుసుకుపోవడం, నేల, గోడల్లో పగుళ్లు రావడం. స్తంభాలు, వృక్షాలు పక్కకు వంగిపోవటం, కొండల నుంచి మట్టి రాలటం వంటివి చోటు చేసుకుంటాయి. ఇలా చేస్తే..ప్రమాదాల తీవ్రత అధికంగా ఉండే కొండ ప్రాంతాల్లో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదు. కొండల నుంచి మట్టి, రాళ్లు రోడ్ల మీద పడకుండా గోడలు నిర్మించాలి. ఫెన్సింగ్ ద్వారా రక్షణ కల్పించాలి. పగుళ్లు తక్కువగా ఉండే ప్రాంతాల్లో నిర్మాణాలకు సరైన ఇంజినీరింగ్ ప్రమాణాలను పాటించాలి. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలి.కొండ ఏటవాలు ప్రాంతాల్లో ఎక్కువగా మొక్కలు నాటాలి. -
మీకు తెలుసా? ఈ దేశాల్లో ఈవీఎంలు వద్దు.. పేపర్ బ్యాలెటే ముద్దు
అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు ఎన్నికల కోసం ఈవీఎంలను కాదు.. ఇంకా పేపర్ బ్యాలెట్‌నే వాడుతున్నాయి. ఆశ్చర్యకరంగా అనిపించినా ఇదే నిజం కూడా. సాధారణంగా ఎన్నికల నిర్వహణకు కొన్ని పద్ధతులంటూ ఉన్నాయి. పేపర్ బ్యాలెట్, ఈవీఎం వాడకం.. లేదంటే రకరకాల కాంబినేషన్లలో నిర్వహించడమూ జరుగుతోంది. మరి టెక్నాలజీ మీద తప్పనిసరిగా ఆధారపడుతున్న ఈరోజుల్లో.. ఆ దేశాలు ఈవీఎంలను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో చూద్దాం. 👉ప్రపంచంలో నిర్దిష్ట కాలపరిమితితో ప్రజాస్వామ్య దేశాలు ఎన్నికలు నిర్వహించుకుంటున్నాయి. అందులో 100 దాకా దేశాలు ఇప్పటికీ పేపర్ బ్యాలెట్ పద్దతినే అవలంభిస్తున్నాయి. 👉పిలిఫ్పైన్స్, ఆస్ట్రేలియా, కోస్టారికా, గువాటెమాలా, ఐర్లాండ్, ఇటలీ, కజకస్థాన్, నార్వే, యూకే.. ఈవీఎంలను ప్రయోగాత్మకంగా పరిశీలించాయి. వాటి ఫలితాల ఆధారంగా చివరకు పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు కొనసాగిస్తున్నాయి.👉భద్రత, ఖచ్చితత్వం, విశ్వసనీయత, ఎన్నికల ధృవీకరణ.. ఇవన్నీ ఈవీఎంల వాడకంపై అనుమానాలకు కారణం అవుతున్నాయి. అందుకే ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ అభివృద్ధి చెందిన దేశాలు కొన్ని ఇప్పటికీ ఈవీఎంలను వాడడం లేదు.👉జర్మనీ, నెదర్లాండ్స్, పరాగ్వే దేశాలు ఈవీఎంల వాడాకాన్ని పూర్తిగా ఆపేశాయి. అక్కడ పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు.👉2006లో నెదర్లాండ్స్ ఈవీఎంలను నిషేధించింది. 2009లో ఐర్లాండ్, అదే ఏడాది ఇటలీ సైతం ఈవీఎంలను బ్యాన్ చేశాయి. బ్యాలెట్ పేపర్‌తో పాటు రకరకాల కాంబోలో ఎన్నికలు జరుగుతున్నాయి. 👉సాంకేతికలో ఓ అడుగు ఎప్పుడూ ముందుండే జపాన్‌లో.. ఒకప్పుడు ఈవీఎంల వాడకం ఉండేది. కానీ, 2018 నుంచి అక్కడా ఈవీఎంల వాడకం నిలిపివేశారు.👉అగ్రరాజ్యం అమెరికా సహా చాలా దేశాల్లో ఈవీఎంల వాడకం పూర్తిస్థాయిలో జరగడం లేదు. విశేషం ఏంటంటే.. అక్కడ ఇప్పటికీ ఈ-ఓటింగ్‌ను ఈమెయిల్ లేదంటే ఫ్యాక్స్ ద్వారా పంపిస్తారు. అలాగే.. బెల్జియం, ఫ్రాన్స్, కెనడా, మెక్సికో, పెరూ, అర్జెంటీనాలో కొన్ని ప్రాంతాల్లో.. కొన్ని ఎన్నికలకు మాత్రమే ఈవీఎంలను వినియోగిస్తున్నారు.👉2009 మార్చిలో జర్మనీ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఈవీఎంల వాడకం రాజ్యాంగ విరుద్ధమని తేల్చింది. ఈవీఎం పనితీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఎన్నికలలో పారదర్శకత అనేది ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని జర్మనీ కోర్టు తీర్పు సందర్భంగా వ్యాఖ్యానించింది.👉ప్రపంచవ్యాప్తంగా భారత్, బ్రెజిల్, వెనిజులా సహా పాతిక దేశాలు మాత్రమే ఈవీఎంలను ఉపయోగిస్తున్నాయి. అందులో పూర్తి స్థాయి ఎన్నికల్లో ఈవీఎంలను వాడుతోంది సింగిల్ డిజిట్‌లోపు మాత్రమే. మిగతా దేశాలు స్థానిక ఎన్నికల్లో, కిందిస్థాయి ఎన్నికల్లో మాత్రమే వాటిని ఉపయోగిస్తున్నాయి. 👉భూటాన్, నమీబియా, నేపాల్‌లో భారత్‌లో తయారయ్యే ఈవీఎంలనే ఉపయోగిస్తున్నాయి. 👉ఈవీఎంల విశ్వసనీయతపై చర్చ జరగడం ఇప్పుడు తొలిసారి కాదు. 2009లో సుబ్రమణియన్ స్వామి(అప్పటికీ ఆయన ఇంకా బీజేపీలో చేరలేదు) ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణ సరికాదని అభిప్రాయపడ్డ ఆయన.. న్యాయపోరాటానికి సైతం సిద్ధపడ్డారు. అయితే ఇప్పుడు ఈవీఎంల వద్దని, పోస్టల్ బ్యాలెట్ ముద్దు అని పోరాటాలు ఉధృతం అవుతున్న వేళ.. ఆయన మౌనంగా ఉండిపోయారు. -
సలార్ కాటేరమ్మ కథ తెలుసా?
ఒక బల్లెంతో వెనుకనుంచి వచ్చే శత్రువుల్ని పొడిచి.. ముందున్న వాళ్లను కత్తులతో చీల్చేసి.. ఇంతలో ‘‘కాటేరమ్మ రాలేదు కానీ, బదులుగా కొడుకుని పంపింది అమ్మ’’ అని డైలాగ్పడగానే.. అపరకాళిలా అవతారం కటౌట్లో ప్రభాస్ అబ్బో రోమాంఛితమైన ఆ సలార్ సీన్.. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. విజిల్స్‌తో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇంతకీ ఈ కాటేరమ్మ కథ గురించి తెలుసా? ద్రవిడ సంస్కృతి నుంచి ఉద్భవించి హిందూ ఆరాధన దైవంగా మారింది శ్రీ కాటేరీ దేవత. నమ్ముకున్నవాళ్లకు అండగా ఉంటూ.. దుష్ట సంహారం చేసే దేవతే ఈ అమ్మ. దక్షిణ భారత దేశంలో.. మరీ ముఖ్యంగా తమిళనాడులో కాటేరీ అమ్మన్‌గా, కర్ణాటకలో కాటేరమ్మగా Kateramma ఆలయాల్లో కొలువై పూజలు అందుకుంటోంది. పార్వతిదేవి మరో రూపంగా భావించే కాటేరమ్మను.. కలియుగంలో రోగాల్ని నయం చేసేందుకు వెలిసిన దేవతగా పూజిస్తున్నారు. కొన్నిచోట్ల ఊరికి కాపలా దేవతగా.. మరికొన్ని చోట్ల కులదేవతగా తరతరాల నుంచి కొలుస్తున్నారు. జానపద కథ ప్రచారం.. కైలాసంలో శివుడు నిద్రపోయే సమయంలో పార్వతి దేవి రోజూ రాత్రిళ్లు ఎటో వెళ్లిపోతుంటుంది. సూర్యోదయానికి ముందు తిరిగి కైలాసానికి చేరుతుంది. ఈ చర్యపై శివుడు పార్వతిని నిలదీస్తాడు. తన ప్రమేయం లేకుండానే అలా జరిగిపోతుందంటూ పార్వతి బాధపడుతుంది. ఒకరోజు కైలాసం అడవుల గుండా వెళ్తున్న ఆమెను శివుడు అనుసరిస్తాడు. హఠాత్తుగా కాళి రూపంలోకి మారిపోయి.. శవాలను తవ్వి బయటకు తీసి తినే యత్నం చేస్తుందామె. ఉగ్ర రూపంలో ఉన్న పార్వతిని నిలువరించేందుకు అడవి మార్గంలో పెద్ద గొయ్యిని సృష్టిస్తాడు. ఆమె అందులో పడిపోయి.. తన చర్యలకు పశ్చాత్తాపం చెందుతుంది. ఇకపై ఇలాంటి చేష్టలకు పాల్పడబోనని శివుడికి మాటిస్తుంది. భయంకరమైన ఈ రూపాన్ని ఆ గొయ్యిలోనే వదిలేసి, విధేయురాలైన భార్య.. పార్వతిదేవిగా వెంట వస్తానని శివుడికి చెబుతుంది. అలా విడిచిపెట్టిన ఆ శక్తి అవతారమే.. కాటేరీ దేవతగా చెబుతుంటారు. తనను నమ్ముకున్న వాళ్లను రక్షించే దయగల దేవతగా, సర్వరోగాల్ని నయం చేసే అమ్మవారిగా వందల ఏళ్ల నుంచి పూజలు అందుకుంటోంది కాటేరమ్మ. ఈ దేవతకు జాతరలు, ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. దళిత కమ్యూనిటీలో మరోలా.. అయితే తమిళనాడు, కర్ణాటకలోని దళిత కమ్యూనిటీలు మాత్రం కాటేరమ్మను మరోలా విశ్వసిస్తాయి. శివుడి శాపం చేత ఆమె అడవుల్లో తిరుగుతుంటుందని.. ఈ కారణం చేతనే ఆమె ఉగ్రరూపంలో దర్శనం ఇస్తుందని చెబుతూ కాటేరమ్మను బలి దేవతగా కొలుస్తుంటారు. కాటేరమ్మకు ఇష్ట నైవేద్యంగా వేప ఆకుల్ని భక్తులు పేర్కొంటారు. నిమ్మకాయలు, ఎర్ర పువ్వులతో పూజిస్తారు. జంతు బలిలో కోళ్లను, మేకల్నే కాకుండా పందుల్ని కూడా ఒక్కోసారి బలిస్తుంటారు. కుల దేవతగానూ కాటేరమ్మ దక్షిణ భారతంలో పూజలు అందుకుంటోంది. మద్రాసీ సంస్కృతిలో మద్యం, సిగరెట్లు సైతం సమర్పిస్తుంటారు. మరికొన్ని చోట్ల బలి లేకుండా ప్రసాదాలతో కొలుస్తారు. ఇదీ చదవండి: సలార్ మూవీ రివ్యూ శక్తివంతమైన దేవతగా.. కాటేరమ్మ.. అనేక రూపాల్లో దర్శనమిస్తుంది. ఉగ్ర రూపంలోనే కాదు.. శాంత స్వరూపిణిగానూ పూజలు అందుకుంటోంది. నీలి రంగు లేదంటే నలుపు రంగు విగ్రహాల్ని.. ఎక్కువగా నాలుగు భుజాల దేవతగా.. ఒక్కో చేతిలో కత్తి, త్రిశూలం, తామర, గిన్నెతో రూపొందిస్తారు. మరికొన్ని చోట్ల అనేక భుజాలతో ఉగ్రరూపంలో ఏర్పాటు చేస్తారు. దక్షిణ రాష్ట్రాల్లోనే కాదు.. శ్రీలంకలోనూ కొన్ని తెగలు కాటేరమ్మను కొలుస్తారు. ట్రినిడాడ్, గుయానా, జమైకా, మారిషస్, సౌతాఫ్రికాలో స్థిరపడిన తమిళ కమ్యూనిటీ ప్రజల నుంచి కూడా పూజలు అందుకుంటోంది. కన్నడ ప్రజలు కాటేరమ్మగానే కాకుండా.. రక్త కాటేరమ్మగానూ కాటేరీ దేవి ఆరాధ్య దైవం. రోగాలు మాయం చేయడంతో పాటు దుష్టశక్తుల్ని వదిలిస్తుందని నమ్ముతారు. అలా కన్నడనాట శక్తివంతమైన దేవతగా పేరున్న కాటేరమ్మ రిఫరెన్స్‌ను ఇలా ప్రభాస్ ఫైట్ సీన్‌తో Salaar Kateramma Scene ప్రేక్షకులకు రుచిచూపించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ 'సలార్' మూవీ స్టిల్స్ -
186 ఏళ్ల తర్వాత.. కొత్త చరిత్రకు శ్రీకారం
ఢిల్లీ: భారత శిక్షా స్మృతి (ఇండియన్ పీనల్ కోడ్–ఐపీసీ), 1860, నేర విచారణ ప్రక్రియా స్మృతి (క్రిమినల్ ప్రొసీజర్ కోడ్–సీఆర్పీసీ), 1898, భారత సాక్ష్య చట్టం (ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్), 1872 ల స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చే ప్రక్రియ పార్లమెంటులో ప్రారంభమైంది. స్వతంత్ర భారతంలో ఇది విప్లవాత్మక చర్యగా భావిస్తున్నారు. ఈ నెల 11న ఈ మూడు చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిల్లు (బీఎన్ ఎస్), భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు (బీఎన్ ఎసెస్), భారతీయ సాక్ష్య బిల్లు (బీఎస్)లను కేంద్ర హోం మంత్రి అమిత్ ప్రవేశపెట్టారు. కీలకమైన ఈ 3 మూడు బిల్లులను సమగ్రంగా, లోతుగా అధ్యయనం చేసి, వాటిలో అవసరమైన మార్పులు చేర్పులు సూచించడానికి పార్లమెంటరీ కమిటీకి ఈ బిల్లులను తర్వాత నివేదించారు. ► కాలం చెల్లిన చట్టాలను రద్దుచేయడం లేదా వాటి స్థానంలో కొత్తవి తీసుకురావడం, మార్పులు అవసరమైన చట్టాలను సవరించడం, మారుతున్న కాలానికి, అవసరాలకు అనుగుణంగా కొత్త చట్టాలు చేయడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సాధారణం. అయితే, ఈ మూడు చట్టాలూ న్యాయవ్యవస్థ విచారణ ప్రక్రియకు సంబంధించినవి కావడంతో కొత్త బిల్లులపై ఆసక్తి పెరుగుతోంది. బ్రిటిష్ వారి పాలనాకాలంలో రూపొందించి, అమల్లోకి తెచ్చిన పై మూడు చట్టాలకూ తర్వాత, స్వతంత్ర భారతంలో అవసరమైన సవరణలు చేశారు. అయినా.. ► మారిన పరిస్థితులు, అభిప్రాయాల కారణంగా 21వ శతాబ్దంలో భారత పార్లమెంటు ఈ మూడింటి స్థానంలో కొత్త బిల్లులు రూపొందించి, వాటికి చట్ట రూపం కల్పించే ప్రక్రియను 17వ లోక్ సభ చివరి సంవత్సరంలో ప్రారంభించడం మంచి పరిణామమని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా వీటిలో అత్యంత కీలకమైన భారత శిక్షా స్మృతి (ఐపీసీ) ఎలా అమలులోకి వచ్చింది ఓసారి గుర్తుచేసుకుందాం. ఇంగ్లిష్ వారి హయాంలో 1862 నుంచి అమలులోకి వచ్చిన ఐపీసీ తొలుత ఈస్టిండియా కంపెనీ పాలనలో ఇండియాలోని మూడు ప్రధాన ప్రాంతాలను (కలకత్తా, మద్రాస్, బొంబాయి ప్రెసిడెన్సీలు) కేంద్రీకృత పాలనా వ్యవస్థ పరిధిలోకి తీసుకొచ్చారు. కంపెనీ అధీనంలోని అన్ని భూభాగాల ప్రజల కోసం శాసనాలు చేయడానికి సెంట్రల్ లెజిస్టేటివ్ కౌన్సిల్ ఏర్పాటయింది. కొత్తగా చేసే చట్టాల రూపకల్పనకు కౌన్సిల్ లో న్యాయవిభాగం సభ్యుడు థామస్ బీ మెకాలే అధ్యక్షతన రెండేళ్ల తర్వాత లా కమిషన్ ఏర్పాటు చేశారు. తమ మాతృదేశం బ్రిటన్‌లో అమలులో ఉన్న సాధారణ ఇంగ్లిష్ చట్టాల ఆధారంగా ఇండియాలో అమలు చేసే చట్టాలు ఉండాలనేది వారి అప్రకటిత లక్ష్యం. మొదట సమగ్రమైన పీనల్ కోడ్ (శిక్షా స్మృతి) ను రూపొందించే బాధ్యతను లా కమిషన్ కు అప్పగించారు. ► మెకాలే బృందం హడావుడిగా ఒక ముసాయిదా స్మృతిని నాటి గవర్నర్ జనరల్ కు 1837లో సమర్పించింది. కొన్నేళ్లు అధ్యయనం చేశాక మెకాలే వారసులు డ్రింక్ వాటర్ బెతూన్, బార్నెస్ పీకాక్ దాన్ని సంపూర్ణంగా సవరించారు. సవరించిన ముసాయిదాను 1856లో సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు సమర్పించారు. 1857లో తొలి భారత స్వాతంత్య్ర సంగ్రామం (సిపాయి తిరుగుబాటు) కారణంగా ఈ ముసాయిదాను చట్టంగా చేసే పని నిలిచిపోయింది. ఈ బెంబేలెత్తిన బ్రిటిష్ సర్కారు భవిష్యత్తులో ఇలాంటి ‘తిరుగుబాటుదారుల’ను అణచివేసే అధికారాన్ని దఖలు పరచుకుంటూ ఈ ముసాయిదాను మరోసారి సవరించింది. భారీ మార్పులతో రూపొందించిన ముసాయిదాను కేంద్ర చట్టసభ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు సమర్పించగా 1860లో దీన్ని ఆమోదించించారు. ► ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) పేరుతో 1862లో ఇది అమలులోకి వచ్చింది. వెంటనే నాటి న్యాయస్థానాల భాష అయిన ఉర్దూలోకి దీన్ని అనువాదం చేయించారు. ఉర్దూ తర్జుమా ప్రతికి ‘తాజీరాతే హింద్’ అని పేరుపెట్టారు. మొదట ఈ ఐపీసీలో 23 చాప్టర్ల కింద 511 సెక్షన్లు ఉన్నాయి. 11 ఐపీసీ సవరణ చట్టాల పేరుతో దానిలో మార్పులు చేశారు. చాప్టర్ల సంఖ్య 25కు పెంచారు. స్వతంత్ర భారతంలో 1959 నుంచి ఐపీసీని 12 పర్యాయాలు సవరించారు. 1860 నుంచి దానికి అదనంగా 61 సెక్షన్లు జోడించారు. అలాగే, అనవసరమని భావించిన 21 సెక్షన్లను తొలగించారు. ప్రస్తుతం ఐపీసీలో 555 సెక్షన్లు ఉన్నాయి. కోడ్ అనే మాటకు సంస్కృతంలో స్మృతి అంటారు. దాన్నే ఇప్పుడు హిందీలో సంహిత అనే పేరుతో కొత్త శాసనం రూపొందిస్తున్నారు. అయితే.. బ్రిటిష్ వారి జమానాలో ఐపీసీని భారతీయ దండ్ సంహిత అని హిందీలోకి అనువదించినప్పటికీ అప్పట్లో అది ప్రాచుర్యంలోకి రాలేదు. ::: విజయసాయిరెడ్డి, వైఎస్సార్ సీపీ, రాజ్యసభ సభ్యులు -
డిజిటల్ ప్రపంచానికి కష్టకాలం తప్పదా?
పొద్దున లేనిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే దాకా.. మధ్యలో మనం చేసే దాదాపు ప్రతీ పనికి-స్మార్ట్ ఫోన్‌తో ముడిపడిపోయింది. ఎందుకంటే.. మనమంతా డిజిటల్ వరల్డ్‌లో దర్జాగా బతుకుతున్నాం. ఇంటర్నెట్ లేకుంటే ఏ పనులూ జరగవు!. అలాంటిది ఇంటర్నెట్లేని రేపటిని ఊహించుకోగలమా?.. అమ్మో కలలో కూడా కష్టం అంటారా?.. అయితే ఇది చదివేయండి! ఇంటర్నెట్ అపోకలిప్స్ internet apocalypse.. ఇప్పుడు వార్తల్లో చక్కర్లు కొడుతూ ప్రజల్ని భయపెడుతున్న పదం. దీనర్థం ఇంటర్నెట్కి గడ్డుకాలం వచ్చిందని అప్రమత్తం చేయడమే!. 2025 నాటికల్లా సోలార్ మాగ్జిమమ్(ఉగ్రరూపానికి అన్నట్లు)కి సూర్యుడు చేరుకుంటాడని.. అప్పుడు ఏర్పడే సౌర తుపాన్ల ధాటికి ఇంటర్నెట్కు విఘాతం కలగవచ్చని తీవ్ర హెచ్చరికలు జారీ అయ్యాయి. ఒకవేళ సౌర తుపాను గనుక భూమిని తాకితే!.. ఈ చర్చ ఇప్పటిది కాదు.. గత కొంతకాలంగా నడుస్తూ వస్తోంది. సౌర తుపాను భూమిని గనుక తాకితే గంటల నుంచి రోజుల తరబడి కమ్యూనికేషన్ వ్యవస్థ ఆగిపోతుంది. అంటే ఇంటర్నెట్ సహా అన్నీ సంధాన వ్యవస్థలు ఆగిపోవచ్చన్నమాట. ఆశ్చర్యకరంగా.. ఈ వాదనతో పలువురు సైంటిస్టులు, ప్రొఫెసర్లు సైతం అంగీకరిస్తున్నారు. Internet Apocalypse 2025 ఎందుకీ అంతరాయం సౌర తుపాను అంటే సూర్యుడిపై ఏర్పడే విద్యుత్ తరంగం. సూర్యునిలో ఏర్పడే అసాధారణమైన అయస్కాంత విస్ఫోటనం ఇది. ఈ అలలు చుట్టుకుని మబ్బులా ఏర్పడి సూర్యుడి ఉపరితలాన్ని విచ్ఛేదనం చేయడం, సన్నటి పదార్థాలను ఊడ్చేయడం చేస్తాయి. ఈ తుపాన్లు భూమితో పాటు మిగతా గ్రహాలపై ప్రభావం చూపెట్టనుంది. సమాచార వ్యవస్థకు సంబంధించిన ప్రతీదానిని దెబ్బ తీస్తుంది. 2025 ఇంటర్నెట్ Internet Apocalypse 2025 సంక్షోభాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ధృవీకరించలేదు. కానీ, చర్చ జోరుగా నడుస్తోంది. సోషల్ మీడియాలోనూ విపరీతంగా మీమ్స్ కనిపిస్తున్నాయి. మరి ఆధారం ఏమిటి?.. ఎందుకంటే స్పేస్‌సైన్స్ ఆ వాదనతో ఏకీభవిస్తోంది కాబట్టి. సోలార్ మాగ్జిమమ్ ప్రభావం ఇంటర్నెట్పై కచ్చితంగా ఉంటుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. అందుకే అలాంటి పరిస్థితులకు ముందుగా సన్నద్ధం కావాలంటూ ముందు నుంచే సిద్ధం చేస్తున్నారు. సౌర తుపాన్లనేవి అరుదుగా వస్తుంటాయి. గతంలో 1859, 1921లో భూమిని తాకాయి. 1859లో టెలిగ్రాఫ్స్ సేవలు దెబ్బ తిన్నాయి. 1989లో ఓ మోస్తరు తుపాను కూడా సంభవించింది. ఆయా సమయాల్లో రేడియో వ్యవస్థలు మూగబోయాయి. అయితే ఇప్పుడున్నంత ఎలక్ట్రిక్ గ్రిడ్స్, ఇంటర్నెట్ వ్యవస్థ ఆ సమయంలో లేదు. కాబట్టే.. ఇప్పుడు ఓ మోస్తరు తుపాను వచ్చినా తీవ్ర నష్టం ఉండొచ్చని కాలిఫోర్నియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న సంగీత అబు జ్యోతి చెబుతున్నారు. నష్టం ఊహించని దానికంటే.. Internet Apocalypse 2025 సంభవిస్తే గనుక సముద్ర అంతర్బాగం నుంచి విస్తరించి ఉన్న ఇంటర్నెట్ కేబుల్స్‌పై సౌర తుపాను తీవ్ర ప్రభావం చూపెడుతుంది. ఆప్టికల్ సిగ్నల్స్ తరచూ ఇబ్బందికి గురికావడంతో అంతర్గత వ్యవస్థల్లో పెద్ద ఎత్తున్న డ్యామేజ్ జరగొచ్చు. అప్పుడు మొత్తం ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతుంది. ఆ ప్రభావం ఎన్నిరోజులు ఉంటుంది?.. తిరిగి ఎన్నిరోజుల్లో యధాస్థితికి తీసుకురావొచ్చనేది ఇప్పుడే చెప్పలేం. అంత పెద్ద విపత్తును ఎదుర్కొవడానికి అంతర్జాతీయ సమాజం ఎలా ఎదుర్కొంటుందో కూడా ఊహించలేం. కానీ, జరిగే నష్టం మాత్రం ఊహించని స్థాయిలో ఉంటుందనేది మాత్రం చెప్పొచ్చు. ఒకవేళ నిజంగా సౌరతుపాను Internet Apocalypse 2025 గనుక విరుచుకుపడితే మాత్రం.. ఆసియా దేశాలకు డ్యామేజ్ తక్కువగా ఉండొచ్చు. ఎందుకంటే.. భూమధ్య రేఖకు దగ్గరగా సముద్ర గర్భ కేబుల్స్ ఉండడం కలిసొచ్చే అంశమని చెప్తున్నారు. ఈ లెక్కన భారత్ సహా మరికొన్ని దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. కానీ, అట్లాంటిక్, ఫసిఫిక్ మహాసముద్రాల పరిధిలోని అంతర్గత కేబుల్ వ్యవస్థ మాత్రం సౌర తుపానుతో ఘోరంగా దెబ్బతింటుంది. -
బర్త్‌డేకు ఒక్కరోజు ముందు.. ఓపెనర్‌గా డబుల్ సెంచరీ
వన్డేల్లో ఎంఎస్ ధోని అత్యధిక స్కోరు ఎంత అని అడిగితే టక్కున వచ్చే సమాధానం.. శ్రీలంకపై 183* పరుగుల సుడిగాలి ఇన్నింగ్స్. అంతకముందు పాకిస్తాన్‌పై 148 పరుగుల ఇన్నింగ్స్ ఆడినప్పటికి అంతగా పేరు రాలేదు. కానీ 183 పరుగులు ఇన్నింగ్స్ మాత్రం ధోని కెరీర్లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచిందనడంలో సందేహం అవసరం లేదు. ఇక్కడి నుంచి ధోని కొట్టిన హెలికాప్టర్ షాట్లు బాగా ఫేమస్ అయ్యాయి. అయితే ధోని ఈ రెండు ఇన్నింగ్స్‌లను మిడిలార్డర్లో వచ్చి ఆడినవే. మరి ధోని ఓపెనర్‌గా డబుల్ సెంచరీ బాదాడన్న విషయం మీకు తెలుసా? అవును ఓపెనర్‌గా ధోని డబుల్ సెంచరీ బాదాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో కాదు.. దేశవాలీ క్రికెట్లో. తన పుట్టినరోజుకు ఒక్కరోజు ముందు ధోని ఈ అద్బుత ఇన్నింగ్స్‌ను ఆడడం ఇక్కడ మరో విశేషం. జూన్ 6, 2005లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా ధోని షామ్ బజార్ క్లబ్ తరపున 50 ఓవర్ల మ్యాచ్ ఆడాడు. పి-సేన్ టోర్నమెంట్లో భాగంగా జార్జ్ టెలిగ్రాఫ్‌తో షామ్ బజార్ క్లబ్ జట్టు తలపడింది. ఆ మ్యాచ్‌కు వచ్చిన అభిమానులను ధోని నిరాశపరచలేదు. ప్రత్యర్థి జట్టు బౌలర్లను చీల్చి చెండాడుతూ కేవలం 126 బంతుల్లోనే 207 పరుగులు బాదాడు. బ్యాట్‌కు చిల్లుపడిందా అన్నట్లుగా స్టేడియాన్ని సిక్సర్ల వర్షంతో మోతెక్కించాడు. ఆరోజు ధోని ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ విషయాన్ని టెలిగ్రాఫ్ పత్రిక మరుసటి రోజు పెద్ద హెడ్‌లైన్స్‌తో ప్రచురించింది. ఇప్పటికి ధోని డబుల్ సెంచరీకి 18 ఏళ్ల పూర్తయిన సందర్భం.. ఇవాళ ధోని బర్త్‌డే సందర్భంగా ఆ విషయాన్ని గుర్తుచేసుకుంటూ బెంగాల్ క్రికెట్ అసోసియేష్(CAB) పంచుకుంది. అయితే అంతర్జాతీయ క్రికెట్లో ధోని 2006లో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో ఓపెనర్‌గా వచ్చి 106 బంతుల్లో 96 పరుగులు చేసి ఔటయ్యాడు. కేవలం నాలుగు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకున్నాడు. వన్డే కెరీర్లో ఓపెనర్‌గా ధోనికిదే అత్యధిక స్కోరు. ఇక ధోనికి వన్డేల్లో డబుల్ సెంచరీ లేకపోయినప్పటికి.. టెస్టుల్లో ఆ ముచ్చటను తీర్చుకున్నాడు. 2012-13లో చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ధోని ఈ ఫీట్ సాధించాడు. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 265 బంతులాడిన ధోని 224 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. On MS Dhoni's 42nd birthday, I found this report from 7th June 2005. It was about Dhoni hitting 207 off just 126 balls with 10 6s for Shyambazar Club against George Telegraph in the P Sen tournament at the Eden Gardens. pic.twitter.com/HbZNIHTD1o — Joy Bhattacharjya (@joybhattacharj) July 7, 2023 ఇక టీమిండియా కెప్టెన్‌గా ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఎంఎస్ ధోని ఇవాళ(జూలై 7న) 42వ పడిలోకి అడుగుపెట్టాడు. టీమిండియా క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా గుర్తింపు పొందిన ఎంఎస్ ధోని 2007లో టి20 ప్రపంచకప్, 2011లో వన్డే వరల్డ్‌కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోపీ ఇలా మూడు టైటిల్స్ గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు.అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పి మూడేళ్లు కావొస్తున్నా అతని క్రేజ్ ఇసుమంతైనా తగ్గలేదు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 16వ సీజన్ చాలు ధోని క్రేజ్ ఏంటో చెప్పడానికి. ఇక ఐపీఎల్లో సీఎస్కేను ఐదుసార్లు చాంపియన్‌గా నిలిపి అక్కడా సక్సెస్ఫుల్ కెప్టెన్ అయ్యాడు.2004లో టీమిండియాలో కీపర్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా అరంగేట్రం చేసిన ధోని.. సుమారు 15 సంవత్సరాల పాటు అంతర్జాతీయ కెరీర్లో జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు. ధోని కెరీర్లో 90 టెస్టుల్లో 4876 పరుగులు, 350 వన్డేల్లో 10,773 పరుగులు, 98 టి20ల్లో 1617 పరుగులు చేశాడు. చదవండి: '30 లక్షలు సంపాదించి రాంచీలో ప్రశాంతంగా బతికేస్తా' ధోనికి వాళ్లంటే ఇష్టం! ‘ఏకైక’ క్రికెటర్‌గా ఎన్నెన్నో ఘనతలు! 42 ఆసక్తికర విషయాలు -
సీన్ రివర్స్ అయినట్టుందే!.. ఇంగ్లండ్‌కు దిమ్మతిరిగే షాక్
ఇంగ్లండ్ జట్టు బజ్‌బాల్ ఆటతీరుతో వరుసగా సిరీస్‌లు గెలిచిన సంగతి తెలిసిందే. స్టోక్స్ కెప్టెన్‌గా.. మెక్కల్లమ్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంగ్లండ్ జట్టు 13 టెస్టుల్లో 11 విజయాలు సాధించింది. అన్నింటిలోనూ బజ్‌బాల్ ఆట దూకుడునే ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లను మట్టికరిపించి సిరీస్ విజయాలను సొంతం చేసుకుంది. ఇక యాషెస్ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు కూడా ఇంగ్లండ్ జట్టు తమ బజ్‌బాల్ దూకుడు కొనసాగుతుందని స్పష్టం చేసింది. అందుకు తగ్గట్టుగానే ఆసీస్‌తో తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌ను ఒక్కరోజులోనే డిక్లేర్ చేసింది. అయితే ప్రతీసారి మనది కాదని తెలుసుకోని ఇంగ్లండ్ ప్రపంచ టెస్టు చాంపియన్ అయిన ఆస్ట్రేలియాకు తలవంచింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. అయితే ఇంగ్లండ్ బౌలర్లు ఐదోరోజు సూపర్‌గా బౌలింగ్ చేసినప్పటికి పాట్ కమిన్స్, నాథన్ లయోన్ల అద్బుత పోరాటం ఇంగ్లండ్‌కు విజయాన్ని దూరం చేసింది. కానీ ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాత్రం బజ్‌బాల్ ఆటను సమర్థించుకున్నాడు. ఒక్క టెస్టులో ఓడిపోయినంత మాత్రానా బజ్‌బాల్‌ను పక్కనపెట్టేదే లేదని కుండబద్దలు కొట్టాడు. సీన్ మొత్తం రివర్స్.. అయితే బుధవారం(జూన్ 28న) లార్డ్స్ వేదికగా మొదలైన రెండో టెస్టులో సీన్ మొత్తం రివర్స్ అయింది. బజ్‌బాల్ ఆటతో దూకుడు కనబరుస్తామనుకున్న ఇంగ్లండ్‌కు ఆసీస్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఎందుకంటే తొలిరోజు ఆటలో ఆస్ట్రేలియా వేగంగా ఆడింది. ఒకవైపు వికెట్లు పడుతున్నా ఇలాగే ఆడుతామంటూ బజ్‌బాల్ ఆటను ఇంగ్లండ్‌కు చూపించింది. డేవిడ్ వార్నర్, ట్రెవిస్ హెడ్లు వన్డే స్టైల్లో వేగంగా ఆడితే.. స్మిత్ ఎప్పటిలాగే తన నిలకడైన ఆటను ప్రదర్శిస్తూ 85 పరుగులతో నాటౌట్‌గా నిలిచి సెంచరీకి దగ్గరయ్యాడు. ఓవర్‌కు 4.08 రన్‌రేట్‌తో 83 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది. ఒక దశలో వార్నర్-లబుషేన్, ట్రెవిస్ హెడ్- స్మిత్ జోడి ఓవర్‌కు ఐదు పరుగుల చొప్పున జోడించారు. నిజంగా ఇది ఇంగ్లండ్ ఇది ఊహించలేదు. ఇక రెండోరోజు ఆటలో స్మిత్ సెంచరీ నుంచి డబుల్ సెంచరీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలెక్స్ క్యారీ, లాస్ట్ మ్యాచ్ హీరో పాట్ కమిన్స్ ఇంకా బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. తొలి సెషన్లో వీరిని ఎంత త్వరగా ఔట్ చేస్తే ఇంగ్లండ్‌కు అంత మంచిది. రెండు సెషన్ల పాటు ఆసీస్ బ్యాటింగ్ చేస్తే మాత్రం 500 స్కోరు దాటే అవకాశం ఉంది. అప్పుడు ఇంగ్లండ్‌కు కష్టాలు మొదలైనట్లే. బజ్‌బాల్‌తో ప్రత్యర్థికి చుక్కలు చూపిద్దామనుకున్న ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియానే ముచ్చెమటలు పట్టించేలా కనిపిస్తోంది. చదవండి: రూట్ అరుదైన ఘనత.. యాషెస్ చరిత్రలో మూడో ఆటగాడిగా భారత్ చేతిలో ఓడినా సరే.. మాకు అదే ముఖ్యం: పాక్ స్టార్ క్రికెటర్ -
టీమిండియాతో తలపడే ఆ ఐదు జట్లకు వేర్వేరు పిచ్‌లు..
ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ 2023 మెగా సమరానికి మరో 99 రోజుల కౌంట్‌డౌన్ మిగిలి ఉంది. నాలుగోసారి వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమిస్తున్న టీమిండియా పెవరెట్‌గా కనిపిస్తోంది. పుష్కరకాలం కిందట ధోని సేన స్వదేశంలో ప్రపంచకప్‌ను కొట్టి 28 సంవత్సరాల నిరీక్షణకు తెరదించింది. తాజాగా మరోసారి వరల్డ్‌కప్‌కు మన దేశం ఆతిథ్యం ఇస్తుండడంతో రోహిత్ సేన ఆ మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక మంగళవారం ఐసీసీ.. వరల్డ్‌కప్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం పది వేదికల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న మెగా సమరంలో 48 లీగ్ మ్యాచ్‌లు సహా రెండు సెమీఫైనల్స్, ఒక ఫైనల్ జరగనుంది. మొదటి సెమీఫైనల్‌కు ముంబై.. రెండో సెమీఫైనల్‌కు కోల్‌కతా.. ఇక ప్రతిష్టాత్మక ఫైనల్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది. ఇక టీమిండియా తొమ్మిది వేదికల్లో(హైదరాబాద్ మినహా) వివిధ జట్లతో మ్యాచ్‌లు ఆడనుంది. ఈ మ్యాచ్‌లు ఆడేందుకు దేశం మొత్తం మీద ప్రధాన నగరాల్లో దాదాపు పదివేల కిలోమీటర్లు(9700 కిమీ) ప్రయాణం చేయనుంది. ఇందులో చిన్నజట్లతో మ్యాచ్‌లు మినహాయిస్తే భారత్ ఎదుర్కొనే ఐదు ప్రధాన ప్రత్యర్థులు, ఎక్కడ మ్యాచ్ ఆడుతుందనేది ఒకసారి పరిశీలిద్దాం. ఐదు ప్రధాన జట్లతో ఆడబోతున్న మ్యాచ్‌ల్లో పిచ్‌లు టీమిండియాకు అనుకూలంగా ఉండేలా తయారు చేస్తున్నారు. అదే సమయంలో ఒక్కో జట్టుకు ఒక్కో పిచ్‌ను రూపొందించనుండడం విశేషం. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా(అక్టోబర్ 8, చెన్నై వేదికగా) ఈ మెగా సమరంలో టీమిండియా ఆడబోయే తొలి మ్యాచ్‌లో ప్రత్యర్థిగా బలమైన ఆస్ట్రేలియాను ఎదుర్కోనుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా మ్యాచ్ జరగనుంది. అప్పటికి చలికాలం సీజన్ ప్రారంభం అవుతుంది. రెండో బ్యాటింగ్ సమయంలో మంచు ప్రభావం ఎక్కువగా ఉండే చాన్స్ ఉండడంతో ఇక్కడ ఏ జట్టైనా తొలి బ్యాటింగ్ చేసేందుకే మొగ్గు చూపుతుంది. దీన్నిబట్టి చెన్నై పిచ్ కాస్త స్లగిష్గా ఉండే అవకాశముంది. ఇక 1987 నుంచి టీమిండియా చిదంబరం స్టేడియంలో 14 మ్యాచ్‌లాడి ఏడు మ్యాచ్‌ల్లో గెలిచింది. ఇందులో నాలుగు విజయాలు ఈ దశాబ్దంలో వచ్చినవే. గతేడాది ఇక్కడ జరిగిన వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా పరాజయం పాలైంది. ఇక స్టేడియంలో పలు మార్పులు చేస్తున్నారు. స్టేడియం ఫ్లడ్‌లైట్స్‌ను ఎల్ఈడీ వెలుగులతో నింపుతున్నారు. ఇక మ్యాచ్‌కు రెండు ఎర్రమట్టి పిచ్‌లను తయారు చేస్తున్నారు. తుది దశ పనులు జరుగుతున్నాయి ఇండియా వర్సెస్ పాకిస్తాన్(అక్టోబర్ 15, అహ్మదాబాద్) వరల్డ్‌కప్‌లో అన్ని మ్యాచ్‌లు ఒక ఎత్తయితే.. ఈ ఒక్క మ్యాచ్ మరొక ఎత్తు. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్‌లు అక్టోబర్ 15న అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నాయి. లక్షా 30వేల మంది కెపాసిటీ కలిగిన ఈ స్టేడియంలో భారత్, పాక్ జరిగే రోజున స్టేడియం సామర్థ్యానికి మించి జనం వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు టీఆర్పీ రేటింగ్‌లు కూడా బద్దలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇరుదేశాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిదనేది ఆసక్తిగా మారింది. ఇక పిచ్‌ను ప్లాట్‌గా రూపొందిచే ప్రక్రియలో ఉన్నారు. ఎందుకంటే మ్యాచ్‌లో పరుగుల వర్షం రావాలని.. బ్యాటింగ్‌కు అనుకూలించేలా పిచ్‌ను తయారు చేయనున్నారు. దేశంలోనే అతిపెద్ద స్టేడియమైన నరేంద్రమోదీ స్టేడియం స్పిన్నర్లకు అనువుగా ఉంటుంది. అయితే ఈసారి ఎర్రమట్టి బదులు నల్లమట్టిని పిచ్‌కు వాడనున్నారు. దీంతో కాస్త లోబౌన్స్ ఉండే అవకాశం కూడా ఉంది. కానీ ఎక్కువమేరకు ప్లాట్‌గానే రూపొందించనున్నారు. అంటే చిరకాల ప్రత్యర్థుల పోరులో పరుగుల సునామీని చూసే అవకాశం ఉంటుంది. 1984 నుంచి టీమిండియా ఇక్కడ 18 మ్యాచ్‌లు ఆడితే 10 విజయాలు సాధించింది. 2021లో ఈ స్టేడియానికి నరేంద్ర మోదీ స్టేడియం అని పేరు మార్చారు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్(అక్టోబర్ 22, ధర్మశాల) దేశంలో అతిచిన్న స్టేడియాల్లో ధర్మశాల ఒకటిగా ఉంది. ఇక్కడి బౌండరీ లైన్ చాలా దగ్గర్లో ఉంటుంది. ఇక్కడి పిచ్ పేసర్లకు కాస్త అనుకూలంగా ఉంటుంది. అయితే న్యూజిలాండ్‌తో ఆడబోయే మ్యాచ్‌కు నల్లమట్టిని ఉపయోగించి పిచ్‌ను రూపొందించనున్నారు. బ్యాటింగ్ ట్రాక్‌కు అనుకూలమైనప్పటికి మ్యాచ్ రోజు ఎండ ఉంటే పరుగులు బాగానే వస్తాయి. ఒకవేళ వాతావరణం చల్లగా ఉంటే మాత్రం రెండో బ్యాటింగ్ చేసే జట్టుకు ఇబ్బందులు తప్పవు. అందుకే టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవడం ఉత్తమం. మన దేశంలో కొత్త స్టేడియాల్లో ఒకటిగా ఉన్న ధర్మశాలలో టీమిండియా నాలుగు మ్యాచ్‌లు ఆడితే రెండు గెలిచి.. రెండింట ఓడింది. ఇండియా వర్సెస్ ఇంగ్లండ్(అక్టోబర్ 29, లక్నో) ఐపీఎల్ సమయంలో లక్నోలోని ఎకానా స్టేడియంలో పెద్దగా పరుగుల వరద పారింది లేదు. ఇక్కడి పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉంటుంది. దీంతో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు స్పిన్ ట్రాక్నే కంటిన్యూ చేయనున్నారు. ఇక్కడ టీమిండియా ఒకే ఒక మ్యాచ్ ఆడింది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించారు. మ్యాచ్‌లో ప్రొటీస్ ఓడిపోయింది. ఇక్కడి పిచ్ ప్రభావం కారణంగా జట్లు స్కోర్లు 250 నుంచి 270 మధ్య నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక పిచ్‌పై నల్లమట్టిని ఉపయోగించనున్నారు. ఎక్కువగా స్పిన్నర్లు ప్రభావం చూపించే మ్యాచ్‌లో పేసర్లకు అనువైన బౌలింగ్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇండియా వర్సెస్ సౌతాఫ్రికా(నవంబర్ 5, కోల్‌కతా) అహ్మదాబాద్ తర్వాత కెపాసిటీలో, స్టేడియం సామర్థ్యంలో రెండో అతిపెద్ద స్టేడియం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మెగాటోర్నీలు ఎప్పుడు జరిగినా నాకౌట్ మ్యాచ్‌ల్లో ఒక్కటైనా ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీ. పైగా ఈడెన్ గార్డెన్స్‌లో టీమిండియాకు సూపర్ రికార్డు ఉంది. ఆడిన 22 మ్యాచ్‌ల్లో 13 మ్యాచ్‌లు గెలిచింది. 2011 నుంచి 2017 వరకు తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు ఆరుసార్లు గెలుపొందితే.. రెండో బ్యాటింగ్ చేసిన జట్లు ఐదుసార్లు గెలుపొందాయి. ఇక ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై అటు పేసర్లకు.. ఇటు స్పిన్నర్లకు సమానపాత్ర ఉంటుంది. ఇక్కడ మంచు ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. చదవండి: వన్డే వరల్డ్‌కప్-2023 మ్యాచ్‌లు ఎలా జరుగుతాయంటే..? ఎందుకీ వివక్ష? బీసీసీఐపై హైదరాబాదీల ఆగ్రహం -
రెండు టికెట్లతో పోయేది.. ఒక్క శపథం చరిత్రను తిరగరాసింది
భారత క్రికెట్లో ఈరోజుకు(జూన్ 25) ఒక విశిష్టత ఉంది. కపిల్ డెవిల్స్ వన్డే వరల్డ్‌కప్ సాధించి ఇవాళ్టికి 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఎలాంటి అంచనాలు లేకుండా అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన భారత జట్టు అప్పటికే రెండుసార్లు జగజ్జేతగా నిలిచిన విండీస్‌ను ఫైనల్లో ఓడించి ప్రఖ్యాత లార్డ్స్ బాల్కనీ నుంచి వరల్డ్‌కప్ ట్రోపీని అందుకోవడం ఎవరు మరిచిపోలేరు. 1983.. టీమిండియా క్రికెట్ భవిష్యత్తును మార్చివేసిన సంవత్సరంగా నిలిచిపోయింది. అప్పటివరకు ఏదో మొక్కుబడిగా మ్యాచ్‌లు చూసిన సందర్భాలే ఎక్కువగా ఉండేది. కానీ భారత్ విశ్వవిజేతగా నిలిచిన తర్వాత దేశంలో క్రికెట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఒక రకంగా భారత్ క్రికెట్లో నూతన ఒరవడి 1983కు ముందు.. ఆ తర్వాత అన్నట్లుగా తయారైంది. ఇప్పుడంటే క్రికెట్లో బలమైన శక్తిగా ఉన్న బీసీసీఐ తన కనుసైగలతోనే క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తోంది. కానీ 40 ఏళ్ల క్రితం పరిస్థితి వేరుగా ఉండేది. అందరూ టీమిండియాను తక్కువ చేసి చూసినవారే. ఆ ప్రపంచకప్‌లో పాల్గొన్న 8 దేశాల్లో ఏ ఒక్కటీ భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని ఊహించలేదు. కానీ అన్ని దేశాలకు షాక్ ఇచ్చి.. కపిల్ డెవిల్స్ భారత్ ప్రపంచకప్ సాధించింది. అయితే ఈ ప్రపంచకప్ ప్రయాణంలో భారత్‌కు ఎదురైన అవమానాలు ఒకటి రెండు కాదు. ఇండియాతో ఆతిథ్య ఇంగ్లండ్ ప్రవర్తించిన తీరు దారుణంగా ఉంది. అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు ఎన్‌కేపీ సాల్వేను ఇంగ్లండ్ అవమానించిన తీరు అభిమానుల గుండెల్లో ఎప్పటికి గుర్తుండిపోతుంది. అసలు ఏం జరిగింది? ఎన్‌కేపీ సాల్వే 1982 నుంచి 1985 వరకు బీసీసీఐ(BCCI) అధ్యక్షుడిగా ఉన్నాడు. అతని పదవీకాలంలో 1983 ప్రపంచ కప్ కోసం కపిల్ నేతృత్వంలోని భారత్ ఇంగ్లండ్‌కు వెళ్లింది. అయితే ఎవరు ఊహించని రీతిలో అసమాన ప్రదర్శనతో భారత్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. అయితే అప్పటికే రెండుసార్లు ప్రపంచకప్ విజేత వెస్టిండీస్ ముచ్చటగా మూడోసారి ఫైనల్‌కు రావడంతో టీమిండియా కప్ కొడుతుందన్న నమ్మకం ఎవరికి లేదు. అప్పటికి భారత్ ఫైనల్ దాకా వెళ్లడమే చాలా గొప్ప ఫీట్ అని చెప్పుకున్నారు. అదే సమయంలో బీసీసీఐ అధ్యక్షుడు సాల్వే ఫైనల్ మ్యాచ్ చూడటానికి ఆతిథ్య ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు నుంచి రెండు టిక్కెట్లు మాత్రమే అడిగాడు. అయితే టికెట్టు ఉన్నప్పటికీ సాల్వేకు ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో విసిగిపోయిన సాల్వే ఇంగ్లండ్ బోర్డు దురహంకారానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. ఆ తర్వాత ఫైనల్ మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించిన భారత్ ప్రపంచకప్‌ను గెలుచుకుని స్వదేశానికి తిరిగి వచ్చింది. కానీ ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు చేసిన అవమానం సాల్వే మనసులో మాత్రం అలాగే ఉండిపోయింది. ఇంగ్లండ్‌పై ప్రతీకారం తీర్చుకుంటానని తనలో తాను శపథం చేసిన సాల్వే.. కేవలం నాలుగేళ్లలోనే తన ప్రతీకారం తీర్చుకున్నాడు. 1975,79,83 వరల్డ్‌కప్‌లు చూసుకుంటే ఈ మూడు ఇంగ్లండ్ గడ్డపైనే జరిగాయి. అప్పట్లో మిగతా దేశాల్లో క్రికెట్‌కు అనుగుణమైన పరిస్థితులు అంతగా లేవు. కానీ సాల్వే ఎలాగైన తన పంతం నెరవేర్చుకోవాలనుకున్నాడు.ఇంగ్లండ్ దురహంకారానికి బ్రేక్ వేయాలంటే ఈసారి జరగబోయే వరల్డ్‌కప్ కచ్చితంగా ఇంగ్లండ్ వెలుపల జరగాల్సిందే. 1987 ప్రపంచ కప్(1987 World Cup)ను భారత్, పాకిస్తాన్ భాగస్వామ్యంతో నిర్వహించాలని సాల్వే ప్రతిపాదన పంపాడు. ప్రపంచకప్‌కు భారత్, పాక్‌లు ఆతిథ్యమిస్తున్న విషయం తెలుసుకొని కంగుతిన్న ఇంగ్లండ్ ఆసియా దేశాలు ఇంత పెద్ద ఈవెంట్‌ను నిర్వహించలేవని పేర్కొంది. ఇంగ్లండ్ బోర్డు చేసిన ఈ ప్రకటన సాల్వే మరింత గట్టిగా పని చేసేందుకు ఉత్సాహాన్ని ఇచ్చింది. లాహోర్‌లో పాకిస్థాన్ కౌన్సిల్‌తో సమావేశం నిర్వహించి అన్నింటికీ వరల్డ్ కప్ నిర్వహించేందుకు తుది మెరుగులు దిద్దారు. సాల్వే ప్రయత్నాల ఫలితంగా 1987 ప్రపంచకప్ మొదటిసారిగా ఇంగ్లండ్ వెలుపల జరిగింది. పాకిస్థాన్‌తో కలిసి టోర్నీని భారత్ విజయవంతంగా నిర్వహించింది. ఇప్పటికి మూడుసార్లు వన్డే ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చిన భారత్ ఈ ఏడాది నాలుగోసారి ఆతిథ్యం ఇవ్వనుంది. 12 ఏళ్ల క్రితం 2011 వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇచ్చిన టీమిండియా.. ధోని నేతృత్వంలో రెండోసారి టైటిల్‌ను కొల్లగొట్టింది. తాజాగా రోహిత్ కెప్టెన్సీలో ఆతిథ్య హోదాలో బరిలోకి దిగుతున్న టీమిండియా మూడోసారి కప్ కొట్టాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. 1983 World Cup Final highlights. Kapil Dev's running catch to dismiss Viv Richards was the turning point! pic.twitter.com/7vs9kZj6HU — Mufaddal Vohra (@mufaddal_vohra) June 25, 2023 #OnThisDay in 1983, India lifted the Cricket World Cup for the first time, etching the name in golden letters! A monumental triumph that ignited a cricketing revolution and forever changed the course of Indian cricket. #1983WorldCup @BCCI pic.twitter.com/Ru6wDkHWg8 — Jay Shah (@JayShah) June 25, 2023 చదవండి: రోహిత్ వద్దు.. ప్రపంచకప్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే! -
#LionelMessi: 'కేజీఎఫ్' బ్యాక్‌గ్రౌండ్.. రోమాలు నిక్కబొడిచేలా..
5 అడుగుల 9 అంగుళాలు.. మొహంపై చెరగని చిరునవ్వు.. 18 ఏళ్లుగా తన ఆటతో అభిమానులను అలరిస్తూనే వస్తున్నాడు.. మారడోనా తర్వాత అర్జెంటీనా ఫుట్‌బాల్ అభిమానులకు ఆరాధ్య దైవంగా మారిపోయాడు.. ఈ తరంలో ఫుట్‌బాల్‌లో క్రిస్టియానో రొనాల్డోతో పోటీ పడుతున్న అతను ఒక మెట్టుపైనే ఉన్నాడు.అతనే అర్జెంటీనా గ్రేట్ లియోనల్ మెస్సీ. లియోనల్ మెస్సీ.. ఫుట్‌బాల్ కెరీర్లో చూడాల్సినవన్నీ చూశాడు. పసిఫిక్ దేశాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే కోపా అమెరికా కప్‌ను 2021లో అర్జెంటీనాకు అందించాడు. ఇక ఇంతకాలం వెలితిగా ఉన్న ఫిఫా వరల్డ్‌కప్‌ను కూడా గతేడాది ఒడిసిపట్టాడు. వరల్డ్‌కప్ సాధించిన తర్వాత ఆటకు గుడ్‌బై చెప్తాడని అంతా భావించారు. కానీ మెస్సీ అలా చేయలేదు. తనలో శక్తి ఉన్నంతవరకు ఆడతానని.. ఇక ఆడలేను అన్నప్పుడు రిటైర్ అవుతానని మెస్సీ స్వయంగా పేర్కొన్నాడు. ఆల్‌టైమ్ గ్రేట్‌గా అభివర్ణిస్తున్న లియోనల్ మెస్సీ ఇవాళ(జూన్ 24న) 36వ పుట్టిన రోజు జరుపుకుంటున్నాడు. మరి కెరీర్లో ఎంత ఎత్తకు ఎదిగినా ఒదిగిన శిఖరంలా కనిపించే మెస్సీకి గుండె లోతుల్లోనుంచి చెబుతున్న ఒక్క మాట.. Happy Birthday Lionel Messi.. విచిత్రమైన డెబ్యూ.. ఏ ఆటగాడైనా తన అరంగేట్రంలో అదరగొట్టాలని భావించడం సహజం. కానీ మెస్సీ విషయంలో కాస్త భిన్నం. 2005లో అర్జెంటీనా తరపున హంగేరీతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేశాడు. అది కూడా ఒక సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా. అయితే తొలి మ్యాచ్‌లోనే మెస్సీకి వింత అనుభవం ఎదురైంది. హంగేరీ ఆటగాడు మెస్సీ జెర్సీని పట్టుకొని లాగడంతో .. మెస్సీ మోచేతి సదరు ఆటగాడికి బలంగా తాకింది. దీంతో రిఫరీ మెస్సీకి రెడ్‌కార్డ్ చూపించాడు. కేవలం 47 సెకన్ల పాటు మాత్రమే గ్రౌండ్లో ఉన్న మెస్సీ అనూహ్య రీతిలో మైదానం వీడాల్సి వచ్చింది. అంతుచిక్కని వ్యాధి.. మెస్సీకి 11 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు.. గ్రోత్ హార్మోన్ లోపం (GHD) ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో మెస్సీ జీవితంలో ఫుట్‌బాల్ ఆటగాడు కాలేడని వైద్యులు ప్రకటించారు. అయితే మెస్సీకి చికిత్స చేయించేందుకు అప్పట్లోనే నెలకు 900 డాలర్లు ఖర్చు అయ్యేది. మెస్సీ కుటుంబానికి ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే కావడంతో మెస్సీ చికిత్సకు కష్టంగా మారింది. దీంతో మెస్సీ తండ్రితో ఉన్న అనుబంధం కారణంగా బార్సిలోనా ఫుట్‌బాల్ క్లబ్ రంగంలోకి దిగింది. మెస్సీ కుటుంబానికి అండగా నిలబడిన బార్సిలోనా మెస్సీతో పాటు కుటుంబాన్ని మొత్తం స్పెయిన్‌కు తరలించి మెస్సీకి చికిత్స చేయించడం విశేషం. అలా 11 ఏళ్ల వయసులోనే మెస్సీ బార్సిలోనాకు రుణపడిపోయాడు. ఆ తర్వాత చాలా ఏళ్ల పాటు బార్సిలోనా క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆల్‌టైమ్ గ్రేట్‌గా గుర్తింపు.. 2005లో అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అరంగేట్రం చేసిన లియోనల్ మెస్సీ అర్జెంటీనా తరపున 175 మ్యాచ్‌ల్లో 103 గోల్స్ చేశాడు. అర్జెంటీనా తరపున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా.. ఫుట్‌బాల్ ప్రపంచంలో రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. తన కెరీర్లో ఎక్కువగా బార్సిలోనా క్లబ్‌కు ఆడిన మెస్సీ 778 మ్యాచ్‌ల్లో 672 గోల్స్.. పారిస్ సెయింట్ జెర్మన్ క్లబ్ తరపున 75 మ్యాచ్‌ల్లో 32 గోల్స్.. ఓవరాల్‌గా అంతర్జాతీయ, ప్రైవేటు ఫుట్‌బాల్ క్లబ్స్ కలిపి 1028 మ్యాచ్‌లాడి 807 గోల్స్‌తో అత్యధిక గోల్స్ కొట్టిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. Happy Birthday Thalaivaaa😘🐐❤️#LeoMessi #Messi𓃵 #Messi #LionelMessi #HappyBirthdayMessi pic.twitter.com/NY7CR1WQrD — Chikadhee 🇦🇷 ™ (@Chickadhi) June 23, 2023 Happy 36th birthday GOAT 🐐#LionelAndresMessi. Happy Birthday Leo 🦁 Hoping for another Ballon d'Or in October. 🤗🤗#Messi #Leo #Messi36 #Messi𓃵 #MessiBirthday #LionelMessi pic.twitter.com/pSwzXxD0Hs — Fukkard (@Fukkard) June 24, 2023 #GOAT𓃵 #Messi𓃵 📸🙌🏻🐐🎂 pic.twitter.com/chrslX3wvd — sameer ᴩᴀᴛʜᴀɴ 👑🦁 (@sameerp07528955) June 24, 2023 -
కశ్మీర్ విల్లో బ్యాట్లకు ఫుల్ డిమాండ్.. వన్డే ప్రపంచకప్‌కు తొలిసారి
అక్టోబర్-నవంబర్‌లో భారత్‌లో వన్డే వరల్డ్‌కప్ 2023 జరగనున్న సంగతి తెలిసిందే. 2011 తర్వాత మళ్లీ 12 ఏండ్లకు భారత్ ఆతిథ్యం ఇస్తుండడంతో ఈసారి రోహిత్ సేన కప్ కొడుతుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రపంచ కప్ నేపథ్యంలో బీసీసీఐ కూడా పక్కా ప్రణాళికతో ఉంది. భారీగా లాభాలను ఆర్జించాలని చూస్తోంది. వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌కు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చే అవకాశం వచ్చింది. భారత్‌లో జరగనున్న ప్రపంచకప్ లో కాశ్మీర్ విల్లో(Kashmir Willow Bats) క్రికెట్ బ్యాట్లను ఎక్కువగా ఉపయోగించాలని బీసీసీఐ అనుకుంటుంది. కాగా క్రికెట్లో ఇప్పటికైతే ఇంగ్లీష్ విల్లో , కశ్మీర్ విల్లో బ్యాట్లను వాడుతున్నారు. వీటిలో ఇంగ్లీష్ విల్లో బ్యాట్స్(English Willow Bats)కు ఎక్కువగా క్రేజ్ ఉంది. ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, యూఏఈ, శ్రీలంక వంటి దేశాలు.. ఈ ప్రపంచకప్‌లో కాశ్మీర్ విల్లో బ్యాట్లను ఉపయోగించాలని నిర్ణయించుకున్నాయి. వన్డే ప్రపంచకప్ చరిత్రలో కాశ్మీర్ విల్లో బ్యాట్లను ఉపయోగించడం ఇదే తొలిసారి. దీనికి ఒక కారణం ఉంది. ఆస్ట్రేలియాలో జరిగిన టి20 ప్రపంచ కప్(T20 World Cup)లో మెుదటిసారిగా కశ్మీర్ విల్లో బ్యాట్ ను ఉపయోగించిన బ్యాటర్.. టి20 ప్రపంచ్ కప్ లో అత్యంత లాంగ్ సిక్స్ కొట్టాడు. దీంతో అప్పటి నుంచి ఈ బ్యాట్లకు డిమాండ్ పెరిగింది. ఇక మరో కారణం ఏంటంటే కాశ్మీర్ విల్లో బ్యాట్లు ఇంగ్లీష్ విల్లో బ్యాట్లతో పోలిస్తే.. చౌకగా ఉంటాయి. అలాగే ఈ బ్యాట్స్ నాణ్యత కూడా బాగా ఉంటుంది. కాశ్మీర్ విల్లో బ్యాట్లు.. రూ.10 వేల నుంచి రూ.20 వేల మధ్య ధర ఉంటుంది. అదే ఇంగ్లీష్ విల్లో బ్యాట్స్ చూసుకుంటే.. రూ.లక్ష వరకూ ఉంటాయి. దీంతో నాణ్యతతో తక్కువ ధరకు వచ్చే.. కశ్మీర్ విల్లో బ్యాట్లపై ఆటగాళ్లు దృష్టి పెడుతున్నారు. బ్యాట్ల తయారీతో కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని బిజ్బెహరా, చార్సూ, సేతార్ సంగం, హల్ములా, సంగం, పుజ్టెంగ్, మిర్జాపూర్, సేతార్ గ్రామాలు, పంజాబ్‌లోని జలంధర్, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. Heega Kashmir willow Hx 509 cricket bat (Grade 2) is manufactured using selected Kashmir willow and is hand-crafted with utmost precision. The bat is suitable for leather balls.https://t.co/Xzxz6ys3JS#englishwillowbat #kashmirwillowbat #heegasports pic.twitter.com/Vqo7kgGaEs — Heega Sports (@HeegaSports) May 20, 2023 చదవండి: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌కు బిగ్ షాక్.. భారీ జరిమానా 13 సిక్సర్లతో ఊచకోత.. బౌలింగ్‌లో ఆఖరి బంతికి గెలిపించిన చిచ్చరపిడుగు -
బజ్‌బాల్ అంటూ విర్రవీగారు.. అణిచివేసిన ఆసీస్
ఆటలో ప్రతీరోజు మనది కాదు. ప్రయోగాలు మంచిదే అయినప్పటికి ప్రతీసారి అది మనకు కలిసి వస్తుందని చెప్పలేం. తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టకు ఈ విషయం బాగా అర్థమయి ఉంటుంది. బజ్‌బాల్ అంటూ దూకుడైన ఆటతీరుతో తమకు ఎదురులేదని విర్రవీగుతున్న ఇంగ్లండ్‌ను ఆసీస్ అణిచివేసింది. అది కూడా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో కావడంతో ఇంగ్లీష్ అభిమానులు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. బజ్‌బాల్ క్రికెట్‌తో ఇంగ్లండ్ ఏడాది కాలంగా మంచి ఫలితాలను సాధించింది. బెన్‌స్టోక్స్ సారధ్యంలోని ఇంగ్లండ్ జట్టు కొత్తగా కనిపించింది. ఇదే బజ్‌బాల్ మంత్రంతో పాకిస్తాన్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌లను మట్టికరిపించి సిరీస్‌ను కైవసం చేసుకుంది. కానీ జరుగుతున్నది ప్రతిష్టాత్మక యాషెస్.. అందునా ఇటీవలే ప్రపంచ టెస్టు చాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం అంత సులువు కాదు. ఈ విషయం తెలిసి కూడా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తొలిరోజే సాహసం చేశాడు. పూర్తి బ్యాటింగ్ చేయకుండా తొలి ఇన్నింగ్స్‌ను 8 వికెట్ల నష్టానికి 393 పరుగుల వద్ద డిక్లేర్ చేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌కు ధీటుగా బదులిచ్చింది. 386 పరుగులకు ఆలౌట్ కావడంతో ఇంగ్లండ్‌కు స్వల్ప ఆధిక్యం లభించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్ల దాటికి 273 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే సొంతగడ్డపై జరుగుతుండడంతో ఇంగ్లండ్‌కు కలిసొచ్చే అంశం. అయితే ఎడ్జ్‌బాస్టన్‌లో చివరి రోజు బౌలర్లకు అనుకూలిస్తుందని చెప్పారు. ఇక ఐదోరోజు ఆటలో వరుణుడు దోబుచులాడడంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలు కనిపించాయి. ఇంగ్లండ్ వ్యూహం బెడిసికొట్టేలా కనిపించింది. అయితే రెండో సెషన్లో కుదురుకున్న ఇంగ్లండ్ వరుసగా వికెట్లు పడగొట్టింది. అరె మళ్లీ ఇంగ్లండ్ బజ్‌బాల్ మంత్రం ఫలించిందే అనుకుంటున్న తరుణంలో పాట్ కమిన్స్, నాథన్ లియోన్లు తమ పోరాటంతో ఇంగ్లండ్‌కు విజయాన్ని దూరం చేశారు. ప్రతీసారి బజ్‌బాల్ దూకుడు పనికి రాదన్నది మరోసారి ఇంగ్లండ్‌కు అర్థమయి ఉండాలి. రెండో టెస్టు నుంచి బజ్‌బాల్ క్రికెట్‌ను పక్కనబెడతారా లేక కొనసాగిస్తారా అనేది చూడాలి. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా రెండు వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. తొలి సెషన్లో వర్షంతో ఆటకు అంతరాయం కలగడం.. రెండో సెషన్లో పిచ్‌పై ఉన్న పదును ఉపయోగించుకొని ఇంగ్లండ్ బౌలర్లు వికెట్లతో చెలరేగారు. దీంతో ఆఖరి సెషన్లో ఎలాగైనా నిలబడి డ్రా చేసుకున్నా చాలు అనే దోరణిలో తొలుత ఆసీస్ ఆట కొనసాగింది. కానీ కెప్టెన్ పాట్ కమిన్స్ ధైర్యం ప్రదర్శించాడు. ఆరంభంలో కాస్త నిధానంగా ఆడిన కమిన్స్.. లయన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. ‘డ్రా’కు అవకాశమివ్వకుండా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (73 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), నాథన్ లయన్ (28 బంతుల్లో 16 నాటౌట్; 2 ఫోర్లు) చక్కని పోరాటం చేశారు. దీంతో ఇంగ్లండ్ గెలిచేందుకు బాట వేసుకున్న ఆఖరి సెషన్లో వీళ్లిద్దరు పిచ్‌పై పరుగులతో పాగా వేశారు. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో ఆసీస్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జూన్ 28 నుంచి జూలై 2 వరకు లార్డ్స్ వేదికగా జరగనుంది. Ball by ball Last 4 overs of Ashes thriller between Australia and England in first test at Edgbaston #Ashes23 pic.twitter.com/OYpoar6vhW — Spartan (@_spartan_45) June 20, 2023 చదవండి: 2005 రిపీట్ అవుతుందా? లేక ఆసీస్ షాకిస్తుందా? -
యాషెస్ సమరం.. పరుగుల వరద పారించిన టాప్-10 బ్యాటర్లు
మరికొద్ది గంటల్లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ సమరానికి తెరలేవనుంది. ప్రస్తుతం యాషెస్ సిరీస్‌కు ఇంగ్లండ్ వేదిక కానుంది. ఐదు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇవాళ(జూన్ 16న) ఎడ్జ్‌బాస్టన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. యాషెస్ ట్రోపీ ప్రస్తుతం ఆస్ట్రేలియా వద్ద ఉండగా.. 2015 తర్వాత మళ్లీ యాషెస్ గెలవని ఇంగ్లండ్ ఈసారి ఎలాగైనా ఆసీస్‌ను దెబ్బతీయాలని కంకణం కట్టుకుంది. బజ్‌బాల్‌తో దూకుడైన ఆటతీరు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్‌ను.. ఇటీవలే ప్రపంచ టెస్టు చాంపియన్‌గా అవతరించిన ఆసీస్ ఏ మేరకు నిలువరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ప్రతిష్టాత్మక సిరీస్‌లో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవైపు వికెట్లతో బౌలర్లు చెలరేగితే.. మరోపక్క బ్యాటర్లు సెంచరీలు, డబుల్ సెంచరీలు అందుకోవాలని చూస్తుంటారు. ఆసీస్ త్రయం స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, ట్రెవిస్ హెడ్ సూపర్‌ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. వీరి నుంచి భారీ ఇన్నింగ్స్‌లు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో యాషెస్ చరిత్రలో పరుగుల వరద పారించి టాప్-10 క్రికెటర్లను ఇప్పుడు చూద్దాం. డాన్ బ్రాడ్‌మన్: ఆస్ట్రేలియా దిగ్గజం డాన్ బ్రాడ్‌మన్ యాషెస్ సిరీస్‌లో లీడింగ్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. యాషెస్ సిరీస్‌లో 37 టెస్టులాడిన బ్రాడ్‌మన్ 5028 పరుగులు సాధించాడు. ఈ దిగ్గజం చేసిన 10వేల పరుగుల్లో సగం పరుగులు యాషెస్ సిరీస్‌లోనే వచ్చాయంటే బ్రాడ్‌మన్ ఎంత కసితో ఆడాడో అర్థమవుతుంది. 90 సగటుతో బ్యాటింగ్ చేసిన బ్రాడ్‌మన్ 1930లో జరిగిన సిరీస్‌లో ఏకంగా 974 పరుగులు సాధించాడు. ఇప్పటికి ఇదే అత్యధికంగా ఉంది. జాక్ హబ్స్: ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్‌గా పేరు పొందిన జాక్ హబ్స్ యాషెస్‌లో 41 టెస్టులాడి 3636 పరుగులు సాధించాడు. 12 సెంచరీలు బాదిన జాన్ హబ్స్ బెస్ట్ ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు. అలెన్ బోర్డర్: ఇంగ్లండ్ దిగ్గజ కెప్టెన్ అలెన్ బోర్డర్‌కు కూడా యాషెస్ సిరీస్‌లో మంచి రికార్డు ఉంది. 28 టెస్టులు ఆడిన అలెన్ బోర్డర్ 55.55 సగటుతో 3222 పరుగులు చేశాడు. స్టీవ్ వా: ఆసీస్ దిగ్గజ కెప్టెన్‌గా పేరు పొందిన స్టీవ్ వాకు కూడా యాషెస్‌లో మంచి రికార్డు ఉంది. ఆల్‌రౌండర్‌గా తనదైన ముద్ర వేసిన స్టీవ్ వా 3143 పరుగులు సాధించాడు. ఆసీస్ తరపున అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా పేరు పొందిన స్టీవ్ వాకు యాషెస్‌లో కెప్టెన్‌గా మంచి రికార్డు ఉంది. అతని కెప్టెన్సీలో ఆస్ట్రేలియా రెండుసార్లు యాషెస్ ట్రోపీని నెగ్గడంతో పాటు అతని కెప్టెన్సీలో యాషెస్‌లో తొమ్మిది మ్యాచ్‌లు ఆడి ఎనిమిది మ్యాచ్‌ల్లో విజయాలు అందుకోవడం విశేషం. స్టీవ్ స్మిత్: ప్రస్తుతం బ్రాడ్‌మన్ రికార్డును అందుకోగల సత్తా కేవలం స్టీవ్ స్మిత్‌కు మాత్రమే ఉంది. ఈ శకంలో బెస్ట్ టెస్టు క్రికెటర్‌గా పేరు పొందిన స్మిత్ యాషెస్‌లో 32 టెస్టుల్లో 3044 పరుగులు బాదాడు. తాజాగా జరగనున్న సిరీస్‌లో స్టీవ్‌స్మిత్ కీలకం కానున్నాడు. బీభత్సమైన ఫామ్‌లో ఉన్న స్మిత్ ఇంగ్లండ్ బౌలర్లకు తలనొప్పిగా తయారయ్యాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే ఔట్ చేయడం మహా కష్టం. డేవిడ్ గోవర్ ఇంగ్లండ్ దిగ్గజం డేవిడ్ గోవర్ యాషెస్‌లో 38 టెస్టులాడి 3037 పరుగులు చేశాడు. వాలీ హామండ్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ వాలీ హామండ్ 33 టెస్టుల్లోనే 3852 పరగులు సాధించాడు. హెర్బర్ట్ సట్‌క్లిఫ్ ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్‌గా పేరు పొందిన హెర్బర్ట్ సట్‌క్లిఫ్ 27 టెస్టుల్లోనే 2741 పరుగులు సాధించాడు. క్లిమెంట్ హిల్: ఆస్ట్రేలియా క్రికెటర్ క్లిమెంట్ హిల్ 41 టెస్టుల్లో 2660 పరుగులు సాధించాడు. జాన్ హెడ్రిచ్: ఇంగ్లండ్‌కు చెందిన జాన్ హెడ్రిచ్ యాషెస్‌లో 32 మ్యాచ్‌లాడి 2644 పరుగులు సాధించాడు. చదవండి: ట్రోల్స్ పట్టించుకోలేదు.. హాలిడే మూడ్‌లో రోహిత్ శర్మ 'సంతోషంగా ఉంది.. బీసీసీఐ పరిస్థితి అర్థమైంది' -
'బూడిద' కోసం 141 ఏళ్లుగా.. 'యాషెస్' పదం ఎలా వచ్చిందంటే?
క్రికెట్ చరిత్రలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ఎంత క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. దాయాదులు తలపడుతున్నాయంటే రెండు దేశాల్లోని క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కుపోతుంటారు. టీఆర్పీ రేటింగ్‌లు కూడా బద్దలవుతుంటాయి. అచ్చం అలాంటి పోరు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య కూడా ఉంటుంది. అది కూడా సంప్రదాయ టెస్టు క్రికెట్లో. టి20 క్రికెట్ లాంటి వేగవంతమైన ఆట వచ్చాకా కూడా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగే యాషెస్ టెస్టు సిరీస్‌కు ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. దాదాపు 141 సంవత్సరాల చరిత్ర కలిగిన యాషెస్‌ను ఇంగ్లండ్, ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. కేవలం ఒక ట్రోపీలో ఉన్న బూడిద కోసం కొదమసింహాల్లా తలపడే రెండు జట్ల పోరు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. రెండేళ్లకు ఒకసారి జరిగే యాషెస్ సిరీస్ మళ్లీ వచ్చేసింది. జూన్ 16 నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టుల యాషెస్ సిరీస్ జరగనుంది. యాషెస్ సిరీస్‌కు ఈసారి ఇంగ్లండ్ వేదిక కానుంది. ఈ నేపథ్యంలో అసలు యాషెస్ అనే పేరు ఎలా వచ్చింది.. ఈ సిరీస్ ఎందుకు ఇరుదేశాలకు ప్రతిష్టాత్మకం అనేది మరోసారి తెలుసుకుందాం. -సాక్షి, వెబ్‌డెస్క్ 1882లో మొదలైన గొడవ.. 1882లో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా తొలిసారి ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ ఆడాయి. ఆ ఏడాది ఇంగ్లండ్‌కు టెస్టుల్లో అద్భుతమైన రికార్డు ఉంది. అప్పటివరకు 22 టెస్టుల్లో కేవలం నాలుగింటిలో మాత్రమే ఓడిపోయింది. దీంతో సిరీస్‌లో ఫెవరెట్‌గా కనిపించిన ఇంగ్లండ్‌కు ఆస్ట్రేలియా షాక్ ఇచ్చింది. ఆ సిరీస్‌లో ఓవల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన ఆసీస్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇంగ్లండ్ విజయానికి కేవలం 85 పరుగులు మాత్రమే కావాలి. అప్పటికి ఇంగ్లండ్ టీం స్కోరు రెండు వికెట్లకు 51 పరుగులు. క్రికెట్ అంటేనే అన్ ప్రిడిక్టబుల్ కాబట్టి.. అనూహ్యంగా ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఇంగ్లండ్‌లో ఆస్ట్రేలియాకు ఇది తొలి విజయం. ఆగస్టు 29 న ఇంగ్లండ్ ఓడిపోయింది. ఈ ఓటమి ఇంగ్లండ్ మీడియాను తాకింది. ఇంగ్లండ్‌లోని ప్రతీ వార్తాపత్రిక ఇంగ్లండ్ టీంను దారుణంగా విమర్శిస్తూ వ్యాసాలు వందల్లో వెలువడ్డాయి ఈ ఓటమి తరువాత, స్పోర్టింగ్ టైమ్స్ అనే పత్రిక ఇంగ్లీష్ క్రికెట్ కోసం ఒక సంతాప సందేశాన్ని ప్రచురించింది. “ఇంగ్లీష్ క్రికెట్ చనిపోయింది. 29 ఆగస్టు 1882, ఓవల్‌లో ఇంగ్లండ్ టీం అంత్యక్రియల తర్వాత వచ్చిన బూడిదను (యాషెస్) ఆస్ట్రేలియా తీసుకెళ్లింది.. ” అంటూ రాసుకొచ్చింది. ఆ తర్వాత కొన్ని వారాలకే హాన్ ఐవో బ్లిగ్ సారథ్యంలోని ఇంగ్లిష్ జట్టు ఆస్ట్రేలియాకు బయలుదేరింది. ఈ సందర్భంగా బ్లిగ్ మాట్లాడుతూ... యాషెస్‌ను తిరిగి తీసుకొస్తానని శపథం చేశాడు. స్థానిక మీడియా ‘యాషెస్‌ను తిరిగి తీసుకరావాలంటూ’ మళ్లీ వందల సంఖ్యలో వార్తలు ప్రచురించాయి. అదే సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ విల్ మర్దోక్ కూడా ఇలాంటి ప్రకటనే చేశాడు. యాషెస్‌ను ఇంగ్లండ్ పట్టుకెళ్లకుండా అడ్డుకుంటామని పేర్కొన్నాడు. కలశంలో బూడిద.. అయితే ఇంగ్లండ్ ఓటమిని దారుణంగా విమర్శిస్తూ వ్యాసాలు రాసిన వార్తా పత్రికలను ఒక మహిళా బృందం తగలబెట్టింది. దానికి సంబంధించిన బూడిదను కలశం లాంటి పాత్రలో పెట్టి అప్పటి ఇంగ్లండ్ కెప్టెన్ బ్లైగ్కు అందించారు. కాగా ఆ కలశంలో నిజమైన యాషెస్ ఇప్పటికీ ఉపయోగించిన ఒక జత స్టంప్ బెయిల్ల్ను లండన్ మ్యూజియంలో భద్రపరిచారు. అప్పటినుంచి కాగా పెళుసుగా ఉండే అసలైన దానిని లార్డ్స్‌లోని క్రికెట్ మ్యూజియంలో చూడొచ్చు. అప్పటి నుంచి ఈ రెండు దేశాల మధ్య టెస్టు సిరీస్‌కు యాషెస్ అని పేరు పెట్టారు. కాగా సిరీస్ గెలుపొందిన జట్లకు కలశం ప్రతిరూపాన్ని అందజేస్తారు.ఆ తర్వాత ఈ సిరీస్ కోసం కలశం రూపంలోనే ప్రత్యేక ట్రోఫీని తయారు చేశారు. దీనిలో మొప్పలను కాల్చిన తర్వాత బూడిదను ఉంచుతారు. ఈ ట్రోఫీని యూఆర్ఎన్ అని కూడా పిలుస్తారు, ఇది బూడిద కలిగిన పాత్ర. నేటికీ ఈ సంప్రదాయం కొనసాగుతోంది. మొదట్లో ఇంగ్లండ్.. ఇప్పుడు ఆసీస్‌దే ఆధిపత్యం ఇక ఇప్పటివరకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య 72 యాషెస్ సిరీస్‌లు జరిగితే.. అందులో ఆస్ట్రేలియా 3 సార్లు, ఇంగ్లండ్ 32 సార్లు విజయాలు అందుకోగా.. ఆరు సిరీస్‌లు మాత్రం డ్రాగా ముగిశాయి. ఇక 141 సంవత్సరాల చరిత్ర కలిగిన యాషెస్ సిరీస్‌లో 356 మ్యాచ్‌లు జరగ్గా ఆస్ట్రేలియా 150.. ఇంగ్లండ్ 110 మ్యాచ్‌లు నెగ్గగా.. 96 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. ఇక ప్రస్తుతం యాషెస్ ట్రోపీ ఆస్ట్రేలియా వద్ద ఉంది. 2021-22లో జరిగిన యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. కాగా ఇంగ్లండ్ 2015 తర్వాత మళ్లీ యాషెస్‌ను గెలవలేకపోయింది. ఈసారి స్టోక్స్ నేతృత్వంలో బజ్‌బాల్ ఆటతీరుతో దూకుడు ప్రదర్శిస్తున్న ఇంగ్లండ్ ఎలాగైనా యాషెస్ ట్రోపీని దక్కించుకోవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు ఇటీవలే టీమిండియాను ఓడించి ప్రపంచటెస్టు చాంపియన్‌గా అవతరించిన ఆస్ట్రేలియా మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. కాగా 73వ సారి జరుగుతున్న యాషెస్ టెస్టు సిరీస్‌లో తొలి టెస్టు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జూన్ 16 నుంచి 20 వరకు జరగనుంది. చదవండి: ఎల్పీఎల్ వేలం.. రైనాను మరిచిపోయారా? పట్టించుకోలేదా? #TNPL2023: రోజుకో విచిత్రం.. ఒకే బంతికి రెండుసార్లు డీఆర్ఎస్ -
#NovakDjokovic: సెర్బియా యోధుడి చరిత్ర.. టెన్నిస్‌లో కొత్త రారాజు
సెర్బియా టెన్నిస్ స్టార్ నొవాక్ జొకోవిచ్ పురుషుల టెన్నిస్‌లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం(జూన్ 11న) ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గడం ద్వారా తన ఖాతాలో 23వ గ్రాండ్‌స్లామ్ జమ చేసుకున్నాడు. తద్వారా ఓపెన్ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన యోధుడిగా రికార్డులకెక్కాడు. ఇంతకవరకు నాదల్‌తో కలిసి 22 గ్రాండ్‌స్లామ్‌లతో సంయుక్తంగా ఉన్న జొకోవిచ్ తాజాగా ఫ్రెంచ్ ఓపెన్ గెలవడంతో 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ పురుషుల టెన్నిస్‌లో కొత్త రారాజుగా ఆవిర్భవించాడు. ► జొకోవిచ్ సాధించిన 23 గ్రాండ్‌స్లామ్స్‌లో అత్యధికంగా ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ పది ఉండగా.. ఆ తర్వాత వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను ఏడుసార్లు గెలుచుకున్నాడు. ఇక యూస్ ఓపెన్‌తో పాటు ఫ్రెంచ్ ఓపెన్‌ను మూడేసి సార్లు నెగ్గిన జొకోవిచ్.. నాలుగు మేజర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ కనీసం మూడుసార్గు నెగ్గిన తొలి ఆటగాడిగానూ రికార్డులకెక్కాడు. ► ఇక జొకోవిచ్ ఇప్పటివరకు సాధించిన 23 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లో పది గ్రాండ్‌స్లామ్‌లు 30 ఏళ్లలోపే సాధించడం గమనార్హం. ► రోలాండ్ గారోస్‌లో(ఫ్రెంచ్ ఓపెన్)లో ఛాంపియన్‌గా అవతరించిన అతిపెద్ద వయస్కుడిగానూ జొకో చరిత్ర సృష్టించాడు. 2023 ఫ్రెంచ్ ఓపెన్ కైవసం చేసుకునే నాటికి జొకో వయసు 36 ఏళ్ల 19 రోజులుగా ఉంది. ఈ నేపథ్యంలో రఫెల్ నాదల్(35 ఏళ్ల 11 నెలల 19 రోజులు) రికార్డును బద్దలు కొట్టాడు. ► ఇక ఓపెన్ శకంలో మహిళల, పురుషుల టెన్నిస్ విభాగాలను కలిపి చూస్తే అత్యధిక గ్రాండ్‌స్లామ్‌లు నెగ్గిన క్రీడాకారుల్లో సెరెనా విలియమ్స్‌తో కలిసి జొకోవిచ్(23 టైటిల్స్) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక తొలి స్థానంలో ఆస్ట్రేలియా టెన్నిస్ దిగ్గజం మార్గరెట్ కోర్ట్ 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌తో తొలిస్థానంలో ఉంది. ఒకవేళ వచ్చే నెలలో ఆరంభం కానున్న వింబుల్డన్‌లో గనుక జొకోవిచ్ టైటిల్ కొడితే మాత్రం మార్గరెట్ కోర్ట్ సరసన నిలవనున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆదివారం నార్వేకు చెందిన కాస్పర్ రూడ్‌తో జరిగిన ఫైనల్లో జొకోవిచ్ 7-6(7-1), 6-3, 7-5తో గెలుపొందాడు. మూడు గంటలకు పైగా సాగిన మ్యాచ్‌లో తొలిసెట్లోనే జొకోవిచ్‌కు కాస్పర్ రూడ్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. టైబ్రేక్‌కు దారి తీసిన తొలి సెట్‌ను జొకోవిచ్ 7-1తో కైవసం చేసుకున్నాడు. ఇక రెండో సెట్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండానే కేవలం 45 నిమిషాల్లో 6-3తో సొంతం చేసుకున్నాడు. కీలకమైన మూడోసెట్లో కాస్పర్ రూడ్ ఫుంజుకోవడంతో మళ్లీ టైబ్రేక్ తప్పదనిపించింది. ఈ దశలో రూడ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ 7-5తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. One of the best speeches after winning a grand slam Special achievement, special speech NEVER GIVE UP#RolandGarros #RolandGarros2023 #Djokovic #NovakDjokovic pic.twitter.com/zcwbd4Up6X — Vaibhav Sharma (@vaibhav_4x) June 11, 2023 🏆🇷🇸#RolandGarros | @DjokerNole pic.twitter.com/sopyII3GfQ — Roland-Garros (@rolandgarros) June 11, 2023 A legendary moment ✨#RolandGarros @DjokerNole pic.twitter.com/IdT4LWqqjO — Roland-Garros (@rolandgarros) June 11, 2023 🏆 Forever raising the bar 🏆@DjokerNole masters Casper Ruud 7-6(1), 6-3, 7-5 to win a third Roland-Garros title and an unprecedented 23rd Grand Slam men’s singles title. ⁰#RolandGarros pic.twitter.com/9IfTi39alB — Roland-Garros (@rolandgarros) June 11, 2023 చదవండి: French Open 2023 Final: జొకోవిచ్‌దే ఫ్రెంచ్ ఓపెన్.. ఖాతాలో 23వ గ్రాండ్‌స్లామ్ -
512 రోజులు.. కొత్తగా కనిపిస్తున్న రహానే
టీమిండియా క్రికెటర్ అజింక్యా రహానే ఎన్నోసార్లు జట్టుకు ఆపద్బాందవుడయ్యాడు. తన ఇన్నింగ్స్‌లతో ఎన్నోసార్లు టీమిండియాకు విజయాలు అందించాడు. కెరీర్ ఆరంభంలో మూడు ఫార్మాట్లలో ఆడిన రహానే క్రమంగా టెస్టులకు మాత్రమే పరిమితమయ్యాడు. అయినా సంప్రదాయ ఫార్మాట్లో తన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చాడు. ఎంత బాగా ఆడినా ఏదో ఒక దశలో ఒక బ్యాడ్‌ఫేజ్ అనేది ఉంటుంది. ఆ సమయంలో ఎవరికైనా అన్ని ప్రతికూలంగానే ఉంటాయి. అజింక్యా రహానేకు కూడా ఆ ఇబ్బంది తప్పలేదు. రెండేళ్ల క్రితం సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో రహానే ఘోర ప్రదర్శన కనబరిచాడు. అంతే దెబ్బకు టీమిండియాలో చోటు కోల్పోయాడు. జాతీయ జట్టుకు దూరమైనప్పటికి రహానే పెద్దగా బాధపడలేదు. ఏదో ఒకరోజు అవకాశం మళ్లీ తనను వెతుక్కుంటూ వస్తుందని నమ్మాడు. అందుకు తగ్గట్టుగానే దేశవాలీ క్రికెట్ అయిన రంజీ ట్రోపీ సహా మిగతా టోర్నీల్లో పాల్గొని సెంచరీలతో చెలరేగినా రహానేకు తుది జట్టులో చోటు దక్కడం కష్టంగా మారిపోయింది. చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి. ఇంతలో ఐపీఎల్ 2023 సీజన్ వచ్చింది. రహానేను పెద్దగా ఎవరు కొనడానికి ఆసక్తి చూపలేదు. దీంతో సీఎస్కే రూ. 50 లక్షల కనీస ధరకే రహానేను సొంతం చేసుకుంది. అయితే రహానే అప్పటికే పరుగుల దాహంతో ఉన్నాడు. ఆకలి మీద ఉన్న సింహం పంజా విసిరితే ఎలా ఉంటుందో అప్పటికి ఎవరికి తెలియదు. కానీ రహానేను సీఎస్కే కెప్టెన్ ధోని నమ్మాడు. ధోని నమ్మకాన్ని రహానే నిలబెట్టాడు. గతంలో ఐపీఎల్ ఆడినప్పటికి రహానేలో ఇంత వేగవంతమైన ఆట ఎప్పుడు చూసింది లేదు. ఈ సీజన్లో 14 మ్యాచ్‌లాడిన రహానే 172.49 స్ట్రైక్‌రేట్‌తో 326 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో చూపెట్టిన సూపర్ ఫామ్ రహానేను డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపిక చేసింది. అయితే ఐపీఎల్ సమయంలో ఏప్రిల్ 23న మ్యాచ్ అనంతరం రహానే మాట్లాడుతూ.. ''ఇది సరిపోదు.. నా బెస్ట్ ఇంకా రావాల్సి ఉంది'' అంటూ కామెంట్ చేశాడు. అలా 512 రోజుల విరామం తర్వాత జాతీయ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రహానే సరికొత్తగా కనిపించాడు. ఐపీఎల్ తన ఆటతో దూకుడుగా కనిపించిన అదే రహానే.. డబ్ల్యూటీసీ ఫైనల్లో శాంతంగా కనిపించాడు. పరిస్థితులకు తగ్గట్లుగా ఆడుతూ కొత్త రహానేను చూపెట్టాడు. ఆసీస్ బౌలర్లు చెలరేగుతున్న వేళ కష్టాల్లో ఉన్న టీమిండియాను గట్టెక్కించే బాధ్యతను తీసుకున్నాడు. వరుసగా వికెట్లు పడుతున్నా తాను మాత్రం ఒంటరి పోరాటం చేస్తూ వచ్చాడు. తొలుత జడేజాతో కలిసి 70 పరుగులు జోడించిన రహానే.. ఆపై శార్దూల్ ఠాకూర్‌తో కలిసి ఏకంగా 109 పరుగులు జోడించి టీమిండియా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఒక దశలో 200 లోపే చాప చుట్టేస్తుందనుకున్న తరుణంలో శార్దూల్‌తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడిన రహానే టీమిండియా పరువు కాపాడాడు. చివరికి 129 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 89 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్‌లో గ్రీన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తన బెస్ట్ ఇవ్వాల్సి ఉంది అని చెప్పిన మాటకు కట్టుబడి తన కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ ఆడిన రహానే రెండు వారాల వ్యవధిలోనే అభిమానులకు తనలోని డబుల్ వర్షన్ చూపించాడు. 96 at Durban 118 at Wellington 103 at Lord's 147 at Melbourne 126 at Colombo 108* at Jamaica 81 at Nottingham 112 at Melbourne 89 at Oval The crisis man at Overseas, Rahane. pic.twitter.com/LW52iqOAtH — Johns. (@CricCrazyJohns) June 9, 2023 TAKE A BOW, AJINKYA RAHANE. 89 in 129 balls with 11 fours and a six. An innings to remember on the Test return, what a knock. He made a grand comeback! No words can describe his contribution today. pic.twitter.com/N4QsbvWiVz — Mufaddal Vohra (@mufaddal_vohra) June 9, 2023 చదవండి: కష్టమొచ్చిన ప్రతీసారి నేనున్నానంటూ.. నొప్పిని భరిస్తూనే -
డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఇంగ్లండ్‌లోనే ఎందుకు?
ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీలు క్రికెట్ ఆడుతున్న సభ్యదేశాల్లో ఎక్కడైనా నిర్వహించే అవకాశం ఉంటుంది. వన్డే వరల్డ్‌కప్, టి20 వరల్డ్‌కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా మెగాటోర్నీలు ఏవైనా ఏదో ఒక దేశం ఆతిథ్యం ఇవ్వడం కనబడుతుంది. అయితే తాజాగా జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్‌కు మాత్రం ఇంగ్లండ్ మాత్రమే ఎందుకు ఆతిథ్యమిస్తోంది అని సగటు అభిమాని ప్రశ్నిస్తున్నాడు. తొలిసారి 2021లో నిర్వహించిన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదిక అయింది. ఈసారి ఓవల్ స్టేడియంలో రెండో డబ్ల్యూటీసీ ఫైనల్ నిర్వహిస్తున్నారు. రెండు వేర్వేరు స్టేడియాల్లో రెండు ఫైనల్స్ జరిగితే ఇందులో కామన్‌గా ఉంది మాత్రం టీమిండియానే. వరుసగా రెండో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతున్న టీమిండియా ఈసారి కూడా మ్యాచ్ గెలస్తుందా అన్న అనుమానం కలుగుతుంది. 2021లో కివీస్‌తో జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్లో టీమిండియా 8 వికెట్ల తేడాతో పరాజయం పాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మరి డబ్ల్యూటీసీ ఫైనల్స్‌ను ఐసీసీ ఇంగ్లండ్‌లోనే ఎందుకు నిర్వహిస్తుందనే ప్రశ్నకు ఒకటే సమాధానం వినిపిస్తుంది. భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ లాంటి ఆసియా ఖండపు దేశాల్లో జూన్ నెలలో ఎలాంటి టెస్టు మ్యాచ్‌లు జరగవు. దానికి కారణం వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భారత్, శ్రీలంక ఇలా ఏది చూసుకున్నా ఉపఖండపు దేశాల్లో వాతావరణ పరిస్థితి ఒకలాగే ఉంటుంది. అందుకే జూన్ నుంచి ఆగస్టు వరకు ఉపఖండపు దేశాలు స్వదేశంలో టెస్టు మ్యాచ్‌లు ఎక్కువగా ఆడవు. మనం సరిగ్గా గమనిస్తే జూన్ నెలలో ఇంగ్లండ్ మినహా ఏ దేశంలోనూ ఎక్కువగా క్రికెట్ మ్యాచ్‌లు జరగవు. ఈ సమయంలో ఇంగ్లండ్ లాంటి యూరోప్ దేశంలోనే పరిస్థితులు కాస్త అనుకూలంగా ఉంటాయి. అందుకే ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్‌ను ఇంగ్లండ్‌లో నిర్వహించడానికే మొగ్గు చూపుతుంది. 2025 డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఇంగ్లండ్‌లోని లార్డ్స్‌లో నిర్వహించాలని ఐసీసీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఉపఖండపు దేశాలకు ప్రతికూలంగా.. ఇంగ్లండ్‌లోని పరిస్థితులు ఉపఖండపు దేశాలకు ప్రతికూలంగా ఉంటాయి. ఇక్కడి పిచ్లన్ని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలకు కాస్త అనుకూలంగా ఉంటాయి. ఇంగ్లండ్ పిచ్‌ల్లో ఎక్కువగా స్వింగ్ కనిపిస్తుంది. ఆసీస్ పిచ్‌లు ఎక్కువగా బౌన్సీ ట్రాక్‌లు ఉంటాయి. ఇక న్యూజిలాండ్‌లోనూ పరిస్థితులు అలానే ఉంటాయి. అందుకే ఇంగ్లండ్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడుతున్నప్పటికి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి జట్లకు పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ టీమిండియాకు ఇది కాస్త ప్రతికూలమని చెప్పొచ్చు. 2021లో సౌతాంప్టన్ వేదికగా జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ టీమిండియా తడబడింది. స్వింగ్ పిచ్‌లపై బ్యాటింగ్ చేసేందుకు ఇబ్బంది పడిన టీమిండియా బ్యాటర్లు వికెట్లుపారేసుకున్నారు. బౌలర్లు కూడా పెద్దగా ప్రభావం చూపింది లేదు. ఈసారి కూడా పరిస్థితి అలానే కనిపిస్తోంది. ఓవల్ పిచ్ టీమిండియా కంటే ఆస్ట్రేలియాకే ఎక్కువగా సహకరిస్తుందని తెలుస్తోంది. అలా అని పిచ్‌ను తప్పు బట్టడానికి లేదు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసర్లు ఎలాగైతే వికెట్లు తీశారో.. టీమిండియా ఇన్నింగ్స్‌లోనూ ఇప్పటివరకు పడిన ఆరు వికెట్లలో ఐదు పేసర్లే పడగొట్టారు. అయినా ఆసీస్ బ్యాటర్లు యదేచ్ఛగా బ్యాట్ ఝులిపించిన చోట టీమిండియా బ్యాటర్లు పరుగులు చేయలేక అల్లాడిపోతున్నారు. పరిస్థితి చూస్తుంటే టీమిండియా ఈసారి కూడా రన్నరప్‌గా నిలిచేలా కనిపిస్తోంది. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ను ఐసీసీ ఇంగ్లండ్‌లో నిర్వహిస్తున్నప్పటికి బీసీసీఐ పెద్దగా అడ్డుచెప్పడం లేదు. క్రికెట్ ప్రపంచాన్ని కనుసైగలతో శాసిస్తున్న బీసీసీఐ తలచుకుంటే డబ్ల్యూటీసీ వేదికను మార్చడానికి అవకాశం ఉంటుంది. కానీ టెస్టు ఛాంపియన్షిప్ విషయంలో బీసీసీఐ సీరియస్‌గా కనిపించడం లేదు. టెస్టు క్రికెట్లో పెద్దగా కాసుల వర్షం కురిసే అవకాశం లేకపోవడంతో బీసీసీఐ తన దృష్టంతా టి20లు, వన్డేలపైనే ఉంచింది. బీసీసీఐ ఆలోచనా ధోరణి మారాలని అభిమానులు భావిస్తున్నారు. ప్యూచర్ టూర్ ప్రోగ్రామ్(FTP) పేరిట ఇప్పటికే రానున్న మూడేళ్లకు షెడ్యూల్ రూపొందించిన ఐసీసీ వచ్చే డబ్ల్యూటీసీ ఫైనల్‌ను కూడా ఇంగ్లండ్‌లోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఇది మార్చడానికి అవకాశం లేకపోయినప్పటికి బీసీసీఐ చొరవ తీసుకొని ఐసీసీని ఒప్పించి 2027 టెస్టు ఛాంపియన్‌షిప్‌కు తటస్థ వేదికలో జరిగేలా చూడొచ్చు. అలా కాదని బీసీసీఐ పట్టించుకోకుండా ఉంటే మాత్రం టీమిండియా భవిష్యత్తులోనూ రన్నరప్‌గానే నిలిచిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చదవండి: WTC Final Day-3: రహానే ఫిఫ్టీ.. 200 మార్క్ దాటిన టీమిండియా -
అతనికి కుటుంబమే ప్రాణం.. మరి గ్యాంగ్‌స్టర్‌గా ఎందుకు మారాడంటే..
లక్నో సిటీ సివిల్ కోర్టులో బుధవారం విచారణ జరుగుతుండగానే కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో సంజీవ్ జీవా అనే డాన్ అక్కడికక్కడే చనిపోయాడు. మూడు దశాబ్దాలుగా దాదాపు పాతిక కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు సంజీవ్ జీవా. కానీ, ఒకప్పుడు అతనికి కుటుంబమే ముఖ్యంగా ఉండేంది. దానిని పోషించుకునేందుకు కాంపౌండర్ పని కూడా చేశాడు. అలాంటోడు గ్యాంగ్‌స్టర్‌గా ఎలా మారాడు?.. అతని నేరచరిత్ర నెత్తుటి మరకలతో ఎలా సాగిందో చూస్తే.. అది 90వ దశకం ప్రారంభం కాలం అది. పశ్చిమ యూపీలోని ముజఫ్ఫర్ నగర్లో శంకర్ హాస్పిటల్ ఉండేది. అక్కడ కంపౌండర్‌గా పనిచేసే ఒక యువకుడు అందరికి మందులు పొట్లాలు కట్టేవాడు. చేసేది కంపౌండర్ పనే అయినా అందరూ అతన్ని ‘డాక్టర్’ అనే సరదాగా పిలిచేవారు. ఆ టైంలో అతనికి కుటుంబం తప్ప మరో ఊసు ఉండేది కాదు. వాళ్ల కోసం పగలురాత్రి తెగ కష్టపడేవాడు. అయితే.. ఆ డబ్బు సులువుగా వచ్చే మార్గం ఏంటో త్వరలోనే అతను అర్థం చేసుకున్నాడు. నెమ్మదిగా అతనిలో నేర స్వభావం బయటపడడం ప్రారంభమైంది. తాను, తన కుటుంబం బతకాలంటే డబ్బు కావాలి. అది ఎంత ఖర్చు చేసినా తరగనంత. అందుకోసం నేరవృత్తిని ఎంచుకున్నాడు. తన డాక్టర్‌కు డబ్బులు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న ఒక వ్యాపారిని బెదిరించడం ద్వారా ఆ యువకుడు తన నేరసామ్రాజ్యాన్ని ప్రారంభించాడు. అక్కడతో ఆగలేదు… తరువాతి కాలంలో తన డాక్టర్నే కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేశాడు. సంజీవ్ జీవా పూర్తి పేరు సంజీవ్ మహేశ్వరి . యూపీలోని ముజఫ్పర్ నగర్‌కు చెందిన వ్యక్తి. తన నేర సామ్రాజ్యం ప్రారంభంలోనే కోట్ల రూపాయలు వసూలు చేశాడు. 90వ దశకం చివరికి వచ్చేనాటికి సంజీవ్ కలకత్తాకు చెందిన ఓ వ్యాపారి కుమారుడిని కిడ్నాప్ చేసి 2కోట్లు డిమాండ్ చేశాడు. అప్పట్లో కిడ్నాపర్ డిమాండ్ చేసే డబ్బు విలువను బట్టి ఆ గ్యాంగ్ ఎంత పెద్దదో డిసైడ్ చేసేవారు. తరువాతి కాలంలో తనదంటూ ఓ గ్యాంగ్‌ను ఏర్పాటు చేసుకున్న సంజీవ్… విదేశాల నుంచి ఆయుధాలను తీసుకువచ్చాడు. యూపీలోని షామ్లీ జిల్లాలో పోలీసులు చెక్‌పోస్టు వద్ద అనిల్ అనే ఒక రౌడీ దగ్గర నుంచి ఏకే-47తోపాటు 1300బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనిల్ యూనివర్సిటీ డీన్ హత్యకేసులో నిందితుడు. అనిల్‌కు ఈ ఆయుధాలు అమ్మింది సంజీవ్ అని పోలీసులు తేల్చారు. ముజఫ్పర్నగర్ కేంద్రంగా తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించిన సంజీవ్ … మెల్లిగా కాంట్రాక్టు కిల్లింగ్లను ప్రారంభించాడు. సంజీవ్ నేర ప్రపంచంలో బ్రహ్మదత్త ద్వివేది హత్య సంచలనం సృష్టించింది. 90వ దశకంలో యూపీ రాజకీయాల్లో కీలకమైన నాయకుడిగా బ్రహ్మదత్త ద్వివేదికి పేరుంది. బీఎస్పీ రాజకీయాలను మలుపు తిప్పిన గెస్ట్‌హౌజ్ సంఘటనలో మాయావతికి ద్వివేది సహాయం చేశారు. కవిగా, సిద్ధాంత కర్తగా బ్రహ్మదత్తకు బీజేపీలో మంచి గుర్తింపు ఉండేది. బీజేపీ నాయకుడైనప్పటికీ… మాయావతి ఆయనను సోదరుడిగా భావించేది. ఫిబ్రవరి 1997లో తన ఇంటి దగ్గర నుంచి వెలుతున్న సమయంలో నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. ద్వివేది అక్కడికక్కడే చనిపోయారు. అద్వానీ, వాజ్‌పేయి హుటాహుటిన లక్నో వచ్చి ద్వివేది అంత్యక్రియల్లోపాల్గన్నారంటే.. ఆయన ఎంత ముఖ్యమైన వ్యక్తో అర్ధం చేసుకోవచ్చు. ఫరూకాబాద్ ఎమ్మెల్యే విజయ్‌సింగ్ తో పాటు సంజీవ్ జీవా కూడా ఇందులో దోషిగా కోర్టు తేల్చింది. ఈ కేసులో సంజీవ్ జీవాకు యావజ్జీవా కారాగార శిక్షపడింది. అయితే సంజీవ్ జీవా మాత్రం పోలీసులకు చిక్కలేదు. మున్నా బజరంగీతో చేరడం ద్వారా సంజీవ్ తన నేరసామ్రాజ్యాన్ని మరింత విస్తరించాడు. 2005నాటికి సంజీవ్ జీవా బీఎస్పీ ఎంపీగా ఉన్న మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీతో జీవా చేతులు కలిపాడు. ఇదే సమయంలో జరిగిన కృష్ణానంద్ రాయ్ హత్యతో సంజీవా ఫేమస్ అయిపోయాడు. మహమ్మదాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణానంద్ రాయ్ బీజేపీలో కీలకమైన నేత. 2005 నవంబర్‌లో రాయ్ తన ఇంటి నుంచి ఒక కార్యక్రమానికి వెళ్లివస్తుండగా నలుగురు వ్యక్తులు ఆయుధాలతో ఆయనను అడ్డుకున్నారు. ఏకంగా ఏకే-47 ఆయుధాలతో దాదాపు 500బుల్లెట్లు ఫైర్ చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ వాహనం పూర్తిగా బుల్లెట్లతో జల్లెడలా మారిపోయింది. ఈ ఘటనలో 7గురు అక్కడికక్కడే చనిపోయారు. చనిపోయిన వారి శరీరాల నుంచి దాదాపు 50బుల్లెట్లు బయటకు తీశారు. కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన మున్నాబజరంగీని జైలులో హత్య చేశారు. లోక్‌సభ సభ్యుడు ముఖ్తార్ అన్సారి కేసు నుంచి తప్పించుకోగలిగారు. ఇక సంజీవ్ జీవా ఈ కేసులో కీలక నిందితుడని విచారణలో తేలింది. ప్రస్తుతం జైలులో ఉన్న సంజీవాను కోర్టులో జడ్జి ముందు విచారణ జరుగుతుండగానే.. లాయర్ల దుస్తుల్లో వచ్చి మరీ కాల్చి చంపారు. సంజీవా భార్య పాయల్ చౌదరి ఆర్ఎల్డీ పార్టీ నుంచి ముజఫ్ఫర్ నగర్ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. తన భర్తకు ప్రాణహాని ఉందని సంజీవ్ భార్య ఆ మధ్య సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఏది ఏమైనా సంజీవ్ చావుతో… యూపీ రక్తచరిత్రలో ఓ అంకం ముగిసినట్లయ్యింది. :::ఇస్మాయిల్, ఇన్ పుట్ ఎడిటర్, సాక్షి టీవీ -
'ఎరుపు బంతి'.. ప్రాభవం కోల్పోతున్న దశ నుంచి శిఖరస్థాయికి
క్రికెట్ అంటే ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు టి20 క్రికెట్. అయితే ఇదే టి20 క్రికెట్, వన్డే క్రికెట్‌కు మూలం సంప్రదాయ ఫార్మాట్ అయిన టెస్టు క్రికెట్ అని మరిచిపోవద్దు. మనకు తెలిసి క్రికెట్ ప్రారంభమైంది దాదాపు మూడు వందల ఏళ్ల కిందటి పైమాటే. తొలుత బ్రిటీష్ వాళ్లు క్రికెట్ ఎక్కువగా ఆడేవారు. 17,18వ దశకంలో ఇంగ్లండ్‌లో క్రికెట్‌కు విపరీతమైన క్రేజ్ ఉండేది. కాలక్రమంలో ఇంగ్లండ్ దేశం క్రికెట్‌కు పుట్టినిల్లుగా తయారైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుంది. 18వ దశకం చివరి నుంచి 19వ దశకం ఆరంభం వరకు ఎక్కువ మ్యాచ్‌లు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్యే జరిగేవి. అయితే మన దేశం బ్రిటీష్ వారి చేతుల్లో ఉండడంతో ఇక్కడ కూడా క్రికెట్‌పై ఆసక్తి బాగా ఉండేది. మన దేశం తరపున బ్రిటీష్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వారు ఉన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత క్రికెట్‌పై ప్రజల్లో ఆసక్తి పెరగడం మొదలైంది. ఇక క్రికెట్ ప్రారంభమైనప్పటి నుంచి టెస్టు క్రికెట్ ఫార్మాట్లోనే చాలాకాలం పాటు ఆట జరిగింది. 1975లో తొలి ప్రపంచకప్ జరిగే వరకు కూడా టెస్టు క్రికెట్ మాత్రమే ఎక్కువగా జరిగేది. మన జాతీయ క్రీడ హాకీ అయినప్పటికి 1980 తర్వాత హాకీ ప్రభావం కోల్పోవడం ప్రారంభమైంది. అదే సమయంలో క్రికెట్ మాత్రం వైభవం పెరుగుతూ వచ్చింది. 1983లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి కపిల్ డెవిల్స్ ప్రపంచకప్ విజేతగా నిలవడంతో క్రికెట్‌పై క్రేజ్ ఆకాశమంత ఎత్తుకు వెళ్లిపోయింది. అక్కడి నుంచి టీమిండియా వెనుదిరిగి చూసుకోలేదు. జాతీయ క్రీడ హాకీ నుంచి క్రికెట్ అనేలా మన ప్రాభవం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది.1990వ దశకంలో క్రికెట్లో పెను మార్పులు వచ్చాయి. వన్డే మ్యాచ్‌లకు కలర్ జెర్సీలు వాడడం.. ఎర్రబంతుల స్థానంలో తెల్లబంతులు ఉపయోగించడం మొదలైంది. క్రమంగా వన్డే క్రికెట్‌కు ఆదరణ పెరుగుతూ వచ్చింది. వన్డే క్రికెట్‌కు ఆదరణ వచ్చినా టెస్టులకు మాత్రం క్రేజ్ తగ్గలేదు. అయితే టి20 క్రికెట్ వచ్చాకా మాత్రం టెస్టులపై ఆసక్తి సన్నగిల్లింది. వన్డేలు ఒక్కరోజులో ముగిసిపోతే.. టి20లు మాత్రం మూడున్నర గంటల్లోనే ముగిసి అభిమానులను అలరిస్తున్నాయి. ఇప్పటి ఆటగాళ్లలో ఐదు రోజులు జరిగే టెస్టు క్రికెట్ కన్నా మూడు గంటల్లో ముగిసిపోయే టి 20 క్రికెట్ అంటేనే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీనివల్ల టెస్టు క్రికెట్ ప్రమాదంలో పడిందేమో అన్న సంకేతాలు వినిపించాయి. కానీ మనం ఒకటి అనుకుంటే ఐసీసీ మరోలా ఆలోచించింది. ప్రాభవం కోల్పోతున్న టెస్టు క్రికెట్‌కు డబ్ల్యూటీసీ ఫైనల్ పేరుతో కొత్త హంగులు తీసుకొచ్చింది. టెస్టు క్రికెట్ ఐదు రోజుల పాటు జరిగినప్పటికి అందులో ఉండే మజా వేరుగా ఉంటుంది. బ్యాటర్ల నుంచి కళాత్మక షాట్లు.. బౌలర్లు తీసే వికెట్లలో నైపుణ్యం కనిపిస్తుంటుంది. టి20ల్లో ఎంత వేగంగా ఆడినా.. బ్యాటింగ్‌లో నైపుణ్యం బయటపడేది టెస్టు క్రికెట్ ద్వారానే. ఇక స్పిన్నర్లు, పేసర్లు పోటీ పడి వికెట్లు తీస్తుంటే చూడముచ్చటగా ఉండేది. అయితే ఇప్పుడు టెస్టు మ్యాచ్‌లు కూడా దాదాపు మూడురోజుల్లోనే ముగిసిపోతున్నాయి. ఇది కొంత ఆందోళన కలిగించే అంశం. 2021లో జరిగిన తొలి డబ్ల్యూటీసీ ఫైనల్ మంచి టీఆర్పీ రేటింగ్ నమోదు చేసింది. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరగడమే దీనికి కారణం. టీమిండియా ఓటమిపాలైనప్పటికి డబ్ల్యూటీసీకి మాత్రం మంచి ఆదరణ లభించింది. దీన్నిబట్టి చూస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ పేరుతో టెస్టు క్రికెట్‌ను నిలబెట్టేందుకు ఐసీసీ చేసిన ప్రయత్నం మెచ్చుకోదగినది. చదవండి: WTC Final: టెస్టుల్లో టీమిండియా తరపున సిక్సర్ల రారాజు ఎవరంటే? -
Old Parliament: ఏకైక ప్రత్యక్ష సాక్షి అదొక్కటే!
పార్లమెంట్ పాతదైపోయింది. హాల్స్ నుంచి ప్రతీది.. ప్రజాప్రతినిధుల అవసరాలకు అనుగణంగా సరిపోవడం లేదు. పైగా సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భవిష్యత్ కోసం కొత్తది కావాల్సిందే.. నరంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట ఇలాంటి ప్రకటనే చేసింది. ఆ ప్రకటనకు కట్టుబడి.. భారీ వ్యయంతో పార్లమెంట్ నూతన భవనాన్ని నిర్మించింది కూడా. రేపు(ఆదివారం) పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ తరుణంలో ఆధునిక భారత దేశ చరిత్రలో కీలక ఘట్టాలకు ఏకైక ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన పార్లమెంట్ ప్రస్థానాన్ని తిరగేద్దాం.. కౌన్సిల్ హౌజ్ నుంచి పార్లమెంట్ అనే గుర్తింపు దాకా.. బ్రిటిషర్ల కాలంలో చట్ట సభల ద్వారా మొదలై.. 76 ఏళ్ల ప్రజాసామ్య దేశానికి సంబంధించి మొదటి మీటింగ్ జరిగింది ఈ భవనంలోనే!. ఉభయ సభల్లోని సభ్యుల మధ్య వాదప్రతివాదనలు, చర్చలు, నేతల కీలక ప్రసంగాలు, ప్రభుత్వాల పని తీరుపై ఓటింగ్‌లు.. ఇలాంటి ఎన్నో ఘట్టాల ద్వారా అనుబంధాన్ని అల్లేసుకుంది. దాని చరిత్రను పరిశీలిస్తే.. 👉 1911లో కోల్‌కతా నుంచి రాజధానిని ఢిల్లీకి తరలించాలని నిర్ణయించింది అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం. అందుకోసం న్యూఢిల్లీని నిర్మించాలనుకుంది. రెండేళ్ల తర్వాత న్యూఢిల్లీ ప్రణాళికా దశకి చేరింది. ఆ సమయంలో తక్కువ సభ్యులున్న లెజిస్టేటివ్ కౌన్సిల్ కోసం గవర్నర్ జనరల్ నివాసం (ఇప్పుడున్న రాష్ట్రపతి భవన్) సరిపోతుంది కదా అని బ్రిటిష్ అధికారులు భావించారు. వేసవిలో సిమ్లాలోని వైస్రాయ్ లాడ్జ్‌లో, శీతాకాలంలో అప్పటి ఢిల్లీ సెక్రటేరియెట్ బిల్డింగ్‌లో (ఇప్పుడది ఢిల్లీ అసెంబ్లీగా ఉంది) భేటీ అయ్యేవాళ్లు. అయితే.. 👉 1918లో మాంటెగ్ ఛేమ్స్‌ఫర్డ్ సంస్కరణలు తెర మీదకు వచ్చాయి. దాని ప్రకారం.. చట్టసభల ప్రాధాన్యంతో పాటు... సభ్యుల సంఖ్యా పెరిగింది. ఎగువ, దిగువ సభలనేవి అమల్లోకి వచ్చాయి. వీటితో పాటు సిబ్బంది సంఖ్యా పెరిగింది. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం రెండు ప్రతిపాదనలు చేసింది. ఒకటి.. టెంట్ల కింద సభను నిర్వహించటం. రెండవది.. శాశ్వత భవంతిని నిర్మించడం. అలా.. 1921లో పార్లమెంట్ భవనానికి తొలి అడుగు పడింది. అదే సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (దిగువ సభ) తొలి భవంతి. 👉 న్యూ ఢిల్లీ నగర రూపశిల్పులు.. బ్రిటిష్ ఆర్కిటెక్టులు ఎడ్విన్ ల్యూటెన్, హెర్బర్ట్ బేకర్లు ఎగువ, దిగువ చట్టసభలకు శాశ్వత భవన నిర్మాణాలను ప్రతిపాదించారు. ల్యూటన్ గుండ్రంగా, బేకర్ త్రికోణాకారంలో ప్రణాళికలు తయారు చేశారు. చివరకు ల్యూటన్ దానికే బ్రిటిష్ సర్కారు మొగ్గు చూపింది. 👉 1921 ఫిబ్రవరి 12న.. డ్యూక్ ఆఫ్ కానాట్ ‘ప్రిన్స్ ఆర్థర్’ కొత్త పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేశారు. ఆరేళ్లలో నిర్మితమైన ఈ భవనాన్ని 1927 జనవరి 19న అప్పటి భారత వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ప్రారంభించారు. ఆరు ఎకరాల విస్తీర్ణంలో.. 27 అడుగుల ఎత్తైన పిల్లర్లు 144 ను ఉపయోగించి.. ఈ అందమైన భవంతి నిర్మించారు. ప్రకృతి వైపరిత్యాలను తట్టుకునేలా పక్కా ప్లాన్‌తో చాలా బలంగా ఈ నిర్మాణం జరిగింది. బహుశా అందుకేనేమో ఈ 96 ఏళ్ల కాలంలో.. పార్లమెంట్ భవనానికి జరిగిన రిపేర్ సందర్భాలు చాలా తక్కువగానే ఉన్నాయి. 👉 మధ్యలో సెంట్రల్ హాల్, దాని పక్కనే మూడు అర్ధవృత్తాకార ఛాంబర్లు... చుట్టూ ఉద్యానవనంతో ఆకట్టుకునేలా నిర్మించారు. సెంట్రల్ హాల్ చుట్టూ ఉండే ఒక ఛాంబర్లో సంస్థానాధీశుల సభ (ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్), మరోదాంట్లో స్టేట్ కౌన్సిల్ (ఎగువ సభ, ప్రస్తుత రాజ్యసభ), మూడోదాంట్లో సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (దిగువ సభ, ప్రస్తుత లోక్‌సభ) ఉండేవి. 👉 మధ్యప్రదేశ్‌లోని చౌసత్ యోగిని దేవాలయాకృతి స్ఫూర్తితో పార్లమెంట్ భవనం నిర్మించారనే ఒక ప్రచారం కూడా నడుస్తుంటుంది. అలా మన పార్లమెంటు భవనం ప్రారంభం కాగా.. ప్రపంచవ్యాప్తంగా కూడా అందరి దృష్టినీ ఆకర్షించింది. 👉 బ్రిటిషర్ల కాలంలో చట్టసభగా కొనసాగిన ఈ భవనం.. అధికార మార్పిడికి వేదికైంది. అంతేకాదు.. కొత్త ఏర్పాట్లు జరిగేదాకా మొదట్లో సుప్రీంకోర్టు కూడా ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నుంచే కార్యకలాపాలు నిర్వహించింది. యూపీఎస్సీ కార్యాలయం కూడా పార్లమెంటు కాంప్లెక్స్‌లోనే ఉండేది. 👉 స్థలాభావాన్ని అధిగమించటం కోసం 1956లో పాత పార్లమెంటులో మరో రెండు అంతస్థులు నిర్మించారు. అయినా స్థలం సరిపోయేది కాదు. 👉 సెంట్రల్ హాల్లో మూడోదైన లెజిస్లేటివ్ అసెంబ్లీలోనే 1929లో విప్లవకారుడు భగత్‌సింగ్, ఆయన సహచరుడు బతుకేశ్వర్ దత్‌లు బాంబు విసిరారు. 👉 2001లో లష్కరే తోయిబా తీవ్రవాదుల దాడి జరిగింది పార్లమెంట్ భవనంపై. స్వతంత్ర భారతంలోని అత్యంత కీలక చట్టాలకు ఈ పార్లమెంట్ భవనమే ప్రత్యక్ష సాక్షి. ఎమర్జెన్సీలాంటి చీకట్లతో పాటు స్వాత్రంత్య దినోత్సవ వేడుకల వెలుగుల్ని వీక్షించింది ఈ భవంతి. మహ మహా మేధావుల నేతృత్వంలో ఆధునిక భారత ప్రస్థానానికి దారితీసిన సంస్కరణలకే కాదు.. వివాదాలకు, నేతల వ్యక్తిగత విమర్శలకూ ఈ ప్రజాస్వామ్య సౌధం వేదికగా మారింది. 👉 నూతన భవన నిర్మాణంలో సుమారు 60,000 మంది కార్మికులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల పాటు నిర్మాణ పనులు సాగాయి. సెంట్రల్ విస్టా వెబ్సైట్ ప్రకారం.. పాత పార్లమెంటు భవన నిర్మాణానికి అవసరమైన రాళ్లు, మార్బుల్స్ కోసమే రాళ్లు కొట్టేవాళ్లను, మేస్త్రీలను కలిపి 2,500 మందిదాకా అప్పట్లో నియమించారట. 👉 కార్యకలాపాలకు కొత్త పార్లమెంట్ భవనం ఉపయోగించినప్పటికీ.. పాత పార్లమెంట్ భవనాన్ని కూల్చబోమని కేంద్రం ఇప్పటికే తెలిపింది. దానికి మరమత్తులు చేసి ప్రత్యామ్నాయ వినియోగానికి అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. పాత పార్లమెంటు భవనాన్ని దేశ పురావస్తు సంపదగా పరిరక్షిస్తామని తెలిపారు. ఆ అవసరం ఉంది కూడా. 👉 మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న టైంలో.. పార్లమెంట్ మ్యూజియంను ఏర్పాటు చేశారు. 2500 ఏళ్ల నాటి భారతీయ విశిష్ట నాగరికత సంస్కృతులు ఇందులో అద్దంపట్టేలా ఏర్పాటు చేశారు.