యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది కోల్‌కతా యువ వైద్యురాలి హత్యాచారం కేసులో.. సంజయ్ రాయ్‌కి మరణశిక్ష పడకపోవడంపై పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత అరుదైన కేసు కాదనే ఉద్దేశంతోనే అంతటి శిక్ష వేయడం లేదని సీల్దా కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే.. ఈ కేసులో కంటికి కన్నులాగా.. ప్రాణానికి ప్రాణం తీయడమే సరైందని.. న్యాయస్థానం ఆ అంశాల్ని పరిశీలించి ఉండాలనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో బెంగాల్‌లోనే చర్చనీయాంశమైన కేసుల్ని ప్రస్తావిస్తున్నారు.
కిందటి ఏడాది ఆగష్టులో కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారోదంతం.. తీవ్ర చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది ఆందోళన బాట చేపట్టడంతో వైద్య సేవలపైనా ప్రభావం పడడమే అందుకు ప్రధాన కారణం. అదే సమయంలో మహిళలపై అఘాయిత్యాలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందనే వాదనను ఈ కేసు తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలోనే బెంగాల్ సర్కార్ అపరాజిత పేరుతో ప్రత్యేక చట్టం చేసుకుంది కూడా. కానీ, దోషికి సరైన శిక్ష పడలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఆర్జీకర్ ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా ఐదు కేసుల్లో మరణశిక్షలు విధించాయి పశ్చిమ బెంగాల్ న్యాయస్థానాలు.
1. ఆగష్టు 2023లో మతిగరలో 16 ఏళ్ల అమ్మాయిపై హత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నిందితుడు. అతనికి సిలిగూరి కోర్టు కిందటి ఏడాది సెప్టెంబర్ 21న మరణశిక్ష విధించింది.
2. 2023 ఏప్రిల్‌లో.. తిల్‌జల ప్రాంతంలో ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారం జరిగింది. సెప్టెంబర్ 26వ తేదీన ఆ మానవమృగానికి మరణశిక్ష విధించింది కోల్‌కత్తా కోర్టు.
3. కిందటి ఏడాది అక్టోబర్‌లో కుల్‌తలి ఏరియాలో తొమ్మిదేళ్ల బాలికపై హత్యాచారానికి తెగబడ్డ వ్యక్తికి.. డిసెంబర్ 6వ తేదీన కోర్టు మరణశిక్ష విధించింది.
4. డిసెంబర్ 13వ తేదీన.. తొమ్మిదేళ్ల చిన్నారిని చిదిమేసిన కామాంధుడికి మరణశిక్ష విధించింది ఫరక్కా కోర్టు.
5. కిందటి ఏడాది నవంబర్‌లో ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి తెగబడి ప్రాణం తీసిన కిరాతకుడికి ఆదివారం(జనవరి 20న) హూగ్లీ కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది.
ఈ ఐదు కేసుల్లో మరణశిక్షలు విధించిన న్యాయస్థానాలు.. ఆర్జీకర్ కేసు, ఆ కేసులో చోటుచేసుకున్న పరిణామాలను ఎందుకు అంతతీవ్రమైనవిగా పరిగణించలేకపోయిందనేది పలువురి ప్రశ్న. అయితే దీనికి న్యాయ నిపుణులు వివరణ ఇస్తున్నారు. అదనపు డైరెక్టర్ జనరల్ జావేద్ షమీమ్ మాట్లాడుతూ.. ఈ తరహా శిక్షలు కేవలం బాధితురాలికో, ఆమె కుటుంబానికో మాత్రమే కాదు.. యావత్ సమాజానికి న్యాయం జరుగుతుందనే సందేశాన్ని పంపిస్తాయి. మహిళలు, మరీ ముఖ్యంగా మైనర్ల విషయంలో కలిగే అభద్రతాభావాన్ని తొలగించే అడుగు అని అన్నారు. అయితే..
పైన చెప్పుకున్న అన్ని కేసులు మైనర్లపై జరిగిన అఘాయిత్యాలే. తీర్పులు ఇచ్చిన అన్ని కోర్టులు.. పోక్సో న్యాయస్థానాలే. పైగా ఈ కేసులన్నింటిలో బాధిత చిన్నారులకు.. వాళ్ల కుటుంబ సభ్యులతో నేరానికి పాల్పడిన వాళ్లకు పరిచయాలు ఉన్నాయి. నమ్మి వెంట వెళ్లిన చిన్నారులను చిధిమేశాయి ఆ మానవమృగాలు. పైగా ఈ కేసుల్లో బలమైన ఆధారాలు ఉన్నాయి. అందుకే అత్యంత అరుదైన కేసులుగా ఆయా న్యాయస్థానాలు గుర్తించాయి అని చెబుతున్నారు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బివాస్ ఛటర్జీ. మతిగర, కుల్‌తలి, ఫరక్కా కేసుల్లో స్వయంగా ఈయనే వాదనలు వినిపించారు.
పై ఐదు కేసుల్లో మరణశిక్షలను, అలాగే ఆర్జీకర్ కేసుల్లో యావజ్జీవ కాగారార శిక్షను న్యాయనిపుణులు సమర్థిస్తున్నారు. భావోద్వేగాలు, ప్రజాభిప్రాయాలు.. న్యాయవ్యవస్థలను ఎంతమాత్రం ప్రభావితం చేయబోవని చెబుతున్నారు. అలాగని.. ఆ ఆందోళనలను గనుక పరిగణనలోకి తీసుకుని కోర్టులు సత్వర న్యాయానికి ప్రయత్నించడం ఎంతమాత్రం మంచిదికాదని అంటున్నారు.
అత్యంత అరుదైన కేసంటే..
మన దేశంలో అంత్యంత అరుదైన కేసుల్లోనే మరణశిక్షలు విధిస్థాయి న్యాయస్థానాలు. బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు ఆధారంగా సుప్రీం కోర్టు తొలిసారి ఈ తరహా తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడు ముగ్గురిని హతమార్చాడనే అభియోగాల కింద బచ్చన్ సింగ్ అనే వ్యక్తికి సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించగా.. హైకోర్టు ఆ శిక్షను సమర్థించింది. ఆ తర్వాత కేసు సుప్రీం కోర్టుకు చేరింది.
ఐపీసీ సెక్షన్ 302 రాజ్యాంగబద్ధతతో పాటు సీఆర్‌పీసీలోని సెక్షన్ 354(3) ప్రకారం మరణశిక్షలకు ప్రత్యేక కారణాలను పరిగణనలోకి తీసుకోవడం వంటి అంశాలను ఈ కేసు సవాల్ చేసింది. అయితే ఈ కేసులో వాదనలు విన్న జస్టిస్ వైసీ చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం.. 1980 ఆగష్టు 16వ తేదీన తీర్పు వెల్లడించింది. కింది కోర్టులు విధించిన మరణశిక్షను సమర్థించింది.
భారతీయ న్యాయవ్యవస్థకు ‘‘అత్యంత అరుదైన కేసు’’ సిద్ధాంతాన్ని తెచ్చిపెట్టింది ఈ తీర్పు. నేర తీవ్రత, ప్రత్యేక పరిస్థితులను, మానవ హక్కులను గౌరవించడంలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే.. అంతిమ మార్గంగా మరణశిక్షలు విధించాలని తీర్పు సమయంలో రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసు తర్వాతి కాలంలో భారతీయ కోర్టులకు మార్గదర్శకంగా మారింది.
అంత్యత అరుదైన కేసులకు వర్తించేవి ఇవే..
నేర తీవ్రత
నేరానికి పాల్పడ్డ తీరు, ఉద్దేశాలు
ఆ నేరం.. సమాజంపై చూపించే ప్రభావం
నేరస్తుడి వయసు, కుటుంబ నేపథ్యం.. ప్రస్తుత పరిస్థితులు
నేరస్థుడిలో జైలు జీవితం పరివర్తన తీసుకొచ్చే అంశాల పరిశీలన
మన దేశంలో అత్యంత అరుదైన కేసుల్లో మరణశిక్షలు పడ్డవెన్నో. వాటిల్లో కోల్‌కతాలో స్కూల్ చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డ ధనంజయ్ ఛటర్జీ(1990)కి, నిర్భయ ఘటన(2012)లో, 2008లో ముంబై ఉగ్రదాడులకు పాల్పడిన అజ్మల్ కసబ్‌లకు అత్యంత ప్రముఖమైన కేసులుగా నిలిచాయి.
అయితే.. అత్యంత అరుదైన కేసుల్లో సాధారణంగా కింది కోర్టులు మరణశిక్షలు విధిస్తుంటాయి. వాళ్లు పైకోర్టులకు వెళ్లినప్పుడు.. ఊరట లభించిన సందర్భాలే అధికంగా ఉన్నాయి అని బెంగాల్ మాజీ అడ్వొకేట్ జనరల్ జయంత మిత్రా అంటున్నారు. ఆర్జీకర్ కేసులోనూ నిందితుడు పైకోర్టులో తనకు పడ్డ జీవితఖైదు శిక్షనూ సవాల్ చేసే అవకాశం లేకపోదని చెబుతున్నారాయన.
Comments
Please login to add a commentAdd a comment