indian judiciary
-
ఆర్జీకర్ ఘటన అందుకే ‘అరుదైన కేసు’ కాలేకపోయింది!
యావత్ దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతి గురిచేసింది కోల్‌కతా యువ వైద్యురాలి హత్యాచారం కేసులో.. సంజయ్ రాయ్‌కి మరణశిక్ష పడకపోవడంపై పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అత్యంత అరుదైన కేసు కాదనే ఉద్దేశంతోనే అంతటి శిక్ష వేయడం లేదని సీల్దా కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే.. ఈ కేసులో కంటికి కన్నులాగా.. ప్రాణానికి ప్రాణం తీయడమే సరైందని.. న్యాయస్థానం ఆ అంశాల్ని పరిశీలించి ఉండాలనే అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో బెంగాల్లోనే చర్చనీయాంశమైన కేసుల్ని ప్రస్తావిస్తున్నారు.కిందటి ఏడాది ఆగష్టులో కోల్‌కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారోదంతం.. తీవ్ర చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా వైద్య సిబ్బంది ఆందోళన బాట చేపట్టడంతో వైద్య సేవలపైనా ప్రభావం పడడమే అందుకు ప్రధాన కారణం. అదే సమయంలో మహిళలపై అఘాయిత్యాలను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందనే వాదనను ఈ కేసు తెరపైకి తెచ్చింది. ఈ క్రమంలోనే బెంగాల్ సర్కార్ అపరాజిత పేరుతో ప్రత్యేక చట్టం చేసుకుంది కూడా. కానీ, దోషికి సరైన శిక్ష పడలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. ఆర్జీకర్ ఘటన జరిగినప్పటి నుంచి ఇప్పటిదాకా ఐదు కేసుల్లో మరణశిక్షలు విధించాయి పశ్చిమ బెంగాల్ న్యాయస్థానాలు.1. ఆగష్టు 2023లో మతిగరలో 16 ఏళ్ల అమ్మాయిపై హత్యాచారానికి పాల్పడ్డాడు ఓ నిందితుడు. అతనికి సిలిగూరి కోర్టు కిందటి ఏడాది సెప్టెంబర్ 21న మరణశిక్ష విధించింది.2. 2023 ఏప్రిల్‌లో.. తిల్జల ప్రాంతంలో ఏడేళ్ల చిన్నారిపై హత్యాచారం జరిగింది. సెప్టెంబర్ 26వ తేదీన ఆ మానవమృగానికి మరణశిక్ష విధించింది కోల్కత్తా కోర్టు.3. కిందటి ఏడాది అక్టోబర్‌లో కుల్తలి ఏరియాలో తొమ్మిదేళ్ల బాలికపై హత్యాచారానికి తెగబడ్డ వ్యక్తికి.. డిసెంబర్ 6వ తేదీన కోర్టు మరణశిక్ష విధించింది.4. డిసెంబర్ 13వ తేదీన.. తొమ్మిదేళ్ల చిన్నారిని చిదిమేసిన కామాంధుడికి మరణశిక్ష విధించింది ఫరక్కా కోర్టు.5. కిందటి ఏడాది నవంబర్‌లో ఐదేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి తెగబడి ప్రాణం తీసిన కిరాతకుడికి ఆదివారం(జనవరి 20న) హూగ్లీ కోర్టు మరణశిక్ష ఖరారు చేసింది.ఈ ఐదు కేసుల్లో మరణశిక్షలు విధించిన న్యాయస్థానాలు.. ఆర్జీకర్ కేసు, ఆ కేసులో చోటుచేసుకున్న పరిణామాలను ఎందుకు అంతతీవ్రమైనవిగా పరిగణించలేకపోయిందనేది పలువురి ప్రశ్న. అయితే దీనికి న్యాయ నిపుణులు వివరణ ఇస్తున్నారు. అదనపు డైరెక్టర్ జనరల్ జావేద్ షమీమ్ మాట్లాడుతూ.. ఈ తరహా శిక్షలు కేవలం బాధితురాలికో, ఆమె కుటుంబానికో మాత్రమే కాదు.. యావత్ సమాజానికి న్యాయం జరుగుతుందనే సందేశాన్ని పంపిస్తాయి. మహిళలు, మరీ ముఖ్యంగా మైనర్ల విషయంలో కలిగే అభద్రతాభావాన్ని తొలగించే అడుగు అని అన్నారు. అయితే.. పైన చెప్పుకున్న అన్ని కేసులు మైనర్లపై జరిగిన అఘాయిత్యాలే. తీర్పులు ఇచ్చిన అన్ని కోర్టులు.. పోక్సో న్యాయస్థానాలే. పైగా ఈ కేసులన్నింటిలో బాధిత చిన్నారులకు.. వాళ్ల కుటుంబ సభ్యులతో నేరానికి పాల్పడిన వాళ్లకు పరిచయాలు ఉన్నాయి. నమ్మి వెంట వెళ్లిన చిన్నారులను చిధిమేశాయి ఆ మానవమృగాలు. పైగా ఈ కేసుల్లో బలమైన ఆధారాలు ఉన్నాయి. అందుకే అత్యంత అరుదైన కేసులుగా ఆయా న్యాయస్థానాలు గుర్తించాయి అని చెబుతున్నారు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బివాస్ ఛటర్జీ. మతిగర, కుల్తలి, ఫరక్కా కేసుల్లో స్వయంగా ఈయనే వాదనలు వినిపించారు. పై ఐదు కేసుల్లో మరణశిక్షలను, అలాగే ఆర్జీకర్ కేసుల్లో యావజ్జీవ కాగారార శిక్షను న్యాయనిపుణులు సమర్థిస్తున్నారు. భావోద్వేగాలు, ప్రజాభిప్రాయాలు.. న్యాయవ్యవస్థలను ఎంతమాత్రం ప్రభావితం చేయబోవని చెబుతున్నారు. అలాగని.. ఆ ఆందోళనలను గనుక పరిగణనలోకి తీసుకుని కోర్టులు సత్వర న్యాయానికి ప్రయత్నించడం ఎంతమాత్రం మంచిదికాదని అంటున్నారు.అత్యంత అరుదైన కేసంటే.. మన దేశంలో అంత్యంత అరుదైన కేసుల్లోనే మరణశిక్షలు విధిస్థాయి న్యాయస్థానాలు. బచ్చన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ కేసు ఆధారంగా సుప్రీం కోర్టు తొలిసారి ఈ తరహా తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితుడు ముగ్గురిని హతమార్చాడనే అభియోగాల కింద బచ్చన్ సింగ్ అనే వ్యక్తికి సెషన్స్ కోర్టు మరణశిక్ష విధించగా.. హైకోర్టు ఆ శిక్షను సమర్థించింది. ఆ తర్వాత కేసు సుప్రీం కోర్టుకు చేరింది.ఐపీసీ సెక్షన్ 302 రాజ్యాంగబద్ధతతో పాటు సీఆర్పీసీలోని సెక్షన్ 354(3) ప్రకారం మరణశిక్షలకు ప్రత్యేక కారణాలను పరిగణనలోకి తీసుకోవడం వంటి అంశాలను ఈ కేసు సవాల్ చేసింది. అయితే ఈ కేసులో వాదనలు విన్న జస్టిస్ వైసీ చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం.. 1980 ఆగష్టు 16వ తేదీన తీర్పు వెల్లడించింది. కింది కోర్టులు విధించిన మరణశిక్షను సమర్థించింది.భారతీయ న్యాయవ్యవస్థకు ‘‘అత్యంత అరుదైన కేసు’’ సిద్ధాంతాన్ని తెచ్చిపెట్టింది ఈ తీర్పు. నేర తీవ్రత, ప్రత్యేక పరిస్థితులను, మానవ హక్కులను గౌరవించడంలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే.. అంతిమ మార్గంగా మరణశిక్షలు విధించాలని తీర్పు సమయంలో రాజ్యాంగ ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసు తర్వాతి కాలంలో భారతీయ కోర్టులకు మార్గదర్శకంగా మారింది.అంత్యత అరుదైన కేసులకు వర్తించేవి ఇవే..నేర తీవ్రతనేరానికి పాల్పడ్డ తీరు, ఉద్దేశాలుఆ నేరం.. సమాజంపై చూపించే ప్రభావంనేరస్తుడి వయసు, కుటుంబ నేపథ్యం.. ప్రస్తుత పరిస్థితులునేరస్థుడిలో జైలు జీవితం పరివర్తన తీసుకొచ్చే అంశాల పరిశీలనమన దేశంలో అత్యంత అరుదైన కేసుల్లో మరణశిక్షలు పడ్డవెన్నో. వాటిల్లో కోల్‌కతాలో స్కూల్ చిన్నారిపై హత్యాచారానికి పాల్పడ్డ ధనంజయ్ ఛటర్జీ(1990)కి, నిర్భయ ఘటన(2012)లో, 2008లో ముంబై ఉగ్రదాడులకు పాల్పడిన అజ్మల్ కసబ్‌లకు అత్యంత ప్రముఖమైన కేసులుగా నిలిచాయి.అయితే.. అత్యంత అరుదైన కేసుల్లో సాధారణంగా కింది కోర్టులు మరణశిక్షలు విధిస్తుంటాయి. వాళ్లు పైకోర్టులకు వెళ్లినప్పుడు.. ఊరట లభించిన సందర్భాలే అధికంగా ఉన్నాయి అని బెంగాల్ మాజీ అడ్వొకేట్ జనరల్ జయంత మిత్రా అంటున్నారు. ఆర్జీకర్ కేసులోనూ నిందితుడు పైకోర్టులో తనకు పడ్డ జీవితఖైదు శిక్షనూ సవాల్ చేసే అవకాశం లేకపోదని చెబుతున్నారాయన. -
రివైండ్ 2024: విషాదాలు... విజయాలు
2024లో భారతావని తీపి, చేదులెన్నింటినో చవిచూసింది. హిందువుల ఐదు శతాబ్దాల కలను సాకారం చేస్తూ అయోధ్యలో బాలరామునికి దివ్య ధామం కొలువుదీరింది. అస్తవ్యస్థ అభివృద్ధి తగదని కేరళ కొండల్లో ప్రకోపం రూపంలో ప్రకృతి హెచ్చరించింది. ‘400 పార్’ అన్న బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు హ్యాట్రిక్ ఇచ్చినా మెజారిటీకి కాస్త దూరంలోనే నిలబెట్టి షాకిచ్చారు. కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో శిక్షణ వైద్యురాలిపై కామాంధుడి హత్యాచారం యావత్ జాతినీ నిశ్చేష్టపరిచింది. వలస చట్టాల స్థానంలో భారతీయ చట్టాలు వచ్చాయి. చచ్చిన జంతువుల చర్మాలపై వేళ్లు కదలించే వాళ్లంటూ దూరం పెట్టిన నోళ్లు నివ్వెరబోయేలా తబలాకు విశ్వవ్యాప్త కీర్తి కిరీటం తొడిగిన స్వర తపస్వి జాకీర్ హుస్సేన్ అస్తమయంతో సంగీత ప్రపంచం మూగబోయింది. సంస్కరణల బాటలో దేశాన్ని ప్రగతి పరుగులు పెట్టించిన కర్మయోగి మన్మోహన్, పారిశ్రామిక జగజ్జేత రతన్ టాటా సహా దిగ్గజాలెందరో ఇక సెలవంటూ మనను వీడి వెళ్లారు. ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్లో జగజ్జేతగా నిలిచి టీనేజర్ గుకేశ్ దొమ్మరాజు ఆనంద డోలికల్లో ముంచెత్తాడు...అయోధ్యలో బాల రాముడు శతాబ్దాల కలను సాకారం చేస్తూ అయోధ్యలో భవ్య రామమందిరం రూపుదిద్దుకుంది. బాల రాము ని ప్రాణప్రతిష్ట కార్యక్రమం జనవరిలో అతిరథ మహారథుల సమక్షంలో కన్నులపండువగా జరిగింది. వజ్రతిలకంతో అపూర్వ ఆభరణాలతో కూడిన ఆ సుందర రూపాన్ని చూసేందుకు భక్త కోటి పోటెత్తింది. ప్రారం¿ోత్సవాన్ని వేలాది మంది ప్రత్యక్షంగా, కోట్లాది మంది పరోక్షంగా వీక్షించారు.సత్తా చాటిన ఇస్రో 2024 మొదలవుతూనే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో జయభేరి మోగించింది. కృష్ణబిలాలు, ఎక్స్ కిరణాలపై శోధనకు ఎక్స్‌రే పొలారీమీటర్ శాటిలైట్‌ను జనవరి 1న తొలి ప్రయత్నంలో విజయవంతంగా ప్రయోగించింది. వారంలోపే సూర్యునిపై పరిశోధనలకు ఉద్దేశించిన ఆదిత్య ఎల్–1ను సైతం ఎల్–1 కక్ష్యలోకి చేర్చింది. ఏడాది పొడవునా ప్రయోగాలతో సత్తా చాటింది.పరిణిత తీర్పు లోక్‌సభలో తమకు ఎదురు లేదని భావించిన కమల దళానికి ఓటర్లు చిన్న షాకిచ్చారు. మోదీ మేనియాలో హ్యాట్రిక్ ఖాయమన్న అంచనాలను నిజం చేసినా, బీజేపీని మాత్రం మెజారిటీకి కాస్త దూరంలోనే ఉంచారు. అయోధ్యకు నెలవైన లోక్‌సభ స్థానంలోనూ బీజేపీ ఓటమి చవిచూసింది. విపక్ష ‘ఇండియా’ కూటమి పర్వాలేదనిపించింది. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర కలిసొచ్చి కాంగ్రెస్ కూడా కాస్త కోలుకుంది. దివికేగిన దిగ్గజాలు న్యాయ కోవిదుడు ఫాలీ ఎస్ నారిమన్, వామపక్ష దిగ్గజాలు బుద్ధదేవ్ భట్టాచార్య, సీతారాం ఏచూరి మొదలుకుని ఓం ప్రకాశ్ చౌతాలా, ఎస్ఎస్ కృష్ణ వంటి దిగ్గజ నేతలను, భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నిపుణురాలు యామినీ కృష్ణమూర్తి తదితరులనూ ఈ ఏడాదిలోనే దేశం కోల్పోయింది. పారిశ్రామిక దిగ్గజం, మానవీయ విలువలకు నిలువుటద్దం రతన్ టాటా అస్తమయం తీరని లోటు మిగిల్చింది. డిసెంబర్ అయితే పీడకలగా మిగిలింది. తబలా దిగ్గజం జాకిర్ హుస్సేన్, భారతీయ సినిమాకు మట్టి పరిమళాలద్దిన హైదరాబాదీ శిఖరం శ్యామ్ బెనగల్, రాజనీతిజు్ఞడికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన సంస్కరణల ప్రధాని మన్మోహన్ సింగ్ ఒకరి వెంట ఒకరు సెలవంటూ వెళ్లిపోయారు.బాండ్లకు బైబై పారీ్టలకు నిధులు సమకూర్చేందుకు తీసుకొచి్చన ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వాటి జారీని తక్షణమే నిలిపేయాలంటూ ఏకగీవ్ర తీర్పునిచ్చింది. ఎన్నికల బాండ్ల ముసుగులో గోప్యంగా విరాళాల స్వీకరణ సమాచార హక్కుకు ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. దాతల పేర్లపై గోప్యత తగదని చెప్పింది.వయనాడ్ విలయం కేరళలోని వయనాడ్ జిల్లాలో మారుమూల గ్రామాలపై కొండచరియలు విరిగిపడ్డ విలయంలో 231 మంది అమాయకులు సజీవ సమాధి అయ్యారు. పర్యాటకం పేరిట కొండలను ఇష్టంగా తవ్వేసిన పాపానికి వాళ్లు బలైపోయారు. దాదాపు 120 మంది జాడ ఇప్పటికీ తెలియలేదు. వేలమంది సర్వస్వం కోల్పోయారు. ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్ జిల్లాలో సత్సంగ్‌లో బోలే బాబా పాదస్పర్శ జరిగిన మట్టి కోసం భక్తులు వేలాదిగా ఎగబడ్డ ఉదంతం తొక్కిసలాటకు దారితీసి 121 మంది ప్రాణాలు కోల్పోయారు.అరెస్టులే అరెస్టులు ఢిల్లీలో మద్యం విధా నం కుంభకోణం కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చిలో ఈడీ అరెస్టు చేసింది. ఎట్టకేలకు బెయిల్ మీద బయటికొచి్చనా నమ్మినబంటు అతిశిని ఢిల్లీ సీఎం కుర్చీపై కూర్చోబెట్టారు. కర్ణాటకలో సంచలనం సృష్టించిన అత్యాచారాల కేసులో మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ అరెస్టయ్యారు. కన్నడ నటుడు దర్శన్ తూగుదీప కూడా అభిమానిని కొట్టి చంపిన కేసులో కటకటాలపాలయ్యారు. సంచలనం సృష్టించిన నీట్ ప్రవేశ పరీక్షలోనూ పలు అరెస్టులు జరిగాయి.రైతన్నల పోరుబాట మద్దతు ధరకు చట్ట బద్ధత కోరుతూ పంజాబ్, హరియాణాలో కర్షకలోకం మరోసారి సమరశంఖం పూరించింది. శంభూ సరిహద్దు వద్ద మొదలైన రైతు ఉద్యమం మరోసారి ఉధృతంగా సాగింది. ఢిల్లీ, హరియాణా సరిహద్దుల దిగ్బంధం, పోలీసులతో రైతుల ఘర్షణ, లాఠీచార్జ్, బాష్పవాయుగోళాల ప్రయోగంతో రైతన్నలు నెల రోజులుగా రోడ్డుపై రక్తమోడుతున్నా కేంద్రం నుంచి ఇప్పటికైతే సానుకూల ప్రకటన లేదు. నానాటికీ క్షీణిస్తున్న రైతు నేత డల్లేవాల్ ఆరోగ్యం ఆందోళన కలిగిస్తోంది.అమల్లోకి సీఏఏ వివాదాస్పద పౌరస త్వ సవరణ చట్టాన్ని మోదీ సర్కారు అమల్లోకి తెచ్చింది. 2014 డిసెంబరు 31కి ముందు పాకిస్థాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు ధ్రువీకరణ పత్రాలు లేకున్నా పౌరసత్వం ఇచ్చేందుకు సిద్ధమైంది. వలస వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలకు పౌరసత్వం ఇచ్చే ప్రక్రియ మొదలైంది.భారత న్యాయవ్యవస్థభారత న్యాయవ్యవస్థలో నూతన అధ్యాయానికి తెరలేచింది. బ్రిటిష్ హయాం నాటి భారత శిక్షా స్మృతి (ఐపీసీ), నేర శిక్షాస్మృతి (సీఆర్పీసీ), సాక్ష్యాధార చట్టాలు కనుమరుగయ్యాయి. వాటి స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అమల్లోకి వచ్చాయి. సత్వర న్యాయం, జీరో ఎఫ్ఐఆర్, పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు, ఎస్ఎంఎస్ వంటి ఎల్రక్టానిక్ మాధ్యమాలతో సమన్ల జారీ లాంటి అత్యాధునిక పద్ధతులను అందుబాటులోకి తెచ్చాయి.చైనా దోస్తీ సరిహద్దు సంక్షోభాగ్నిని ఎగదోసే డ్రాగన్ దేశంతో ఎట్టకేలకు తూర్పు లద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణ ఒప్పందం కుదిరింది. అక్కడ బలగాల ఉపసంహరణ, ఉమ్మడి గస్తీకి ఇరు దేశాలు సరేనన్నాయి. దాంతో గల్వాన్ లోయ ఉద్రిక్తత అనంతరం దిగజారిన ద్వైపాక్షిక సంబంధాలు కాస్త మెరుగయ్యాయి.ఆర్జీ కర్ దారుణం కోల్‌కతా ఆర్జీ కర్ వైద్య కళాశాలలో ట్రైనీ వైద్యురాలిపై సివిల్ వలంటీర్ చేసిన దారుణ హత్యాచారం యావద్దేశాన్నీ కలచివేసింది. నిందితునితో అంటకాగిన కాలేజీ ప్రిన్సిపల్‌ను తొలగించకపోగా వేరే పోస్టింగ్ ఇచ్చి మమత సర్కారు జనాగ్రహానికి గురైంది. మహిళా వైద్యులు, వైద్య సిబ్బంది భద్రత గాల్లో దీపమంటూ దేశవ్యాప్తంగా వైద్య లోకం రోడ్డెక్కడంతో సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పని ప్రదేశాల్లో మహిళల భద్రతకు చర్యలపై మార్గదర్శకాలు రూపొందించాలని ఆదేశించింది.చదరంగంలో యువరాజు 18 ఏళ్ల గుకేశ్ దొమ్మరాజు చదరంగంలో భారత పతాకను సమున్నతంగా ఎగరేశాడు. ఏడేళ్ల వయసు నుంచే గళ్లపై తిరుగులేని పట్టు సాధించిన ఈ సంచలనం తాజాగా ప్రపంచ వేదికపై డిఫండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను మట్టికరిపించి ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతా సిద్ధమేనా?
భారత న్యాయశాస్త్ర చరిత్రలో మొన్న జూలై 1న ఒక కొత్త అధ్యాయం మొదలైంది. బ్రిటీషు కాలం నాటి నేర చట్టాల స్థానంలో మూడు కొత్త చట్టాలను మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. భారత శిక్షాస్మృతి– 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్– 1973, భారతీయ సాక్ష్యాల చట్టం – 1872... ఈ మూడింటి బదులు ‘భారతీయ న్యాయ సంహిత’, ‘భారతీయ నాగరిక్ సురక్షా సంహిత’, ‘భారతీయ సాక్ష్య అధినియమ్’లు సోమవారం నుంచి ఆచరణలోకి వచ్చాయి. అయితే, న్యాయకోవిదుల మొదలు సాధారణ కక్షిదారుల వరకు ఈ కొత్త చట్టాలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. నేరన్యాయవ్యవస్థను ఆధునికీకరించడంలో ఈ కొత్త చట్టాలు గణనీయమైన ముందడుగు అని కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు పాతవాటికి పైపై మెరుగులు దిద్ది, అమానుషంగా మార్చారని విమర్శిస్తున్నారు. పోలీస్స్టేషన్ల నుంచి కోర్టుల దాకా అన్నిటా పనితీరును మార్చేసి, సామాన్యులపై పెను ప్రభావం చూపే ఈ శాసనాలపైనే ఇప్పుడు దేశమంతటా చర్చ సాగుతోంది. కొత్త నేర చట్టాల వ్యవహారం సహజంగానే అధికార బీజేపీకీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌కూ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. వలసవాద పాలన తాలూకు అవశేషాలను వదిలించుకొనే ఈ ప్రయత్నం దేశపురోగతికీ, స్థితిస్థాపకతకూ ప్రతీక అన్నది బీజేపీ మాట. కాంగ్రెస్ మాత్రం గడచిన ప్రభుత్వ హయాంలో పార్లమెంట్లో ఏకంగా 146 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెండైన వేళ, కేవలం మూజువాణి ఓటుతో బలవంతాన ఈ చట్టాలకు ఆమోదముద్ర వేశారనీ, పార్లమెంటరీ వ్యవస్థలో ఈ రకమైన ‘బుల్డోజర్ న్యాయాన్ని’ తమ ప్రతిపక్ష కూటమి సహించబోదనీ పేర్కొంది. శతాబ్ద కాలానికి ముందెప్పుడో బ్రిటీషు హయాంలో చేసిన చట్టాలు శిక్షల మీద ప్రధానంగా దృష్టి పెడుతుంటే, ఈ కొత్త చట్టాలు మటుకు అందరికీ న్యాయం, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తాయనేది అధికార పక్షం కథనం. కానీ, ఆ మాటలతో ప్రతిపక్షాలే కాదు... చివరకు పలువురు న్యాయశాస్త్ర నిపుణులు సైతం విభేదిస్తుండడం గమనార్హం. ఇంకా చెప్పాలంటే, సరికొత్త శాసనాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఎంతైనా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి, మారుతున్న సమాజ పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా పాతకాలపు చట్టాలను మార్చాలన్న ఆలోచన మంచిదే. ప్రస్తుతం విచారణలోని ఖైదీలు లెక్కకు మిక్కిలిగా జైళ్ళలో మగ్గిపోతున్నారు. అసంఖ్యాకంగా బాధితులు న్యాయం కోసం ఏళ్ళ తరబడి నిరీక్షిస్తున్నారు. లక్షల కొద్దీ కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో నేర న్యాయవ్యవస్థలో సంస్కరణలు అత్యవసరం. అయితే, అందుకు గడచిన మోదీ సర్కార్ హడావిడిగా అనుసరించిన పద్ధతి, తగిన చర్చకు తావివ్వకుండా పార్లమెంట్లో చూపిన ఆధిపత్యం, చేసిన మంచి సూచనల్నీ – చెప్పిన అభ్యంతరాలను సైతం పట్టించుకోని తెంపరితనంతోనే అసలు చిక్కంతా! అసలు 2020 జూలైలోనే కేంద్ర హోమ్ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల సంఘం వైవాహిక అత్యాచారం మొదలు కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేయడం, రాజద్రోహ నేరంపై పునస్సమీక్ష లాంటి అనేక అంశాలపై పౌరులకు వివరమైన ప్రశ్నావళిని జారీ చేసింది. అయితే, కరోనా కాలంలోనే సంప్రతింపుల ప్రక్రియలో అధిక భాగం జరిగింది. అడిగిన, ఆశించిన భారీ మార్పులేమీ లేకుండానే కొత్త చట్టాలు వచ్చేశాయి. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు ఏకంగా 14 రోజుల పాటు పోలీసు అధికారి ప్రాథమిక దర్యాప్తు చేయవచ్చనడం, పోలీసు కస్టడీ కాలవ్యవధిని 15 రోజుల నుంచి అనేక వారాలు పెంచేయడం, చేతులకు బేడీలు సహా కొన్ని అంశాల్లో పోలీసులకు అపరిమిత అధికారాలు కట్టబెట్టడం లాంటివి ఇప్పటికే వివాదాస్పదమయ్యాయి. అలాగని కొత్త చట్టాల్లో ఏ మంచీ లేదనలేం. కొన్ని ముందడుగులు పడ్డాయి. కొన్ని రకాల నేరాల్లో శిక్షకు ప్రత్యామ్నాయంగా సామాజిక సేవ చేయడాన్ని ప్రవేశపెట్టారు. అలాగే, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణలకూ వీలు కల్పించారు. త్వరితగతిన విచారణలు పూర్తయ్యేలా నిర్ణీత కాలవ్యవధులను నిర్ణయించడం మరో మంచి ప్రయత్నం. అయితే, చట్టాలకు అన్ని ప్రాంతాలకు అర్థమయ్యే ఇంగ్లీష్ పేర్లు పెట్టనే లేదు. ప్రాంతీయ భాషల్లో అనువాదం పూర్తి కానేలేదు. రాష్ట్రాలు స్థానికంగా అవసరమైన మార్పులు చేసుకోవచ్చంటున్నా, చిక్కులున్నాయి.ఏమైనా, కొత్త చట్టాల అమలు సైతం సవాలే. దశాబ్దాలుగా అలవాటైపోయిన సెక్షన్లు, చట్టాలను ఒక్కసారిగా మార్చేయడం ఇతర సమస్యలు తెచ్చింది. ఏ నేరానికి ఏ సెక్షన్ ఎంతమేరకు వర్తిస్తుందో ఇప్పటికిప్పుడు చటుక్కున అర్థం కాని పరిస్థితి. పోలీసు, న్యాయ వ్యవస్థలు కొత్త పద్ధతులకు ఏ మేరకు సుశిక్షితమైనదీ చెప్పలేం. అన్నీ అర్థమై, అలవాటయ్యే వరకు చట్టాల అమలు సంస్థలు, జడ్జీలు, లాయర్ల నుంచి కక్షిదారుల వరకు అందరికీ గందరగోళమే. అలాగే జూలై 1కి ముందు కేసులను పాత చట్టాలతో, ఆ తరువాతి కేసులను కొత్త చట్టాలతో విచారించాల్సి ఉంటుంది. ఇప్పటికీ లక్షల కొద్దీ పాత కేసులు పెండింగ్‌లో ఉన్నందున చాలాకాలం రెండు రకాల చట్టాలనూ అనుసరించాల్సి వస్తుంది. ఇది మరో పెద్ద చిక్కు. అలాగే, ఏ చట్టాలైనా వ్యక్తిగత స్వేచ్ఛ, పౌరహక్కులకు అండగా నిలిస్తేనే వాటికి విలువ. కొత్త చట్టాలపై ఆ విషయంలోనూ అనేక అనుమానాలున్నాయి. కాబట్టి వీటిపై పార్లమెంట్‌లోనే కాదు... పౌర సమాజంలోనూ విస్తృత చర్చ జరగనివ్వాలి. ఆ స్వరాలకు పాలకులు చెవి ఒగ్గాలి. లోపాలను సరిచేయాలి. వ్యవస్థలో సంస్కరణ ఒక్కరోజులో, ఒక్కసారిగా జరిగేది కాదని గుర్తించి, మార్పులు చేర్పులతో సాగాలి. అందుకిది మొదటి అడుగు అవ్వాలి. -
అమల్లోకి కొత్త నేర చట్టాలు.. ఈ సంగతులు తెలుసా?
న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి చట్టాలకు తెరపడింది. భారత న్యాయ వ్యవస్థలో మూడు కొత్త నేర చట్టాలు భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం నేటినుంచి అమల్లోకి వచ్చాయి. భారత శిక్షా స్మృతి (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్(సీఆర్పీసీ), భారత సాక్ష్యాధార చట్టాల చరిత్ర గత అర్ధరాత్రితో ముగిసింది. కొత్త చట్టాలతో జీరో ఎఫ్ఐఆర్, ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేయడం, ఎస్ఎంఎస్ వంటి ఎలక్టాన్రిక్ పద్ధతిలో సమన్లు పంపడం, హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్లను తప్పనిసరి వీడియోల్లో బంధించడం వంటి ఆధునిక పద్ధతులు న్యాయ వ్యవస్థలో రానున్నాయి. బ్రిటిష్ కాలం నాటి చట్టాల మాదిరిగా శిక్షకు కాకుండా, న్యాయం అందించేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచి్చనట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. చట్టాల పేరు మాత్రమే కాదు, వాటి సవరణలు పూర్తి భారతీయ ఆత్మతో రూపొందించామన్నారు. కొత్త చట్టాలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయాన్ని అందిస్తాయని చెప్పారు. → భారతీయ శిక్షాస్మృతిలోని రాజద్రోహాన్ని ఇప్పుడు దేశద్రోహంగా మార్చారు. కులం, మతం వంటి కారణాలతో సామూహిక దాడులు, హత్యకు పాల్పడితే ఐపీసీ ప్రకారం ఏడేళ్ల శిక్ష పడుతుంది. దీన్నిప్పుడు యావజ్జీవంగా మార్చారు. హేయమైన నేరాలకు సంబంధించిన క్రైమ్ సీన్ల వీడియో చిత్రీకరణ తప్పనిసరి చేశారు.→ నకిలీ నోట్ల తయారీ, వాటి స్మగ్లింగ్ ఉగ్రవాదం పరిధిలోకి వస్తుంది. విదేశాల్లో మన ఆస్తుల ధ్వంసాన్నీ ఉగ్రవాదంగా నిర్వచించారు. డిమాండ్ల సాధనకు వ్యక్తులను బంధించడం, కిడ్నాప్ చేయడాన్ని ఉగ్రవాదం పరిధిలోకి చేర్చారు. → మహిళలు, పిల్లలపై నేరాలపై కొత్త అధ్యాయాన్ని జోడించారు. పిల్లల్ని కొనడం, అమ్మడం ఘోరమైన నేరంగా మార్చారు. మైనర్‌పై సామూహిక అత్యాచారానికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు నిబంధన తెచ్చారు. పెళ్లి చేసుకుంటానన్న తప్పుడు వాగ్దానాలతో లైంగిక సంబంధాలు పెట్టుకుని మహిళలను వదిలేయడం వంటి కేసులకు కొత్త నిబంధన పెట్టారు. మహిళలు, పిల్లలపై నేరాల్లో బాధితులకు అన్ని ఆస్పత్రుల్లో ప్రథమ చికిత్స లేదా ఉచిత వైద్యం అందించాలి. మహిళలు, 15 ఏళ్లలోపు, 60 ఏళ్లు పైబడిన వ్యక్తులు, వికలాంగులు, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నవారు ఇంటినుంచే పోలీసు సాయం పొందవచ్చు. కోర్టు అనుమతి లేకుండా లైంగిక దాడి గురించి ప్రచురిస్తే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా నిబంధన చేర్చారు.→ కొత్త చట్టాల ప్రకారం ఫిర్యాదుల నుంచి సమన్లదాకా అన్నీ ఆన్లైన్లో జరగనున్నాయి. పోలీసు స్టేషన్‌కు వెళ్లే పని లేకుండా ఎల్రక్టానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఎస్ఎంఎస్ ద్వారా కూడా సమన్లు పంపవచ్చు. పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఎఫ్ఐఆర్ దాఖలు చేసే జీరో ఎఫ్ఐఆర్ విధానం ప్రవేశపెట్టారు. అరెస్టయిన వ్యక్తి కుటుంబానికి, స్నేహితులకు సమాచారాన్ని పంచుకునే వీలు కల్పించడంతోపాటు వివరాలను పోలీస్ స్టేషన్లలో ప్రదర్శిస్తారు. -
ఆమె మదర్ ఆఫ్ 'పిల్'! శక్తిమంతమైన మార్పుకి నిలువెత్తు నిదర్శనం!
మనం తరుచుగా న్యాయవ్యవస్థలో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం(పిల్) గురించి వింటుంటాం. అసలు ఇది ఎలా వచ్చింది? దీన్ని ఎవరు తీసుకొచ్చారో తెలుసా?. ఈ పిల్ మన దేశ న్యాయవ్యస్థ గతినే మార్చేసింది. చెప్పాలంటే న్యాయవ్యవస్థలో ఓ మూలస్థంభంగా ఉంది. ఈ రెండు అక్షరాల 'పిల్' అనే పదం ఎంతోమందికి న్యాయం చేకూర్చడమే గాక, సమాజంలో గొప్ప మార్పుకి నాంది పలకింది. ఈ 'పిల్' ఓ మహిళ న్యాయవాది మహోన్నత కృషి. ఆమె కథ ఎందరో యువ న్యాయవాదులకు స్ఫూర్తి. తన జీవితమంతా న్యాయం కోసం అర్పించిన ఆ స్ఫూర్తి ప్రదాత గాథ ఏంటంటే.. భారత న్యాయవాది పుష్ప కపిలా హింగోరాణిని 'మదర్ ఆఫ్ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్(పిఐఎల్)' లేదా 'ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం' తల్లిగా పిలుస్తారు. ఆమె 1927 నైరోబీలో జన్మించింది. విద్యాభ్యాసం అంతా కెన్యా, యూకేలలో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆ తర్వాత 1947లో న్యాయవాద వృత్తిని అభ్యసించేందుకు భారతదేశానికి తిరిగి వచ్చింది. ఆ క్రమంలోనే 1979లో బీహార్‌లోని అండర్ ట్రయల్ ఖైదీల దుస్థితి గురించి వచ్చిన వార్తపత్రక కథనాలను చూసి చలించిపోయింది. ఈ చట్టాలన్నీ బాధితులు లేదా వారి బంధువులు మాత్రమే పిటిషన్లు దాఖలు చేయడానికి అనుమతిస్తున్నాయనే విషయం ఆమెకు తెలిసింది. దీని కారణంగా అభాగ్యులు, బలహీన వర్గాల ప్రజలు ఎలా చట్టపరమైన ప్రాతినిధ్యం పొందలేకపోతున్నారనేది గమనించారు. ఈ అంతరాన్ని పరిష్కరించేలా బిహార్ జైళ్లలోని అమానవీయ పరిస్థితులను సవాలు చేస్తూ అండర్ ట్రయల్ ఖైదీల తరుపును హింగోరాణి తొలిసారిగా ఈ 'పిల్'ని దాఖలు చేశారు. ఇది హుస్సేనారా ఖాటూన్ కేసుగా భారతీయ న్యాయ చరిత్రలో ఓ మలుపు తిరిగింది. ఆ తర్వాత ఆ 'పిల్' కాస్తా సామాజిక న్యాయం కోసం ఒక శక్తిమంతమైన సాధనంగా అవతరించింది. ఇది ఎందరో అభాగ్యులకు వరమై చట్టపరమైన పరిహారం పొందేలా చేసింది. క్రమంగా ఆ పిల్ న్యాయవ్యవస్థలో కీలక మూలస్థంభంగా మారిపోయింది. ఈ పిల్‌తోనే ఎన్నో సమస్యలను పరిష్కరించారు హింగోరాణి. ఈ 'పిల్'తో వాదించిన కేసులు మహిళల హక్కులు: లింగ సమానత్వం కోసం పోరాడారు. అలాగే వరకట్నం వంటి వివక్షాపూరిత పద్ధతులకు వ్యతిరేకంగా ప్రచారం కూడా చేశారు. పర్యావరణ పరిరక్షణ: ఆమె కాలుష్యనికి కారణమయ్యే పరిశ్రమలను సవాలు చేస్తూ..సహజ వనరుల పరిరక్షణ కోసం వాదించింది. జైలు సంస్కరణలు: ఆమె ఖైదీల హక్కులు, జైలు పరిస్థితుల కోసం కూడా వాదించారు శిశు సంక్షేమం: ఆమె బాలల రక్షణ కోసం పోరాడటమే గాక బాల కార్మిక పద్ధతులను సవాలు చేశారు. సమాచార హక్కు: ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకత, జవాబుదారీతనం కోసం వాదించారు. తమ గోడును చెప్పుకోలేక, న్యాయం పొందలేని బలహీన వర్గాల వారికి హింగోరాణి శక్తిమంతమైన గొంతుగా మారారు. ఆమె అవిశ్రాంతంగా న్యాయం కోసం నిబద్ధతగా నిలిబడి సాగించిన కృషిని భారత ప్రభుత్వం గుర్తించి అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్‌తో సంత్కరించి ప్రశంసించింది. హింగోరాణి కథ సమాజంలో తెచ్చే శక్తిమంతమైన మార్పుకి నిదర్శనం. అంతేగాదు న్యాయం కోసం ఎలా నిబద్ధతగా వ్యవహరించి పోరాడాలో అనేందుకు కూడా ఆమె ఒక ప్రేరణ. (చదవండి: ఎవరీ సోమా మండల్? ఆమె వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్‌గా..! -
బీబీసీపై రూ.10 వేల కోట్ల పరువు నష్టం కేసు
న్యూఢిల్లీ: ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్’ పేరుతో డాక్యుమెంట్ రూపొందించిన బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్(బీబీసీ)పై ఓ ప్రభుత్వేతర సంస్థ ఢిల్లీ హైకోర్టులో రూ.10 వేల కోట్ల పరువు నష్టం దావా వేసింది. ఈ డాక్యుమెంట్లో ప్రధాని మోదీ, భారత న్యాయవ్యవస్థపై తప్పుడు ఆరోపణలతో బీబీసీ భారత ప్రభుత్వం, గుజరాత్ ప్రభుత్వాల ప్రతిష్టను దెబ్బతీసిందని ఆరోపించింది. గుజరాత్‌కు చెందిన జస్టిస్ ఆన్ ట్రయల్ అనే సంస్థ వేసిన పిటిషన్‌పై సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది. బీబీసీ (యూకే)తోపాటు బీబీసీ(ఇండియా)కు సమన్లు ఇచ్చింది. సెప్టెంబర్ 25న తదుపరి విచారణ చేపడతామని తెలిపింది. పిటిషన్‌దారు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. నష్ట పరిహారంతోపాటు తమ సంస్థకు ఇతర ఆదాయ మార్గాలు లేనందున కోర్టు ఫీజులు తదితరాల కోసం రూ.10 వేల కోట్లు చెల్లించాలని కోరారు. -
ప్రజాస్వామ్యం పతనం కాకుండా...
భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు దారుణంగా పతనమయ్యాయని స్వీడన్ యూనివర్సిటీ అనుబంధ సంస్థ ‘వి–డెమ్’ వెల్లడించింది. పాత్రికేయుల మీద వేధింపుల సంఖ్య పెరిగిందని కూడా నమోదు చేసింది. పారిశుద్ధ్య కార్మికులకు సరైన రక్షణ కవచాలు లేక వారు ప్రాణాలు విడుస్తున్న ఉదాహరణలను చూస్తూనే వున్నాం. విష వాయు మాళిగల్లోకి వారిని ‘తోసి’ ప్రాణాలు తీసే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా చూడం. ఇలాంటి పరిస్థితుల్లో పండుగలు, పబ్బాలు కూడా పేద వర్గాల జీవితాల్లో నామమాత్రం అయిపోయాయి. ఇన్ని సమస్యలు దేశంలో ఉండగా, పాలక వ్యవస్థను ప్రజావసరాలు తీర్చడానికి వినియోగించేందుకు నడుం బిగించడం మానేసి న్యాయ వ్యవస్థను తటస్థం చేసేందుకు పాలక పక్షం యత్నిస్తోంది. ‘‘2014 తర్వాత భారతదేశంలో ప్రజా స్వామ్య విలువలు దారుణంగా పతనమై నాయి. ఈ పతన దశ 1975 నాటి ఎమర్జెన్సీ కాలం పరిస్థితుల స్థాయికి 2022లో చేరుకుంది. 2014–2022 మధ్య కాలంలో ఇండియాలో ప్రజాస్వామ్య విలువల పతనం గ్రీస్, బ్రెజిల్, పోలెండ్, ఫిలిప్పీన్స్లలో పతన దశకు సమాన స్థాయిలో నమోదయింది.’’ – అమలులో ఉన్న వివిధ రకాల ప్రజాస్వామ్యాల గురించి గోథెన్బర్గ్ నగరంలోని స్వీడన్ యూనివర్సిటీ అనుబంధ సంస్థ ‘వెరైటీస్ ఆఫ్ డెమోక్రసీ’ (క్లుప్తంగా వి–డెమ్) పరిశోధనలో ఈ సత్యాలు వెల్లడ య్యాయి. ‘హిందూ’ పత్రిక ‘డేటా పాయింట్’ విశ్లేషకుడు విఘ్నేశ్ రాధా కృష్ణన్ ఈ వివరాలను పొందుపరిచారు. (20 మార్చ్ 2023) ఈ వెల్లడి ఇలా ఉన్న సమయంలోనే బీజేపీ ప్రభుత్వ న్యాయశాఖా మంత్రి కిరణ్ రిజిజు ఒక ప్రకటన చేస్తూ (19 మార్చ్ 2023)– భారతదేశంలో కొందరు రిటైర్డ్ (విశ్రాంత) న్యాయమూర్తులు భారత వ్యతిరేక ముఠాతో చేతులు కలిపి పనిచేస్తున్నారనీ, వీరు భారత న్యాయ వ్యవస్థ ప్రతిపక్ష పార్టీ పాత్ర వహించాలని చూస్తున్నారనీ ఆరోపించారు. ఇది చెల్లుబాటు కాదని కూడా అన్నారు. ‘ఇది మంత్రి బెదిరింపు’ అని కాంగ్రెస్ నాయకుడు జైరామ్ రమేశ్ ఖండించారు! ఆట్టే చూస్తుంటే ఈ పరస్పర ఆరోపణలు, ప్రత్యారోపణల తంతు ఎలా ఉందంటే, ‘అభిరుచి భేదాల’ గురించి రష్యన్ మహాకవి మయ కోవస్కీ చెప్పిన వ్యంగ్య రచన గుర్తుకొస్తోంది: వెనకటికొక ‘‘గుర్రం ఒంటె వైపు చూపు సారించి అరిచింది, ఛీ! ఇది సంకర జాతికి చెందిన గుర్రం’ అని. ఒంటె (తాను మాత్రం తక్కువ తిన్నానా అనుకుని) అన్నది కదా ‘నువ్వు గుర్రానివి కావు చిన్న సైజు ఒంటెవి అంతే అనుకో’ అని! కానీ అసలు సంగతి ఆ దేవునికే తెలుసు! విశాల నక్షత్ర వీధుల్లో ఆ విశ్వ ప్రభువుకి, ఈ రెండూ రెండు విభిన్న జాతులకి చెందిన మృగాలని తెలుసు’’! భారత లౌకిక రాజ్యాంగం గుర్తించి రూపొందించిన వాక్, సభా స్వాతంత్య్రం లాంటి ప్రాథమిక హక్కులను నర్మగర్భంగా అణచివేసే పద్ధతుల్ని ఏ పాలకులు అనుసరిస్తున్నా, కనీస ప్రజాస్వామ్య విలు వల్ని రకరకాల ‘మిష’ చాటు చేసుకుని గౌరవించని దశలోనే ఇలా ‘అభిరుచిలో భేదాలు’ బాహాటంగా చోటు చేసుకుంటాయని మరచి పోరాదు! అంతేగాదు, 2014–2022 మధ్య కాలంలో దేశంలో పెక్కు మంది పాత్రికేయుల మీద వేధింపుల సంఖ్య కూడా పెరిగిందని ‘వి–డెమ్’ సంస్థ నమోదు చేసింది. పశువులకు మేత లేక తిండి కరవుతో చస్తున్నా, ‘మతం’ పేరిట ముస్లిం యువకుల్నీ, వారి కుటుంబాలనూ వేధిస్తున్న ఘటనలకు అసాధారణ చొరవ చూపారు ఉత్తర ప్రదేశ్ పాలకులు. ‘గోరక్షణ’ పేరిట పలుచోట్ల జరిగిన దారుణమైన దాడులు సామాజిక అశాంతికి దారి తీశాయి. ఇలాంటి ఎన్నో ఘటన లను ‘హిందూ’ పత్రిక అనుబంధ విశిష్ట పక్ష పత్రిక ‘ఫ్రంట్‌లైన్’ (మార్చి 10, 2023) నమోదు చేసింది. ఇదిలా ఉండగా– చివరికి పారిశుద్ధ్య కార్మికులకు సరైన రక్షణ కవచాలు లేక అనేక సీవేజ్ గుంటల్లో ప్రాణాలు విడుస్తున్న ఉదా హరణలను పేర్కొంటూ సుప్రీంకోర్టు చలించిపోయింది. దుర్గంధపూరిత విష వాయువుల మధ్య చనిపోతున్న పారిశుధ్య కార్మికుల పరిస్థితులను ప్రస్తావించి, ఇలా ‘విష వాయు మాళిగ (గ్యాస్చాంబర్స్)ల్లోకి తోసి ప్రాణాలు తీసే పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా చూడ బోమని’ (2019లో) వ్యాఖ్యానించింది! పారిశుద్ధ్య కార్మికుల ఉద్యమ నాయకుడు బెజవాడ విల్సన్ దేశంలో వీరి పరిస్థితి ఎందుకు మెరుగవటం లేదో కారణాలు వివరంగా పేర్కొన్నారు: ‘‘కుల వ్యవస్థ దేశంలో బలంగా ఉన్నందున, ఈ కార్మికుల ఆరోగ్య పరిస్థితుల్ని పట్టించుకోవడం లేదు. పాలకులు రాజ్యాంగ విధుల్ని పాటించడం మానేశారు. దేశంలో ప్రతి మూడవ రోజున ఒక పారిశుద్ధ్య కార్మికుడు చనిపోతున్నాడు. అయినా వారి రక్షణ గురించిన పల్లెత్తు హామీ లేదు.’ (ఫ్రంట్‌లైన్, 10 మార్చ్ 2023)ఇలాంటి పరిస్థితుల్లో చివరికి పండుగలు, పబ్బాలు కూడా పేద వర్గాల జీవితాల్లో నామ మాత్రం అయిపోయాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి ఇలాంటి దీన పరిస్థితుల్ని తలచుకున్నప్పుడల్లా ‘మాకు గాదులు లేవు, ఉగాదులు లేవ’ని పలుమార్లు ఎత్తిపొడుస్తూ వచ్చాడు. చివరికి ‘ఎంత పెద్ద పండుగ’ వచ్చినా పేదసాదలు యథాలాపంగా జరుపుకోవడమేగానీ, వారి బతుకుల్లో నిజమైన వెలుగులు చూడలేక పోతున్నాం! అందుకే శ్రీశ్రీ కూడా ‘పండుగెవరికి? పబ్బమెవరికి?’ అన్న పాటలో సమాధానాలు లేని ప్రశ్నల వర్షం కురిపించాల్సి వచ్చింది: ‘‘పెద్ద పండుగ, పెద్ద పండుగ, పేరు దండగ! పండుగెవరికి, పబ్బమెవరికి? తిండి లేక, దిక్కు లేక దేవులాడే దీన జనులకు పండుగెక్కడ! పబ్బమెక్కడ? ఎండు డొక్కల పుండు రెక్కల బండ బతుకుల బానిసీండ్రకు పండుగేమిటి? పబ్బమేమిటి? ఉండటానికి గూడు లేకా ఎండవానల దేబిరించే హీన జనులకు పేద నరులకు పండుగొకటా? పబ్బమొకటా?’’ ఇన్ని ఈతిబాధలు పేద వర్గాలను నిత్యం వెంటాడుతుండగా– పాలక వ్యవస్థను ప్రజావసరాలు తీర్చడానికి వినియోగించేందుకు నడుం బిగించడం మానేసి న్యాయ వ్యవస్థను తటస్థం చేసేందుకు పాలక పక్షం యత్నిస్తోంది. అఖిల పక్ష– పాలక వర్గ, ప్రతిపక్ష, న్యాయ వ్యవస్థ ప్రతినిధులతో సమాన ఫాయాలో ఏర్పడే క్రియాశీల సంస్థ ఉంటేనే వివక్షకు తావుండదని న్యాయ వ్యవస్థ భావించింది. ఇది ఆచరణలోకి వస్తే పాలక వర్గ ఏకపక్ష నిర్ణయాలూ, ఆటలూ సాగవు. అలాంటి పరిణామానికి ప్రస్తుత క్రియాశీల అత్యున్నత ధర్మాసనం సానుకూలం. కేంద్రం ప్రతికూలం. ఈ వైరుధ్యం, రాజ్యాంగం ఉభయ శాఖలకు నిర్దేశించిన పరిధుల్ని గౌరవించి వ్యవహరించినంత కాలం తలెత్తదు. ఇప్పుడా పరిధిని పాలకులు అతిక్రమించడానికి ఘడియలు లెక్కపెడుతూ కూర్చున్నందుననే ప్రజలకు సమస్యలు ఎదురవుతున్నాయి! ప్రస్తుత పాలకవర్గానికి అసలు భయమంతా – 2024 జనరల్ ఎన్నికల వరకే గాక ఆ తరువాత కూడా ప్రస్తుత క్రియాశీల ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ మరికొంత కాలం పదవిలో ఉండ బోవడమే! ప్రస్తుతం కిరణ్ రిజిజు మనోవేదనంతా సుప్రీం చుట్టూనే తిరుగుతోంది! ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లకు అవకాశం లేదు
న్యూఢిల్లీ: ప్రస్తుతమున్న విధానం, నిబంధనల ప్రకారం భారత న్యాయవ్యవస్థలో రిజర్వేషన్లకు అవకాశం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు చెప్పారు. కానీ, జడ్జీల నియామక ప్రతిపాదనల సమయంలో సరైన ప్రాతినిధ్యం లేని మహిళలు, బీసీలు, ఇతర వర్గాలకు చెందిన వారి విషయం దృష్టిలో ఉంచుకోవాలని జడ్జీలు, ముఖ్యంగా కొలీజియం సభ్యులకు తెలిపినట్లు ఆయన వెల్లడించారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో డీఎంకే నేత తిరుచి శివ అడిగిన ఒక ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నాటికి దేశంలోని 25 హైకోర్టుల్లో సుమారు 60 లక్షల కేసులు, సుప్రీంకోర్టులో 69 వేల కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు మరో ప్రశ్నకు సమాధానంగా మంత్రి వెల్లడించారు. ఇందులో, అలహాబాద్ హైకోర్టులో అత్యధికంగా 10.30 లక్షల కేసులు, సిక్కిం హైకోర్టులో అత్యల్పంగా 171 కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతే పరమావధి
న్యాయవ్యవస్థకూ, కేంద్ర ప్రభుత్వానికీ మధ్య జరుగుతున్న చారిత్రక ఘర్షణ ఫలితంగా న్యాయవ్యవస్థ సామర్థ్యం క్షీణిస్తోంది. ప్రజాస్వామ్య ఆరోగ్యం కోసం న్యాయవ్యవస్థ స్వతంత్రత కొనసాగాలి. న్యాయవ్యవస్థ రాజకీయ భావజాలానికీ, ప్రజా ఒత్తిడికీ దూరంగా ఉండాలి. దాన్ని ప్రభుత్వ శాఖల నుంచి స్వతంత్రంగా ఉండేలా ప్రోత్సహించాలి. దీనికోసం న్యాయమూర్తులను నియమించే విశ్వసనీయ, పక్షపాత రహిత వ్యవస్థ అవసరం. కొలీజియం వ్యవస్థను కొనసాగిస్తూనే, జడ్జీలను నియమించే అధికారాన్ని కార్యనిర్వాహక వ్యవస్థకు ఇస్తూనే న్యాయమూర్తులను సిఫారసు చేయడానికి ఒక సెక్రటేరియట్‌ను బలోపేతం చేయవచ్చు. ప్రస్తుత న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయ శాఖ, సామాన్యులు ఇందులో ప్రతినిధులుగా ఉండొచ్చు. కేరళలోని ఎడ్నీర్ మఠం ఆస్తుల నిర్వహణ విషయంలో మఠంపై నిబంధనలు విధించడా నికి ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను సవాలు చేస్తూ మఠాధి పతి స్వామి కేశవానంద భారతి 1970 ఫిబ్రవరిలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 20 కింద సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. మూడేళ్ల తర్వాత సుప్రీంకోర్టు 7–6 మెజారిటీతో రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణ సిద్ధాం తాన్ని వివరిస్తూ, రాజ్యాంగ కీలక సూత్రాలను, స్వరూపాన్ని సవ రించడంలో పార్లమెంట్‌కు ఉన్న పరిమితులను నొక్కిచెప్పింది. అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు సుప్రీంకోర్టును కూడా నూతన న్యాయమూర్తుల బృందంతో నింపారు. ఆయన కంటే ముగ్గురు సీనియర్ జడ్జీలను పక్కకునెట్టి ఏఎన్ రాయ్‌ని ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి నియమించారు. కేశవానంద కేసు తీర్పుపై సంతకం చేయని ఆ ఒక్క న్యాయమూర్తి ఈయనే. ఈయన నేతృ త్వంలో 13 మంది న్యాయమూర్తుల బెంచ్ నాటి చారిత్రాత్మక తీర్పును తిరగదోడింది. కేసును రెండు రోజులపాటు విచారించింది. ఈ కేసుపై ఎలాంటి రివ్యూ పిటిషన్‌ని దాఖలు చేయలేదనీ, మౌఖిక అభ్యర్థన ప్రాతిపదికగా తప్పు ప్రక్రియతో ఈ కేసును సమీక్షించారనీ త్వరలోనే గుర్తించారు. దాంతో బెంచ్ మొత్తాన్నీ రద్దు చేయాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి నిబద్ధత చూపే న్యాయవ్యవస్థ ఉన్నప్ప టికీ ఆనాడు రాజ్యాంగ ప్రాథమిక స్వరూపం బతికి బట్టకట్టింది. ఈ చారిత్రాత్మక తీర్పు నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి సమ తుల్యతను కలిగించడంలో తోడ్పడింది. కొంతకాలంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 124 (2), 217 (1)లను వ్యాఖ్యానించడంలో కేంద్రప్రభుత్వానికీ, న్యాయవ్యవస్థకూ మధ్య ఘర్షణ కొనసాగుతోంది. ఆర్టికల్ 124(2) ప్రకారం సుప్రీంకోర్టుకు సంబంధించిన ప్రతి న్యాయమూర్తినీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు (ప్రత్యేకించి చీఫ్ జస్టిస్), రాష్ట్రాల్లోని హైకోర్టు న్యాయమూర్తులతో చర్చించి రాష్ట్రపతి నియమిస్తారు. అదేవిధంగా హైకోర్టు న్యాయ మూర్తులను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో, రాష్ట్ర గవర్నర్‌తో, హైకోర్టు చీఫ్ జస్టిస్‌తో సంప్రదించిన తర్వాత రాష్ట్రపతి నియ మిస్తారని ఆర్టికల్ 217 (1) నొక్కి చెబుతుంది. ఎస్పీ గుప్తా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1981)లో న్యాయపరమైన భాష్యం కానీ, సుప్రీంకోర్టు రికార్డ్ అడ్వకేట్స్ అసోసియేషన్ వర్సెస్ యూని యన్ ఆఫ్ ఇండియా (రెండో జడ్జీల కేసు) (1993) కానీ, అర్టికల్ 143(1) ... వర్సెస్ అనామక (మూడో జడ్జీల అభిప్రాయం) (1998) వంటివి కానీ... న్యాయమూర్తుల స్వాతంత్య్ర సూత్రాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయాయి. న్యాయమూర్తులను సిఫారసు చేసే కొలీజియం వ్యవస్థకు దారి తీశాయి. ప్రస్తుతం, కేంద్ర ప్రభుత్వం కొలీజియం వ్యవస్థ సిఫార్సులను ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు– కానీ కొలీజియం రెండో సారి కూడా ఆ సిఫార్సులను చేస్తే ప్రభుత్వం తప్పకుండా ఆమోదించాల్సి ఉంటుంది. ఇటీవలే ఈ ఏకాభిప్రాయం స్తంభనకు దారి తీసింది. నవంబర్ 12న కొలీజియం తిరిగి సిఫార్సు చేసిన ప్రతి పాదనలను కేంద్రం నిలిపివుంచింది. దీంతో సెకండ్ జడ్జీల కేసులో విధించిన కాలక్రమాన్ని పాటించనందుకు సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసింది. ఖాళీలను పూరించడానికి నిర్దిష్ట సమయాన్ని సూచించ నందుకు న్యాయ శాఖ పట్ల న్యాయ, పర్సనల్ వ్యవహారాలపై స్టాండింగ్ పార్లమెంటరీ కమిటీ కూడా తన అసంతృప్తిని వెళ్లగక్కింది. స్వతంత్ర న్యాయవ్యవస్థకూ, మితిమీరి వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికీ మధ్య జరుగుతున్న ఈ చారిత్రక ఘర్షణ ఫలితంగా భారత న్యాయవ్యవస్థ సామర్థ్యం క్షీణిస్తోంది. 2022 ఆగస్టులో సుప్రీం కోర్టులో మొత్తం 34కి గానూ 3 ఖాళీలు, హైకోర్టుల్లో 1,108 ఖాళీలకు గానూ 381, దిగువ కోర్టుల్లో 24,631 జడ్జీ పదవులకుగానూ 5,342 ఖాళీలు ఉన్నాయి. అంటే 20 శాతం మేర ఖాళీలు ఉన్నాయి. బాంబే, పంజాబ్–హరియాణా, కలకత్తా, పట్నా, రాజస్థాన్ హైకోర్టుల్లో ఇలాంటి ఖాళీలు న్యాయవ్యవస్థ సామర్థ్యంపై ప్రభావం చూపుతాయి. (2022 ఆగస్టు నాటికి నాలుగు కోట్ల కేసులు పెండింగులో ఉన్నాయి). న్యాయవ్యవస్థలో సంస్కరణలు దీర్ఘకాలం పెండింగులో ఉండటం నిజమే కావచ్చు. రాజకీయ సంస్థల చేత జడ్జీల నియామ కాలు జరుగుతున్న దేశాలను చూడండి. ఇటలీలో రాజ్యాంగబద్ధ న్యాయస్థానం నియామకాలకు అధ్యక్షుడు, లెజిస్లేచర్, సుప్రీంకోర్టు ఇలా ప్రతి సంస్థా అయిదుగురు జడ్జీలను నామినేట్ చేయడానికి అనుమతిస్తారు. అమెరికాలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులను శాశ్వత ప్రాతిపదికన అధ్యక్షుడు నామినేట్ చేస్తారు. తర్వాత సెనేట్ మెజారిటీ ద్వారా ఆమోదిస్తుంది. సహజంగానే ఇది పక్షపాత న్యాయవ్యవస్థకు దారితీస్తుంది. న్యాయవ్యవస్థ పారదర్శకతను మెరుగుపర్చడానికి న్యాయమూర్తుల ఎన్నికలు కూడా ఉపయోగపడతాయి. అమెరికా లోని అనేక రాష్ట్రాలు రాష్ట్ర సుప్రీంకోర్టుల న్యాయ నియామకాల కోసం ఎన్నికలను ఉపయోగించుకుంటున్నాయి. అయితే ఇవి ప్రజా కర్షక తీర్పులు ఇచ్చేలా న్యాయమూర్తులను ప్రోత్సహిస్తాయి. సంకీర్ణ ప్రభుత్వ ధోరణి కలిగిన ఏ ప్రజాస్వామ్యానికైనా ఇది మంచిది కాదు. ఇతర దేశాలు న్యాయ కౌన్సిల్స్‌తో ప్రయోగాలు చేస్తాయి. ఇరాక్‌లో జడ్జీలందరూ ఒక న్యాయ సంస్థలో పట్టభద్రులై ఉంటారు. దరఖాస్తుదారులందరూ రాత, మౌఖిక పరీక్షల్లో పాల్గొంటారు. జడ్జీల ప్యానెల్‌తో ఇంటర్వ్యూలో పాల్గొంటారు. జపాన్‌లో సుప్రీంకోర్టు సెక్రటేరియట్ శిక్షణ, ప్రమోషన్లతోపాటు దిగువ స్థాయి న్యాయ నియామకాలను నియంత్రిస్తుంటుంది. ఇటీవలే, కేంద్రప్రభుత్వం న్యాయ కమిషన్ ద్వారా న్యాయమూర్తుల నియామకాలు చేపట్టాలని ప్రతిపాదించింది (జాతీయ న్యాయమూర్తుల నియామకాల కమిషన్ బిల్లు, 2014). 2015 అక్టోబర్ 16న దీన్ని 4–1 మెజారిటీతో సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. అయితే కొలీజియం వ్యవస్థలో మరింత పారదర్శకతను కల్పించడాన్ని సుప్రీంకోర్టు నొక్కిచెప్పింది. అదే సమయంలో న్యాయమూర్తుల నియామకానికి సాధికారిక సెక్రటేరి యట్ అవసరమా ఆనే అంశంపై చర్చపెట్టింది. దీనిపై తదుపరి సంస్కరణలు చేయవచ్చు. కొలీజియం వ్యవస్థ కొనసాగుతుంది; నియమించే అధికారాన్ని కార్యనిర్వాహక వ్యవస్థకు కొనసాగిస్తూనే అభ్యర్థులను సిఫారసు చేయడానికి ఒక సెక్రటేరియట్‌ను బలోపేతం చేయవచ్చు. దీన్ని ప్రస్తుత న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయ మంత్రిత్వ శాఖ, సామాన్యుల ప్రతినిధుల నుంచి నియమించవచ్చు. ఇది న్యాయ వ్యవస్థలో మన సమాజానికి గొప్ప ప్రాతినిధ్యాన్ని కల్పిస్తుంది. 2022 డిసెంబర్ నాటికి, సుప్రీంకోర్టులో ముగ్గురు మహిళలు, ఇద్దరు ఎస్సీ జడ్జీలు మాత్రమే ఉన్నారు. న్యాయమూర్తుల నియామకాలకు అవతల, ఒక కొత్త అప్పీల్ కోర్టు ఉండాల్సిన అవసరం ఉంది. హైకోర్టుల్లో తీర్పులకు వ్యతిరే కంగా రెగ్యులర్ అప్పీల్ కోర్టుగా ఉండాలనే ఉద్దేశం సుప్రీంకోర్టుకు ఎన్నడూ లేదు. సుప్రీంకోర్టు బెయిల్ అప్లికేషన్లను వినకూడదు. దానికి బదులుగా లా కమిషన్ సిఫార్సు చేసినట్లుగా, ప్రముఖ మెట్రో నగ రాల్లో బ్రాంచ్‌లు ఉన్న ఒక ఫెడరల్ అప్పీల్ కోర్టు ఉండాలి. ఈలోపు, సుప్రీంకోర్టు ఒక రాజ్యాంగ కోర్టు (రాజ్యాంగ సవరణ ద్వారా)లోకి పరివర్తన చెందాలి. ఇలా చేయడమంటే అత్యున్నత స్థాయిలో తక్కువ కేసులు (మాట వరసకు 50) మాత్రమే పెండింగులో ఉండేట్టు చూడటం! ఏ స్థాయిలో అయినా జడ్జీలందరికీ కచ్చితమైన రిటైర్మెంట్ వయసు (65 ఏళ్లు) విధించాలి. రిటైర్మెంట్ తర్వాత, ప్రభుత్వంలో పోస్టులకు నామినేట్ చేయడానికి నిర్దిష్టమైన గడువును విధించాలి. భారతీయ ప్రజాస్వామ్య ఆరోగ్యం కోసం న్యాయవ్యవస్థ స్వతంత్రత అవశ్యం. దీన్ని సాధించడానికి న్యాయమూర్తులను నియ మించే విశ్వసనీయమైన, పక్షపాత రహితమైన వ్యవస్థ అవసరం. వ్యక్తి స్థాయిలో, వ్యవస్థ స్థాయిలో న్యాయవ్యవస్థను ప్రభుత్వ శాఖల నుంచి స్వతంత్రంగా ఉండేలా ప్రోత్సహించాల్సి ఉంది. ఫిరోజ్ వరుణ్ గాంధీ వ్యాసకర్త లోక్‌సభలో బీజేపీ ఎంపీ (‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ సౌజన్యంతో -
Constitution Day: ప్రజల చెంతకు కోర్టులు: సీజేఐ
వ్యాజ్యప్రక్రియను మరింత సులభతరం చేసి ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దాల్సిన అవసరం చాలా ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు. ‘‘అపార వైవిధ్యానికి నిలయమైన భారత్ వంటి అతి పెద్ద దేశంలో న్యాయమందించే వ్యవస్థ ప్రతి పౌరునికీ అందుబాటులో ఉండేలా చూడటమే అతి పెద్ద సవాలు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన వ్యవస్థాగతమైన సంస్కరణలు చేపట్టడంతో పాటు అధునాతన టెక్నాలజీని మరింతగా వాడుకోవాలి. న్యాయం కోసం ప్రజలు కోర్టు మెట్లెక్కడం కాదు, కోర్టులే వారి చెంతకు చేరే రోజు రావాలి. ఈ దిశగా టెక్నాలజీని న్యాయవ్యవస్థ మరింతగా అందిపుచ్చుకుంటోంది. తద్వారా పనితీరును మరింతగా మెరుగు పరుచుకునేలా కోర్టులను తీర్చిదిద్దుతున్నాం’’ అని వివరించారు. ప్రధాని ప్రారంభించిన ఇ–సైట్లే అందుకు నిదర్శనమన్నారు. ‘‘ఉదాహరణకు నేషనల్ జ్యుడీషియల్ డేటా గ్రిడ్‌లోని సమాచారం వర్చువల్ జస్టిస్ క్లాక్ ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. జస్ట్‌ఈజ్ మొబైల్ యాప్ 2.0 ద్వారా జిల్లా జడ్జిలు తమ కోర్టుల్లో పెండింగ్ కేసులు తదితరాలన్నింటినీ నిరంతరం మొబైల్లో పర్యవేక్షించగలరు’’ అని చెప్పారు. హైబ్రిడ్ విధానం ద్వారా సుప్రీంకోర్టు విచారణలో లాయర్లు దేశంలో ఎక్కడినుంచైనా పాల్గొంటున్నారని గుర్తు చేశారు. జడ్జిలపై గురుతర బాధ్యత ప్రజలందరికీ స్వేచ్ఛ, న్యాయం, సమానత్వాలు అందేలా చూడాలన్న రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పని చేయాల్సిన బాధ్యత జిల్లా జడ్జి నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి దాకా అందరిపైనా ఉందని సీజేఐ అన్నారు. ‘‘ఇది జరగాలంటే న్యాయమూర్తులమంతా మన పనితీరును, మనలో పాతుకుపోయిన దురభిప్రాయాలు, తప్పుడు భావజాలాలను ఎప్పటికప్పుడు ఆత్మశోధన చేసుకుంటుండాలి. భిన్న నేపథ్యాల వ్యక్తుల జీవితానుభవాలకు సంబంధించిన భిన్న దృక్కోణాలను అర్థం చేసుకోనిదే మన పాత్రను సమర్థంగా నిర్వహించలేం’’ అన్నారు. జిల్లా న్యాయ వ్యవస్థది కీలకపాత్ర న్యాయం కోసం ప్రజలు తొలుత ఆశ్రయించేది జిల్లా న్యాయవ్యవస్థనేనని సీజేఐ గుర్తు చేశారు. ‘‘అందుకే ఆ వ్యవస్థను బలోపేతం చేయడం, అవసరమైన అన్నిరకాల సాయమూ అందించడం అత్యవసరం. ఉన్నత న్యాయవ్యవస్థకు మితిమీరిన విధేయత చూపే భావజాలం నుంచి జిల్లా న్యాయవ్యవస్థను బయటికి తేవడం చాలా అవసరం’’ అని అభిప్రాయపడ్డారు. ‘‘భిన్న రంగాల వ్యక్తుల తాలూకు అనుభవాన్ని ఒడిసిపట్టి న్యాయవ్యవస్థలో భాగంగా మార్చడం చాలా ముఖ్యం. ఇందుకోసం న్యాయ వృత్తిలో అణగారిన వర్గాలు, మహిళల ప్రాతినిధ్యం మరింత పెరిగేలా చూడటం చాలా అవసరం’’ అని సూచించారు. -
న్యాయవ్యవస్థలో పురుషాధిక్యత
న్యూఢిల్లీ: భారతీయ న్యాయవ్యవస్థలో తొలినుంచీ పురుషాధిక్యత వేళ్లూనుకొని ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశంలో న్యాయ వృత్తి ఫ్యూడల్, పితృస్వామ్య తరహాతో, మహిళలను సముచిత వాటా కల్పించని స్వభావంతో కూడుకున్నదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఢిల్లీలో హిందుస్తాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్‌లో ఆయన మాట్లాడారు. మహిళలు, సమాజంలోని అణగారిన వర్గాల వారు న్యాయపాలికలోకి మరింత పెద్ద సంఖ్యలో ప్రవేశించాలని అభిప్రాయపడ్డారు. అందుకు వీలుగా మొత్తం న్యాయ వ్యవస్థను మరింత ప్రజాస్వామ్యయుతంగా, ప్రతిభాధారితంగా మార్చాల్సిన అవసరం చాలా ఉందంటూ కుండబద్దలు కొట్టారు. ‘‘ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. న్యాయ వ్యవస్థకు మానవ వనరులను అందించేందుకు మనకు ఒక నిర్ధారిత వ్యవస్థ ఉంది. దాని నిర్మాణం ఇప్పటికీ ఫ్యూడల్, పితృస్వామ్య పోకడలతోనే నిండి ఉందన్నది వాస్తవం. పురుషాధిక్యత మన న్యాయవ్యవస్థ స్వరూపంలోనే గూడుకట్టుకుపోయింది. సీనియర్ లాయర్లున్న ఏ చాంబర్లోకి వెళ్లినా అక్కడ మొత్తం పురుషులే కనిపిస్తారు. మార్పు అక్కడి నుంచే రావాలి. మహిళలు, అణగారిన వర్గాలకు చెందిన ప్రతిభావంతులకు ఆ చాంబర్లలో చోటు దక్కాలి. అప్పుడు గానీ న్యాయపాలికలో వారి సంఖ్య పెరగదు! మహిళా న్యాయవాదులు, న్యాయమూర్తుల ద్వారానే భవిష్యత్తులో మెరుగైన న్యాయవ్యవస్థను నిర్మించుకోగలం’’ అన్నారు. ‘‘నేడు న్యాయవ్యవస్థ ముందు ఎన్నో సవాళ్లున్నాయి. వాటిలో మొట్టమొదటిది, అతి ముఖ్యమైనది సుప్రీంకోర్టుపై ప్రజలు పెట్టుకున్న ఆశలు. ఎందుకంటే ప్రతి సామాజిక, న్యాయపరమైన అంశమూ, రాజకీయ అంశమూ సుప్రీంకోర్టు న్యాయ పరిధిలోకి వచ్చేవే’’ అని చెప్పారు. న్యాయమూర్తులకు ఆ నేర్పుండాలి చట్టం అణచివేతకు సాధనంగా కాక న్యాయమందించే సాధనంగా ఉండాలని సీజేఐ అభిప్రాయపడ్డారు. ఆ బాధ్యత పాలకులదే తప్ప న్యాయమూర్తులది కాదని స్పష్టం చేశారు. ‘‘మాపై ప్రజలకు ఎన్నో ఆశలు, అంచనాలున్నాయి. కానీ కోర్టుల పరిమితులను కూడా అర్థం చేసుకోవాలి. ‘‘చట్టాలు, న్యాయం కొన్నిసార్లు ఒకే సరళరేఖపై వెళ్లకపోవచ్చు. కానీ చట్టాలున్నది అంతిమంగా న్యాయ వితరణకే. వాటిని అణచివేతకు దుర్వినియోగం చేయొద్దు’ అని సీజేఐ అన్నారు. ‘‘దీర్ఘకాలంలో న్యాయవ్యవస్థను నిలబెట్టేది దయా భావన, సహానుభూతితో ప్రజల వేదనను పోగొట్టగలిగిన సామర్థ్యం మాత్రమే. ఎవరూ పట్టించుకోని అణగారిన వర్గాల ఆక్రందన వినగలిగి, వారి బాధలను చూడగలిగి చట్టాన్ని, న్యాయాన్ని నేర్పుగా బ్యాలెన్స్ చేయగలిగిన నాడు న్యాయమూర్తిగా బాధ్యతలను సరిగా నిర్వర్తించినట్టు లెక్క’’ అన్నారు అమెరికాతో పోలికేల...? మన సుప్రీంకోర్టును అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల అత్యున్నత న్యాయస్థానాలతో పోల్చడం సరికాదని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘‘అమెరికా సుప్రీంకోర్టు ఏడాదంతా కలిపి మహా అయితే 180 పై చిలుకు కేసులు పరిష్కరిస్తుంది. బ్రిటన్‌లోనైతే 85 కేసులు దాటవు! కానీ మన సుప్రీంకోర్టులో ప్రతి న్యాయమూర్తీ సోమ, శుక్రవారాల్లో 75 నుంచి 80 కేసుల దాకా ఆలకిస్తారు. మంగళ, బుధ, గురువారాల్లో 30 నుంచి 40 దాకా కేసులు చూస్తారు. మన సుప్రీంకోర్టు విస్తృతి అంత సువిశాలమైనది! మేం పరిష్కరించే చాలా ముఖ్యమైన కేసుల్లో కొన్ని వార్తాపత్రికల్లో, సామాజిక మాధ్యమాల్లో కన్పించకపోవచ్చు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కూడా పెన్షన్, భరణం వంటి చిన్నాచితకా కేసులనూ విచారించాల్సిందేనా అంటే, అవునన్నదే నా సమాధానం. ఎందుకంటే ప్రజలకు నిజమైన భరోసా కల్పించగలిగినప్పుడే న్యాయ వ్యవస్థ పరిఢవిల్లుతుంది’’ అన్నారు. మేము మానసికంగా పక్కా యూత్! న్యాయమూర్తులు నల్లకోటుతో పాత, రాచరిక కాలపు వస్త్రధారణలో కన్పించి బోరు కొట్టిస్తుంటారని సీజేఐ అన్నారు. ‘‘మా లుక్స్ జనాలకు బాగా విసుగు పుట్టిస్తాయన్నది నిజమే కావచ్చు. కానీ నిజానికి మానసికంగా మాత్రం మేమంతా నవ యవ్వనంతో ఉరకలేస్తుంటాం’’ అంటూ చమత్కరించారు! ..అందుకే ప్రత్యక్ష ప్రసారాలు రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్యాల్లో ఒక్కోసారి పారదర్శకత లేమి పెద్ద ప్రమాదంగా మారుతుందని సీజేఐ అభిప్రాయపడ్డారు. దానికి అడ్డుకట్ట వేసేందుకే సుప్రీంకోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారానికి తెర తీసినట్టు చెప్పారు. తద్వారా న్యాయపాలికలో ఏం జరుగుతోందనే పౌరులు తెలుసుకునే అవకాశం దక్కడమే గాక న్యాయవ్యవస్థ మరింత జవాబుదారీతనంతో వ్యవహరించేందుకు వీలు కలుగుతుందన్నారు. ‘‘కోర్టు విచారణల ప్రత్యక్ష ప్రసారాలు మేం చేపట్టిన ఓ నూతన ప్రయోగం. న్యాయవ్యవస్థను ప్రజలకు మరింత చేరువ చేయడంలో టెక్నాలజీ ఎంత పాత్ర పోషించగలదో దీని ద్వారా అర్థమైంది. న్యాయం కోసం సామాన్యుడు తొలుత ఆశ్రయించే జిల్లా కోర్టుల విచారణలనూ ప్రత్యక్ష ప్రసారం చేయాలి’’ అన్నారు. ‘సోషల్’ సవాలుకు తగ్గట్టు అప్డేట్ కావాలి ‘‘కోర్టు గదిలో న్యాయమూర్తులు మాట్లాడే ప్రతి చిన్న మాటనూ రియల్ టైంలో రిపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా పెను సవాలుగా విసురుతోంది. న్యాయమూర్తుల పనితీరు నిత్యం మదింపుకు గురవుతోంది’’ అని సీజేఐ అభిప్రాయపడ్డారు. ‘‘మనమిప్పుడు ఇంటర్నెట్, సోషల్ మీడియా యుగంలో ఉన్నాం. కనుక న్యాయమూర్తులుగా మనల్ని మనం నిత్యం కొత్తగా ఆవిష్కరించుకోవాలి. ఈ కొత్త తరపు సవాళ్లను ఎదుర్కోవడంలో మన పాత్రపై పునరాలోచించుకోవాలి. ఎప్పటికప్పుడు కొత్తగా ఆలోచించాలి’’ అని పిలుపునిచ్చారు. -
శతమానం భారతి: లక్ష్యం 2047
స్వాతంత్య్రానికి పూర్వం భారత్‌లో బ్రిటిష్ న్యాయం ఎలా ఉండిందో తెలిసిందే. భగత్‌సింగ్, సుఖ్‌దేశ్, రాజ్‌గురు, తిలక్, మహాత్మాగాంధీ వంటి స్వాతంత్య్ర సమరయోధుల్ని విచారించి, శిక్షలు విధించడంలోని వివక్షకు ఆనాటి కోర్టులు ప్రతీకలు. స్వాతంత్య్రం వచ్చాక ప్రజాస్వామ్య పాలనలో ఆ దుస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వం, ప్రభుత్వాధీనంలోని సంస్థలు పౌరుల ప్రాణాలను, స్వేచ్ఛను హరించకుండా పరిరక్షించే స్వతంత్య్ర న్యాయ వ్యవస్థ రూపుదిద్దుకుంది. నవ భారత నిర్మాణానికి, ప్రజాస్వామ్య పాలనకు నియమ నిబంధల చట్రం ఏర్పడింది. మన న్యాయ వ్యవస్థ ఎంత స్వతంత్రమైనదంటే.. పాలక పక్షానికి పార్లమెంటులో సంపూర్ణ మెజారిటీ ఉన్నప్పటికీ అది రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విఘాతం కలిగించిన సవరణలను గానీ, మరే ఇతర మార్పు చేర్పులను కానీ చేయకూడదని 1973లో కేశవానంద భారత కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. చదవండి: సామ్రాజ్య భారతి: జననాలు ఏదైనా రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అత్యవసర పరిస్థితి ద్వారా రద్దు చేయాలని గవర్నర్ సిఫారసు చేస్తే దానిపై న్యాయ సమీక్ష జరిపి, గవర్నర్ నిర్ణయంలో సదుద్దేశం లేదని నిర్థారణ అయినట్లయితే బర్తరఫ్ అయిన ప్రభుత్వాన్ని పునరుద్దరించాలని ఎస్.ఆర్.బొమ్మై (1994) కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇక ఎన్నికల్లో పౌరుల ఓటు హక్కు వినియోగంపై న్యాయ వ్యవస్థ కల్పించిన ‘నోటా’ అవకాశం ఒక ప్రజాస్వామ్య సంస్కరణ అనే చెప్పాలి. వచ్చే 25 ఏళ్లల్లో మరిన్ని మెరుగైన మార్పులు రాగలవని ఆశించవచ్చు. -
మధ్యవర్తిత్వంతో న్యాయవ్యవస్థలో మార్పులు
కెవాడియా (గుజరాత్): మధ్యవర్తిత్వంతో పాటు ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారం (ఏడీఆర్) యంత్రాంగాన్ని అమలు చేస్తే భారత న్యాయవ్యవస్థలో సమూల మార్పులు వస్తాయని, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అభిప్రాయపడ్డారు. అయితే ఇందులో ఉండే కొన్ని చిక్కుముళ్ల వల్ల దీనికి విస్తృత స్థాయిలో ఆమోదం ఉండాలన్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కూడా కోర్టు కేసుల పరిష్కారం కోసం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని పేర్కొన్నారు. గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం దగ్గర టెంట్ సిటీలో మధ్యవర్తిత్వం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనే అంశంపై శనివారం జరిగిన సదస్సులో రాష్ట్రపతి కోవింద్, సీజేఐ జస్టిస్ రమణ తదితరులు పాల్గొని ప్రసంగించారు. -
న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల లేమి!
అలహాబాద్: భారతీయ కోర్టులు ఇప్పటికీ అసంపూర్ణ మౌలిక సదుపాయాలతో పనిచేస్తున్నాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రిటి‹Ùపాలన అనంతరం న్యాయవ్యవస్థలో మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం రాజ్యమేలిందన్నారు. పరిష్కారానికే జాతీయ జ్యుడీíÙయల్ ఇన్ఫ్రా కార్పొరేషన్(ఎన్‌జేఐసీ) ఏర్పాటుతోనే ఈసమస్యకు పరిష్కారమని సూచించారు. ఉత్తరప్రదేశ్జాతీయ లా యూనివర్సిటీ, అలహాబాద్ హైకోర్టు నూతన భవన సదుపాయం శంకుస్థాపనలో రాష్ట్రపతితో పాటు ఆయన పాల్గొన్నారు. దేశీయ కోర్టుల్లో మెరుగైన వసతులు లేకపోవడం విచారకరమని, దీనివల్ల న్యాయసిబ్బంది పనితీరుపై ప్రభావం కనిపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి పరిష్కారం ఎన్‌జేఐసీ ఏర్పాటేనని అభిప్రాయపడ్డారు. దేశంలోని జాతీయ ఆస్తుల నిర్మాణ సంస్థలతో కలిసి ఎన్‌జేఐసీ పనిచేస్తుందని, జాతీయ కోర్టు డెవలప్మెంట్ ప్రాజెక్టుకు నమూనాలను అభివృద్ధి చేస్తుందని తెలిపారు. సరైన మౌలికవసతుల కల్పనతో న్యాయం పొందే మార్గం మరింత సుగమం అవుతుందన్నారు. అలహాబాద్ హైకోర్టులో పెండింగ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోవడాన్ని ప్రస్తావిస్తూ, నూతన భవనంతో జ్యుడీషియరీ మరింత చురుగ్గా పనిచేసి పెండింగులను తగ్గిస్తుందని ఆశించారు. తీర్పులను వ్యవహారిక భాషలోకి అనువదించాన్న సూచన రాష్ట్రపతి కోవింద్దేనని ఆయన ప్రశంసించారు. ఆ తీర్పు సాహసోపేతం 1975లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ అలహాబాద్ హైకోర్టు జడ్జి జగ్మోహన్లాల్ సిన్హా ఇచి్చన తీర్పు అత్యంత సాహసోపేతమైనదని సీజేఐ రమణ ప్రశంసించారు. ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఇందిర ఎన్నికను చెల్లకుండా చేసిన ఈ తీర్పు దేశంలో ఒక కుదుపు తెచ్చిందన్నారు. దీనికారణంగానే చివరకు ఇందిర ఎమర్జెన్సీ విధించారని గుర్తు చేశారు. అలహాబాద్ హైకోర్టుకు 150 సంవత్సరాల చరిత్రుందని కొనియాడారు. ఇక్కడనుంచి అనేకమంది గొప్ప న్యాయవాదులు, న్యాయమూర్తులు వచ్చారన్నారు. దీంతో పాటు అలహాబాద్ నగర ప్రాశస్త్యాన్ని కూడా ఆయన ప్రస్తుతించారు. -
న్యాయ వ్యవస్థలో సుపరిపాలన పునాదులు
అహ్మదాబాద్: ప్రజల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షించడంలో భారత న్యాయవ్యవస్థ తనవంతు కర్తవ్యాన్ని భేషుగ్గా నిర్వర్తిస్తోందని, భారత రాజ్యాంగాన్ని ఇది బలోపేతం చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. గుజరాత్ హైకోర్టు డైమండ్ జూబ్లీ వేడుకల్లో మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా పాల్గొన్నారు. కరోనా వైరస్ సంక్షోభంలో భారత న్యాయస్థానాలు ఉత్తమ పనితీరు కనపర్చాయన్నారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రపంచంలోని అన్ని దేశాల కంటే అధికంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణలు చేపట్టిందని ఆయన తెలిపారు. దేశ భవిష్యత్ న్యాయవ్యవస్థ అవసరాల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టు మోదీ చెప్పారు. గుజరాత్ హైకోర్టు వ్యవస్థాపన జరిగిన 60ఏళ్లయిన సందర్భంగా మోదీ తపాలా బిళ్లను విడుదల చేశారు. ప్రత్యక్ష ప్రసారాల ఆరంభం.. కోవిడ్ సందర్భంలో ప్రత్యక్ష ప్రసారాలను మొట్టమొదటిగా ప్రారంభించింది గుజరాత్ హైకోర్టేనని మోదీ చెప్పారు. ‘దేశంలో 18,000 పైగా కోర్టులు కంప్యూటీకరించబడ్డాయి. వీడియో కాన్ఫరెన్సింగ్, టెలీ కాన్ఫరెన్సింగ్‌లకు సుప్రీంకోర్టు అనుమతించడంతో దేశంలోని అన్ని కోర్టుల్లో ఆన్లైన్ విచారణలు సాధ్యమయ్యాయి’ అని మోదీ అన్నారు. డిజిటల్ విభజనను తగ్గించడానికి హైకోర్టులు, జిల్లా కోర్టుల్లో కూడా ఈ సేవా కేంద్రాలను ప్రారంభిస్తున్నట్టు మోదీ చెప్పారు. దేశంలో తొలి లోక్ అదాలత్ గుజరాత్‌లోని జునాగఢలో నాలుగు దశాబ్దాల క్రితం ప్రారంభమైందని మోదీ తెలిపారు. -
న్యాయవ్యవస్థ కృషి అమోఘం
న్యూఢిల్లీ: లింగపరమైన న్యాయం అనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించేందుకు భారత న్యాయవ్యవస్థ చేసిన కృషి అమోఘమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎల్లప్పుడూ సానుకూల, ప్రగతిశీల దృక్పథంతోనే పనిచేసిందని కొనియాడారు. ఢిల్లీలో జరుగుతున్న అంతర్జాతీయ న్యాయ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆదివారం ‘న్యాయవ్యవస్థ –మారుతున్న ప్రపంచం’అంశంపై రాష్ట్రపతి ప్రసంగించారు. ‘లింగపరమైన న్యాయం అనే ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని సాధించడంలో భారత సుప్రీంకోర్టు ఎల్లప్పుడూ చురుకైన, ప్రగతిశీల దృక్పథంతోనే పనిచేసింది. పని చేసే ప్రాంతాల్లో లైంగిక వేధింపుల నుంచి మహిళలకు రక్షణ కల్పించే విశాఖ మార్గదర్శకాలు మొదలుకొని, సైన్యంలో మహిళా అధికారులకు కమాండ్ పోస్టుల్లో నియమించేందుకు ఉద్దేశించిన పర్మినెంట్ కమిషన్ ఏర్పాటు వరకు సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులు దేశాన్ని ప్రగతిశీల సామాజిక పరివర్తన దిశగా తీసుకెళ్తున్నాయి’అని పేర్కొన్నారు. ‘దేశంలో భాషా వైవిధ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులను 9 ప్రాంతీయ భాషల్లో సామాన్యులకు సైతం అందుబాటులోకి తేవడం హర్షణీయం. సామాన్యులకు న్యాయాన్ని సులభతరం చేసేందుకు సుప్రీంకోర్టు కీలక సంస్కరణలను తెచ్చింది. సుప్రీంకోర్టు వెలువరించిన అత్యంత కీలకమైన తీర్పులు రాజ్యాంగాన్ని, న్యాయవ్యవస్థ మరింత పటిష్టం చేశాయి. న్యాయవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతున్న వివిధ లోపాలను గుర్తించి, సరిచేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం చేపట్టిన నిశ్శబ్ద విప్లవంగా చెప్పుకోవచ్చు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి మధ్య సమతూకం సాధించేందుకు సుప్రీంకోర్టు తీసుకున్న చర్యలు అనేక దేశాల దృష్టిని ఆకర్షించాయి. సమాచార సాంకేతికాభివృద్ధి కారణంగా తలెత్తిన సమాచార పరిరక్షణ, గోప్యతా హక్కు వంటి సమస్యలను న్యాయవ్యవస్థ ఎదుర్కోవాల్సి ఉంది’అని పేర్కొన్నారు. ‘లింగపరమైన న్యాయం, రాజ్యాంగ విలువల రక్షణపై సమకాలీన దృక్పథాలు, మారుతున్న ప్రపంచంలో రాజ్యాంగానికి గతిశీల వ్యాఖ్యానం, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి మధ్య సమన్వయం, నేటి ఇంటర్నెట్ యుగంలో గోప్యతా హక్కు రక్షణ అనే ఐదు వేర్వేరు అంశాలు ప్రపంచ న్యాయవ్యవస్థకు సవాళ్లు విసురుతున్నాయి. వీటన్నిటిలోనూ లింగపరమైన న్యాయం అనే అంశమే ప్రపంచవ్యాప్తంగా మొదటి ప్రాధాన్యంగా ఉంది. పెరుగుతున్న ప్రజాకర్షక విధానాలపై గత దశాబ్దంలో రాజ్యాంగ విలువల ప్రాతిపదికన విస్తృత చర్చ జరిగింది. ఈ పరిణామం రాజ్యాంగాల మూలాలపై మరో చర్చకు తెరలేపింది’అని తెలిపారు. ప్రపంచవేగంగా, అనూహ్యంగా ఇటీవలి కాలంలో పరిణామం చెందుతూ వస్తోంది. దీనివల్ల న్యాయవ్యవస్థ మరింత క్రియాశీలకంగా మారిందని రాష్ట్రపతి పేర్కొన్నారు. సుదీర్ఘ న్యాయ ప్రక్రియకు బదులుగా వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వం, రాజీ మార్గాలకు ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడంతోపాటు ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని తీర్పులను సత్వరం వెలువరించడంలో కోర్టులు చాలా ప్రగతిని సాధించాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. పర్యావరణ సమస్యలు అందరికీ ఒక్కటే: సీజేఐ పర్యావరణ సంబంధ అంశాలకు జాతీయ, అంతర్జాతీయ అనే భేదం లేదని, వీటిని పరిష్కరించడానికి చట్టాలతో కూడిన ఒకే వ్యవస్థ అవసరమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే పేర్కొన్నారు. ‘పర్యావరణ సమస్యలు అందరికీ ఒక్కటే. పర్యావరణ అంశాలను జాతీయ, అంతర్జాతీయ సరిహద్దులు అడ్డుకాజాలవు. భూమిపై మనిషి ఒక బీజంగా మాత్రమే కాదు, పరాన్నజీవిగా మారాడు. భూమికి ఇస్తున్న దానికంటే భూమి నుంచి మనిషి తీసుకునేదే ఎక్కువనే అభిప్రాయం ఉంది. అందుకే పర్యావరణ పరిరక్షణ విషయంలో ఒకే విధమైన అంతర్జాతీయ చట్టాలు అవసరం’అని సీజేఐ తెలిపారు. ‘దేశంలోని 103 కోట్ల ప్రజల హక్కులకు జవాబుదారీగా ఉంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆకాంక్ష మేరకు తీర్పులను 9 ప్రాంతీయ భాషల్లో వివిధ ప్రాంతాల వారికి అందుబాటులోకి తెచ్చాం’అని తెలిపారు. -
'గత 15 ఏళ్లలో నలుగురికి మాత్రమే ఆ శిక్ష'
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీత తేదీ ఖరారైంది. ఏడేళ్ల నిరీక్షణకు తెరదించుతూ దోషులైన ముఖేష్ సింగ్ (32), పవన్ గుప్తా (25), వినయ్ శర్మ (26), అక్షయ్ కుమార్ ఠాకూర్ (31)లను ఈ నెల 22 ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరి తీయాలని ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు మంగళవారం డెత్ వారెంట్లు జారీ చేసింది. ఈ మేరకు అదనపు సెషన్స్ జడ్జి సతీష్ కుమార్ అరోరా కోర్టు హాలులో డెత్ వారెంట్‌ను చదివి వినిపించారు. ఈ నేపథ్యంలో గత 15 ఏళ్లలో దేశంలో మరణశిక్షలు అమలు చేసిన వివరాలను పరిశీలిస్తే.. మొత్తం 400 మందికి కోర్టులు మరణశిక్షలు విధించగా అందులో కేవలం ఒక శాతం మందికి మాత్రమే శిక్షలు అమలైనట్టు జాతీయ నేర విభాగం (ఎన్సీఆర్బీ) గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. చదవండి: నిర్భయ దోషులకు 22న ఉరి మరణశిక్ష కేసుల్లో దాదాపు 1200 మందికి అది ఆ తర్వాత జీవిత ఖైదుగా మారింది. నిర్భయ నిందితులకు ఈ నెల 22న ఉరిశిక్ష అమలు చేయనున్న నేపథ్యంలో ఎన్సీఆర్బీ గణాంకాలకు ప్రాధాన్యం ఏర్పడింది. కోర్టులో సుదీర్ఘకాల విచారణ, రాష్ట్రపతి అభ్యర్థనలు కారణంగానే శిక్షల అమలులో జాప్యం జరుగుతున్నట్టు తెలుస్తోంది. గత 15 ఏళ్లలో ఉరిశిక్ష అమలు పరిచింది నలుగురికి మాత్రమే. బాలికపై అత్యాచారం కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన ధనుంజయ్, ముంబైలో జరిగిన ఉగ్రదాడిలో కీలక పాత్రధారి పాకిస్తాన్ ఉగ్రవాది కసబ్, పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన అఫ్జల్ గురు, 1993లో ముంబైలో జరిగిన వరుస బాంబుదాడులకు కారకుడైన యాకూబ్ మెమన్‌లకు మాత్రమే గత 15 ఏళ్లలో ఉరిశిక్ష అమలు పరిచారు. ఈ నెల 22న నిర్భయ దోషులకు ఉరితీస్తే ఈ సంఖ్య 8కి పెరుగునుంది. -
సత్వరమైతేనే.. న్యాయం!
న్యాయం అందించడం ఒక ఎత్తైతే న్యాయం అందుతుందనే విశ్వాసం ప్రజల్లో కలిగించడం మరో ఎత్తు! అవిచ్ఛిన్నంగా, కచ్చితంగా, సత్వరంగా ఒకటోది అందితే రెండోది దానంతట అదే సిద్ధిస్తుంది. మనం, మన వ్యవస్థలు, ప్రభుత్వాలు పనిగట్టుకొని అందించాల్సింది మొదటిదే! రెండోదాని కోసం ఎవరూ ప్రత్యేకంగా కృషి చేయాల్సిన పని లేదు. అంతటా న్యాయం సులువుగా అందుతున్న క్రమంలో అంతే సహజంగా విశ్వాసం ప్రజల్లో ఏర్పడు తుంది, క్రమంగా బలపడుతుంది. రెండోది లేదంటే, మొదటిది లభించడం లేదనే అర్థం! ఈ దుస్థితి ఇటీవల బాగా పెరిగింది. న్యాయం అంత తేలిగ్గా దొరక్కపోవడం, కొన్నిసార్లు ఎంతకీ లభించక పోవడంతో అది లభిస్తుందనే విశ్వాసం పౌర సమాజంలో సన్నగిల్లు తోంది. అనుచిత జాప్యాలతో సాగే నేర దర్యాప్తు–న్యాయ విచారణ ప్రక్రియ (క్రిమినల్ జస్టిస్ సిస్టమ్) న్యాయనిరాకరణే కాక తీరని నష్టమనే భావన జనంలో బలపడుతోంది. ముఖ్యంగా ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరిగి, పట్టుబడ్డ నిందితులు బేషుగ్గా జైళ్లలోనో, బెయిల్‌పై వచ్చి బయటో కాలం వెళ్లదీస్తున్నపుడు... న్యాయం జరుగుతుందనే నమ్మకం సడలుతోంది. ఇది ఆరంభం నుంచీ ఉన్న పరిస్థితేం కాదు. పలు జాడ్యాల వల్ల ముప్పిరిగొంటున్న ఇటీవలి అనుచిత జాప్యాలే ఇందుకు కారణం. మన పరిపాలన, పోలీసు– దర్యాప్తు, న్యాయ వ్యవస్థ ఇలా అన్నిచోట్లా నిర్వాకాలు వెరసి ఉమ్మ డిగా విశ్వాసాన్ని సన్నగిల్లజేస్తున్నాయి. ఫలితంగా, ప్రజాస్వామ్య ప్రక్రియను కాదని ప్రజలు సత్వర ఫలితాల కోసం ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. అవి ప్రజా స్వామ్యబద్ధమైన చర్యలు కావు అని తెలిసినా... కాప్ పంచాయతీల వైపు మొగ్గుతున్నారు. అసాంఘిక శక్తుల సెటిల్మెంట్లకు తలొగ్గుతు న్నారు. అసహజ ఎన్కౌంటర్లనూ సమర్థిస్తున్నారు. హక్కుల సంఘాల కృషినీ అభిశంసిస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఎక్కడికక్కడ తీర్పులిచ్చే చర్యల్ని తప్పుపట్టకపోగా... గట్టిగా సమ ర్థిస్తున్నారు. పట్టరాని హర్షాలు, పాలాభిషేకాలు అందుకే! ఇదివర కెప్పుడూ లేనంత తీవ్ర స్థాయిలో ఈ రకం భావజాలం వ్యాపిస్తోంది. ప్రమాదకరంగా ఇది బలపడుతోంది. తీవ్ర భావోద్వేగాలకు లోన వుతున్న కొందరు ఈ పరిస్థితిని సామాజిక మాధ్యమాల్లో నెత్తికెత్తు కుంటున్నా... ఇదంత మంచిది కాదనేది విజ్ఞుల అభిప్రాయం. తాజా ఘటనల్లో అది కొట్టొచ్చినట్టు కనిపించింది. ఒక ప్రజాస్వామ్య వ్యవ స్థలో ప్రజలు ఏం కోరుకోవాలి, నిజానికి ఏం కోరుకుంటున్నారు? అని లోతుగా చూస్తే... ఈ పరిణామాలు ఆలోచనాపరుల్లో కాస్త గగు ర్పాటు కలిగిస్తున్నాయి. కఠిన శిక్షా? కచ్చితమైన శిక్షా? నేర దర్యాప్తు, న్యాయ విచారణల్లో జరిగే అనుచిత జాప్యాల వల్ల తీవ్రమైన నేరాల్లోనూ కేసులు కొలిక్కి రావట్లేదు. సత్వర న్యాయం దొరకటం లేదు. నేరస్తులకు శిక్షలు లేవు. బాధితుల కడగండ్లు తీరటం లేదు. ఇది ప్రజల్ని అసహనానికే కాకుండా ఆగ్రహానికీ గురిచేస్తోంది. బాధితులకు, ప్రజాస్వామ్యవాదులకు న్యాయవ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లడంతోపాటు దీనివల్ల మరో ప్రమాదం కూడా ఉంది. ఆడ వాళ్లపై అఘాయిత్యాలు చేసే వారికి, ఆ మాటకొస్తే నేరస్వభావు లెవరికైనా చట్టమంటే, శిక్షలంటే భయం లేని తెంపరితనం వచ్చే స్తుంది. అది బరితెగింపులకు దారితీస్తోంది. మొత్తం జనాభాతో పోల్చినపుడు నేరాలకు పాల్పడే వారి సంఖ్య చాలా తక్కువే అయినా, చట్టాలంటే భయంలేనితనం వల్ల సర్వత్రా అభద్రత రాజ్యమేలు తోంది. ‘తప్పు చేసిందెవరైనా, ఎంతవారైనా శిక్ష తప్పదు...’ అన్న నమ్మకం బలపడాలి. అది బలహీనులకు భరోసా కల్పిస్తూనే నేర స్వభావులకు భయాన్నీ కలిగిస్తుంది. ఏడేళ్ల కింద జరిగి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ కేసు’లో నిందితులైన వారికి ఇప్ప టికీ శిక్షలు అమలు కాకపోవడాన్ని సాధారణ జనం కూడా జీర్ణించు కోలేకపోతున్నారు. నేర నిర్ధారణ జరిగి, శిక్షలు ఖరారై... అమలు జరు గకపోవడం వారికి మరింత కోపకారణమవుతోంది. న్యాయ ‘ప్రక్రియ’ అంటేనే పరిహాసం చేస్తున్నారు. మరోవంక, ఇక్కడ హైదరాబాద్ శివార్లలో జరిగిన ‘దిశ’ దుర్మార్గం తర్వాత స్వల్ప వ్యవధిలోనే ‘ఎన్కౌంటర్’లో నిందితులు నలుగురు చనిపోవడం ఒకింత ఉపశమనం కలిగించింది. దాంతో, ఎక్కువ మంది ఈ రెండు... నిర్భయ, దిశ కేసుల అంతిమ ఫలితాన్ని సరిపోల్చి చూస్తున్నారు. దేనికన్నా ఏది నయం? అని బేరీజు వేస్తు న్నారు. నిర్భయ ఘటన తర్వాతనాడే దేశం అట్టుడికింది. సాక్ష్యాత్తూ దేశ రాజధాని నడిబొడ్డున ఇంత దారుణమా? అనే ఆగ్రహావేశాలు సర్వత్రా పెల్లుబికాయి. కేంద్ర ప్రభుత్వం జస్టిస్ వర్మ నేతృత్వంలో కమిషన్ వేసింది. దాని ముందుకు రకరకాల ప్రతిపాదనలు వచ్చాయి. పిల్లలు, మహిళలపై అత్యాచారం, హత్యోదంతం వంటి అఘాయిత్యాలకు తలపడే వారికి కఠిన శిక్షలు అమలు పరచాలనే వాదనా వచ్చింది. అక్కడికక్కడే మరణ శిక్ష విధించాలని, నేరుగా ఉరి తీయాలని... ఇలా వచ్చిన పలు ప్రతిపాదనల్లో చట్టాల్ని సమూలంగా మార్చే అంశం కూడా తెరపైకొచ్చింది. ప్రస్తుత చట్టాల్లోనూ ఆయా శిక్షలున్నాయని, కొత్తగా అమానుష శిక్షలు ప్రతిపాదించి నాగరిక సమాజం వెనక్కి నడవాల్సిన పనిలేదనే వాదనా వినిపించింది. అయితే ప్రక్రియలో జాప్యం నివారించి, సత్వర న్యాయం అందించేం దుకు చర్యలు తీసుకోవాలనే గట్టి వాదన ముందుకు వచ్చింది. సమయపరిమితే సరైన మార్గం అన్నిస్థాయిల్లోనూ సమయపరిమితులు విధించి నేర దర్యాప్తు– న్యాయ విచారణ ప్రక్రియను వేగవంతం చేయడం ఓ పరిష్కారం. అవసరం మేర ఎప్పటికప్పుడు ఫాస్ట్‌ట్రాక్ కోర్టుల ఏర్పాటు ఒక మార్గం. దయాబిక్షతో సహా తీర్పు తదనంతర ప్రక్రియకూ సమయ పరిమితులుండాలి. కొన్ని నేరాల్లో దయాబిక్షే ఉండకూడదు. కఠిన శిక్షల్ని వర్తింప చేయడం ద్వారా, ఎవరూ మహిళలపై ఏ దుశ్చర్యకూ తలపడలేని విధంగా భయం పుట్టించాలి. జాప్యాల్ని హరించి, ప్రక్రి యను సత్వరం పూర్తి చేస్తే ఫలితాలుంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిందదే! సీఆర్పీసీ, ఐపీసీలను తగు విధంగా సవరించడంతో పాటు సొంతంగా ఒక చట్టాన్ని తీసుకురావాలనే ప్రతి పాదనకు మంత్రివర్గం ఆమోదించింది. సామాజిక మాధ్యమాల వేది కగా జరిగే దుశ్చర్యలకూ పగ్గాలు వేసే చర్యల్ని ప్రతిపాదించారు. ముసాయిదా కూడా సిద్ధమైంది. ఇక నేడో, రేపో అసెంబ్లీలో ఆ బిల్లు చట్టరూపు సంతరించుకోవడమే తరువాయి. మహిళలపై దుర్మార్గపు హింస జరిగినపుడు వారం రోజుల్లో నేర దర్యాప్తు, పక్షం రోజుల్లో న్యాయ విచారణ పూర్తిచేసి, నిర్ధారించే సాక్ష్యాలున్న కేసుల్లో మూడు వారాల్లో తుది తీర్పు ఇప్పించాలనేది తాజా చొరవ ఉద్దేశం. న్యాయ ప్రక్రియపై ప్రజలకు భరోసా కల్పిం చడమే కాకుండా నేర స్వభావుల్లో భయం కలిగిస్తే లక్ష్యం నెరవేరినట్టే! ఇదొక్కటే సరిపోతుందా? అని సందేహం వ్యక్తం చేసేవాళ్లుంటారు. ఇలాంటి సంస్కరణలు, చట్ట సవరణలు, సత్వర చర్యలు అన్ని స్థాయిల్లో ఉంటే పని సజావుగా జరిగిపోతుంది. హైకోర్టు, సుప్రీం కోర్టు స్థాయిలో విచారణకు గడువెలా విధిస్తారనే వాదన రావొచ్చు! అసాధారణ పరిస్థితుల్లో తప్ప కేసు విచారణలకు సమయ పరిమి తులు విధించుకోవచ్చు. ప్రక్రియను సత్వరం పూర్తిచేసి ఒక హేతు బద్ధమైన ముగింపునకు తీసుకురావాలనే ఒత్తిడయితే ఉన్నత స్థాయి న్యాయ వ్యవస్థపైనా పెరుగుతుంది. సత్వర విచారణ, తగు తీర్పు తోనే సరిపోదు, సదరు శిక్షలు అమలు కావాలి. జరిగిన నేరపు ఘోర త్వం జనుల స్మృతిపథం నుంచి జారక ముందే నేరస్తులకు శిక్షలు అమలయితేనే సార్థకం. ఏకకాలంలో ఎన్ని కావాలో...! కేసు నమోదు దశ నుంచి ప్రాసిక్యూషన్ ముగిసే దాకా నేర దర్యాప్తు ప్రక్రియను పోలీసులు వేగిరపర్చాలి. పాలన, సాంకేతిక, దురుద్దేశ పూర్వక జాప్యాలన్నింటినీ çహరించాలి. ముఖ్యంగా దేశంలో అత్యా చార నేరాల పెరుగుదల తీరు ఆందోళన కలిగిస్తోంది. జరిగినా, పలు సాంఘిక కారణాల వల్ల నమోదయ్యేవే తక్కువంటే, ఈ అధికారిక గణాంకాలు గగుర్పాటు కలిగిస్తున్నాయి. గత 15 ఏళ్లలో 3.41 లక్షల అత్యాచార కేసులు నమోదయ్యాయి. ఒక వైపు ఘటనలు పెరుగు తుంటే, మరోవైపు శిక్షల రేటు తగ్గుతోంది. 2016లో 38,947 కేసులు రాగా 6,289 కేసుల్లోనే శిక్షలు పడ్డాయి. మహిళలపై జరిగే నేరాల్లో పోలీసుల సత్వర స్పందన, బాధ్యతాయుత ప్రవర్తన చాలా ముఖ్యం. దర్యాప్తుతో పాటు న్యాయ విచారణ ప్రక్రియలోనూ వేగం పెరగాలి. గర్భస్థ పిండాలుగా ఉన్నప్పటి నుంచి కడ శ్వాసవరకు మహిళలపై గౌరవ భావం కలిగేలా మన సమాజానికి అవగాహన పెంచాలి. కుటుంబం, బడి, పనిప్రదేశం, బహిరంగ స్థలం.... ఇలా అన్ని చోట్లా, ప్రతి స్థాయిలో వివక్ష పోవాలి. మనిషి తప్ప సృష్టిలో మరే జీవి పాల్పడని అతి హీనమైన నేరం అత్యాచారం. అది సామూహికంగా జరిగి, ఘాతుకమైన హత్యతో ముడివడటం భూమ్మీద అతిపెద్ద నేరం! దీనికి సమాజం నుంచే పరిష్కారం లభించాలి. దీన్ని పూర్తిగా నిర్మూలించడానికి అన్ని విధాలుగా, అన్ని స్థాయిల్లో సమాజం సమాయత్తం కావాలి. ఇది సమష్టి బాధ్యత. దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
గవర్నర్ చర్యలకు రాజ్యాంగ రక్షణ ఉందా?
న్యూఢిల్లీ: రాజ్యాంగం ఆర్టికల్ 361 ద్వారా రాష్ట్రపతి, గవర్నర్లకు రక్షణ కల్పించింది. తమ అధికారాలు, విధుల నిర్వహణలో రాష్ట్రపతి, గవర్నర్లు తీసుకునే నిర్ణయాలు, చర్యలను ప్రశ్నించే అధికారం ఏ న్యాయస్థానానికీ లేదని ఆర్టికల్ 361(1) చెబుతోంది. అయితే, ఆర్టికల్ 361 నిబంధనల మేరకు రాష్ట్రపతి, గవర్నర్ల చర్యలకు మినహాయింపులున్నప్పటికీ.. వారి చర్యలు దురుద్దేశపూరితంగా, ఏకపక్షంగా, అసంబద్ధంగా ఉన్నాయని భావించిన పక్షంలో జోక్యం చేసుకోవచ్చని గతంలో పలు సంద ర్భాల్లో కోర్టులు తీర్పులు చెప్పాయి. 2006లో సుప్రీంకోర్టు ఈ మేరకు స్పష్టం చేసింది. ఎస్ఆర్ బొమ్మై కేసు ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మైకు అసెంబ్లీలో బల నిరూపణకు అవకాశం ఇవ్వకుండా 1989లో అప్పటి కర్ణాటక గవర్నర్ పి.వెంకటసుబ్బయ్య ప్రభుత్వాన్ని రద్దు చేశారు. అధికార పార్టీలోని పలువురు నేతలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడటంతో బొమ్మై మెజారిటీ కోల్పోయారని భావించినట్లు గవర్నర్ కారణంగా చూపారు. అనంతరం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు గవర్నర్ నిర్ణయం చెల్లదంటూ 1994లో కీలక తీర్పు వెలువరిం చింది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసేందుకు రాష్ట్రపతికి తిరుగులేని అధికారాలు మాత్రం లేవని స్పష్టం చేసింది. అవసరమైన పరిస్థితుల్లో మాత్రమే ఆయన అసెంబ్లీని రద్దు చేయాలని తెలిపింది. 2018నాటి కర్ణాటక పరిణామాలు 2018 ఎన్నికల్లో కర్ణాటక అసెంబ్లీలోని 225 సీట్లకు గాను బీజేపీ 104 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో గవర్నర్ వజూభాయ్ ఆహ్వానం మేరకు యడియూరప్ప ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేడీఎస్‌ల కూటమి తమకు మెజారిటీ సభ్యుల మద్దతు ఉందని చెప్పినా గవర్నర్ పట్టించుకోలేదు. దీంతో ఈ రెండు పార్టీలు అర్ధరాత్రి సమయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. తక్షణమే విచారణ జరిపిన కోర్టు.. గవర్నర్‌కు యడియూరప్ప సమర్పించిన లేఖను తమకు అందజేయాల్సిందిగా ఆదేశించింది. కానీ, యడ్యూరప్పకు కేవలం మెజారిటీ సభ్యుల మద్దతుందని మాత్రమే ఆ లేఖలో ఉంది. మద్దతు పలికే ఎమ్మెల్యేల పేర్లు లేవు. దీంతో అత్యున్నత న్యాయస్థానం.. గవర్నర్ ఇచ్చిన 15 రోజుల గడువుకు బదులుగా మరుసటి రోజే శాసనసభలో బల పరీక్ష జరపాలని యడియూరప్పను ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. -
రాజస్తాన్ హైకోర్టులో ఆ పదాలు నిషేధం
జైపూర్: భారత న్యాయ వ్యవస్థలో ప్రస్తుతం అమలవుతోన్న చాలా చట్టాలు బ్రిటీష్ పాలనా కాలంలో రూపుదిద్దుకున్నవే. దేశానికి స్వాతంత్ర్య వచ్చి ఏళ్లు గడుస్తున్నప్పటకీ కోర్టుల్లో ఇంకా పురాతన చట్టాలు, పాత నియమాలనే అనుసరిస్తున్నారు మన న్యాయకోవిధులు. అయితే వాటికి చరమగీతం పాడేందుకు రాజస్తాన్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి న్యాయమూర్తులు కేసులను వాదించే సందర్భంలో ‘మై లార్డ్’, ‘యువర్ హానర్’ అనే పదాల వాడకంపై నిషేధం విధించింది. ఈ మేరకు రాజస్తాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రవీందర్ భట్టు నేతృత్వంలో భేటీ అయిన కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మీదట కోర్టు కార్యాకలపాలలో వాటిని వాడకూడదంటూ హైకోర్టు రిజిస్ట్రర్ జనరల్ సతీష్ కుమార్ శర్మ నోటీసులు జారీ చేశారు. ఇదే పద్దతిని దేశ వ్యాప్తంగా గల హైకోర్టులో కూడా పాటిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. -
జడ్జీలు రాజకీయాలకు దూరంగా ఉండాలి
న్యూఢిల్లీ: రాజస్తాన్ హైకోర్టు సీజే జస్టిస్ ప్రదీప్ నంద్రజాగ్, ఢిల్లీ హైకోర్టు సీజే జస్టిస్ రాజేంద్ర మీనన్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించకపోవడంపై సుప్రీం మాజీ జడ్జి జస్టిస్ మదన్.బి.లోకూర్ స్పందించారు. జస్టిస్ ప్రదీప్, జస్టిస్ రాజేంద్ర మీనన్‌ల నియామకంపై 2018, డిసెంబర్ 12న కొలీజియం చేసిన సిఫార్సుల్ని ప్రజలకు అందుబాటులోకి తేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నెల 10న సమావేశమైన కొత్త కొలీజియం జస్టిస్ ప్రదీప్, జస్టిస్ మీనన్‌ల పేర్లను తొలగించి జస్టిస్ ఖన్నా, జస్టిస్ మహేశ్వరిల పేర్లను సిఫార్సు చేయడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. కొలీజియం సిఫార్సుకు కేంద్రం గత వారం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో బుధవారం ది లీఫెల్ట్ న్యూస్‌పోర్టల్ నిర్వహించిన స్టేట్ ఆఫ్ ఇండియన్ జ్యుడీషియరీ అనే కార్యక్రమంలో జస్టిస్ లోకూర్ మాట్లాడుతూ.. ‘2018, డిసెంబర్ 12న కొలీజియం సమావేశం జరిగింది. అందులో కొన్ని నిర్ణయాలను తీసుకున్నాం. కానీ డిసెంబర్ 12 నుంచి 2019, జనవరి 10 మధ్యన ఏం జరిగిందో నాకు తెలియదు. కాబట్టి నేనేం చెప్పలేను. కానీ మేము ఆమోదించిన తీర్మానాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచకపోవడం నన్ను నిరాశ పరిచింది. అయితే ఆ తీర్మానాన్ని వెబ్సైట్లో ఎందుకు అప్లోడ్ చేయలేదో నాకు అనవసరం’ అని వ్యాఖ్యానించారు. విశ్వాసఘాతకానికి పాల్పడలేను.. కొలీజియం నిర్ణయాలపై స్పందిస్తూ.. ‘కొలీజియంలో నిర్ణయాలను పరస్పరం నమ్మకంతో రహస్యంగా తీసుకుంటారు. కాబట్టి ఆ సమావేశంలో చర్చించిన విషయాలను బయటపెట్టి విశ్వాసఘాతుకానికి పాల్పడలేను. కానీ ఈ సమావేశంలో మేం కొన్ని నిర్ణయాలను తీసుకున్నాం. వీటిని సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. కొలీజియం భేటీలో ఆరోగ్యకరమైన చర్చ సాగింది. అందులో సమ్మతి, అసమ్మతి రెండూ ఉన్నాయి’ అని జస్టిస్ లోకూర్ తెలిపారు. ప్రధాని మోదీ ఇటీవల సుప్రీంకోర్టు ప్రాంగణాన్ని సందర్శించడంపై మాట్లాడుతూ.. ‘జడ్జీలు రాజకీయాలకు దూరంగా ఉండాలి. అంతమాత్రాన రుషిలా, ఒంటరిగా గడపాల్సిన అవసరం లేదు. దూరం పాటించాలంటే అర్థం ఏంటి? ప్రధాని మోదీ ముఖాన్ని కూడా చూడకూడదంటున్నారా? సాధారణ కార్యక్రమాలకు ప్రధానిని ఆహ్వానించడం తప్పుకాదు. ఇలాంటి కార్యక్రమాలకు సుప్రీంకోర్టు తలుపులు తెరవడం మంచిదే‘ అని వెల్లడించారు. న్యాయవ్యవస్థలో బంధుప్రీతి ఉందన్న ఆరోపణల్ని కొట్టిపారేశారు. కొలీజియం వ్యవస్థ విఫలమైందని తాను భావించడం లేదని లోకూర్ అన్నారు. విధివిధానాలు రూపొందించాలి కొన్నిసార్లు న్యాయవ్యవస్థ కూడా తన పరిధి దాటి వ్యవహరించిందని జస్టిస్ లోకూర్ తెలిపారు. కొలీజియం తీసుకునే నిర్ణయాలను నిర్ణీత గడువులోగా అమలుచేసేలా ఓ వ్యవస్థ ఉండాలన్నారు. ఈ గడువులోగా కేంద్రం నుంచి జవాబు రాకుంటే ఆమోదం లభించాలని వ్యాఖ్యానించారు. ఇందుకోసం కొలీజియంలో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా గతంలో జస్టిస్ ఏఎం జోసెఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జీగా పదోన్నతి కల్పించే విషయంలో కేంద్రం ఫైలును కొన్నినెలల పాటు తనవద్దే అట్టిపెట్టుకున్న విషయాన్ని ప్రస్తావించారు. న్యాయ వ్యవస్థ, కేంద్రానికి ఇలా ఫైళ్లను తొక్కిపెట్టే అధికారం లేదన్నారు. భవిష్యత్‌లో కేంద్రం ఇచ్చే ఎలాంటి బాధ్యతలను తాను స్వీకరించబోనని చెప్పారు. జస్టిస్ ప్రదీప్, జస్టిస్ మీనన్‌ల పేర్లను ప్రతిపాదించిన కొలీజియంలో సభ్యుడిగా ఉన్న జస్టిస్ లోకూర్.. గత డిసెంబర్ 30న పదవీవిరమణ చేశారు. -
ఆలస్యంగా దక్కిన న్యాయం
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తమ పార్టీ చేతులు కూడా నెత్తుట తడిశాయని అంగీకరించినప్పుడు కాంగ్రెస్‌లో పెద్ద దుమారం లేచింది. ‘నేరాంగీకార ప్రకటన’గా భావించాల్సిన ఆ జవాబుకు కారణమైన ప్రశ్న బుధవారం తీర్పు వెలువడిన హాషింపురా నరమేథానికి సంబంధించిందే. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) విద్యార్థులతో సంభాషిస్తున్న సందర్భంలో ఒక విద్యార్థి ఆ దారుణ మారణకాండ వెలు గుచూడకుండా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కప్పెట్టే యత్నం చేయలేదా అని అడిగినప్పుడు ఆయన ఒప్పుకోక తప్పలేదు. ఈ ఉదంతంలో ఢిల్లీ హైకోర్టు వెలువరించిన తాజా తీర్పు పర్యవసానంగా ప్రొవిన్షియల్ ఆర్మ్డ్ కానిస్టేబులరీ(పీఏసీ)కి చెందిన 16 మంది మాజీ జవాన్లకు జీవితఖైదు పడింది. ఈ రోజు కోసమే మృతుల కుటుంబాలు 31 ఏళ్లుగా ఎదురుచూస్తున్నాయి. ఘటన జరిగిన సమయంలో కేంద్రంలోనూ, ఉత్తరప్రదేశ్‌లోనూ కాంగ్రెసే అధికారం చలాయిస్తోంది. అంతకు మూడేళ్లక్రితం దేశ రాజధాని నగరం న్యూఢిల్లీతోసహా పలు నగరాల్లో మూడురోజులపాటు కాంగ్రెస్ నాయకులు పంపిన హంతక ముఠాలు చెలరేగి అయిదువేలమంది సిక్కు పౌరులను ఊచకోత కోశాయి. ఎందరో మహిళలు అత్యాచారాలకు గురయ్యారు. దాన్నుంచి దేశం ఇంకా తేరుకోక ముందే ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో మత ఘర్షణలు చెలరేగి 350 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నగరంలో ప్రశాంతత నెలకొల్పడానికొచ్చిన పీఏసీ జవాన్లు ఆ పని విడిచిపెట్టి తామే హంతకులుగా మారారు. నగరంలోని హాషింపురా ప్రాంతంలోని ముస్లింల ఇళ్లు చుట్టుముట్టి ఆడవాళ్లనూ, వృద్ధులనూ వేరుచేసి 43 మంది యువకులను, మైనర్ బాలురను ట్రక్కుల్లో తీసు కుపోయి ఒకరి తర్వాత ఒకరిని కాల్చుకుంటూ పోయారు. బుల్లెట్ గాయాలతో నెత్తురోడు తున్నవారిని కాలువలోకి విసిరేశారు. వీరిలో అయిదుగురు చనిపోయినట్టు నటించి ప్రాణాలు కాపాడుకున్నారు. మన దేశంలో న్యాయం ఎలా నత్తనడకన సాగుతుందో చెప్పడానికున్న అనేక ఉదాహరణల్లో ఈ హాషింపురా నరమేథం ఒకటి. ఈ కేసు ఎన్ని మలుపులు తిరిగిందో, ఎంత నిర్లక్ష్యానికి గురైందో, బాధిత కుటుంబాలు ఎంత క్షోభకు గురయ్యాయో గమనిస్తే ఎలాంటివారైనా దిగ్భ్రమచెందుతారు. సమాజాన్ని అల్లకల్లోలం చేసే ముఠాల బారినుంచి కాపాడటానికి అవసరమైన శిక్షణనిచ్చి యూనిఫాంనూ, ఆయుధాన్నీ ఇచ్చి పంపితే కొందరు సిబ్బంది తమ బాధ్యతల్ని గాలికొదిలి ఉద్దేశపూర్వకంగా ఊచకోతకు పాల్పడిన దురంతమది. ఆనాటి జిల్లా ఎస్పీ విభూతి నారాయణ్ రాయ్ ఈ ఉదంతం గురించి తెలుసుకుని చలించి, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి ఆయన్ను తీసుకుని రాత్రికి రాత్రే అక్కడికి వెళ్లారు. మృతదేహాల మధ్య కొన ఊపిరితో ఉన్న అయిదుగురిని గమనించి ఆసుపత్రికి పంపి కాపాడారు. ఆ సమయానికి మీరట్ నగరం మీదుగానే వెళ్తున్న అప్పటి ముఖ్యమంత్రి వీర్బహదూర్సింగ్ను ఆపి ఆయనకు దీన్ని గురించి వివరించారు. విభూతి నారా యణ్ ఎంతో శ్రద్ధపెట్టి దుండగులపై కేసులు పెట్టకపోయి ఉంటే ఇదసలు వెలుగుచూసేదే కాదు. కానీ విచారకరమేమంటే, ఆ తర్వాత దర్యాప్తు ప్రక్రియనంతటినీ వీర్‌బహదూర్ నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఫలితంగా నిందితులంతా సులభంగా తప్పించుకోగలిగారు. బాధిత కుటుం బాలన్నీ ఎంతో పట్టుదలగా పోరాడి ఉండకపోతే... ఈ ఉదంతంలో గాయపడిన పదిహేడేళ్ల బాలుడు జుల్ఫికర్ నాసిర్ బెదిరింపులను బేఖాతరు చేస్తూ గత 31 ఏళ్లుగా న్యాయస్థానాల చుట్టూ తిరిగి ఉండకపోతే బుధవారంనాటి తీర్పు వెలువడేది కాదు. అతడిచ్చిన తిరుగులేని సాక్ష్యాధారాల వల్లే దోషులకు ఇన్నాళ్లకైనా శిక్ష పడింది. నిందితులు 19 మందిలో ముగ్గురు చనిపోగా మిగిలిన వారికి ఇప్పుడు శిక్షలు పడ్డాయి. విభూతి నారాయణ్ చెబుతున్న ప్రకారం ఉన్నతస్థాయి అధికారుల ఆదేశాలు లేకుండా వీరు ఇంతగా బరితెగించరు. ఈ నరమేథంపై రెండేళ్లక్రితం ఆయన వెలువరిం చిన పుస్తకం సంచలనం సృష్టించింది. నేరాల దర్యాప్తు, న్యాయస్థానాల్లో వాటి విచారణ ఏళ్ల తరబడి సాగటం వల్ల కలిగే నష్టం అంతా ఇంతా కాదు. దర్యాప్తులో బయటికొచ్చిన అనేక అంశాలకు సంబంధించిన ఫైళ్లు మాయం చేయడానికి నేరగాళ్లకు వీలవుతుంది. హాషింపురా దురంతంలో జరిగిన సీఐడీ దర్యాప్తులో కొందరు అధికారుల పేర్లున్నట్టు తమకు తెలుసునని, అవన్నీ కాలక్రమంలో మాయం చేశారని రిటైర్డ్ పోలీసు అధికారులు చెబుతున్న మాట. అప్పట్లోని కాంగ్రెస్ ప్రభుత్వమూ, అనంతరకాలంలో వచ్చిన బీజేపీ, బీఎస్పీ, ఎస్పీ తదితర పక్షాల నేతృత్వంలోని ప్రభుత్వాలు కూడా న్యాయస్థానాల పోరు పడలేక అయిష్టంగా కేసు నడిపించినా... అందులో నిందితులుగా ఉండాల్సిన ఉన్నతాధికారుల పేర్లు మాయం చేశాయి. నిందితుల జాబితాలో ఉన్నవారికి పదోన్నతులిస్తూ పోయాయి. వారి సర్వీసు రికార్డుల్లో ఈ కేసులో నిందితులుగా ఉన్నారన్న ప్రస్తావనే లేదు. న్యాయస్థానం పదే పదే మందలించాకగానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం చేయలేదు. ఆ వచ్చినవారు సైతం ఒకటికి రెండుసార్లు న్యాయస్థానం మందలించాకగానీ ఈ కేసుపై సరైన శ్రద్ధపెట్టలేదు. పట్టపగలు హత్యా కాండ సాగించినవారిని శిక్షించడానికి కూడా మూడు దశాబ్దాలకుపైగా సమయం పట్టిందంటే మన దేశంలో నేర న్యాయ వ్యవస్థ ఏ స్థితిలో ఉందో అర్ధమవుతుంది. ఇప్పుడు వెలువడిన ఢిల్లీ హైకోర్టు తీర్పుతో హాషింపురా కేసు ముగిసినట్టు కాదు. ఇప్పుడు శిక్షపడినవారంతా సుప్రీంకోర్టుకు వెళ్తామం టున్నారు. కనుక ఇది మరి కొన్నేళ్లు నడుస్తుంది. అన్యాయానికి గురైనామని భావించేవారికి సకా లంలో న్యాయం అందించగలిగితే వారికి వ్యవస్థపై నమ్మకం కలుగుతుంది. అది దక్కనప్పుడు వారు అసహనానికీ, ఆగ్రహావేశాలకూ లోనవుతారు. ఇతరేతర మార్గాలు ఆశ్రయిస్తారు. పర్య వసానంగా సమాజం అల్లకల్లోలమవుతుంది. పాలకులు దీన్ని దృష్టిలో ఉంచుకుని మెలగాలి. -
త్వరలోనే సర్దుకుంటుంది!
న్యూఢిల్లీ: భారత న్యాయవ్యవస్థలో ఏర్పడిన సంక్షోభం త్వరలోనే సమసిపోతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ దీపక్ మిశ్రా స్పష్టం చేశారు. వివాదం నేపథ్యంలో తనను కలిసిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (బీసీఐ) ఏడుగురు సభ్యుల కమిటీకి సీజేఐ ఈవిధమైన భరోసా ఇచ్చారు. సానుకూల వాతావరణంలో జరిగిన ఈ చర్చల అనంతరం వివాదం 2–3 రోజుల్లో సమసిపోతుందనే భరోసా కలిగిందని బీసీఐ కమిటీ చైర్మన్ మన్ కుమార్ మిశ్రా మీడియాకు వెల్లడించారు. అంతకుముందు ఈ కమిటీ... తిరుగుబాటు చేసిన న్యాయమూర్తులు జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్లతోనూ సమావేశమైంది. వారు కూడా వివాదం తొందరగానే పరిష్కారమవుతుందని అభిప్రాయపడ్డారన్నారు. మరోవైపు, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు వికాస్ సింగ్ కూడా సీజేఐని కలిశారు. అటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్ఏ బాబ్డేలు కూడా సీజేఐ, జస్టిస్ చలమేశ్వర్లతో సంప్రదింపులు జరిపారు. సుప్రీంకోర్టులో కేసుల పంపకం రోస్టర్ విధానంలో జరగటం లేదంటూ సీజేఐ తీరుకు నిరసనగా నలుగురు సీనియర్ న్యాయమూర్తులు తిరుగుబాటు ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు మూడు రోజుల్లో: బీసీఐ చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతోపాటు జస్టిస్ చలమేశ్వర్, ఇతర న్యాయమూర్తులతో బీసీఐ కమిటీ ఆదివారం వేర్వేరుగా భేటీ అయింది. ఈ సమావేశాల అనంతరం బీసీఐ చైర్మన్ మన్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ.. ‘సుప్రీంకోర్టులో ఎలాంటి సంక్షోభం లేదు. ఇది కేవలం అంతర్గత విషయమే. ఈ సమావేశాల అనంతరం వివాదం త్వరలోనే పరిష్కారం అవుతుందనే నమ్మకం కుదిరింది. సీజేఐతో 50 నిమిషాల సేపు సానుకూల వాతావరణంలో భేటీ జరిగింది. ఇది తీవ్రమైన సమస్యేమీ కాదు. అంతా సర్దుకుంటుంది. ఈ వివాద పరిష్కారంలో బీసీఐ పాత్ర పరిమితమే. న్యాయమూర్తులు కూడా సమస్యేమీ లేదని పేర్కొన్నారు. 2–3 రోజుల్లో అంతా సర్దుకుంటుంది’ అని పేర్కొన్నారు. కొందరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఢిల్లీకి దూరంగా ఉన్నందున రెండ్రోజుల్లో వీరందరితోనూ భేటీ అవుతామన్నారు. అనంతరం జస్టిస్ అరుణ్ మిశ్రాతో సమావేశమైన బీసీఐ కమిటీ.. ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి బీహెచ్ లోయా మృతిపై దాఖలైన పిల్‌పై విచారణ జరపాలని కోరింది. జస్టిస్ అరుణ్ మిశ్రాకు లోయా కేసును బదిలీ చేయటాన్నీ తిరుగుబాటు జడ్జీలు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. వారి ప్రెస్‌మీట్ దురదృష్టకరం న్యాయమూర్తులు, సీజేఐ మధ్య నెలకొన్న వివాదం త్వరలోనే పరిష్కారమవుతుందని ఢిల్లీ బార్ అసోసియేషన్స్ (ఢిల్లీలోని ఆరు జిల్లా కోర్టుల న్యాయవాదుల సంఘాలు) సమన్వయ కమిటీ ఆశాభావం వ్యక్తం చేసింది. న్యాయమూర్తులు ప్రెస్‌మీట్ పెట్టడం సరైంది కాదని భావిస్తున్నట్లు తెలిపిన కమిటీ.. ఈ వివాదం ద్వారా న్యాయవ్యవస్థపై ప్రజల్లో నమ్మకం కాస్త తగ్గిందని అభిప్రాయపడింది. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ న్యాయపరమైన క్రమశిక్షణను కొనసాగించాలని పేర్కొంది. 10 రోజుల్లో అందరూ కలిసి సమస్యను పరిష్కరించుకోలేని పక్షంలో మిగిలిన నగరాల్లో ఉన్న బార్ అసోసియేషన్లతో చర్చించి.. దేశవ్యాప్తంగా వీధుల్లో నిరసన ప్రదర్శనలను నిర్వహిస్తామని హెచ్చరించింది. ‘అంతర్గత వివాదాలను పరిష్కరించుకునేందుకు ఓ వ్యవస్థను ఏర్పాటుచేసుకోవాలి. ఇలాంటి వివాదాలను నిరోధించేందుకు జ్యుడీషియల్ అకౌంటబిలిటీ బిల్లును తీసుకురావాలి. సీజేఐ సభను ఆర్డర్లో పెట్టుకోవాలి. సీనియర్ న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలను తక్షణమే పరిష్కరించాలి’ అని కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. సీజేఐతో ఎస్సీబీఏ అధ్యక్షుడి భేటీ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ (ఎస్సీబీఏ) అధ్యక్షుడు వికాస్ సింగ్ ఆదివారం సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రాతో సమావేశమయ్యారు. సంక్షోభ పరిష్కారం కోసం ఎస్సీబీఏ రూపొందించిన తీర్మానాన్ని సీజేఐకి అందజేశారు. సుప్రీంకోర్టులోని అందరు న్యాయమూర్తులు ఈ తీర్మానానికి సమ్మతించారని.. వికాస్ సింగ్ పేర్కొన్నారు. ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పీఐఎల్), పెండింగ్ పిల్లను సీజేఐ నేరుగా విచారించాలని, లేదంటే కొలీజియం వ్యవస్థలోని నలుగురు సీనియర్ న్యాయమూర్తుల ధర్మాసనానికి అప్పగించాలని ఎస్సీబీఏ శనివారం తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీజేఐ సానుకూలంగా స్పందించారని వికాస్ వెల్లడించారు. సమంజసమే: మాజీ జడ్జీల లేఖ ఓ సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సహా ఐదుగురు రిటైర్డ్ న్యాయమూర్తులు సీజేఐకి బహిరంగ లేఖ రాశారు. నలుగురు తిరుగుబాటు న్యాయమూర్తులు లేవనెత్తిన అంశాలు సమంజసమేనని.. వీటిని త్వరలోనే పరిష్కరించుకోవాలని ఆ లేఖలో కోరారు. మాజీ సుప్రీం న్యాయమూర్తి పీబీ సావంత్, ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఏపీ షా, మద్రాస్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి కె. చంద్రు, బాంబే హైకోర్టు మాజీ జడ్జి హెచ్ సురేశ్ ఈ లేఖను రాశారు. ఈ వివాదం పరిష్కారమయ్యేంత వరకు ముఖ్యమైన కేసులను ఐదుగురు సీనియర్ న్యాయమూర్తుల ధర్మాసనానికి బదిలీ చేయాలని కోరారు. ‘రోస్టర్, కేసుల పంపకంలో సీజేఐ నిర్ణయమే అంతిమం. కానీ.. సున్నితమైన, ముఖ్యమైన కేసులను జూనియర్ న్యాయమూర్తులున్న ధర్మాసనాలకు ఇవ్వటం సరికాదు. వివాదాన్ని వెంటనే పరిష్కరించుకుని.. కేసుల పంపకానికి సంబంధించి స్పష్టమైన విధివిధానాలను రూపొందించుకోవాల్సిన తక్షణ అవసరం ఉంది’ అని ఆ లేఖలో వారు పేర్కొన్నారు. గెలవలేమని తెలిసే... ‘ఈ నలుగురు న్యాయమూర్తులు తాము లేవనెత్తిన అంశాలను నెగ్గించుకోవాలంటే.. ఫుల్‌కోర్టు (అందరు న్యాయమూర్తులతో సమావేశం)లో విషయాలను లేవనెత్తి ఓటింగ్ నిర్వహించవచ్చు. కానీ సీజేఐకే మెజారిటీ న్యాయమూర్తుల మద్దతుందని ముందే గుర్తించినందుకే ఫుల్‌కోర్టుకు పోకుండా.. తమ ఆవేదనను పంచుకునేందుకే మీడియాతో సమావేశమయ్యారు’ అని సుప్రీంకోర్టు వర్గాలు వెల్లడించాయి. భవిష్యత్తులో సీజేఐ కావాలనుకుంటున్న ఓ న్యాయమూర్తి ఈ నలుగురితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొనేందుకు విముఖత వ్యక్తం చేసినట్లు తెలిపాయి. -
గతంలో ‘న్యాయ’ వివాదాలు..!
న్యూఢిల్లీ: భారత న్యాయవ్యవస్థ వివాదాల్లో చిక్కుకోవడం ఇదే తొలిసారి కాదు. పలువురు న్యాయమూర్తులు అవినీతి, లైంగిక వేధింపులకు పాల్పడినట్లు గతంలో ఆరోపణలు ఎదుర్కోగా, ఓ మాజీ జడ్జీ కోర్టు ధిక్కార నేరం కింద ఆరు నెలల జైలుశిక్ష అనుభవించారు. ► 1993లో అప్పటి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామస్వామిపై అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆయనపై లోక్‌సభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. కానీ మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో ఆ తీర్మానం వీగిపోయింది. ► 2011లో కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సౌమిత్రా సేన్ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు రాజ్యసభ గుర్తించింది. ఆయన్ను తొలగించేందుకు ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని కూడా ఆమోదించింది. అయితే ఈ తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టడానికి ముందే సేన్ తన పదవికి రాజీనామా చేశారు. ► కొలీజియంతో పాటు సుప్రీం, హైకోర్టు జడ్జీలపై పరువు నష్టం వ్యాఖ్యలు చేసినందుకు కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కర్ణన్‌కు 2016లో ఆరు నెలల జైలుశిక్ష పడింది. దీంతో జైలుశిక్ష ఎదుర్కొన్న తొలిజడ్జీగా కర్ణన్ నిలిచారు. ► 2010లో వ్యక్తిగత ఆస్తుల్ని వెల్లడించడానికి సుప్రీం, హైకోర్టుల్లోని న్యాయమూర్తులు జంకుతున్న సమయంలో కర్ణాటక హైకోర్టు జడ్జీ జస్టిస్ శైలేంద్ర కుమార్ అప్పటి సీజేఐ జస్టిస్ బాలకృష్ణన్‌ను విమర్శించారు. ► 2012లో కర్ణాటక హైకోర్టు సిట్టింగ్ జడ్జీ జ్ఞాన్ సుధా మిశ్రా ప్రకటించిన ఆస్తుల్లో తన పెళ్లికాని కుమార్తెలను అప్పుగా చూపించడంతో మరో వివాదం రాజుకుంది. ► 2012లోనే కర్ణాటక హైకోర్టులో విడాకుల కోసం ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్ భక్తవత్సల.. గృహహింస ప్రతి ఇంట్లోనూ ఉంటుందని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ► గతేడాది ఓ కేసులో సుప్రీం కోర్టు తీర్పుపై తన బ్లాగ్‌లో చేసిన కామెంట్లపై వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా అత్యున్నత ధర్మాసనం మాజీ జడ్జి జస్టిస్ మార్కాండేయ కట్జూను ఆదేశించింది. ► 2015లో హార్దిక్ పటేల్ అరెస్ట్ కేసును విచారించిన గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జేబీ పార్దివాలా రిజర్వేషన్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనకు వ్యతిరేకంగా 58 మంది రాజ్యసభ ఎంపీలు అభిశంసన నోటీసును అప్పటి సభ చైర్మన్ హమీద్ అన్సారీకి పంపారు. ► సుప్రీం కోర్టు మాజీ సీజేఐ జస్టిస్ సదాశివం, న్యాయమూర్తి జస్టిస్ ఏకే గంగూలీలు తమ వద్ద శిక్షణ పొందుతున్న న్యాయ విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని గతంలో ఆరోపణలు వచ్చాయి. -
వ్యవస్థల స్థాయిని కాపాడాలి
విశ్లేషణ ఆంధ్రప్రదేశ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వరకు ప్రస్తుతం ఉన్న భవనాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కోసం విడిచిపెట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఇదే అంశాన్ని తెలియచేయడమైనది. న్యాయవ్యవస్థ విభజన గురించి ఒక నివేదికను ఇచ్చాను కాబట్టి, ఆ అంశాన్ని పరిశీలించడానికి నియమించిన సీనియర్ న్యాయమూర్తుల సంఘం నుంచి నన్ను తప్పిం చారు. ఆ తరువాత మరో సమావేశం గానీ, అవసరమైన చర్య గానీ తీసుకోలేదు. విభజన అంశాన్ని ఆ ప్రధాన న్యాయమూర్తి చర్చకు తీసుకువచ్చినప్పుడు ఆయనతో చెప్పాను, వెయ్యిమంది యువకుల ప్రాణత్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం, హైకోర్టు విభజనను వ్యతిరేకించడం ద్వారా ఆ సంతోషాన్ని హరించడం సరికాదు అని. అందుకు ఆయన, నేను హైదరాబాద్‌లో కొనసాగినంత కాలం హైకోర్టు విభజనకు అనుమతించే ప్రశ్నే లేదని తెగేసి చెప్పారు. ఆయన అటు పాలనాపరంగానూ, ఇటు న్యాయ వ్యవహారపరంగానూ నన్ను ఎంత హింస పెట్టా రంటే, నేను గుండె నిండా ప్రేమించే, ఆరాధించే న్యాయ వ్యవస్థ నుంచి నిష్ర్కమించే క్షణం కోసం ఎదురు చూడ వలసి వచ్చింది. హైకోర్టులో ఒక సీనియర్ న్యాయమూర్తి ఎదుర్కొన్న పరిస్థితి ఈ విధంగా ఉంటే, కింది కోర్టులలో న్యాయాధికారులు చిన్న చిన్న సాకులతో ఎంతగా వేధిం పులకు గురయ్యారో ఎవరైనా ఊహించవచ్చు. న్యాయవ్యవస్థ విభజనకు సంబంధించి చర్చ ఏ సందర్భంలో ఏ రూపంలో వచ్చినా, ప్రస్తుతం పని చేస్తున్నవారి కేటాయింపు వారి రికార్డుల మేరకు స్థానికత ఆధారంగా జరగాలని నేను చెప్పాను. ఒకవేళ ఒక ప్రాంతానికి కేటాయించిన వారి సంఖ్య అసలు కేటా యింపునకు మించి ఉంటే, ఆ పెరిగిన సంఖ్య మేరకు సీనియారిటీని తగ్గిస్తూ ఆదేశాలు ఇచ్చి ఇతర ప్రాంతంలో నియమించుకోవచ్చునని కూడా చెప్పాను. నిజానికి వివిధ క్యాడర్లకు చెందిన ఉద్యోగుల కేటా యింపులో అనుసరించవలసిన మార్గదర్శకాలు ఇలాగే ఉన్నాయి. దీనిని హైకోర్టు పరిగణనలోనికి తీసు కోలేదు. రెండు రాష్ట్రాలకు సంబంధించి అన్ని విభాగాల లోను ఉద్యోగుల విభజన జరిగినప్పుడు పెద్దగా నిర సనలు లేకుండా, కోర్టుల జోక్యం లేకుండా సాగిపోగా, హైకోర్టు విషయంలో మాత్రం వివాదం రేగడం ఒకింత చిత్రమే. ఇందులో గమనించవలసిన మరో ముఖ్య అంశం- హైకోర్టు తనకు తాను రూపొందించిన మార్గ దర్శకాలకు కూడా ఇది విరుద్ధం. నాడు పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు విభజనకు అవసరమైన చర్యలేవీ తీసుకోవడానికి నిరాకరించడమే కాదు, కేంద్ర ప్రభుత్వం ఇందుకు చొరవ చూపినప్పుడు అది వీలు పడకుండా కూడా అడ్డుకున్నారు. నా పరిజ్ఞానం మేరకు సుప్రీం కోర్టు కూడా ఇందుకు దాదాపు ఎలాంటి చొరవ చూపలేదు. ఒకవేళ ఏదైనా జరిగితే అది పరిపాలనా విభాగం నుంచి, న్యాయ వ్యవస్థ వైపునుంచే జరిగింది. న్యాయ విభాగం నుంచి ధర్మారావు అనే న్యాయాధికారి ఈ అంశం మీద రిట్ దాఖలు చేశారు. దీనితో మొత్తం ప్రక్రియ నిలిచిపోయింది. విధించిన స్టేని తొలగింప చేయడానికి తెలంగాణ ప్రభుత్వం, హైకోర్టు చేసిన ఖర్చు అంశం ఏ ఉద్యమ కారుడైనా తెలుసుకోవలసిన సమాచారం. విషాదం ఏమిటంటే, ఈ రిట్ దాఖలు చేసిన అధికారి పదవీ విర మణ చేసి, కోర్టులో పోరాడడానికి నిరాసక్తంగా ఉన్నప్ప టికీ, ఆఖరికి ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ విధించిన స్టేని తొలగించడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. తరువాత ఇప్పుడు మనం చూస్తున్నదంతా జరిగింది. పరిపాలనా విభాగం నుంచి జరిగిన ప్రయత్నం చూస్తే- బార్ కౌన్సిల్, బార్ల ప్రతినిధులు, ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కలుసు కుని హైకోర్టు విభజన అంశానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుకు చోటు చూపించి నట్టయితే, ఒక నెలలోనే విభజన అమలులోకి వస్తుందని ఒక దశలో తెలంగాణ ముఖ్యమంత్రికి తెలియచేశారు. ముఖ్యమంత్రి నాతో సంప్రదించారు. నేను, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇతర న్యాయ మూర్తులు కలసి తెలంగాణ హైకోర్టు ఏర్పాటుకు తగిన చోటును గుర్తిం చాం. ఆంధ్రప్రదేశ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వరకు ప్రస్తుతం ఉన్న భవనాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కోసం విడిచిపెట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఇదే అంశాన్ని తెలియచేయడం జరిగింది. అయితే హైకోర్టు విభజనను, కింది స్థాయి న్యాయ వ్యవస్థల విభజనను అడ్డుకోవాలన్న ధ్యేయంతో ఉన్న లాబీ అంతకు మించి ముందుకు వెళ్లడానికి అనుమ తించలేదు. ఒక్క పిలుపుతో బయటకు వచ్చి తమ సమస్యలను తామే పరిష్కరించుకునే విధంగా కాన్స్టిట్యూషనల్ కోర్టులు సుప్రీంకోర్టు, హైకోర్టులు ప్రజలను తయారు చేస్తున్నాయని మనం వింటున్నాం. ఇలాంటి ఉద్య మంతో కొన్ని మంచి ఫలితాలు వచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అయితే న్యాయ వ్యవస్థలో భాగమైన వారు తమకు జరిగిన అన్యాయం గురించి పిలుపునిచ్చి నప్పటికీ దానిని సుప్రీంకోర్టు తీవ్రంగా తీసుకునే దాఖ లాలు కనిపించడం లేదు. ఇంకో కాన్స్టిట్యూషనల్ కోర్టు గురించి చెప్పాలంటే, అసలు సమస్య దానికి సంబం దించినదే. తమ సమస్యను పరిష్కరించాలంటూ అటు సుప్రీం కోర్టును గానీ, ఇటు హైకోర్టును గానీ ఆశ్రయించబో మంటూ ఏకగ్రీవంగా తీర్మానించి ఉద్యోగాలను, జీవి తాలను త్యాగం చేయడానికి ఒక రాష్ట్రానికి చెందిన మొత్తం న్యాయాధికారులు సిద్ధ పడ్డారు. దీనిని చూసిన ఏ సామాజిక శాస్త్రవేత్త అయినా గతకాలపు మన న్యాయ వ్యవస్థ ఎంత తటస్తంగా ఉండేదో సులభంగానే అంచనా వేయగలడు. నేటి పరిణామాలను చూసిన తరువాత కలిగిన వేదన మేరకు ఇది రాశాను గానీ, నా మీద నేను జాలి పడడానికి కాదు. నా ఆవేదన అంతా వ్యవస్థలు, వాటి గౌరవం, విశ్వసనీయతల గురించే. న్యాయ వ్యవస్థ స్థాయినీ మర్యాదనీ రక్షించుకోవడానికి లభించే ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకునే పరిస్థితి రాకూడదని ఆశిద్దాం. జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి, వ్యాసకర్త పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఈమెయిల్ : aravindreddy.l@me.com