వ్యవస్థల స్థాయిని కాపాడాలి
విశ్లేషణ
ఆంధ్రప్రదేశ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వరకు ప్రస్తుతం ఉన్న భవనాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కోసం విడిచిపెట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఇదే అంశాన్ని తెలియచేయడమైనది. న్యాయవ్యవస్థ విభజన గురించి ఒక నివేదికను ఇచ్చాను కాబట్టి, ఆ అంశాన్ని పరిశీలించడానికి నియమించిన సీనియర్ న్యాయమూర్తుల సంఘం నుంచి నన్ను తప్పిం చారు. ఆ తరువాత మరో సమావేశం గానీ, అవసరమైన చర్య గానీ తీసుకోలేదు. విభజన అంశాన్ని ఆ ప్రధాన న్యాయమూర్తి చర్చకు తీసుకువచ్చినప్పుడు ఆయనతో చెప్పాను, వెయ్యిమంది యువకుల ప్రాణత్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం, హైకోర్టు విభజనను వ్యతిరేకించడం ద్వారా ఆ సంతోషాన్ని హరించడం సరికాదు అని.
అందుకు ఆయన, నేను హైదరాబాద్‌లో కొనసాగినంత కాలం హైకోర్టు విభజనకు అనుమతించే ప్రశ్నే లేదని తెగేసి చెప్పారు. ఆయన అటు పాలనాపరంగానూ, ఇటు న్యాయ వ్యవహారపరంగానూ నన్ను ఎంత హింస పెట్టా రంటే, నేను గుండె నిండా ప్రేమించే, ఆరాధించే న్యాయ వ్యవస్థ నుంచి నిష్ర్కమించే క్షణం కోసం ఎదురు చూడ వలసి వచ్చింది. హైకోర్టులో ఒక సీనియర్ న్యాయమూర్తి ఎదుర్కొన్న పరిస్థితి ఈ విధంగా ఉంటే, కింది కోర్టులలో న్యాయాధికారులు చిన్న చిన్న సాకులతో ఎంతగా వేధిం పులకు గురయ్యారో ఎవరైనా ఊహించవచ్చు.
న్యాయవ్యవస్థ విభజనకు సంబంధించి చర్చ ఏ సందర్భంలో ఏ రూపంలో వచ్చినా, ప్రస్తుతం పని చేస్తున్నవారి కేటాయింపు వారి రికార్డుల మేరకు స్థానికత ఆధారంగా జరగాలని నేను చెప్పాను. ఒకవేళ ఒక ప్రాంతానికి కేటాయించిన వారి సంఖ్య అసలు కేటా యింపునకు మించి ఉంటే, ఆ పెరిగిన సంఖ్య మేరకు సీనియారిటీని తగ్గిస్తూ ఆదేశాలు ఇచ్చి ఇతర ప్రాంతంలో నియమించుకోవచ్చునని కూడా చెప్పాను. నిజానికి వివిధ క్యాడర్లకు చెందిన ఉద్యోగుల కేటా యింపులో అనుసరించవలసిన మార్గదర్శకాలు ఇలాగే ఉన్నాయి. దీనిని హైకోర్టు పరిగణనలోనికి తీసు కోలేదు. రెండు రాష్ట్రాలకు సంబంధించి అన్ని విభాగాల లోను ఉద్యోగుల విభజన జరిగినప్పుడు పెద్దగా నిర సనలు లేకుండా, కోర్టుల జోక్యం లేకుండా సాగిపోగా, హైకోర్టు విషయంలో మాత్రం వివాదం రేగడం ఒకింత చిత్రమే. ఇందులో గమనించవలసిన మరో ముఖ్య అంశం- హైకోర్టు తనకు తాను రూపొందించిన మార్గ దర్శకాలకు కూడా ఇది విరుద్ధం.
నాడు పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హైకోర్టు విభజనకు అవసరమైన చర్యలేవీ తీసుకోవడానికి నిరాకరించడమే కాదు, కేంద్ర ప్రభుత్వం ఇందుకు చొరవ చూపినప్పుడు అది వీలు పడకుండా కూడా అడ్డుకున్నారు. నా పరిజ్ఞానం మేరకు సుప్రీం కోర్టు కూడా ఇందుకు దాదాపు ఎలాంటి చొరవ చూపలేదు. ఒకవేళ ఏదైనా జరిగితే అది పరిపాలనా విభాగం నుంచి, న్యాయ వ్యవస్థ వైపునుంచే జరిగింది. న్యాయ విభాగం నుంచి ధర్మారావు అనే న్యాయాధికారి ఈ అంశం మీద రిట్ దాఖలు చేశారు. దీనితో మొత్తం ప్రక్రియ నిలిచిపోయింది.
విధించిన స్టేని తొలగింప చేయడానికి తెలంగాణ ప్రభుత్వం, హైకోర్టు చేసిన ఖర్చు అంశం ఏ ఉద్యమ కారుడైనా తెలుసుకోవలసిన సమాచారం. విషాదం ఏమిటంటే, ఈ రిట్ దాఖలు చేసిన అధికారి పదవీ విర మణ చేసి, కోర్టులో పోరాడడానికి నిరాసక్తంగా ఉన్నప్ప టికీ, ఆఖరికి ఇదే అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ విధించిన స్టేని తొలగించడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. తరువాత ఇప్పుడు మనం చూస్తున్నదంతా జరిగింది.
పరిపాలనా విభాగం నుంచి జరిగిన ప్రయత్నం చూస్తే- బార్ కౌన్సిల్, బార్‌ల ప్రతినిధులు, ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కలుసు కుని హైకోర్టు విభజన అంశానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటుకు చోటు చూపించి నట్టయితే, ఒక నెలలోనే విభజన అమలులోకి వస్తుందని ఒక దశలో తెలంగాణ ముఖ్యమంత్రికి తెలియచేశారు. ముఖ్యమంత్రి నాతో సంప్రదించారు. నేను, తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇతర న్యాయ మూర్తులు కలసి తెలంగాణ హైకోర్టు ఏర్పాటుకు తగిన చోటును గుర్తిం చాం. ఆంధ్రప్రదేశ్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునే వరకు ప్రస్తుతం ఉన్న భవనాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కోసం విడిచిపెట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఇదే అంశాన్ని తెలియచేయడం జరిగింది. అయితే హైకోర్టు విభజనను, కింది స్థాయి న్యాయ వ్యవస్థల విభజనను అడ్డుకోవాలన్న ధ్యేయంతో ఉన్న లాబీ అంతకు మించి ముందుకు వెళ్లడానికి అనుమ తించలేదు.
ఒక్క పిలుపుతో బయటకు వచ్చి తమ సమస్యలను తామే పరిష్కరించుకునే విధంగా కాన్‌స్టిట్యూషనల్ కోర్టులు సుప్రీంకోర్టు, హైకోర్టులు ప్రజలను తయారు చేస్తున్నాయని మనం వింటున్నాం. ఇలాంటి ఉద్య మంతో కొన్ని మంచి ఫలితాలు వచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అయితే న్యాయ వ్యవస్థలో భాగమైన వారు తమకు జరిగిన అన్యాయం గురించి పిలుపునిచ్చి నప్పటికీ దానిని సుప్రీంకోర్టు తీవ్రంగా తీసుకునే దాఖ లాలు కనిపించడం లేదు. ఇంకో కాన్‌స్టిట్యూషనల్ కోర్టు గురించి చెప్పాలంటే, అసలు సమస్య దానికి సంబం దించినదే.
తమ సమస్యను పరిష్కరించాలంటూ అటు సుప్రీం కోర్టును గానీ, ఇటు హైకోర్టును గానీ ఆశ్రయించబో మంటూ ఏకగ్రీవంగా తీర్మానించి ఉద్యోగాలను, జీవి తాలను త్యాగం చేయడానికి ఒక రాష్ట్రానికి చెందిన మొత్తం న్యాయాధికారులు సిద్ధ పడ్డారు. దీనిని చూసిన ఏ సామాజిక శాస్త్రవేత్త అయినా గతకాలపు మన న్యాయ వ్యవస్థ ఎంత తటస్తంగా ఉండేదో సులభంగానే అంచనా వేయగలడు. నేటి పరిణామాలను చూసిన తరువాత కలిగిన వేదన మేరకు ఇది రాశాను గానీ, నా మీద నేను జాలి పడడానికి కాదు. నా ఆవేదన అంతా వ్యవస్థలు, వాటి గౌరవం, విశ్వసనీయతల గురించే. న్యాయ వ్యవస్థ స్థాయినీ మర్యాదనీ రక్షించుకోవడానికి లభించే ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకునే పరిస్థితి రాకూడదని ఆశిద్దాం.
జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి,
వ్యాసకర్త పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి
ఈమెయిల్ : aravindreddy.l@me.com