అంతా సిద్ధమేనా? | Sakshi Editorial On PM Modi NDA Govt New Criminal laws | Sakshi
Sakshi News home page

అంతా సిద్ధమేనా?

Published Wed, Jul 3 2024 12:25 AM | Last Updated on Wed, Jul 3 2024 12:25 AM

Sakshi Editorial On PM Modi NDA Govt New Criminal laws

భారత న్యాయశాస్త్ర చరిత్రలో మొన్న జూలై 1న ఒక కొత్త అధ్యాయం మొదలైంది. బ్రిటీషు కాలం నాటి నేర చట్టాల స్థానంలో మూడు కొత్త చట్టాలను మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. భారత  శిక్షాస్మృతి– 1860, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌– 1973, భారతీయ సాక్ష్యాల చట్టం – 1872... ఈ మూడింటి బదులు ‘భారతీయ న్యాయ సంహిత’, ‘భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత’, ‘భారతీయ సాక్ష్య అధినియమ్‌’లు సోమవారం నుంచి ఆచరణలోకి వచ్చాయి. అయితే, న్యాయకోవిదుల మొదలు సాధారణ కక్షిదారుల వరకు ఈ కొత్త చట్టాలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నారు. 

నేరన్యాయవ్యవస్థను ఆధునికీకరించడంలో ఈ కొత్త చట్టాలు గణనీయమైన ముందడుగు అని కొందరు ప్రశంసిస్తుంటే, మరికొందరు పాతవాటికి పైపై మెరుగులు దిద్ది, అమానుషంగా మార్చారని విమర్శిస్తున్నారు. పోలీస్‌స్టేషన్ల నుంచి కోర్టుల దాకా అన్నిటా పనితీరును మార్చేసి, సామాన్యులపై పెను ప్రభావం చూపే ఈ శాసనాలపైనే ఇప్పుడు దేశమంతటా చర్చ సాగుతోంది. 

కొత్త నేర చట్టాల వ్యవహారం సహజంగానే అధికార బీజేపీకీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌కూ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. వలసవాద పాలన తాలూకు అవశేషాలను వదిలించుకొనే ఈ ప్రయత్నం దేశపురోగతికీ, స్థితిస్థాపకతకూ ప్రతీక అన్నది బీజేపీ మాట. కాంగ్రెస్‌ మాత్రం గడచిన ప్రభుత్వ హయాంలో పార్లమెంట్‌లో ఏకంగా 146 మంది ప్రతిపక్ష సభ్యులు సస్పెండైన వేళ, కేవలం మూజువాణి ఓటుతో బలవంతాన ఈ చట్టాలకు ఆమోదముద్ర వేశారనీ, పార్లమెంటరీ వ్యవస్థలో ఈ రకమైన ‘బుల్‌డోజర్‌ న్యాయాన్ని’ తమ ప్రతిపక్ష కూటమి సహించబోదనీ పేర్కొంది. 

శతాబ్ద కాలానికి ముందెప్పుడో బ్రిటీషు హయాంలో చేసిన చట్టాలు శిక్షల మీద ప్రధానంగా దృష్టి పెడుతుంటే, ఈ కొత్త చట్టాలు మటుకు అందరికీ న్యాయం, హక్కుల పరిరక్షణకు ప్రాధాన్యమిస్తాయనేది అధికార పక్షం కథనం. కానీ, ఆ మాటలతో ప్రతిపక్షాలే కాదు... చివరకు పలువురు న్యాయశాస్త్ర నిపుణులు సైతం విభేదిస్తుండడం గమనార్హం. ఇంకా చెప్పాలంటే, సరికొత్త శాసనాలు దుర్వినియోగమయ్యే ప్రమాదం ఎంతైనా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

నిజానికి, మారుతున్న సమాజ పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా పాతకాలపు చట్టాలను మార్చాలన్న ఆలోచన మంచిదే. ప్రస్తుతం విచారణలోని ఖైదీలు లెక్కకు మిక్కిలిగా జైళ్ళలో మగ్గిపోతున్నారు. అసంఖ్యాకంగా బాధితులు న్యాయం కోసం ఏళ్ళ తరబడి నిరీక్షిస్తున్నారు. లక్షల కొద్దీ కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో నేర న్యాయవ్యవస్థలో సంస్కరణలు అత్యవసరం. అయితే, అందుకు గడచిన మోదీ సర్కార్‌ హడావిడిగా అనుసరించిన పద్ధతి, తగిన చర్చకు తావివ్వకుండా పార్లమెంట్‌లో చూపిన ఆధిపత్యం, చేసిన మంచి సూచనల్నీ – చెప్పిన అభ్యంతరాలను సైతం పట్టించుకోని తెంపరితనంతోనే అసలు చిక్కంతా! అసలు 2020 జూలైలోనే కేంద్ర హోమ్‌ శాఖ ఏర్పాటు చేసిన నిపుణుల సంఘం వైవాహిక అత్యాచారం మొదలు కారుణ్య మరణాన్ని చట్టబద్ధం చేయడం, రాజద్రోహ నేరంపై పునస్సమీక్ష లాంటి అనేక అంశాలపై పౌరులకు వివరమైన ప్రశ్నావళిని జారీ చేసింది. అయితే, కరోనా కాలంలోనే సంప్రతింపుల ప్రక్రియలో అధిక భాగం జరిగింది. అడిగిన, ఆశించిన భారీ మార్పులేమీ లేకుండానే కొత్త చట్టాలు వచ్చేశాయి. 

ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ముందు ఏకంగా 14 రోజుల పాటు పోలీసు అధికారి ప్రాథమిక దర్యాప్తు చేయవచ్చనడం, పోలీసు కస్టడీ కాలవ్యవధిని 15 రోజుల నుంచి అనేక వారాలు పెంచేయడం, చేతులకు బేడీలు సహా కొన్ని అంశాల్లో పోలీసులకు అపరిమిత అధికారాలు కట్టబెట్టడం లాంటివి ఇప్పటికే వివాదాస్పదమయ్యాయి. అలాగని కొత్త చట్టాల్లో ఏ మంచీ లేదనలేం. కొన్ని ముందడుగులు పడ్డాయి. 

కొన్ని రకాల నేరాల్లో శిక్షకు ప్రత్యామ్నాయంగా సామాజిక సేవ చేయడాన్ని ప్రవేశపెట్టారు. అలాగే, వీడియో కాన్ఫరెన్సింగ్‌ ద్వారా విచారణలకూ వీలు కల్పించారు. త్వరితగతిన విచారణలు పూర్తయ్యేలా నిర్ణీత కాలవ్యవధులను నిర్ణయించడం మరో మంచి ప్రయత్నం. అయితే, చట్టాలకు అన్ని ప్రాంతాలకు అర్థమయ్యే ఇంగ్లీష్‌ పేర్లు పెట్టనే లేదు. ప్రాంతీయ భాషల్లో అనువాదం పూర్తి కానేలేదు. రాష్ట్రాలు స్థానికంగా అవసరమైన మార్పులు చేసుకోవచ్చంటున్నా, చిక్కులున్నాయి.

ఏమైనా, కొత్త చట్టాల అమలు సైతం సవాలే. దశాబ్దాలుగా అలవాటైపోయిన సెక్షన్లు, చట్టాలను ఒక్కసారిగా మార్చేయడం ఇతర సమస్యలు తెచ్చింది. ఏ నేరానికి ఏ సెక్షన్‌ ఎంతమేరకు వర్తిస్తుందో ఇప్పటికిప్పుడు చటుక్కున అర్థం కాని పరిస్థితి. పోలీసు, న్యాయ వ్యవస్థలు కొత్త పద్ధతులకు ఏ మేరకు సుశిక్షితమైనదీ చెప్పలేం. అన్నీ అర్థమై, అలవాటయ్యే వరకు చట్టాల అమలు సంస్థలు, జడ్జీలు, లాయర్ల నుంచి కక్షిదారుల వరకు అందరికీ గందరగోళమే. అలాగే జూలై 1కి ముందు కేసులను పాత చట్టాలతో, ఆ తరువాతి కేసులను కొత్త చట్టాలతో విచారించాల్సి ఉంటుంది. 

ఇప్పటికీ లక్షల కొద్దీ పాత కేసులు పెండింగ్‌లో ఉన్నందున చాలాకాలం రెండు రకాల చట్టాలనూ అనుసరించాల్సి వస్తుంది. ఇది మరో పెద్ద చిక్కు. అలాగే, ఏ చట్టాలైనా వ్యక్తిగత స్వేచ్ఛ, పౌరహక్కులకు అండగా నిలిస్తేనే వాటికి విలువ. కొత్త చట్టాలపై ఆ విషయంలోనూ అనేక అనుమానాలున్నాయి. కాబట్టి వీటిపై పార్లమెంట్‌లోనే కాదు... పౌర సమాజంలోనూ విస్తృత చర్చ జరగనివ్వాలి. ఆ స్వరాలకు పాలకులు చెవి ఒగ్గాలి. లోపాలను సరిచేయాలి. వ్యవస్థలో సంస్కరణ ఒక్కరోజులో, ఒక్కసారిగా జరిగేది కాదని గుర్తించి, మార్పులు చేర్పులతో సాగాలి. అందుకిది మొదటి అడుగు అవ్వాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement