మళ్లీ తెరపైకి పౌరస్మృతి | Sakshi Editorial On Uniform Civil Code | Sakshi
Sakshi News home page

మళ్లీ తెరపైకి పౌరస్మృతి

Published Fri, Aug 16 2024 12:06 AM | Last Updated on Fri, Aug 16 2024 6:22 AM

Sakshi Editorial On Uniform Civil Code

వరసగా మూడోసారి గద్దెనెక్కిన తర్వాత ఎర్రకోట బురుజులపై నుంచి చేసిన తొలి ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలకమైన అంశాలు ప్రస్తావించారు. అందులో ప్రధానమైనది ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ). ఇప్పుడున్న ‘మతతత్వ పౌరస్మృతి’ స్థానంలో ‘సెక్యులర్‌ పౌరస్మృతి’ రావా ల్సిన అవసరం ఉందన్నది మోదీ నిశ్చితాభిప్రాయం. నిజానికి ఇదేమీ కొత్త కాదు. ఇంతక్రితం సైతం పలు సందర్భాల్లో యూసీసీ గురించి ఆయన మాట్లాడారు. 

నిరుడు జూన్‌లో మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల సదస్సులో దీనిపై ఆయన గొంతెత్తారు. ఆ మాటకొస్తే పూర్వపు జనసంఘ్‌ నుంచీ బీజేపీ దీన్ని తరచూ చెబుతోంది. కనుక ఇందులో కొత్త ఏమున్నదని అనిపించవచ్చు. అయితే గతంలో ప్రస్తావించటానికీ, ఇప్పుడు మాట్లాడటానికీ మధ్య మౌలికంగా వ్యత్యాస ముంది. గత పదేళ్ల నుంచి ఆయన ఎన్డీయే ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్నా బీజేపీకి సొంతంగానే పాలించగల సత్తా ఉండేది. 

ఇప్పుడు కూటమి పక్షాలపై ఆధారపడక తప్పనిస్థితి వచ్చింది. ప్రధాని తాజా ప్రసంగంలో ఇంకా అవినీతి, మహిళల భద్రత, ఒకే దేశం–ఒకేసారి ఎన్నికలు వంటివి కూడా చోటుచేసుకున్నాయి. నిజానికి ఎర్రకోట బురుజు ప్రసంగం లాంఛనమైన అర్థంలో విధాన ప్రకట నేమీ కాదు. కానీ రాగల అయిదేళ్ల కాలంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం చేయదల్చుకున్నదేమి టన్న విషయంలో ఆయన స్పష్టతతో ఉన్నారని అర్థం చేసుకోవచ్చు. 

మనం పూర్తి స్థాయి సెక్యులర్‌ దేశంగా మనుగడ సాగించాలని తొలి ప్రధాని నెహ్రూ మొదలు కొని స్వాతంత్య్రోద్యమ నాయకులందరూ భావించారు. యూసీసీ గురించి రాజ్యాంగ నిర్ణాయక సభలో లోతైన చర్చే జరిగింది. రాజ్యాంగసభ అధ్యక్షుడు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సైతం యూసీసీ ఉండితీరాలని కోరుకున్నారు. సభ్యుల్లో కొందరు వ్యతిరేకిస్తే... అనుకూలంగా మాట్లాడినవారిలో సైతం కొందరు ఇది అనువైన సమయం కాదన్నారు. 

ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులు భిన్నమై నవి. దేశ విభజన సమయంలో ఇరుపక్కలా మతోన్మాదులు చెలరేగిపోయారు. నెత్తురుటేర్లు పారించారు.  పరస్పర అవిశ్వాసం, అపనమ్మకం ప్రబలటంతో ఇళ్లూ, వాకిళ్లూ, ఆస్తులూ అన్నీ వదిలి లక్షల కుటుంబాలు ఇటునుంచి అటు... అటునుంచి ఇటూ వలసబాట పట్టారు. అదే సమయంలో పాకి స్తాన్‌ ఆవిర్భావానికి కారకుడైన మహమ్మద్‌ అలీ జిన్నా మరింత రెచ్చగొట్టే ప్రకటన చేశారు. 

భారత్‌లో ముస్లింలకు మనుగడ ఉండబోదని, వారిని అన్ని విధాలా అణిచేస్తారని దాని సారాంశం. అలాంటి సమయంలో యూసీసీని తీసుకొస్తే అనవసర అపోహలు బయల్దేరి పరిస్థితి మరింత జటిలమవుతుందని అందరూ అనుకున్నారు. అందువల్లే హక్కుల్లో భాగం కావాల్సిన యూసీసీ కాస్తా 44వ అధికరణ కింద ఆదేశిక సూత్రాల్లో చేరింది. ఆ సూత్రాలన్నీ ప్రభుత్వాలు నెరవేర్చాల్సిన అంశాలు. 

అయినా ఇతర అధికరణాల అమలు కోసం వెళ్లినట్టుగా కోర్టుకు పోయి వాటి అమలుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరటం సాధ్యం కాదు. అందువల్లే సుప్రీంకోర్టు వివిధ తీర్పుల్లో యూసీసీని తీసుకురావలసిన అవసరాన్ని పాలకులకు గుర్తుచేసి ఊరుకుంది. చిత్రమేమంటే పర స్పర పూరకాలు కావలసిన హక్కులూ, ఆదేశిక సూత్రాలూ కొన్ని సందర్భాల్లో విభేదించుకుంటాయి. 

ఉదాహరణకు 25 నుంచి 28వ అధికరణ వరకూ పౌరులకుండే మత స్వేచ్ఛ గురించి మాట్లాడ తాయి. ఆదేశిక సూత్రాల్లో ఒకటైన యూసీసీపై చట్టం తెస్తే సహజంగానే అది మత స్వేచ్ఛను హరించినట్టవుతుంది. కనుక ఈ రెండింటి మధ్యా సమన్వయం సాధించాలి. గతంలో చాలా సందర్భాల్లో ఇలా చేయకతప్పలేదు. ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ ప్రభావితం కాని రీతిలో ఆ పని చేయాలి. 

ఆ సంగతలా ఉంచి యూసీసీ తీసుకురాదల్చుకుంటే ఇస్లామ్‌ను అనుసరించేవారికి మాత్రమే కాదు... హిందూ, క్రైస్తవ, పార్సీ మతస్థులపైనా ప్రభావం పడుతుంది. కొంత హెచ్చుతగ్గులు ఉండొచ్చుగానీ దాదాపు అన్ని మతాలూ స్త్రీల విషయంలో వివక్షాపూరితంగానే ఉన్నాయి.

ముఖ్యంగా వ్యక్తిగత (పర్సనల్‌) చట్టాలకొచ్చేసరికి ఇది బాహాటంగా కనబడుతుంది. వీటి మూలాలు వందలు, వేల ఏళ్ల నుంచి పరంపరగా వస్తూవున్న సంప్రదాయాల్లో ఉండటం, మారు తున్న కాలానికి అనుగుణంగా సవరించుకోవటానికి సిద్ధపడకపోవటం సమస్య. వివాహం, విడా కులు, పునర్వివాహం, వారసత్వం, ఆస్తి హక్కు, బహుభార్యాత్వం వంటి అంశాల్లో స్త్రీలకు వివక్ష ఎదురవుతోంది. 

అయితే రాజ్యాంగం హామీ ఇచ్చిన లింగసమానత్వం లేని పక్షంలో అలాంటి చట్టా లను సుప్రీంకోర్టు కొట్టివేసిన సందర్భాలున్నాయి. పార్శీల్లో అన్య మతస్థుణ్ణి పెళ్లాడిన మహిళలకు వారసత్వ ఆస్తిలో భాగం ఇవ్వరు. పార్శీ పురుషుడికి అది వర్తించదు. అన్ని అంశాలనూ సవివరంగా చర్చించేందుకూ... అన్ని మతాచారాల వివక్షను తొలగించటానికీ సిద్ధపడుతున్నారన్న అభిప్రాయం కలిగిస్తే యూసీసీ రూపకల్పన సమస్యేమీ కాదు. దానికి ముందు మైనారిటీల విశ్వాసం పొందాలి. 

కోల్‌కతాలో ఇటీవల మహిళా జూనియర్‌ డాక్టర్‌పై అత్యాచారం, హత్య నేపథ్యంలో మహిళల భద్రత అంశాన్ని మోదీ ప్రస్తావించారు. ఇక భారత్‌లో అవినీతి పెచ్చుమీరిందని గణాంకాలు వెల్లడి స్తున్న నేపథ్యంలో కఠినంగా ఉంటామన్న సంకేతాలిచ్చారు. 

కానీ అలాంటి ఆరోపణలున్న నేతలు బీజేపీలోనో, దాని మిత్రపక్షంగానో ఉన్నప్పుడూ... వారిపై కేసుల దర్యాప్తు మందగిస్తున్నప్పుడూ దీన్ని జనం ఎంతవరకూ విశ్వసించగలరన్నది ఆలోచించుకోవాలి. మొత్తానికి యూసీసీ అంశాన్ని ప్రధాని మరోసారి తెరపైకి తెచ్చారు. ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఎటువంటి స్పందన వస్తుందో, ఎన్డీయే కూటమిలోని ఇతర పక్షాల వైఖరి ఏ విధంగా ఉంటుందో మున్ముందు తెలుస్తుంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement