వక్ఫ్ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఏర్పాటు చేయకతప్పని పక్షం రోజుల్లోనే ప్రస్తుతం భిన్నవర్గాల పరిశీలనలో ఉన్నదని చెబుతున్న బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్లు ముసాయిదాను కేంద్రంలోని ఎన్డీయే సర్కారు వెనక్కి తీసుకుంది. కారణమేదైనా ఇది ఆహ్వానించ దగ్గ పరిణామం. ఈ బిల్లు తొలి ముసాయిదా నిరుడు నవంబర్‌లో విడుదల చేయగా దానిపై వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని చెబుతూ గత నెల రెండో ముసాయిదా తీసుకొచ్చారు. తాజాగా దాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు.
వచ్చే అక్టోబర్ 15 వరకూ ముసా యిదా బిల్లుపై సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వం చెబుతోంది. బహుశా శీతా కాల సమావేశాలనాటికి దీనికి తుదిరూపం ఇవ్వాలన్నది పాలకుల ఉద్దేశం కావొచ్చు. డిజిటల్ మీడియా ప్రస్తుతం ఊహకందని రీతిలో విస్తరించింది. 1959లో ప్రయోగాత్మకంగా ఢిల్లీలో ప్రారంభించిన టెలివిజన్ ప్రసారసేవలు 80వ దశకం చివరినాటికి కొత్త పుంతలు తొక్కాయి. స్టార్ టీవీ, ఎంటీవీ, బీబీసీ, సీఎన్‌ఎన్ వగైరాలు జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ప్రస్తుతం యూట్యూబ్, ఫేస్‌బుక్, ట్విటర్‌వంటి సామాజిక మాధ్యమాలతోపాటు ఓటీటీలు వచ్చాయి.
వాట్సాప్, టెలిగ్రామ్ వంటివి సరేసరి. అన్నింటా మంచీ చెడూ ఉన్నట్టే వీటివల్ల కూడా సమస్యలు ఎదురువుతూ ఉండొచ్చు. అవి దుష్పరిణామాలకు దారితీయటం నిజమే కావొచ్చు. అందుకు తగిన చట్టాలు తీసుకు రావటం కూడా తప్పేమీ కాదు. కానీ ఈ మాధ్యమాలను నియంత్రించే పేరిట భావప్రకటనా స్వేచ్ఛకు కళ్లెం వేయాలనుకోవటం, అసమ్మతిని అణిచేయాలనుకోవటం ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. బ్రాడ్‌కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ ముసాయిదా బిల్లు చేస్తున్నది అదే.
గతంలో కేబుల్ రంగం హవా నడిచినప్పుడు వీక్షకులకు ఇష్టం ఉన్నా లేకున్నా అనేక చానెళ్లు వచ్చిపడేవి. వర్తమానంలో అలా కాదు. ఏం చూడాలో, వద్దో నిర్ణయించుకునే స్వేచ్ఛ వీక్షకులకు ఉంటుంది. పార్టీలకు అమ్ముడుపోయిన చానెళ్లు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని అర్థమయ్యాక జనం వాటిని చూడటం మానుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో ప్రత్యామ్నాయాలను వెదుక్కుంటున్నారు.
తమకు నచ్చిన, తాము తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఉన్నదనుకుంటేనే ఆన్‌లైన్‌లో లభ్య మయ్యే వీడియోలను వీక్షిస్తారు. వార్తా విశ్లేషణలను చదువుతారు. ఒక అంశంపై ఎవరెవరి అభిప్రా యాలు ఎలావున్నాయో తెలుసుకుంటారు. ఈ క్రమంలో సహజంగానే ప్రజలను పక్కదోవపట్టించేవాళ్లు ఉంటారు. అశ్లీలతనూ, దుర్భాషలనూ గుప్పించేవారుంటారు. తప్పుడు కథనాలను ప్రసారం చేసేవారూ ఉంటారు. అలాంటివారిపై తగిన చర్యలు తీసుకోవటాన్ని ఎవరూ కాదనరు.
కానీ నిజాయితీగా అభిప్రాయాలు వ్యక్తీకరించేవారిని కూడా వారితో సమంచేసి శిక్షించే ధోరణి ఎంతవరకూ సబబు? అత్యధిక వీక్షకుల్ని రాబట్టుకుంటున్న ఆన్‌లైన్ మాధ్యమాలకు సైతం ముసా యిదాలో ఏముందో అధికారికంగా తెలియదు. అనేకానేక ఆన్‌లైన్ చానెళ్లు, ఇతర ప్రచురణ మాధ్య మాలూ సభ్యులుగా ఉన్న డిజిపబ్ వంటి స్వయంనియంత్రణ సంస్థలకే ఈ ముసాయిదాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి వర్తమానమూ లేదు.
మరి కేంద్రం ఇంతవరకూ సాగించామంటున్న సంప్రదింపులు ఎవరితో జరిగినట్టు? రెండు మూడు ఓటీటీ యాజమాన్యాలనో, కార్పొరేట్ రంగ ఆధిపత్యంలో సాగుతున్న ఇతర మాధ్యమాలనో, తాము నిపుణులుగా భావించేవారినో సంప్రదిస్తే సరిపోతుందా? సాగు చట్టాల విషయంలోనూ లక్షలాదిమంది రైతులతో, వేలాది సంఘాలతో చర్చించామని అప్పట్లో ప్రభుత్వం చెప్పింది.
చివరకు ఏమైంది? రైతులు పట్టుదలగా పోరాడాక వెనక్కు తీసుకోకతప్పలేదు. సమస్యేమంటే...ట్విటర్‌లో లక్షల్లో అనుయాయులున్న రాజకీయ నాయకులు మొదలుకొని ధ్రువ్‌రాఠివంటి పాపులర్ యూట్యూబర్‌ల వరకూ... ఎంతో నిబద్ధతతో సీనియర్ జర్నలిస్టులు నడిపే మాధ్యమాలవరకూ అందరినీ ముసాయిదా బిల్లు ఒకే గాటన కడు తోంది. ఆఖరికి పత్రికలూ, చానెళ్లూ అనుబంధంగా నడుపుతున్న డిజిటల్ మాధ్యమాలు సైతం ఈ పరిధిలోకొస్తాయి.
పైగా ఈ కార్యకలాపాలు క్రిమినల్ చట్టాల పరిధిలోకి కూడా వెళ్లి అనేక కేసులు దాఖలవుతాయి. అరెస్టయితే బెయిల్ దుర్లభమవుతుంది. తటస్థంగా విశ్లేషణలందిస్తూ వేలల్లోనో, లక్షల్లోనో వీక్షకుల్ని సంపాదించుకుంటున్న వ్యక్తులు కూడా ఈ బిల్లు చట్టమైతే అనేకానేక పత్రాలు దాఖలుచేయాల్సివస్తుంది. అంతేకాదు...ఒక గ్రీవెన్స్ అధికారిని నియమించుకోవటం, స్వీయ మదింపు కమిటీని ఏర్పాటుచేసుకోవటం తప్పనిసరవుతుంది.
ఈ వ్యయాన్నంతా వీక్షకులనుంచి వసూలు చేయటం సాధ్యమేనా? అసలు వచ్చే ఆదాయం ఎంత? పైగా తప్పుడు కథనాలు ప్రసారం చేశారనుకుంటే వారెంట్ లేకుండా దాడులు చేసి పరికరాలను స్వాధీనం చేసుకునే అధికారం ప్రభు త్వాలకు వస్తుందంటున్నారు.
ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించి విపక్షాలను జైళ్లలో కుక్కి అసమ్మతిని అణి చేశారని బీజేపీ తరచు చెబుతుంటుంది. రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజుగా ప్రతియేటా జూన్ 25ను పాటించాలని కూడా పిలుపునిచ్చింది. అలాంటి పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ ముసాయిదాను తీసుకురావటం, దాన్ని బహిరంగపరచకపోవటం వింత కాదా? మన పొరుగు నున్న బంగ్లాదేశ్‌లో హసీనా హయాంలో ఇలాంటి చట్టాన్నే తీసుకొచ్చారు.
కానీ అక్కడ నిరసన వెల్లువ ఆగిందా? తమ నిర్ణయాలపై సామాన్యులు ఏమనుకుంటున్నారో, వారిలోవున్న అసంతృప్తి ఏమిటో తెలుసుకోవటానికి డిజిటల్ మీడియా తోడ్పడుతుంది. అది పాలకులకే మంచిది. మీడియా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టయిన ఇలాంటి ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవటం ఉత్తమం.
మీడియా స్వేచ్ఛకు కళ్లెమా!
Published Thu, Aug 15 2024 12:18 AM | Last Updated on Thu, Aug 15 2024 6:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment