‘చావుకి పెడితే లంఖణానికి వస్తార’ని నానుడి. కొన్నేళ్లుగా ప్రజాస్వామ్యంలో బుల్డోజర్ స్వామ్యాన్ని జొప్పించి మురిసి ముక్కలవుతున్నవారికి సర్వోన్నత న్యాయస్థానం కీలెరిగి వాత పెట్టింది. నేరం రుజువై శిక్షపడిన లేదా నిందితులుగా ముద్రపడినవారి ఆవాసాలను కూల్చటం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. అలాంటి చేష్టలకు పాల్పడే ప్రభుత్వాధికారులు బాధితులకు పరిహారం చెల్లించటంతోపాటు వారి ఇళ్ల పునర్నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని వ్యక్తిగతంగా భరించాల్సి వుంటుందని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం తేల్చిచెప్పింది.
కూల్చివేతలకు ఏ నిబంధనలు పాటించాలో వివరించే మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని ఉల్లంఘించే అధికారులపై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవటంతోపాటు వ్యాజ్యాలు కూడా మొదలవుతాయని హెచ్చరించింది. ‘ఇళ్లు కూల్చినప్పుడల్లా నిశిరాత్రిలో నడిరోడ్లపై చిన్నా రులూ, ఆడవాళ్లూ విలపిస్తున్న దృశ్యాలు అరాచకానికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఒకప్పుడు అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కొన్ని విధివిధానాలు పాటించేవారు. నోటీసులిచ్చి సంజాయిషీలు తీసుకుని ఆ తర్వాత చర్యలు ప్రారంభించేవారు. కీడు శంకించినవారు న్యాయస్థానాలను ఆశ్రయించటం, వారికి ఊరట దొరకటం కూడా రివాజే.
తమకు నచ్చని అభిప్రాయాలున్నా, ఏదో ఉదంతంలో నిందితులుగా ముద్రపడినా వారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చే పాపిష్టి సంస్కృతి ఇటీవలి కాలపు జాడ్యం. సినిమా భాషలో చెప్పాలంటే ఇది ‘పాన్ ఇండియా’ సంస్కృతి! దీనికి ఆద్యుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉత్తర ప్రదేశ్‌లో నేర సంస్కృతిని అరికట్టడంలో, సంక్షేమ పథకాలు అర్హులకు అందించటంలో ఆయన విజయం సాధించారని బీజేపీ చెబుతుంటుంది. కానీ అంతకన్నా ‘బుల్డోజర్ బాబా’గా పిలిపించుకోవటం యోగికి, అక్కడి బీజేపీకి ఇష్టం. చూస్తుండగానే ఇది అంటువ్యాధిలా పరిణమించింది.
మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కర్ణాటకల్లో బీజేపీ ప్రభుత్వాలు బుల్డోజర్లతో విధ్వంసానికి దిగాయి. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకున్నాక బాబు ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయాలను బుల్డోజర్లతో కూల్చాలని చూసింది. ఒకటి రెండుచోట్ల ఆ పనిచేసింది కూడా. ఇక తమకు వ్యతిరేకంగా పనిచేశారన్న కక్షతో దిక్కూ మొక్కూలేని పేదల ఇళ్లు సైతం ఇదే రీతిలో ధ్వంసం చేసింది.
రాజస్థాన్‌లో 2022లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా బీజేపీ ఏలుబడిలో ఉన్న రాజ్‌గఢ్ మున్సిపాలిటీ పరిధిలో ఈ దుశ్చర్య చోటు చేసుకుంది. మహారాష్ట్రలో శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి సర్కారు హయాంలో నిందితుల ఇళ్లనూ, దుకాణాలనూ కూల్చారు. కేంద్రం మాటే చెల్లుబాటయ్యే ఢిల్లీలో జహంగీర్‌పురా ప్రాంతంలో మతఘర్షణలు జరిగినప్పుడు అనేక ఇళ్లూ, దుకాణాలూ నేలమట్టం చేశారు.
బాధితులు సుప్రీంకోర్టు ఉత్తర్వులు పొందేలోగానే విధ్వంసకాండ పూర్తయింది. 2020 నుంచి ముమ్మరమైన ఈ విష సంస్కృతిపై సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరిస్తూనే వచ్చింది. ‘నిందితులు మాత్రమే కాదు, శిక్ష పడినవారి ఇళ్లను సైతం కూల్చడానికి లేదు. ఈ విషయంలో చట్టనిబంధనలు పాటించి తీరాలి’ అని స్పష్టం చేసింది. కానీ ఆ చేష్టలు తగ్గిన దాఖలా లేదు. చుట్టూ మూగేవారు ‘ఆహా ఓహో’ అనొచ్చు. అవతలి మతంవారి ఇళ్లు, దుకాణాలు కూలుతున్నాయంటే తన్మయత్వంలో మునిగే వారుండొచ్చు.
ఆఖరికి ఇళ్లు కూల్చిన ఉదంతాల్లో పాలుపంచుకున్న అధికారులు విందులు చేసుకున్న ఉదంతాలు కూడా వెల్లడయ్యాయి. కానీ సమాజంలో అరాచకం ప్రబలకూడదన్న ఉద్దేశంతో రాజ్య వ్యవస్థ ఏర్పడినప్పుడూ... రాజ్యాంగమూ, చట్టాలూ ఉన్నప్పుడూ... రాజ్యవ్యవస్థే తోడేలుగా మారితే దిక్కెవరు? సుప్రీంకోర్టు వద్దుగాక వద్దని చెప్పాక కూడా ఈ పోకడ ఆగలేదంటే ఏమను కోవాలి? ఒక వ్యక్తి నిజంగా తప్పు చేశాడనుకున్నా అతని కుటుంబమంతా అందుకు శిక్ష అనుభవించి తీరాలన్న పట్టుదల నియంతృత్వ పోకడ కాదా?
సుప్రీంకోర్టు 95 పేజీల్లో ఇచ్చిన తీర్పు ఎన్నో విధాల ప్రామాణికమైనదీ, చిరస్మరణీయమైనదీ. ‘ఇల్లంటే కేవలం ఒక ఆస్తి కాదు... అది కొందరు వ్యక్తుల, కుటుంబాల సమష్టి ఆకాంక్షల వ్యక్తీకరణ. అది వారి భవిష్యత్తు. వారికి స్థిరత్వాన్నీ, భద్రతనూ చేకూరుస్తూ, సమాజంలో గౌరవం తీసుకొచ్చేది. ఇలాంటి ఇంటిని బలవంతంగా తీసుకోవాలంటే ముందుగా ఇతర ప్రత్యామ్నాయాలేవీ లేవని అధికారులు విశ్వసించాలి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించిన తీరు అమానవీయత నిండిన పాలకులకు ఏమేరకు అర్థమైందో సంశయమే.
ఆ మాటెలా వున్నా కఠిన చర్యలుంటాయన్న హెచ్చరిక వారిని నిలువరించే అవకాశం ఉంది. దేశంలో దిక్కూ మొక్కూలేని కోట్లాదిమంది సామాన్యులకు ఊరటనిచ్చే ఈ తీర్పులో హిందీ భాషా కవి ప్రదీప్ లిఖించిన కవితకు కూడా చోటు దక్కింది. దాని సారాంశం – ‘ఇల్లు, పెరడు ప్రతి ఒక్కరి స్వప్నం. ఆ కలను కోల్పోవడానికి సిద్ధపడతారా ఎవరైనా?’ బ్రిటన్ న్యాయకోవిదుడు లార్డ్ డెన్నింగ్ చేసిన వ్యాఖ్యలను కూడా తీర్పులో ఉటంకించారు. ‘రాజ్యా ధికారాన్ని ధిక్కరించి అతి సామాన్యుడు వేసుకున్న గుడిసె చిరుగాలికే వణికేంత బలహీనమైనది కావొచ్చు.
ఈదురుగాలికి ఇట్టే ఎగిరిపోవచ్చు. దాన్ని వర్షం ముంచెత్తవచ్చు. కానీ చట్టనిబంధన అనుమతిస్తే తప్ప ఆ శిథిల నిర్మాణం వాకిలిని అతిక్రమించటానికి ఇంగ్లండ్ రాజుకు సైతం అధికారంలేదు’ అని లార్డ్ డెన్నింగ్ అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూశాకైనా తమపై ఏ స్థాయిలో విశ్వాసరాహిత్యం ఏర్పడిందో ప్రభుత్వాలు గ్రహించాలి. నీతిగా, నిజాయితీగా, రాజ్యాంగానికి అనుగుణంగా పాలించటం నేర్చుకోవాలి.
బుల్డోజర్ సంస్కృతిపై వేటు!
Published Fri, Nov 15 2024 5:13 AM | Last Updated on Fri, Nov 15 2024 5:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment