Illegal structures
-
బుల్డోజర్ సంస్కృతిపై వేటు!
‘చావుకి పెడితే లంఖణానికి వస్తార’ని నానుడి. కొన్నేళ్లుగా ప్రజాస్వామ్యంలో బుల్డోజర్ స్వామ్యాన్ని జొప్పించి మురిసి ముక్కలవుతున్నవారికి సర్వోన్నత న్యాయస్థానం కీలెరిగి వాత పెట్టింది. నేరం రుజువై శిక్షపడిన లేదా నిందితులుగా ముద్రపడినవారి ఆవాసాలను కూల్చటం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. అలాంటి చేష్టలకు పాల్పడే ప్రభుత్వాధికారులు బాధితులకు పరిహారం చెల్లించటంతోపాటు వారి ఇళ్ల పునర్నిర్మాణానికయ్యే మొత్తం వ్యయాన్ని వ్యక్తిగతంగా భరించాల్సి వుంటుందని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్‌ల ధర్మాసనం తేల్చిచెప్పింది. కూల్చివేతలకు ఏ నిబంధనలు పాటించాలో వివరించే మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిని ఉల్లంఘించే అధికారులపై కోర్టు ధిక్కార నేరం కింద చర్యలు తీసుకోవటంతోపాటు వ్యాజ్యాలు కూడా మొదలవుతాయని హెచ్చరించింది. ‘ఇళ్లు కూల్చినప్పుడల్లా నిశిరాత్రిలో నడిరోడ్లపై చిన్నా రులూ, ఆడవాళ్లూ విలపిస్తున్న దృశ్యాలు అరాచకానికి ఆనవాళ్లుగా నిలుస్తున్నాయి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. ఒకప్పుడు అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కొన్ని విధివిధానాలు పాటించేవారు. నోటీసులిచ్చి సంజాయిషీలు తీసుకుని ఆ తర్వాత చర్యలు ప్రారంభించేవారు. కీడు శంకించినవారు న్యాయస్థానాలను ఆశ్రయించటం, వారికి ఊరట దొరకటం కూడా రివాజే. తమకు నచ్చని అభిప్రాయాలున్నా, ఏదో ఉదంతంలో నిందితులుగా ముద్రపడినా వారి ఇళ్లూ, దుకాణాలూ కూల్చే పాపిష్టి సంస్కృతి ఇటీవలి కాలపు జాడ్యం. సినిమా భాషలో చెప్పాలంటే ఇది ‘పాన్ ఇండియా’ సంస్కృతి! దీనికి ఆద్యుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. ఉత్తర ప్రదేశ్‌లో నేర సంస్కృతిని అరికట్టడంలో, సంక్షేమ పథకాలు అర్హులకు అందించటంలో ఆయన విజయం సాధించారని బీజేపీ చెబుతుంటుంది. కానీ అంతకన్నా ‘బుల్డోజర్ బాబా’గా పిలిపించుకోవటం యోగికి, అక్కడి బీజేపీకి ఇష్టం. చూస్తుండగానే ఇది అంటువ్యాధిలా పరిణమించింది. మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, కర్ణాటకల్లో బీజేపీ ప్రభుత్వాలు బుల్డోజర్లతో విధ్వంసానికి దిగాయి. మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో దొడ్డిదారిన అధికారం చేజిక్కించుకున్నాక బాబు ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కార్యాలయాలను బుల్డోజర్లతో కూల్చాలని చూసింది. ఒకటి రెండుచోట్ల ఆ పనిచేసింది కూడా. ఇక తమకు వ్యతిరేకంగా పనిచేశారన్న కక్షతో దిక్కూ మొక్కూలేని పేదల ఇళ్లు సైతం ఇదే రీతిలో ధ్వంసం చేసింది. రాజస్థాన్‌లో 2022లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా బీజేపీ ఏలుబడిలో ఉన్న రాజ్‌గఢ్ మున్సిపాలిటీ పరిధిలో ఈ దుశ్చర్య చోటు చేసుకుంది. మహారాష్ట్రలో శివసేన–కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి సర్కారు హయాంలో నిందితుల ఇళ్లనూ, దుకాణాలనూ కూల్చారు. కేంద్రం మాటే చెల్లుబాటయ్యే ఢిల్లీలో జహంగీర్‌పురా ప్రాంతంలో మతఘర్షణలు జరిగినప్పుడు అనేక ఇళ్లూ, దుకాణాలూ నేలమట్టం చేశారు. బాధితులు సుప్రీంకోర్టు ఉత్తర్వులు పొందేలోగానే విధ్వంసకాండ పూర్తయింది. 2020 నుంచి ముమ్మరమైన ఈ విష సంస్కృతిపై సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరిస్తూనే వచ్చింది. ‘నిందితులు మాత్రమే కాదు, శిక్ష పడినవారి ఇళ్లను సైతం కూల్చడానికి లేదు. ఈ విషయంలో చట్టనిబంధనలు పాటించి తీరాలి’ అని స్పష్టం చేసింది. కానీ ఆ చేష్టలు తగ్గిన దాఖలా లేదు. చుట్టూ మూగేవారు ‘ఆహా ఓహో’ అనొచ్చు. అవతలి మతంవారి ఇళ్లు, దుకాణాలు కూలుతున్నాయంటే తన్మయత్వంలో మునిగే వారుండొచ్చు. ఆఖరికి ఇళ్లు కూల్చిన ఉదంతాల్లో పాలుపంచుకున్న అధికారులు విందులు చేసుకున్న ఉదంతాలు కూడా వెల్లడయ్యాయి. కానీ సమాజంలో అరాచకం ప్రబలకూడదన్న ఉద్దేశంతో రాజ్య వ్యవస్థ ఏర్పడినప్పుడూ... రాజ్యాంగమూ, చట్టాలూ ఉన్నప్పుడూ... రాజ్యవ్యవస్థే తోడేలుగా మారితే దిక్కెవరు? సుప్రీంకోర్టు వద్దుగాక వద్దని చెప్పాక కూడా ఈ పోకడ ఆగలేదంటే ఏమను కోవాలి? ఒక వ్యక్తి నిజంగా తప్పు చేశాడనుకున్నా అతని కుటుంబమంతా అందుకు శిక్ష అనుభవించి తీరాలన్న పట్టుదల నియంతృత్వ పోకడ కాదా? సుప్రీంకోర్టు 95 పేజీల్లో ఇచ్చిన తీర్పు ఎన్నో విధాల ప్రామాణికమైనదీ, చిరస్మరణీయమైనదీ. ‘ఇల్లంటే కేవలం ఒక ఆస్తి కాదు... అది కొందరు వ్యక్తుల, కుటుంబాల సమష్టి ఆకాంక్షల వ్యక్తీకరణ. అది వారి భవిష్యత్తు. వారికి స్థిరత్వాన్నీ, భద్రతనూ చేకూరుస్తూ, సమాజంలో గౌరవం తీసుకొచ్చేది. ఇలాంటి ఇంటిని బలవంతంగా తీసుకోవాలంటే ముందుగా ఇతర ప్రత్యామ్నాయాలేవీ లేవని అధికారులు విశ్వసించాలి’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించిన తీరు అమానవీయత నిండిన పాలకులకు ఏమేరకు అర్థమైందో సంశయమే. ఆ మాటెలా వున్నా కఠిన చర్యలుంటాయన్న హెచ్చరిక వారిని నిలువరించే అవకాశం ఉంది. దేశంలో దిక్కూ మొక్కూలేని కోట్లాదిమంది సామాన్యులకు ఊరటనిచ్చే ఈ తీర్పులో హిందీ భాషా కవి ప్రదీప్ లిఖించిన కవితకు కూడా చోటు దక్కింది. దాని సారాంశం – ‘ఇల్లు, పెరడు ప్రతి ఒక్కరి స్వప్నం. ఆ కలను కోల్పోవడానికి సిద్ధపడతారా ఎవరైనా?’ బ్రిటన్ న్యాయకోవిదుడు లార్డ్ డెన్నింగ్ చేసిన వ్యాఖ్యలను కూడా తీర్పులో ఉటంకించారు. ‘రాజ్యా ధికారాన్ని ధిక్కరించి అతి సామాన్యుడు వేసుకున్న గుడిసె చిరుగాలికే వణికేంత బలహీనమైనది కావొచ్చు. ఈదురుగాలికి ఇట్టే ఎగిరిపోవచ్చు. దాన్ని వర్షం ముంచెత్తవచ్చు. కానీ చట్టనిబంధన అనుమతిస్తే తప్ప ఆ శిథిల నిర్మాణం వాకిలిని అతిక్రమించటానికి ఇంగ్లండ్ రాజుకు సైతం అధికారంలేదు’ అని లార్డ్ డెన్నింగ్ అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చూశాకైనా తమపై ఏ స్థాయిలో విశ్వాసరాహిత్యం ఏర్పడిందో ప్రభుత్వాలు గ్రహించాలి. నీతిగా, నిజాయితీగా, రాజ్యాంగానికి అనుగుణంగా పాలించటం నేర్చుకోవాలి. -
Telangana: బుల్డోజర్లకు బ్రేక్!
సాక్షి, హైదరాబాద్: వరుసగా అక్రమ నిర్మాణాల కూల్చివేతలతో కలకలం రేపిన ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)’కు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఇటీవలి పరిణామాలు, సంస్థాగత లోపాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. కనీసం 3 నెలలపాటు కూల్చివేతల జోలికి వెళ్లవద్దని సూచించింది. దీనితో హైడ్రా తమ విభాగం అంతర్గత నిర్మాణంపై దృష్టి పెట్టనుంది. మరోవైపు హెచ్ఎండీఏ, రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారులు చెరువులు, కుంటలపై విస్తృత సర్వే చేపట్టడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఏర్పడటానికి ముందు నుంచే కూల్చివేతలతో..చెరువుల ఆక్రమణల తొలగింపు కోసం హైడ్రా ఏర్పడటానికి ముందే.. జీహెచ్ఎంసీ అధీనంలో డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ‘విజిలెన్స్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం)’రూపంలో కూల్చివేతలు ప్రారంభించారు. జూన్ 27న ఫిల్మ్‌నగర్ కో–ఆపరేటివ్ సొసైటీలో తొలి ఆపరేషన్ చేపట్టారు. నార్నే గోకుల్ ఆక్రమించిన లోటస్ పాండ్‌లోని 0.16 ఎకరాలకు విముక్తి కల్పించారు. తర్వాత ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి, ఓఆర్ఆర్ వరకు పరిధిని కల్పిస్తూ జూలై 19న ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి దాదాపు 20 చోట్ల అక్రమ నిర్మాణాలను తొలగించారు. 50 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి, చెరువులను పరిరక్షించారు.విరామానికి కారణాలెన్నో..హైడ్రా ప్రభావంతో రాష్ట్రంలో, ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింది. ఇళ్లు, స్థలాల క్రయవిక్రయాలు పడిపోయాయి. మరో వైపు అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతల వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. నది వెంట ఇళ్ల సర్వే, ఖాళీ చేయించడం, కూల్చివేయడం వంటి చర్యలు చేపట్టింది. మూసీ ప్రాజెక్టుతో హైడ్రాకు సంబంధం లేకపోయినా.. రెండింటి కూల్చివేతలపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ కారణాల నేపథ్యంలో ప్రభుత్వం హైడ్రా కూల్చివేతలకు తాత్కాలికంగా బ్రేక్ వేసింది.‘హైడ్రా’వ్యవస్థ నిర్మాణంపై ఫోకస్కనీసం మూడు నెలల పాటు హైడ్రా ఆపరేషన్లు నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సమయంలో హైడ్రాకు సంబంధించిన పలు అంశాలను చక్కదిద్దనున్నట్టు సమాచారం. ప్రస్తుతం హైడ్రాకు పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు. ఇటీవలే వివిధ విభాగాల నుంచి 169 మందిని డిప్యూటేషన్‌పై నియమించారు. కానీ పోలీసు విభాగం నుంచి వచ్చిన 20 మంది మినహా మరే ఇతర విభాగాల సిబ్బంది హైడ్రా విధుల్లో చేరలేదు. మరోవైపు హైడ్రాలో చేరేందుకు ఆసక్తి చూపుతూ కొందరు ఉద్యోగులు దరఖాస్తు పెట్టుకున్నారు. అయితే వారిని రిలీవ్ చేయడానికి పలువురు శాఖాధిపతులు విముఖత చూపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం హైడ్రా వినియోగిస్తున్న కార్యాలయంతోపాటు సిబ్బందిలో దాదాపు అంతా జీహెచ్ఎంసీకి సంబంధించిన వారే. ఈ విషయంలో అటు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు, ఇటు హైడ్రాకు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సంస్థాగత అంశాలు, సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టనున్నారు.జల వనరుల ‘లెక్క’తేల్చేలా..జల వనరుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా హైడ్రాను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం చెబుతోంది. తొలిదశలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలకు సంబంధించిన ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్)లో ఉన్న ఆక్రమణలు తొలగించాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ చేపట్టడానికి ముందు ఆయా చెరువులు, వాటి ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను నోటిఫై చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తికాకపోవడాన్ని ఇటీవల న్యాయస్థానం సైతం ప్రశ్నించింది. దీనికోసం రెవెన్యూ, ఇరిగేషన్ విభాగాలతోపాటు హెచ్ఎండీఏ ఉమ్మడిగా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. తొలుత ప్రాథమిక, ఆపై తుది నోటిఫికేషన్లు జారీ చేయాలి. హెచ్ఎండీఏ లెక్కల ప్రకారం హైదరాబాద్‌తోపాటు శివారు జిల్లాల్లో కలిపి 2,688 జలవనరులు ఉన్నాయి. వీటిలో 2,364 ప్రిలిమినరీ నోటిఫికేషన్ స్థితి దాటగా, 324 మాత్రమే తుది నోటిఫికేషన్ దాకా వెళ్లాయి. 95 చెరువులకు హైడ్రా ఏర్పడిన తర్వాతే ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో వచ్చే మూడు నెలల్లో అన్ని చెరువుల సర్వే పూర్తి చేసి, తుది నోటిఫికేషన్ ఇచ్చేలా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. -
చెరువుల్ని వదలకుంటే చెరసాలకే!: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్/బండ్లగూడ: ‘చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల వల్లే వరదలు వస్తున్నాయి. వరదలతో పేదల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. ఫాంహౌస్‌ల నుంచి వచ్చే డ్రైనేజీని గండిపేటలో కలుపుతున్నారు. అందుకే చెరబట్టిన వారి నుంచి చెరువులను విడిపిస్తున్నాం. ఆక్రమించుకున్న చెరువులను స్వచ్ఛందంగా వదిలేయాలని ఆక్రమణ దారులకు విజ్ఞప్తి చేస్తున్నా..లేకపోతే చెరువులలోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి తీరుతాం. నాలాలపై ఆక్రమణలను కూడా తప్పనిసరిగా కూల్చేస్తాం. కూల్చివేతలపై స్టే తెచ్చుకుంటే కోర్టుల్లో కొట్లాడతాం. అవసరమైతే ఆక్రమణదారులను జైలుకు పంపేందుకూ వెనకాడం..’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. చెరువులు, నాలాల ఆక్రమణలు తొలగించే లక్ష్యంతోనే హైడ్రాను ఏర్పాటు చేశామని, ఆక్రమణదారులు ఎంత గొప్పవారైనా చర్యలు తప్పవని చెప్పారు. ఇదే తమ ప్రభుత్వ విధానమని పేర్కొన్నారు. చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలను క్రమబద్ధం చేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాజా బహదూర్ వెంకటరామారెడ్డి తెలంగాణ పోలీస్ అకాడమీలో బుధవారం నిర్వహించిన ఎస్ఐల దీక్షాంత్ పరేడ్‌లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 145 మంది మహిళలు సహా 547 మంది సివిల్ ఎస్ఐలు, రిజర్వ్ ఎస్ఐలు, ఏఎస్ఐల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. శిక్షణలో భాగంగా ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ట్రోఫీలను బహూకరించారు. పాసింగ్ అవుట్ పరేడ్ కమాండర్‌గా వ్యవహరించిన పల్లి భాగ్యశ్రీని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగించారు. డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం మోపాలి ‘పోలీస్ ఉద్యోగాన్ని కేవలం ఉద్యోగ బాధ్యతగా మాత్రమే కాదు.. రాష్ట్ర ప్రజలను కాపాడే ఉద్యోగంగా, భావోద్వేగంతో చూడాలి. ప్రకృతి విపత్తులైనా, శాంతిభద్రతల సమస్యలైనా, ఏ ఇతర సమస్య వచ్చినా ముందుగా అందుబాటులో ఉండేది పోలీసులే. ఆ మేరకు ప్రజల్లో విశ్వాసాన్ని, పోలీసులపై గౌరవాన్ని పెంచేలా పనిచేయాలి. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిపై ఉక్కు పాదం మోపాలి. సైబర్ నేరాలకు తావులేకుండా యువ పోలీస్ అధికారులు పనిచేయాలి. డ్రగ్స్, గంజాయి పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టాలి. ఆక్రమణల కూల్చివేతలు, డ్రగ్స్ కట్టడి సహా ప్రభుత్వ అన్ని నిర్ణయాలను అమలు చేయాల్సిన బాధ్యత యువ అధికారులపై ఉంది. కాస్మొటిక్ పోలీసింగ్ కాదు.. కాంక్రీట్ పోలీసింగ్ అవసరం. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది బాధితులతోనే.. నేరస్తులతో కాదు. మీ అందరినీ చూస్తోంటే తెలంగాణ డ్రగ్స్ రహితంగా మారుతుందన్న విశ్వాసం కలుగుతోంది..’అని సీఎం అన్నారు. రెండు రెసిడెన్షియల్ పోలీస్ స్కూళ్లు ‘సైనిక్ స్కూళ్ల మాదిరిగా హైదరాబాద్, వరంగల్‌లో ఒక్కొక్కటి 50 ఎకరాలతో రెండు రెసిడెన్షియల్ పోలీస్ స్కూళ్లు ఏర్పాటు చేస్తాం. హోంగార్డు నుంచి డీజీపీ పిల్లల వరకు ఉచితంగా చదువుకునే ఏర్పాటు చేస్తాం. ఇందుకు సంబంధించి డీజీపీ జితేందర్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి చర్యలు తీసుకోవాలి..’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏడాది చివర్లో కొత్తగా 35 వేల ఉద్యోగాలు ‘కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురావడమే కాదు.. రైతన్నలు, నేతన్నలు, గీతన్నలను ఆదుకుంటోంది. కేవలం 28 రోజుల్లోనే 22.22 లక్షల రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు వేసి రుణమాఫీ చేశాం. తెలంగాణ వచ్చినా గత తొమ్మిదేళ్లలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదు. గతంలో జిరాక్స్ సెంటర్లలో టీజీపీఎస్సీ ప్రశ్నపత్రాలు లభించే దారుణ పరిస్థితి ఉండేది. మా ప్రజా ప్రభుత్వంలో నిర్వహిస్తున్న ఉద్యోగ పరీక్షలపై నిరుద్యోగులకు ఎలాంటి అనుమానాలు లేవు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశాం. గ్రూప్–2 పరీక్ష వాయిదా వేసి నిరుద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. ఏడాది చివరికి కొత్తగా 35 వేల ఉద్యోగాలు ఇస్తాం..’అని ముఖ్యమంత్రి వెల్లడించారు. డీజీపీ జితేందర్ మాట్లాడుతూ.. శాంతిభద్రతలు కాపాడడంలో, ప్రజలకు న్యాయం చేయడంలో ఎస్ఐల పాత్ర కీలకం అని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని పొందేలా పనిచేయాలని యువ అధికారులకు సూచించారు. కాగా పోలీస్ అకాడమీలో శిక్షణ సంబంధిత వివరాలను పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష బిస్త్ ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్‌రెడ్డి, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవిగుప్తా, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, ఇతర సీనియర్ అధికారులు, యువ ఎస్ఐల కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్రూం‘హైదరాబాద్ నుంచి వచ్చే కాలుష్యంతో నల్లగొండ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి కోమటిరెడ్డి నా దృష్టికి తెచ్చారు. ఆక్రమణలు తొలగించి మూసీని ప్రక్షాళన చేస్తాం. మూసీలో శాశ్వత నివాసదారుల విషయంలో ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరిస్తుంది. వారికి డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తాం.నివాసితులైన 11 వేల మందిలో ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది’ ..: సీఎం రేవంత్ రెడ్డి :.. -
18 ప్రాంతాలు.. 43.94 ఎకరాలు!
సాక్షి, హైదరాబాద్: రాజధాని హైదరాబాద్‌లో ఉన్న జలవనరులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఏర్పాటైన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఇప్పటివరకు 18 ప్రాంతాల్లో మొత్తం 43.94 ఎకరాలు పరిరక్షించింది. వీటిలో ఎన్–కన్వెన్షన్ ఆక్రమించిన తమ్మిడికుంటతో పాటు ఇతర చెరువులు, ప్రభుత్వ భూములు, పార్కులు ఉన్నాయి. తొలుత జీహెచ్ఎంసీ అ«దీనంలోని డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్స్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) ఈ కూలి్చవేతలు ప్రారంభించింది.ఈ విభాగం డైరెక్టర్‌గా వచి్చన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏవీ రంగనాథ్ నేతృత్వంలోని బృందం ఈ ఏడాది జూన్ 27న ఫిల్మ్‌నగర్ కో–ఆపరేటివ్ సొసైటీలో తొలి ఆపరేషన్ చేపట్టింది. నార్నే గోకుల్ ఆక్రమించిన లోటస్ పాండ్‌లోని 0.16 ఎకరాలకు విముక్తి కలి్పంచడం తొలి ఆపరేషన్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. ఆపై జూలై 1, 4, 5, 14 తేదీల్లో మన్సూరాబాద్, ఎమ్మెల్యేస్ కాలనీ, మిథిలానగర్, బీజేఆర్ నగర్లపై పంజా విసిరింది. ఆ నాలుగు చోట్ల ఉన్న ఏడు నిర్మాణాలను కూలి్చ వేసింది. అప్పటివరకు ఆ ఆపరేషన్లు జీహెచ్ఎంసీ వరకే పరిమితం అయ్యాయి. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వరకు పరిధిని విస్తరించడమే కాకుండా హైడ్రాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గత నెల 19న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మరుసటి రోజే హైడ్రా కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన రంగనాథ్.. దూకుడు పెంచారు. మహదేవ్‌పురంలో తొలి ఆపరేషన్ గత నెల 21న మహదేవ్‌పురంలో పార్కు స్థలంలోని ఆక్రమణల తొలగింపుతో హైడ్రా ఆపరేషన్లు మొదలయ్యాయి. ఇలా శనివారం వరకు 18 చోట్ల ఉన్న 158 అక్రమ నిర్మాణాలను తొలగించింది. మొత్తం 43.94 ఎకరాల మేర ప్రభుత్వ భూములు, చెరు వులు పరిరక్షించింది. వీటిలో పలువురు వీఐపీలతో పాటు బడా రియల్టర్లకు చెందినవీ ఉన్నాయి. హైడ్రా ఏర్పాటై నెల రోజులు దాటినా ఇప్పటివరకు దానికి అదనంగా ఒక్క పోస్టును కానీ సిబ్బందిని కానీ కేటాయించలేదు. దీంతో ఇప్పటివరకు కేవలం ఈవీడీఎం, జీహెచ్ఎంసీలోని టౌన్ ప్లానింగ్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసుల సహకారంతోనే కార్య కలాపాలు సాగిస్తోంది.దీనికోసం ప్రతిపాదించిన అదనపు సిబ్బందితో పాటు ప్రత్యేక పోలీస్‌స్టేషన్‌ను కేటాయిస్తే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హైడ్రా షాక్ తగిలిన వారిలో సినీ నటుడు అక్కినేని నాగార్జునతో పాటు ప్రో కబడ్డీ యజమాని అనుపమ, కావేరీ సీడ్స్ యజమాని భాస్కరరావు, మంథని బీజేపీ నేత సునీల్‌రెడ్డి, బహదూర్‌పుర ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మహ్మద్ మీర్జా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (ఈయనపై కేసు నమోదైంది), చింతల్‌కు చెందిన బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు, కాంగ్రెస్ నేత పళ్లంరాజు సంబంధీకులు ఉన్నారు.హైడ్రా కూలి్చవేతల్లో కీలకమైనవి.. ⇒ మహదేవ్పురంపార్క్ స్థలంలోని నిర్మాణం ⇒ భూదేవిహిల్స్‌లో చెరువులను ఆక్రమించి చేపట్టిన ఐదు నిర్మాణాలు ⇒గాజులరామారంలోని చింతల్చెర్వులో ఉన్న 54 నిర్మాణాలు ⇒నందగిరి హిల్స్ పార్కులో 16 నిర్మాణాలు ⇒రాజేంద్రనగర్‌లోని బుమ్రాఖ్ దౌలా లేక్ లోని 45 నిర్మాణాలు ⇒ ఖానాపూర్, చిల్కూరుల్లోని గండిపేట చెరు వులో ఉన్న 24 నిర్మాణాలు ⇒తమ్మిడికుంట చెరువులోని ఎన్–కన్వెన్షన్‌తో పాటు ఇతర నిర్మాణాలు ⇒ ఫుట్‌పాత్‌లు, నాలాలపైన, ప్రభుత్వ స్థలా ల్లోని అక్రమ నిర్మాణాలు -
ఇది కురుక్షేత్ర యుద్ధమే: సీఎం రేవంత్‌రెడ్డి
మణికొండ (హైదరాబాద్): ‘ఆనాడు శ్రీకృష్ణుడు ధర్మాన్ని గెలిపించేందుకు అర్జునుడి వెంట ఉండి కురుక్షేత్ర యుద్ధం చేయించాడు. నేడు మేము ఆయన మార్గంలోనే భవిష్యత్తు తరాలకు ప్రకృతి సంపదను, చెరువులను అందించాలనే ఉద్దేశంతోనే చెరువుల్లో అక్రమ నిర్మాణాలను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నాం. ఇది కరుక్షేత్ర యుద్ధంతో సమానమే.. ఇందులో మా వారితో పాటు మంది కూడా ఉన్నారు. ఇది ఏమాత్రం రాజకీయ కక్ష కానేకాదు.. భవిష్యత్ తరాలు బాగుండాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నాం. ఎవరు ఎంత ఒత్తిడి తెచ్చినా తలవంచకుండా చెరువుల్లోని అక్రమ నిర్మాణాలన్నీ తొలగిస్తాం. వెనక్కి తగ్గేదే లేదు..’అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పునరుద్ఘాటించారు. ఆది వారం హైదరాబాద్ నగర శివారు నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో హరేకృష్ణ మూవ్మెంట్ వారు నిర్మిస్తున్న హెరిటేజ్ టవర్‌లో అనంత శేష స్థాపన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. చెన్నై, వయనాడ్‌లా కాకూడదు ‘హైదరాబాద్‌కు హెరిటేజ్ సిటీ, లేక్ సిటీగా పేరుంది. ఆ ప్రత్యేకతను సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. లేదంటే చెన్నై, వయనాడ్‌లా ప్రకృతి మనపై ప్రతాపం చూపిస్తుంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చెరువుల చుట్టూ సంపన్నులు ఫాంహౌస్‌లు కట్టుకుని వాటి డ్రైనేజీని చెరువుల్లో కలపటం ఎంతవరకు సబబు? అలాంటి వారిలో కొందరు మా పార్టీ వాళ్లు కూడా ఉండొచ్చు. తెలియక చేసిన తప్పులను సరిదిద్దుకునే సమయం వచ్చింది. వారు సైతం కూల్చివేతలకు సహకరించాలి. కృష్ణా, గోదావరి నదులు ఎండిపోయినా గండిపేట, హిమాయత్‌సాగర్ జలాలతో హైదరాబాద్ ప్రజలు దాహార్తి తీర్చుకున్న సందర్భాలు ఉన్నాయి. హైదరాబాద్‌ను సుందర నగరంగా తీర్చిదిద్దుకుని భవిష్యత్తరాలకు అందించేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకుని పనిచేస్తుంది. అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఇప్పటికే హైడ్రా పలు చెరువుల్లో ఆక్రమణలను తొలగించింది. రాబోయే రోజుల్లో మరింత దూకుడుగా పనిచేస్తుంది..’అని సీఎం స్పష్టం చేశారు కాంక్రీట్ జంగిల్‌కు ఆధ్యాత్మిక శోభ ‘మన రాష్ట్ర ఆర్థిక రాజధాని అయిన ఫైనాన్షియల్ జిల్లా కాంక్రీట్ జంగిల్‌గా అభివృద్ధి చెందింది. అలాంటి చోట ఆరు ఎకరాల విస్తీర్ణంలో 430 అడుగుల ఎత్తులో ఆధ్యాత్మికతను బోధించే హెరిటేజ్ టవర్ రావటం ఎంతో అభినందనీయం. ఇలాంటి దేవాలయ నిర్మాణ కార్యక్రమంలో పాల్గొనటంతో నా జన్మ ధన్యం అయ్యింది. 36 నుంచి 40 నెలల్లో పనులు పూర్తయ్యాక ప్రారంబోత్సవంలోనూ పాల్గొనాలని ఉంది. ఇది చరిత్రలో నిలిచిపోయే గొప్ప మందిరం అవుతుంది. ఇప్పటికే ఐటీ, వైద్యం, విద్య తదితర రంగాల్లో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న మన రాష్ట్రం, హెరిటేజ్ టవర్ నిర్మాణంతో ఆధ్యాత్మికతలోనూ అదే స్థాయికి వస్తుంది. అనునిత్యం ఒత్తిడిలో జీవిస్తున్న ప్రజలకు ఇలాంటి దేవాలయాలతో మనశ్శాంతి, స్ఫూర్తి లభిస్తాయి. అక్షయ పాత్ర ద్వారానే ఆస్పత్రుల్లో భోజనం అక్షయపాత్ర ద్వారానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ నాణ్యమైన భోజనం అందిస్తాం. ప్రభుత్వ పథకాల అమలుకు కూడా హరేకృష్ణ మూవ్మెంట్ సహకారం అందించాలి..’అని రేవంత్‌రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు టి.ప్రకాశ్‌గౌడ్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితారెడ్డి, రాష్ట్ర మత్స్య సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్ బి.జ్ఞానేశ్వర్, టీపీసీసీ అధికార ప్రతినిధి ఎం.జైపాల్‌రెడ్డి, హరేకృష్ణ మూవ్మెంట్ గ్లోబల్ అధ్యక్షుడు మధుపండిత దాస, తెలంగాణ రీజియన్ అధ్యక్షుడు సత్యగౌర చంద్ర దాసలు పాల్గొన్నారు. -
ట్రిపుల్‌వన్ అడ్రస్ తెలుసా హైడ్రా?
‘పరిధి’ దాటుతోందా? చెరువుల పరిరక్షణ, అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేసేందుకు ఏర్పాటైన ‘హైడ్రా’ పరిధి ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్ఆర్) వరకు ఉంటుందని ప్రభుత్వమే నిర్వచించింది. కానీ ట్రిపుల్ వన్ జీవో పరిధిలోని జంట జలాశయాల పరీవాహక ప్రాంతంలో సింహభాగం ఔటర్ వెలుపలే ఉంది. దీంతో ‘హైడ్రా’ పరిధిని దాటి, టార్గెట్ చేసి మరీ బుల్డోజర్లను ప్రయోగిస్తోందనే విమర్శలు వస్తున్నాయి.సెలబ్రిటీల నిర్మాణాలను ‘టచ్’ చేస్తారా? 111 జీవో పరిధిలో చాలా మంది ప్రజాప్రతినిధులు, బ్యూరోక్రాట్లు, సినీ సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు తక్కువ ధరకే పెద్ద ఎత్తున స్థలాలను కొనుగోలు చేశారు. వాటిలో నివాస, వాణిజ్య సముదాయాలు, ఫామ్‌హౌస్‌లు, రిసార్ట్‌లను నిర్మించుకున్నారు. ఇందులో ప్రభుత్వంలోని పలువురు కీలక మంత్రులు, మాజీ మంత్రులు, బహుళ జాతి సంస్థల అధినేతలు, సెలబ్రిటీల లగ్జరీ ఫామ్‌హౌస్‌లు కూడా ఉన్నాయి. మరి ప్రభుత్వం వాటిని ‘టచ్’ చేస్తుందా? ఆ అక్రమ నిర్మాణాలపైకి బుల్డోజర్లను ప్రయోగించగలదా? అని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు.సాక్షి, హైదరాబాద్: వందేళ్లుగా భాగ్యనగరవాసుల దాహార్తిని తీరుస్తున్న ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్‌సాగర్ జంట జలాశయాల పరిధిలోని అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం బుల్డోజర్లతో విరుచుకుపడుతోంది. అక్రమ భవనాలను తొలగించి, జలాశయాలను పరిరక్షించాలన్న ప్రభుత్వ ఉద్దేశం మంచిదేననే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. కానీ ‘ఈ కూల్చివేతలను కేవలం ‘ఎంపిక’చేసిన భవనాలు, నిర్మాణాలకే పరిమితం చేస్తారా? లేక అక్రమ నిర్మాణాలు అన్నింటిపైకీ బుల్డోజర్లు వెళతాయా? విచ్చలవిడి అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన 111 జీవో పరిధిలోని ప్రాంతాలపై ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా)’ దృష్టిపెడుతుందా?’అన్న ప్రశ్నలు వస్తున్నాయి. గండిపేట జలాశయం ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) పరిధిలోని అక్రమ నిర్మాణాలపైకి ‘హైడ్రా’ బుల్డోజర్లను నడిపిస్తున్న నేపథ్యంలో.. ట్రిపుల్ వన్ జీవో వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ‘ట్రిపుల్ వన్’పై తీవ్ర గందరగోళం జంట జలాశయాలను కాపాడేందుకు, వాటి పరీవాహక ప్రాంతాలను పరిరక్షించేందుకు 40 ఏళ్ల క్రితం ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని 84 గ్రామాలను జీవ పరిరక్షణ ప్రాంతం (బయో కన్జర్వేషన్ జోన్) పరిధిలోకి తీసుకొచ్చారు. ఈ జలాశయాల చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్య కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ 1994లో తొలుత జీవో–192ను తీసుకొచ్చారు. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం జీవో–111ను తెల్చింది. ఇటీవలి వరకు అది కొనసాగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్ దాహార్తిని తీర్చేందుకు జంట జలాశయాల మీద ఆధారపడాల్సిన అవసరం లేదని గత ప్రభుత్వం భావించింది. ఈ మేరకు 2022 ఏప్రిల్‌లో ట్రిపుల్ వన్ జీవోను రద్దు చేసి, దాని స్థానంలో జీవో నంబర్ 69ను తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఇక్కడి 84 గ్రామాలకు ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ రూపకల్పన, ఇతర అంశాలపై అప్పటి ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్ నేతృత్వంలో కమిటీని కూడా నియమించింది. కానీ ఆ కమిటీ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. ఈలోపు ఎన్నికలు సమీపించడం, ప్రభుత్వం మారడంతో జీవో–111పై గందరగోళం నెలకొంది. ‘ఎంపిక’ చేసిన భవనాలపైనేనా? గ్రేటర్ హైదరాబాద్ సిటీకి చేరువలో 84 గ్రామాలు, 1.32 లక్షల ఎకరాల భూములు, 584 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. క్లుప్తంగా జీవో– 111 పరిధి ఇది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాల ఫుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్టీఎల్) నుంచి 10 కిలోమీటర్ల వరకు ఎలాంటి శాశ్వత నిర్మాణాలు, లే–అవుట్లకు అనుమతి లేదు. ఈ ప్రాంతంలోని ఏ స్థలంలో అయినా దాని విస్తీర్ణంలో కేవలం 10శాతం మాత్రమే నిర్మాణాలు చేపట్టవచ్చు. అదీ శాశ్వత నిర్మాణం అయి ఉండకూడదు. నీటి సహజ ప్రవాహానికి ఏమాత్రం అడ్డుగా ఉండకూడదు. కానీ ఈ నిబంధనలు కాగితాలకే పరిమితయ్యాయి. అక్రమార్కులు అధికారులతో కుమ్మకై అడ్డగోలుగా నిర్మాణాలను చేపట్టారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు హైడ్రా, మున్సిపల్ శాఖల అధికారులు జలాశయాల పరీవాహక ప్రాంతాల్లోని అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టారు. ఇది ఈ జలాశయాల పరిధిలోని అన్ని అక్రమ నిర్మాణాలపై ఉంటుందా? లేదా కేవలం ‘ఎంపిక’ చేసిన నిర్మాణాల కూల్చివేతతోనే ఆగిపోతుందా? అని పర్యావరణవేత్తలు ప్రశ్నిస్తున్నారు. జలాశయాల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకోకపోతే ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌లు కూడా భవిష్యత్తులో హుస్సేన్‌సాగర్‌లా మురికికూపమైపోయే మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేకున్నా లక్షల్లో నిర్మాణాలు 40 ఏళ్ల కిందటే జంట జలాశయాల పరీవాహక ప్రాంతాన్ని బయో కన్జర్వేషన్ జోన్ పరిధిలోకి తీసుకువచ్చినా.. అక్రమ నిర్మాణాలు కొనసాగుతూ వచ్చాయి. గత పది, పదిహనేళ్లలో విపరీతంగా పెరిగాయి. అధికారులు కాసులకు కక్కుర్తిపడి ఇష్టారీతిగా నిర్మాణాలు సాగుతున్నా చూసీచూడనట్టు వదిలేశారు. ప్రధానంగా మెయినాబాద్, శంషాబాద్, శంకర్పల్లి, చేవెళ్ల, రాజేంద్రనగర్ మండలాల్లోని ట్రిపుల్ వన్ జీవో ప్రాంతంలో నివాస, వాణిజ్య సముదాయాలు, కర్మాగారాలు, హోటళ్లు, ఇతర భవన నిర్మాణాలు వెలిశాయి. జీవో–111 పరిధిలో 7 మండలాల్లోని 84 గ్రామాల పరిధిలో మొత్తం 426 అక్రమ లే–అవుట్లు, 10,907 గృహాలు, 1,363 వాణిజ్య నిర్మాణాలు, 190 పారిశ్రామిక, ప్రభుత్వ నిర్మాణాలు వెలిశాయని 2016లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హైకోర్టుకు నివేదించారు. ఇప్పుడు వీటి సంఖ్య లక్షల్లోనే ఉంటుందని అంచనా.అటు అభివృద్ధి.. ఇటు మనుగడ.. అభివృద్ధిలో వెనుకబడుతున్నామని, జీవో–111 ఎత్తే యాలని ఆ ప్రాంతంలోని వారు మొదట్నుంచీ కోరుతున్నారు. అలా చేస్తే జంట జలాశయాల మనుగడకు విఘాతం కలుగుతుందని పర్యావరణవేత్తలు స్పష్టం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వాలు స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ సర్కారు జీవో–111పై కోదండరెడ్డి నాయకత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ నివేదిక ఆధారంగా త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నాం. – చింపుల సత్యనారాయణరెడ్డి, తెలంగాణ పంచాయతీరాజ్ చాంబర్స్ ప్రెసిడెంట్ ఫిఫ్త్ సిటీగా జీవో–111 జీవో–111 పరిధిలోని 84 గ్రామాలను ఫిఫ్త్ సిటీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పూనుకోవాలి. జీవో పరిధిలోని 84 గ్రామాలకు నెట్ జీరో పాలసీని అవలంబించేలా ప్రత్యేక మాస్టర్ ప్లాన్ రూపొందించాలి. పర్యావరణానికి హాని కలిగించని, తక్కువ సాంద్రత కలిగిన నివాస, సంస్థాగత, వినోదాత్మక కేంద్రాల నిర్మాణాలకు మాత్రమే అనుమతి ఇవ్వాలి. వాన నీరు, జలచరాల అధ్యయన నివేదికను పరిగణనలోకి తీసుకోవాలి. – జీవీ రావు, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ -
ట్రిపుల్ ఆర్ వరకు హెచ్ఎండీఏ విస్తరణ...
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించనున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన నేపథ్యంలో జీవో 111 అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. జంట జలాశయాల పరిరక్షణ కోసం అమల్లోకి తెచ్చిన ఈ జీవో ఇప్పటికే అన్ని విధాలుగా నిర్వీర్యమైంది. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజనల్ రింగ్ రోడ్డు వరకు మహానగర విస్తరణ చేపట్టనున్న దృష్ట్యా జీవో 111పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ముందుకెళ్లనుందనేది ఆసక్తికరంగా మారింది. రీజనల్ రింగ్‌రోడ్డు వరకు ఉన్న అన్ని ప్రాంతాలను హెచ్ఎండీఏ పరిధిలోకి తేనున్నట్లు సీఎం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకనుగుణంగా మెగా మాస్టర్ ప్లాన్–2050 రూపొందించాలని ఆయన హెచ్ఎండీఏను ఆదేశించారు. దీంతో ట్రిపుల్ వన్ పరిధిలోని 82 గ్రామాలను మెగా మాస్టర్ ప్లాన్‌లో విలీనం చేస్తారా, లేక త్రిబుల్ వన్ జీవోను యధాతథంగా కొనసాగిస్తారా అనే అంశంపైన సందిగ్ధం నెలకొంది. ప్రస్తుతం హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌తోపాటు, సైబరాబాద్, పాత ఎంసీహెచ్, ఎయిర్‌పోర్టు, జీహెచ్ఎంసీ మాస్టర్ప్లాన్లు అమల్లో ఉన్నాయి. ఈ ఐదింటిని కలిపి ఒకే బృహత్తర మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాలని, ట్రిపుల్ వన్‌లోని ప్రాంతాలను కూడా మాస్టర్‌ప్లాన్ పరిధిలోకి తేవాలని గత ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ మేరకు అప్పట్లో ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేశారు. కానీ హైకోర్టు ఆదేశాలతో తిరిగి యదాతథస్థితి కల్పించవలసి వచ్చింది. ఈ క్రమంలో బృహత్తర మాస్టర్ప్లాన్పైన హెచ్ఎండీఏ ఇప్పటికే కసరత్తు చేపట్టింది. కానీ తాజా ప్రతిపాదనల మేరకు మెగా మాస్టర్‌ప్లాన్–2050పైన దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న 7000 చదరపు కిలోమీటర్ల హెచ్ఎండీఏ పరిధిని మరో 3000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరిస్తూ భారీ మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తే ప్రస్తుతం హెచ్ఎండీఏ పరిధిలోనే ఉన్న ట్రిపుల్ వన్ జీవోలోకి వచ్చే 82 గ్రామాల్లో ఉన్న సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి కూడా ఈ మాస్టర్‌ప్లాన్‌లో భాగం కానుంది. పరిరక్షణపై నీలినీడలు... ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల పరివాహక ప్రాంతాలను కాపాడేందుకు 1996లో ప్రభుత్వం జీవో 111ను అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే. హెచ్ఎండీఏ పరిధిలోని 82 గ్రామాలు ఈ జీవో పరిధిలో ఉన్నాయి. సుమారు 1.30 లక్షల ఎకరాల భూమి విస్తరించింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో ఒక స్థాయిలో ఈ జీవో చర్చనీయాంశమవుతూనే ఉంది. మరోవైపు జీవోను పటిష్టంగా అమలు చేయాలని కోరుతూ పర్యావరణ సంస్థలు, సామాజిక కార్యకర్తలు న్యాయస్థానాల్లో పోరాడుతున్నారు. జీవోకు విఘాతం కలిగించే చర్యలపైన కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే గత ప్రభుత్వం మరోసారి ఈ జీవోను కదిలించింది. 82 గ్రామాలకు చెందిన రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ జీవోను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. దాని స్థానంలో జీవో 69ను కూడా తెచ్చారు. కానీ న్యాయస్థానంలో జీవో 111 అమల్లోనే ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టతనివ్వడంతో తీవ్రమైన సందిగ్ధం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. భారీగా అక్రమ నిర్మాణాలు... ఒకవైపు ఇలా వివిధ రకాలుగా ట్రిపుల్ వన్ జీవోను నిర్వీర్యమవుతున్న పరిస్థితుల్లోనే అన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వట్టినాగులపల్లి, పుప్పాలగూడ, తదితర ప్రాంతాల్లో అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోనే అడ్డగోలుగా చేంజ్ ఆఫ్ లాండ్ యూజ్ సర్టిఫికెట్లను ఇచ్చేశారు. మరోవైపు రియల్ఎస్టేట్ వర్గాలు, నిర్మాణ సంస్థలు భారీగా అక్రమ నిర్మాణాలు చేపట్టాయి. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వరకు ఈ అక్రమ నిర్మాణాలు యథావిధిగా కొనసాగుతూనే ఉన్నాయి. శంషాబాద్, శంకర్పల్లి, తదితర ప్రాంతాల్లో వందల సంఖ్యలో బహుళ అంతస్థుల భవనాలు వెలిశాయి. ‘శంషాబాద్ పరిధిలోని శాతంరాయి, పెద్ద తుప్రా, ముచ్చింతల్ వంటి ప్రాంతాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. ఆ తరువాత అనుమతులు తీసుకుంటున్నారు.’ అని శంషాబాద్ ప్రాంతానికి చెందిన ఒక అధికారి విస్మయం వ్యక్తం చేశారు. ఏం చేస్తారు... ఇలా అన్ని విధాలుగా జీవో 111 ప్రమాదంలో పడిన దృష్ట్యా మెగామాస్టర్ ప్లాన్‌పైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం కన్జర్వేషన్ జోన్లో ఉన్న ప్రాంతాలను అలాగే ఉంచి మిగతా ప్రాంతాలకు మాస్టర్‌ప్లాన్ విస్తరిస్తారా లేక, ఈ జీవోలోని గ్రామాల కోసం ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ రూపొందిస్తారా అనే అంశాలు ఇప్పుడు చర్చనీయంగా మారాయి. మరోవైపు మెగా మాస్టర్‌ప్లాన్ ఎప్పటి వరకు రూపొందిస్తారనేది కూడా చర్చనీయాంశమే. ట్రిపుల్ ఆర్ వరకు నిర్మాణ రంగానికి అనుమతులపైన కూడా మాస్టర్‌ప్లాన్‌లో ఏ ప్రమాణాలను పాటిస్తారనేది కూడా తాజాగా ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం డీటీసీపీ పరిధిలో ఉన్న ప్రాంతాలు భవిష్యత్తులో హెచ్ఎండీఏ పరిధిలోకి రానున్నాయి. దీంతో భవన నిర్మాణాలకు హెచ్ఎండీఏ అనుమతులు తప్పనిసరి. అలాంటప్పుడు వివిధ రకాల జోన్ల విభజనపైన కూడా మాస్టర్‌ప్లాన్‌లో ఎలా ముందుకెళ్తారనేది కూడా రియల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
అద్దెకు.. టీడీపీ ఆఫీస్!
సాక్షి, అమరావతి: అధికారం ఉన్నా.. లేకున్నా.. టీడీపీ ‘భూ’ కబ్జాలు మాత్రం ఆగడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు వాగు పోరంబోకు భూమిని టీడీపీ ప్రధాన కార్యాలయం కోసం కేటాయించిన చంద్రబాబు.. ఇప్పుడు జీవో నిబంధనలకు విరుద్ధంగా పార్టీ కార్యాలయం ముందే దుకాణాలు నిర్మించి వాణిజ్య కార్యకలాపాలకు అద్దెకిస్తున్నారు. ఈ క్రమంలో జాతీయ రహదారి భూమిని సైతం కబ్జా చేసేశారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం వద్ద జరుగుతున్న ‘చంద్రబాబు చిలక్కొట్టుడు.. కబ్జా’ వ్యవహారం ఇప్పుడు బయటపడింది. కార్యాలయానికి.. వాగు పోరంబోకు భూమి చంద్రబాబు ప్రభుత్వం 2018లో గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామ పరిధిలోని సర్వే నంబరు 392లో ఉన్న 3.65 ఎకరాలను టీడీపీ రాష్ట్ర కార్యాలయం కోసం కేటాయించింది. ఎకరాకు ఏడాదికి కేవలం రూ.వెయ్యి చొప్పున 99 ఏళ్లకు లీజు కింద కేటాయిస్తూ జీవో 228 జారీ చేసింది. ఆ భూమి పూర్తిగా రాజకీయ కార్యకలాపాలకే వినియోగించాలని అందులో పేర్కొంది. ఇతరత్రా అవసరాలకు ఆ భూమిని వినియోగించకూడదని కూడా స్పష్టం చేసింది. ఈ భూ కేటాయింపులో చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘించి మరీ ఉత్తర్వులు జారీ చేయడం వివాదాస్పదం కూడా అయ్యింది. వాగు పోరంబోకు భూమిని చంద్రబాబు టీడీపీ కార్యాలయం కోసం కేటాయించుకున్నారు. వాగులు, చెరువులు, నదులు ఇతర జలవనరులకు సంబంధించిన భూముల్లో ఎలాంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. కానీ అందుకు విరుద్ధంగా వాగు పోరంబోకు భూమిని టీడీపీ కార్యాలయం కోసం కేటాయించుకున్నారు. దీనికి సంబంధించిన కేసు ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణలో ఉంది. సహకరిస్తున్న ఎన్హెచ్ఏఐ అధికారి! ఈ ఆక్రమణలపై ఎన్హెచ్ఏఐ యంత్రాంగం ఉదాసీనంగా ఉండటంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. డిప్యుటేషన్ మీద ఎన్హెచ్ఏఐలో పనిచేస్తున్న ఓ అధికారి టీడీపీకి వత్తాసు పలుకుతున్నట్లు సమాచారం. ఈ అక్రమ నిర్మాణాలపై ఇప్పటికే పలువురు ఫిర్యాదులు చేసినా.. ఆయన పట్టించుకోవట్లేదని చెబుతున్నారు. ఇక టీడీపీ కార్యాలయంలో సమావేశాలు జరిగితే.. ఎన్హెచ్ఏఐకు చెందిన తూర్పు, పశ్చిమ సర్వీసు రోడ్లను పూర్తిగా ‘బ్లాక్’ చేస్తూ.. పార్కింగ్‌కు వాడేసుకుంటున్నారు. ఇష్టమొచ్చినట్లుగా సర్వీస్ రోడ్లపై కార్లు అడ్డంగా పెడుతుండటంతో ఈ ప్రాంతంలో తరచూ ట్రాఫిక్ జామ్ అయ్యి ఇబ్బంది పడుతున్నట్లు స్థానికులు వాపోయారు. దర్జాగా ఆక్రమణలు.. దుకాణాల నిర్మాణం వాగు పోరంబోకు భూమి కేటాయింపుతో టీడీపీ అధినేత చంద్రబాబు సంతృప్తి చెందలేదు. పార్టీ ప్రధాన కార్యాలయం ఎదురుగా ఉన్న జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్హెచ్ఏఐ) పరిధిలోకి వచ్చే భూమిపైనా కన్నేశారు. నెమ్మదిగా దానిని ఆక్రమించడం మొదలుపెట్టారు. టీడీపీ ప్రధాన కార్యాలయానికి కేటాయించిన భూమికి, ఎన్హెచ్ఏఐ సర్వీసు రోడ్డుకు మధ్యలో ఉన్న స్థలాన్ని ఆక్రమిస్తూ నిర్మాణాలు చేపట్టారు. ఏడాది క్రితం టీడీపీ కార్యాలయం ప్రధాన గేటు పక్కన ఓ దుకాణాన్ని నిర్మించి.. మైత్రి ఎంటర్‌ప్రైజస్ అనే పేరుతో ఒకరికి అద్దెకు కూడా ఇచ్చారు. తాజాగా మరో రెండు దుకాణాలను నిర్మించి.. వాణిజ్య కార్యకలాపాల కోసం ఇతరులకు అద్దెకిచ్చారు. రాజకీయ కార్యకలాపాల కోసమే వినియోగించాలని టీడీపీ ఆఫీస్‌కు భూమిని కేటాయిస్తూ జారీ చేసిన జీవోలో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ.. దానికి విరుద్ధంగా ప్రవర్తించడమే కాకుండా.. ఎన్హెచ్ఏఐ సర్వీసు రోడ్డు పరిధిలోకి చొరబడి మరీ వాణిజ్య నిర్మాణాలు చేపట్టారు. ఇది పూర్తిగా నిబంధనల ఉల్లంఘనే. -
ఇప్పటం ఇళ్ల యజమానులకు ధర్మాసనంలోనూ షాక్
సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామానికి చెందిన కొందరు ఇళ్ల యజమానులకు హైకోర్టు ధర్మాసనం సైతం గట్టి షాక్‌నిచ్చింది. రోడ్డు మార్జిన్లను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టడమే కాకుండా వాటిని కూల్చివేసేందుకు అధికారులు నోటీసులిచ్చినా ఆ విషయాన్ని దాచిపెట్టి మధ్యంతర ఉత్తర్వులు పొందిన ఇళ్ల యజమానులు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఖర్చులు విధిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈమేరకు సింగిల్ జడ్జి తీర్పును సవాల్ చేస్తూ 14 మంది ఇళ్ల యజమానులు దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను ధర్మాసనం కొట్టి వేసింది. ఖర్చుల మొత్తాన్ని తగ్గించాలన్న విజ్ఞప్తిని సైతం తోసిపుచ్చింది. వాస్తవాలను దాచి పెట్టి కోర్టుల నుంచి సానుకూల ఉత్తర్వులు పొందే తీరును తామెంత మాత్రం ప్రోత్సహించబోమని తేల్చి చెప్పింది. ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే నిజమైన బాధితులకు అన్యాయం జరుగుతుందని, వారు సకాలంలో కోర్టును ఆశ్రయించి న్యాయం పొందే పరిస్థితి ఉండదని వ్యాఖ్యానించింది. ఒక్కొక్కరూ రూ.లక్ష చొప్పున 14 మంది రూ.14 లక్షలను ఖర్చుల కింద చెల్లించాలంటూ సింగిల్‌జడ్జి ఇచ్చిన తీర్పు సరైందేనని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదీ నేపథ్యం.. రహదారి విస్తరణలో భాగంగా పలు ఇళ్ల కూల్చివేతకు నిర్ణయం తీసుకున్న తాడేపల్లి మునిసిపల్ అధికారులు రోడ్ మార్జిన్లను ఆక్రమించుకుని అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఇళ్ల యజమానులకు ఈ ఏడాది మే 21న చట్ట ప్రకారం నోటీసులు జారీ చేశారు. అయితే రాజకీయ పార్టీల అండతో ఈ నోటీసులను సవాలు చేస్తూ బెల్లంకొండ వెంకట నారాయణ, మరో 13 మంది ఇళ్ల యజమానులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఎలాంటి షోకాజ్ నోటీసులు ఇవ్వకుండా నేరుగా కూల్చివేత నోటీసులు ఇచ్చారని ఆరోపించారు. ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న సింగిల్ జడ్జి జస్టిస్ రవినాథ్ తిల్హారీ... పిటిషనర్ల ఇళ్ల విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని మునిసిపల్ అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అటు తరువాత ఆ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా ఇళ్ల కూల్చివేత విషయంలో పిటిషనర్లకు అధికారులు ముందుగానే షోకాజ్ నోటీసులతో పాటు ఇతర నోటీసులు కూడా అందచేశారంటూ అందుకు సంబంధించి అన్ని ఆధారాలను మునిసిపల్ కార్పొరేషన్ తరఫు న్యాయవాదులు న్యాయమూర్తి ముందుంచారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి హైకోర్టును ఆశ్రయించిన 14 మంది పిటిషనర్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులు అందుకుని కూడా నోటీసులు ఇవ్వలేదంటూ హైకోర్టును తప్పుదోవ పట్టించడంపై మండిపడ్డారు. కోర్టు ముందు వాస్తవాలను దాచి పెట్టినందుకు ఒక్కొక్కరికి రూ. లక్ష చొప్పున 14 మందికి రూ.14 లక్షలను ఖర్చులుగా విధిస్తూ ఇటీవల తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆ 14 మంది ఇళ్ల యజమానులు ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేశారు... ఇళ్ల యజమానుల తరఫున సీనియర్ న్యాయవాది కలిగినీడి చిదంబరం వాదనలు వినిపిస్తూ పిటిషనర్లందరూ వ్యవసాయదారులని పేర్కొన్నారు. వారికి షోకాజ్ నోటీసులకు, తుది నోటీసులకు తేడా తెలియదన్నారు. దీంతో నోటీసులు ఇవ్వలేదని చెప్పారన్నారు. అంతేకానీ కోర్టును తప్పుదోవ పట్టించాలన్న ఉద్దేశం వారికి లేదన్నారు. జరిగిన తప్పులకు క్షమాపణ చెబుతున్నామన్నారు. అయితే ఈ వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. సింగిల్ జడ్జి తీర్పు సరైందేనని తేల్చి చెప్పింది. ఇలాంటి వ్యాజ్యాల వల్ల కోర్టుల సమయం వృథా అవుతోందని పేర్కొంది. వాస్తవాలను తొక్కి పెట్టి పిటిషన్ దాఖలు చేయడం ద్వారా కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేశారని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యాజ్యం దాఖలు చేయడం ద్వారా మిగిలిన కక్షిదారుల వ్యాజ్యం విచారణ జాబితాలో వచ్చే అవకాశం లేకుండా పోయిందని, ఇది ఓ రకంగా అన్యాయం చేయడమేనని వ్యాఖ్యానించింది. కేసులు సకాలంలో విచారణకు రాకపోవడంతో ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారని, అందుకు ఇప్పటం ఇళ్ల యజమానులు లాంటి వారు దాఖలు చేసే వ్యాజ్యాలే కారణమని పేర్కొంది. ఈ వ్యాజ్యాన్ని విచారించేందుకు హైకోర్టు ఎంతో సమయం వెచ్చించిందని తెలిపింది. ఆ సమయాన్ని నిజమైన బాధితులు దాఖలు చేసే వ్యాజ్యాలను విచారించేందుకు వెచ్చించి ఉంటే వారికి న్యాయం జరుగుతుందని పేర్కొంటూ అప్పీల్‌ను కొట్టేసింది. -
AP High Court: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే అటవీ, రెవిన్యూ, పంచాయతీ, మున్సిపల్ భూముల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలంటూ బుధవారం ఆదేశాలిచ్చింది. ఆరు నెలల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని అధికారులకు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. చదవండి: (శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల బుక్లెట్ ఆవిష్కరణ) -
మునిసిపల్ కార్యాలయాల్లో ఏసీబీ తనిఖీలు
సాక్షి, అమరావతి/సూళ్లూరుపేట/నరసరావుపేట: తిరుపతి జిల్లా సూళ్లూరుపేట, పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట మునిసిపల్ కార్యాలయాల్లో బుధవారం ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. భవన నిర్మాణాలకు అనుమతులు, అక్రమ నిర్మాణాలు అడ్డుకోకపోవడం వంటి వాటిపై ఫిర్యాదులు రావడంతో అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. సూళ్లూరుపేట మునిసిపల్ కార్యాలయం వద్ద నోట్ల కట్టలు స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేటలో ఒక భవనం కొలతలు తీసుకున్నారు. ఈ తనిఖీలు నేడు కూడా కొనసాగే అవకాశం ఉంది. రూ.1.9 లక్షల స్వాధీనం సూళ్లూరుపేట మునిసిపల్ కార్యాలయంపై ఉమ్మడి నెల్లూరు జిల్లా ఏసీబీ డీఎస్పీ మోహన్ నేతృత్వంలోని అధికారులు తనిఖీలు చేపట్టారు. భవన నిర్మాణ అనుమతుల విషయంలో అవినీతి జరుగుతోందని స్పందనలో సూళ్లూరుపేటకు చెందిన వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ దాడులు చేశారు. ఏసీబీ అధికారులు కార్యాలయంలోకి వచ్చిన వెంటనే మునిసిపల్ కమిషనర్ చాంబర్ కిటికీకి పక్కనే రూ.500 నోట్ల కట్టలు రెండు, వంద రూపాయల నోట్ల కట్ట ఒకటి కనిపించాయి. వాటిని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ కారులో రూ.50 వేలు దొరికాయి. కొందరు ఉద్యోగుల వద్ద రూ.30 వేలు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం రూ.1.90 లక్షలు స్వాధీనం చేసుకున్నామని ఏసీబీ డీఎస్పీ చెప్పారు. టౌన్ ప్లానింగ్ సెక్షన్‌కు అధికారి లేకపోవడంతో ఆ బాధ్యతలను ప్రస్తుతం కమిషనర్ చూస్తున్నారు. వసూలు చేసిన ఫీజు అధికారుల వద్దే.. నరసరావుపేట మునిసిపల్ కార్యాలయంలో ఏసీబీ అదనపు ఎస్పీ జె.వెంకటరావు ఆధ్వర్యంలో డీఎస్పీ ప్రతాప్‌కుమార్, ఇతర అధికారులు తనిఖీలు చేశారు. రికార్డులు, కంప్యూటర్లను తమ ఆధీనంలోకి తీసుకుని ప్లాన్ల∙వివరాలను పరిశీలించారు. పాతూరు ఆంజనేయస్వామి ఆలయ సమీపంలోని ఒక నూతన భవనాన్ని టేపులతో కొలతలు తీసుకున్నారు. ఆ సమయంలో మునిసిపల్ కమిషనర్ డి.రవీంద్ర అక్కడే ఉండగా టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ అంతకు గంటముందే తనకు ఆరోగ్యం బాగాలేదంటూ ఒక ప్రైవేటు వైద్యశాలలో చేరినట్లు తెలిసింది. తరువాత ఏసీబీ అధికారుల ఆదేశాల మేరకు టీపీఎస్‌తోపాటు పలువురు ఉద్యోగులు కార్యాలయానికి వచ్చారు. అదనపు ఎస్పీ వెంకటరావు విలేకర్లతో మాట్లాడుతూ పట్టణ ప్రణాళిక విభాగంపై తమకు రెండు ఫిర్యాదులు వచ్చాయన్నారు. తమ తనిఖీల్లో చాలా అవకతవకలను కనుగొన్నట్లు చెప్పారు. ప్లాన్‌కు విరుద్ధంగా, అసలు ప్లాన్ తీసుకోకుండా నిర్మాణాలు చేస్తున్నా టౌన్‌ప్లానింగ్ అధికారులు నియంత్రించలేదని తెలిపారు. అనుమతి ఇచ్చిన ప్లాన్‌కు సంబంధించిన ఫీజును వీరే వసూలు చేసి తమ దగ్గరే ఉంచుకున్నారని చెప్పారు. -
ఢిల్లీ జహంగీర్పూరాలో ఉద్రిక్తత
-
జీ+2 పర్మిషన్ తీసుకుని.. అయిదారు అంతస్తులు వేసారా?
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు ఎక్కువ విస్తీర్ణంలో చేపట్టిన భారీ అక్రమ నిర్మాణాలను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించిన హెచ్ఎండీఏ తాజాగా తక్కువ విస్తీర్ణంలోని అక్రమ భవనాలపై దృష్టి సారించింది. హెచ్ఎండీఏ పరిధిలోని ఏడు జిల్లాల్లో, అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగరపంచాయతీలలో అక్రమ నిర్మాణాలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టింది. వివిధ జిల్లాలకు చెందిన అధికార యంత్రాంగాలు, మున్సిపల్ అధికారులు, పోలీసులు తదితర విభాగాలకు చెందిన ప్రత్యేక బృందాలతో త్వరలోనే విస్తృత స్థాయిలో దాడులు చేపట్టనున్నారు. పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించనున్నారు. గత నెల 17 నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేతలను కొనసాగించారు. నగర శివార్లలోని వివిధ ప్రాంతాల్లో ఇప్పటి వరకు 202 అక్రమ భవనాలను గుర్తించి కూల్చివేతలు చేపట్టారు. చట్టవిరుద్ధమని తెలిసినా.. గ్రామ పంచాయతీలలో జీ+2 కోసం అనుమతులు తీసుకొన్న భవన యజమానులు నిబంధనలకు విరుద్ధంగా అయిదారు అంతస్తుల భవనాలను నిర్మించారు. హెచ్ఎండీఏ ఇప్పటి వరకు చేపట్టిన కూల్చివేతలలో చాలా వరకు 600 నుంచి1000 గజాల విస్తీర్ణం కలిగిన స్థలాలు. ఇక నుంచి 600 చదరపు గజాల లోపు స్థలాల్లోనూ చేపట్టిన అక్రమ నిర్మాణాలే టార్గెట్‌గా దాడులు కొనసాగించనున్నారు. 150 గజాల నుంచి 250 గజాల వరకు ఉన్న స్థలాల్లో కూడా చాలా చోట్ల బహుళ అంతస్తుల భవనాల నిర్మాణం చేపట్టారు. ఇలాంటివి పూర్తిగా చట్టవిరుద్ధం. (క్లిక్: ఫ్లాట్ కొంటున్నారా? ఏం చేస్తే బెటర్!) అక్రమాలు వేల సంఖ్యలో.. నగర శివారు ప్రాంతాల్లో వేలాది అక్రమ నిర్మాణాలు వెలిశాయి. వీటిని క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం పారదర్శకమైన అనుమతులను అందుబాటులోకి తెచ్చింది. చాలామంది నిర్మాణదారులు నిబంధనలను ఉల్లంఘించి గ్రామపంచాయతీల అనుమతులతోనే బహుళ అంతస్తులు చేపట్టారు. కోవిడ్ కాలంలో ఇలాంటి అక్రమ భవనాలను ఎక్కువగా నిర్మించినట్లు అధికారులు అంచనా వేశారు. తక్కువ విస్తీర్ణంలో చేపట్టిన అక్రమ కట్టడాలు వేల సంఖ్యలో ఉంటాయని అంచనా. కొరవడిన నిఘా... హెచ్ఎండీఏ ఇప్పటి వరకు చేపట్టిన కూల్చివేతల్లో తిరిగి అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు కూల్చిన కట్టడాలను ప్రజాప్రతినిధులు, స్థానిక నేతలు, ఎమ్మెల్యేల అండతో తిరిగి నిర్మిస్తున్నారు. నిజాంపేట్, తుర్కయంజాల్, పోచారం, ఘట్కేసర్, అన్నోజీగూడ తదితర చోట్ల ఇలా పునర్నిర్మించి కొనుగోలుదారులకు అప్పగించారు. (క్లిక్: హైదరాబాదీలకు శుభవార్త! నగరంలో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లు) -
కూలుతున్న అక్రమ కట్టడాలు
సాక్షి, హైదరాబాద్: మున్సిపాలిటీలుగా మారిన గ్రామ పంచాయతీలలో సరైన అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ కట్టడాలపై సర్కారు కన్నెర్ర చేసింది. వాటిని కూల్చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. గ్రామ పంచాయతీల అనుమతి పేరు చెప్పి కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గత మూడేళ్లుగా భారీ ఎత్తున నిర్మాణాలు సాగుతూనే ఉన్నాయి. నెలక్రితం దుండిగల్‌లో పంచాయతీ అనుమతితో అక్రమంగా నిర్మిస్తున్న కట్టడం విషయం వెలుగుచూడడంతో పురపాలక శాఖ సీరియస్ అయింది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, సీడీఎంఏ సత్యనారాయణ ఇతర అధికారులు సమావేశమై రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీ నుంచి గతంలో నిర్మాణ అనుమతి పొందినప్పటికీ, మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్లుగా మారాక ఆయా ప్రాంతాల్లో తిరిగి సంబంధిత విభాగాల అనుమతి పొందాలని, లేని పక్షంలో కూల్చివేస్తామని ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే పురపాలక శాఖ అధికారులు అక్రమ భవన నిర్మాణాలపై చర్యలు ప్రారంభించారు. ఆయా జిల్లాల టాస్క్ ఫోర్స్ బృందాలు సోమవారం నుంచే భవన నిర్మాణాల కూల్చివేతకు శ్రీకారం చుట్టాయి. హైదరాబాద్ శివార్లలోని జిల్లాల్లో ముందుగా 600 చదరపు గజాల విస్తీర్ణానికి మించి ఉన్న అక్రమ నిర్మాణాలపై ఆయా జిల్లాల టాస్క్ ఫోర్స్ బృందాలు చర్యలకు దిగాయి. కూల్చివేతలను మంగళవారం సైతం కొనసాగించారు. ఇతర జిల్లాల్లో సైతం భారీగా అక్రమ కట్టడాలు రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనమైన గ్రామాల్లో రెండేళ్ల కాలంలో నిర్మించిన, నిర్మిస్తున్న కట్టడాల డేటాను అధికారులు సేకరించారు. ఈ మేరకు కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, రామగుండం, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు వాటికి ఆనుకొని ఉన్న కొత్త మున్సిపాలిటీల్లో కూడా గ్రామ పంచాయతీ అనుమతి పేరిట భారీగా నిర్మాణాలు జరిగినట్లు గుర్తించారు. వ్యక్తిగత నివాస భవనాలతో పాటు కళాశాలలు, హాస్టళ్లు, స్కూళ్లను బహుళ అంతస్తుల్లో నిర్మించినట్లు కనుగొన్నారు. వీటిలో స్థానిక పట్టణ అథారిటీ, డీటీసీపీ అనుమతి లేకుండా సాగిన నిర్మాణాలన్నింటినీ కూల్చివేయాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు పురపాలక శాఖ అధికారి ఒకరు తెలిపారు. -
విశాఖ కలెక్టర్ వ్యక్తిగత హాజరుకు హైకోర్టు ఆదేశం
సాక్షి, అమరావతి: విశాఖపట్నం జిల్లా సబ్బవరం గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చర్యలు తీసుకోవాలన్న తమ ఆదేశాలను అమలు చేయడంలో విఫలమైనందుకు విశాఖ జిల్లా కలెక్టర్ జనవరి 3వ తేదీన వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. విచారణను 3వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. సబ్బవరంలోని 255, 272, 277 సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ భూమిలో కె.దుర్గాప్రసాద్ అనే వ్యక్తి అధికారులతో కుమ్మక్కై నిర్మాణాలు చేపడుతున్నారంటూ ఎస్.చినవెంకటేశ్వర్లు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. విచారణ జరిపిన సీజే ధర్మాసనం ప్రభుత్వ భూమిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని కలెక్టర్‌ను ఆదేశిస్తూ గత ఏడాది ఉత్తర్వులిచ్చింది. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు వచ్చింది. కోర్టు ఆదేశాలున్నా ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు కొనసాగుతున్నాయని పిటిషనర్ న్యాయవాది ఎన్.హెచ్.అక్బర్ తెలిపారు. కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో అధికారులు విఫలమయ్యారంటూ, అక్రమ నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలను ధర్మాసనం ముందుంచారు. వాటిని పరిశీలించిన ధర్మాసనం కలెక్టర్‌పై మండిపడింది. -
నయా మున్సిపాలిటీల్లో అక్రమ నిర్మాణాలపై నజర్
సాక్షి, హైదరాబాద్: నయా మున్సిపాలిటీల్లోని అక్రమ నిర్మాణాలపై పురపాలక శాఖ నజర్ పెట్టింది. పంచాయతీలు మున్సిపాలిటీలుగా రూపాంతరం చెందే సమయంలో సర్పంచ్, పాలకమండలితోపాటు కార్యదర్శులుగా వ్యవహరించినవారు ఇచ్చిన ‘అనుమతుల’తో అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలు వెలిశాయి. ఇటీవల దుండిగల్‌లో నకిలీ అనుమతితో సాగిన నిర్మాణం వెలుగులోకి రావడంతో పురపాలక శాఖ అప్రమత్తమైంది. ఇటీవల ఏర్పాటైన 68 కొత్త మునిసిపాలిటీలు, మున్సిపాలిటీల్లో విలీనమైన 131 గ్రామ పంచాయతీల్లో 2018 తర్వాత పాత తేదీల అనుమతితో వెలిసిన వెంచర్లు, నిర్మించిన భవనాలు, ఇళ్లు, తదితర కట్టడాల వివరాలను తెప్పించింది. ఎల్ఆర్ఎస్, బీపీఎస్‌లపై కోర్టుల్లో వివాదాలున్న నేపథ్యంలో కొత్త విధానం ద్వారా అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలను క్రమబద్ధీకరించేలా కసరత్తు సాగుతున్నట్లు తెలిసింది. మున్సిపాలిటీల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించడం కష్టంగా మారడంతో న్యాయ పరమైన చిక్కులు రాకుండా కొత్త విధానాన్ని రూపొందిస్తున్నట్లు తెలిసింది. కొత్త మున్సిపాలిటీల్లోనే ఈ కొత్తవిధానం వర్తించేలా రూపొందించాలని యోచి స్తున్నట్లు సమాచారం. ఏ సర్వే నంబర్లో ఏ స్థలానికి ఎప్పుడు అనుమతి మంజూరైంది? నిర్మాణం సాగిన వివరాలను కూడా ఇన్‌వార్డు, అవుట్వార్డుల్లో నమోదు చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందుతున్నట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో దీనికి సంబంధించి పురపాలక శాఖ ద్వారా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ శివార్లు, ఇతర పట్టణాల సమీపంలో... గ్రేటర్ హైదరాబాద్ శివార్లన్నీ గతంలో గ్రామపంచాయతీలే. శివార్లలో గత 20 ఏళ్ల నుంచి వేల సంఖ్యలో లేఅవుట్లు వెలసి కాలనీలు ఏర్పాటయ్యాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత 2016 నుంచి మళ్లీ శివారు పంచాయతీల్లో కొత్త వెంచర్లు, నిర్మాణాలు వచ్చాయి. పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా మారిన శివారు ప్రాంతాల్లోనూ పాత తేదీల ‘అనుమతి పత్రాల’తో కొత్త లేఅవుట్లు వెలిశాయి. దీంతో ఐటీ కారిడార్ పరిధిలోని కిస్మత్పూర్, పీరంచెరువు, బైరాగిగూడ, కోకాపేట, గోపన్‌పల్లి, మణికొండ, పుప్పాల్‌గూడ, నార్సింగి, మంచిరేవుల, బండ్లగూడ, దుండిగల్, పోచారం ప్రాంతాలతో పాటు ఓఆర్ఆర్కు లోపలున్న స్థలాలకు డిమాండ్ పెరిగింది. ఇక్కడ పాత లేఅవుట్ల ఆధారంగా అనుమతిపత్రాలు సృష్టించి అక్రమ నిర్మాణాలు జరిగి నట్లు, ఇంకా జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. బోడుప్పల్, పిర్జాదిగూడ, బడంగ్‌పేట, బండ్లగూడ, మీర్‌పే ట, జిల్లెలగూడ, జవహర్‌నగర్ కార్పొరేషన్లతో పాటు ఇబ్రహీంపట్నం, జల్పల్లి, కోకాపేట, పోచారం, మణికొండ, పుప్పాలగూడ, నార్సింగి, శంషాబాద్, ఆదిబట్ల, నాగారం, ఘట్కేసర్, పెద్ద అంబర్‌పేట, కరీంనగర్లో కొత్తపల్లి, మహబూబ్‌నగర్‌లో భూత్పూరు మొదలైన మున్సిపాలిటీల్లో ఒక ఫ్లోర్ అనుమతితో రెండు మూడంతస్తుల భవనాలను నిర్మించి నట్లు, పార్కులు, ఇతర సామాజిక అవసరాల కోసం లే అవుట్లో వదిలేసిన స్థలాలు కూడా ఆక్రమణలకు గురై భవనాలు వెలిసినట్లు పురపాలక శాఖ గుర్తించింది. -
సాక్షి ఎఫెక్ట్: అక్రమాల కోటలు కూలుతున్నాయ్..
సాక్షి, విశాఖపట్నం: ఆదివారం ఉదయం.. బుల్డోజర్లు కదులుతుంటే.. అక్రమార్కుల గుండెలదిరాయి. అనధికార నిర్మాణాలను జేసీబీలతో కూలగొడుతుంటే.. టీడీపీ నేతల వెన్నులో వణుకుపుట్టింది. అడ్డగోలుగా ఫుట్‌పాత్ ఆక్రమించేసి ఏర్పాటు చేసిన దుకాణాల్ని తొలగిస్తుంటే... కబ్జాదారులకు చెమటలు పట్టాయి. ఐదేళ్ల కాలంలో టీడీపీ ఎమ్మెల్యేలు అధికార దర్పం ప్రదర్శించారు. నిబంధనలు మీరి అక్రమాల పునాదులపై అడ్డగోలుగా నిర్మించినవి కొన్నైతే.. స్థలాలు కబ్జా చేసి దర్జాగా కట్టిన కోటలు ఇంకొన్ని.. వెరసి టీడీపీ నేతల దాష్టీకాలపై అధికారులు పంజా విసిరారు. ‘సాక్షి’ దినపత్రికలో వరుసగా ప్రచురితమవుతున్న తెలుగుదేశం పార్టీ నేతల అక్రమాల సిత్రాలు.. నగరంలో సంచలనంగా మారాయి. పల్లా ఆక్రమణలకు మాస్టర్‌ప్లాన్ రోడ్డు చిన్నబోయి అక్రమాల కంచెలో ఇరుక్కుపోయింది. ఇప్పుడా కబ్జా కంచెను కత్తిరించేశారు. ప్లాన్‌కు విరుద్ధంగా చేపడుతున్న అడ్డగోలు నిర్మాణాన్ని జీవీఎంసీ పెకలించేసింది. మరోవైపు వెలగపూడి బ్యాచ్ ఫుట్‌పాత్ ఆక్రమణలపైనా జీవీఎంసీ ఉక్కుపాదం మోపింది. రెండు కిలోమీటర్ల వ్యవధిలో ఏకంగా 70 దుకాణాలను ఫుట్‌పాత్‌లపైనే ఏర్పాటు చేసి దందా సాగించిన పచ్చ రాబందుల రెక్కలు విరిచేశారు. పల్లా అక్రమ నిర్మాణంపై జీవీఎంసీ కొరడా గాజువాక: మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన అక్రమ నిర్మాణంపై జీవీఎంసీ అధికారులు కొరడా ఝళిపించారు. అనుమతుల్లేకుండా నిర్మిస్తున్న భవనాన్ని కూలి్చవేశారు. దీనిపై తొలుత కొంత ఉద్రిక్తత చోటుచేసుకున్నప్పటికీ సంబంధిత, అధికారులు, పోలీసులు చొరవ తీసుకోవడంతో టౌన్‌ప్లానింగ్ సిబ్బంది తమ పని పూర్తిచేశారు. గాజువాకకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాతగాజువాక జంక్షన్‌లోని 1033 చదరపు గజాల (864.33 చదరపు మీటర్ల) స్థలంలో ఒక వాణిజ్య సముదాయ నిర్మాణాన్ని చేపట్టారు. 227.84 చదరపు మీటర్ల వరకు రోడ్డు విస్తరించి ఉంది. దీంతో ఆయనకు 636.49 చదరపు మీటర్లు మిగిలింది. ఇందులో నిబంధనల ప్రకారం మినహాయింపులు పోనూ 221.45 చదరపు మీటర్ల స్థలంలో ఈ సముదాయ నిర్మాణానికి జీవీఎంసీ నుంచి అనుమతులు పొందారు. సెల్లార్+జి+4 భవన నిర్మాణానికి అనుమతి పొందగా, ప్రస్తు తం సెల్లార్+జి+1 అంతస్తుల శ్లాబులు పూర్తిచేశారు. అయితే అనుమతులకు విరుద్ధంగా నిర్మా ణం సాగుతోందని జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదులు అందడంతో పరిశీలించిన అధికారులు నిజమేనని నిర్ధారించారు. ఈ నిర్మాణంలో మాస్టర్ ప్లాన్ రోడ్లో 25.46 చదరపు మీటర్ల ఏరియా కూడా ఆక్రమణకు గురవడంతోపాటు సెట్ బ్యాక్లను కూడా ఉంచలేదని గుర్తించారు. ఒక అంతస్తుకు 221.45 చదరపు మీటర్ల అనుమతి పొందగా 369.86 చదరపు మీటర్ల చొప్పున నిర్మాణం సాగిస్తున్నట్టు నిర్ధారించారు. ఒక్కో అంతస్తుకు 148.41 చదరపు మీటర్ల చొప్పున అదనపు భాగాన్ని నిర్మిస్తున్నట్టు గుర్తించిన అధికారులు అదనంగా చేపట్టిన నిర్మాణాన్ని ఆదివారం తొలగించారు. తెల్లవారుజామున భవనం వద్దకు చేరుకున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు అదనపు నిర్మాణాన్ని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పల్లా శ్రీనివాసరావు, టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకొని తొలగింపును అడ్డుకోవడానికి ప్రయత్నించారు. తాను అనుమతులు తీసుకుని నిర్మాణం చేపట్టానంటూ టౌన్‌ప్లానింగ్ అధికారి నరేంద్రనాథ్‌రెడ్డి తదితరులతో వాదనకు దిగారు. దీంతో వారు మాస్టర్ ప్లాన్ రోడ్డు, సెట్ బ్యాక్‌లు లేకపోవడం, అనుమతి పొందినదానికంటే అదనంగా నిర్మించడం తదితర విషయాలను వివరించారు. గాజువాక పోలీసుల సూచన మేరకు అక్కడి నుంచి పల్లా శ్రీనివాసరావు వెళ్లిపోవడంతో టౌన్‌ప్లానింగ్ అధికారులు అనధికార నిర్మాణాన్ని తొలగించారు. ఈ వ్యవహారం పల్లా మీడియాతో మాట్లాడారు. తనకు హైకోర్టులో ఊరట లభిస్తుందని భావిస్తున్నానని చెప్పారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా జీవీఎంసీ అధికారులు తన భవనాన్ని తొలగించడం అన్యాయమన్నారు. వెలగపూడి ‘దుకాణాలు’ క్లోజ్.. కొమ్మాది (భీమిలి): ప్రశాంత విశాఖ నగరంపై దందాల సంతకం చేసిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి..అధికారాన్ని అడ్డంపెట్టుకొని విషపు సంస్కృతిని వ్యాపింపజేశారు. తూర్పు నియోజకవర్గంలో మొదలుపెట్టి.. భీమిలి నియోజకవర్గంలోనూ పాగా వేశారు. ఆక్రమణల పర్వాన్ని అడ్డగోలుగా సాగించి ఫుట్‌పాత్‌లను సైతం మింగేశారు. అనుచరులకు నచ్చిన చోట ఎలాంటి అనుమతులు లేకుండా దుకాణాలు పెట్టించేసి దందా సాగించారు. దుకాణాలను తొలగిస్తున్న జేసీబీ.. అడ్డగోలుగా 70 దుకాణాలు.. జీవీఎంసీ 8వ వార్డు గీతం కాలేజీ డౌన్ నుంచి చిన్న రుషికొండ మీదుగా పెద్ద రుషికొండ వరకు ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 70 దుకాణాలు అడ్డగోలుగా పెట్టించారు. సుమారు రెండు కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్న ఈ ఆక్రమణల్లో వెలసిన ఒక్కో దుకాణం నుంచి ఏడాదికి రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకూ వసూలు చేసేవారు. ‘సాక్షి’ కథనాలతో బ్రేక్! అధికారంలో లేకపోయినా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానన్న ధైర్యంతో ఆక్రమణల పర్వం కొనసాగించాలనుకున్న వెలగపూడి బ్యాచ్ ఆగడాలకు ‘సాక్షి’ వరుస కథనాలు బ్రేక్ వేశాయి. సాక్షిలో ప్రచురితమైన వరుస కథనాలకు జీవీఎంసీ అధికారులు స్పందిస్తూ వెలగపూడి దుకాణాలను బంద్ చేయించారు. మూడు రోజులుగా ఫుట్‌పాత్ ఆక్రమణలను తొలగిస్తున్న టౌన్‌ప్లానింగ్ అధికారులు వెలగపూడి అండ్ కో ఆక్రమించేసుకున్న బీచ్‌రోడ్డు ఫుట్‌పాత్‌లపై చర్యలకు ఉపక్రమించారు. రైట్ టు వాక్ పేరుతో ఆక్రమణల తొలగింపు బీచ్‌రోడ్ వెంబడి ఫుట్‌పాత్‌లపై వెలగపూడి, టీడీపీ అనుచరులు అక్రమంగా ఏర్పాటు చేసుకున్న ఫుడ్‌స్టాళ్లు, దుకాణాలను పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ఆదివారం తొలగించారు. తెల్లవారు జామున 5 గంటల నుంచి పోలీసు బందోబస్తు నడుమ 70 బడ్డీలను తొలగించారు. ఫుట్‌పాత్‌లను కేవలం పాదచారులకు మాత్రమే వినియోగించేలా జీవీఎంసీ నిర్ణయం తీసుకుందని, ఇందుకోసం ‘రైట్ టు వాక్’ పేరుతో ఆక్రమణలను తొలగిస్తున్నట్టు జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ డీసీపీ రాంబాబు వెల్లడించారు. దీనికితోడు ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకూ బీచ్ రోడ్డు విస్తరణ, సుందరీకరణ పనులు త్వరలోనే చేపట్టనున్న నేపథ్యంలో కమిషనర్ ఆదేశాల మేరకు తాత్కాలిక ఆక్రమణలను తొలగిస్తున్నామని ఆయన వివరించారు. ఆక్రమణదారుల ఆందోళన.. ఫుట్‌పాత్‌పై అక్రమంగా వెలసిన బడ్డీల తొలగింపునకు నిరసనగా ఫుట్‌పాత్ ఆక్రమణదారులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా బడ్డీలను తొలగిస్తున్నారని, కనీసం బడ్డీల్లోని సామగ్రిని తీసుకునే సమయం ఇవ్వనదున తీవ్రంగా నష్టం పోతున్నామని వాపోయారు. వీరితో టీడీపీ కార్యకర్తలు కలిసిపోయి గందరగోళం సృష్టించేందుకు ప్రయతి్నంచారు. పీఎంపాలెం సీఐ రవికుమార్ ఆక్రమణదారులతో మాట్లాడి సామాన్లు తీసుకెళ్లేందుకు సమయం ఇచ్చారు. వారంతా దుకాణాల్లోని సామగ్రిని తీసుకెళ్లిపోయారు. అనంతరం షాపుల తొలగింపు ప్రక్రియను సాయంత్రం వరకూ నిర్వహించారు. టౌన్‌ప్లానింగ్ టీపీవోలు రఘునాథరావు, ప్రసాద్ పర్యవేక్షణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఫుట్‌పాత్‌లను ఆక్రమించి ఏర్పాటు చేసిన బడ్డీలను తొలగించారు. చదవండి: మాయా జలం: మంచి నీటి పేరిట మహా మోసం నేడే చూడండి.. గణబాబు ఆక్రమణ ‘చిత్రం’ -
టీడీపీ మాజీ ఎమ్మెల్యే పల్లా అక్రమ నిర్మాణం కూల్చివేత
సాక్షి, విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన అక్రమ నిర్మాణాన్ని విశాఖ మహానగర పాలకసంస్థ (జీవీఎంసీ) అధికారులు ఆదివారం కూల్చివేశారు. గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆక్రమణలపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన జీవీఎంసీ అధికారులు చర్యలకు ఉపక్రమించారు. పాత గాజువాక జంక్షన్‌లోని 1,033 చదరపు గజాల స్థలంలో ఒక వాణిజ్య సముదాయ నిర్మాణానికి నిబంధనల ప్రకారం మినహాయింపులు పోను 221.45 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించేందుకు జీవీఎంసీ నుంచి అనుమతులు పొందారు. సెల్లార్+జీ+4 భవన నిర్మాణానికి అనుమతి పొందిన ఆయన ప్రస్తుతం సెల్లార్+జీ+1 అంతస్తులకు శ్లాబులను పూర్తిచేశారు. అనుమతులకు విరుద్ధంగా నిర్మాణం సాగుతుండటంతో.. పరిశీలించిన అధికారులు నిబంధనల్ని ఉల్లంఘించినట్లు గుర్తించారు. మాస్టర్‌ప్లాన్ రోడ్డును సైతం ఆక్రమించి ఎలాంటి సెట్బ్యాక్లు లేకుండా అడ్డగోలుగా కడుతున్నట్లు నిర్ధారించారు. ఆదివారం తెల్లవారుజామున భవనం వద్దకు చేరుకున్న జీవీఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులు అదనపు నిర్మాణాల్ని తొలగించేందుకు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న పల్లా శ్రీనివాసరావు, టీడీపీ కార్యకర్తలు కాసేపు హడావుడి చేశారు. పోలీసుల రంగప్రవేశంతో పల్లా అక్కడ నుంచి నిష్క్రమించారు. దీంతో అక్రమ నిర్మాణాన్ని టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు మరోవైపు..నగరంలోని ఫుట్పాత్లన్నింటినీ టీడీపీ నేతలు ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేయడంపై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు.. ‘రైట్ టు వాక్’ పేరుతో తొలగింపు చర్యలు చేపట్టారు. మూడు రోజుల్లో ఫుట్‌పాత్‌లపై ఉన్న 305 దుకాణాలు తొలగించారు. బీచ్‌రోడ్డులో అడ్డగోలుగా టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి అనుచరులు ఏర్పాటు చేసిన 70 దుకాణాల్ని జీవీఎంసీ అధికారులు ఆదివారం తొలగించారు. -
పైసలిస్తారా.. ఫిర్యాదు చేయాలా..?
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: అక్రమ నిర్మాణాల పేరుతో బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. కొందరు చట్టాలకు అతీతులమన్నట్లు పెట్రేగిపోయి భవన నిర్మాణ దారుల నుంచి రూ. లక్షల్లో వసూలు చేస్తున్నారు. అక్రమ నిర్మాణం కూల్చివేయకుండా ఉండాలంటే తాము చెప్పిన ధరకే అపార్టుమెంట్ ఫ్లాట్‌ను ఇవ్వాలని బలవంతంగా తమ పేరిట రాయించుకుంటున్నట్లు పోలీసు యంత్రాంగం దృష్టికి వచ్చింది. ఇటీవల ఈ ఘటనలపై జీహెచ్ఎంసీ, పోలీసులకు ఫిర్యాదులు అందడంతో వారిని కట్టడి చేసేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోన్ పరిధిలోని మూసాపేట, కూకట్పల్లి సర్కిళ్లలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలనే లక్ష్యంగా చేసుకొని బెదిరింపులకు దిగుతున్న 20 మందిపై పోలీసు ప్రత్యేక దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం. గతంలో ఎవరెవరిని బెదిరింపులకు గురి చేశారో..? ఎంత మొత్తంలో దండుకున్నారో పక్కా ఆధారాలతో ఆటకట్టించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. కూకట్పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో రోజూ అక్రమ నిర్మాణాలు లక్ష్యంగా చేసుకొని రాత పూర్వకంగా, సోషల్ మీడియా ద్వారా సుమారు 40 కిపైగా ఫిర్యాదులు రావడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతుంది. రెండేళ్ల క్రితం అక్రమ నిర్మాణదారులను, ప్రభుత్వ భూముల్లో వెలసిన ఇళ్ల వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న ఓ మహిళను కూకట్పల్లి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితురాలి ఇంట్లో దొరికిన ఫిర్యాదు పత్రాలు, సెల్పోన్లో నిక్షిప్తం చేసిన బహుళ అంతస్తుల భవనాల ఫొటోలను చూసిన పోలీసులు అవాక్కయ్యారు. తాజాగా హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని బసంత్‌రాజ్ ఉదంతంలోనూ ఇలాంటి ఫిర్యాదులే తలెత్తడంతో పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. చదవండి: మీర్పేట్లో వ్యభిచార గృహం సీజ్ పిల్లలకు తిండి పెట్టలేని మాకు..ఆత్మహత్యే శరణ్యం! అక్రమ నిర్మాణాలపై చర్యల విషయంలో అధికారుల పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. అక్రమ నిర్మాణాలు కొన్నయితే.. ఎలాంటి నిబంధనలు లేకుండానే చేపట్టే నిర్మాణాలు మరికొన్ని. అయితే వీటిలో ఎక్కువశాతం నిర్మాణాలకు నోటీసులు జారీ చేయడమే తరువాయి అన్నట్లుగా పెద్దఎత్తున ఒత్తిళ్లను తీసుకువచ్చి చర్యలు తీసుకోకుండా అడ్డుకునేవారు కొందరైతే, మరికొందరు ఫిర్యాదులు మొదలుపెట్టి తమకు తాయిలం దక్కే వరకూ బెదిరింపులకు పాల్పడేవారు మరికొందరు. టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు అవినీతికి పాల్పడటం దేవుడెరుగు, ఫిర్యాదుదారులకు ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు ఇప్పించాల్సిన దుస్థితికి దిగజారిపోయారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఫిర్యాదు చేయండి చర్యలు తీసుకుంటాం.. అక్రమ నిర్మాణాల పేరుతో బిల్డర్లను బెదిరింపులకు గురి చేసి డబ్బులు వసూలు చేసే కొంతమందిపై ఫిర్యాదులు అందాయి. పూర్తి ఆధారాలు సేకరించి చర్యలు తీసుకుంటాం. ఇంకా ఎవరైనా కూకట్పల్లి, కేపీహెచ్‌బీ, బాచుపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో బెదిరింపులకు పాల్పడితే తమ దృష్టికి తీసుకురావాలి. వారి వివరాలను గొప్యంగా ఉంచి నిందితులపై చర్యలు తీసుకుంటాం. -సురేందర్‌రావు, ఏసీపీ -
..కూల్చే అధికారం మీకెక్కడిది?
సాక్షి, హైదరాబాద్: ‘ఉరి తీయబోయేటప్పుడు కూడా చివరి కోరిక అడుగుతారు. అలాంటిది అక్రమ నిర్మాణమని నోటీసు కూడా ఇవ్వకుండానే ఇంటిని కూల్చేస్తారా? నోటీసు జారీ చేయకుండా కూల్చేసే అధికారాన్ని మున్సిపల్ కమిషనర్లకు కట్టబెడతారా? అధికారంలో ఉన్నామని ఇష్టానుసారంగా చట్టాలు చేస్తామంటే కుదరదు. రాజ్యాంగం నిర్దేశించిన మేరకే ప్రభుత్వ చర్యలు ఉండాలి’ అని ప్రభుత్వంపై హైకోర్టు మండిపడింది. మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 174 (4), సెక్షన్ 178 (2) రెండింటినీ కలిపి చట్టాన్ని అన్వయించాలే గాని, ఒక సెక్షన్‌కే పరిమిత మై చర్యలు ఉండకూడదని స్పష్టం చేసింది. నోటీ సు జారీ చేయకుండానే అక్రమ నిర్మాణాలను కూ ల్చేసేలా మున్సిపల్ చట్టంలోని సెక్షన్ 178 (2)ను సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డితో కూడిన ధర్మా సనం సోమవారం విచారించింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 11కు వాయిదా వేసింది. తెల్లారేసరికి ఇంటి ముందు బుల్డోజర్ ఉంటే ఆ ఇంటి యజమాని పరి స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని కోర్టు పేర్కొంది. దీనిపై ప్రభుత్వ న్యాయవాది కల్పించుకుని ప్లాన్ ప్రకారం నిర్మాణం చేస్తామని భరోసా ఇచ్చి దాన్ని ఉల్లంఘిస్తే నోటీసు జారీ చేయాల్సిన అవసరం ఏముంటుందన్నారు. కోర్టు స్పందిస్తూ.. ఉరి శిక్ష విధించే కేసులోనైనా నేరస్తుల వాదనలు వినాలని రాజ్యాంగం నిర్దేశిస్తోందని, అలాంటిది అనుమతి పొందిన ప్లాన్‌ను అతిక్రమించి నిర్మిస్తే వాళ్ల వాదన వినేందుకు నోటీసు కూడా ఇవ్వరా అని ప్రశ్నించింది. రోడ్డు పక్కనో, ఫుట్పాత్లపైనో గుడిసెలను తొలగించేటప్పుడు కూడా అందులో నివాసమున్న వారికి నోటీసులివ్వాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పింది. ‘ఒక ప్లాన్ ప్రకారం ఒక అంతస్తుకు అనుమతి తీసుకుని, రెండో అంతస్తు నిర్మించారనుకుందాం. మున్సిపల్ కమిషనర్‌కు తెలియకుండానే రెండో అంతస్తు నిర్మాణానికి టౌన్ ప్లానింగ్ అధికారి అనుమతిచ్చారని అనుకుందాం. బుల్డోజర్లతో కూల్చేసే అధికారం మున్సిపల్ కమిషనర్లకు ఇవ్వడం ఎంత వరకు చట్టబద్ధత?’అని పేర్కొంది. సాంకేతిక కారణాల సాకుతో అడ్డుకోవద్దు.. మంజూరు చేసిన ప్లాన్‌ను ఉల్లంఘించి నిర్మాణాలు చేసి వాటి విషయంలోనే ఆ విధమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వ న్యాయవాది వివరించారు. చట్టాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు రిట్ పిటిషన్ దాఖలు చేయాలని, పిల్‌ను విచారించడానికి వీల్లేదని పేర్కొన్నారు. దీంతో ధర్మాసనం కల్పించుకుని.. సాంకేతిక కారణాలతో అడ్డుకునే ప్రయత్నాలు చేయొద్దని, ఒక ఇంటి నిర్మాణానికి అనుమతి పొందిన ప్లాన్‌లో మార్పు చేసి నిర్మాణం చేస్తే నోటీసు కూడా ఇవ్వకుండా ఏ చట్టం కింద కూల్చేస్తారని, ప్రభుత్వమూ రాజ్యాంగానికి లోబడి పనిచేయాలని చీవాట్లు పెట్టింది. అధికారంలో ఉన్నామని ఏకపక్షంగా అధికారాలను చెలాయిస్తామంటే ఎలాగని ప్రశ్నించింది. అయితే ఇటీవల అక్రమ నిర్మాణాలపై హైకోర్టు ఆందోళన వెలిబుచ్చిందని అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ గుర్తు చేయగా.. అది నిజమేనని, అయితే ఏకపక్షంగా నోటీసు కూడా ఇవ్వకుండా అక్రమ నిర్మాణాలతోపాటు అనుమతి పొంది.. ప్లాన్ డీవియేట్ అయ్యే నిర్మాణాలను కూడా కూల్చేసే అధికారాలను మున్సిపల్ కమిషనర్లకు ఇస్తారా అని ప్రశ్నించింది. ఈ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారని, దీన్ని మరో రెండేళ్ల వరకు ఏర్పాటు చేయకపోతే ఇళ్ల నిర్మాణాల వివాదాలను ఎదుర్కొనే వాళ్ల పరిస్థితి ఏం కావాలని నిలదీసింది. -
నిబంధనలు అతిక్రమిస్తే ‘ఈ-నోటీస్’
సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాల తొలగింపునకు ‘ఈ-నోటీస్’ ఇస్తున్నామని జీహెచ్ఎంసీ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ..ఈ విధానంలో పారదర్శకత కనిపిస్తుందని వెల్లడించారు. సిస్టం ద్వారానే ప్రక్రియ అంతా జరుగుతుందని.. ప్రతీ నోటీస్‌కు క్యూఆర్ కోడ్ ఉంటుందని పేర్కొన్నారు. దీంతో అన్ని వివరాలు ప్రజలకు తెలుస్తాయని వివరించారు. అక్టోబర్ నుంచి ఈ పద్ధతి ఉపయోగిస్తున్నామని వెల్లడించారు. మాన్యువల్ పద్ధతి ఇక్కడ ఉండదని.. లొకేషన్ పూర్తి వివరాలతో పాటు భద్రతాపరమైన అంశాలు ఉంటాయని పేర్కొన్నారు. కోర్టుకి ఎవరైనా వెళ్ళినా ఇది పూర్తిస్థాయి ఆధారంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పటి వరకు 4,61,783 అక్రమ బ్యానర్లు, వాల్‌పోస్టర్స్, గోడ రాతలు, భవన నిర్మాణ వ్యర్థాలు తొలగించామని వెల్లడించారు. 136 కి.మీల పరిధిలో ఫుట్‌పాత్ అక్రమ నిర్మాణాలు తొలగించామని విశ్వజిత్ పేర్కొన్నారు. -
కోర్టు చెబితే మాకేంటి?
రామ్‌నగర్ రాక్‌డేల్ లేఅవుట్లో విలువైన ఖాళీ స్థలంపై ఆక్రమణదారుడు కన్నేశాడు. నకిలీ దస్తావేజులు సృష్టించి బహుళ అంతస్థులతో భారీ నిర్మాణం చేపట్టేందుకు 2012లో జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నాడు. అధికారులు కూడా వెంటనే అనుమతులు ఇచ్చేయడంతో నిర్మాణం చేపట్టాడు. విషయం తెలిసి అసలు హక్కుదారుడు కోర్టును ఆశ్రయించడంతో గుడ్డిగా ఎలా అనుమతులు ఇచ్చారంటా కోర్టు అధికారులకు చీవాట్లుపెట్టి వెంటనే ప్లాన్ రద్దుచేసి నిర్మాణం ఆపేయాలని ఆదేశించింది. అయినా కోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి నిర్మాణం కొనసాగిస్తుండడం విస్మయం కలిగిస్తోంది. సాక్షి, విశాఖపట్నం: అక్రమానికి బరితెగిస్తే.. అధికారులే కాదు.. అపర బ్రహ్మలు అడ్డొచ్చినా ఆగేది లేదు.. అడ్డగోలుగా నిర్మాణాలు సాగించేస్తాం అన్నట్లుగా జోన్–3 పరిధిలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. జోన్–3 టౌన్ ప్లానింగ్‌లో కిందిస్థాయి నుంచి ఉన్నతాధికారి వరకు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుండటంతో న్యాయస్థానం తీర్పుల్ని కూడా తుంగలో తొక్కుతూ అక్రమ నిర్మాణాలు కానిచ్చేస్తున్నారు. రామ్‌నగర్ దరి రాక్‌డేల్ లేఅవుట్లో టౌన్ సర్వేనెంబరు 1187లో ఉన్న సుమారు 3600 గజాల స్థలం 25 ఏళ్లుగా వివాదంలో ఉంది. ఈ స్థలానికి ఆనుకుని ఉన్న ఫ్లాట్ నెంబర్ 19లో ఓ వ్యక్తి ఆ సమయంలో ఈ స్థలంపై కన్నేసి, నకిలీ దస్తావేజులు సృష్టించి 2 వేల చదరపు గజాల స్థలంలో నిర్మాణం చేపట్టేందుకు జీవీఎంసీకి దరఖాస్తు చేసుకున్నాడు. పూర్తిస్థాయిలో పరిశీలన చేయకుండా సంబంధిత అధికారులు నిర్మాణం చేపట్టేందుకు బిల్డింగ్ అప్లికేషన్ (బీఏ) 10567/2012/జోన్3 పేరున ఆగస్టు 1, 2012 తేదీన అనుమతులు కట్టబెట్టేశారు. ఇంకేముంది అప్పనంగా సంపాదించిన స్థలంలో అడ్డగోలుగా భవన నిర్మాణం సాగించేశారు. అసలు హక్కుదారులు కోర్టును ఆశ్రయించారు. విశాఖపట్నం ఆరో అదనపు జిల్లా జడ్జి అక్టోబర్ 12, 2018న జీవీఎంసీకి మొట్టికాయలు వేసి, ప్లాన్ రద్దుచేయాలని ఎల్.ఎ.నెంబర్ 28/2017, ఓ.ఎస్.నెంబర్ 314/2016తో ఆర్డర్ చేసింది. అయితే కోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ఆ యజమాని యథేచ్చగా ఆ అక్రమనిర్మాణ పనులను చేపట్టడం పలువురిని విస్మయానికి గురిచేస్తోంది. నగరం నడి»ొడ్డున ఇంత పెద్ద అక్రమ నిర్మాణం సాగుతున్నా జోన్–3 సిబ్బంది పట్టించుకోకపోవడం వెనుక పెద్దమొత్తంలోనే ఆమ్యామ్యాలు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ విద్యుల్లతను వివరణ కోరగా.. ప్రస్తుతం ఈ స్థలానికి సంబంధించిన వివాదం కోర్టులో ఉండటంతో పనులన్నీ నిలిపి వేశామని తెలిపారు. దీనికి సంబంధించిన ప్లాన్ కూడా అప్పట్లో రద్దు చేశామని వివరించారు. మరోసారి స్థలాన్ని పరిశీలించి సంబంధిత జోనల్ అధికారుల నుంచి నివేదిక తీసుకుంటామని వెల్లడించారు. -
ఉగాదికి ఇళ్ల పట్టాలు
-
పేదలకు ఏపీ సర్కారు బంపర్ ఆఫర్
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంతాల్లో అభ్యంతరాల్లేని అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. రెండు సెంట్లలోపు వరకు మొత్తం రూపాయికే రిజిస్ట్రేషన్ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అంతకు మించితే క్రమబద్ధీకరణ ఫీజు ఎంత ఉండాలన్న దానిపై ప్రతిపాదనలు రూపొందించాలని ఆయన సూచించారు. అలాగే, వీటి క్రమబద్ధీకరణకు విధివిధానాలు తయారు చేయాలన్నారు. ఉగాది నాటికి పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చే విషయమై గురువారం ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) పిల్లి సుభాష్ చంద్రబోస్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, గృహ నిర్మాణ శాఖ మంత్రి రంగనాథరాజులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. కాల్వగట్ల వాసులకు ప్రాధాన్యం నదీతీరాల వెంబడి, కాల్వగట్ల వెంబడి ఉన్న ఇళ్ల కారణంగా ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పు పొంచి ఉన్నందున.. స్థలాలు, ఇళ్ల కేటాయింపులో ఇక్కడి వారికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. గతంలో స్థలం ఇచ్చినా రిజిస్ట్రేషన్ చేసే వారు కాదని.. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నామన్నారు. చంద్రబాబు పేదలకు ఇచ్చిన స్థలాలను లాక్కున్నారని.. ఒకసారిఇచ్చిన తర్వాత ఎలా లాక్కుంటారని జగన్ ప్రశ్నించారు. ఇళ్ల నిర్మాణానికి వీలైనంత మేర ప్రభుత్వ స్థలాలనే వాడుకోవాలని ఆయన స్పష్టం చేశారు. విడివిడిగా ఇళ్లే ఇవ్వండి పట్టణ ప్రాంతాల్లో అవకాశం ఉన్నచోట పేదలకు అపార్ట్మెంట్ ఫ్లాట్లు కన్నా.. ఇళ్ల స్థలాలు కేటాయించి వాటిలో విడివిడిగా ఇళ్లు కట్టించాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం పేదలు ఉంటున్న బహుళ అంతస్తుల సముదాయాల్లో నిర్వహణ సరిగ్గాలేదని.. ఫలితంగా ఫ్లాట్లు దెబ్బతింటున్నాయని ముఖ్యమంత్రి వివరించారు. దీనికి పరిష్కారంగా లబ్ధిదారులకు విడివిడిగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. అలాగే, ప్రస్తుతం సమస్యలు ఎదుర్కొంటున్న ఫ్లాట్లను బాగుచేసుకునేలా ఏదైనా ఆలోచన చేయాలన్నారు. లబ్ధిదారుల జాబితా విధిగా ప్రదర్శించాలి ఇళ్ల స్థలాలు పొందే లబ్ధిదారుల జాబితాలను విధిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని కూడా సీఎం ఆదేశించారు. ఇళ్ల స్థలాల కోసం ఎవరికైనా అర్హత లేకపోతే అందుకు కారణాలను కూడా వారికి తెలియజేయాల్సిందేనని స్పష్టంచేశారు. ఈ సమయంలో మంత్రి బుగ్గన జోక్యం చేసుకుని.. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాలు, ఇళ్లు విషయంలో.. వైఎస్సార్సీపీకి ఓట్లేశారని, ఆ పార్టీ సానుభూతిపరులంటూ వారికి నిరాకరించారని తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించే లబ్ధిదారుల జాబితా కింద దరఖాస్తులు ఎవరికి చేయాలి.. ఎలా చేయాలి.. ఎవరిని సంప్రదించాలి వంటి సూచనలు కూడా ఇవ్వాలని సీఎం చెప్పారు. జనవరి వరకూ దరఖాస్తులు స్వీకరించాలి ఇళ్ల స్థలాల లబ్ధిదారుల నుంచి జనవరి వరకూ దరఖాస్తులు స్వీకరించాలని, లక్ష్యం కన్నా మరో 10 శాతం అదనంగా ఇళ్ల స్థలాలను బఫర్‌గా పెట్టుకుంటే దరఖాస్తుదారులు అనుకున్న దానికంటే ఎక్కువ ఉన్నా ఇబ్బందిలేకుండా ఉంటుందని సీఎం అన్నారు. 20,47,325 మంది లబ్ధిదారులు ఇప్పటివరకూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లబ్ధిదారుల సంఖ్య 20,47,325గా తేలిందని, ఇది ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకూ 19,389 ఎకరాల భూమిని గుర్తించామని, ఇక్కడ మరో 8వేల ఎకరాలు అవసరమయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే, పట్టణ ప్రాంతాల్లో 2,559 ఎకరాలను గుర్తించామని, ఇక్కడ ఇంకా 11వేల ఎకరాలు అవసరమవుతాయని అంచనా వేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. మొత్తం మీద పేదల ఇళ్ల స్థలాల కోసం సుమారు రూ.10 వేల నుంచి రూ.12 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందన్నారు. (చదవండి: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం) -
అక్రమ నిర్మాణాలకు తుది నోటీసులు
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని రమేశ్ అతిథి గృహం సహా కృష్ణా నది కరకట్ట లోపల అక్రమంగా నిర్మించిన 3 భవనాలకు సీఆర్డీఏ తుది నోటీసులు జారీ చేసింది. నదీ పరిరక్షణ చట్టం, బిల్డింగ్ ప్లాన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిపారని వీటి యజమానులకు గతంలోనే నోటీసులిచ్చి వివరణ కోరిన విషయం తెలిసిందే. దానికి వారిచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో శుక్రవారం లింగమనేని రమేశ్, పాతూరి నాగభూషణం, ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ భవనాలకు తుది నోటీసులిచ్చారు. నిర్మాణాలకు అనుమతులు లేవని, సరైన అనుమతులు చూపించడంలో విఫలమయ్యారని పేర్కొంటూ వారంలో ఆ నిర్మాణాలను తొలగించాలని, లేకపోతే తామే తొలగిస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. కరకట్ట లోపల అక్రమంగా నిర్మించినట్లు గుర్తించిన 26 కట్టడాలకు సీఆర్డీఏ గతంలోనే నోటీసులివ్వగా అందరూ వివరణ ఇచ్చారు. తమ వద్ద ఉన్న అనుమతి పత్రాలు, ఇతర పత్రాలను అధికారులకు చూపించారు. సీఆర్డీఏ కమిషనర్ స్వయంగా వారితో మాట్లాడి అభ్యంతరాలను తెలుసుకున్నారు. చంద్రబాబు నివాసం ఉంటున్న భవనం యజమాని లింగమనేని రమేశ్ కూడా సీఆర్డీఏకు వివరణ ఇచ్చారు. తనకు పంచాయతీ అనుమతి ఉందని చెప్పిన ఆయన తాను భవనం నిర్మించినప్పుడు సీఆర్డీఏ లేదని, కాబట్టి సీఆర్డీఏకు నోటీసులిచ్చే అధికారం లేదన్నారు. గోకరాజు గంగరాజు, చందన బ్రదర్స్ యజమానులు హైకోర్టును ఆశ్రయించగా కోర్టు సీఆర్డీఏకు పలు సూచనలు చేసింది. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, వారి వద్దనున్న పత్రాలను కూడా పరిశీలించిన తర్వాత ఈ భవనాలు అక్రమమేనని తేల్చిన సీఆర్డీఏ చంద్రబాబు నివాసం సహా మూడు భవనాలకు తుది నోటీసులు జారీ చేసింది. మిగిలిన అక్రమ నిర్మాణాలకు సోమవారం నుంచి నోటీసులు జారీ చేయనున్నారు.