జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగంలో మూకుమ్మడి బదిలీలు
ఒకేసారి 22 మందికి స్థానచలనం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి 11 మంది బదిలీ
జీవీఎంసీ చరిత్రలో ఇంత భారీ బదిలీలు ఇదే తొలిసారి
విశాఖపట్నం : అడుగడుగునా అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ అవినీతికి చిరునామాగా మారిన మహావిశాఖ నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగంలో మూకుమ్మడి బదిలీలు ప్రకంపనలు రేపుతున్నాయి. రికార్డు స్థాయిలో ఇక్కడ పని చేస్తున్న అధికారులకు స్థానచలనం కలిగిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో డిప్యూటీ సిటీ ప్లానర్‌తో సహా ఏసీపీ, టీపీవో, టీపీఎస్, తదితర అధికారులు సహా ఏకంగా 22 మందిని వివిధ మున్సిపాలిటీలకు బదిలీ చేశారు. టౌన్‌ప్లానింగ్ చరిత్రలో ఇంతమందిని ఒకేసారి బదిలీ చేయడం ఇదే తొలిసారి. కాగా వీరి స్థానంలో 11 మందిని వివిధ మున్సిపాలిటీల నుంచి బదిలీపై జీవీఎంసీలో నియమించారు.
జీవీఎంసీలో టౌన్ ప్లానింగ్ అంటే అదో అవినీతి గని అన్న ముద్ర పడిపోయింది. ఈ విభాగంలో పైస్థాయి నుంచి కింద స్థాయి వరకు ఎవరిస్థాయిలో వారు అక్రమకట్టడాలను ప్రోత్సహిస్తూ రెండు చేతూలా దండుకుంటున్నారనే ఆరోపణలు మూటగట్టుకుంటున్నారు. ఈ విభాగంలో పనిచేసి కోట్లు గడించిన వారు ఇటీవల ఏసీబీకి చిక్కిన విషయమూ తెలిసిందే. ఈ విభాగాన్ని ప్రక్షాళన చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. చీఫ్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్(సీటీపీవో) వెంకటరత్నాన్ని కూడా రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ కు కేటాయిస్తూ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆయనకు ఇంకా రిలీవింగ్ ఆర్డర్ రాలేదు. రేపో మాపో రిలీవింగ్ ఉత్తర్వులు వచ్చే అవకాశాలున్నాయి. కాగా డిప్యూటీ సిటీ ప్లానర్‌గా పనిచేస్తున్న పి.ప్రదీవ్‌కుమార్‌ను గుంటూరు బదిలీ చేయగా ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. ముగ్గురు అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ ఆఫీసర్స్‌తో పాటు ఆరుగురు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు, ఆరుగురు టౌన్‌ప్లానింగ్ సూపర్‌వైజర్లు, ఆరుగురు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవ ర్సీర్‌లపై కూడా బదిలీ వేటు పడింది. వారి స్థానంలో వివిధ మున్సిపాలిటీల నుంచి ఇద్దరు ఏసీపీలు, ఇద్దరు టీపీవోలు, ఇద్దరు టీపీబీవోలు, ఐదుగురు టీపీఎస్‌లను ఇక్కడికి బదిలీ చేశారు. తాజా బదిలీలతో ఖాళీ అయిన డీసీపీతో సహా నాలుగు టీపీవో, ఒక టీపీఎస్, నాలుగు టీపీబీవో పోస్టుల్లో ఎవర్ని నియమించలేదు.