అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత
బాహుబలి క్రేన్‌తో నేలమట్టం చేసిన అధికారులు
హైకోర్టు ఆదేశాలను ధిక్కరించిన భవన యజమాని
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) తన వీకెండ్ ఆపరేషన్లను పునఃప్రారంభించింది. మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీలో ఉన్న 684 చదరపు గజాల ప్రభుత్వ స్థలంలో హైకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరించి అక్రమంగా నిర్మిస్తున్న ఐదు అంతస్తుల భవనాన్ని హైడ్రా అధికారులు ఆదివారం కూల్చేశారు. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ శనివారం అక్కడ పర్యటించి పూర్వాపరాలు తెలుసుకున్నారు. హైడ్రా ఏర్పాటైన తొలినాళ్లలో దాదాపు ప్రతి వీకెండ్‌లోనూ ఓ అక్రమ నిర్మాణం కూల్చివేత ఉండేది.
అక్రమ నిర్మాణాలెన్నో..
శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో అనేక అక్రమ నిర్మాణాలు ఉన్నాయి. 100 ఫీట్ల రోడ్డులో ఉన్న 684 చదరపు గజాల ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఐదు అంతస్తుల్లో ఓ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఇది అక్రమ నిర్మాణమని గుర్తించిన జీహెచ్‌ఎంసీ అధికారులు.. గత ఏడాది ఫిబ్రవరి 14న షోకాజ్ నోటీసులు, 26న స్పీకింగ్ ఉత్తర్వులు ఇచ్చింది. వీటిని భవన యజమాని హైకోర్టు సవాల్ చేశారు.
ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం అది అక్రమ నిర్మాణమని తేల్చి, కూల్చివేయాలని గత ఏడాది ఏప్రిల్ 19న ఆదేశాలు జారీ చేసింది. జీహెచ్‌ఎంసీ అధికారులు.. గత ఏడాది జూన్ 13న ఆ భవనం స్లాబ్‌కు అనేక చోట్ల పెద్ద పెద్ద రంధ్రాలు చేసి విడిచిపెట్టారు. వాటిని పూడ్చేసిన యజమానికి నిర్మాణం కొనసాగిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం దీనిపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఇటీవల సదరు అక్రమ నిర్మాణంపై స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
రాత్రి 8 గంటల వరకు..
క్షేత్రస్థాయిలో పర్యటించిన ఏవీ రంగనాథ్, భవనాన్ని కూల్చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఉదయం ఆ భవనం వద్దకు చేరుకున్న ‘బాహుబలి క్రేన్’కూల్చివేత మొదలు పెట్టింది. రాత్రి 8 గంటల వరకు కూల్చివేత కొనసాగింది. అక్కడ పోలీసులు, హైడ్రా అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భవనం ప్రధాన రహదారి పక్కనే ఉండడంతో విద్యుత్ సరఫరా ఆపేయడంతో పాటు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆ ప్రాంతంలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన కట్టడాలన్నింటినీ కూల్చివేస్తామని హైడ్రా అధికారులు తెలిపారు.
అనుమతిచ్చిన అధికారుల వివరాలపై ఆరా తీస్తున్నాం..
హైకోర్టు అక్రమం అని తేల్చినా భవన నిర్మాణం కొనసాగడానికి కారణమైన అధికారుల వివరాలు ఆరా తీస్తున్నాం. బాధ్యులపై నివేదిక రూపొందించి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం. అయ్యప్ప సొసైటీలో దాదాపు అన్నీ అక్రమ నిర్మాణాలే. ఆ భవనాలకు ఫైర్ ఎన్‌ఓసీ, భవన నిర్మాణ అనుమతి కూడా లేదు. అయ్యప్ప సొసైటీలో ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై జీహెచ్‌ఎంసీతో కలిసి సమీక్షిస్తాం. హైకోర్టు నుంచి స్పష్టమైన కూల్చివేత ఉత్తర్వులు ఉన్న వాటిని తొలి దశలో కూల్చేస్తాం.
– ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్.
Comments
Please login to add a commentAdd a comment