హైకోర్టునూ కూల్చేస్తారా? | Telangana High Court Fires On Hydraa Commissioner Ranganath | Sakshi
Sakshi News home page

హైకోర్టునూ కూల్చేస్తారా?

Published Tue, Oct 1 2024 5:12 AM | Last Updated on Tue, Oct 1 2024 5:12 AM

Telangana High Court Fires On Hydraa Commissioner Ranganath

తహసీల్దార్‌ ఏది చెబితే అది చేస్తారా? 

హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో నిర్మాణం కూల్చివేతపై న్యాయమూర్తి విచారణ 

హైడ్రా కమిషనర్‌తో పాటు తహసీల్దార్‌పై ప్రశ్నల వర్షం  

మీకు చట్టం తెలియదా? స్టే ఉన్న ఆస్తిని సెలవు రోజు ఎందుకు కూల్చారు? 

విస్తృత ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు పాటించరా? 

రాజకీయ నాయకులు చెప్పింది వింటేఇబ్బందులు పడేది మీరేనన్న న్యాయమూర్తి జస్టిస్‌ కె.లక్ష్మణ్‌

నిర్మాణంపై స్టేటస్‌ కో.. విచారణ 15కు వాయిదా  

సాక్షి, హైదరాబాద్‌: సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో కూల్చివేత ఘటనపై హైడ్రా కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘హైకోర్టును కూల్చివేయాలని తహసీల్దార్‌ లేఖ రాస్తే సిబ్బందిని, యంత్రాలను ఏర్పాటు చేస్తారా? మీకు చట్టం తెలియ దా? ఆదివారం, సూర్యాస్తమయం తరువాత కూల్చి వేత చేపట్టవద్దని విస్తృత ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలు పాటించరా? చట్టం తెలియకపోతే ప్రభుత్వ న్యాయవాదులను అడిగి తెలుసుకోరా? మీడియా తో మాట్లాడుతూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తారా?’అంటూ మండిపడింది. 

స్టే ఇచ్చిన ఆస్తిని సెలవు రోజు ఎందుకు కూల్చాల్సి వచ్చిందన్న దాని కి సమాధానం ఉందా అని ప్రశ్నించగా.. హైడ్రా కమిషనర్‌ రంగనాథ్, అమీన్‌పూర్‌ తహసీల్దార్‌ రాధ సమాధానం చెప్పలేదు. హైడ్రా ఏర్పాటు అభినందనీయమే అయినా పని తీరు మాత్రం అసంతృప్తికరమని వ్యాఖ్యానించింది. రాజకీయ నాయకులు చెప్పింది వింటే ఇబ్బందులు పడేది మీరే అన్న విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించింది. తదుపరి విచారణను అక్టోబర్‌ 15కు వాయిదా వేస్తూ, అలోగా కౌంటర్‌ దాఖలు చేయాలని హైడ్రా, తహసీల్దార్‌కు ఆదేశాలు జారీ చేసింది. అప్పటివరకు ఆస్తిపై స్టేటస్‌ కో విధించింది.  

కమిషనర్, తహసీల్దార్‌ హాజరు 
సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం కిష్టారెడ్డిపేట్‌ గ్రామపంచాయతీ పరిధి సర్వే నంబర్‌ 165, 166లోని 270 గజాల స్థలంలో నిర్మాణానికి 2022, నవంబర్‌ 10న మహ్మద్‌ రఫీ భవన నిర్మాణ అనుమతి పొందారు. అయితే ఆ స్థలం సర్వే నంబర్‌ 164లో ఉందని, అది ప్రభుత్వ భూమి అంటూ అధికారులు అనుమతి రద్దు చేశారు. ఈ క్రమంలో నోటీసులు జారీ చేసి ఆదివారం ఆ స్థలంలోని నిర్మాణాన్ని కూల్చివేశారు. 

దీన్ని సవాల్‌ చేస్తూ రఫీ, గణేశ్‌ నిర్మాణ సంస్థ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ సోమవారం మరోసారి విచారణ చేపట్టారు. గత విచారణ సందర్భంగా హైడ్రా కమిషనర్, అమీన్‌పూర్‌ తహసీల్దార్‌ హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో సోమవారం తహసీల్దార్‌ నేరుగా, కమిషనర్‌ వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు వారు సరైన సమాధానాలు చెప్పలేకపోయారు.  

ఆదివారం ఇంట్లో ఉండకుండా ఇదేంటీ?  
‘వివాదాస్పద ఆస్తి సర్వే నంబర్‌ 165, 166లో ఉందని పిటిషనర్లు పేర్కొంటున్నారు. బిల్డింగ్‌ పర్మిషన్‌ 2022 నవంబర్‌లో తీసుకున్నారు. కానీ వాస్తవంగా అది సర్వే నంబర్‌ 164లో ఉంది. ఈ విషయం 2024 మార్చిలో తెలిసింది. ఏప్రిల్‌ 1న సర్వే చేశాం. ఏప్రిల్‌ 24న కలెక్టర్‌ ఆదేశాల మేరకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ల్యాండ్‌ రికార్ట్స్‌ కూడా సర్వే చేశారు. ఏప్రిల్‌ 2న పిటిషనర్లకు నోటీసులిచ్చాం. దానికి వారు ఏప్రిల్‌ 15, 18 తేదీల్లో వివరణ ఇచ్చారు. 

అనంత రం సెపె్టంబర్‌ 20న నోటీసు లు జారీ చేశాం. 22న ఉద యం హైడ్రా సాయంతో కూ ల్చివేత చేపట్టాం..’అని తహసీల్దార్‌ చెప్పారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. ‘పిటిషనర్ల వాద నలు విన్నారా? బిల్డింగ్‌ అనుమతి రద్దు పై, విద్యుత్‌ తొలగింపుపై స్టే ఉంది తెలుసా? చట్టప్రకారం ముందుకు వెళ్లమని చెప్పాం కదా? శనివారం సాయంత్రం 6.30 గంటలకు నోటీసులు అందితే.. ఆదివారం ఉదయం 7.30 గంటలకు కూల్చివేస్తారా? అసలు ఆదివారం మీకు సెలవు కదా.. ఇంట్లో ఉండకుండా, అత్యవసరంగా విధులకు హాజరై మరీ కూల్చివేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఐదు నెలలుగా ఆగుతూ వచ్చి ఒక్క రోజులో కూల్చివేత ఎందుకు? సెపె్టంబర్‌ 20న ఇచ్చిన ఆదేశాల్లో ఖాళీ చేయడానికి 48 గంటల సమయం ఇచ్చారు కదా. 

ఆ గడువు పూర్తయ్యే వరకు ఎందుకు ఆగలేదు? కలెక్టర్‌ ఆదేశాలిస్తే చెప్పండి ఆయననూ పిలుస్తాం. ప్రజాస్వామ్య దేశంలో సహజ న్యాయ సూత్రాలను పాటించాలని మీకు తెలియదా?..’అంటూ ప్రశ్నల వర్షం కురిపించగా, తహసీల్దార్‌ సమాధానం చెప్పలేకపోయారు.

అనుమతులిస్తున్న అధికారులపై చర్యలేంటి?  
సబ్‌ రిజిస్ట్రార్‌ ఎందుకు రిజిస్ట్రేషన్‌ చేశారు? పంచా యతీ/ మున్సిపల్‌ అధికారులు ఎందుకు అనుమతి ఇస్తున్నారు? విద్యుత్, నల్లా కనెక్షన్లు ఎలా ఇస్తున్నా రు? ఆస్తి పన్ను ఎందుకు వసూలు చేస్తున్నారు? ఇంతమంది అధికారులు ఇలా ఇష్టారాజ్యంగా అను మతి ఇస్తూ పోయిన తర్వాత అది చట్టవిరుద్ధమని ప్రజలకు చెప్పేదెవరు? సదరు అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారు? ఎక్కడికక్కడ అక్రమ మా ర్గంలో అనుమతులిస్తారు. కొన్నేళ్ల తర్వాత వచ్చి ఇది అక్రమమంటూ చట్టాన్ని పాటించకుండా కూల్చివేస్తారు. చివరకు ప్రజలను బాధితులను చేస్తారా?’అంటూ న్యాయమూర్తి ప్రశ్నించారు.  

ప్రజలే అన్నీ తెలుసుకోవాలంటే ఎలా?
తహసీల్దార్‌ లేఖ మేరకు కూల్చివేతకు సిబ్బందిని, యంత్రాలను అందజేశామని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ కోర్టుకు తెలిపారు. దీంతో.. ‘తహసీల్దార్‌ హైకోర్టు, చారి్మనార్‌ను కూల్చివేయాలన్నా అలాగే పంపిస్తారా? చట్టాన్ని అమలు చేయరా? మీ స్టేటస్‌ ఏంటి? ఆదివారం కూల్చివేత చేపట్టవచ్చా? తహసీల్దార్‌ అడిగితే మీరు చట్టవిరుద్ధంగా సమకూరుస్తారా? సహకరిస్తారా? కోర్టు ఆదేశాలంటే లెక్కలేదా? అక్రమ నిర్మాణాలను మేం సమర్థించడం లేదు. 

కానీ చట్టాన్ని పాటించాలి కదా? హైడ్రా తీరు సంతృప్తికరంగా లేదు. కమిషనర్‌గా మీకే అవగాహన లేకపోతే ఎలా? జీవో 99 ప్రకారం హైడ్రాకు ఏం పాలసీ ఉంది?’అంటూ జడ్జి ప్రశ్నించారు. చట్టంపై తమకు గౌరవం ఉందని, ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపలే తమ పరిధి అని, ఇందులో దాదాపు 2,500 చెరువులు ఉన్నట్లు రంగనాథ్‌ తెలిపారు. 

కాగా ‘ఒక్క చెరువుకైనా తుది నోటిఫికేషన్‌ ఇచ్చి ఎఫ్‌టీఎల్, బఫర్‌ జోన్‌ నిర్ధారించారా? మూసీపై మీ ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ ఏంటీ? పిటిషనర్‌ ఈ నెలలోనే హైడ్రాపై రిట్‌ పిటిషన్‌ వేశారు? మేం జోక్యం చేసుకోవడం లేదని మీ (హైడ్రా) కౌన్సిల్‌ చెప్పారు. అయినా కూల్చివేత చేపట్టారు. ప్రజలే అన్నీ విచారణ చేసుకుని కొనుగోలు చేయాలి.. వారికి చట్టాలపై అవగాహన ఉండాలంటే ఎలా?  

జైలుకు పంపిస్తేనే దారికొస్తారు
హైడ్రా కార్యాలయం ఎక్కడని సంస్థ కౌన్సిల్‌ కటికం రవీందర్‌రెడ్డిని న్యాయమూర్తి ప్రశ్నించారు. ‘డిజాస్టర్‌ అంటే ఒక్క కూల్చివేతలే కాదు కదా.. ట్రాఫిక్‌ నియంత్రణ చర్యలు హైడ్రా చేపడుతోందా? బతుకమ్మ కుంట, నల్లకుంట పరిస్థితి ఏంటీ? ఒక్క రాత్రిలో ఈ సిటీని మార్చలేం. చెరువులకు సంబంధించిన మెమైరీలను (చిత్రపటాలను) పరిశీలించి ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారించాలని చెప్పాం. 

రెండేళ్లుగా కోరుతున్నా ఒక్క చెరువుకు కూడా ఎఫ్‌టీఎల్‌ తుది నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. మీరు పబ్లిక్‌ సర్వెంట్స్‌ అనేది మర్చిపోవద్దు. చట్టాన్ని ఉల్లంఘిస్తామంటే మాత్రం కోర్టులు చూస్తూ కూర్చోవు. అక్రమాలకు పాల్పడిన, చట్టాన్ని గౌరవించని అధికారులను చంచల్‌గూడ, చర్లపల్లికి పంపిస్తే అప్పుడు దారికొస్తారు. కూల్చివేతలు చేపట్టేటప్పుడు పాటించాల్సిన విధానం ఏంటీ అనేది ప్రభుత్వ న్యాయవాదులను అడిగి తెలుసుకోవచ్చు కదా.. అది కూడా చేయరు. 

ఆదివారం కూల్చడం ముగ్గురు జడ్జిల తీర్పుకు విరుద్ధం..’అని న్యాయమూర్తి స్పష్టం చేశారు. కోర్టు ఆదేశాలంటే తహసీల్దార్‌కు లెక్కలేదని పిటిషనర్‌ న్యాయవాది నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం.. అదీ ఉదయం 7.30 గంటలకే కావడంతో హౌస్‌ మోషన్‌ కూడా దాఖలు చేయలేకపోయామన్నారు. రెవెన్యూ శాఖ తరఫున జీపీ మురళీధర్‌రెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం న్యాయమూర్తి విచారణ వాయిదా వేశారు.  

యుద్ధ ప్రాతిపదికన తొలగించడం లేదు
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతే ముందుకు మూసీలో ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వం వెల్లడి
మూసీ పరీవాహక ప్రాంతంలో ఆక్రమణల తొలగింపు యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం లేదని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీనిపై కమిటీని ఏర్పాటు చేశామని, బాధితులతో చర్చలు జరుపుతోందని ఏఏజీ తేరా రజనీకాంత్‌రెడ్డి వెల్లడించారు. ఇళ్లు కోల్పోయిన పేదలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాత చట్టపరంగా ముందుకు వెళ్తామని చెప్పారు. 

మూసీ పరీవాహక ప్రాంతం వెంట ఉన్న ఇళ్లకు ‘రివర్‌ బెడ్‌’అంటూ రెడ్‌ కలర్‌తో మార్కింగ్‌ చేశారని, కూల్చివేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని పేర్కొంటూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. లంచ్‌ మోషన్‌ రూపంలో దాఖలైన ఈ పిటిషన్లపై జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ సోమవారం విచారణ చేపట్టారు. మూసీ పరీవాహక ప్రాంతంలో ఆక్రమణల తొలగింపునకు ఏదైనా పాలసీ ఉందా? అని ప్రశ్నించారు. 

ఎఫ్‌టీఎల్‌ బయట నిర్మించుకున్న వారికి నోటీసులు ఎలా ఇస్తారని, ఎలాంటి చర్యలు చేపట్టినా చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఏఏజీ వాదనల అనంతరం.. ఎఫ్‌టీఎల్‌ నిర్ధారించిన తర్వాతే చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ అక్టోబర్‌ 16కు వాయిదా వేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement