![Telangana High Court warns Hydra Demolitions](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/HC-10.jpg.webp?itok=Ny9oVyQj)
సెలవు దినాల్లో కూల్చివేస్తే కఠిన చర్యలు.. హైడ్రాను హెచ్చరించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ‘ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? అక్రమ నిర్మాణమని శుక్రవారం నోటీసులిచ్చి.. శనివారం హాజరుకు ఆదేశాలిచ్చి.. ఆదివారం కూల్చివేస్తారా? అంత తొందరేముంది? కూల్చి వేతలు చేపట్టే ముందు సహేతుక సమయం ఇవ్వాలి కదా?’ అని హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా)పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కోహెడ గ్రామంలోని తన ఆస్తుల కూల్చివేతను సవాల్ చేస్తూ సామ్రెడ్డి బాల్‌రెడ్డి హైకోర్టులో ఆదివారం హౌజ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
హైడ్రా నోటీసులు చట్టవిరుద్ధమని, వాటిని రద్దు చేస్తూ ఆదేశాలివ్వాలని కోరారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ విచారణ చేపట్టారు. పిటిషనర్‌కు న్యాయమైన అవకాశం ఇవ్వకుండా తదుపరి చర్యలు తీసుకోవద్దని హైడ్రాను ఆదేశించారు. అవసరమైన పత్రాలు సమర్పించడానికి పిటిషనర్‌కు ఒక వారం సమయం ఇచ్చారు. ముఖ్యంగా సెలవు దినాల్లో కూల్చివేతలు చేపట్టవద్దని, కాదని చేపడితే కఠిన చర్యలు ఉంటాయని హైడ్రాను హెచ్చరించారు.
ఒక్కరోజులో పత్రాలు సమర్పించటం ఎలా సాధ్యం?..: తన ఆస్తులకు సంబంధించిన పత్రాలు సమర్పించేందుకు హైడ్రా ఒక్క రోజే సమయం ఇచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ‘అక్రమ నిర్మాణమని శుక్రవారం అధికారులు నోటీసులు జారీ చేశారు. వ్యక్తిగతంగా హాజరుకావాలని శనివారం సమయం ఇచ్చారు. ఆ వెంటనే ఆదివారం కూల్చివేత ప్రక్రియ చేపట్టారు.
టైటిల్ లింక్ పత్రాలు, పట్టాదార్ పాస్‌బుక్, ఇతర అన్ని డాక్యుమెంట్లతో రావాలని ఆదేశించిన అధికారులు.. ఒక్క రోజే సమయం ఇచ్చారు. అధికారుల తీరు చట్టవిరుద్ధం. నోటీసులను నిలుపుదల చేస్తూ ఆదేశాలు ఇవ్వండి’ అని కోరారు. దీంతో హైడ్రా తీరుపై అసహనం వ్యక్తంచేసిన ధర్మాసనం.. వారంలోగా అధికారులకు డాక్యుమెంట్లు అందజేయాలని ఆదేశించింది. వాటిని పరిశీలించి చట్టప్రకారం చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలిస్తూ విచారణను వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment