
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు.. గురువారం మధ్యాహ్నాం సెషన్‌లో తొలుత కేటీఆర్ ప్రసంగించగా.. ఆ ఆరోపణలపై సీఎం రేవంత్ స్పందించారు.
రాజకీయ కక్ష సాధింపు ఎవరిది? మీదా? నాదా?.. ఎవరైనా అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేస్తే రూ.500 ఫైన్ విధిస్తారు. కానీ, డ్రోన్ ఎగరేశానని బీఆర్‌ఎస్ హయాం(BRS Rule)లో నాపై కేసు పెట్టారు. అధికారం అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న నన్ను చర్లపల్లి జైల్లో పంపారు. నన్ను జైల్లో ఉంచి చిత్రహింసలకు గురి చేశారు. నక్సలైట్లు, దేశ ద్రోహులు ఉండె డిటెన్షన్ సెల్‌లో పార్లమెంట్ సభ్యుడినైన నన్ను వేశారు. నేను పడుకోకుండా రాత్రిళ్లు లైట్లు వేశారు. జైల్లో 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపా.
.. చర్లపల్లి జైలు నుంచి నా బిడ్డ లగ్నపత్రిక రాసుకోవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. నా బిడ్డ లగ్గానికి రాకుండా ఢిల్లీ నుంచి అడ్వకేట్‌లను తీసుకొచ్చారు. చర్లపల్లి జైలు నుంచి ఫంక్షన్ హాల్ కు వచ్చి.. మళ్ళీ జైలుకు పోయా. నా కుటుంబ సభ్యులను అసభ్యంగా తిట్టినా భరించా. సొంతపార్టీ ఆఫీసులో బూతులు తీయించి రికార్డు చేయించినా… చెంపలు వాయించే శక్తి ఉన్నా నేను సంయమనం పాటించా. దేవుడు అన్ని చూస్తుంటాడంటూ సహనంతో ఎదురు చూశా. అంతేకానీ..

కేసీఆర్ కుటుంబంపై ఏనాడూ.. ఎలాంటి రాజకీయ కక్ష చర్యలకు పాల్పడలేదు. వారిని జైలుకు పంపుతానన్న హామీని కూడా నెరవేర్చలేదు. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే.. కేసీఆర్ కుటుంబంలో ఏం జరగాలో అది జరిగింది. నా మీద కక్ష చూపిన వారిని ఆ దేవుడే ఆసుపత్రిపాలు చేశాడు. నేను నిజంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఉంటే ఇవాళ కేటీఆర్(KTR) అసెంబ్లీలో కూర్చొని ఇలా మాట్లాడేవారు కాదు. ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసం నాకు అధికారం ఇచ్చారు. కక్షలు తీర్చుకోవడానికి కాదు. ఎవరివి కక్ష సాధింపు చర్యలో తెలంగాణ సమాజం ఇదంతా గమనిస్తోంది’’ అని సీఎం రేవంత్ అన్నారు.
ఇదీ చదవండి: అది నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా: కేటీఆర్