
హైదరాబాద్, సాక్షి: తాను అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సి వస్తుందనే సభకు రాకుండా కేసీఆర్(KCR) మొహం చాటేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై సమాధానమిస్తూ.. మాజీ సీఎంతో పాటు హరీష్, కేటీఆర్‌లపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తప్పులు.. అప్పులు చేసి మీరు ముంచేశారని, ఆ శిక్ష ప్రజలు అనుభవించాలా? అని రేవంత్ బీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి అన్నారు. ‘‘తెలంగాణలో ఎవరు చనిపోయినా ఆ మామా, అల్లుళ్లు డ్యాన్సులు చేస్తున్నారు. తెలంగాణలో ఎక్కడ ప్రమాదం జరిగినా వాళ్ల కళ్లలోనే మెరుపు కనిపిస్తోంది. పైశాచికత్వంలో వాళ్లు ఉగాండా అధ్యక్షుడితో పోటీ పడుతున్నారు. బీఆర్‌ఎస్ వాళ్లు మాటకు ముందు స్టేచర్.. మాటకు తర్వాత స్టేచర్ అంటున్నారు. మరి మీకు స్టేట్ ఫ్యూచర్ వద్దా.. మీ స్టేచరే మీకు ముఖ్యమా? అని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్రశ్నించారు.
కేసీఆర్ దగ్గర ఇప్పుడు మిగిలింది ప్రతిపక్ష సీటు మాత్రమే. ఆ సీటుతో నేనేం చేసుకుంటాం. అది హరీశ్‌కో, కేటీఆర్‌కో కావాలి మాకు కాదు. కేసీఆర్‌ను ఉద్దేశించి నేను ‘స్ట్రెచర్’ వ్యాఖ్యలు చేశానని హరీష్, కేటీఆర్ చిత్రీకరిస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు మార్చురీలో ఉందని అన్నాను.. అందులో తప్పేం ఉంది. కేసీఆర్ చెడును నేను ఎందుకు కోరుకుంటా?. ఆయన వందేళ్లు ఆరోగ్యంతో ఉండాలి. ఆయన అక్కడే ప్రతిపక్షంలో ఉండాలి. నేను ఇక్కడే అధికారంలో ఉండాలి. కేసీఆర్ సభకు రావాలి. ఆయన గౌరవానికి ఎలాంటి భంగం కలిగించం. ఆయన సభకు వచ్చిననాడే కృష్ణా జలాల అంశం చర్చ పెడతాం’’ అని రేవంత్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment