
ఎంఎంటీఎస్ రైలులో అత్యాచార యత్నం ఘటన
ముమ్మరంగా కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు
సికింద్రాబాద్: ఈ నెల 22న మేడ్చల్ ఎంఎంటీఎస్ రైలులో జరిగిన అత్యాచార యత్నం ఘటన మిస్టరీ వీడలేదు. మరుసటి రోజు నుంచి ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేస్తున్నా నిందితుడి ఆచూకీ తెలియడంలేదు. పలు బృందాలుగా ఏర్పడిన రెండు వందలకు పైబడిన పోలీసులు బృందాలుగా ఏర్పడిన వివిధ విభాగాల పోలీసులు కేసు దర్యాప్తులో ఏమాత్రం ప్రగతి సాధించలేకపోతున్నారు.
ఘటన మిస్టరీని ఛేదించడంలో పోలీసులకు రెండు సమస్యలు అడ్డుగా నిలుస్తున్నాయి. ఒకటి ఘటన జరిగిన ప్రాంతం నుంచి ఎటు పది కిలోమీటర్ల దూరంలోని ఎంఎంటీఎస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు లేకపోవడం. మరోవైపు బాధితురాలు ఘటన భయం నుంచి ఇంకా తేరుకోకపోవడం.
ముఖానికి, తలకు తీవ్రమైన గాయాలు కావడం, పళ్లు ఊడిపోవడంతో యశోదా ఆసుపత్రిలో బాధితురాలికి పలు శస్త్ర చికిత్సలతో కూడిన వైద్యం చేస్తున్నారు. ఈ కారణంగా బాధితురాలు పోలీసులతో వివరంగా మాట్లాడలేకపోతోంది. బాధితురాలు కాస్త కోలుకుని ఘటన భయం నుంచి బయటపడి పూర్తి వివరాలు వెల్లడిస్తే గానీ దర్యాప్తు ముందుకు సాగే అవకాశం లేదన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
ఘటన జరిగిన రెండో రోజే పలువురు పాత నేరస్తుల ఫొటోలను బాధితురాలికి పోలీసులు చూపించారు. ఇందులో నిందితుడి మాదిరి ఉన్నట్టు రెండు ఫొటోలను అనుమానితులుగా బాధితురాలు పేర్కొంది. ఆ ఇరువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాధితురాలికి చూపించగా వారిరువురు కాదన్నట్టు సమాధానం చెప్పడంతో దర్యాప్తు మళ్లీ మొదటికి వచి్చంది. ఘటన జరిగిన సమయంలో బాధితురాలు ఫోన్‌కాల్‌లో మాట్లాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలి మిత్రులను కూడా రప్పించిన పోలీసులు మరింత సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.
త్వరలోనే నిందితుణ్ని గుర్తిస్తాం: రైల్వే పోలీసులు
అనుమానితులుగా భావిస్తున్న ఇరువురు పాత నేరస్తులు అత్యాచార యత్నానికి పాల్పడిన వారు కాదని బాధితురాలు చెప్పినప్పటికీ వారి కదలికలపై పోలీసులు దర్యాప్తు చేశారు. ఇందులో ఒకరు ఘటన జరిగిన సమయంలో కల్లు కాంపౌండ్‌లో మరొకరు ఇంకో ప్రదేశంలో ఉన్నట్టు పోలీసులు గుర్తించినట్టు సమాచారం. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ మీదుగా గుండ్ల పోచంపల్లి వరకు ఎంఎంటీఎస్ స్టేషన్లను ఆవరించి ఉన్న పలు గ్రామాల్లోనూ దర్మాప్తు చేపట్టిన పోలీసులకు నిందితుడి గుర్తింపు కోసం ఎటువంటి ఆధారాలు లభించలేదు. కాగా.. సీసీ కెమెరాలు లేకపోవడం వంటి సాంకేతిక సమస్యలతో దర్యాప్తులో ఆలస్యం జరుగుతోందని, త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని రైల్వే పోలీసులు చెబుతుండడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment