mmts train
-
ఎంఎంటీఎస్‌కు మరోసారి బ్రేక్
హైదరాబాద్: నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ఎంఎంటీఎస్ సర్వీసులకు మరోసారి బ్రేక్‌పడింది. శని, ఆదివారాల్లో పలు రూట్లలో సర్వీసులను నిలిపివేశారు. ప్రయాణికుల నిరాదరణ కారణంగా గత జూలై, ఆగస్టు,సెప్టెంబర్ నెలల్లో వీకెండ్స్‌లో సుమారు 45 ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేశారు. ఆ తరువాత కొద్ది రోజులు పట్టాలెక్కించినప్పటికీ మరోసారి తాజాగా బ్రేక్‌పడింది. పలుచోట్ల ట్రాక్ మరమ్మతులు వంటి సాంకేతిక అంశాలను సాకుగా చూపుతున్నప్పటికీ ప్రయాణికుల ఆదరణ బాగా తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఉచిత బస్సు సదుపాయం వల్ల ఎంఎంటీఎస్, సబర్బన్, ప్యాసింజర్ రైళ్లలో మహిళా ప్రయాణికులు తగ్గారు. దీంతో అధికారులు సర్వీసులను కూడా తగ్గించినట్లు సమాచారం. మొదట్లో రోజుకు 121 సర్వీసులతో లక్షా 50 వేల మంది రాకపోకలు సాగించేవారు. ఎంఎంటీఎస్ సేవలను పునరుద్ధరించిన అనంతరం అన్ని మార్గాల్లో ప్రతి రోజు 75 రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. కానీ ప్రయాణికుల నిరాదరణ కారణంగా తరచుగా వీటి సంఖ్య సగానికి పడిపోవడం గమనార్హం. మనోహరాబాద్– మేడ్చల్, ఉందానగర్–మేడ్చల్, ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్–మేడ్చల్, తదితర ప్రాంతాల మధ్య ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. మేడ్చల్–ఉందానగర్ మధ్య కొత్తగా రైళ్లను ప్రారంభించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ రూట్లో రైళ్లు పట్టాలెక్కాయి. కానీ ప్రారంభించినప్పటి నుంచి ఈ రూట్ రైళ్లకు బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఆర్టీసీ బస్సుల ఎఫెక్ట్... మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ సిటీ ఆర్డినరీ, మెట్రో, జిల్లాల్లో పల్లెవెలుగు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినప్పటి నుంచి ఎంఎంటీఎస్ సర్వీసుల్లోనే కాకుండా సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి జిల్లాలకు రాకపోకలు సాగించే సబర్బన్,ప్యాసింజర్ రైళ్లలోనూ ప్రయాణికుల సంఖ్య తగ్గింది. సికింద్రాబాద్ నుంచి వరంగల్‌కు రాకపోకలు సాగించే పుష్పుల్ ట్రైన్ సాధారణంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటుంది. కానీ కొద్ది రోజులుగా ట్రైన్లో నించొని ప్రయాణించవలసిన అవసరం తప్పిందని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అలాగే సికింద్రాబాద్ నుంచి ఫలక్‌నుమా రూట్లో, సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి రూట్లలో మహిళలు సిటీ బస్సుల వైపే మొగ్గు చూపుతున్నారు.ఫలక్‌నుమా–ఉందానగర్ మధ్య కూడా మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గింది. అలాగే ప్రతి రోజు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే సికింద్రాబాద్–వికారాబాద్, వరంగల్–హైదరాబాద్, వికారాబాద్–కాచిగూడ, సిర్పూర్కాగజ్నగర్–కరీంనగర్, కాచిగూడ–నిజామాబాద్, కాజీపేట్–బల్లార్ష,కాచిగూడ–మహబూబ్‌నగర్, తదితర మార్గాల్లో నడిచే రైళ్లలోనూ మహిళాప్రయాణికులు తగ్గినట్లు అంచనా.‘‘మహిళలకు బస్సుల్లో ఉచిత సదుపాయం వల్ల వారితో పాటు వచ్చే మగవాళ్లు కూడా బస్సుల్లోనే వెళ్తున్నారు.’’ అని రైల్వే అధికారి ఒకరు వివరించారు. గడ్డుకాలమే... కోవిడ్ అనంతరం ఎంఎంటీఎస్ నిర్వహణ దక్షిణమధ్య రైల్వేకు సవాల్‌గా మారింది.గతంలో ఎంఎంటీఎస్ సర్వీసులను వినియోగించుకున్న వాళ్లంతా ఇతర ప్రత్యామ్నాయాల్లోకి మారారు. రైళ్లను పునరుద్ధరించిన తరువాత విస్తృతమైన ప్రచారం కల్పించినప్పటికీ పూర్వపు ఆదరణ లభించలేదు.దీంతో అధికారులు సర్వీసులను తగ్గించారు.ఇదే సమయంలో రెండోదశ మార్గాల్లోకి ఎంఎంటీఎస్ సేవలను విస్తరించడం కూడా రైల్వేకు మరో సవాల్‌గా మారింది. ఒకవైపు ప్రయాణికులు లేక వెలవెలాపోతున్న రైళ్లను లింగంపల్లి–బీహెచ్ఈఎల్,మేడ్చల్–బొల్లారం–సికింద్రాబాద్, ఫలక్‌నుమా–ఉందానగర్ రూట్లలోనడపవలసి వచ్చింది.అతి తక్కువ చార్జీలతో కొత్త రూట్లలో ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులోకి వచ్చినా ప్రయాణికుల ఆదరణ మాత్రం లభించలేదు.దీంతో తరచుగా సర్వీసుల సంఖ్యను తగ్గించవలసి వచ్చింది. ప్రస్తుతం సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత సదుపాయం అందుబాటులోకి రావడంతో మరింత ప్రతికూల ప్రభావం పడింది. -
నయా రూట్.. మేడ్చల్ టూ లింగంపల్లి...
సాక్షి, సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ రైలు కొత్త రూట్ అందుబాటులోకి వచ్చింది. రెండోదశ విస్తరణలో భాగంగా ఇప్పటికే పలు మార్గాల్లో సర్వీసులను ప్రవేశపెట్టిన దక్షిణమధ్య రైల్వే తాజాగా మేడ్చల్ నుంచి లింగంపల్లి, మేడ్చల్ నుంచి నాంపల్లి వరకు రెండు కొత్త మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెట్టింది. కొద్ది నెలల క్రితం ఉత్తర, దక్షిణాది ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు మేడ్చల్ నుంచి ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్ సేవలను విస్తరించగా, తాజాగా ఉత్తరం నుంచి పడమటికి కనెక్టివిటీ ఏర్పడింది. నగరశివార్లు, ఔటర్ చుట్టుపక్కల ఉన్న కాలనీలకు చెందిన ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎంఎంటీఎస్ సేవల విస్తరణ చేపట్టినట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. సిటీ బస్సులు, మెట్రో కంటే అతి తక్కువ చార్జీలతో ఎంఎంటీఎస్ సేవలను విని యోగించుకోవచ్చునని చెప్పారు. అలాగే మేడ్చల్ వైపు ఉన్న వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు నగరంలోని నాంపల్లికి చేరుకునేందుకు అనుగుణంగా కొత్త సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి. మరోవైపు ఎంఎంటీఎస్ సేవలపైన ప్రయాణికుల నుంచి వచ్చిన సలహాలు, సూచనల మేరకు సమయపాలనలో మార్పులు చేసినట్లు జీఎం పేర్కొన్నారు. కాచిగూడ నుంచి బెంగళూరుకు రాకపోకలు సాగించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు అనుగుణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక సర్వీసులను నడుపనున్నారు. నాలుగు సర్వీసులతో ప్రారంభం... ► ఉదయం, సాయంత్రం ప్రయాణికుల రద్దీకనుగుణంగా మేడ్చల్–లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ప్రస్తుతం నాలుగు సర్వీసులను ఈ రూట్లో ప్రారంభించారు. క్రమంగా సర్వీసులను పెంచనున్నారు. ► మేడ్చల్–లింగంపల్లి (47222) ఎంఎంటీఎస్ ఉదయం 7.20 కి బయలుదేరి 8.25కు లింగంపల్లికి చేరుకుంటుంది. తిరిగి 8.27 కే లింగంపల్లి నుంచి బయలుదేరి 9.20కి మేడ్చల్‌కు చేరుకుంటుంది. ► లింగంపల్లి–మేడ్చల్ (47225): ఉదయం 10.20 కి లింగంపల్లి నుంచి బయలుదేరి 11.08 గంటలకు మేడ్చల్‌కు చేరుకుంటుంది. 11.10 గంటలకు మేడ్చల్ నుంచి బయలుదేరి 12.10 కి లింగంపల్లికి చేరుకుంటుంది. ► మేడ్చల్–లింగంపల్లి (47225): మధ్యాహ్నం 3.30గంటలకు మేడ్చల్ నుంచి బయలుదేరి 4.40 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది. సాయంత్రం 4.42 కు తిరిగి బయలుదేరి 5.40 కి మేడ్చల్‌కు చేరుకుంటుంది. ► లింగంపల్లి–మేడ్చల్ (47227): సాయంత్రం 6.10 గంటలకు లింగంపల్లి నుంచి బయలుదేరి 7.10 గంటలకు మేడ్చల్‌కు చేరుకుంటుంది. తిరిగి 7.12గంటలకు బయలుదేరి రాత్రి 8.15 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది. మేడ్చల్–నాంపల్లి రూట్లో.. ► మేడ్చల్–నాంపల్లి (47251): ఎంఎంటీఎస్ ఉదయం 11.50గంటలకు బయలుదేరి 12.48కి నాంపల్లికి చేరుకుంటుంది. తిరిగి 12.50 కి బయలుదేరి మధ్యాహ్నం 1.30కి మేడ్చల్‌కు చేరుకుంటుంది. ► నాంపల్లి–మేడ్చల్ (47244): మధ్యాహ్నం 1.40 కి బయలుదేరి 2.28 కి మేడ్చల్‌కు చేరుకుంటుంది. తిరిగి 2.30కి బయలుదేరి 3.20గంటలకు నాంపల్లికి చేరుకుంటుంది. వందేభారత్‌కు ఎంఎంటీఎస్.. కాచిగూడ నుంచి బెంగళూరుకు ఇటీవల ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కోసం ఎంఎంటీఎస్ స్పెషల్ సర్వీసులను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు కాచిగూడకు చేరుకొనేందుకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. లింగంపల్లి నుంచి ఉందానగర్, ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వరకు ఈ రైళ్లను నడుపుతారు. ► లింగంపల్లి–ఉందానగర్ (47213): ఉదయం 4గంటలకు బయలుదేరి 5 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. 5.02 గంటలకు తిరిగి బయలుదేరి 5.40 గంటలకు ఉందానగర్‌కు చేరుకుంటుంది. ► ఫలక్‌నుమా–లింగంపల్లి (47220): రాత్రి 11.15 గంటలకు ఫలక్‌నుమా నుంచి బయలుదేరి 11.29కి కాచిగూడకు చేరుకుంటుంది. 11.30 కి తిరిగి బయలుదేరి రాత్రి 12.45 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది. ► ఉందానగర్–లింగంపల్లి, ఫలక్‌నుమా–లింగంపల్లి మధ్య రెగ్యులర్‌గా నడిచే మరో 6 సర్వీసుల వేళల్లో మార్పులు, చేర్పులు చేశారు. -
భారీ శబ్ధాలతో ఆగిపోయిన ఎంఎంటీఎస్ రైలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
సాక్షి, హైదరాబాద్: పెద్ద శబ్దంతో కదులుతున్న ఎంఎంటీఎస్ రైలు ఒక్కసారిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరిగిందోనన్న అయోమయంతో క్షణాల్లో రైలు దిగి బయటకు వచ్చేశారు. భారీ కుదుపుతో అకస్మాత్తుగా రైలు ఆగిపోయిన సమయంలో స్పీడ్ తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే..శుక్రవారం ఉదయం 8.20 గంటల సమయంలో లింగంపల్లి నుంచి హైదరాబాద్ వైపు (నాంపల్లి) వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు బేగంపేట దాటింది. చదవండి: దసరాకు ప్రత్యేక రైళ్లు.. రైళ్ల వేళల్లో మార్పులు హుస్సేన్‌సాగర్ జంక్షన్ వద్దకు రాగానే ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పాటు భారీ కుదుపునకు గురై రైలు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు ఏం జరిగిందో అర్ధంకాక ఆందోళనకు గురయ్యారు. కొందరు భయంతో రైలు దిగి నడుచుకుంటూ వెళ్లిపోయారు. రైలుకు విద్యుత్ సరఫరా జరిగే పాథన్‌పై చెట్టుకొమ్మ పడడంతో సరఫరా నిలిచినట్లు సిబ్బంది గుర్తించారు. ఆ సమయంలో రైలు స్పీడ్ తక్కువగా ఉండడంతో పెనుప్రమాదం తప్పింది.15 నిమిషాల్లో సమస్యను పరిష్కరించడంతో యథావిధిగా రైలు ముందుకుకదిలింది. చెట్టుకొమ్మ పడడంతోనే సరఫరా నిలిచి రైలు నిలిచిపోయినట్లు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ భవానీ శంకర్ సరస్వత్ తెలిపారు. -
హైటెక్ సిటీ సమీపంలో MMTS రైలు ఢీకొని ముగ్గురు మృతి
-
హైటెక్ సిటీ సమీపంలో ప్రమాదం.. ఎఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి
సాక్షి, హైదరాబాద్: హైటెక్ సిటీ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎంఎంటీఎస్ రైలు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. వీరు రైల్వే ట్రాక్‌పైనుంచి వెళ్తుండగా రైలు ఢీకొట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులను వనపర్తికి చెందిన రాజప్ప, శ్రీను, కృష్ణగా గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం భౌతికకాయాలను ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారా? లేక ప్రమాదానికి గురయ్యారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మృతుల్లో ఒకరి వద్ద మద్యం సీసాలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. మంగళవారం ఉదయం 8 గంటల సమయంలో రైల్వేస్టేషన్‌కు సమీపంలోని మూలమలుపులో పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. చదవండి: ఆటోలో వచ్చి బాలికను కిడ్నాప్ చేసిన కిరాతకులు.. గదిలో బంధించి 3 నెలలపాటు సామూహిక అత్యాచారం -
Hyderabad: భారీ వర్షాల ఎఫెక్ట్.. 34 ఎంఎంటీఎస్ రైళ్ల రద్దు
సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాల నేపథ్యంలో ఈ నెల 14 నుంచి 17 వరకు 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ప్రధానంగా లింగంపల్లి–హైదరాబాద్, హైదరాబాద్– లింగంపల్లి, ఫలక్‌నుమా– లింగంపల్లి, లింగంపల్లి–ఫలక్‌నుమా, సికింద్రాబాద్– లింగంపల్లి, లింగంపల్లి– సికింద్రాబాద్ మార్గాల్లో రాకపోకలు సాగించే రైళ్లు రద్దు చేసిన జాబితాలో ఉన్నాయి. మరో మూడు రోజులు వర్షసూచన మరో మూడు రోజులపాటు నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ ప్రకటించింది. బుధవారం ఉదయం, సాయంత్రం వేళల్లో కురిసిన వర్షంతో ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్తంభించింది. సాయంత్రం 6 గంటల వరకు అత్యధికంగా శేరిలింగంపల్లి, మాదాపూర్‌లలో ఒక సెంటీమీటరు మేర వర్షపాతం నమోదైంది. అభివృద్ధి పనులను పరిశీలించిన అర్వింద్‌కుమార్ గండిపేట్ వద్ద హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో చేపట్టిన ఆంఫీ థియేటర్, రెస్టారెంట్, పలు అభివృద్ధి పనులను బుధవారం మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్ పరిశీలించారు. పనులపై సంతృప్తి వ్యక్తంచేశారు. ప్రకృతి రమణీయత అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో సిటీజన్లకు చక్కటి ఆహ్లాదాన్ని పంచేందుకు ఈ పనులు చేపట్టినట్లు ఆయన ట్వీట్ చేశారు. (క్లిక్: హైదరాబాద్‌లో ఒకేసారి 69 మంది ఇన్స్పెక్టర్ల బదిలీ) -
ఎంఎంటీఎస్‌కు గూడ్స్ బ్రేక్
సాక్షి, హైదరాబాద్: ‘రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే ఎంఎంటీఎస్ ఎంతో ముఖ్యం. హైదరాబాద్ ప్రజల రాకపోకలకు ఎంఎంటీఎస్ ‘లైఫ్‌లైన్’. ...ఇది ఒకప్పటి దక్షిణమధ్య రైల్వే ప్రాధాన్యం. అలాంటి ఎంఎంటీఎస్ రైళ్ల లక్ష్యం నీరుగారుతోంది. ఎంఎంటీఎస్ రైళ్ల నిర్వహణ కంటే ఇప్పుడు గూడ్స్ రైళ్లే దక్షిణ మధ్య రైల్వేకు కీలకంగా మారాయి. బైపాస్ మార్గాల్లో వెళ్లవలసిన గూడ్స్ రైళ్లను సికింద్రాబాద్ స్టేషన్ మీదుగా నడుపుతూ ఎంఎంటీఎస్ రైళ్లను నిలిపివేస్తున్నారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి వంటి ప్రధాన రైల్వేస్టేషన్ల నుంచి ప్రయాణికుల రైళ్లు మాత్రమే నడపాల్సి ఉండగా కొంతకాలంగా ఈ స్టేషన్ల నుంచి గూడ్స్ రైళ్లను సైతం నడుపుతున్నారు. దీంతో ప్రయాణికుల రైళ్లకు బ్రేకులు పడుతున్నాయి. ప్రత్యేకించి సికింద్రాబాద్ మీదుగా నడిచే గూడ్స్ వల్ల ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయడంతో పాటు పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు స్టేషన్‌కు చేరుకోవడంలో జాప్యం నెలకొంటోంది. ప్రతి రోజు తెల్లవారు జామునే సికింద్రాబాద్‌కు చేరుకోవలసిన రైళ్లు మౌలాలీ, చర్లపల్లి స్టేషన్లలో నిలిచిపోతున్నట్లు ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు ఎంఎంటీఎస్లపైన ప్రయాణికులు క్రమంగా నమ్మకాన్ని కోల్పోవలసి వస్తుంది. బైపాస్ ఉన్నా ఎందుకిలా... విజయవాడ, కాజీపేట్ తదితర ప్రాంతాల నుంచి ఉత్తరాది రాష్ట్రాల వైపు వెళ్లే సరుకు రవాణా రైళ్లు బైపాస్ మార్గంలో మౌలాలి–సనత్‌నగర్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. కానీ కోవిడ్ కాలంలో పాలు, కూరగాయలు, అత్యవసర వస్తువులను వివిధ ప్రాంతాలకు చేరవేసేందుకు ప్రధాన రైల్వేస్టేషన్ల మీదుగా గూడ్స్ రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. కోవిడ్ అనంతరం పాత రూట్లలో ఈ రైళ్లను పునరుద్ధరించకపోవడం గమనార్హం. కాజీపేట్ వైపు నుంచి వచ్చే పలు సరుకు రవాణా రైళ్లు ఇప్పటికీ సికింద్రాబాద్ నుంచే నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికుల రైళ్ల నిర్వహణపైన ప్రభావం పడుతుంది. గూడ్స్ రైళ్ల కోసం ఏకంగా ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేయడం గమనార్హం. ఒక్క శని, ఆదివారాలు రెండు రోజుల్లోనే 68 ఎంఎంటీఎస్ సర్వీసులను నిలిపివేయడం గమనార్హం. కోవిడ్ అనంతరం ఎంఎంటీఎస్ రైళ్ల కచ్చితమైన సమయపాలనను పునరుద్ధరించకపోవడమే కాకుండా సర్వీసులను కూడా రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రత్యామ్నాయంగా సిటీ బస్సులు... ఎంఎంటీఎస్ రైళ్లకు బ్రేకులు పడుతూండడంతో ఆయా మార్గాలపైన ఆర్టీసీ దృష్టి సారించింది. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి హైటెక్‌సిటీ, లింగంపల్లి వరకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో అదనపు బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ రూట్లలో 280 కి పైగా అదనపు ట్రిప్పులను నడిపేందుకు చర్యలు చేపట్టినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. సగానికి తగ్గిన సర్వీసులు... కోవిడ్‌కు ముందు సికింద్రాబాద్–లింగంపల్లి, ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, నాంపల్లి–ఫలక్‌నుమా, తదితర రూట్లలో రోజుకు 121 సర్వీసులు నడిచాయి.1.5 లక్షల మంది ప్రయాణం చేశారు. కోవిడ్ అనంతరం దశలవారీగా 70 నుంచి 80 రైళ్లను మాత్రమే పునరుద్ధరించారు.కానీ కచ్చితమై సమయపాలన లేకపోవడం వల్ల ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు ఉన్న సర్వీసుల్లోనూ వీకెండ్స్‌లో 34 నుంచి 40 రైళ్లను రద్దు చేస్తున్నారు. మిగతా రోజుల్లోనూ ట్రిప్పుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఒకప్పుడు లక్షన్నర మందికి రవాణా సదుపాయం కల్పించిన రైళ్లలో ఇప్పుడు 25 వేల మంది కూడా ప్రయాణం చేయడం లేదు. (చదవండి: క్లబ్ టెకీల అంశంలో... మరో ఇన్స్పెక్టర్కు పబ్ దెబ్బ) -
ఎంఎంటీఎస్ రైలులో కత్తితో హల్చల్
సాక్షి, నాంపల్లి: ఎంఎంటీఎస్ రైలులో ఓ ఆగంతుకుడు హల్చల్ సృష్టించాడు. కత్తితో మహిళా బోగీలోకి దూరి బెదిరింపులకు దిగాడు. సెల్‌ఫోన్, నగదుతో పరారైన ఘటన నాంపల్లి జీఆర్పీ పోలీసు స్టేషన్ పరిధిలోని బోరబండ రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. నాంపల్లి జీఆర్పీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ చెప్పిన వివరాల ప్రకారం.. మణికర్ణ అనే మహిళ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టంలో (సీఆర్ఐఎస్) సీనియర్ ప్రాజెక్టు ఇంజినీరుగా పని చేస్తున్నారు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బేగంపేట రైల్వే స్టేషన్‌కు వచ్చారు. చదవండి: Hyderabad RRR: అలైన్మెంట్.. ఆల్రైట్! రాత్రి సుమారు 10.37 గంటలకు లింగంపల్లికి వెళ్లే ఎంఎంటీఎస్ రైలు ఎక్కారు. ఆమెతో పాటు ఆ బోగీలో మరో మహిళ ఉన్నారు. సదరు మహిళ ఫతేనగర్ రైల్వే స్టేషన్లో దిగిపోయారు. రైలు బోరబండ రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే గుర్తు తెలియని ఆగంతుకుడు మహిళా బోగీలోకి ప్రవేశించి మణికర్ణను కత్తితో బెదిరించాడు. ఆమె చేతిలోని సెల్‌ఫోన్‌ను, నగదును లాక్కెళ్లాడు. బాధితురాలు చందానగర్ రైల్వే స్టేషన్లో దిగి ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: ‘కొడుకా.. ఎంత పనాయె.. నీ పిల్లలకు దిక్కెవరు బిడ్డా’ -
క్షణాల్లోనే.. అందమైన బంధంలో అంతులేని శోకం
వివాహ బంధంతో ఒక్కటవ్వాలని కలలు కన్న బావామరదళ్లను మృత్యు రూపంలో వచ్చిన రైలు కబళించింది. వచ్చే వేసవిలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ జంట మంగళవారం గుంటూరులోని బంధువుల ఇంటికి బయలుదేరగా..మధ్యలోనే మృత్యువాత పడింది. చందానగర్ పరిధిలోని శాంతినగర్‌కు చెందిన మనోహర్, సోనీలు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు గుంటూరు వెళ్లేందుకు బయలుదేరారు. చందానగర్ ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లో పట్టాలు దాటుతుండగా లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళ్తున్న రైలు ఢీకొంది. దీంతో మనోహర్, సోనీ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదాన్ని మనోహర్ తల్లి సూర్యకళ సమీపం నుంచి చూసి తీవ్ర షాక్‌కు గురైంది. ఈ స్టేషన్లో మూల మలుపు ఉండటంతో దగ్గరికి వచ్చే వరకు రైలు కనిపించదు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. చందానగర్: వారిద్దరూ బావా మరదళ్లు, వారికి పెళ్లి చేయాలని పెద్దలు నిర్ణయించారు. కొద్ది రోజుల్లోనే ఒకటికానున్న ఈ జంటను విధి వెంటాడింది. మృత్యువు రూపంలో దూసుకొచ్చిన రైలు ఢీ కొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ హృదయ విదారక ఘటన మంగళవారం చందానగర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..చందానగర్ పాపిరెడ్డి కాలనీకి చెందిన పెంటయ్య, సూర్యకళ దంపతుల కుమారుడు మనోహర్(24) హైటెక్‌సిటీలో జీహెచ్ఎంసీ చెత్త ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. శాంతినగర్‌కు చెందిన భిక్షపతి, లక్ష్మమ్మ కుమార్తె సోని(18) ఇంట్లోనే ఉంటుంది. మనోహర్‌కు మేనమామ కూతురైన సోనితో వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించుకున్నారు. మనోహర్, సోని క్రిస్మస్ వేడుకల నిమిత్తం గుంటూరుకు వెళ్లేందుకు మంగళవారం చందానగర్ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. వారిని ఎంఎంటీఎస్ రైలు ఎక్కించేందుకు తల్లి సూర్యకళ కూడా వారి వెంట వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం ప్లాట్ ఫాం పక్క నుంచి పట్టాలు దాటుతుండగా లింగంపల్లి నుంచి హైదరాబాద్ వెళుతున్న ఎంఎంటీఎస్ రైలు ఢీ కొట్టింది. ఈ ఘటనలో మనోహర్ పట్టాలపై పడంతో తల, మొండెం వేరయ్యాయి. సోని ఎగిరి పట్టాల పక్కన పడటంతో తీవ్ర గాయాలై అక్కడిక్కడే మృతి చెందింది. తల్లి సూర్యకళ కొద్దిగా వెనకగా ఉండటంతో ప్రమాదం నుంచి బయటపడింది. కళ్ల ముందే కొడుకు, కోడలు చనిపోవడంతో సూర్యకళ కన్నీరు మున్నీరైంది. ఘటనా స్థలాన్ని హైదరాబాద్ రైల్వే ఎస్ఐ జీఆర్పీ దాస్యా నాయక్ పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఉదయం వెళ్లాల్సి ఉండేది... గుంటూరులో ఉంటున్న సూర్యకళ అక్క కుమారుడు సంతోష్ ఆహ్వానం మేరకు మనోహర్, సోని గుంటూరుకు బయలుదేరారు. ఇందుకుగాను మూడు రోజుల క్రితమే రైలు టికెట్ రిజర్వేషన్ చేసుకున్నారు. మంగళవారం ఉదయం లింగంపల్లి స్టేషన్‌కు వెళ్లగా వారు ఎక్కాల్సిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్ మిస్ అయ్యింది. దీంతో మధ్యాహ్నం ఎంఎంటీఎస్ రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు వచ్చారు. ముందుగా బ్యాగులు తీసుకుని ఫ్లాట్‌ఫాం మీద పెట్టి తిరిగి వచ్చిన మనోహర్ మరదలు, తల్లిని తీసుకొని పట్టాలు దాటుతుండగా వేగంగా దూసుకొచ్చిన ఎంఎంటీఎస్ రైలు ఢీ కొనడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సూర్యకళ పెద్ద కొడుకు రాజుకు మతిస్థిమితం లేదు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న మనోహర్ మృతి చెందడంతో సూర్యకళ బోరున విలపిస్తోంది. కాగా సోని తల్లి లక్ష్మమ్మ హఫీజ్‌పేట్ డివిజన్లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తోంది. మనోహర్, సోని మృతి వార్త తెలియడంతో పాపిరెడ్డి నగర్ కాలనీ, శాంతినగర్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మూలమలుపు కారణంగానే.. చందానగర్ ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్‌కు వచ్చే వారు పాపిరెడ్డినగర్ కాలనీ, సురభి కాలనీ, రాజీవ్ గృహకల్ప మీదుగా కాలినడకన వచ్చి పట్టాలు దాటుతుంటారు. అయితే అక్కడ మూల మలుపు ఉండటంతో దగ్గరికి వచ్చే వరకు రైలు కనిపించదు. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగి ఉంటుందని రైల్వే పోలీసులు భావిస్తున్నారు. -
‘మా కూతురు బతికే ఉండాలి దేవుడా’
సాక్షి, రాంగోపాల్‌పేట్ : రాణి గంజ్‌కు చెందిన ఓ యువతి (26) సోమవారం ఉదయం 10.30 గంటల సమయంలో చెల్లెలితో కలిసి ఎంఎంటీఎస్ రైలులో వెళ్లింది. సంజీవయ్య పార్కు వద్ద చెల్లికి లేఖ ఉన్న ఒక కవరు ఇచ్చి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిపోయింది. అక్క ఎక్కడికి వెళ్లిందో అర్థం కాక చెల్లెలు లేఖను చూసింది. అందులో.. ‘అమ్మా నేను చనిపోతున్నా ’ అని రాసి ఉంది. దీంతో ఆందోళనకు గురైన చెల్లెలు అమ్మానాన్నలకు చెప్పింది. వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఇదిలా ఉండగా యువతి బ్యాగు నెక్లెస్‌రోడ్‌లో ఉన్న నాలా పక్కన అక్కడున్న వారికి కనిపించింది. దీంతో రాంగోపాల్‌పేట్ ఇన్స్పెక్టర్ బాబు, లేక్ ఇన్స్పెక్టర్ ధనలక్ష్మి పోలీసులు పెద్ద ఎత్తున సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దింపి హుసేన్ సాగర్‌ను అణువణువూ గాలించారు. సాగర్‌లో దూకిన అమ్మాయి ఆచూకీ ఏమైనా దొరుకుతుందేమోననే ఆశతో సాగర్‌ను జల్లెడ పట్టారు. బయటనుంచి ప్రజలు కూడా గుమిగూడారు. యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతూ మా కూతురు బతికే ఉండాలి దేవుడా అని దండం పెడుతున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ గాలింపు కొనసాగింది. సాగర్‌తోపాటు పక్కనున్న నాలాలో కూడా వెతుకుతూనే ఉన్నారు. తరువాత అమ్మానాన్నలకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. దానిని విన్న తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యారు. అమ్మా..నేను బాగానే ఉన్నా.. అంటూ కూతురు ఎక్కడినుంచో ఫోన్‌చేసి చెప్పింది. దీంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రియుడితో కలిసి వెళ్లిపోయేందుకు ఆమె ఇలా నాటకమాడినట్లు తెలుస్తోంది. తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. -
లోకోపైలెట్ చంద్రశేఖర్ కుడికాలు తొలగింపు
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన లోకో పైలెట్ చంద్రశేఖర్ (35) కుడికాలును గురువారం తొలగించారు. ఎంఎం టీఎస్, ఇంటర్సిటీ రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీ కొన్న ఈ ఘటనలో 17 మంది గాయపడటం, వీరిలో ఆరుగురు బాధితులు కేర్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చంద్రశేఖర్ తీవ్రంగా గాయపడటంతో ఆయన కుడి కాలు చిద్రమైంది. రక్తనాళాలతో పాటు కండరాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆ భాగానికి రక్త సరఫరా పూర్తిగా నిలిచిపోవడం, కిడ్నీ, గుండెకు ఇన్ఫెక్షన్ చేరే ప్రమాదం ఉండటంతో విధిలేని పరిస్థితుల్లో ఆయన కుడి మోకాలి పైభాగం వరకు కాలును పూర్తిగా తొలగించాల్సి వచ్చిందని ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆయన్ను ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని, మరో 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు. -
ప్రమాదం ఎలా జరిగింది..?
సాక్షి, హైదరాబాద్: ఎంఎంటీఎస్ రైలు ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి విచారణ కమిటీ బుధవారం కాచిగూడ రైల్వేస్టేషన్లో సమావేశమైంది. ప్రమాదం జరిగిన తీరు, తీవ్రత, తదనంతర పరి ణామాలపై అధికారులు విచారణ చేపట్టారు. రైల్వే భద్రత కమిషనర్ రాంకృపాల్ నేతృత్వంలో జరి గిన ఈ సమావేశంలో హైదరాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ సీతారాం, వివిధ విభాగాలకు చెంది న ఉన్నతాధికారులు, ఆర్పీఎఫ్, జీఆర్పీ అధికారు లు పాల్గొన్నారు. ప్రమాద సమయంలో నమోదైన సీసీటీవీ ఫుటేజీలను అధికారులు పరిశీలించారు. ఆ సమయంలో ఎంఎంటీఎస్ ట్రైన్ కనీసం 50 కిలోమీటర్లపైనే వేగంతో వెళ్తున్నట్లు గుర్తించారు. వేగం వల్లే ఎక్కువ బోగీలు ధ్వంసమైనట్లు తేల్చా రు. ప్రమాద సమయంలో లూప్లైన్లో నెమ్మదిగా క్రాస్ చేస్తున్న హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ వాకిం గ్ స్పీడ్‌తో ముందుకెళ్లడం వల్ల కూడా ప్రమాద తీవ్రత తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ప్రమాద సమయంలో విధి నిర్వహణలో ఉన్న కాచిగూడ స్టేషన్ మేనేజర్ దశరథ్, ఇతర విభాగాల్లో పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది, సిగ్నలింగ్ స్టాఫ్‌ను విచారించారు. ప్రయాణికులు, ప్రత్యక్ష సాక్షుల నుంచీ వివరాలు సేకరించారు. హంద్రీ ఎక్స్‌ప్రెస్ లోకోపైలట్ బాలకిషన్‌తోనూ ఉన్నతస్థాయి విచారణ కమిటీ సమావేశమైంది. ఎంఎంటీఎస్ లోకోపైలట్ చంద్రశేఖర్ మానసిక స్థితిని అంచనా వేసేందుకు అధ్యయనం చేపట్టారు. అతడితో పనిచేస్తున్న సహోద్యోగులు, పైఅధికారుల నుంచి వివరాలు తెలుసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కేవలం ఏమరుపాటుగానే సిగ్నల్‌ను గమనించకుండా ముందుకు వెళ్లి ఉంటే ఆ ఏమరుపాటుకు దారితీసిన అంశాలేంటీ అనే దానిపైనా దృష్టి సారించారు. గురువారం కూడా విచారణ కొనసాగనున్న దృష్ట్యా లోకో పైలట్‌కు సన్నిహితులైన వ్యక్తుల నుంచి అదనపు సమాచారం సేకరించాలని భావిస్తున్నారు. విషమంగానే లోకోపైలట్ పరిస్థితి లోకోపైలట్ చంద్రశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. నాంపల్లి కేర్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై ఉంచి డాక్టర్లు అత్యవసర వైద్య చికిత్సలు అందిస్తున్నారు. మరో 24 గంటలు గడిస్తే తప్ప అతడి ఆరోగ్యంపై ఏమీ చెప్పలేమని వైద్యులు స్పష్టం చేశారు. -
ఎంఎంఢీఎస్
-
కాచిగూడ రైల్వే ప్రమాద సీసీ టీవీ దృశ్యాలు
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైల్వేస్టేషన్లో సోమవారం ఉదయం కర్నూల్-సికింద్రాబాద్ హంద్రీ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ ఢీకొన్న విషయం తెలిసిందే. ప్రమాదానికి సంబంధించిన సీసీ టీవీ పుటేజ్‌ను అధికారులు విడుదల చేశారు. ఈ ప్రమాదంలో సుమారు 30మంది గాయపడగా, వారిలో ఎనిమిది మందికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. మరోవైపు ఇంజిన్ క్యాబిన్లో చిక్కుకున్న లోకో పైలెట్ చంద్రశేఖర్‌ను ఎనిమిది గంటలపాటు శ్రమించి బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన అతడిని చికిత్స నిమిత్తం నాంపల్లి కేర్ ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ నెమ్మదిగా పట్టాలు మారుతుండడం, ఎంఎంటీఎస్ కూడా తక్కువ వేగంతో బయలుదేరడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. కానీ ఆ సమయంలో రెండు రైళ్లు ఏ కొంచెం ఎక్కువ వేగంతో వెళ్లినా భారీ నష్టం జరిగి ఉండేదని రైల్వే అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఎంఎంటీఎస్ చరిత్రలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదాలు జరగలేదు. తొలిసారిగా ఎంఎంటీఎస్ రైలు మరో రైలును ఢీకొనడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఉదయం 10.39 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఢీ కొన్న దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. చదవండి: కాచిగూడ స్టేషన్ వద్ద రెండు రైళ్లు ఢీ మరోవైపు ఈ ప్రమాద ఘటన నేపథ్యంలో కాచిగూడ మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లను రద్దు చేశారు. నగరంలోని వివిధ మార్గాల్లో నడిచే ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ఉదయం ఇళ్ల నుంచి ఆఫీసులకు, ఇతర పనులకు వెళ్లవలసిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ దుర్ఘటన దృష్ట్యా లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వరకు రాకపోకలు సాగించే వాటిని సికింద్రాబాద్‌కే పరిమితం చేయడంతో సికింద్రాబాద్ నుంచి ఫలక్‌నుమా వరకు వెళ్లవలసిన వారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాగే నాంపల్లి నుంచి ఫలక్‌నుమాకు కూడా సర్వీసులు నిలిచిపోయాయి. మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయగా, కొన్నింటిని దారిమళ్లించారు. ఆకస్మాత్తుగా రైళ్లు రద్దు కావడంతో ప్రయాణికులు నానా కష్టాలు పడ్డారు. -
లోకో పైలెట్‌కు తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైల్వేస్టేషన్లో సుమారు ఎనిమిది గంటల పాటు కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు ముగిసింది. రైలు ఇంజిన్‌లో ఇరుక్కొన్న లోకో పైలెట్ శేఖర్‌ను ఆర్పీఎఫ్ సిబ్బంది బయటకు తీశారు. గ్యాస్ కట్టర్ల సాయంతో ఇంజిన్ భాగాలను తొలగించి లోకో పైలెట్‌ను సురక్షితంగా బయటకు తీసుకు వచ్చారు. తీవ్రంగా గాయపడిన శేఖర్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా కాచిగూడ రైల్వేస్టేషన్లో ఆగి వున్న కర్నూలు-హైదరాబాద్ హంద్రీ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను...అదే ట్రాక్ వచ్చిన ఎంఎంటీఎస్ రైలు ఢీకొన్న విషయం తెలిసిందే. ఈ సంఘటనలో 30 మందికిపైగా గాయపడ్డారు. మరోవైపు ఈ ఘటనపై రైల్వే ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. సిగ్నల్ చూసుకోకపోవడంతోనే రెండు ట్రైన్లు ఒకే ట్రాక్‌పైకొచ్చినట్టు తెలుస్తోంది. టెక్నికల్ లోపం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెప్తున్నారు. చదవండి: కాచిగూడ : ఆగివున్న ట్రైన్‌ను ఢీకొట్టిన ఎంఎంటీఎస్ -
హైదరాబాద్ : కాచిగూడలో ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొట్టిన ఎంఎంటీఎస్
-
కాచిగూడ స్టేషన్ వద్ద రెండు రైళ్లు ఢీ
సాక్షి, హైదరాబాద్ : కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద ఇంటర్సిటీ, ఎంఎంటీఎస్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 30 మందికిపైగా గాయాలపాలయ్యారు. ఆగివున్న ఉన్న ప్యాసెంజర్ (ఇంటర్సిటీ) రైలు ట్రాక్‌పైకి ఎంఎంటీఎస్ ట్రైన్ వచ్చి ఢీకొట్టింది. సిగ్నల్ చూసుకోకపోవడంతోనే రెండు ట్రైన్లు ఒకే ట్రాక్‌పైకొచ్చినట్టు తెలుస్తోంది. టెక్నికల్ లోపం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే అధికారులు చెప్తున్నారు. స్టేషన్ కావడంతో రైలు వేగం తక్కువగా ఉందని, లేదంటే పెను ప్రమాదం సంభవించేదని అధికారులు వెల్లడించారు. ప్రమాదంలో ఎంఎంటీఎస్ ట్రైన్ మూడు కోచ్‌లు ధ్వంసమయ్యాయి. మరో ఆరు కోచ్‌లు పట్టాలపై పడిపోయాయి. ఎంఎంటీస్ ట్రైన్ డ్రైవర్ శేఖర్ ఇంజన్లో ఇరుక్కుపోయారు. అతన్ని బయటికి తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఘటన నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
హైదరాబాద్ రవాణాకు 'లండన్ మోడల్'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకూ నష్టాల ఊబిలో కూరుకుపోతున్న తెలంగాణ ఆర్టీసీకి తిరిగి జవసత్వాలు కల్పించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కీలక సూచన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా బస్సుల నిర్వహణ ఒక సంస్థే పర్యవేక్షిస్తే అది ఎప్పటికీ బాగుపడదని, హైదరాబాద్‌లో రవాణా వ్యవస్థను విడిగా చూసినప్పుడే పరిస్థితి మెరుగుపడుతుందని కమిటీ నిర్ధారణకు వచ్చింది. ఇందుకోసం లండన్ మోడల్‌ను తెరపైకి తెచ్చింది. హైదరాబాద్ సిటీ వరకు లండన్ మోడల్‌ను నిర్వహిస్తే సిటీలో రవాణా వ్యవస్థ మెరుగుపడటంతోపాటు ఆర్టీసీపై సిటీ భారం తొలగిపోయి రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో బస్సుల నిర్వహణ గాడిలో పడుతుందని కమిటీ తన సిఫారసులో ఖరారు చేసినట్లు తెలిసింది. త్వరలో దీన్ని ప్రభుత్వానికి నివేదించేందుకు సిద్ధమైంది. ఏమిటీ లండన్ మోడల్...? ప్రపంచ పట్టణ రవాణాలో లండన్ నగరాన్ని ఉత్తమంగా పేర్కొంటారు. అక్కడ సిటీ బస్సులు, ట్రామ్ సర్వీసులు, మెట్రో రైలు వ్యవస్థతోపాటు ఇతర రవాణా వ్యవస్థలు ఒకే గొడుగు కింద పని చేస్తున్నాయి. వాటన్నింటినీ నగర మేయర్ పర్యవే క్షిస్తారు. లండన్ ప్రజలు మంచినీటి సరఫరా కంటే రవాణా వ్యవస్థకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. రవాణా వ్యవస్థ గాడి తప్పితే మేయర్ సీటులో ఉన్న వ్యక్తి చీత్కారాలు ఎదుర్కోవాల్సిందే. వెరసి అక్కడ రవాణా వ్యవస్థ అద్భుతంగా పని చేస్తోంది. హైదరాబాద్ సిటీలో కూడా అదే తరహా వ్యవస్థ అవసరమని కమిటీ సిఫారసులో పేర్కొంటోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో దాదాపు 3,800 సిటీ బస్సులు తిరుగుతున్నాయి. ఇటీవలే రెండు కారిడార్ల మెట్రో రైలు సేవలు మొదలయ్యాయి. దాదాపు దశాబ్దంన్నర నుంచి ఎంఎంటీఎస్ రైళ్లు పరుగుపెడుతున్నాయి. కానీ ఈ మూడు ప్రధాన రవాణా సాధనాలు మూడు సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ఇలా కాకుండా వాటిని ఒకే సంస్థ పర్యవేక్షించేలా చూడాలని, ఆ బాధ్యత ఆర్టీసీ కాకుం డా హైదరాబాద్ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ తరహాలో ఓ వ్యవస్థ పర్యవేక్షించాలని కమిటీ తేల్చింది. ఒకే పరిధిలో ఉండటం వల్లే సమస్యలు... హైదరాబాద్ సిటీలో బస్సుల నిర్వహణకు, జిల్లాల్లో బస్సుల నిర్వహణకు చాలా తేడా ఉంటుంది. వాటిని ఒకేలా పర్యవేక్షిస్తుండటంతో ఆర్టీసీకి సమస్యలు వస్తున్నాయని కమిటీ తేల్చింది. జిల్లా బస్సు సర్వీసులు పకడ్బందీగా కొనసాగాలంటే ఆర్టీసీపై సిటీ బస్సుల నిర్వహణ భారం ఉండరాదని తేల్చింది. ప్రస్తుతం కర్ణాటకలో బెంగళూరు మహానగర ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ (బీఎంటీసీ) పేరుతో ప్రత్యేక వ్యవస్థ ఉంది. సిటీ బస్సులను అదే నిర్వహిస్తోంది. దేశంలోని అన్ని ముఖ్య నగరాలతో పోలిస్తే బెంగళూరులో సిటీ బస్సుల నిర్వహణ మెరుగ్గా ఉంది. దీనికి ఈ ప్రత్యేక వ్యవస్థే కారణం. హైదరాబాద్‌లో కూడా అలాంటి ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి మెట్రో రైలు, ఎంఎంటీఎస్ రైళ్లను దాని పరిధిలోకి తీసుకోవాలనేది కమిటీ అభిప్రాయం. అమలు కష్టమే.. నిపుణుల కమిటీ చేసిన సిఫారసు అమలు ఎంతవరకు సాధ్యమనే విషయంలో సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో చేపట్టిన హైదరాబాద్ మెట్రో రైలు ప్రస్తుతం ఎల్ అండ్ టీ సంస్థ కనుసన్నల్లో కొనసాగుతోంది. దాన్ని ప్రభుత్వం తీసుకోవడం అంత సులభం కాదు. ఇక ఎంఎంటీఎస్ రైళ్లను రైల్వేశాఖ పర్యవేక్షిస్తోంది. వాటిని రైల్వే నుంచి విడదీసి రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించేందుకు కేంద్రం అంగీకరించాల్సి ఉంటుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి తదనుగుణంగా ప్రయత్నిస్తే అది అసాధ్యం కాదని కమిటీ సభ్యులు పేర్కొంటున్నారు. -
ఎంఎంటీఎస్ రైలు ఢీకొని నర్సు మృతి
ఖైరతాబాద్: ఎంఎంటీఎస్ రైలు ఢీ కొని ఓ నర్సు మృతిచెందింది. ఈ సంఘటన ఖైరతాబాద్‌లో జరిగింది. నాంపల్లి జిఆర్పిఎఫ్ ఇన్వెస్టిగేషన ఆఫీసర్ మహ్మద్ బషీరుద్దీన్ తెలిపిన మేరకు.. ఢిల్లీకి చెందిన రేఖా మహల్(25) లక్డీకాపూల్‌లోని గ్లోబల్ హాస్పిటల్లో పనిచేస్తూ టెలిఫోన్ భవన్ ఎదురుగా ఉన్న హాస్టల్లో ఉంటుంది. గురువారం ఉదయం జిమ్ చేసి తిరిగి ఉదయం 8.08 గంటలకు ఖైరతాబాద్ రైల్వేగేట్ వద్ద గేటు వేసి ఉన్న సమయంలో చెవిలో హెడ్‌ఫోన్స్ పెట్టుకొని పట్టాలు దాటేందుకు ప్రయత్నించడంతో నాంపల్లి నుంచి లింగంపల్లి వైపు వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలును రైలు ఢీ కొట్టింది. ఈ సంఘటనలో ఆమె తలకు తీవ్రగాలయ్యాయి. వెంటనే హాస్పిటల్‌కు తరలించినా అప్పటికే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. -
సెల్ఫీ పోజు.. అతనికేం కాలేదంట!
సాక్షి, హైదరాబాద్: వేగంగా వస్తున్న ఎంఎంటీఎస్ ముందు సెల్ఫీ వీడియో దిగడానికి ప్రయత్నించి.. గాయపడిన యువకుడి తాజా వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో హల్చల్ చేస్తున్నాయి. ఈ సెల్ఫీ వీడియో ఘటనలో అతను తీవ్రంగా గాయపడినట్టు మొదట కథనాలు వచ్చాయి. అయితే, ఈ ఘటనలో అతనికేం పెద్దగా గాయాలు కాలేదని, అతను బాగానే ఉన్నాడంటూ స్నేహితులు ఆటపట్టించేలా ఉన్న ఈ తాజా వీడియో హల్చల్ చేస్తోంది. వరంగల్ ఉర్సు కరీమాబాద్‌కి చెందిన కృష్ణమూర్తి కుమారుడు తోటం శివ(25) గత ఆదివారం బోరబండ ఎంఎంటీఎస్ స్టేషన్లో వేగంగా వస్తున్న రైలు ముందు సెల్ఫీ తీసుకునేందుకు యత్నించాడు. రైల్వే హోంగార్డ్ వారిస్తున్నా ఎడమ చేత్తో సెల్‌ఫోన్ పట్టుకున్న శివ కుడిచేత్తో రైలును చూపిస్తూ ఫోజు ఇచ్చాడు. ఇంతలో ఎంఎంటీఎస్ డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేక్ వేశారు. వేగం తగ్గిన రైలు వచ్చి శివ కుడిచేతిని ఢీ కొట్టింది. దీంతో పట్టాల పక్కన పడిపోయిన శివ తలకు రాయి తగలడంతో గాయపడ్డాడు. వెంటనే స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. సోమవారం భరత్‌నగర్ ఆర్పీఎఫ్ పోలీసులు శివకు సెల్‌ఫోన్ అప్పగించి అతడిపై కేసు నమోదు చేశారు. కౌన్సెలింగ్ అనంతరం రైల్వే కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం విధించిన రూ.500 జరిమానా శివ చెల్లించాడు. ఈ సెల్ఫీ ‘సైట్’ను నాంపల్లి రైల్వే ఎస్పీ జి.అశోక్‌కుమార్, ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి బుధవారం సందర్శించారు. ఈ ఘటన ఇలా ఉండగా శివ తాజా వీడియో హల్చల్ చేస్తోంది. ఇతనికేం కాలేదు.. తినితాగి మంచిగా ఉన్నాడంటూ స్నేహితులు ఆటపట్టించేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం వాట్సాప్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను బట్టి శివకు పెద్దగా గాయాలు కాలేదని స్పష్టమవుతోంది. అయితే, ఇది వీడియోనేనా? లేక పాతదా? అన్నది నిర్దారణ కాలేదు. మొత్తానికి ఈ వీడియోతోపాటు శివ సెల్ఫీ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
వేగంగా ట్రైన్ ఢీ కొట్టినా ఏం కాలేదంట!
-
వేగంగా వస్తున్న రైలు ముందు పోజిచ్చి..!
-
రైలుతో సెల్ఫీ తీసుకోవాలని..
సాక్షి,హైదరాబాద్: వేగంగా వస్తున్న ఎంఎంటీఎస్ ముందు సెల్ఫీ వీడియో దిగడానికి ప్రయత్నించిన ఓ యువకుడు అదే రైలు ఢీ కొట్టడంతో గాయపడ్డాడు. ఈ వీడియో బుధవారం సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. వరంగల్ ఉర్సు కరీమాబాద్‌కి చెందిన కృష్ణమూర్తి కుమారుడు తోటం శివ(25) జిమ్ ట్రైనర్. ఇతడి సోదరుడు సతీష్ హైదరాబాద్‌లోని బోరబండ సమీపంలో ఉన్న పర్వత్‌నగర్‌లో నివసి స్తున్నాడు. శివ కొన్నిరోజుల క్రితం సతీష్ వద్దకు వచ్చాడు. టైమ్‌పాస్ కావట్లేదంటూ ఆదివారం బోరబండ ఎంఎంటీఎస్ స్టేషన్ వద్దకు వచ్చాడు. రైలు పట్టాలకు సమీపంలో నిల్చొని వెనుక నుంచి వస్తున్న ఎంఎంటీఎస్‌తో సెల్ఫీ తీసుకునేందుకు యత్నించాడు. రైల్వే హోంగార్డ్ వారిస్తున్నా ఎడమ చేత్తో సెల్‌ఫోన్ పట్టుకున్న శివ కుడిచేత్తో రైలును చూపిస్తూ ఫోజు ఇచ్చాడు. ఇంతలో ఎంఎంటీఎస్ డ్రైవర్ ఎమర్జెన్సీ బ్రేక్ వేశారు. వేగం తగ్గిన రైలు వచ్చి శివ కుడిచేతిని ఢీ కొట్టింది. దీంతో పట్టాల పక్కన పడిపోయిన శివ తలకు రాయి తగలడంతో గాయపడ్డాడు. వెంటనే స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నాడు. సోమవారం భరత్‌నగర్ ఆర్పీఎఫ్ పోలీసులు శివకు సెల్‌ఫోన్ అప్పగించి అతడిపై కేసు నమోదు చేశారు. కౌన్సెలింగ్ అనంతరం రైల్వే కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం విధించిన రూ.500 జరిమానా శివ చెల్లించాడు. ఈ సెల్ఫీ ‘సైట్’ను నాంపల్లి రైల్వే ఎస్పీ జి.అశోక్‌కుమార్, ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి బుధవారం సందర్శించారు. రైలు వెడల్పు ఎక్కువ ఉండడం వల్లే? రైళ్ల ముందు, వాటి సమీపంలో సెల్ఫీలు దిగే అలవాటు శివకు ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. వరంగల్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో అతడు సాధార ణ రైళ్ల ముందు సెల్ఫీలు దిగి ఉంటాడని, వాటి వెడల్పు కేవలం రెండు మీటర్లేనని, ఎంఎంటీఎస్ రెండున్నర మీటర్లు ఉంటుందని చెప్పారు. అందు వల్లే రైలు శివ చేతికి తగిలి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ విషయం తెలియని శివ తప్పుడు అంచనాతో ఎంఎంటీఎస్ వస్తుండగా సెల్ఫీ వీడియోకు ప్రయత్నించి ఉంటాడని భావిస్తున్నారు. -
చెన్నైలో ఘోర ప్రమాదం
చెన్నై: చెన్నైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పల్లవాన్పాంగన్ సమీపంలో ఎంఎంటీఎస్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు యువకులు అదుపుతప్పి కింద పడిపోయారు. వీరిలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురు యువకులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్ధితి విషమంగా ఉంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సివుంది. -
గమ్యం చేరే దారేది..!
సిటీబస్సుకు ఎంఎంటీఎస్‌కు తెగిన లింకు ప్రయాణికులకు తప్పని పాట్లు దశాబ్దం దాటినా అమలుకు నోచని కనెక్టివిటీ ఏళ్లుగా ఇదే నిర్లక్ష్యం.. గ్రేటర్ హైదరాబాద్‌లోని 26 ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్లలో మూడొంతుల స్టేషన్లది ఇదే దుస్థితి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, ఫలక్‌నుమా, ఉప్పుగూడ, హైటెక్‌సిటీ వంటి కొన్ని స్టేషన్లు మినహా.. చాలా వరకు రోడ్డు సదుపాయం కానీ, సిటీ బస్సు కనెక్టివిటీ కానీ లేకుండానే ఉన్నాయి. నగరంలో ప్రజా రవాణా రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో 2003లో ప్రవేశపెట్టిన ఈ ‘మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ’ బస్ కనెక్టివిటీ లేకపోవడం వల్ల ‘సింగిల్ మోడల్ సిస్టమ్’గానే నడుస్తోంది. ఎంఎంటీఎస్‌తో పాటే అన్ని స్టేషన్లకు రోడ్లు, బస్స్టేషన్లు, ఇతర మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తేవాలని ప్రతిపాదించారు. కానీ 13 ఏళ్లు దాటినా అది ఆచరణకు నోచుకోలేదు. ప్రధాన రహదారులకు ఆనుకొని ఉన్న కొన్ని స్టేషన్లకు మాత్రమే బస్సు సదుపాయం కల్పించారు. మొదట్లో కొద్ది రోజులు ఎంఎంటీఎస్ ట్రైన్ తరహాలోనే నీలి, తెలుపు రంగు బస్సులను నడిపారు. లక్డీకాపూల్, ఖైరతాబాద్, నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ వంటి స్టేషన్లకు ఈ బస్సులు నడిచేవి. కానీ ప్రయాణికుల ఆదరణ లేదనే కారణంతో ఏడాది తిరగకుండానే బస్సులను నిలిపివేశారు. దీంతో ఎంఎంటీఎస్-సిటీ బస్సు కనెక్టివిటీ ఆదిలోనే అటకెక్కింది. సిటీబ్యూరో: నగరంలో ప్రతిరోజు ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసుల సంఖ్య 121. వీటిలో ప్రయాణిస్తున్న వారు 1.30 లక్షల మంది. మూడేళ్ల క్రితం 1.60 లక్షల మంది ఎంఎంటీఎస్ రైళ్లను వినియోగించుకునే వారు. ఈ మూడేళ్లలో 30 వేల మంది ఎంఎంటీఎస్‌కు దూరమయ్యారు. రూ. 10తో ట్రైన్లో ప్రయాణించిన వారు రైలు దిగి తమ గమ్యం చేరుకోవాలంటే ఆటోకు కనీసం రూ.30 చెల్లించాల్సిన పరిస్థితి. ఫలక్‌నుమా-లింగంపల్లి, నాంపల్లి-లింగంపలి, సికింద్రాబాద్-నాంపల్లి మార్గంలో ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. రైలు దిగి గమ్యం చేరేందుకు ఇప్పటికీ నగరంలోని ఏ ఎంఎంటీఎస్ స్టేషన్ నుంచి పూర్తిస్థాయిలో సిటీ బస్సు సౌకర్యం లేదు. దీంతో క్రమంగా ప్రయాణికుల సంఖ్య తగ్గుతోంది. ఇదేక్రమంలో గ్రేటర్లో 3850 సిటీ బస్సులు నడుస్తుండగా ఎంఎంటీఎస్ స్టేషన్లతో లింకున్నవి 300 మించి లేవు. సీతాఫల్మండి బస్టాపు నుంచి ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్ మధ్య దూరం 2 కిలోమీటర్లు. ఈ మార్గంలో బస్సులు రైల్వేస్టేషన్ వరకు వెళ్లే అవకాశం లేదు. రైల్వేస్టేషన్లో దిగి ఇటు తార్నాక వైపు లేదా అటు చిలకలగూడ వైపు నడిచి వెళ్లాల్సిందే. లేదంటే ఆటో ప్రయాణం. ఆటోలో రెండు కిలోమీటర్ల దూరానికి కనీసంరూ. 30 చెల్లించాలి. హైటెక్‌సిటీ నుంచి సీతాఫల్మండి వరకు ఎంఎంటీఎస్ ట్రైన్లో రూ.10 టిక్కెట్‌పై వచ్చిన వారు.. మరో రెండు కిలోమీటర్లు రోడ్డు మార్గంలో వెళ్లేందుకు ఆటోకు రూ.30 వెచ్చించాల్సి వస్తోంది. అమీర్‌పేట్ నేచర్ క్యూర్ రైల్వేస్టేషన్ నుంచి ప్రతి రోజు వందలాది మంది రాకపోకలు సాగిస్తారు. కానీ ఈ రూట్లో బస్సులు అందుబాటులో ఉండవు. బసెక్కాలంటే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ వైపు లేదా అమీర్‌పేట్ వైపు రెండు కిలోమీటర్లు వెళ్లాల్సిందే. ఈ రెండు స్టేషన్లు మాత్రమే కాదు.. చందానగర్, హఫీజ్‌పేట్, బోరబండ, భరత్‌నగర్, నెక్లెస్‌రోడ్డు, బేగంపేట్, జేమ్స్ స్ట్రీట్, మలక్‌పేట్, యాకుత్‌పురా, తదితర స్టేషన్లకు సైతం బస్సు సదుపాయం లేదు. వేలాది మంది రాకపోకలు సాగించే మౌలాలీ, మల్కాజిగిరి వంటి రైల్వేస్టేషన్ల పరిస్థితీ అలాగే ఉంది. ఇంకా కొన్ని రైల్వేస్టేషన్లకు రోడ్డు సదుపాయం కూడా లేదు. దీంతో ప్రయాణికులు తక్కువ చార్జీలతో ఎంఎంటీఎస్ రైళ్లను వినియోగించుకోగలిగినా ట్రైన్ దిగిన తరువాత రోడ్డు రవాణా కోసం ఇబ్బందులకు గురికావలసి వస్తోంది. తగ్గుతున్న ప్రయాణికులు.. పెరుగుతున్న జనాభా, రోడ్లపై వాహనాల రద్దీ, ప్రయాణికుల అవసరాలు, వాహన కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎంఎంటీఎస్‌కు శ్రీకారం చుట్టింది. మొదటి దశలో సుమారు రూ. 69.50 కోట్ల వ్యయంతో ఈ రైళ్లు పట్టాలెక్కాయి. మొదట సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు ఈ రైలును ప్రవేశపెట్టారు. తరువాత సికింద్రాబాద్ నుంచి ఫలక్‌నుమా వరకు విస్తరించారు. 25 వేల మంది ప్రయాణికులు, 30 సర్వీసులతో ప్రారంభమైన ఎంఎంటీఎస్ సేవలు.. ప్రస్తుతం 121 సర్వీసులకు చేరుకున్నాయి. కానీ ఇప్పటికీ సిటీ బస్సుతో లింకు లేకపోవడంతో ఏటా ప్రయాణికుల సంఖ్య తగ్గుతోంది. 2013లో ఎంఎంటీఎస్ రైళ్లలో 1.60 లక్షల మంది పయనిస్తే ఇప్పుడు ఆ సంఖ్య 1.30 లక్షలకు పడిపోయింది. అటు హైటెక్ సిటీ నుంచి ఇటు పాతనగరం వరకు సాఫ్ట్వేర్ నిపుణులు, ఉద్యోగులు, వ్యాపారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలకు ఎంఎంటీఎస్ ఎంతో అందుబాటులో ఉన్నప్పటికీ క్రమంగా ఆదరణ కొరవడుతోంది. ఇక ఎంఎంటీఎస్ రెండో ద శ ప్రాజెక్టులోనైనా రోడ్డు, సిటీ బస్సు కనెక్టివిటీ కోసం ప్రత్యేక చర్యలు తీసుకొంటే తప్ప నగర ప్రజలకు పెద్దగా ప్రయోజనం ఉండదు. -
ఎంఎంటీఎస్ ఢీకొని ఇద్దరు యువకుల మృతి
అడ్డగుట్ట (సికింద్రాబాద్): ప్రమాదవశాత్తూ ఎంఎంటీఎస్ రైలు ఢీకొన్న ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు యువకులు మృత్యువాతపడ్డారు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మెట్టుగూడకు చెందిన డోమ్నిక్ (18), నవీన్ చారి (25)లు ఆదివారం మధ్యాహ్నం సీతాఫల్‌మండిలోని దూద్ బావి రైలు పట్టాల వద్ద నడుచుకుంటూ వెళ్తున్నారు. అయితే అటుగా వచ్చిన రైలును గుర్తించడంలో ఆలస్యం కావడంతో రైలు వారిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే మార్గం మధ్యలోనే వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
ఎంఎంటీఎస్ నుంచి జారి పడి వ్యక్తి మృతి
నాంపల్లి (హైదరాబాద్): ఎంఎంటీఎస్ రైలు నుంచి ఓ గుర్తు తెలియని యువకుడు(30) ప్రమాదవశాత్తు జారి కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన నాంపల్లి జీఆర్పీ రైల్వే స్టేషన్ పరిధిలోని ప్రకృతి చికిత్సాలయం రైల్వే స్టేషన్ సమీపంలో సోమవారం జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడు నీలం, తెలుపు రంగు నిలువు గీతల చొక్కా, గోధుమ రంగు ప్యాంటు ధరించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాల కోసం 040-23202238 ఫోన్ నంబరులో సంప్రదించవచ్చని సూచించారు. -
ప్రయాణికురాలితో టీటీఈ అసభ్య ప్రవర్తన
దాడి చేసి రూ. 12 వేలు జరిమానా విధించిన వైనం కేసు నమోదు చేసిన ఆర్పీఎఫ్ పోలీసులు సికింద్రాబాద్: ఎంఎంటీఎస్ రైళ్లో ప్రయాణిస్తున్న మహిళతో రైల్వే టీటీఈ అనుచితంగా మాట్లాడి, అసభ్యకరంగా ప్రవర్తించడం కలకలం సృష్టించింది. సీజన్ టికెట్‌తో ఏసీ బోగీలో ఎక్కిన పాపానికి సదరు మహిళకు రూ.12 వేలు జరిమానా విధిస్తూ చలానా రాయడంతో పాటు ఇదేంటని ప్రశ్నించిన పాపానికి టీటీఈ గాయపర్చడం పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురి చేసింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్పీఎఫ్ పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం....మియాపూర్‌కు చెందిన లోక్‌సత్తా పార్టీ గ్రేటర్ అధ్యక్షురాలు చంద్ర మధ్యాహ్నం లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే రైలులోని ఒకటవ క్లాస్ బోగీ ఎక్కారు. ఆ బోగీలో ఆమె ఒక్కర్తే కూర్చొని ఉన్నారు. ఆ బోగీకి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గార్డుగా ఉన్నాడు. చందానగర్ దాటగానే నరేష్‌రాజ్ అనే టీటీఈ బోగీలోకి ఎక్కి టికెట్ చూపించమని చంద్రను అడిగాడు. ఆమె తనవద్ద నున్న సీజన్ టికెట్‌ను చూపించింది. ‘టికెట్‌పై నీ సంతకం లేదు. అయినా సీజన్ టికెట్‌తో ఫస్ట్‌క్లాస్ బోగీలో ఎందుకు కూర్చున్నావ్ అంటూనే దుర్భాలాడాడు. అవసరమైతే చలానా విధించుకో.. అమర్యాదగా మాట్లాడితే ఊరుకునేది లేదని చంద్ర అంది. దీంతో ఆగ్రహించిన టీటీఈ ఎక్కువ మాట్లాడుతున్నావేంటని చంద్రను నెట్టివేయడంతో ఆమె చేతులకు గాయాలయ్యాయి. ఆ బోగీలోని గార్డు వారించబోగా టీటీఈ.. ‘ఇది నీ డ్యూటీ కాదు.. నోర్మూసుకుని కూర్చో’ అని అన్నాడు. తర్వాత చంద్రకు రూ. 12 వేల జరిమానా విధిస్తూ చలనా రాసి.. ఆమెను బేగంపేట్ రైల్వేస్టేషన్లో దింపేశాడు. దీంతో బాధితురాలు ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. అనంతరం రైల్వే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, టీటీఈ నరేష్ కోసం గాలిస్తున్నారు. ఇదిలాఉండగా చంద్ర అనే మహిళా ప్రయాణికురాలు తనతో అసభ్యకరంగా మాట్లాడి దాడికి యత్నించిందని టీటీఈ నరేష్‌రాజ్ ఆర్పీఎఫ్ పోలీసులకు ప్రతి ఫిర్యాదు చేసి.. అందుబాటు లేకుండాపోయినట్టు తెలిసింది. -
‘ఎంఎంటీఎస్’ వేగం పెంచాలి
దక్షిణ మధ్య రైల్వే జీఎంను కలిసిన బండారు దత్తాత్రేయ సాక్షి,సిటీబ్యూరో : ఎంఎంటీఎస్ రెండో దశ పనులను వేగవంతం చేయాలని బీజేపీ నేత, సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యులు బండారు దత్తాత్రేయ కోరారు. దక్షిణ మధ్య రెల్వేలోని పలు పెండింగ్ ప్రాజెక్టులపై ఆయన సోమవారం జీఎం పి.కె.శ్రీవాస్తవతో సమావేశమయ్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు రెండో దశ ప్రాజెక్టును విస్తరించాలని సూచించారు. ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి జాప్యానికి తావు లేకుండా రాష్ట్రప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, రాష్ర్టం వాటాగా అందజేసే 2/3 వంతు నిధుల్లో భాగంగా వచ్చే బడ్జెట్లో రూ. వంద కోట్లు కేటాయించాలని కోరారు. రోజు రోజుకు పెరుగుతున్న రైళ్లు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను విస్తరించాలని, వరల్డ్‌క్లాస్ స్టేషన్‌గా అభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. ఇందుకోసం సికింద్రాబాద్ పాత గాంధీ ఆసుపత్రి స్థలాన్ని ప్రభుత్వం రైల్వే స్టేషన్‌కు ఇవ్వాలని కోరారు. బోయిగూడ రైల్వే క్వార్టర్స్ స్థలాన్ని కూడా వరల్డ్‌క్లాస్ అభివృద్ధి కోసం వినియోగించుకోవచ్చునని సూచించారు. మౌలాలీ రైల్వేస్టేషన్న అభివృద్ధి చేయడం వల్ల సికింద్రాబాద్ పై ఒత్తిడి తగ్గుతుందన్నారు. లాలాగూడ రైల్వే ఆసుపత్రిని సూపర్‌స్పెషాలిటీ హోదాకు పెంచాలని, గతంలో ప్రతిపాదించినట్లుగా నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని కోరారు.పెండింగ్‌లో ఉన్న ఆర్ఓబీ,ఆర్యూబీ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. జీఎం స్పందిస్తూ పనుల కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని, నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తామన్నారు. స్థలం కేటాయించాలి : జీఎం కాజీపేట్ రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ పనుల పురోగతి పైన కూడా ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా జీఎం,ప్రభుత్వం తమకు ఇప్పటి వరకు స్థలం అప్పగించలేదని, స్థలం ఇచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు. పెద్దపల్లి-సికింద్రాబాద్ లైన్‌ను త్వరలో పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. -
ఎంఎంటీఎస్‌ల్లో భద్రత పెంపు
టీటీఈలపై దాడుల నేపథ్యంలో ఆర్పీఎఫ్ చర్యలు మహిళలకు ప్రత్యేక రక్షణ ఆకతాయిల గుర్తింపునకు మఫ్టీ పోలీసులు సికింద్రాబాద్: టీటీఈలపై దాడులు, మహిళలకు వేధింపులు, జేబుదొంగతనాలు వంటి నేరాలు వరుసగా జరుగుతున్న నేపథ్యంలో ఎంఎంటీఎస్ రైళ్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గడచిన వారం రోజుల్లో టికెట్ అడిగిన పాపానికి ఇద్దరు టీటీఈలపై ఆకతాయిలు దాడి చేసిన విషయం తెలిసిందే. భద్రత లేకుంటే తాము విధులు నిర్వహించలేమని టీటీఈలు ఇటీవల ఆందోళనకు దిగడంతో ఆర్పీఎఫ్ పోలీసులు అప్రత్తమయ్యారు. నిత్యం లక్ష మంది వరకు ఎంఎంటీఎస్ రైళ్లలో ప్రయాణిస్తున్నారు. ఈ రైళ్లలో జేబుదొంగతనాలు, చోరీలు, ఈవ్‌టీజింగ్ వంటివి జరుగుతున్నట్టు ఫిర్యాదులందుతున్నాయి. దీనికి తోడు ఇటీవల టికెట్లేని ప్రయాణికుల సంచారం కూడా అధికమైంది. దీంతో వీటన్నింటినీ నియంత్రించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మహిళా రైలులో.... ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళా ప్రయాణికులకు ఇకపై పూర్తిస్థాయి భద్రత కల్పిస్తారు. ముఖ్యంగా ఈవ్‌టీజర్లను పట్టుకుని జైలుకు పంపుతారు. మహిళల కోసమే ప్రత్యేకంగా నడుస్తున్న మాతృభూమి రైలులో తొమ్మిది బోగీలు ఉండగా ఆరుగురు లేడీ ఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లను నియమించారు. రైలు ప్రయాణం ఉదయం ప్రారంభమై రాత్రి తిరిగి యార్డుకు చేరే వరకు వీరు విధుల్లో ఉంటారు. ఎంఎంటీఎస్లలో... నగరంలో నడిచే అన్ని ఎంఎంటీఎస్ రైళ్లలో గతంలో ఒక రైలుకు ఒక హోంగార్డు మాత్రమే విధుల్లో ఉండేవాడు. ప్రస్తుతం ప్రతీ రైలుకు ముగ్గురు హోంగార్డులను నియమించారు. ప్రతీ రైలులో మహిళలకు కేటాయించిన మూడు బోగీల్లో బోగీకి ఒక్కరు చొప్పున ఆర్పీఎఫ్ లేడీ కానిస్టేబుల్‌ను నియమించారు. అనుమానితులపై నిఘా పెట్టేందుకు మఫ్టీలో ఉన్న ఆర్పీఎఫ్ బృందాలను రంగంలోకి దింపుతున్నారు. ప్రత్యేక డ్రైవ్ కోసం ఫ్లయింగ్ స్క్వాడ్స్.. ఎంఎంటీఎస్ రైళ్లలో పహారాలో ఉన్న సిబ్బంది పని తీరును సమీక్షించడంతో పాటు, ఆకతాయిల పనిపట్టేందుకు, సీతాఫల్మండి, ఆర్ట్స్ కళాశాల, సంజీవయ్యపార్కు, బేగంపేట్, బల్కంపేట స్టేషన్లలో ఆకస్మిక తనిఖీలు చేపట్టేందుకు మఫ్టీలో ఇద్దరు అధికారుల నేతృత్వంలో ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. తప్పు చేస్తే జైలుకే.. ఎంఎంటీఎస్ రైళ్లు, రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు ఎటువంటి తప్పు చేసినా కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తాం. మహిళల్ని వేధించేవారిని వదిలిపెట్టం. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు మహిళల్ని వేధించి కేసుల్లో చిక్కి భవిష్యత్‌ను పాడుచేసుకోవద్దు. రైళ్లలో జేబు, సెల్‌ఫోన్ దొంగలు, చైన్ స్నాచర్ల సంచారాన్ని పూర్తిగా నియంత్రిస్తాం. -అశ్వినీకుమార్, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్, సికింద్రాబాద్ -
నేడు సిటీ బంద్
ఎంఎంటీఎస్‌లు యధాతథం పరిస్థితిని బట్టి బస్సుల రాకపోకలు: ఆర్టీసీ సాక్షి, సిటీబ్యూరో: పోలవరం ఆర్డినెన్స్‌ను పార్లమెంట్ ఆమోదించడాన్ని నిరసిస్తూ తెలంగాణ పొలిటికల్ జేఏసీ శనివారం తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో నగరంలో కూడా బంద్ ప్రభావం కనిపించనుంది. బంద్ దృష్ట్యా పోలీసుల సూచనలు, సలహా మేరకు బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలి పారు. మరోవైపు నగరంలోని 121 ఎంఎంటీఎస్ సర్వీసులు, వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్లు మాత్రం యధావిధిగా నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలి పారు. ఈ బంద్‌కు ఏఐటీయూసీ తదితర కార్మిక సంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి. కేంద్రం వైఖరిని వ్యతిరేకిస్తూ నగరంలోని వివిధ ప్రాంతాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టనున్నట్లు ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశం తెలిపారు. కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతుగా నిలిచినప్పటికీ ఆటోలు మాత్రం యధావిధిగా నడుస్తాయని చెప్పారు. -
ఆశలు అడియాసలే..!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీలో బడ్జెట్ రైలు పరుగులు తీసింది. కానీ తెలంగాణవైపు మళ్లకుండా వెళ్లిపోయింది. ఆశలపై నీళ్లు చల్లుతూ.. అంచనాలను తలకిందులు చేస్తూ .. కొత్త రాష్ట్రాన్ని కేంద్రం వెక్కిరించింది. లక్షన్నర కోట్ల భారీ బడ్జెట్‌తో రైల్వేలు మురిపించినా.. తెలంగాణకు దక్కింది మాత్రం కొన్ని వందల కోట్లే! మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ైరె ల్వే బడ్జెట్లో రాష్ట్రానికి ప్రకటించినవి నాలుగు రైళ్లు కాగా.. అవన్నీ వారానికోసారే(ఒక్కటి మాత్రం రెండు సార్లు) ప్రయాణికులను పలకరిస్తాయి. రెండు రైళ్లు రాష్ర్టం నుంచే ప్రారంభమవుతుండగా.. మరో రెండు మాత్రం ఈ ప్రాంతం మీదుగా వెళతాయి. తాజా బడ్జెట్లో తెలంగాణకు దక్కింది ఇంతే! గత యూపీఏ ప్రభుత్వ పదేళ్ల కాలంలో తెలంగాణకు అన్యాయం జరుగుతూ వస్తుండగా.. తాజాగా మోడీ ప్రభుత్వం అంతకంటే చిన్నచూపే చూశారు. రైల్వేల ఆర్థిక స్థితి సరిగా లేదని, పదేళ్లుగా ప్రకటించిన పథకాలకు సరిపడా నిధులు లేనందున కొత్త ప్రాజెక్టులు ఇవ్వలేమని వారం క్రితమే ఆయన కుండబద్దలు కొట్టినా.. అంతకుమించిన రీతిలో తెలంగాణ ను నిర్లక్ష్యం చేశారు. కొత్త ప్రాజెక్టులు మంజూరు చేయకున్నా.. ఇప్పటికే మొదలైన పనులకు నిధుల కేటాయింపు. కీలక మార్గాల్లో డబ్లింగ్ పనుల పూర్తి, కొత్త రైళ్లు, ఉన్నవాటి నిడివి పొడగింపు తదితరాల విషయంలో రాష్ర్ట ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆది నుంచీ రైల్వే మార్గాల విషయంలో బాగా వెనకబడి ఉన్నందున.. కొత్త రాష్ర్టంగా ఏర్పడినందున ప్రోత్సాహకరంగా నిధులు కేటాయిస్తారని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ప్రత్యేకంగా కొత్త ప్రాజెక్టులపై ప్రతిపాదనలు ఇవ్వకుండా.. పాతవాటినే పూర్తి చేయాలంటూ పదేపదే కేంద్రాన్ని కోరారు. కానీ రైల్వే మంత్రి సదానంద గౌడ ఇవేవీ పట్టించుకోలేదు. ప్రాజెక్టులు సరే... రైళ్లేవి? గత బడ్జెట్లో 11, అంతకుముందు 15, ఆపైయేడు 17.. ఇలా దక్షిణ మధ్య రైల్వేకు కొత్త రైళ్లు వచ్చాయి. వాటిని చూసే ప్రజలు పెదవి విరిచారు. అలాంటిది ఈసారి ఆ స్థాయిలో కూడా కొత్త రైళ్లను కేటాయించలేదు. కేవలం నాలుగు ైరె ళ్లను మాత్రమే ప్రకటించారు. ఒకటి హైదరాబాద్-హజ్రత్ నిజాముద్దీన్ ప్రీమియం ఎక్స్‌ప్రెస్. ఇది వారానికి ఒక్కసారే తిరుగుతుంది. ప్రీమియం రైలు కావడంతో దీని టికెట్ రేట్లు పేలిపోతాయి. వెరసి ఇది ఫ్రీక్వెన్సీ, టికెట్ ధరల పరంగా ఏమాత్రం అనుకూలం కాదు. కాజీపేట-ముంబై మధ్య మరో రైలును ప్రకటించారు. అది కూడా వారానికి ఒక్క రోజే నడుస్తుంది. ఇవి కాకుండా తెలంగాణ మీదుగా వెళ్లేవి మరో రెండున్నాయి. వారానికోరోజు నడిచే జైపూర్-మధురై ప్రీమియం ఎక్స్‌ప్రెస్‌తో పాటు వారానికి రెండు రోజులు నడిచే అహ్మదాబాద్-చెన్నై (వయా వసాయ్ రోడ్డు) ఎక్స్‌ప్రెస్‌ను కేంద్రం ప్రకటించింది. ఇవి కూడా ప్రజలకు అంతగా ఉపయోగపడేవి కావు. సెమీ బుల్లెట్ రైళ్లు దూసుకెళ్లేదెన్నడు? హైదరాబాద్ నుంచి చెన్నై, సికింద్రాబాద్ నుంచి నాగ్‌పూర్ మార్గాలను ఆధునీకరించి.. హైస్పీడ్ సెమీ బుల్లెట్ రైళ్లను నడుపుతామని రైల్వే మంత్రి ప్రకటించారు. వీటి గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు. ఇందుకు లైన్ల పటుత్వాన్ని బాగా మెరుగుపరచాల్సి ఉంటుంది. కాపలా లేని లెవల్ క్రాసింగ్‌లు ఉండకూడదు. ఇదంతా జరగాలంటే భారీగా నిధులు అవసరమవుతాయి. బడ్జెట్లో ఇందుకు ప్రతిపాదించింది కేవలం రూ. 100 కోట్లు. అర్థం కాని కమిటీ.. అంతుచిక్కని ఆలోచన! ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పెండింగ్ ప్రాజెక్టుల పరిశీలనను కమిటీకి అప్పగిస్తామనడం గందరగోళంగా ఉంది. ఆ కమిటీ ఏంటో, దానికి పెండింగు ప్రాజెక్టుల బాధ్యత ఇవ్వడం వెనక ఉద్దేశం ఏంటో అంతుచిక్కకుండా ఉంది. రాష్ట్ర విభజన చట్టంలో ప్రకారం ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్, కాజీపేట్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల ఏర్పాటును పరిశీలించేందుకు ఐదుగురు సభ్యులతో గతంలో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఏపీలలో 29 పెండింగ్ (పనులు కొనసాగుతున్నవి) ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ.20,680 కోట్లు అవసరమవుతాయని అంచనా. అయితే ఈ ప్రాజెక్టుల విషయం తేల్చే బాధ్యతను ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటీకి అప్పగిస్తున్నామని, అందులో రైల్వే అధికారులతోపాటు రెండు రాష్ట్రాల అధికారులుంటారని, తాను స్వయంగా వారితో చర్చిస్తానని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ప్రకటించారు. విభజన సమయంలో ఏర్పాటు చేసిన కమిటీలో ఐదుగురు రైల్వే అధికారులు తప్ప ఇరు రాష్ట్రాల ప్రతినిధులు లేరు. మరి మంత్రి చెప్పేది అదే కమిటీనా, వేరే కమిటీనా అన్నది దక్షిణ మధ్య రైల్వే అధికారులకు కూడా అర్థం కావడం లేదు. ఎంఎంటీఎస్ది నత్తనడకే! ఎంఎంటీఎ స్ రెండో దశకు ఈసారి కూడా మొండిచేయే ఎదురైంది. స్మార్ట్ సిటీ ఫార్ములాను కేంద్రం సిద్ధం చేసి న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని ఆశించారు. కానీ కేవలం రూ. 20 కోట్లతోనే కేంద్రం సరిపెట్టింది. దీంతో రైల్వే శాఖ ఇప్పటివరకు కేటాయించిన నిధుల మొత్తం రూ. 40 కోట్లకు చేరుకోగా రాష్ట్రప్రభుత్వం వాటాగా రూ. 80 కోట్లు ఇచ్చింది. రైల్వే నుంచి రూ. 60 కోట్లు వస్తే పనులు వేగిరమయ్యేవని అధికారులు అభిప్రాయపడుతున్నారు.రైల్వేస్టేషన్లను విమానాశ్రయాల కంటే అందంగా తీర్చిదిద్దాలంటూ ఇటీవల స్వయంగా ప్రధాని మోడీ పేర్కొన్న నేపథ్యంలో... సికింద్రాబాద్ స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దే ప్రాజెక్టుకు నిధులు వస్తాయని ప్రజలు ఆశించారు. కానీ బడ్జెట్లో దాని ఊసే లేదు. -
బడ్జెట్ బండి...ఆగేనా?
నేడే కొత్త రైల్వే బడ్జెట్ అటకెక్కిన వరల్డ్‌క్లాస్ కొరవడిన సదుపాయాలు విస్తరణకు నోచని టెర్మినళ్లు లింకు సర్వీసుల్లేని ఎంఎంటీఎస్ మోడీ బడ్జెట్ రైలు మరి కొన్ని గంటల్లో పట్టాల పైకి చేరుకోనుంది.ఈ రైలులో సౌకర్యాల మూటలుంటాయో... అసౌకర్యాల ముళ్లుంటాయో... నగర ప్రయాణికులను కేంద్రం కరుణిస్తుందో... గాలికి వదిలేస్తుందో... రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను మన్నిస్తుందో...మరచిపోతుందో కాసేపట్లో తేలిపోతుంది. సాక్షి, సిటీబ్యూరో: ప్రజలు ఎన్నో ఆశలతో ప్రధానిగా మోడీని గద్దెనెక్కిస్తే... నెల తిరక్కుండానే చార్జీల భారాన్ని మోపి ప్రయాణికుల నుంచి విమర్శలను మూటగట్టుకున్నారు. ఇప్పుడు అసలు సిసలైన... మోడీ ప్రభుత్వ ప్రతిష్ఠకు తార్కాణంగా నిలిచే రైల్వే బడ్జెట్ వస్తోంది. దీని కోసం నగర ప్రజలు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో రైల్వే వ్యవస్థ పనితీరు...చేపడుతున్న ప్రాజెక్టులు... అభివృద్ధి చర్యలు, సమస్యలను ఒకసారి పరిశీలిస్తే... ఎప్పటికి పూర్తయ్యేనో? ఎనిమిదేళ్ల క్రితం ప్రతిపాదించి, చివరకు రెండేళ్ల క్రితం బడ్జెట్లో చోటు దక్కించుకున్న ఎంఎంటీఎస్ రెండో దశ పనులు అనేక ఆటంకాలను అధిగమించి ఇప్పుడిప్పుడే ముందుకు కదులుతున్నాయి. రెండో దశ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేందుకు ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. విస్తరణ అంతేనా? నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్లపై ఒత్తిడిని తొలగించేందుకు మల్కాజిగిరి, మౌలాలీ స్టేషన్లను విస్తరించాలనే ప్రతిపాదనలు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి. ప్రయాణికుల డిమాండ్‌కు తగిన విధంగా రైళ్లు పెరగడం లేదు. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు రాజధాని హైదరాబాద్‌తో అనుసంధానం చేసే దిశగా ఇంతవరకూ అడుగులు పడలేదు. ఈ దశలో కొత్త సర్కారు తెలంగాణపై ఎలాంటి వరాలు కురిపిస్తుందో చూడాలి. కొండెక్కిన వరల్డ్ క్లాస్ సుమారు రూ.5000 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను పూర్తిగా ఆధునికీకరించాలని, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని 2008లో అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పటి వరకు అది అధ్యయనానికే పరిమితమైంది. దీనిని వరల్క్లాస్ స్టేషన్‌గా అభివృద్ధి చేయడం వల్ల స్టేషన్‌కు వచ్చే రైళ్లకు, ఇక్కడి నుంచి వెళ్లే రైళ్లకు ప్రత్యేక ప్లాట్‌ఫామ్‌లు ఉంటాయి. ఎంఎంటీఎస్ వంటి లోకల్ సర్వీసులకు ప్రత్యేక లైన్లు, ప్లాట్‌ఫామ్‌లు ఉంటాయి. స్టేషన్లో రైళ్ల రద్దీ తగ్గుతుంది. ప్రయాణికులకు అవసరమైన షాపింగ్‌మాల్స్, కమర్షియల్ భవనాలు నిర్మించవచ్చు. కానీ ఆచరణ వైపు చక్రాలు కదల్లేదు. తెలంగాణ సర్కారు ఈ దిశగా చేసిన కృషి ఏంటో బడ్జెట్ పట్టాలపైకి ఎక్కితే తెలుస్తుంది. పేరుకేఏ-1 స్టేషన్ నగరంలోని కాచిగూడను ఏ-1 స్టేషన్‌గా ప్రకటించారు. కానీ సదుపాయాలు ఆ స్థాయిలో లేవు. ఇక్కడినుంచి నిత్యం 50 వేల మంది వివిధ ప్రాంతాలకు వెళ్తారు. నిజాం కాలానికి చెందిన ఈ స్టేషన్లో కనీస సదుపాయాలు లేవు. ఇటీవల కొత్తగా నిర్మించిన ప్లాట్‌ఫామ్‌ల పైన మంచినీళ్లు, టాయిలెట్లు, కేటరింగ్ వంటి సదుపాయాలు లేవు. విస్తరణ లేని నాంపల్లి... నిజాం కాలంలో జరిగిన అభివృద్ధి మినహా నాంపల్లి స్టేషన్లో ఎలాంటి పురోగతి లేదు. చెన్నై తరహాలో ప్లాట్‌ఫారాలను విస్తరించాలనే ప్రతిపాదన అటకెక్కింది. ఎస్కలేటర్లు మంజూరైనా స్థలాభావం సాకు చూపి ఇక్కడి నుంచి తరలించారు. రైల్వే హెల్త్ యూనిట్లో సేవలను విస్తరించకపోవడంతో ప్రమాదాలకు గురైన కార్మికులను సికింద్రాబాద్ లా లాగూడ ఆస్పత్రికి తరలించాల్సి వస్తోంది. ఇటీవల గుండెపోటుకు గురైన ఓ కార్మికుడు సకాలంలో వైద్యం లభించక మృతిచెందాడు. ఏదీ లింక్? రాజధాని ఎక్స్‌ప్రెస్ కంటే ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నట్లు ప్రకటించి, 2003లో ప్రవేశపెట్టిన మల్టిమోడల్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్ (ఎంఎంటీఎస్)కు ఇప్పటికీ సిటీ బస్సుతో లింకు లేదు. జంట నగరాల ప్రయాణికులకు ‘రైలు-బస్సు’ సదుపాయం అందుబాటులోకి తేవాలన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్టు లక్ష్యం నీరుగారుతోంది. ప్రస్తుతం నగరంలో ఉన్న 26 ఎంఎంటీఎస్ స్టేషన్లలో సగానికి పైగా స్టేషన్లలో కనీసం రోడ్డు సదుపాయం లేదు. రైలు దిగిన ప్రయాణికులు ఆటో ఎక్కాలన్నా, బస్సు ఎక్కాలన్నా అసాధ్యంగానే ఉంది. ఫలక్‌నుమా, మలక్‌పేట్, లకిడికాఫూల్, నెక్లెస్ రోడ్డు, సికింద్రాబాద్, బేగంపేట్, హైటెక్ సిటీ వంటి కొన్ని స్టేషన్లకు రోడ్డు సదుపాయం ఉన్నప్పటికీ ఎంఎంటీఎస్ రాకపోకలకు అనుగుణంగా సిటీ బస్సులు అందుబాటులో ఉండడం లేదు. ఫలక్‌నుమా, ఉప్పుగూడ, యాకుత్‌పురా, డబీర్‌పురా స్టేషన్ల నుంచి ఎంఎంటీఎస్‌తో పాటు దూర ప్రాంత రైళ్లూ రాకపోకలు సాగిస్తాయి. నిత్యం వేల సంఖ్యలో ఉద్యోగులు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. కానీ ఈ స్టేషన్లకు అనుబంధ రోడ్డు, రవాణా సదుపాయాలు లేవు. మంచినీరూ కరువే హైటెక్ సిటీ, లింగంపల్లి వంటి వద్దీ ఎక్కువగా ఉండే స్టేషన్లలో మంచినీటి సదుపాయం కూడా లేకపోవడం అధికారుల బాధ్యతా రాహిత్యానికి నిదర్శనం. ప్రయాణికులు తల దాచుకునేందుకు షెల్టర్లు కూడా లేవు. పత్తా లేని టెర్మినళ్లు... మల్కాజిగిరి, మౌలాలీ స్టేషన్లను విస్తరించి అతి పెద్ద ప్రయాణికుల టెర్మినళ్లుగా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన చాలాకాలంగా పెండింగ్‌లోనే ఉంది. ఈ రెండు స్టేషన్లను విస్తరించేందుకు కావలసినంత స్థలం ఉంది. వీటిని అభివృద్ధి చేయడం వల్ల కాజీపేట్, నిజామాబాద్ వైపు నుంచి వచ్చే రైళ్లకు హాల్టింగ్ సదుపాయం లభిస్తుంది. సికింద్రాబాద్‌తో నిమిత్తం లేకుండా కొన్ని రైళ్లు నేరుగా కాచిగూడకు వెళ్తాయి. 2007 నుంచే ఈ ప్రతిపాదనలు ఉన్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. ఆదర్శ స్టేషన్‌గా ప్రకటించిన మల్కాజిగిరికి ఇప్పటికీ అప్రొచ్ రోడ్లు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు మౌలాలీ స్టేషన్ నుంచి నేరుగా బస్సు సదుపాయం లేదు. ఇందుకోసం ప్రయాణికులు ఒకటిన్నర కిలోమీటర్లు నడవాల్సి వస్తోంది. కొత్త రైళ్లకు డిమాండ్ జంట నగరాల నుంచి సుమారు 100 నుంచి 120 ప్రధాన రైళ్లు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. విశాఖ, తిరుపతి, బెంగళూరు, షిర్డీలకు మరిన్ని కొత్త రైళ్లు అవసరమనే డిమాండ్ ఉంది. కాచిగూడ నుంచి బెంగళూర్‌కు రెండు ఎక్స్‌ప్రెస్‌లు మాత్రమే ఉన్నాయి. ఈ రూట్లో మరో 2 రైళ్లకు డిమాండ్ ఉంది. నగరం నుంచి షిర్డీ వెళ్లే భక్తులకు ప్రస్తుతం మన్మాడ్ ఎక్స్‌ప్రెస్ ఒక్కటే ఆధారం. ఇది కూడా నాగర్సోల్ వరకు వె ళ్తుంది. అక్కడి నుంచి షిర్డీకి రోడ్డు మార్గాన వెళ్లాల్సిందే. కాకినాడ నుంచి నేరుగా షిర్డీవరకు సాయినగర్ ఎక్స్‌ప్రెస్ ఉంది. ఇది వారానికి రెండు రోజులే నడుస్తుండడం గమనార్హం. వరంగల్, మిరియాలగూడ, మణుగూర్ల నుంచే ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లు ఉన్నాయి. మిగతా అన్ని జిల్లా కేంద్రాల నుంచి నగరానికి ఇంటర్ సిటీ సర్వీసులతో రైల్వే రవాణా సదుపాయాలను మెరుగుపర్చవలసిన అవసరం ఉంది. కొత్త లైన్లు... ప్రస్తుతం రూ.389 కోట్లతో వివిధ మార్గాల్లో ఎంఎంటీఎస్ రెండో దశ లైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ పనులు చేపడుతున్నారు. అయితే ప్రస్తుతం నడుస్తున్న ఎంఎంటీఎస్ సర్వీసులకు ప్రత్యేక లైన్లు లేకపోవడం వల్ల అడుగడుగునా బ్రేకులు పడుతున్నాయి.శంకర్పల్లి-పగిడిపల్లి మధ్య బైపాస్ రైల్వే లైన్ నిర్మిస్తే గూడ్సు రైళ్లను ఆ దిశలో మళ్లించేందుకు అవకాశం లభిస్తుంది. సికింద్రాబాద్ మార్గంలో గూడ్సు రైళ్ల ఒత్తిడి తగ్గి ఎంఎంటీఎస్‌కు అవకాశాలు పెరుగుతాయి. -
ఎంఎంటీఎస్ ప్రయాణమూ భారమే..
నెలవారీ, క్వార్టర్లీ పాస్‌లపై చార్జీల పెంపు పెరిగిన చార్జీలు 25వ తేదీ నుంచి అమలు సాక్షి,సిటీబ్యూరో: సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇప్పటి వరకు అతి తక్కువ చార్జీల్లో లభించిన ఎంఎంటీఎస్ ప్రయాణం ఇక ప్రియంగా మారనుంది. అన్ని రకాల రైల్వే చార్జీలతో పాటు ఎంఎంటీఎస్, లోకల్ రైలు చార్జీలను కూడా ప్రభుత్వం పెంచింది. పెరిగిన చార్జీలు ఈ నెల 25 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం సామాన్య ప్రయాణికులు వినియోగించే సెకెండ్ క్లాస్ చార్జీలను 15 కిలోమీటర్ల వరకు యదాతథంగా ఉంచారు. 16 నుంచి 20 కిలోమీటర్ల దూరానికి ఇప్పటి వరకు ఉన్న రూ.5 కు బదులు ఇక నుంచి రూ.10 చార్జీ ఉంటుంది. ఆ తరువాత 21 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వరకు చార్జీల్లో మార్పు లేదు. ప్రస్తుతం ఉన్నట్లుగానే రూ.10 చార్జీ ఉంటుంది. ఇక మధ్యతరగతి, ఆ పై వర్గాలు వినియోగించే ఫస్ట్‌క్లాస్ చార్జీలు 5 కిలోమీటర్ల కనీస దూరానికి రూ.45 నుంచి రూ.50 కి పెరిగాయి. 40 కిలోమీటర్ల గరిష్ట దూరానికి రూ. 135 నుంచి రూ.150 కి పెరిగాయి. అలాగే నెలవారీ సెకెండ్‌క్లాస్ నెలవారీ పాస్ ప్రస్తుతం కనీస దూరానికి రూ.130 కాగా, ఇక నుంచి రూ.225కు పెరగనుంది. అలాగే ఫస్ట్‌క్లాస్ పాస్ రూ.445 నుంచి రూ.935 కు పెరుగనుంది. ప్రతి రోజు జంటనగరాల్లోని వివిధ మార్గాల్లో 121 ఎంఎంటీఎస్ సర్వీసుల్లో ప్రయాణిస్తున్న సుమారు లక్షా 70 వేల మంది ఎంఎంటీఎస్ ప్రయాణికులపైన చార్జీల భారం పడనుంది. రైల్వేచార్జీల పెంపుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం తన స్వభావాన్ని చాటుకుందని ప్రయాణికుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పెంచిన చార్జీలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. భద్రత మరచి చార్జీలు పెంచారు రైళ్లలో ప్రయాణించాలంటేనే భయమేస్తోంది. అసాంఘిక శక్తులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. స్టేషన్లలోనూ, రైళ్లలోనూ ఎక్కడా ప్రయాణికులకు భద్రత లేదు. ప్రయాణికులకు కనీస సదుపాయాలను కూడా అందజేయలేని ప్రభుత్వం రైల్వే చార్జీలను మాత్రం ఇష్టారాజ్యంగా పెంచేసింది. ఈ పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. - నూర్, సబర్బన్ బస్,రైల్ ట్రావెలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఫస్ట్‌క్లాస్ చార్జీలు బాగా పెంచారు ఎంఎంటీఎస్ రైళ్లలో ఫస్ట్‌క్లాస్ చార్జీలు బాగా పెంచారు. ఇది చాలా అన్యాయం. ఇప్పటికే సర్‌చార్జీల పేరిట ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఇక కొత్తగా పెరుగనున్న చార్జీలు మరింత భారం కానున్నాయి. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చార్జీలను తగ్గించాలి. - ప్రవీణ్ సింగ్, ఎంఎంటీఎస్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధి లాభార్జన కోసమే ప్రజా రవాణా సదుపాయాన్ని అందజేయవలసిన బాధ్యత నుంచి ప్రభుత్వం పక్కకు తప్పుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. తరచుగా పెంచుతున్న చార్జీలను చూస్తోంటే రైల్వే సైతం ఒక ప్రైవేట్ ఆపరేటర్‌గా మారుతోందని అర్ధమవుతోంది. ఇది సరైన పద్ధతి కాదు. గతేడాది జనవరిలో పెంచారు. ప్రస్తుతం మరోసారి చార్జీలు పెంచారు. రానున్న రైల్వే బడ్జెట్లో మరోసారి చార్జీలు పెరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. - గణేశ్, ప్రయాణికుడు -
హైదరాబాద్ ఎమ్ఎమ్టీఎస్ రైల్లో దుశ్చర్య
హైదరాబాద్: హైదరాబాద్ ఎమ్ఎమ్టీఎస్ రైల్లో దుండగులు బీభత్సం సృష్టించారు. చిక్కడపల్లి సమీపంలో రైల్లోని ఓ ప్రయాణికుడిపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అతని వద్ద పది వేల రూపాయిల నగదును దోచుకున్నారు. కదులుతున్న రైలు నుంచి దుండగులు ఆ ప్రయాణికుడిని బయటకు తోసివేశారు. బాధితుడి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. -
ఎమ్ఎమ్టీఎస్ రైల్లో దొంగల బీభత్సం
-
ప్రజా రవాణా హైరానా
నగర ప్రయాణం నరకం రాత్రి వేళల్లో ప్రయాణికులకు ఇబ్బందులు ప్రజల నిష్పత్తికి తగ్గట్టుగా లేని ప్రజా రవాణా లక్షల్లో పెరుగుతున్న వ్యక్తిగత వాహనాలు వాహన కాలుష్యంతో సిటీ ఉక్కిరిబిక్కిరి వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు సాక్షి, సిటీబ్యూరో : పేరుకే మహానగరం... ప్రజా రవాణా తీరు చూస్తే అస్తవ్యస్తం.. అందుబాటులో ఉండని ఆర్టీసీ బస్సులు... చాలీచాలని ఎంఎంటీఎస్ రైళ్లు... ఏ బస్సు ఎప్పుడు వస్తుందో... ఏ రైలు ఎప్పుడు రద్దవుతుందో తెలీని దుస్థితి. సకాలంలో సిటీ బస్సులు, ఎంఎంటీఎస్ రైళ్లు అందుబాటులో లేకపోవడం వల్ల ‘గ్రేటర్’లో లక్షలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దశాబ్దాలు గడిచినా ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడకపోవడం వల్ల సిటీజనులు వ్యక్తిగత వాహనాలను ఆశ్రయించవలసి వస్తోంది. ఫలితంగా ఏటా లక్షలాది ద్విచక్ర వాహనాలు, కార్లు రోడ్డెక్కుతున్నాయి. ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్న వాహనాలు, వాటి నుంచి వెలువడే విషపూరితమైన రసాయనాల వల్ల ప్రజారోగ్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. నగరవాసులు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ప్రజారవాణా విస్తరించని తీరుపై నగర ప్రజానీకం తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఎన్నికల్లో ప్రజాప్రతినిధులను ఈ విషయమై నిలదీయనుంది. కోటి జనాభాకు 3800 బస్సులు ప్రయాణికుల డిమాండ్‌కు తగిన విధంగా బస్సులు, ఎంఎంటీఎస్ సర్వీసులు పెంచడంలో ప్రభుత్వాలు దారుణంగా విఫలమవుతున్నాయి. నగరవాసులతో పాటు, ఉపాధి, ఉద్యోగాల కోసం ఏటా లక్షలాది మంది హైదరాబాద్‌కు వస్తున్నారు. ఫలితంగా ఏటేటా జనాభా అనూహ్యంగా పెరుగుతోంది. కొత్త కొత్త కాలనీలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నగర జనాభా కోటికి చేరువవుతున్నట్లు అంచనా. కానీ ఇందుకు తగిన విధంగా రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, ప్రజా రవాణా విస్తరించడం లేదు. ప్రస్తుతం 3800 బస్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 34 లక్షల మందికి మాత్రమే ఈ బస్సులు సరిపోతున్నాయి. దీంతో ఎక్కువ శాతం వ్యక్తిగత వాహనాలపైనే ఆధారపడుతున్నారు. ఆర్టీసీ అంచనాల ప్రకారం ఇప్పటికిప్పుడు కనీసం ఐదువేల బస్సులు అవసరం. నగరంలో 50 లక్షల మందికి రవాణా సదుపాయాలను అందజేయగలిగితే రోడ్లపై వాహనాల రద్దీ 50 శాతానికి పైగా పరిష్కారమవుతుంది. కానీ ఆ దిశగా ప్రభుత్వాలు దృష్టి పెట్టడం లేదు. కాలనీలు విలవిల బస్సుల కొరత కారణంగా ఎంఎంటీఎస్ సర్వీసులు వినియోగించుకొనేందుకు అవకాశం లేకపోవడం వల్ల నగరం చుట్టూ ఉన్న వందలాది కాలనీలు రవాణా సదుపాయాల కోసం విలవిలలాడుతున్నాయి. ఉదాహరణకు ఎల్బీనగర్ చుట్టూ సుమారు 700 కాలనీలు ఉన్నాయి. ఇంకా కొన్ని వందల సంఖ్యలో పల్లెలున్నాయి. ప్రతి నిత్యం లక్షలాది మంది నగరానికి రాకపోకలు సాగిస్తారు. ఈ రూట్లో ఎంఎంటీఎస్‌కు అవకాశం లేదు. ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేవు. ఫలితంగా రాత్రి 9 దాటితే కొత్తపేట, రామకృష్ణాపురం, సరూర్‌నగర్, మన్సూరాబాద్, కర్మన్‌ఘాట్, చిన్న రావిరాల, పెద్ద రావిరాల, బండ రావిరాల, గౌరెల్లి, బాచారం,తదితర ప్రాంతాలకు చేరుకోవడం అసాధ్యంగా మారింది. జగద్గిరిగుట్ట, జీడిమెట్ల అతి పెద్ద పారిశ్రామిక ప్రాంతాలు. లక్షలాది మంది వలస ప్రజలు ఇక్కడ ఉపాధిని పొందుతున్నారు. రాత్రి కాస్త ఆలస్యంగా ఇల్లు చేరుకోవడమంటే ఈ మార్గాల్లో ఎంతో కష్టం. అత్యధిక రద్దీ ఉండే జీడిమెట్ల నుంచి నేరుగా జగద్గిరిగుట్టకు వెళ్లేందుకు బస్సులు అందుబాటులో లేవంటే ప్రజా రవాణా ఏ స్థాయిలో ఉందో తెలుస్తుంది. మచ్చబొల్లారం, అల్వాల్ డివిజన్లలోని సుమారు 150 కాలనీల ప్రజలు మల్కాజిగిరికి నేరుగా వెళ్లేందుకు బస్సులు లేవు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ నేరేడ్‌మెట్‌లోనే ఉండటంతో ఈ ప్రాంతాల ప్రజలు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించవలసి వస్తోంది. కాప్రా పరిధిలోని అంబేద్కర్ నగర్, సాయిబాబా నగర్, వంపుగూడ తదితర ప్రాంతాల్లో వెలసిన అనేక కాలనీలకు బస్సు సౌకర్యం లేదు. ఉప్పల్, బోడుప్పల్ ప్రాంతానికి చెందిన పలు కాలనీలు రవాణా సదుపాయాల కోసం అల్లాడుతున్నాయి. శేరిలింగంపల్లి పరిధిలోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ, మయూరీ నగర్, బీకే ఎన్క్లేవ్, గోకుల్ ఫ్లాట్స్ వంటి ప్రాంతాలకు ఇప్పటికీ బస్సు సౌకర్యం లేదు. లింగంపల్లి నుంచి గోపన్‌పల్లి, వట్టినాగులపల్లి మీదుగా మెహిదీపట్నం మార్గంలో, లింగంపల్లి నుంచి గోపన్‌పల్లి గౌలిదొడ్డి, నానక్‌రాంగూడ మీదుగా రాయదుర్గం మార్గంలో కోఠికి వెళ్లేందుకు బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. తీవ్రమైన శ్వాసకోశ వ్యాధుల ముప్పు నగరంలో ప్రజారవాణా సరిపోయినంతగా లేక వ్యక్తిగత వాహనాలు రోజురోజుకూ అధికమవు తున్నాయి. ఫలితంగా వీటి కాలుష్యం విప రీతంగా పెరుగుతోంది. పీల్చే గాలిలో దుమ్ము, ధూళి కణాల పరిమాణం బాగా పెరగడంతో న్యుమోనియా, ఆస్తమా కేసులు ఇటీవల బాగా పెరుగుతున్నాయని వైద్యనిపుణులు స్పష్టం చేస్తున్నారు. క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ (శ్వాస ఆడక బాగా ఇబ్బంది పడటం) వంటి వ్యాధులు ప్రబలుతున్నాయన్నారు. చిన్నపిల్లల్లో ఊపిరితిత్తుల పెరుగుదల అర్ధంతరంగా ఆగిపోతోంది. గర్భిణులు కాలుష్యం బారిన పడటంతో తక్కువ బరువున్న పిల్లలు పుట్టడం వంటి విపరిణామాలు చోటుచేసుకుంటున్నాయని అభిప్రాయపడుతున్నారు. అలర్జీతో బాధపడే వారి సంఖ్యా బాగా పెరిగిందని చెబుతున్నారు. వాహన కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి గ్రేటర్లో కిక్కిరిసిన రహదారులపై వెల్లువెత్తుతోన్న వాయు కాలుష్యం సిటీజనులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దుమ్ము, ధూళికణాలు, విషవాయువులు నగరజీవుల ఆరోగ్యానికి పొగ బెడుతున్నాయి. పరిమితికి మించిన వాయుకాలుష్యంతో ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థలు దారుణంగా దెబ్బతింటుండటంతో నగరవాసులు విలవిల్లాడుతున్నారు. ఇటీవల నగరంలో శ్వాసకోశ వ్యాధులు పెరగడానికి వాహన కాలుష్యమే ప్రధాన కారణమని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గంటకు పదివేల నుంచి 20 వేల వాహనాలు దూసుకెళ్లే అత్యంత రద్దీ రూట్లలో పరిస్థితి మరింత విషమించింది. కాలంచెల్లిన వాహనాలు, సామర్థ్యం సరిగా లేనివి,పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్ లేనివి, కల్తీ ఇంధనాలు వినియోగిస్తున్న మోటారు వాహనాలతో వాయు కాలుష్యం అవధులు దాటుతోంది. గ్రేటర్లో నిత్యం రోడ్డెక్కుతోన్న 39 లక్షల వాహనాలతో రహదారులు కిక్కిరిసి పోవడమే కాదు.. వాయుకాలుష్యం పెరుగుతోందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాయుకాలుష్యాన్ని కట్టడి చేసే విషయంలో ఇటు ఆర్టీఏ, అటు పీసీబీలు ప్రేక్షకపాత్రకే పరిమితమౌతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 39 లక్షల వాహనాలు గ్రేటర్ గడిచిన ఐదేళ్ల కాలంలో విస్తరించింది. నగర శివార్లలో అనేక కొత్త కాలనీలు వెలిశాయి. పెరుగుతున్న కాలనీలకు ప్రజా రవాణా అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు తమ శక్తి మేరకు ద్విచక్ర వాహనాలు, కార్లను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే బెంగళూరు, చెన్నై వంటి మెట్రో నగరాల కంటే అత్యధిక వాహనాలున్న గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 39 లక్షల వాహనాలు ఉన్నాయి. వీటిలో 24 లక్షల వరకు ద్విచక్ర వాహనాలే. మరో 10 లక్షల కార్లు ఉన్నాయి. మిగతా ఐదు లక్షల వాహనాల్లో ఆటోరిక్షాలు, ఇతర వాహనాలు ఉన్నాయి. ఏటా 1.5 లక్షల వాహనాలు కొత్తగా వచ్చి చేరుతున్నాయి. మెట్రో రైలు అందుబాటులోకి వచ్చేనాటికి వ్యక్తిగత వాహనాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని చెబుతున్న అంచనాలను తలకిందులు చేస్తూ ఏటేటా కొత్త వాహనాల సంఖ్య పెరుగుతూనే ఉంది. దీంతో అడుగడుగునా ట్రాఫిక్ ర ద్దీ చోటుచేసుకుంటోంది. రెండు దశాబ్దాల క్రితం కేవలం కోఠి, సికింద్రాబాద్ ప్రాంతాలకే పరిమితమైన వ్యాపార కార్యకలాపాలు ప్రస్తుతం నగరమంతటా విస్తరించాయి. కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు నుంచి ఇటు ఎల్బీనగర్ వరకు గ్రేటర్ హైదరాబాద్ ఒక వ్యాపార కూడలిగా మారిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు బాగా పెరిగాయి. కానీ ఇందుకు తగినట్లుగా రోడ్ల విస్తీర్ణం పెరగకపోవడంతో ప్రతి రోజు నగరం ట్రాఫిక్ వలయంలో విలవిలాడుతోంది. ఐటీ రంగం విస్తరించడం, అంతర్జాతీయ స్థాయి వ్యాపార కార్యకలాపాలు బాగా అభివృద్ధి చెందడం వంటి కారణాల వల్ల కూడా వాహనాల సంఖ్య ఇతోధికంగా పెరుగుతోంది. ఇపుడున్న 39 లక్షల వాహనాలు 2015 నాటికి 42 లక్షల వరకు పెరిగే అవకాశం ఉంది. ఎంఎంటీఎస్ రెండో దశకు అడ్డంకులు నగరానికి అన్ని వైపులా ప్రజా రవాణ సదుపాయాలను పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన ఎంఎంటీఎస్ ప్రాజెక్టు ఒక అడుగు ముందుకు, నాలుగడుగులు వెనక్కు అన్నట్లుగా ఉంది. 2003లో మొదటి దశ కింద ఫలక్‌నుమా-సికింద్రాబాద్-లింగంపల్లి,నాంపల్లి-లింగంపల్లి తదితర రూట్లలో రైళ్లను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 121 సర్వీసులు నడుస్తున్నాయి. రెండు ల క్షల మంది ఈ సర్వీసులను వినియోగించుకుంటున్నారు. మరో నాలుగు లక్షల మంది శివారు ప్రాంతాల ప్రజలకు రవాణా సదుపాయాన్ని అందజేసే లక్ష్యంతో చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశకు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఎంఎంటీఎస్ రైళ్లకు ప్రయాణికుల డిమాండ్ రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ కొత్త మార్గాలు, కొత్త రైళ్లు అందుబాటులోకి రావడం లేదు. పైగా ఎంఎంటీఎస్ కోసం ప్రత్యేక లైన్లు లేకపోవడం వల్ల ఈ రైళ్లు గంటల తరబడి ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇలా అనేక కారణాల వల్ల ప్రయాణికుల ఆదరణ, డిమాండ్ ఉన్నప్పటికీ రైలు సదుపాయాలు పెరగడం లేదు. రెండో దశ అందుబాటులోకి వస్తే పటాన్చెరు నుంచి ఎయిర్‌పోర్టు వరకు, ఘట్కేసర్ నుంచి హైటెక్ సిటీ వరకు, మేడ్చల్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు అన్ని మార్గాల్లో ప్రజా రవాణా అభివృద్ధి చెందుతుంది. ఆటోలను ఆశ్రయించాల్సిందే నగరంలో నాలుగైదు ప్రధాన మార్గాల్లో మినహా ప్రయాణికులకు అవసరమైన రూట్లలో ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండడం లేదు. ఉన్న బస్సులైనా కిటకిట లాడుతూ కాలు పెట్టే స్థలం కూడా ఉండటం లేదు. గత్యంతరం లేని పరిస్థితిలో ఆటోలను ఆశ్రయించి అడిగినంత డబ్బు ఇచ్చుకోక తప్పని పరిస్థితి. - మోహన్, ప్రయాణికుడు సమయపాలనే లేదు ఒకే మార్గంలో ఒకేమారు నాలుగైదు బస్సులు వస్తున్నాయి. లేదంటే గంటన్నర వరకు ఆ మార్గంలో బస్సులు రావడమే లేదు. ఎక్కువ బస్సులు వచ్చిన సందర్భాల్లో ఖాళీగా వెళుతున్నాయి. ఆలస్యంగా వచ్చే బస్సుల్లో నిలబడడానికి కూడా వీలులేని పరిస్థితి. ఇవేం ప్రజాప్రతినిధులకు పట్టవు. - చిన్నారావు, ప్రయాణికుడు ఎంఎంటీఎస్‌లు మరీ ఆలస్యం ప్రతీ పదిహేను నిమిషాలకో ఎంఎంటీఎస్ అని బోర్డులు రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేస్తున్నా.. వాటి ఆలస్యం ఆర్టీసీ బస్సులను మించిపోతోంది. ఒక్కోమారు గంటన్నరకు మించి ఆలస్యంగా నడుస్తుండటంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. - వాసుదేవరావు, ప్రయాణికుడు మధ్యలో నిలిపేస్తున్నారు ఎంఎంటీఎస్ రైళ్లు ఎక్కడికక్కడే నిలిపేస్తున్నారు. బయలుదేరి ఒకటి రెండు స్టేషన్లు దాటగానే ఎక్స్‌ప్రెస్ రైళ్లకు లైన్‌క్లియర్ చేయాలని వీటిని మార్గమధ్యంలోనే నిలిపేస్తున్నారు. ఇలా పదిహేను నిమిషాల నుంచి గంట వరకు అక్కడే నిలిపివేస్తుండటంతో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. - ఆనంద్, ప్రయాణికుడు -
ఎంఎంటీఎస్ రెండో దశ జీఎమ్మార్‌కు అప్పగింత?
తప్పుకొన్న బాల్‌ఫోర్‌బెట్టి టాటా పవర్, జీఎమ్మార్లతో రైల్వేశాఖ చర్చలు త్వరలో పనులు ప్రారంభం ‘హైలైట్స్’ పథకావిష్కరణలో జీఎం వెల్లడి సాక్షి, సిటీబ్యూరో : ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టు పనులను టాటా పవర్, జీఎమ్మార్ సంస్థలకు అప్పగించేందుకు రైల్వేశాఖ ప్రయత్నాలు చేపట్టినట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఒక ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒప్పందం కుదిరిన వెంటనే ఎలాంటి జాప్యానికి తావు లేకుండా రెండో దశ పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ‘హైదరాబాద్ లైవ్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్’ (హైలైట్స్) ప్రారంభోత్సవం సందర్భంగా రైల్‌నిలయం ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండో దశ ప్రాజెక్టు నుంచి బ్రిటన్ సంస్థ బాల్‌ఫోర్‌బెట్టి, ఇండియాలో దాని భాగస్వామ్య సంస్థ కాళింది నిర్మాణ్లు తప్పుకోవడంతో ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే టాటాపవర్, జీఎమ్మార్ సంస్థలతో చర్చలు జరుపుతున్నామన్నారు. ఇప్పటికే ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం చోటుచేసుకున్నందువల్ల తిరిగి మరోసారి టెండర్లకు వెళ్లకుండా నేరుగా పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. నగరంలో ఎంఎంటీఎస్‌కు ప్రత్యేక లైన్లు వేయడం ఇప్పట్లో సాధ్యం కాదని, రెండో దశ నిర్మాణంలో భాగంగానే ప్రత్యేక లైన్ అందుబాటులోకి వస్తుందని చెప్పారు. రూ.110 కోట్లతో దేశవ్యాప్తంగా ‘హైలైట్స్’ తరహా సేవలు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్లకు వచ్చే, పోయే ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల వాస్తవ వేళలతో పాటు, 26 ఎంఎంటీఎస్ స్టేషన్ల మీదుగా నడిచే అన్ని ఎంఎంటీఎస్ రైళ్ల రన్నింగ్ సమాచారాన్ని మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకొనేందుకు ప్రవేశపెట్టిన ‘హైలైట్స్’ తరహా సేవలను దేశవ్యాప్తంగా విస్తరించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకోసం రైల్వేశాఖ రూ.110 కోట్లతో ప్రణాళికలను రూపొందించిందన్నారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారి దక్షిణమధ్య రైల్వే ఈ తరహా సేవలను అందుబాటులోకి తెచ్చిందన్నారు. భవిష్యత్తులో దేశంలోని అన్ని ప్రధాన రైల్వేస్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించే లోకల్, ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్ల వేళలను, ఇతర సమాచారాన్ని రైల్వేశాఖ ప్రయాణికులకు అందుబాటులోకి తెస్తుందన్నారు. దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు మాట్లాడుతూ, ‘హైలైట్స్ ’ వల్ల ప్రతి రోజు 3 లక్షల మంది ఎంఎంటీఎస్ ప్రయాణికులకు, మరో రెండు లక్షల మంది దూరప్రాంత ప్రయాణికులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. మొబైల్ ఫోన్ ద్వారా ఎక్కడి నుంచైనా రైళ్ల వాస్తవ సమాచారం తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ డివిజనల్ రైల్వేమేనేజర్ సుశాంత్‌కుమార్ మిశ్రా, అల్లాం తదితరులు పాల్గొన్నారు. ‘హైలైట్స్’ ప్రయోజనాలివీ... ఆండ్రాయిడ్ మొబైల్ టచ్ ఫోన్ ఆధారంగా ప్రయాణికులు ఎంఎంటీఎస్ వచ్చే, పోయే వేళల వివరాలు తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఆ ట్రైన్ ఎక్కడ వరకు వచ్చింది, తాము ఎక్కవలసిన స్టేషన్‌కు ఎంతసేపట్లో రాగలదనే వాస్తవ సమాచారమూ తెలుస్తుంది. ఎంఎంటీఎస్ రైళ్ల టైమ్‌టేబుల్, రూట్‌మ్యాప్, చార్జీలు, ఏటీవీఎం కేంద్రాలు, ఆర్పీఎఫ్, జీఆర్పీ హెల్ప్లైన్లు, హాస్పిటళ్లు, క్యాబ్‌లు, అంబులెన్స్‌లు తదితర అత్యవసర సేవల వివరాలు తెలుసుకోవచ్చు. నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లకు వచ్చే, వెళ్లే రైళ్ల వాస్తవ వేళలు, రైలు ఏ ప్లాట్‌ఫామ్ మీదకు వచ్చేది, ఏ ప్లాట్‌ఫామ్ నుంచి బయలుదేరేది తెలుస్తాయి. -
ఎంఎంటీఎస్ సర్వీసుల పెంపు
=త్వరలో రెండోదశ పనులు ప్రారంభం =ప్రయాణికుల భద్రతపై దృష్టి =విలేకరుల సమావేశంలో ద.మ.రైల్వే జీఎం సాక్షి,సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ రెండో దశ పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ తెలిపారు. ఉందానగర్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు రెండో దశపై నెలకొన్న ప్రతిష్టం భన సైతం తొలగిపోయిందని, తాజాగా ఎయిర్‌పోర్టులో రైల్వేస్టేషన్ నిర్మాణం కోసం స్థల సేకరణపై సర్వే చేశామని సోమవారం విలేకరులకు చెప్పారు. ముంబయి ఎయిర్‌పోర్టుకు కూడా సబర్బన్ ట్రైన్ సదుపాయం లేదని, ఆ సౌకర్యం శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఎంఎంటీఎస్ రెండో దశ టెండర్లను బ్రిటన్‌కు చెందిన బాల్ఫోర్ బెట్టి సంస్థ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఇండియాలోని కాళింది అనే సంస్థతో కలిసి అది ఈ ప్రాజెక్టును చేపడుతుంది. ప్రతిపాదిత రెండో దశలోని ఆరు మార్గాల్లో రైల్వేలైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ, కొత్త లైన్లు, స్టేషన్ల నిర్మాణం వంటి పనులను త్వరలో ప్రారంభిస్తారని జీఎం వెల్లడించారు. రెండో దశ లైన్ల నిర్మాణం కోసం రూ.380 కోట్లు కేటాయించారు. మరో రూ.300 కోట్లతో ఇంజన్లు, కోచ్‌లు సమకూర్చుకుంటారు. మొత్తం 84 కిలోమీటర్లలో రెండో దశ చేపట్టనున్నారు. రద్దీకి అనుగుణంగా సర్వీసుల పెంపు.. ప్రస్తుతం నాలుగు మార్గాల్లో అందుబాటులో ఉన్న ఎంఎంటీఎస్ సర్వీసుల సంఖ్యను పెంచనున్నట్లు జీఎం శ్రీవాస్తవ తెలిపారు. ఉదయం, సాయంత్రం ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్లను పెంచనున్నట్లు చెప్పారు. ప్రస్తుతం జంట నగరాల్లో 121 సర్వీసులు ఉన్నాయి. సుమారు 2 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఎంఎంటీఎస్ సర్వీసులన్నీ 9 బోగీలతో రూపొందించినవే. వీటిని 11 బోగీలకు పెంచడం ద్వారా ప్రయాణికుల డిమాండ్‌ను భర్తీ చేసే అవకాశం ఉంటుందని ఆయన తెలిపారు. ముంబయి సబర్బన్ రైళ్ల తరహాలో ఎంఎంటీఎస్ రైళ్ల సమయపాలన పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇక నుంచి అన్ని ఎంఎంటీఎస్ సర్వీసులు నిర్ణీత వేళల ప్రకారం నడుస్తాయని ఆయన వివరించారు. సికింద్రాబాద్ స్టేషన్లో జీఎం తనిఖీ విలేకరుల సమావేశం అనంతరం జీఎం శ్రీవాస్తవ సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ ఎస్.కె.మిశ్రా, ఇతర ఉన్నతాధికారులతో కలిసి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తనిఖీలు చేశారు. ప్రయాణికుల సదుపాయాలు, స్టేషన్లో విక్రయించే ఆహార పదార్థాల పరిశుభ్రత, నాణ్యత, ప్లాట్‌ఫాంల వినియోగం తదితర అంశాలను పరిశీలించారు. రిజర్వేషన్ చార్టులు, రైళ్ల అనౌన్స్మెంట్ పద్ధతి, రైళ్ల రాకపోకల సమాచారం డిజిటల్ ప్రదర్శన, రిజర్వేషన్ బుకింగ్ కార్యాలయాలు, టాయిలెట్లను కూడా ఆయన పరిశీలించారు. సీసీటీవీ సర్వెలెన్స్ వ్యవస్థ, స్టేషన్లో భద్రతా సిబ్బంది ఏర్పాట్లపై సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఎంఎంటీఎస్ బోగీల్లో హోంగార్డుల సంఖ్యను పెంచుతామన్నారు. అన్ని రైల్వే స్టేషన్లు, రైళ్లలో ఆర్పీఎఫ్ సిబ్బందిని కూడా మరింత పెంచుతామని చెప్పారు. ఎంఎంటీఎస్ రైళ్ల వేళలపై నిర్ధిష్టమైన సమాచారం అందజేసేందుకు జీపీఎస్, జీపీఆర్ఎస్ వ్యవస్థను ఇటీవల ప్రవేశపెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
తప్పిన పెనుముప్పు
సాక్షి,సిటీబ్యూరో : నాంపల్లి రైల్వేస్టేషన్లో బుధవారం చోటుచేసుకున్న ఎంఎంటీఎస్ ప్రమాద ఘటనలో పెనుముప్పు తప్పింది. అప్పటికే ప్రయాణికులు దిగిపోవడం, స్టేషన్లో డెడ్‌ఎండ్‌లో గోడకు ఇంజన్ తాకడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. రైలు పూర్తి వేగంతో నడుస్తుండగా ఘటన జరిగి ఉంటే పెనుముప్పు ఏర్పడేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. రైలు బోగీలను ముందుకు నెట్టే హై డ్రాలిక్ యంత్రాలు పాడైపోవడం వల్లే ఇంజన్ ముందుకు దూసుకెళ్లి గోడను ఢీకొట్టిందని అంటున్నారు. ఎంఎంటీఎస్ సర్వీసులు ప్రారంభమయ్యాక ఇటువంటి ఘటన జరగడం ఇదే ప్రథమం. నిర్వహణలో నిర్లక్ష్యం.. నగరంలో 121 ఎంఎంటీఎస్ రైళ్లు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. రోజూ లక్షా 50 వేల మంది వీటిని ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికులకు చేరువైన ఈ సర్వీసుల సంఖ్యను ఇటీవల పెంచడంతో లోకో పెలైట్లపై పని ఒత్తిడి పెరిగింది. అలాగే, రైళ్లను సకాలంలో తనిఖీ చేయకపోవడం, కొన్నిసార్లు తనిఖీలు లేకుండానే సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. కీలకమైన హైడ్రాలిక్ యంత్రాలు పాడైనా, బ్రేక్బాక్సులు పనిచేయకున్నా అధికారులు పట్టించుకోవట్లేదని కిందిస్థాయిలో పనిచేసే ఇన్చార్జిలు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫలక్‌నుమా-లింగంపల్లి, లింగంపల్లి-నాంపల్లి, నాంపల్లి-సికింద్రాబాద్ మధ్య ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రతి 2-3 ట్రిప్పులకు ఒకసారి రైలును ఐడియలింగ్లో ఉంచాలి. కానీ సర్వీసుల సంఖ్య పెరడంతో ఇందుకు సమయం లభించట్లేదు. మరోవైపు క్రమం తప్పకుండా ఇంటర్మీడియట్ ఓవర్ హాలింగ్ (ఐఓహెచ్), పీరియాడికల్ ఓవర్ హాలింగ్ (పీఓహెచ్) నిర్వహించట్లేదనే ఆరోపణలున్నాయి. పైపై తనిఖీలు జరిపి రైళ్లను పట్టాలపైకి ఎక్కించేస్తున్నారని ఎంఎంటీఎస్ డ్రైవర్లు వాపోతున్నారు. ఎంఎంటీఎస్ రైళ్లను నడిపేందుకు నిపుణులైన లోకోపెలైట్లనే వినియోగించాలి. కానీ గూడ్స్ రైళ్లను నడిపే వారిని ఈ సెక్టార్లో వినియోగిస్తున్నారు. పైగా వీరిపై పని భారం పెరిగింది. 6 గంటలే రైలు నడపాల్సి ఉండగా 8-10 గంటల పాటు నడుపుతున్నారు. పనిభారానికి తోడు ఆరోగ్యం బాగోలేకున్నా సెలవులు ఇవ్వరని, దీనివల్ల ఒత్తిడి పెరుగుతోందని ఓ లోకోపెలైట్ చెప్పారు. ఉన్నతస్థాయి దర్యాఫ్తు: సీపీఆర్వో ఘటనపై ఉన్నతస్థాయి అధికారుల కమిటీ వేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాఫ్తు చేస్తామన్నారు. ప్రమాదం కారణం గా నాంపల్లి-సికింద్రాబాద్, నాంపల్లి-లింగంపల్లి మధ్య నడిచే 5 సర్వీసులు రద్దయ్యాయి. వీటి రద్దుతో పాటు వర్షం కారణంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రవాణా సౌకర్యాలు అందుబాటులో లేక ప్రయాణికులు ఇబ్బందుల పాలయ్యారు. -
అదుపుతప్పిన ఎంఎంటీఎస్ రైలు
నాంపల్లి రైల్వే స్టేషన్లో ప్రమాదం డ్రైవర్, గ్యాంగ్‌మెన్, ప్రయాణికుడికి గాయాలు రెండు నెలల్లో రెండో ఘటన సాక్షి, సిటీబ్యూరో: నాంపల్లి రైల్వే స్టేషన్లో బుధవారం మరో రైలు ప్రమాదానికి గురైంది. లింగంపల్లి నుంచి నాంపల్లికి వస్తున్న ఎంఎంటీఎస్ రైలు (నం.47128) 2వ నంబర్ ప్లాట్‌ఫాంపైకి వచ్చిన తర్వాత ఆగకుండా అలానే ముందుకెళ్లి చివరనున్న రక్షణ గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, గ్యాంగ్‌మెన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రెండు నెలల వ్యవధిలో ఇదే రైల్వే స్టేషన్లో రెండో ప్రమాదం జరగడం అధికారుల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తోంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. రైలు ప్లాట్‌ఫామ్‌పైకి వస్తున్న సమయంలో బోగీలను ముందుకు పుష్ చేసే హైడ్రాలిక్ యంత్రాలు పనిచేయకపోవడం వల్ల ప్రమాదానికి దారితీసినట్లు తెలుస్తోంది. రైలును ఆపడానికి డ్రైవర్ పి.మణ్యం చేసిన ప్రయత్నం ఫలించలేదు. బ్రేకులు వేసినా ఆగకుండా రైలు ముందుకు వెళ్లి 2వ నంబర్ ప్లాట్ ఫామ్ ‘డెడ్ ఎండ్’ గోడను ఢీకొట్టింది. కేబిన్ నలిగిపోవడంతో లోపల నుంచి డ్రైవర్ బయటపడలేకపోయారు. ఆయనతో పాటు కేబిన్‌లోనే ఉన్న గ్యాంగ్‌మెన్ నర్సయ్య తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో షేక్ సద్దాం అనే ప్రయాణికుడు స్వల్పంగా గాయపడ్డారు. మిగతా ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. చివరి స్టేషన్ కావడంతో ప్రమాద సమయంలో రైలులో ప్రయాణికులు చాలా తక్కువ మంది ఉన్నారు. ఫ్లాట్‌ఫామ్‌పైకి రైలు వచ్చాక ప్రమాదం జరగడం, గోడను ఢీకొట్టి ఆగిపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని రైల్వే అధికారులు తెలిపారు. ఇదే ప్రమాదం స్టేషన్‌కు వెలుపల ప్రయాణంలో ఉండగా జరిగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ప్రమాదం కారణంగా డ్రైవర్ మణ్యం కాలు కేబిన్‌లో ఇరుక్కుపోవడంతో మెడికల్ రిలీఫ్ వ్యాన్ సిబ్బంది వచ్చి కట్టర్ ద్వారా ఆయనను బయటకు తీసుకొచ్చారు. డ్రైవర్ కాలు, వేళ్లు దెబ్బతినడంతో ఆయనను, తలకు గాయాలైన గ్యాంగ్‌మెన్‌ను చికిత్స కోసం నాంపల్లి కేర్ ఆసుపత్రికి తరలించారు. విచారణ జరుపుతున్నాం: డీఆర్ఎం సికింద్రాబాదు డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) మిశ్రా ఉదయం సంఘటన స్థలానికి వచ్చి వివరాలు తెలుసుకున్నా రు. బ్రేకులు ఫెయిలయ్యాయా లేక ఇతరత్రా కారణాల వల్ల ప్రమాదం జరిగిందా? తెలుసుకునేందుకు విచారణ చేస్తున్న ట్లు మిశ్రా తెలిపారు. ప్రమాదంపై డ్రైవర్‌తో కూడా మాట్లాడి న తర్వాత కారణాలపై ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు. నాంపల్లి రైల్వే స్టేషన్లో రెండు నెలల క్రితం ఒక ప్యాసింజర్ రైలు కూడా ఇలానే ప్లాట్‌ఫామ్‌పై డెడ్ ఎండ్‌ను ఢీకొట్టింది. -
ఎంఎంటీఎస్ రైలుకు ప్రమాదం
హైదరాబాద్: లింగంపల్లి-ఫలక్‌నుమా ఎంఎంటీఎస్ రైలు నాంపల్లి రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గురయింది. రెండవ నంబర్ ప్లాట్ పామ్ డెడ్ ఎండ్‌ను ఢీకొని నిలిచిపోయింది. ఈ ప్రమాదంలో నాలుగు బోగీలు పట్టాలు తప్పాయి. డ్రైవర్ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమయింది. క్యాబిన్లో ఇరుక్కునపోయిన డ్రైవర్‌ను సహాయక సిబ్బంది కాపాడారు. అతడిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. బ్రేకులు ఫెయిలవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు తెలిపారు. ఎంఎంటీఎస్ రైలు ప్రమాదంలో నాంపల్లి రైల్వే స్టేషన్లో పలు రైళ్ల రాకపోకలకు స్వల్పంగా అంతరాయం కలిగింది. రైల్వే సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దుతున్నారు.