ఎంఎంటీఎస్ ప్రయాణమూ భారమే..
- నెలవారీ, క్వార్టర్లీ పాస్‌లపై చార్జీల పెంపు
- పెరిగిన చార్జీలు 25వ తేదీ నుంచి అమలు
సాక్షి,సిటీబ్యూరో: సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఇప్పటి వరకు అతి తక్కువ చార్జీల్లో లభించిన ఎంఎంటీఎస్ ప్రయాణం ఇక ప్రియంగా మారనుంది. అన్ని రకాల రైల్వే చార్జీలతో పాటు ఎంఎంటీఎస్, లోకల్ రైలు చార్జీలను కూడా ప్రభుత్వం పెంచింది. పెరిగిన చార్జీలు ఈ నెల 25 నుంచి అమల్లోకి రానున్నాయి.
ప్రస్తుతం సామాన్య ప్రయాణికులు వినియోగించే సెకెండ్ క్లాస్ చార్జీలను 15 కిలోమీటర్ల వరకు యదాతథంగా ఉంచారు. 16 నుంచి 20 కిలోమీటర్ల దూరానికి ఇప్పటి వరకు ఉన్న రూ.5 కు బదులు ఇక నుంచి రూ.10 చార్జీ ఉంటుంది. ఆ తరువాత 21 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వరకు చార్జీల్లో మార్పు లేదు. ప్రస్తుతం ఉన్నట్లుగానే రూ.10 చార్జీ ఉంటుంది.
ఇక మధ్యతరగతి, ఆ పై వర్గాలు వినియోగించే ఫస్ట్‌క్లాస్ చార్జీలు 5 కిలోమీటర్ల కనీస దూరానికి రూ.45 నుంచి రూ.50 కి పెరిగాయి. 40 కిలోమీటర్ల గరిష్ట దూరానికి రూ. 135 నుంచి రూ.150 కి పెరిగాయి. అలాగే నెలవారీ సెకెండ్‌క్లాస్ నెలవారీ పాస్ ప్రస్తుతం కనీస దూరానికి రూ.130 కాగా, ఇక నుంచి రూ.225కు పెరగనుంది. అలాగే ఫస్ట్‌క్లాస్ పాస్ రూ.445 నుంచి రూ.935 కు పెరుగనుంది. ప్రతి రోజు జంటనగరాల్లోని వివిధ మార్గాల్లో 121 ఎంఎంటీఎస్ సర్వీసుల్లో ప్రయాణిస్తున్న సుమారు లక్షా 70 వేల మంది ఎంఎంటీఎస్ ప్రయాణికులపైన చార్జీల భారం పడనుంది.
రైల్వేచార్జీల పెంపుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన ఎన్డీయే ప్రభుత్వం తన స్వభావాన్ని చాటుకుందని ప్రయాణికుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పెంచిన చార్జీలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
భద్రత మరచి చార్జీలు పెంచారు
రైళ్లలో ప్రయాణించాలంటేనే భయమేస్తోంది. అసాంఘిక శక్తులు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. స్టేషన్‌లలోనూ, రైళ్లలోనూ ఎక్కడా ప్రయాణికులకు భద్రత లేదు. ప్రయాణికులకు కనీస సదుపాయాలను కూడా అందజేయలేని ప్రభుత్వం రైల్వే చార్జీలను మాత్రం ఇష్టారాజ్యంగా పెంచేసింది. ఈ పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము.
- నూర్, సబర్బన్ బస్,రైల్ ట్రావెలర్స్
అసోసియేషన్ అధ్యక్షులు
ఫస్ట్‌క్లాస్ చార్జీలు బాగా పెంచారు
ఎంఎంటీఎస్ రైళ్లలో ఫస్ట్‌క్లాస్ చార్జీలు బాగా పెంచారు. ఇది చాలా అన్యాయం. ఇప్పటికే సర్‌చార్జీల పేరిట ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఇక కొత్తగా పెరుగనున్న చార్జీలు మరింత భారం కానున్నాయి. అన్ని వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చార్జీలను తగ్గించాలి.
- ప్రవీణ్ సింగ్, ఎంఎంటీఎస్ ట్రావెలర్స్
అసోసియేషన్ ప్రతినిధి
లాభార్జన కోసమే
ప్రజా రవాణా సదుపాయాన్ని అందజేయవలసిన బాధ్యత నుంచి ప్రభుత్వం పక్కకు తప్పుకుంటున్నట్లుగా అనిపిస్తోంది. తరచుగా పెంచుతున్న చార్జీలను చూస్తోంటే రైల్వే సైతం ఒక ప్రైవేట్ ఆపరేటర్‌గా మారుతోందని అర్ధమవుతోంది. ఇది సరైన పద్ధతి కాదు. గతేడాది జనవరిలో పెంచారు. ప్రస్తుతం మరోసారి చార్జీలు పెంచారు. రానున్న రైల్వే బడ్జెట్‌లో మరోసారి చార్జీలు పెరిగే ప్రమాదం కూడా లేకపోలేదు.
- గణేశ్, ప్రయాణికుడు