ప్రయాణికురాలితో టీటీఈ అసభ్య ప్రవర్తన
- దాడి చేసి రూ. 12 వేలు జరిమానా విధించిన వైనం
- కేసు నమోదు చేసిన ఆర్‌పీఎఫ్ పోలీసులు
సికింద్రాబాద్: ఎంఎంటీఎస్ రైళ్లో ప్రయాణిస్తున్న మహిళతో రైల్వే టీటీఈ అనుచితంగా మాట్లాడి, అసభ్యకరంగా ప్రవర్తించడం కలకలం సృష్టించింది. సీజన్ టికెట్‌తో ఏసీ బోగీలో ఎక్కిన పాపానికి సదరు మహిళకు రూ.12 వేలు జరిమానా విధిస్తూ చలానా రాయడంతో పాటు ఇదేంటని ప్రశ్నించిన పాపానికి టీటీఈ గాయపర్చడం పోలీసులను సైతం దిగ్భ్రాంతికి గురి చేసింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆర్‌పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్‌పీఎఫ్ పోలీసులు, బాధితురాలి కథనం ప్రకారం....మియాపూర్‌కు చెందిన లోక్‌సత్తా పార్టీ గ్రేటర్ అధ్యక్షురాలు చంద్ర మధ్యాహ్నం లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్లే రైలులోని ఒకటవ క్లాస్ బోగీ ఎక్కారు. ఆ బోగీలో ఆమె ఒక్కర్తే కూర్చొని ఉన్నారు. ఆ బోగీకి ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ గార్డుగా ఉన్నాడు. చందానగర్ దాటగానే నరేష్‌రాజ్ అనే టీటీఈ బోగీలోకి ఎక్కి టికెట్ చూపించమని చంద్రను అడిగాడు. ఆమె తనవద్ద నున్న సీజన్ టికెట్‌ను చూపించింది.
‘టికెట్‌పై నీ సంతకం లేదు. అయినా సీజన్ టికెట్‌తో ఫస్ట్‌క్లాస్ బోగీలో ఎందుకు కూర్చున్నావ్ అంటూనే దుర్భాలాడాడు. అవసరమైతే చలానా విధించుకో.. అమర్యాదగా మాట్లాడితే ఊరుకునేది లేదని చంద్ర అంది. దీంతో ఆగ్రహించిన టీటీఈ ఎక్కువ మాట్లాడుతున్నావేంటని చంద్రను నెట్టివేయడంతో ఆమె చేతులకు గాయాలయ్యాయి. ఆ బోగీలోని గార్డు వారించబోగా టీటీఈ.. ‘ఇది నీ డ్యూటీ కాదు.. నోర్మూసుకుని కూర్చో’ అని అన్నాడు. తర్వాత చంద్రకు రూ. 12 వేల జరిమానా విధిస్తూ చలనా రాసి.. ఆమెను బేగంపేట్ రైల్వేస్టేషన్‌లో దింపేశాడు.
దీంతో బాధితురాలు ఆర్‌పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. అనంతరం రైల్వే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, టీటీఈ నరేష్ కోసం గాలిస్తున్నారు. ఇదిలాఉండగా చంద్ర అనే మహిళా ప్రయాణికురాలు తనతో అసభ్యకరంగా మాట్లాడి దాడికి యత్నించిందని టీటీఈ నరేష్‌రాజ్ ఆర్‌పీఎఫ్ పోలీసులకు ప్రతి ఫిర్యాదు చేసి.. అందుబాటు లేకుండాపోయినట్టు తెలిసింది.