సాక్షి, సిటీబ్యూరో: ఎంఎంటీఎస్ రైలు కొత్త రూట్ అందుబాటులోకి వచ్చింది. రెండోదశ విస్తరణలో భాగంగా ఇప్పటికే పలు మార్గాల్లో సర్వీసులను ప్రవేశపెట్టిన దక్షిణమధ్య రైల్వే తాజాగా మేడ్చల్ నుంచి లింగంపల్లి, మేడ్చల్ నుంచి నాంపల్లి వరకు రెండు కొత్త మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్లను ప్రవేశపెట్టింది. కొద్ది నెలల క్రితం ఉత్తర, దక్షిణాది ప్రాంతాల మధ్య కనెక్టివిటీని పెంచేందుకు మేడ్చల్ నుంచి ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్ సేవలను విస్తరించగా, తాజాగా ఉత్తరం నుంచి పడమటికి కనెక్టివిటీ ఏర్పడింది. నగరశివార్లు, ఔటర్ చుట్టుపక్కల ఉన్న కాలనీలకు చెందిన ప్రజల రవాణా అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఎంఎంటీఎస్ సేవల విస్తరణ చేపట్టినట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. సిటీ బస్సులు, మెట్రో కంటే అతి తక్కువ చార్జీలతో ఎంఎంటీఎస్ సేవలను విని యోగించుకోవచ్చునని చెప్పారు. అలాగే మేడ్చల్ వైపు ఉన్న వివిధ ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు నగరంలోని నాంపల్లికి చేరుకునేందుకు అనుగుణంగా కొత్త సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి. మరోవైపు ఎంఎంటీఎస్ సేవలపైన ప్రయాణికుల నుంచి వచ్చిన సలహాలు, సూచనల మేరకు సమయపాలనలో మార్పులు చేసినట్లు జీఎం పేర్కొన్నారు. కాచిగూడ నుంచి బెంగళూరుకు రాకపోకలు సాగించే వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు అనుగుణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక సర్వీసులను నడుపనున్నారు.
నాలుగు సర్వీసులతో ప్రారంభం...
► ఉదయం, సాయంత్రం ప్రయాణికుల రద్దీకనుగుణంగా మేడ్చల్–లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ప్రస్తుతం నాలుగు సర్వీసులను ఈ రూట్‌లో ప్రారంభించారు. క్రమంగా సర్వీసులను పెంచనున్నారు.
► మేడ్చల్–లింగంపల్లి (47222) ఎంఎంటీఎస్ ఉదయం 7.20 కి బయలుదేరి 8.25కు లింగంపల్లికి చేరుకుంటుంది. తిరిగి 8.27 కే లింగంపల్లి నుంచి బయలుదేరి 9.20కి మేడ్చల్‌కు చేరుకుంటుంది.
► లింగంపల్లి–మేడ్చల్ (47225): ఉదయం 10.20 కి లింగంపల్లి నుంచి బయలుదేరి 11.08 గంటలకు మేడ్చల్‌కు చేరుకుంటుంది. 11.10 గంటలకు మేడ్చల్ నుంచి బయలుదేరి 12.10 కి లింగంపల్లికి చేరుకుంటుంది.
► మేడ్చల్–లింగంపల్లి (47225): మధ్యాహ్నం 3.30గంటలకు మేడ్చల్ నుంచి బయలుదేరి 4.40 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది. సాయంత్రం 4.42 కు తిరిగి బయలుదేరి 5.40 కి మేడ్చల్‌కు చేరుకుంటుంది.
► లింగంపల్లి–మేడ్చల్ (47227): సాయంత్రం 6.10 గంటలకు లింగంపల్లి నుంచి బయలుదేరి 7.10 గంటలకు మేడ్చల్‌కు చేరుకుంటుంది. తిరిగి 7.12గంటలకు బయలుదేరి రాత్రి 8.15 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది.
మేడ్చల్–నాంపల్లి రూట్‌లో..
► మేడ్చల్–నాంపల్లి (47251): ఎంఎంటీఎస్ ఉదయం 11.50గంటలకు బయలుదేరి 12.48కి నాంపల్లికి చేరుకుంటుంది. తిరిగి 12.50 కి బయలుదేరి మధ్యాహ్నం 1.30కి మేడ్చల్‌కు చేరుకుంటుంది.
► నాంపల్లి–మేడ్చల్ (47244): మధ్యాహ్నం 1.40 కి బయలుదేరి 2.28 కి మేడ్చల్‌కు చేరుకుంటుంది. తిరిగి 2.30కి బయలుదేరి 3.20గంటలకు నాంపల్లికి చేరుకుంటుంది.
వందేభారత్‌కు ఎంఎంటీఎస్..
కాచిగూడ నుంచి బెంగళూరుకు ఇటీవల ప్రారంభించిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ కోసం ఎంఎంటీఎస్ స్పెషల్ సర్వీసులను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రయాణికులు కాచిగూడకు చేరుకొనేందుకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. లింగంపల్లి నుంచి ఉందానగర్, ఫలక్‌నుమా నుంచి లింగంపల్లి వరకు ఈ రైళ్లను నడుపుతారు.
► లింగంపల్లి–ఉందానగర్ (47213): ఉదయం 4గంటలకు బయలుదేరి 5 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. 5.02 గంటలకు తిరిగి బయలుదేరి 5.40 గంటలకు ఉందానగర్‌కు చేరుకుంటుంది.
► ఫలక్‌నుమా–లింగంపల్లి (47220): రాత్రి 11.15 గంటలకు ఫలక్‌నుమా నుంచి బయలుదేరి 11.29కి కాచిగూడకు చేరుకుంటుంది. 11.30 కి తిరిగి బయలుదేరి రాత్రి 12.45 గంటలకు లింగంపల్లికి చేరుకుంటుంది.
► ఉందానగర్–లింగంపల్లి, ఫలక్‌నుమా–లింగంపల్లి మధ్య రెగ్యులర్‌గా నడిచే మరో 6 సర్వీసుల వేళల్లో మార్పులు, చేర్పులు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment