ఎంఎంటీఎస్‌కు మరోసారి బ్రేక్‌ | - | Sakshi
Sakshi News home page

ఎంఎంటీఎస్‌కు మరోసారి బ్రేక్‌

Dec 25 2023 6:38 AM | Updated on Dec 25 2023 8:18 AM

- - Sakshi

హైదరాబాద్: నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించే ఎంఎంటీఎస్‌ సర్వీసులకు మరోసారి బ్రేక్‌పడింది. శని, ఆదివారాల్లో పలు రూట్‌లలో సర్వీసులను నిలిపివేశారు. ప్రయాణికుల నిరాదరణ కారణంగా గత జూలై, ఆగస్టు,సెప్టెంబర్‌ నెలల్లో వీకెండ్స్‌లో సుమారు 45 ఎంఎంటీఎస్‌ రైళ్లను నిలిపివేశారు. ఆ తరువాత కొద్ది రోజులు పట్టాలెక్కించినప్పటికీ మరోసారి తాజాగా బ్రేక్‌పడింది. పలుచోట్ల ట్రాక్‌ మరమ్మతులు వంటి సాంకేతిక అంశాలను సాకుగా చూపుతున్నప్పటికీ ప్రయాణికుల ఆదరణ బాగా తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ప్రభుత్వం కొత్తగా అందుబాటులోకి తెచ్చిన ఉచిత బస్సు సదుపాయం వల్ల ఎంఎంటీఎస్‌, సబర్బన్‌, ప్యాసింజర్‌ రైళ్లలో మహిళా ప్రయాణికులు తగ్గారు.

దీంతో అధికారులు సర్వీసులను కూడా తగ్గించినట్లు సమాచారం. మొదట్లో రోజుకు 121 సర్వీసులతో లక్షా 50 వేల మంది రాకపోకలు సాగించేవారు. ఎంఎంటీఎస్‌ సేవలను పునరుద్ధరించిన అనంతరం అన్ని మార్గాల్లో ప్రతి రోజు 75 రైళ్లను అందుబాటులోకి తెచ్చారు. కానీ ప్రయాణికుల నిరాదరణ కారణంగా తరచుగా వీటి సంఖ్య సగానికి పడిపోవడం గమనార్హం. మనోహరాబాద్‌– మేడ్చల్‌, ఉందానగర్‌–మేడ్చల్‌, ఫలక్‌నుమా–లింగంపల్లి, నాంపల్లి–లింగంపల్లి, సికింద్రాబాద్‌–మేడ్చల్‌, తదితర ప్రాంతాల మధ్య ఎంఎంటీఎస్‌ రైళ్లు నడుస్తున్నాయి. మేడ్చల్‌–ఉందానగర్‌ మధ్య కొత్తగా రైళ్లను ప్రారంభించారు. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ రూట్‌లో రైళ్లు పట్టాలెక్కాయి. కానీ ప్రారంభించినప్పటి నుంచి ఈ రూట్‌ రైళ్లకు బ్రేకులు పడుతూనే ఉన్నాయి.

ఆర్టీసీ బస్సుల ఎఫెక్ట్‌...
మహిళా ప్రయాణికులకు ఆర్టీసీ సిటీ ఆర్డినరీ, మెట్రో, జిల్లాల్లో పల్లెవెలుగు ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినప్పటి నుంచి ఎంఎంటీఎస్‌ సర్వీసుల్లోనే కాకుండా సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ స్టేషన్‌ల నుంచి జిల్లాలకు రాకపోకలు సాగించే సబర్బన్‌,ప్యాసింజర్‌ రైళ్లలోనూ ప్రయాణికుల సంఖ్య తగ్గింది. సికింద్రాబాద్‌ నుంచి వరంగల్‌కు రాకపోకలు సాగించే పుష్‌పుల్‌ ట్రైన్‌ సాధారణంగా ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ప్రయాణికులతో కిక్కిరిసి ఉంటుంది. కానీ కొద్ది రోజులుగా ట్రైన్‌లో నించొని ప్రయాణించవలసిన అవసరం తప్పిందని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే సికింద్రాబాద్‌ నుంచి ఫలక్‌నుమా రూట్‌లో, సికింద్రాబాద్‌ నుంచి లింగంపల్లి రూట్‌లలో మహిళలు సిటీ బస్సుల వైపే మొగ్గు చూపుతున్నారు.ఫలక్‌నుమా–ఉందానగర్‌ మధ్య కూడా మహిళా ప్రయాణికుల సంఖ్య తగ్గింది. అలాగే ప్రతి రోజు పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగించే సికింద్రాబాద్‌–వికారాబాద్‌, వరంగల్‌–హైదరాబాద్‌, వికారాబాద్‌–కాచిగూడ, సిర్పూర్‌కాగజ్‌నగర్‌–కరీంనగర్‌, కాచిగూడ–నిజామాబాద్‌, కాజీపేట్‌–బల్లార్ష,కాచిగూడ–మహబూబ్‌నగర్‌, తదితర మార్గాల్లో నడిచే రైళ్లలోనూ మహిళాప్రయాణికులు తగ్గినట్లు అంచనా.‘‘మహిళలకు బస్సుల్లో ఉచిత సదుపాయం వల్ల వారితో పాటు వచ్చే మగవాళ్లు కూడా బస్సుల్లోనే వెళ్తున్నారు.’’ అని రైల్వే అధికారి ఒకరు వివరించారు.

గడ్డుకాలమే...
కోవిడ్‌ అనంతరం ఎంఎంటీఎస్‌ నిర్వహణ దక్షిణమధ్య రైల్వేకు సవాల్‌గా మారింది.గతంలో ఎంఎంటీఎస్‌ సర్వీసులను వినియోగించుకున్న వాళ్లంతా ఇతర ప్రత్యామ్నాయాల్లోకి మారారు. రైళ్లను పునరుద్ధరించిన తరువాత విస్తృతమైన ప్రచారం కల్పించినప్పటికీ పూర్వపు ఆదరణ లభించలేదు.దీంతో అధికారులు సర్వీసులను తగ్గించారు.ఇదే సమయంలో రెండోదశ మార్గాల్లోకి ఎంఎంటీఎస్‌ సేవలను విస్తరించడం కూడా రైల్వేకు మరో సవాల్‌గా మారింది. ఒకవైపు ప్రయాణికులు లేక వెలవెలాపోతున్న రైళ్లను లింగంపల్లి–బీహెచ్‌ఈఎల్‌,మేడ్చల్‌–బొల్లారం–సికింద్రాబాద్‌, ఫలక్‌నుమా–ఉందానగర్‌ రూట్‌లలోనడపవలసి వచ్చింది.అతి తక్కువ చార్జీలతో కొత్త రూట్‌లలో ఎంఎంటీఎస్‌ రైళ్లు అందుబాటులోకి వచ్చినా ప్రయాణికుల ఆదరణ మాత్రం లభించలేదు.దీంతో తరచుగా సర్వీసుల సంఖ్యను తగ్గించవలసి వచ్చింది. ప్రస్తుతం సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత సదుపాయం అందుబాటులోకి రావడంతో మరింత ప్రతికూల ప్రభావం పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement