Hyderabad District Latest News
-
పని ప్రదేశాల్లో లింగ సమానత్వం సాధించాలి
సాక్షి, సిటీబ్యూరో: పనిచేసే చోట లింగ సమానత్వం సాధించాల్సిన అవసరం ఉందని సీఐఐ తెలంగాణ చైర్మన్ సాయి డి ప్రసాద్ అన్నారు. తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం(టీడీఎఫ్), సీఐఐ తెలంగాణ ఎడ్యుకేషన్ అండ్ యూత్ ఎంపవర్మెంట్ సంయుక్తంగా ’ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి’ అనే అంశంపై ఆదివారం హైదరాబాద్‌లో సదస్సు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పాలసీకి సిఫార్సులను రూపొందించడంలో ఇండియన్ ఉమెన్ నెట్ వర్క్ తెలంగాణ చేస్తున్న కృషిని కొనియాడారు. ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ విద్యా నాణ్యతను మెరుగుపరిచేందుకు మద్దతు ఇవ్వడానికి చాలామంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మన విద్యార్థులు అసాధారణంగా రాణించేందుకు విద్యా వ్యవస్థలో భారీ మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సమాచారం సమకూర్చాలని కోరారు. విద్యలో నాణ్యత పెంపొందించడానికి విశ్వవిద్యాలయాల పరిపాలనను మెరుగుపరచడం, అవసరమైన నిధులను సమకూర్చడం, కొత్త బోధనా పద్ధతులను ప్రవేశపెట్టడం అవసరమని అన్నారు. కార్యక్రమంలో సీఐఐ సదరన్ రీజియన్ మాజీ చైర్మన్ అనిల్ కుమార్, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ట్రస్టీ, మాజీ చైర్మన్ జి.గోపాల్ రెడ్డి, కావేరి విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ వి.ప్రవీణ్ రావు, మారుతి సుజుకి లిమిటెడ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు సి.వి.రామన్, సీఐఐ తెలంగాణ వైస్ చైర్మన్ ఆర్ఎస్ రెడ్డి, 200 మందికిపైగా పరిశ్రమ నిపుణులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. -
శిశుమందిరాలతోనే సంస్కృతి పరిరక్షణ
బండ్లగూడ: సరస్వతీ శిశుమందిరాల్లోనే సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన విద్య అందుతుందని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. బండ్లగూడ జాగీరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీ విద్యారణ్య ఆవాస విద్యాలయం శ్రీ శారదాధామంలో 41వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి సమాజానికి అవసరమైన భవిష్యత్ యువతరం శ్రీ సరస్వతీ శిశు మందిరాల ద్వారానే నిర్మాణం అవుతుందని పేర్కొన్నారు. చక్కటి వాతావరణం ఉన్నచోటనే దేశ భవిష్యత్ నిర్మాణం సాధ్యమవుతుంన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతీ వి ద్యాపీఠం తెలంగాణ అధ్యక్షుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ డాక్టర్ తక్కెళ్లపల్లి తిరుపతిరావు, భాగ్యనగనర్ విభాగ్ కార్యదర్శి విరివింటి రవీంద్ర శర్మ, ఆవాస విద్యాలయ కార్యదర్శి బొడ్డు శ్రీనివాస్, అధ్యక్షుడు అర్జున్‌గౌడ్, శ్రీ సరస్వతీ విద్యాపీఠం ప్రాంత సంఘటనా కార్యదర్శి పతకమూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
‘చరితార్థం’ పుస్తకావిష్కరణ
సాక్షి, సిటీబ్యూరో: ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోని ఆంధ్ర మహిళాసభ కళాశాలలో ఆనందేశి నాగరాజు రాసిన ’చరితార్థం’ పుస్తకాన్ని ఆదివారం ఆవిష్కరించారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నందివెలుగు ముక్తేశ్వర్రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ రఘుకుమార్, సెంటర్ ఫర్ సోషియల్ డైలాగ్ కన్వీనర్ వేలూరి రామారావు మాట్లారు. భారత సమాజం, సంస్కృతి, ఆర్థిక అధ్యయనంతో ప్రాచీన భారతదేశ చరిత్రను ‘చరితార్థం’పుస్తకంలో రికార్డు చేశారని వక్తలు అన్నారు. నేటి భారత యువతకు మొదటి భారత ముస్లిం సంఘ సంస్కర్త, లౌకిక ప్రజాస్వామ్యవాది హమీద్ దల్వాయి భావాలు అనుసరణీయమని చెప్పారు. అనంతరం హమీద్ దల్వాయి రచించిన ’లౌకిక భారతదేశంలో ముస్లిం రాజకీయాలు’ అనే అనువాద పుస్తక పరిచయం కార్యక్రమం కూడా జరిగింది. -
బ్రష్‌లు చేత పట్టి.. గోడలకు రంగులేసి..
ఉస్మానియా ఆసుపత్రిలో ఐటీ ఉద్యోగుల సామాజిక సేవ అఫ్జల్‌గంజ్: నిత్యం కంప్యూటర్ కీ బోర్డుపై బిజీగా ఉండే సాఫ్ట్వేర్ ఉద్యోగుల చేతులు బ్రష్‌లను పట్టి ఉస్మానియా ఆసుపత్రి గోడలకు రంగులు అద్దాయి. ప్రతిరోజు పని ఒత్తిడితో సతమతమవుతూ వారాంతంలో సినిమా, విందు, వినోద కార్యక్రమాలతో సేద తీరే ఐటీ ఉద్యోగులు సామాజిక సేవలో తాము సైతం అంటూ పాల్గొని ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. వివిధ ఐటీ కంపెనీలకు చెందిన దాదాపు 50 మంది ఉద్యోగులు, ఇప్పటికే ఉస్మానియా ఆసుపత్రిలో పేద రోగులకు సేవలందిస్తున్న హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ సహకారంతో ఆసుపత్రిలోని అవుట్ పేషంట్ బ్లాక్, కులీకుత్బ్ షా భవనంలోని పరిసరాలు, గోడలు, వార్డులను శ్రమదానంతో శుభ్రం చేశారు. బ్రష్‌లు చేతబట్టి సుమారు 100 లీటర్ల పెయింట్‌తో రంగులు వేశారు. పేద రోగులు వచ్చే ఉస్మానియా ఆసుపత్రికి తమ వంతుగా సేవ చేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చిందని విప్రో కేర్ ఉద్యోగులు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ సహాయ్, ఆర్‌ఎంఓలు డాక్టర్ జయకృష్ణ, డాక్టర్ మునావర్లు ఐటీ ఉ ద్యోగులను అభినందించారు. కార్యక్రమంలో వాజీ ద్, భారతి, నేహ, ప్రీతి, ఆరిఫ్, తేజ, దివ్య, స్వర్ణ, కౌసల్య, ఉష, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. ఆనందం వ్యక్తం చేస్తున్న ఐటీ ఉద్యోగులు -
నీరా కేఫ్ ఎత్తేస్తే అడ్డుకుంటాం
ఖైరతాబాద్/సుందరయ్య విజ్ఞానకేంద్రం: హైదరాబాద్ నడిబొడ్డున రూ.20 కోట్లతో నిర్మించిన నీరా కేఫ్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్, గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలికట్టె విజయ్‌కుమార్ గౌడ్ హెచ్చరించారు. విజయ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కల్లుగీత సంఘాల నాయకులు నీరా కేఫ్ భవన్‌ను పరిశీలించారు. అనంతరం బాగ్‌లింగంపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గౌడ కులస్తులు ఆత్మగౌరవంతోపాటు వృత్తిదారులకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు నీరా కేఫ్ ఏర్పాటైందని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 50 వేల వృత్తిదారులు ప్రకృతి సిద్ధమైన పానియాన్ని నీరా రూపంలో ప్రజలకు అందిస్తున్నారని అన్నారు. కొందరు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి ఈ కేఫ్‌ను ప్రైవేటు వ్యక్తుల పరం చేయడానికి పన్నాగం పన్నారని ఆరోపించారు. ప్రభుత్వ తక్షణమే ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని, లేదంటే గౌడ సంఘాలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గౌడ ఐక్యసాధన సమితి అధ్యక్షుడు అంబాల నారాయణ గౌడ్, బబ్బూరి బిక్షపతి, భానుగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ -
‘ఛావా’ చిత్ర ప్రదర్శన
కుత్బుల్లాపూర్: మొగలులు భారతీయులపై సాగించిన దమకాండను ‘ఛావా’చిత్రం ప్రతిబింబిస్తోందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం కొంపల్లిలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షుడు పెద్దబుద్దుల సతీష్సాగర్ ఆధ్వర్యంలో ప్రదర్శించిన చావా చిత్రాన్ని ఎంపీ రాజేందర్ వీక్షించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 400 ఏళ్ల క్రితం మొగలుల దమనకాండ నుంచి హిందూ ధర్మాన్ని పరిరక్షించేందుకు శివాజీ మహరాజ్ నడుం బిగించారని, మన సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడేందుకు ఆయన వీరోచితంగా పోరాడారని తెలిపారు. ఆయన వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న శంభాజీ మహరాజ్ ఆనాడు మొగల్ చక్రవర్తులపై సాగించిన పోరాటాన్ని ఛావా చిత్రం ద్వారా తెరకెక్కించడం అభినందనీయమన్నారు. ఎంపీ ఈటల వెంట బీజేపీ నాయకుడు రాజిరెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ కో కన్వీనర్ శివాజీ రాజు, మాధురి, దుర్గా, అశోక్, మధు, మహేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, శంకర్ నాయక్, మహేందర్, తిరుపతి తదితరులు ఉన్నారు. ర్యాలీగా వెళ్లి... చిత్రం తిలకించి.. సుల్తాన్‌బజార్: శంభాజీ మహారాజ్ జీవిత కథగా తెరకెక్కిన ఛావా చిత్రానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఆదివారం కాచిగూడ క్రాస్ రోడ్డులోని ఐనాక్స్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. సనాతన ధర్మసేన వ్యవస్థాపకుడు డాక్టర్ కొప్పుల రాజశేఖర్‌తో కలిసి 150 మంది జాతీయవాద వైద్యులు కోఠి ఉస్మానియా మెడికల్ కళాశాల నుంచి ప్రత్యేకంగా అలంకరించిన గుర్రంతో ర్యాలీగా ఐనాక్స్ థియేటర్ వద్దకు చేరుకుని తిలకించారు. -
వినూత్నంగా ‘ది ఆర్టిసాన్స్ ఫ్లీ’..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని టి–వర్క్స్ వేదికగా నిర్వహించిన ‘ది ఆర్టిసాన్స్ ఫ్లీ’కార్యక్రమం విభిన్న కళలను, కళాకారులను ఒకే వేదిక మీదకు చేర్చింది. ఆదివారం జరిగిన ఈ కళాత్మక వేదికలో పలువురు ఆర్టిస్టులు వినూత్న కళలు, ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ప్రముఖ ఆర్ట్ బ్రాండ్ బ్రస్ట్రో సహకారంతో బియాండ్ హైదరాబాద్, ఆర్ట్ ఆర్టిస్ అఫీషియల్, ఎన్ఆర్బీ, అర్బన్ స్కెచర్స్ హైదరాబాద్ వంటి సంస్థ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాకారుల హస్తకళా ప్రదర్శనలతోపాటు కళా ప్రముఖులతో ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహించారు. మేకింగ్ కల్చర్‌ను ప్రోత్సహించడానికి ఇటీవల టి–వర్క్స్ ఆధ్వర్యంలో మేకర్స్ కలెక్టివ్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఏర్పాటు చేసిన ఈ వేదికలో హ్యాండ్స్–ఆన్ వర్క్‌షాప్‌లు, నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలను నిర్వహించింది. ఈ ఆర్టిసన్స్ ఫ్లీ 23వ ఎడిషన్‌లో 40 మంది వరకు కళాకారులు సృష్టించిన కళాకృతులను సామాజిక అనుసంధానాన్ని ప్రదర్శించాయి. ఈ వినూత్న కార్యక్రమంలోని ప్యానెల్ చర్చలో ప్రముఖ నటి గీతాభాస్కర్, స్క్రైబుల్ ఆర్టిస్టు హరీష్ భాగవతులు, అర్బన్ స్కెచర్స్ హైదరాబాద్ వ్యవస్థాపకుడు ఇషాక్ జియాయీ, చిత్రకారుడు–టెడెక్స్ స్పీకర్ ప్రియతం తదితరులు పాల్గొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగిన ఈ ఆర్టిసాన్స్ ఫ్లీలో వెయ్యికి పైగా ఔత్సాహికులు, కళాకారులు పాల్గొన్నారు. టీ వర్క్స్ వేదికగా కళాత్మక సందడి ఆర్టిసాన్స్ ఫ్లీలో ఆకట్టుకున్న ఆర్టిస్టులు, కళాకృతులు ప్యానల్ చర్చలో పాల్గొన్న ప్రముఖులు -
ఈజీగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్లు
సాక్షి, సిటీబ్యూరో: అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లు మరింత సులభతరం కానున్నాయి. ఆన్లైన్లోనే పునరుద్ధరించుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. రవాణా శాఖ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సారథి’సాంకేతిక పరిజ్ఞానంసహాయంతో వాహన వినియోగదారులు ఎక్కడి నుంచైనా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ల(ఐడీపీ)ను రెన్యువల్ చేసుకొనే సదుపాయం ఉంటుంది. అమెరికా, దుబాయ్, యూరోప్ తదితర దేశాల్లోని నిబంధనల మేరకు రవాణా శాఖ అందజేసే డ్రైవింగ్ లైసెన్సులు, పర్మిట్ల ఆధారంగా ఏడాదిపాటు చెల్లుబాటు అయ్యేవిధంగా తాత్కాలికంగా లైసెన్సులను అందజేస్తారు. మరో ఏడాదిపాటు తీసుకోవాలంటే హైదరాబాద్ నుంచి మరోసారి ఐడీపీ పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రత్యక్షంగా ఆర్టీఏ అధికారులను సంప్రదించాలి. కానీ, ‘సారథి’సేవలు వినియోగంలోకి వచ్చిన తరువాత ఆ ఇబ్బంది తొలగిపోనుందని ఆర్టీఏ అధికారి ఒకరు తెలిపారు. ఆర్టీఏ అందజేసే శాశ్వత డ్రైవింగ్ లైసెన్సులు, విదేశాల్లో ఉండేందుకు అనుమతించిన వీసాల ఆధారంగా ఆన్లైన్లోనే ఐడీపీలను పొందే అవకాశం లభిస్తుంది. సాధారణ లైసెన్సుల పునరుద్ధరణ, చిరునామా మార్పు, డూప్లికేట్ లైసెన్సులు వంటి ఆన్లైన్ సేవల్లో భాగంగా ఐడీపీ సదుపాయం ఉంటుంది. విదేశాల్లో ఉంటున్న వాళ్లకు దీనివల్ల భారీ ఊరట లభించనుంది. అనూహ్యమైన స్పందన... ఆర్టీఏ అందజేసే ఐడీపీలకు అనూహ్యమైన స్పందన లభిస్తోంది. విదేశాల్లో చదువుకొనేందుకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, బంధువుల ఇళ్లకు వెళ్లేవాళ్లు, తాత్కాలిక వీసాలపై వెళ్లే పర్యాటకులు ఐడీపీల కోసం ఆర్టీఏ కార్యాయాల వద్ద క్యూ కడుతున్నారు. ఒక్క ఖైరతాబాద్ కేంద్ర కార్యాలయం నుంచి ప్రతిరోజు సగటున 25 నుంచి 30 ఐడీపీలను అందజేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ ఆర్టీఏ కార్యాలయాల పరిధిలో సగటున 50 వరకు ఉండవచ్చని అంచనా. లైట్ మోటార్ వెహికల్(ఎల్ఎంవీ) డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండి వీసా ఉన్న నగరవాసులు ఈ అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లను తీసుకోవచ్చు. ఇందుకోసం ప్రస్తుతం ఆన్లైన్లో స్లాట్ నమోదు చేసుకొని సుమారు రూ.1,500 ఫీజు చెల్లించి నిర్ణీత తేదీ, సమయం ప్రకారం సంబంధిత ఆర్టీఏ అధికారులను సంప్రదించాలి. డాక్యుమెంట్ల పరిశీలన అనంతరం అదేరోజు ఐడీపీని అందజేస్తారు. ఈ ఐడీపీని ఆమోదించిన దేశాల్లో వాహనాలు నడిపేందుకు అర్హత లభిస్తుంది. కానీ, ఉద్యోగులు వీటి పునరుద్ధరణలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సారథి పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే ఆ ఇబ్బందులు తొలగిపోయే అవకాశం ఉంది. మరోవైపు విదేశాల్లో వాహనాలు నడిపేందుకు పర్మిట్లు కోరుతున్న వాళ్లలో ఉద్యోగులతోపాటు మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. విదేశాల్లోనే స్థిరపడ్డవాళ్లు మాత్రం కొంతకాలం తాత్కాలికంగా ఐడీపీ ఆధారంగా వాహనాలు నడిపేందుకు అనుమతి పొందినా శాశ్వతంగా మాత్రం అక్కడి రవాణా శాఖ నుంచి డ్రైవింగ్ లైసెన్సులను పొందవలసి ఉంటుంది. తుదిదశలో ‘సారథి’పరిశీలన దేశ వ్యాప్తంగా వాహనాల నమోదు, డ్రైవింగ్ లైసెన్సుల సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వాహన్ సారథిని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ‘వాహన్’సేవలు అందుబాటులోకి వచ్చాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన వాహనాల గణాంకాలు, చిరునామాలు వంటి వివరాలన్నింటినీ ‘వాహన్’లో నిక్షిప్తం చేశారు. దీనివల్ల వాహనదారులు ఒక రాష్ట్రంనుంచి మరో రాష్ట్రానికి, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వాహనాలను బదిలీ చేసుకొన్నప్పుడు ప్రత్యేకంగా నిరభ్యంతర పత్రం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవిధంగా వాహనాన్ని ఏ రాష్ట్రంలో కొనుగోలు చేసినా వాహన వినియోగానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒకే విధమైన సేవలను పొందవచ్చు. వాహన్ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. డ్రైవింగ్ లైసెన్సుల సేవలను సైతం ఏకీకృతం చేసేవిధంగా ‘సారథి’ని హైదరాబాద్ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. సికింద్రాబాద్ ప్రాంతీయ రవాణా కార్యాలయాన్ని ప్రయోగాత్మకంగా ఎంపిక చేశారు. సారథి సాంకేతిక వ్యవస్థ తుదిదశ పరిశీలనలో ఉంది. డ్రైవింగ్ లైసెన్సుల గణాంకాలను, వివరాలను సారథిలో నమోదు చేయడం వల్ల వాహనదారులు వాటి బదిలీలు, పునరుద్ధరణలో సారథి సేవలను వినియోగించుకోవచ్చు. అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్లకు కూడా ఈ సదుపాయం లభించనుంది. ‘సారథి’సాంకేతిక దన్నుతో ఆన్లైన్లో పునరుద్ధరణ ఎక్కడి నుంచైనా సేవలను వినియోగించుకొనే అవకాశం తుదిదశలో సాంకేతిక అంశాల పరిశీలన... -
అడుగంటిన పబ్లిక్ గార్డెన్ చెరువు
ప్రశ్నార్థకంగా జలచరాల మనుగడ నాంపల్లి: 150 ఏళ్ల పురాతన చరిత్ర కలిగిన నాంపల్లి పబ్లిక్ గార్డెన్ చెరువు అడుగంటింది. ఈ చెరువు ఎండిపోవడం పర్యావరణం సంక్షోభానికి సంకేతం. ఇన్నాళ్లూ జీవ వైవిధ్యానికి ఆధారంగా నిలిచిన పబ్లిక్‌గార్డెన్ చెరువు ఎండిపోవడానికి పట్టణీకరణ, భూగర్భ జలాలు అడుగంటడం, పేలవమైన పరిరక్షణ చర్యలే కారణాలని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ఈ చరిత్రాత్మకమైన ప్రదేశం వినాశనానికి గురికావడంతో అందులోని జలచరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మరో రెండురోజుల్లో పూర్తిగా ఎండిపోయే ప్రమాదం ఉంది. తాబేళ్లు, చేపలు మృత్యువాత పడే అవకాశం ఉంది. నీటిమట్టం తగ్గడంతో చెరువులోని చేపలు కొంగలకు ఆహారంగా మారాయి. కాబట్టి సంబంధిత శాఖ అధికారులు ఈ చెరువుపై ప్రత్యేక దృష్టిని సారించి చెరువును, చెరువులోని జలచరాలను కాపాడాల్సిన అవసరం ఉంది. చెరువులోని పూడికను తొలగించి తక్షణం జల స్థిరతాన్ని తీసుకురావాలని స్థానికులు, సందర్శకులు కోరుతున్నారు. -
మంటగలుస్తున్న మానవత్వం.. పెరుగుతున్న హింసా ప్రవృత్తి
తన ప్రేమ వివాహం చెడిపోవడానికి కారణమయ్యాడని కన్నతండ్రినే నడిరోడ్డుపై దారుణంగా హత్య చేశాడు కన్న కొడుకు. బుద్ధి చెప్పాల్సిన తండ్రే వ్యసనాలకు బానిస కావడంతో అతనిపై కోపం పెంచుకున్నాడు కొడుకు సాయికుమార్. ఎలాగైనా తండ్రి మొగిలిని అంతమొందించాలని నిర్ణయించుకొని.. నడిరోడ్డుపై చుట్టూ జనం చూస్తుండగానే కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి చంపేశాడు.అకారణంగా భార్య వెంకట మాధవితో గొడవ పెట్టుకొని, ఆమె గొంతు నులిమి చంపేశాడు భర్త గురుమూర్తి. ఇల్లాలి కాళ్లు, చేతులు, శరీరం, తల నాలుగు భాగాలుగా నరికి, వాటర్ హీటర్‌తో నీళ్లు మరిగించి శరీర భాగాలను ఉడకబెట్టాడు. ఆ తర్వాత వాటిని స్టవ్‌పై కాల్చి, రోకలి బండతో దంచి పోడి చేశాడు. ఆ పొడిని బ్లాస్టిక్ బకెట్లో తీసుకెళ్లి జిల్లెలగూడ చెరువులో పారబోశాడు.తనను కాదని కంపెనీలో డైరెక్టర్‌గా మరొకర్ని నియమించారని, ఆస్తిలో వాటా ఇవ్వలేదని తాత మీద కక్ష పెంచుకున్నాడు మనవడు. చంద్రశేఖర జనార్దన్ రావు ఇంట్లోకి చొరబడిన కూతురు కొడుకు కార్తి తేజ.. వెంట తెచ్చుకున్న కత్తితో తాతను విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లి సరోజపైనా దాడికి తెగబడ్డాడు.భార్యను, పిల్లలను వేధిస్తున్న అన్నను అంతమొందించారు తమ్ముళ్లు. ఎప్పటిలాగే మద్యం మత్తులో ఉమేష్.. భార్య ప్రియాంక, తమ్ముడు రాకేష్, చిన్నాన్న కొడుకు లక్ష్మణ్‌లతో గొడవ పడ్డాడు. బీరు సీసాతో దాడి చేశాడు. వారు ప్రతిఘటించడంతో ఇంట్లో నుంచి వీధిలోకి పరుగెత్తుకుంటూ జాతీయ రహదారిపైకి చేరుకున్నాడు. అయినా రాకేష్, లక్ష్మణ్‌లు వదిలిపెట్టకుండా అన్న ఉమేష్‌ను వెంబడించి కత్తులతో 15 సార్లు పొడిచి చంపేశారు. ఇలా.. రక్త సంబంధాల్లో నెత్తుటి చారికలు పారుతున్నాయి. ఎలాంటి బంధాలనూ లెక్కచేయడం లేదు. చెడు వ్యసనాలు, డబ్బు మీద వ్యామోహం, వివాహేతర సంబంధాల కారణంగా బంధుత్వాలు మరిచి పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. ఈ దారుణ ఉదంతాలు ఏ మారుమూల గ్రామాల్లోనో, గిరిజన ప్రాంతాల్లో జరిగినవి కాదు.. విశ్వనగరంగా ప్రపంచంతో పోటీపడుతున్న హైదరాబాద్‌లో ఇటీవల చోటుచేసుకున్నాయి. విద్యావంతులు, రిటైర్డ్ ఉద్యోగస్తులూ ఇలాంటి కిరాతకాలకు పాల్పడుతుండటం శోచనీయం.ఓటీటీలో బోలెడంత కంటెంట్..హత్యలు ఎలా చేయాలి, చేశాక పోలీసులకు ఆధారాలు దొరక్కుండా ఎలా తప్పించుకోవాలి? ఈజీగా మనీ సంపాదించే అక్రమ మార్గాలేంటి? అనే అంశాలు పూసగుచ్చినట్లు బోలెడంత కంటెంట్ ఓటీటీ, యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. ఓటీటీ కంటెంట్ కారణంగా సమాజంలో నేరాలు, లైంగిక హింస పెరుగుతున్నాయని ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇండియన్ సైకాలజీ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఓటీటీకి అలవాటు పడ్డవారి ప్రవర్తనలో విపరీతమైన మార్పులు కలుగుతున్నట్లు, ముఖ్యంగా టీనేజర్లలో ఒంటరితనం, హింసా ప్రవృత్తి పెరుగుతున్నట్టు తేల్చింది. ఓటీటీకి కేటాయించే సమయాన్ని క్రమంగా తగ్గిస్తూ.. సాహిత్యం, సంగీత, ఇతర కళలు, అభిరుచుల వైపు దృష్టిసారిస్తేనే ఈ విపత్తు నుంచి బయటపడవచ్చనిసూచించింది.అసాంఘిక ఊబిలోకి..మద్యం, మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చాయి. నగదు అవసరాలు పెరిగాయి. వీటి కోసం పర తమ భేద భావాలను మర్చిపోతున్నారు. అయినోళ్లనే అత్యంత కిరాతకంగా హతమారుస్తున్నారు. తల్లీదండ్రులు, అన్నా చెళ్లెళ్లు, భార్యభర్తలు వావి వరసలు పట్టించుకోవడం లేదు. అవసరాల కోసం, క్షణిక సుఖాల కోసం నిర్దాక్షిణ్యంగా చంపేస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన అశ్లీలత, విశృంఖలత్వం, మనుషుల భావాలను తీవ్రంగా దిగజారుస్తున్నాయి. వారిని అసాంఘిక ఊబిలోకి లాగుతున్నాయి. సంస్కృతి, సంప్రదాయాల్ని పక్కనపెట్టేలా చేస్తున్నాయి. ఈ దుస్థితిని సమాజం నుంచి పారదోలేందుకు చిన్ననాటి పాఠ్యాంశాల నుంచి కూడా మార్పు తీసుకురావాల్సిన అవసరం ఉందని సామాజిక, మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. నైతిక విలువలకు ప్రత్యేకంగా క్లాసులు తీసుకోవాలి. ఉన్నత, తరగతుల ఉపాధ్యాయులు సమకాలిన రాజకీయ, ఆర్థిక, చారిత్రక అంశాలకు, భారతీయ సంస్కృతి, విలువల్ని కూడా జోడించి విద్యార్థులకు బోధించాలి. చట్టాలు, న్యాయ వ్యవస్థ మానసిక శాస్త్ర ఆలోచల్ని అందుబాటులో ఉంచాలి.గతేడాది గ్రేటర్లో హత్యల గణాంకాలివీ:హైదరాబాద్77సైబరాబాద్ 121రాచకొండ 73విలువలు కునారిల్లడం వల్లే..చిన్నతనం నుంచే డ్రగ్సకు బానిసలవుతున్నారు. దీంతో సమాజం, కుటుంబం అంటే గౌరవం ఉండట్లే. ఆస్తులు, డబ్బే లక్ష్యంగా ఎంతటి దారుణాలకై నా ఒడిగడుతున్నారు. నేరాలు, హింస, హత్యలు, వివాహేతర సంబంధాల వంటి వాటికి ఇంతకాలం మగవారు ఎక్కువగా పాల్పడేవారు. ఇటీవల కాలంలో మహిళలు కూడా ఇందులో భాగస్వామ్యమవుతున్నారు.–డాక్టర్ పద్మా కమలాకర్, మానసిక వైద్యురాలు, ఫ్యామిలీ రిలేషిన్షిప్ కౌన్సిలర్తప్పు చేసి తప్పించుకోలేరుఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఈ రోజుల్లో నేరం చేసి తప్పించుకోలేరు. వ్యామోహంలో, క్షణికావేశంలో చేసిన తప్పు తెలుసుకునేసరికి పరిస్థితి ఘోరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు జైలుకు వచ్చి పలకరించే పరిస్థితి కూడా ఉండదు. కన్నబిడ్డలు అసలు దగ్గరకు కూడా రానివ్వరు. ఇలా అందరూ ఉన్న ఒంటరిగా నాలుగు గోడల మధ్య జైలు జీవితం గడపాల్సిందే.–సుధీర్ బాబు, రాచకొండ సీపీ -
సిటీ ట్రాఫిక్ చీఫ్‌గా జోయల్ డెవిస్
సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ విభాగం చీఫ్‌గా 2010 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి డి.జోయల్ డెవిస్ నియమితులయ్యారు. మొత్తం ఎనిమిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లకు సంబంధించి నలుగురు అధికారులు ఉన్నారు. జోయల్ డెవిస్ గతంలో హైదరాబాద్ మధ్య మండల డీసీపీగా, సిద్దిపేట కమిషనర్‌గా పని చేశారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి సైబరాబాద్‌లో ట్రాఫిక్ విభాగం సంయుక్త పోలీసు కమిషనర్‌గా (జేసీపీ) వ్యవహరిస్తున్నారు. ఆ పరిధిలో ఉన్న అనేక రహదారుల్ని అధ్యయనం చేసిన ఆయన క్లిష్టమైన ప్రాంతాల్లోని ట్రాఫిక్ సమస్యల్ని పరిష్కరించడంతో తన మార్కు చూపించారు. ఈ నేపథ్యంలో ఆయనను అత్యంత కీలకమైన సిటీ ట్రాఫిక్ చీఫ్‌గా ప్రభుత్వం నియమించింది. కొన్నాళ్లుగా రాజధానిలోని ట్రాఫిక్ సమస్యలపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో జోయల్ డెవిస్ నియామకం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అదనపు సీపీ హోదాలో సిటీ ట్రాఫిక్ చీఫ్‌గా పని చేస్తున్న 2005 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పి.విశ్వప్రసాద్‌ను ప్రభుత్వం నగర నేర విభాగానికి బదిలీ చేసింది. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్‌తో అదనపు సీపీగా (నేరాలు) పని చేస్తున్న ఏవీ రంగనాథ్ బదిలీ అయ్యారు. అప్పటి నుంచి ఈ పోస్టును నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) డీసీపీనే ఇన్చార్జ్గా ఉన్నారు. జోయల్ డెవిస్ బదిలీతో ఖాళీ అయిన సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం జేసీపీ పోస్టులో 2008 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి డాక్టర్ గజరావ్ భూపాల్ నియమితులయ్యారు. గతంలో దక్షిణ మండల డీసీపీ, సీసీఎస్ డీసీపీగా పని చేసిన ఆయన 2023 నుంచి డీజీపీ కార్యాలయంలో కో–ఆర్డినేషన్ విభాగం డీఐజీగా పని చేస్తున్నారు. జోయల్ డెవిస్ బదిలీతో ఆయన్ను మరో కీలకమైన సైబరాబాద్ ట్రాఫిక్ చీఫ్ పోస్టులో ప్రభుత్వం నియమించింది. గతంలో నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీగా పని చేసిన ఎస్.చైతన్యకుమార్‌కు 2020 బ్యాచ్ ఐపీఎస్ ఖరారైంది. ఈయన కొన్నాళ్లుగా నగర నిఘా విభాగమైన స్పెషల్ బ్రాంచ్ (ఎస్బీ) డీసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వీరు సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన స్థానంలో సైబరాబాద్‌కు గజరావ్ భూపాల్ అదనపు కమిషనర్‌గా (నేరాలు) వెళ్లిన పి.విశ్వప్రసాద్ చైతన్యకుమార్‌ను ఎస్బీ డీసీపీగా నియమిస్తూ ఉత్తర్వులు -
కాంక్రీట్ లారీ ఢీ.. కారు నుజ్జునుజ్జు
యువకుడి దుర్మరణం దుండిగల్: ఎదురుగా వస్తున్న కారును కాంక్రీట్ లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆదివారం దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దూలపల్లి ప్రాంతానికి చెందిన దున్నాల నాగ వంశీ (22) ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. ఆదివారం ఉదయం కారులో మియాపూర్ నుంచి గండిమైసమ్మ చౌరస్తా వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో గండిమైసమ్మ నుంచి ప్రగతినగర్ వైపు వస్తున్న కాంక్రీట్ లారీ బౌరంపేట స్నేక్ పార్క్ చౌరస్తా వద్ద ఎదురుగా వస్తున్న నాగ వంశీ కారును ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో నాగ వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంతో బైక్‌పై వస్తున్న బాచుపల్లికి చెందిన చిట్టూరి వెంకట సురేంద్ర, గోపాల్ కారును వెనుక నుంచి ఢీకొట్టారు. సురేంద్రకు కాలు విరిగిపోవడంతో సూరారంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కారులో ఇరుక్కుపోయిన నాగవంశీ మృతదేహాన్ని జేసీబీ బయటికి తీసి పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సుమారు గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. లారీ డ్రైవర్ రాములు పరారీలో ఉన్నాడని, కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
సూపర్ మచ్చీ!
నగరంలోని ముషీరాబాద్ చేపల మార్కెట్‌కు ఆదివారం కొనుగోలుదారులు పోటెత్తారు. నిన్నా మొన్నటి దాకా కొరమీను కిలో రూ.400 నుంచి రూ.450కి అమ్మగా.. ఆదివారం రూ.500 నుంచి రూ.600కు విక్రయించారు. బొచ్చ చేపలు మొన్నటి వరకు కిలో రూ.170– 180 ఉండగా రూ.200 ధర పలికాయి. రవ్వూ చేప కిలో రూ.130 నుంచి రూ.140కి విక్రయించగా రూ.150 నుంచి 160కి వినియోగదారులు కొనుగోలు చేశారు. రొయ్యలు కిలోకు రూ.450కి విక్రయించారు. బర్డ్‌ఫ్లూ భయంతోనే చేపలకు గిరాకీ ఏర్పడిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. – ముషీరాబాద్ -
ఉద్యానం.. అభివృద్ధి స్వచ్ఛందం
రాజధానిలోని చెరువుల అభివృద్ధి కోసం హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) నిధులు కేటాయిస్తుండగా... పార్కుల్ని తమకు అప్పగించాలంటూ పలు స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీఓ) హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని (హైడ్రా) కలుస్తున్నాయి. కబ్జా చెర నుంచి విడిపించిన వాటితో పాటు తమ ప్రాంతాల్లో ఉన్నవీ అప్పగిస్తే వాటిని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి స్థానికులకు అందుబాటులోకి తీసుకువస్తామని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించి, తదుపరి వచ్చే ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నిర్ణయించారు. –సాక్షి, సిటీబ్యూరోహైడ్రా అధికారులు ఓఆర్ఆర్ పరిధిలో ఉన్న జలవనరులతో పాటు ప్రభుత్వ స్థలాలను పరిరక్షించే బాధ్యతల్ని నిర్వర్తిస్తోంది. ఏదైనా లేఔట్‌కు అనుమతి పొందే సమయంలో దాని యజమానులు పార్కుతో పాటు కామన్ ఏరియాలను విడిచిపెట్టడం అనివార్యం. తొలినాళ్లల్లో వీటిని ఓపెన్ ప్లేసులుగానే వదిలేస్తున్న యజమానులు కాలక్రమంలో ప్లాట్‌గా మార్చి అమ్మేస్తున్నారు. మరికొన్ని చోట్ల ఆ ప్రాంతానికి అటు–ఇటు ఉన్న ప్లాట్ల యజమానులు కబ్జా చేస్తున్నారు. ఇలాంటి అనేక కారణాల నేపథ్యంలో కాలనీ నుంచి పార్కులు, ఓపెన్ స్పేస్‌లు, కామన్ ఏరియాలు మాయమవుతున్నాయి. లేఔట్ వేసే సమయంలో వదిలే ఈ ప్రాంతాలన్నీ ప్రభుత్వ స్థలాల పరిధిలోకే వస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పరుసగా ఫిర్యాదులు.. కొన్నేళ్లుగా నగరంలో ఈ కబ్జా పర్వం నడుస్తోంది. అయితే.. ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఎలా ఫిర్యాదు చేయాలి? అనేది అంశాలు తెలియక కొందరు.. ప్రభుత్వ విభాగాల చుట్టూ ప్రదక్షిణలు చేయలేక మరికొందరు మిన్నకుండిపోతున్నారు. హైడ్రా ఏర్పడిన తర్వాత ఈ కబ్జాలపై ఫిర్యాదులు మొదలు కాగా... ఆ విభాగంలో ప్రజావాణి నిర్వహణ ప్రారంభించిన తర్వాత జోరందుకున్నాయి. తమకు వచ్చే ఫిర్యాదుల పూర్వాపరాలు, రికార్డులు, డాక్యుమెంట్లు పరిశీలిస్తున్న హైడ్రా అధికారులు పార్కుల్లో ఉన్న కబ్జాలను తొలగిస్తున్నారు. అక్కడ నిర్మించిన నిర్మాణాలను కూల్చివేస్తూ పరిరక్షించాల్సిందిగా ఆయా ప్రభుత్వ విభాగాలకు లేఖలు రాస్తున్నారు. కొన్ని కాలనీల్లో ఆయా సంక్షేమ సంఘాలే ఈ బాధ్యతల్ని చేపడుతున్నాయి. ఆసక్తి చూపిస్తున్న ఎన్జీఓలు.. నగరంలోని అనేక ప్రాంతాల్లో ఎన్జీఓలు యాక్టివ్‌గా పని చేస్తున్నాయి. కొన్ని సంస్థలు నగర వ్యాప్తంగా తమ సేవల్ని విస్తరించాయి. ఇలాంటి కొన్ని ప్రతిష్టాత్మక సంస్థల నుంచి హైడ్రాకు విజ్ఞప్తులు వస్తున్నాయి. కొన్ని పార్కుల్ని తమకు అప్పగిస్తే వాటిని అభివృద్ధి చేయడంతో పాటు నిర్వహణ బాధ్యతలు చేపడతామని కోరుతున్నాయి. అయితే గత ప్రభుత్వం కొన్ని చెరువులన్ని రియల్ ఎస్టేట్ సంస్థలకు అప్పగించింది. అభివృద్ధి పనులంటూ వారు చేపట్టిన చర్యల వల్ల ఆయా జలవనరులకు లాభం కంటే నష్టమే జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న హైడ్రా అధికారులు పూర్తి సమాచారాన్ని, విధివిధానాలను ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించారు. ఆపై సర్కారు తీసుకునే నిర్ణయం, ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లనున్నట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ’సాక్షి’కి తెలిపారు. యథావిధిగా నేటి ప్రజావాణి... నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగ మార్గంలో శనివారం దుర్ఘటన చోటు చేసుకున్న విషయం విదితమే. ఆ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మందిని రక్షించడానికి వివిధ ప్రభుత్వ విభాగాలు రెస్క్యూ ఆపరేషన్లు చేస్తున్నారు. దీనికోసం నగరం నుంచి హైడ్రా బృందాలు కూడా తరలివెళ్లాయి. కమిషనర్ ఏవీ రంగనాథ్ సైతం ఈ బృందాలతో పాటు శనివారం రాత్రి అక్కడికి వెళ్లారు. రాణిగంజ్‌లోని బుద్ధ భవన్లో ఉన్న హైడ్రా ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణికి.. కమిషనర్ రంగనాథ్ అందుబాటులో లేనప్పటికీ ప్రజావాణి యథావిధిగా కొనసాగుతుందని హైడ్రా ప్రకటించింది. హైడ్రా కమిషనర్‌ను కలుస్తున్న ఎన్జీఓల ప్రతినిధులు తమ ప్రాంతాల్లోని పార్కులు అప్పగించాలని వినతులు చెరువులూ అభివృద్ధి చేసేందుకు కొన్ని సంఘాల ఆసక్తి ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకోవాలని హైడ్రా నిర్ణయం -
కీసరగుట్ట బ్రహ్మోత్సవాలకు నేడే అంకురార్పణ
కీసర: ప్రఖ్యాత శైవ క్షేత్రం కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రాంరభం కానున్నాయి. మార్చి 1వ తేదీ వరకు ఆరు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. టీటీడీ వేద పాఠశాల ఆచార్యులు పుల్లేటికుర్తి గణపతి శర్మ ప్రధాన సంధానకర్తగా వైదిక కార్యక్రమాలు కొనసాగుతాయి. సోమవారం ఉదయం 11 గంటలకు ఆలయ చైర్మన్ తటాకం నారాయణ దంపతులచే విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, రుత్విక్వరణం, యాగశాల ప్రవేశం, అఖండ జ్యోతి ప్రతిష్ఠాపనం తదితర కార్యక్రమాలను వైదికులు నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు అగ్ని ప్రతిష్ఠాపన, బేరిపూజ, ధ్వజారోహణ, ద్వాత్రింశతి రాగాలాపన, హారతి, రాత్రి 7 గంటలకు మంత్ర పుష్పం, పరాకస్తవం, తీర్థ ప్రసాద వినియోగం, రాత్రి 8 గంటలకు శ్రీస్వామివారిని కీసరగుట్ట నుంచి కీసర గ్రామానికి ఊరేగింపుగా తీసుకువస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సుమారు 5 లక్షల వరకు యాత్రికులు వస్తారని అంచనా. ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు మేడ్చల్– మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. అలాగే కీసరగుట్ట బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని జిల్లా స్థాయి క్రీడోత్సవాలు సోమవారం ఉదయం ప్రారంభం కానున్నాయి. -
హెల్మెట్ ధరిస్తే ప్రాణాలు దక్కేవేమో..
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి ఘట్కేసర్: రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన ఘట్కేసర్ పీఎస్ పరిధిలో ఆదివారం జరిగింది. ఇన్స్పెక్టర్ పరుశురాం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి– భువనగిరి జిల్లా బీబీనగర మండలం జమిలాపేట్‌కు చెందిన మడిపడిగే యశ్వంత్ (18) ఇంటర్ చదివి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం ఇంటి నుంచి ఘట్కేసర్ వైపు స్కూటీపై వస్తుండగా అగస్త్య ఫామ్‌హౌజ్ సమీపంలో మితిమీరిన వేగంతో వచ్చిన లారీ యశ్వంత్ స్కూటీని ఢీకొట్టింది. దీంతో అతడి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యశ్వంత్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. యశ్వంత్ హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణం పోయేది కాదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. యశ్వంత్ మృతదేహం -
ఊపిరి.. ఉక్కిరిబిక్కిరి
టర్ పరిధిలోని కోకాపేట్, నార్సింగి, తెల్లాపూర్, పుప్పాలగూడ, మణికొండ, గండిపేట్, జూబ్లీహిల్స్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో భారీ సంఖ్యలో భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పనిచేసే ప్రదేశాల్లో ఇసుక, మట్టి తరలింపు, వ్యర్థాల తొలగింపు, నిర్వహణ వంటి విషయాల్లో నిర్మాణ సంస్థలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో వాటి పరిసర ప్రాంతాల్లో ఇసుక రేణువులు గాలిలో దట్టంగా అలముకుంటున్నాయి. గాలిలో పీఎం 10 ధూళికణాల సాంద్రత అధికంగా ఉండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై బస్సు, లారీ, కారు వంటి వాహనాలు వెళ్లేటప్పుడు దారి కనిపించనంత దట్టంగా దుమ్ము రేగుతోంది. పటాన్చెరు, బొల్లారం, పాశమైలారం, రామచంద్రాపురం తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశమ్రలు విడుదల చేస్తున్న వ్యర్థాలు గాలి పీల్చుకోలేనంత గాఢంగా మారుతున్నాయి. నగరంలో సుమారు 80 లక్షల వాహనాలు నిత్యం రహదారిపై తిరుగుతున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మెహిదీపట్నం, అమీర్‌పేట్, కోఠి, కూకట్పల్లి, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వాహనాల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. దీంతో రహదారిపై ఒకవైపు పొగ, మరోవైపు ధూళి రేణువులు కళ్లల్లో పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికితోడు జీహెచ్ఎంసీ రూ.వేల కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులు దీర్ఘకాలంగా కొనసాగుతుండటంతో ఆ దారిలో దుమ్మురేగుతోంది. గాఢమైన వాసనలు పీల్చడం, దుమ్ము, ధూళి రేణువుల ప్రభావంతో శ్వాసకోశ జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మియాపూర్‌లో ఆందోళనకరం మియాపూర్‌లోని నరేన్ గార్డెన్లో ఎయిర్ క్వాలిటీ 342గా నమోదైంది. ఇక్కడ ఉన్న కొన్ని నిర్మాణ సంస్థలే ఇందుకు ప్రధాన కారణమంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్నారులు, మహిళలు, వృద్ధులు శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం గాలి నాణ్యత సోమాజిగూడ(154), కేపీహెచ్‌బీ ఫేజ్–3 (139), జూపార్క్ (124), కోటి (124), యూఎస్ కాన్సలేట్ (124) సైదాబాద్ (107) తదితర ప్రదేశాల్లో ప్రమాదకరంగా నమోదైంది. గాలి నాణ్యత 50 వరకు ఉంటే సాధారణం. 100 దాటితే ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు.బయటకు వెళ్తే దుమ్ము, ధూళి.. ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరి.. పరిశ్రమలు, నిర్మాణ సంస్థలున్న ప్రాంతాల్లో దట్టమైన పొగలు.. ఇదీ నగరంలో పరిస్థితి. స్వచ్ఛమైన గాలి మచ్చుకై నా లేదు. వాహనాల రద్దీకి గాలి నాణ్యత తీవ్రంగా దెబ్బతింటోంది. కొన్ని ప్రాంతాల్లో ఘనపు మీటరు గాలిలో పీఎం10 ధూళికణాలు 60 మైక్రో గ్రాములు ఉండాల్సిన చోట 150 మైక్రో గ్రాములు దాటి నమోదు కావడం అందరినీ కలవరపెడుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం ఘనపు మీటరు గాలిలో పీఎం 10 సూక్ష్మ ధూళి కణాలు 60 మైక్రో గ్రాములు, డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాల ప్రకారం 40 మైక్రో గ్రాములు ఉండాలి. –సాక్షి, సిటీబ్యూరోప్రాంతం పీఎం 10 స్థాయి (మైక్రో గ్రాములు) పాశమైలారం 158 పటాన్చెరు 155 జూ పార్క్ 157 బొల్లారం 146 హెచ్‌సీయూ 135 కోకాపేట్ 120 సోమాజిగూడ 104 -
వారం రోజుల్లో.. గోదావరి రెండు, మూడో దశలకు టెండర్లు..
సాక్షి, హైదరాబాద్: మహా నగర తాగునీటి అవసరాల కోసం మరో 20 టీఎంసీల గోదావరి జలాలను తీసుకొచ్చేందుకు కసరత్తు ప్రారంభమైంది. మరో వారం రోజుల్లో గోదావరి (Godavari) తాగునీటి సరఫరా పథకం రెండు, మూడో దశ పనులకు టెండర్లు ఆహ్వానించేందుకు జలమండలి ఏర్పాట్లు పూర్తి చేసింది. సుమారు రూ.7,360 కోట్ల అంచనా వ్యయంతో హైబ్రిడ్ యాన్యూటీ మోడల్ (హ్యామ్) ప్రాజెక్టు పనులు చేపట్టనున్నారు. మొత్తం వ్యయంలో ప్రభుత్వ వాటా 40 శాతం, నిర్మాణ సంస్థ వాటా 60 శాతం భరించనున్నారు. ప్రభుత్వం తన వాటా నిధులను హడ్కో నుంచి రుణం తీసుకోనుంది. టెండర్ ప్రక్రియ పూర్తయిన నాటి నుంచి 24 నెలల్లో పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టనున్నారు.రెండు వరుసల భారీ పైపులైన్..కాళేశ్వరం (Kaleswaram) ఎత్తిపోతల్లో భాగంగా నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ నుంచి శామీర్‌పేట ఘన్పూర్ మీదుగా ఉస్మాన్‌సాగర్‌కు రెండు వరుసల భారీ పైపులైన్ నిర్మించనున్నారు. 3000 ఎంఎం డయాతో 50 కిలోమీటర్లు, 2,200 ఎంఎం డయాతో 58 కిలోమీటర్ల వరకు పైపులైన్ పనులు చేపట్టనున్నారు. ఘన్పూర్ వద్ద సుమారు 1170 ఎంఎల్డీల నీటిశుద్ధి ప్లాంట్ ఇతరత్రా నిర్మించనున్నారు. ఇందుకోసం సుమారు రూ.4,671 కోట్లు వినియోగించనున్నారు.● సుమారు రూ. 596.88 కోట్ల అంచనా వ్యయంతో ఘన్పూర్ నుంచి ముత్తంగి జంక్షన్ వరకు సుమారు 40 కిలోమీటర్లు 2400 ఎంఎం పైపులైన్, దాని వెంట 3000 ఎంఎం డయా రింగ్ మెయిన్‌ను కలుపుతూ పైపులైన్ నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపట్టనున్నారు.● దాదాపు రూ. 300.09 కోట్ల అంచనాతో ఉస్మాన్ సాగర్‌లో 120 ఎంఎల్డీ, హిమాయత్‌సాగర్‌లో 70 ఎంఎల్డీ సామర్థ్యంతో నీటి శుద్ధి కేంద్రాల నిర్మాణ పనులు చేపట్టనున్నారు.30 టీఎంసీల కేటాయింపుగోదావరి జలాల్లో మహానగర తాగునీటి అవసరాలకు సుమారు 30 టీఎంసీల కేటాయింపు ఉంది. ఇప్పటికే గోదావరి మొదటి దశ కింద శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీల నీటిని తరలిస్తున్నారు. రెండు, మూడు దశల కింద మిగిలిన 20 టీఎంసీలు తరలించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 20 టీఎంసీల్లో నగర తాగునీటి అవరాలకు 15 టీఎంసీలు, మిగిలిన 5 టీఎంసీలను ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల పునరుజ్జీవనానికి వినియోగించనున్నారు. గోదావరి మొదటి దశలో జలాలను ఇప్పటికే మూడు రింగ్ మెయిన్ పైప్లెన్ల ద్వారా నగరంలోని వివిధ ప్రాంతాలకు అందిస్తున్నారు. రెండో దశ ప్రాజెక్టులో ఘన్పూర్ నుంచి నాలుగో రింగ్ మెయిన్ పైపులైన్ ముత్తంగి వరకూ నిర్మించనున్నారు. దీనిని ఇప్పటికే ఉన్న రింగ్ మెయిన్లకు అనుసంధానిస్తారు. మొత్తం మీద ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రెండోదశ నుంచి 150 ఎంజీడీలు, మూడోదశ నుంచి 150 ఎంజీడీల నీరు ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని అన్ని ప్రాంతాలకూ సరఫరా జరిగే అవకాశం ఉంది. -
‘చలో విద్యుత్ సౌధ’ భగ్నం
సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఆర్టిజన్ కార్మికులను విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ గురువారం చేపట్టిన చలో విద్యుత్ సౌధ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ముందస్లు చర్యల్లో భాగంగా విద్యుత్ సౌధ సహా ఖైరతాబాద్, పంజాగుట్ట సర్కిళ్లలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఇతర జిల్లాల నుంచి నగరానికి చేరుకుంటున్న వాహనాలను ఎక్కడికక్కడే అడ్డుకుని కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కళ్లుగప్పి విద్యుత్ సౌధ ముందుకు చేరుకున్న జేఏసీ చైర్మన్ ఈశ్వర్రావును అరెస్ట్ చేయగా, కన్వీనర్ వజీర్‌ను ఎర్రగడ్డలో అదుపులోకి తీసుకున్నారు. జేఏసీ కో కన్వీనర్ గాంబో నాగరాజు సహా ఇతర ప్రతినిధులు సదానందం, నరేందర్, ఎల్లయ్యలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ భవన్ ముందు అదుపులోకి తీసుకున్నారు. -
బీఆర్ఎస్ నుంచి ఒకరు విత్‌డ్రా
నేడు మరొకరు సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలోని 15 సభ్యత్వాల కోసం నామినేషన్లు దాఖలు చేసిన వారిలో బీఆర్ఎస్ కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి తన నామినేషన్‌ను గురువారం విత్‌డ్రా చేసుకున్నారు. బీఆర్ఎస్కే చెందిన మరో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణరావు సైతం తన నామినేషన్‌ను శుక్రవారం ఉపసంహరించుకోనున్నట్లు సమాచారం. స్టాండింగ్ కమిటీ కోసం అధికార కాంగ్రెస్– ఎంఐఎం పరస్పర అవగాహనతో నామినేషన్లు వేసినందున, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు బీఆర్ఎస్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటున్నట్లు సమాచారం. ఉపసంహరణకు నేటి (శుక్రవారం) వరకు గడువు ఉంది. సత్యనారాయణరావు ఉపసంహరణ పూర్తయ్యాక, మిగతా 15 మందిని ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించే అవకాశం ఉంది. వీరిలో ఎనిమిది మంది ఎంఐఎం సభ్యులు, ఏడుగురు కాంగ్రెస్ సభ్యులుండటం తెలిసిందే. -
పరికి చెరువు ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు
నిర్మాణంలో ఉన్న తన ఇంటిని తానే కూల్చుకున్న జేసీబీ డ్రైవర్ ఆల్విన్‌కాలనీ: కూకట్పల్లి మండల పరిధిలోని ఆల్విన్ కాలనీ డివిజన్ భూదేవి హిల్స్ పరికి చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు గురువారం కూల్చివేశారు. ఈ క్రమంలో హైడ్రాలో జేసీబీని నడిపే ఓ ఉద్యోగి నిర్మాణంలో ఉన్న తన ఇంటిని తానే కూల్చివేసుకోవడం గమనార్హం. తనకు చెందిన ఇంటి స్లాబ్ నిర్మాణాన్ని వదిలివేయాలని అతడు అధికారులను బతిమిలాడినా వారు ససేమిరా అన్నారు. చెరువులు, ప్రభుత్వ భూములు, నాలాల వెంట కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి కొనుగోలు చేసుకోవాలని, కష్టపడిన సొమ్మును వృథా చేసుకోరాదని అతడికి వారు సూచించారు. హైడ్రా సిబ్బంది అయినా, రాజకీయ నాయకులైనా, కబ్జాదారులైనా, ప్రభుత్వ భూములు, చెరువు స్ధలాలు, నాలా పరిసర ప్రాంత స్థలాలను ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సంబంధిత అధికారులు స్పష్టం చేశారు. కాగా.. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారనే విషయం తెలియడంతో స్థానికులు ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున వచ్చి అడ్డుకోవడానికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశామని, ఇళ్లు కట్టుకుంటున్న తరుణంలో కూల్చివేయటమేంటని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జేసీబీ డ్రైవర్‌కు నచ్చచెబుతున్న పోలీస్ అధికారి -
‘స్కిల్ డెవలప్మెంట్’కు కమ్యూనిటీ హాల్
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటికే జీహెచ్ఎంసీకి చెందిన రెండు మోడల్ మార్కెట్లను నిరుద్యోగ యువత, మహిళల ఉపాధి కల్పన పేరిట స్కిల్ డెవలప్మెంట్ కోసం సీఎస్సార్ కింద లైట్‌హౌస్ కమ్యూనిటీ ఫౌండేషన్‌కు అప్పగించిన జీహెచ్ఎంసీ.. మరో కమ్యూనిటీ హాల్‌ను అదే సంస్థకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణకు ఇచ్చేందుకు పచ్చ జెండా ఊపింది. గతంలో మోడల్ మార్కెట్లు అంటే ఎవరూ ముందుకు రానందున ఖాళీగా ఉన్నాయని ఇచ్చారు. ఈసారి మాత్రం బోరబండలోని జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్‌ను ఇచ్చేందుకు గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. స్థానిక బస్తీల్లోని పేదలు, సామాన్య ప్రజలకు వివిధ కార్యక్రమాల కోసం ఉపయోగపడాల్సిన కమ్యూనిటీ హాల్‌ను సైతం స్కిల్ డెవలప్మెంట్కు ఇస్తుండటంతో మున్ముందు ఇంకెన్ని జీహెచ్ఎంసీ ఆస్తులు శిక్షణల పేరిట బదలాయిస్తారోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భారీగా భూ సేకరణలు.. కేబీఆర్ పార్కు చుట్టూ నిర్మించనున్న ఫ్లై ఓవర్టు, అండర్‌పాస్‌లకు 105 ఆస్తులు, ఆల్విన్ క్రాస్‌రోడ్, ఖాజాగూడ, తదితర ప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు, రహదారుల అభివృద్ధి పనులు తదితరాల కోసం మరో 455 ఆస్తులు వెరసీ.. మొత్తం 560 ఆస్తుల సేకరణకు కమిటీ పచ్చజెండా ఊపింది. వీటితో పాటు మొత్తం 15 అజెండా అంశాలు, ఆరు టేబుల్ అంశాలకు ప్రస్తుత స్టాండింగ్ కమిటీ చివరి సమావేశం ఆమోదం తెలిపింది. ముఖ్యాంశాలు ఇలా.. ● మిధాని బస్టేషన్, బస్ డిపో నిర్మాణాలకు ఆర్టీసీకి కేటాయించిన 5.37 ఎకరాల ప్రభుత్వ భూమికి ఎన్ఓసీ. ● బీఆర్ఎస్ భవన్‌నుంచి బంజారా లేక్ వరకు ఎస్ఎన్డీపీ నిధుల నుంచి రూ.22.17 కోట్ల తో వరద కాల్వ నిర్మాణం, ఆధునికీకరణ. ● ఉప్పల్ సర్కిల్లోని చిలుకా నగర్ వివేకానంద విగ్రహం నుంచి కావేరీనగర్ కల్వర్టు వరకు రూ.6 కోట్ల అంచనా వ్యయంతో 100 మి.మీ. డయా పైపులైన్ నిర్మాణం. ● ప్రగతి నగర్ నుంచి మహదేవపురం వెటర్నరీ హాస్పిటల్ (వయా ఎల్లమ్మ బండ) వరకు ప్రతిపాదిత 30 మీటర్ల లింక్ రోడ్ అభివృద్ధికి అవసరమైన 8 ఆస్తుల సేకరణతో పాటు, రోడ్‌ను మాస్టర్‌ప్లాన్‌లో చేర్చేందుకు ప్రభుత్వానికి వినతి. ● దారుసలాం నుంచి చక్నావాడి కల్వర్టు వరకు రూ.7.40 కోట్లతో ఆర్సీసీ బాక్స్ డ్రెయిన్ నిర్మాణం. ● వీటన్నింటినీ పాలకమండలి ద్వారా ప్రభుత్వానికి నివేదించనున్నారు. జోన్‌కు రూ.25 కోట్లు జీహెచ్ఎంసీలో వివిధ అభివృద్ధి పనులకుగాను జోన్‌కు రూ.25 కోట్ల వంతున మొత్తం రూ.125 కోట్లు కేటాయించనున్నట్లు కమిషనర్ ఇలంబర్తి ఈ సందర్భంగా తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయంతో ప్రజల కోసం పని చేద్దామన్నారు. రహదారుల విస్తరణ, జంక్షన్లు, పార్కులు, క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీకి సంబంధించిన ఆస్తులు, వాటిపై వస్తున్న ఆదాయ వివరాలను అందించాలని అడిషనల్ కమిషనర్ (ఎస్టేట్స్) సమ్రాట్ అశోక్‌కు సూచించారు. జీహెచ్ఎంసీ ఆస్తులన్నింటినీ డిజిటలైజ్ చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో జీహెచ్ఎంసీ సెక్రటరీ కె.సత్యనారాయణ, స్టాండింగ్ కమిటీ సభ్యులు, అడిషనల్, జోనల్ కమిషనర్లు, విభాగాధిపతులు పాల్గొన్నారు. కమిషనర్, మేయర్‌తో స్టాండింగ్ కమిటీ సభ్యులు, అధికారులుసీఎస్సార్ కింద లైట్‌హౌస్ ఫౌండేషన్‌కు.. వివిధ ప్రాజెక్టుల కోసం 560 ఆస్తుల సేకరణ రూ.22 కోట్లతో బీఆర్ఎస్ భవన్ నుంచి బంజారా లేక్ వరకు వరద కాల్వ ఆధునికీకరణ జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలో ఆమోదం రూ.700 కోట్లిచ్చిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు: మేయర్ రాష్ట్రప్రభుత్వం గడచిన సంవత్సర కాలంలో జీహెచ్ఎంసీకి రూ. 700 కోట్ల నిధులు విడుదల చేసిందని చెబుతూ సమావేశానికి అధ్యక్షత వహించిన మేయర్ విజయలక్ష్మి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జీహెచ్ఎంసీకి ఎంతో ఆదాయాన్నిచ్చే క్రీడాప్రాంగణాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. -
డీఆర్ఎఫ్ పాత్ర కీలకం
● హైడ్రా కమిషనర్ రంగనాథ్ ● ఔట్ సోర్సింగ్ అభ్యర్థులకు శిక్షణ సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) నిర్వహిస్తున్న విధుల్లో దీని అంతర్భాగంగా పని చేస్తున్న డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్) పాత్ర అత్యంత కీలకమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు. ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చడంతో పాటు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా హైడ్రా పని చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. డీఆర్ఎఫ్లోని ఔట్ సోర్సింగ్ విధానంలో కొత్తగా ఎంపిక చేసుకున్న 357 మందికి అంబర్‌పేటలోని పోలీసు ట్రైనింగ్ సెంటర్లో (పీటీసీ) వారం రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ కార్యక్రమాన్ని రంగనాథ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో, ప్రభుత్వ పరంగా హైడ్రా కీలక భూమిక పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలు రక్షించడంతో పాటు ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో డీఆర్ఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇప్పుడు దీనికి హైడ్రా విధులు కూడా తోడయ్యాయని చెప్పారు. హైడ్రా మీద నమ్మకంతో ప్రభుత్వం పలు బాధ్యతలు అప్పగిస్తోందని, తాజాగా ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునే పనినీ అప్పగించిందని తెలిపారు. ఈ బాధ్యతల్ని అందరూ అంకిత భావంతో నెరవేర్చాలని ఆయన సూచించారు. -
కులగణన రీ సర్వేకు సహకరించండి
హుడాకాంప్లెక్స్: కులగణన రీ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని బీసీ కమిషన్ సభ్యుడు రాపోలు జయప్రకాశ్ కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణనలో పలు ఆరోపణలు వచ్చినందున తిరిగి సర్వే చేపట్టిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం ఆయన సరూర్‌నగర్ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వక్కలంక శ్రీనివాసరావు, పార్టీ సరూర్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు శంకర్‌యాదవ్‌లతో సమావేశమై కులగణనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులగణనలో పాల్గొనని వారు ప్రస్తుతం రీ సర్వేలో తమ పేర్లను కులాల వారీగా నమోదు చేసుకోవాలన్నారు. కుల సంఘాల అభివృద్ధి, సంక్షేమానికి దోహదపడాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు మహేందర్‌యాదవ్, శ్రీనివాస్, ధన్రాజ్గౌడ్, ఇమ్రాన్‌అలీ, శివకుమార్, షఫీ, యూనస్, జంగారెడ్డి, సుశీల, సంగీత తదితరులు పాల్గొన్నారు. -
అద్దెకు తీసుకుని అమ్మేశాడు..
జీడిమెట్ల: కార్లను లీజు ప్రాతిపదికన అద్దెకు తీసుకుని వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న వ్యక్తిని జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం బాలానగర్ డీసీపీ సురేష్‌కుమార్, ఏసీపీ హన్మంతరావు, జగద్గిరిగుట్ట సీఐ నర్సింహ, డీఐ అంజయ్యలతో కలిసి వివరాలు వెల్లడించారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన అప్పరి విశ్వ పణీంద్ర గాజులరామారం దేవేందర్‌నగర్‌లో ఉంటూ చివకల రమణ, రెడ్డి వెంకటేశ్‌లతో కలిసి వీవీఅర్ ట్రావెల్స్ పేరిట సంస్థను ఏర్పాటు చేశాడు. అతను జగద్గిరిగుట్టకు చెందిన శశిధర్ వద్ద 2024 అక్టోబర్‌లో నెలకు రూ. 23 వేలు చెల్లించేలా లీజు ప్రాతిపదికన కారును అద్దెకు తీసుకున్నాడు. రెండు నెలలు సక్రమంగా అద్దె చెల్లించిన తర్వాత అద్దె చెల్లించకుండా కాలయాపన చేస్తున్నాడు. దీంతో అనుమానం వచ్చిన శశిధర్ అతడి కార్యాలయం వద్దకు వెళ్లి చూడగా తాళం వేసి ఉంది. దీంతో పరిసర ప్రాంతాల్లో విచారించగా అతను ఇదే తరహాలో మరికొందరిని మోసం చేసినట్లు తెలిసింది. శశిధర్ జగద్గిరిగుట్ట పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు విశ్వపణీంద్రను అదుపులోకి తీసుకున్నారు. 32 కార్లు అమ్మేశాడు.. విశ్వపణీంద్ర ఇదే తరహాలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 32 కార్లను అద్దెకు తీసుకుని విక్రయించినట్లు విచారణలో వెల్లడైంది. 28 కార్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడికి సహకరించిన రమణ, సత్యనారాయణ, వెంకటేష్‌ల కోసం గాలిస్తున్నారు. నిందితుడు విశ్వపణీంద్రను గురువారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన జగద్గిరిగుట్ట ఇన్స్పెక్టర్ నర్సింహ, డీఐ ఎం.అంజయ్య, ఎస్సై శంకర్, ఎఎస్సై రమణ, హెడ్‌కానిస్టేబుళ్లు అంజిబాబు, పురందాస్, కానిస్టేబుళ్లు నరేష్కుమార్, చిరంజీవి, నరేష్‌లను డీసీపీ అభినందించి రివార్డులను అందజేశారు. ఘరానా మోసగాడి అరెస్ట్ రూ.2.5 కోట్ల విలువైన 28 కార్లు స్వాధీనం -
పీఎం కిసాన్ పేరుతో ఏపీకే ఫైల్
సాక్షి, సిటీబ్యూరో: పీఎం కిసాన్ దరఖాస్తు పేరుతో సైబర్ నేరగాళ్లు పంపిన ఆండ్రాయిడ్ ప్యాకేజ్ కిట్ (ఏపీకే) ఫైల్‌ను ఇన్స్టాల్ చేసుకున్న బాలానగర్ వాసి రూ.1.97 లక్షలు కోల్పోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలానగర్‌లోని గీతానగర్‌కు చెందిన మల్లికార్జున్ ప్రైవేట్ ఉద్యోగి. తన స్వగ్రామానికి చెందిన వారితో కూడిన వాట్సాప్ గ్రూపులో సభ్యుడిగా ఉన్నారు. ఇటీవల ఆ గ్రూపులో పీఎం కిసాన్ పథకం దరఖాస్తు పేరుతో ఓ లింక్ వచ్చింది. దానిని క్లిక్ చేయడంతో ఓ ఏపీకే ఫైల్ మల్లికార్జున్ ఫోన్లో ఇన్స్టాల్ అయింది. సైబర్ నేరగాళ్లు ఈ ఫైల్స్‌లో మాల్వేర్ను నిక్షిప్తం చేసి పంపిస్తారు. ఇది ఒకసారి ఇన్స్టాల్ అయిన తర్వాత ఫోన్ మొత్తం నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతుంది. ఫోన్ ద్వారా జరిగే లావాదేవీలతో పాటు వచ్చే ఎస్సెమ్మెస్‌లు సైతం వారికి చేరిపోతుంటాయి. మల్లికార్జున్ ఫోన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్న సైబర్ నేరగాళ్లు దాని ద్వారా ఆర్థిక లావాదేవీలు చేస్తూ, ఓటీపీలను వినియోగించి రూ.1.97 లక్షలు కాజేశారు. ఎట్టకేలకు జరిగిన మోసాన్ని గుర్తించిన బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీన్ని అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేస్తున్నారు. గత ఏడాది రాష్ట్రంలో నాలుగు వేలకు పైగా ఏపీకే ఫ్రాడ్స్‌కు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. ఈ ఫైల్స్‌ను సైబర్ నేరగాళ్లు లింకులు, సందేశాలు సహా వివిధ రూపాల్లో పంపిస్తారని, వీటిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు. ● తెలియక డౌన్లోడ్ చేసుకున్న బాధితుడు ● రూ.1.97 లక్షలు స్వాహా చేసిన నేరగాళ్లు -
గోల్డ్ లోన్ సొమ్ము నేరగాళ్ల పాలు!
సాక్షి, సిటీబ్యూరో: విద్య, వైద్య అవసరాల కోసం ఓ కార్మికుడు తీసుకున్న గోల్డ్ లోన్ సొమ్ము సైబర్ నేరగాళ్ల పరమైంది. ఈ మొత్తంతో పాటు అప్పటికే తన బ్యాంకు ఖాతాలో ఉన్న దాంతో కలిపి రూ.2.98 లక్షలు ఈ–కేటుగాళ్లు కాజేశారు. బాధితుడి ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నగరానికి చెందిన ఓ దిససరి కార్మికుడు (56) 20 రోజుల క్రితం గోల్డ్ లోన్ తీసుకున్నారు. అందులోంచి కొంత మొత్తం డ్రా చేసుకునేందుకు రెండు రోజులు క్రితం బ్యాంక్‌కు వెళ్లాడు. అయితే అధికారులు ఖాతాలో నగదు లేదని చెప్పడంతో కంగుతిన్న అతను పాస్‌బుక్ అప్డేట్ చేయించాడు. దీని ద్వారా కొన్ని అనధికార లావాదేవీలు జరిగాయని, బ్యాంకు ఖాతాలో ఉన్న మొత్తం గుర్తు తెలియని వ్యక్తులు కాజేశారని తెలిసింది. దీంతో ఆయన గురువారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు అధికారులు ప్రాథమిక ఆధారాలను బట్టి నేరం జరిగిన తీరుపై ఓ అంచనాకు వచ్చారు. కొన్ని రోజుల క్రితం బాధితుడు సిటీ బస్సులో ప్రయాణిస్తూ తన సెల్‌ఫోన్ పొగొట్టుకున్నారు. దీనిపై ఫిర్యాదు చేయడం, సిమ్‌కార్డు బ్లాక్ చేయించడం తదితర చర్యలు తీసుకోలేదు. సదరు ఫోన్లో ఉన్న సిమ్‌కార్డు నెంబరే బ్యాంకు ఖాతాతో లింకై ఉండగా... ఫోన్ పే, గూగుల్ పే సహా ఎలాంటి యూపీఐ యాప్స్ అందులో లేవు. ఈ ఫోన్‌కు చేజిక్కించుకున్న వ్యక్తులు అందులో యూపీఐ యాప్స్ డౌన్లోడ్ చేశారు. ఖాతాతో లింకై న సిమ్‌కార్డు బ్లాక్ కాకపోవడంతో వాళ్ల పని తేలికై ంది. బ్యాంకు నుంచి వచ్చే ఓటీపీలు దానికే రావడంతో ఆ యాప్స్‌ను నేరగాడు యాక్టివేట్ చేసుకున్నారు. వీటి ద్వారా లావాదేవీలు చేస్తూ రూ.రూ.2.98 లక్షలు స్వాహా చేశారు. ఈ లావాదేవీలపై బ్యాంకు నుంచి ఎస్సెమ్మెస్‌లు వచ్చినప్పటికీ... ఫోన్ సైతం నేరగాళ్ల వద్దే ఉండటంతో బాధితుడికి విషయం తెలియలేదు. ఫోన్ అన్‌లాక్‌కు సంబంధించిన పాస్వర్డ్ సైతం పటిష్టంగా లేకపోవడం సైబర్ నేరగాళ్లకు కలిసి వచ్చింది. ఈ కేసు నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు కొన్ని కీలక హెచ్చరికలు చేస్తున్నారు. ఆండ్రాయిడ్, ఐఫోన్లలో కచ్చితంగా ఫౌండ్ మై డివైజ్‌ను యాక్టివేట్ చేసుకోవాలని కోరుతున్నారు. ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే వెంటనే సిమ్‌కార్డు బ్లాక్ చేయించుకోవాలని, పోలీసులతో పాటు బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. తన నెట్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలను నిలిపివేయాల్సిందిగా బ్యాంకును కోరాలని సూచిస్తున్నారు. సిటీ బస్సులో ఫోన్ పోగొట్టుకున్న కార్మికుడు దాన్ని చేజిక్కించుకుని యూపీఐ యాప్స్ ఇన్స్టాల్ వీటితో రూ.2.98 లక్షలు కాజేసిన ఈ–కేటుగాళ్లు -
స్టూడెంట్ వీసాపై వచ్చి డ్రగ్స్ దందా
గచ్చిబౌలి: కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ అంతర్రాష్ట్ర డ్రగ్ పెడ్లర్‌గా మారిన ఓ యువతిని అదుపులోకి తీసుకున్న యాంటీ నార్కొటిక్ బ్యూరో(టీన్యాబ్), మియాపూర్ పోలీసులు ఆమె నుంచి 60 గ్రాముల సింథటిక్ ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలు శతాబ్ధి మన్నా(24) అరెస్ట్ చేశామని, మరో అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ వారెన్ కొకరంగో పరారీలో ఉన్నాడు. గురువారం మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ డాక్టర్ వినీత్ వివరాలు వెల్లడించారు. డ్రగ్ పెడ్లర్ శతాబ్ధి మన్నా బుధవారం సాయంత్రం మియాపూర్ బస్‌స్టాప్‌లో ఉన్నట్లు సమాచారం అందడంతో దాడి చేసిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని రూ.6 లక్షల విలువైన సింథటిక్ ఎండీఎంఏ డ్రగ్, సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. జార్కండ్ రాష్ట్రం, జంషెడ్‌పూర్‌కు చెందిన మన్నా బెంగళూర్‌లో బీబీఏ పూర్తి చేసింది. అక్కడే ఆమెకు స్టూడెంట్ వీసాపై వచ్చిన ఆఫ్రికాకు చెందిన వారెన్ కొకరంగోతో పరిచయం ఏర్పడింది. బెంగళూరులోనే ఉంటూ వర్క్ ఫ్రం హోం విధులు నిర్వహిస్తున్న శతాబ్ధి మన్నా తన గదిలోనే డ్రగ్స్ నిల్వ ఉంచి డ్రగ్ పెడ్లర్లకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ క్రమంలో పక్కా సమాచారంతో డ్రగ్స్ అందజేసేందుకు వచ్చిన మన్నాను అరెస్ట్ చేసినట్లు తెలిపారు., ఏదైనా పార్టీ లేదా పెడ్లర్లకు విక్రయించేందుకు ఆమె హైదరాబాద్‌కు వచ్చి ఉండవచ్చునన్నారు. మన్నా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసే సబ్ పెడ్లర్‌ను గుర్తించామని, మరి కొందరిని గుర్తించాల్సి ఉందన్నారు. వీరు గోవా, బెంగళూర్, రాజస్తాన్, ముంబై నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నట్లు సమాచారం ఉందని ఈ డ్రగ్ చైన్‌ను త్వరలోనే చేధిస్తామన్నారు. మరో నిందితుడు వారెన్ కొకరంగోకు అంతర్జాతీయ డ్రగ్ నెట్‌వర్క్‌లో ఉన్నాడని, పరారీలో ఉన్న అతడిని త్వరలోనే పట్టుకుంటామన్నారు. డ్రగ్ పెడ్లర్లు జార్కండ్లో పేదరికంలో ఉన్న విద్యార్థులకు డబ్బు ఆశ చూపి ఈ దందాలోకి దించుతున్నట్లు తాము గుర్తించామన్నారు. టీ న్యాబ్ ఎస్పీ సాయి చైతన్య మాట్లాడుతూ డ్రగ్ ఫ్రీ తెలంగాణకు ప్రజలు సహకరించాలన్నారు. గత అక్టోబర్‌లో అబిడ్స్, అఫ్జల్‌గంజ్, చౌటుప్పల్ పీఎస్‌ల పరిధిలో రాజస్తాన్ గ్యాంగ్ నుంచి 350 గ్రాముల ఎండీఎంఏ, డిసెంబర్ 25న ఫిల్మ్‌నగర్ పీఎస్ పరిధిలో 17.38 గ్రాముల ఎండీఎంఏ, పేట్ బషీరాబాద్ పీఎస్ పరిధిలో ఫిబ్రవరి 11న ఇద్దరు రాజస్తాన్ పెడ్లర్ల నుంచి 40 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసున్నట్లు తెలిపారు. విద్యార్థులు, యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. సమావేశంలో మాదాపూర్ ఏడీసీపీ జయరాం, టి న్యాబ్ డీఎస్పీ హరిచంద్రారెడ్డి, మియాపూర్ ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు విజయభాస్కర్ రెడ్డి, క్రాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు. మియాపూర్‌లో 60 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం బెంగళూర్‌కు చెందిన కార్పొరేట్ ఉద్యోగిని శతాబ్ధి మన్నా అరెస్ట్ అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ వారెన్ కొకరంగో పరారీ -
తుంగభద్ర నదిలో గల్లంతైన వైద్యురాలి మృతి
సుభాష్‌నగర్: విహార యాత్రకు వెళ్లి తుంగభద్ర నదిలో గల్లంతైన నగర వైద్యురాలు మైనంపల్లి అనన్యరావు(27) మృతి చెందింది. గురువారం అక్కడి యంత్రాంగం మృతదేహాన్ని వెలికి తీసింది. దూలపల్లిలోని అశోక ఎలా మైసన్–2కు చెందిన డాక్టర్ మోహన్‌రావు, రజిత దంపతుల కుమార్తె అనన్య రావు గుండ్లపోచంపల్లిలోని వీకేసీ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తోంది. తన స్నేహితులు సాత్విన్, హషితలతో కలిసి కర్నాటకలోని హంపీకి విహార యాత్రకు వెళ్లింది. ఈ నెల 19న సుమారు 25 అడుగుల ఎత్తుగల బండరాయి నుంచి తుంగభద్ర నదిలో ఈత కొట్టాలనుకుంది. నదికి మరోవైపు నుంచి స్నేహితులు సరదాగా వీడియో తీస్తున్నారు. అంతెత్తు నుంచి దూకిన అనన్య కొన్ని క్షణాల పాటు ఈత కొట్టి నీటి ఉధృతికి కొట్టుకుపోయింది. వెంటనే స్నేహితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో బుధవారం రాత్రి వరకు గాలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులతో కలిసి మాజీ ఎమ్మెల్యే హన్మంతరావు అక్కడకి చేరుకున్నారు. మరునాడు గురువారం సాయంత్రం మృతదేహం లభ్యమైంది. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అధికారులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని నగరానికి తీసుకురానున్నారు. పోస్టుమార్టం అనంతరం నేడు నగరానికి మృతదేహం -
యాప్రాల్‌లో దాడికి కుట్ర
మొయినాబాద్: చిలుకూరు బాలాజీ దేవాలయం అర్చకుడు రంగరాజన్‌పై దాడి చేసి, కస్టడీలో ఉన్న వీర రాఘవరెడ్డి విచారణ ముగిసింది. దాడికి సంబంధించిన కీలక విషయాలను పోలీసులు ఆయననుంచి రాబట్టే ప్రయత్నం చేశారు. 14 రోజుల జుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నిందితుడిని కోర్టు అనుమతితో పోలీసులు మూడు రోజుల కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. విచారణ చివరిరోజైన గురువారం ఉదయం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి వీర రాఘవరెడ్డిని నగరంలోని యాప్రాల్‌కు తీసుకెళ్లారు. రంగరాజన్‌పై దాడికి ముందు రెండు రోజులపాటు రామరాజ్యం సైన్యంతో యాప్రాల్‌లోని ఓ ఇంట్లో వీర రాఘవరెడ్డి సమావేశం నిర్వహించాడు. అక్కడే దాడికి కుట్ర జరిగిందనే విషయాలను నిందితుడి నుంచి రాబట్టారు. రెండు రోజుల సమావేశంలో ఏయే అంశాలపై చర్చ జరిగింది? అనే విషయాన్ని పోలీసులు ఆరా తీశారు. రామరాజ్య స్థాపనలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకోసం పనిచేయాలని.. అందుకు సహకరించనివారి అడ్డు తొలగించుకోవాలని వీరరాఘవరెడ్డి సైన్యంతో ప్రతిజ్ఞ చేయించినట్లు సమాచారం. అక్కడి నుంచి నిందితుడిని మణికొండలోని తన నివాసానికి తీసుకెళ్లి పరిశీలించారు. ఇంట్లో పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. అనంతరం రాజేంద్రనగర్ డీసీపీ కార్యాలయానికి తలరించారు. డీసీపీ శ్రీనివాస్, వీర రాఘవరెడ్డిని పలు ప్రశ్నలు అడిగి కీలక విషయాలను రాబట్టారు. చిలుకూరు బాలాజీ దేవాలయానికి వచ్చి రంగరాజన్‌పై దాడి చేయడానికి ముందు ఏం జరిగిందనే విషయాలను తెలుసుకున్నారు. మూడు రోజుల విచారణలో రాబట్టిన కీలక విషయాలతో నివేదిక రూపొందించారు. గురువారం కస్టడీ ముగిసిన నేపథ్యంలో శుక్రవారం అతన్ని కోర్టులో హాజరుపర్చనున్నారు. ఇందుకు సంబంధించిన నివేదికను సైతం శుక్రవారం కోర్టులో సమర్పించనున్నారు. దుష్ట శిక్షణ.. శిష్ట రక్షణ కోసం పనిచేయాలని ప్రతిజ్ఞ రామరాజ్య స్థాపనకు సహకరించని వారిని అడ్డు తొలగించాలని దిశానిర్దేశం పోలీసుల విచారణలో వెల్లడించిన వీర రాఘవరెడ్డి? ముగిసిన మూడు రోజుల కస్టడీ నేడు కోర్టులో హాజరుపర్చనున్న పోలీసులు -
స్క్రాప్ మాటున గంజాయి అక్రమ రవాణా
నాగోలు: ఎవరికీ అనుమానం రాకుండా కంటైనర్‌లో స్క్రాప్ మెటీరియల్ మధ్య గంజాయి దాచి అరకు నుంచి మహారాష్ట్రకు అక్రమ రవాణా చేస్తున్న కంటైనర్ డ్రైవర్‌ను అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులు, ఎస్ఓటీ మహేశ్వరం జోన్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన అతడి నుంచి 300 కిలోల గంజాయి, కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గురువారం ఎల్బీనగర్లోని క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాచకొండ సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు..మహారాష్ట్ర, పూణె, రూపినగర్కు చెందిన అహ్మద్ గులాబ్ షేక్ డీసీఎం డ్రైవర్‌గా పని చేసేవాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అతను సులువుగా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో అతడికి అదే ప్రాంతానికి చెందిన వైభవ్, దేవాతో పరిచయం ఏర్పడింది. మాదకద్రవ్యాల దందా నిర్వహించే వారు తమ వద్ద డ్రైవర్‌గా పని చేయాలని అహ్మద్ గులాబ్ షేక్‌కు సూచించారు. ఏపీలోని విశాఖపట్నం నుంచి పూణె, మహారాష్ట్ర, తదితర ప్రాంతాలకు గంజాయి తరలిస్తే ఒక్కో లోడ్‌కు రూ. 3 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అందుకు అంగీకరించిన అతను గతంలో విశాఖపట్నం నుంచి పూణేకు రెండు లోడ్ల గంజాయిని విజయవంతంగా డెలివరీ చేసి వైభవ్‌కు అప్పగించాడు. దానిని వైభవ్, దేవా పూణెలోని తమ ఏజెంట్లకు సరఫరా చేశారు. వైభవ్, దేవా సూచన మేరకు నిందితు డు అమ్మద్ గులాబ్ షేక్ ఇటీవల విశాఖపట్నం వెళ్లి బుజ్జిబాబు అనే వ్యక్తి నుంచి 300 కిలోల గంజాయి (138) ప్యాకెట్లు) సేకరించాడు. తనిఖీల సమయంలో పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు కంటైనర్‌లో ప్లాస్టిక్ స్క్రాప్లోడ్ చేసి దాని కింద గంజాయి దాచి హైదరాబాద్ మీదుగా పూణెకు తరలిస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో ఎస్ఓటీ మహేశ్వరం జోన్ పోలీసులు, అబ్దుల్లాపూర్‌మెంట్ పోలీసులు గురువారం మధ్యాహ్నం రామోజీ ఫీల్మ్ సిటీ సమీపంలో కంటైనర్‌ను ఆపి సోదా చేయగా గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడి నుంచి గంజాయి, టాటా కంటైనర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ.1.05 కోట్లు ఉండవచ్చునని సీపీ పేర్కొన్నారు. ఈ కేసులో మిగిలిన నిందితులను పట్టుకునేందుకు ఎస్ఓటీ, అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎల్బీనగర్, మహేశ్వరం అదనపు డీసీపీ ఎండీ షకీర్ హుస్సేన్, అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అరకు నుంచి పూణెకు తరలింపు 300 కేజీల గంజాయి స్వాధీనం కంటైనర్ డ్రైవర్ అరెస్ట్ -
చుక్కలు చూపిస్తున్న మెట్రో రైళ్లు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో తరచూ స్తంభిస్తున్న మెట్రో రైళ్లు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఒకవైపు ప్రయాణికుల డిమాండ్ మేరకు కోచ్‌లు అందుబాటులో లేకపోవడంతో కిక్కిరిసిపోతున్నాయి. అదే సమయంలో ఉన్నపళంగా నిలిచిపోతున్న సర్వీసులతో స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, కార్యాలయాలకు వెళ్లే ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన వారు గంటల తరబడి పడిగాపులు కాయాల్సివస్తోంది. కొద్దిరోజుల క్రితం నాగోల్– అమీర్‌పేట్ మార్గంలో సాంకేతిక కారణాలతో సర్వీసులు నిలిచిపోయాయి. ఉదయం 7.30 గంటల నుంచి సుమారు గంట పాటు రైళ్ల నిర్వహణకు ఆటంకాలు తలెత్తడంతో ప్రయాణికులంతా ఎక్కడిక్కడ మెట్రో స్టేషన్లలోనే పడిగాపులు కాశారు. ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. సామాజిక మాధ్యమాల్లో ఆందోళన వ్యక్తమైంది. గతేడాది నవంబర్ 4న సైతం మియాపూర్–ఎల్బీనగర్ రూట్లో అసెంబ్లీ సమీపంలో మెట్రో రైలు ఆగిపోయింది. దీంతో ఆ రూట్లో సర్వీసులను నిలిపివేయాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ఇలా తరచూ మెట్రో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడటం పట్ల నగరంలోని వివిధ ప్రాంతాల ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ముందస్తు సమాచారం లేదు..సాధారణంగా సాంకేతికంగా తలెత్తే సమస్యలతో సిగ్నలింగ్ సేవలకు ఆటంకం కలుగుతుంది. అధికారులు ఆ సమస్యను గుర్తించి పరిష్కరించేందుకు అరగంట నుంచి గంట వరకు సమయం పట్టవచ్చు. ఈ క్రమంలో మెట్రో రాకపోకల్లో తలెత్తిన అంతరాయంపై ప్రయాణికులకు ముందస్తుగా ఎలాంటి సమాచారం లభించడం లేదు. ఒకవైపు అప్పటికే టికెట్లు తీసుకున్న వాళ్లు మెట్రో కోసం ఎదురు చూస్తుంటారు. మరోవైపు యథావిధిగా టికెట్ విక్రయాలు కొనసాగుతూనే ఉంటాయి. దీంతో ఒక ట్రైన్‌కు సరిపడా ప్రయాణికులు ఎదురుచూస్తుండగా.. అంతకు రెట్టింపు సంఖ్యలో టికెట్లు ఇవ్వడం వల్ల రద్దీ అనూహ్యంగా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని సర్వీసులకు అంతరాయం ఏర్పడినట్లు మెట్రోస్టేషన్లలో అనౌన్స్మెంట్ ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలకు అవకాశం లభిస్తుందని పేర్కొంటున్నారు. అధికారులు ఈ మేరకు ఎలాంటి అనౌన్స్మెంట్ చర్యలు చేపట్టకపోవడం వల్ల ప్రయాణికులకు పడిగాపులు తప్పడం లేదు.కోచ్‌ల కొరత.. తంటాలుసాంకేతిక సమస్యలతో పాటు కోచ్‌ల కొరత కూడా నగరంలో మెట్రో ప్రయాణానికి సవాల్‌గా మారింది. ప్రస్తుతం నాగోల్–రాయదుర్గం, ఎల్బీనగర్– మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్ కారిడార్లలో ప్రతి రోజు సుమారు 5 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. రోజురోజుజూ మెట్రోల్లో రద్దీ పెరుగుతూనే ఉంది. ఒక ట్రైన్ బయలుదేరే సమయానికి మరో రెండు ట్రైన్లకు సరిపడా ప్రయాణికులు టికెట్లు తీసుకొని ఎదురుచూస్తున్నారు. దీంతో ఉదయం, సాయంత్రం మెట్రోలు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ, డిమాండ్ మేరకు రైళ్లు పెంచాలనే ప్రతిపాదన ఉంది. నాగ్‌పూర్ నుంచి కొత్త కోచ్‌లను కొనుగోలు చేయనున్నట్లు ఇటీవల ఎల్అండ్టీ అధికారులు పేర్కొన్నారు. కానీ ఆ దిశగా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. -
మురుగు శుద్ధి దిశగా జలమండలి అడుగులు
సాక్షి, సిటీబ్యూరో: వందశాతం మురుగు శుద్ధి దిశగా జలమండలి అడుగులేస్తోంది. మహా నగరంలో రోజువారీగా ఉత్పన్నమయ్యే మురుగు నీటిని పూర్తి స్థాయిలో శుద్ధి చేసేందుకు మూడేళ్ల క్రితం చేపట్టిన మురుగు శుద్ధి కేంద్రాల (ఎస్టీపీ) ప్రాజెక్టు పూర్తి కావస్తోంది. ఇప్పటికే సుమారు 663 ఎంఎల్డీల సామర్థ్యం గల 11 ఎస్టీపీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరో 443 ఎంఎల్డీ సామర్థ్యం గల తొమ్మిది ఎస్టీపీల నిర్మాణాలు తుది దశకు చేరుకుంటున్నాయి. మరోవైపు అమృత్ పథకంక కింద 972 ఎంఎల్డీ సామర్థ్యమున్న 39 ఎస్టీపీల నిర్మాణాలకు టెండర్లను ఆహ్వానించింది.1,650 ఎంఎల్డీల మురుగు ఉత్పన్నం..గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజువారీగా సుమారు 1,650 మురుగు నీరు ఉత్పన్నమవుతోందని అంచనా. అందులో సుమారు 772 ఎంఎల్డీల మురుగు నీటిని ఇప్పటికే 25 ఎస్టీపీల ద్వారా శుద్ధి చేస్తోంది. ఉత్పన్నమవుతున్న నీటిలో 46 శాతం శుద్ధి జరుగుతుండటంతో మిగిలిన 54 శాతం సైతం మురుగు నీటిని శుభ్రం చేయడానికి కొత్త ఎస్టీపీల నిర్మాణాలకు నడుం కట్టింది.31 నుంచి 20కి కుదింపుమూడేళ్ల క్రితం చేపట్టిన ఎస్టీపీల ప్రాజెక్టును మొత్తం మూడు ప్యాకేజీలుగా విభజించి రూ.3866.41 కోట్ల అంచనా వ్యయంతో 1259.50 ఎంఎల్డీల సామర్థ్యం గల 31 కొత్త మురుగు నీటి శుద్ధి కేంద్రాలకు ప్రణాళిక రూపొందించి కార్యాచరణకు దిగింది. స్థల సేకరణ వివాదాలు ఇతరత్రా అభ్యంతరాలతో ఎస్టీపీల సంఖ్యను 20కి కుదించి ఎంఎల్డీల సామర్థ్యాన్ని మాత్రం తగ్గకుండా చర్యలు చేపట్టింది. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీ వినియోగిస్తూ ఎస్టీపీల నిర్మాణాలు చేపట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్యాకేజీ –1 కింద అల్వాల్, మల్కాజిగిరి, కాప్రా, ఉప్పల్, ప్యాకేజీ–2 కింద రాజేంద్రనగర్, ఎల్బీ నగర్ ప్యాకేజీ–3 కింద కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి సర్కిల్ ప్రాంతాల్లో ఎస్టీపీ నిర్మాణాలు చేపట్టగా.. ఇప్పటికే వీటిలో సగం అందుబాటులోకి వచ్చాయి. మిగతావి తుది దశలో ఉన్నట్లు జలమండలి వర్గాలు చెబుతున్నాయి.హ్యామ్ మోడ్‌లో అమృత్ ఎస్టీపీలుకేంద్ర ప్రభుత్వ అమృత్ పథకం కింద మంజూరైన 39 ఎస్టీపీలు హ్యామ్ మోడ్‌లో నిర్మించేందుకు జలమండలి ప్రణాళిక రూపొందించింది. ప్రస్తుతం అవి టెండర్ దశలో ఉన్నాయి. అందులో ఒక ఎస్టీపీ పీపీపీ మోడ్‌లో.. మిగతా 38 ఎస్టీపీలను హైబ్రిడ్ అన్నూయిటీ మోడల్ (హ్యామ్) విధానంలో నిర్మించనున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే.. 972 ఎంఎల్డీల మురుగును శుద్ధి చేయవచ్చు. వాటి నిర్మాణ పనులు రెండు ప్యాకేజీల్లో పూర్తి చేయనుంది.. ప్యాకేజీ–1లో 16 ఎస్టీపీలను, ప్యాకేజీ–2లో 22 ఎస్టీఛపీలు నిర్మిస్తారు. నిర్మాణ సంస్థ ఎస్టీపీలను నిర్మించి 15 ఏళ్ల పాటు నిర్వహణ చేపట్టాల్సి ఉంది. మొత్తం ఎస్టీపీల నిర్మాణ వ్యయం రూ.2,569.81 కోట్లు కాగా.. 15 ఏళ్ల పాటు నిర్వహణకు రూ.1,279.29 కోట్ల అంచనా వ్యయం కానుంది. ఎస్టీపీల ప్రాజెక్టుల నిర్మాణ వ్యయంలో కేంద్రం 30, రాష్ట్రం 30 నిర్మాణ సంస్థ 40 శాతం చొప్పున నిధులు సమకూర్చనున్నాయి.తుది దశలో ఉన్న ఎస్టీపీలుఎస్టీపీ ఎంఎల్డీ.. సామర్థ్యంపాలపిట్ట 7శివాలయనగర్ 14ముల్లకత్వ చెరువు 25నలగండ్ల 7అత్తాపూర్–1 64అంబర్‌పేట 212.5రెయిన్బో విస్తా 43.5రామ చెరువు 30అత్తాపూర్–2 40 -
ఒత్తిడే శత్రువు!
మరికొద్ది రోజుల్లో టెన్త్, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షల సమయం సమీపిస్తున్నకొద్దీ.. విద్యార్థుల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. పరీక్షల్లో తప్పుతామోనని.. కొంత మంది, తల్లిదండ్రులు ఆశించిన దానికంటే తమకు తక్కువ మార్కులు వస్తాయోననే టెన్షన్‌తో మరికొంత మంది తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నారు. బలహీన క్షణంలో ఆత్మహత్యలకూ పాల్పడుతున్నారు. వార్షిక పరీక్షల వేళ.. విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా కౌన్సెలింగ్ ఇచ్చేందుకు ఏ ఒక్క రెసిడెన్షియల్ కాలేజీలోనూ కౌన్సిలర్ లేకపోవడం కూడా ఈ విపత్కర పరిణామాలకు మరో కారణం. అధ్యాపకులే కాదు తల్లిదండ్రులు కూడా విద్యార్థుల మానసిక స్థితిపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. బలవంతపు బోధన, అభ్యాసన కంటే.. ఇష్టంతో చదివేలా విద్యార్థులను మానసికంగా సంసిద్ధులను చేసినప్పుడు మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోర్యాంకులు, గ్రేడ్లు రద్దు చేశాంవిద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ప్రభుత్వం ఇప్పటికే టెన్త్‌లో ర్యాంకులు, గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసింది. ప్రభుత్వ స్కూళ్లలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి, వారిలో మానసిక స్థైర్యాన్ని నింపి, మానసికంగా పరీక్షలకు సంసిద్ధులను చేస్తున్నాం. అర్థం కాని పాఠ్యాంశాలను మళ్లీ వివరించే ప్రయత్నం చేస్తున్నాం. వార్షిక పరీక్షలపై వారిలో ఉన్న భయాన్ని పూర్తిగా పోగొట్టే ప్రయత్నం చేస్తున్నాం. మోడల్ పేపర్లను తయారు చేసి, పరీక్షలు రాయిస్తున్నాం.– సుశీందర్‌రావు, డీఈఓ, రంగారెడిప్రేమతో చెప్పాలిపిల్లల ఆత్మహత్యలకు కాలేజీ యాజమాన్యాలది ఎంత బాధ్యత ఉంటుందో? తల్లిదండ్రులది అంతే బాధ్యత ఉంటుంది. పిల్లల మానసిక స్థితిని అర్థం చేసుకోకుండా వారికి ఇష్టం లేని కోర్సులు, కాలేజీల్లో బలవంతంగా చేర్పిస్తుంటారు. ఈ సమయంలో కనీసం కౌన్సెలింగ్ కూడా ఇవ్వడం లేదు. ఒత్తిడికి గురై, ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్నకొద్దీ.. వారిలో ఆందోళన, భయం ఎక్కువై.. ఆత్మహత్యలకు పూనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు వారితో ప్రేమగా వ్యవహరించాలి. మానసిక స్థైర్యం చెప్పాలే గాని.. వారిని తోటి పిల్లలు, బంధువుల ముందు తిట్టకూడదు.– డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, మానసిక నిపుణుడ్డు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరంఅత్యధిక మార్కులు సాధించాలనే ఉద్దేశంతో చాలా మంది పిల్లలు నిద్రాహారాలు మాని చదువుతుంటారు. అదేపనిగా చదవడం వల్ల తలనొప్పి, మానసిక సంఘర్షణ, కంటిచూపు సమస్య వస్తుంది. తీరా పరీక్షలు మొదలయ్యే నాటకి అనారోగ్యం పాల వుతుంటారు. ఈ సమయంలో పరీక్ష సరిగా రాయలేక..ఫెయిలవుతుంటారు. పిల్లల ఆరోగ్యపై తల్లిదండ్రులు శ్రద్ద చూపించాలి. వేళకు నిద్రపుచ్చడం, వేళకు నిద్రలేపి ఓ ప్రణాళిక ప్రకారం చదివించడం చేయాలి. తేలికగా జీర్ణం అయ్యే అప్పుడే వండివార్చిన తాజా ఆహారం అందించాలి.– డాక్టర్ వెంకటి, డీఎంహెచ్ఓ, హైదరాబాద్మచ్చుకు కొన్ని ఇటీవలి ఉదంతాలు..● ప్రిన్సిపాల్ తిట్టాడనే కారణంతో షాద్‌నగర్‌లోని శాస్త్ర పాఠశాల భవనంపై నుంచి దూకి 10వ తరగతి విద్యార్థి నీరజ్ బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.● పరీక్షలో ఫెయిల్ అవుతాననే భయంతో మైసమ్మగూడ మల్లారెడ్డి మహిళా ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని కళాశాల నాలుగో అంతస్తు కిటికీ నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు యత్నించగా తోటి విద్యార్థులు గమనించి అడ్డుకున్నారు.● కుంట్లూరులోని తెలంగాణ గిరిజన రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న నాగర్‌కర్నూలుకు చెందిన సౌమ్య (17) ఇటీవల తరగతి గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.● చదువు ఒత్తిడి తట్టుకోలేక హైదర్‌నగర్ శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న షాద్‌నగర్‌కు చెందిన విద్యార్థి కౌశిక్ రాఘవ (17) హాస్టల్ గదిలో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.● పరీక్ష సరిగా రాయలేదనే కారణంతో జీడిమెట్ల పీఎస్ పరిధిలో ఇటీవల పదో తరగతి విద్యార్థిని త్రిష ఆత్మహత్యకు పాల్పడింది. -
రాచకొండలో ఆపరేషన్ స్మైల్
సాక్షి, సిటీబ్యూరో: హోటళ్లు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు తదితర పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేస్తున్న 1,051 మంది బాల కార్మికులకు రాచకొండ పోలీసులు విముక్తి కలిగించారు. ఆపరేషన్ స్మైల్–11లో భాగంగా కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో గురువారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మానవ అక్రమ రవాణా, షీ టీమ్, స్పెషల్ బ్రాంచ్ విభాగాలతో పాటు ఒక సబ్ ఇన్స్పెక్టర్, నలుగురు కానిస్టేబుళ్లు (ఒక మహిళా కానిస్టేబుల్ కలిపి)లతో 9 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ కొనసాగింది. విముక్తి కలిగించిన చిన్నారుల్లో మన రాష్ట్రానికి చెందిన బాలురు 512 మంది, బాలికలు 28 మంది ఉండగా.. ఇతర రాష్ట్రాలకు చెందిన బాలురు 473 మంది, బాలికలు 38 మంది ఉన్నారు. చిన్నారులను పనిలో పెట్టుకున్న 464 మంది యాజమానులపై ఎఫ్ఐఆర్లు, 410 మందిపై జీడీ ఎంట్రీ కేసులు నమోదు చేశారు. 1,051 మంది చిన్నారులకు విముక్తి -
డ్రగ్స్ విక్రేతల అరెస్ట్
23 గ్రాముల కొకై న్, కారు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం మాదాపూర్: మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఇజ్జత్‌నగర్‌లోని అలేఖ్యహోమ్స్లో ఉంటున్న చంద్రపు ప్రసన్నకుమార్ రెడ్డి ప్రైవేటు కంపెనీలో పని చేస్తున్నాడు. అతడికి బెంగళూరుకు చెందిన డ్రగ్స్ విక్రేత కెవిన్‌తో పరిచయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతను గురువారం ప్రసన్నకుమార్ రెడ్డికి డ్రగ్స్ అందజేసేందుకు మాదాపూర్‌లోని హైటెక్స్ మెటల్ చార్మినార్ వద్దకు వచ్చాడు. దీనిపై సమాచారం అందడంతో దాడి చేసిన మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 23 గ్రాముల కొకై న్ స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు నిందితులు పాల్వంచకు చెందిన జూపల్లి విశ్వామిత్ర, మణికొండకు చెందిన శ్రీనివాస సాయిదీపక్, సికింద్రాబాద్‌కు చెందిన వరుణ్‌గౌడ్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. కాగా కెవిన్ బెంగళూరులో డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నాడని, ప్రస్తుతం హైదరాబాద్‌లో మొదలు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి మాదకద్రవ్యాలతో పాటు, కారు, మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న యువకుడి అరెస్ట్ మాదాపూర్: డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంఘటన మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మాదాపూర్‌లోని జేఎంజే కోలివింగ్ పీజీ హాస్టల్లో ఉంటున్న గుత్తాతేజ కృష్ణ ఆర్కిటెక్‌గా పనిచేస్తున్నారు. గురువారం అతను అయ్యప్ప సొసైటీ వద్ద బెంగళూరుకు చెందిన శాండీ అనే యువతి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు గుత్తా తేజకృష్ణను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. డ్రగ్స్ విక్రేత శాండి పరారీలో ఉన్నట్లు తెలిపారు. పోలీసులు తేజ నుంచి 11.14 గ్రాముల ఎండీఎంతో పాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
అంతర్రాష్ట్ర గంజాయి పెడ్లర్ అరెస్ట్
సికింద్రాబాద్: ఒడిశా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా గంజాయి తరలిస్తున్న పెడ్లర్‌ను జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం జీఆర్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ వివరాలు వెల్లడించారు. ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లాకు చెందిన అబల్(23)వ్యవసాయ కూలీగా పని చేసేవాడు. సులువుగా డబ్బులు సంపాదించాలని భావించిన అతను కొద్ది రోజుల క్రితం అడవ పట్టణానికి వెళ్లి రైనో అనే వ్యక్తిని కలిశాడు. మహారాష్ట్రలో గంజాయికి చాలా డిమాండ్ ఉందని, తనకు 8 కిలోల గంజాయి కావాలని చెప్పిన రైనో పూణేకు గంజాయి తరలిస్తే ప్యాకెట్‌కు రూ. 1000 ఇస్తానని చెప్పడంతో అబల్ అందుకు అంగీకరించారు. దీంతో అతను మాసియా అనే వ్యక్తి నుంచి కిలో రూ. 800 చొప్పున గంజాయి కొనుగోలు చేసి అబల్కు అప్పగించాడు. ఈ నెల 4న అతను గంజాయి ప్యాకెట్లతో ఇచ్చాపురం నుంచి కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు అనుమానస్పదంగా కనిపించిన అబల్ బ్యాగ్‌ను సోదా చేయగా రూ.1.96 లక్షల విలువైన 7.8 కిలోల గంజాయిని గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎస్ఐ మాజీద్, హెచ్‌సీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.7.84 కిలోల గంజాయి స్వాధీనం -
రోడ్డు భద్రతపై విస్తృత అవగాహన
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ రహదారి భద్రతా మాసం–2025 నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కమిషనరేట్ పరిసర ప్రాంతాల్లో గురువారం 1494 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. లా అండ్ ఆర్డర్ విభాగం 708, ట్రాఫిక్ విభాగం 378, ట్రాఫిక్ ట్రయినింగ్ ఇనిస్టిట్యూట్ (టీటీఐ) 408 అవగాహన సెషన్లు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు కమిషనర్ జీ సుధీర్ బాబు తెలిపారు. డ్రైవర్లు, పాదచారులు, విద్యార్థులు, ఆర్టీసీ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, ఆటోడ్రైవర్లను అవగాహన కార్యక్రమాల్లో భాగస్వాములను చేశారు. రోడ్డు భద్రతా నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వివిధ విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. -
ఇంట్లోకి చొరబడి..కత్తులతో పొడిచి..
చిలకలగూడ: ఓ ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు తల్లి కొడుకుపై కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన గురువారం చిలకలగూడ ఠాణా పరిధిలోని మెట్టుగూడలో చోటుచేసుకుంది. . తల్లి అపస్మారకస్థితిలో ఉండగా, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. ఎవరు, ఎందుకు దాడికి పాల్పడ్డారో తెలియరాలేదు. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మెట్టుగూడ నల్లపోచమ్మ ఆలయ సమీపంలో రేణుక, శేఖర్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కుమారులు యశ్వంత్, యశ్పాల్, వినయ్ ఉన్నారు. ఏజీ కార్యాలయంలో పనిచేసే శేఖర్ మూడేళ్ల క్రితం మృతిచెందాడు. రేణుక, తన ముగ్గురు కుమారులు, మంచానికే పరిమితమైన అత్త (శేఖర్ తల్లి) అనసూయ (70) కలిసి ఉంటున్నారు. మౌలాలీలోని ఓ రైల్వే కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తున్న యశ్వత్ గత మూడు నెలలుగా పనికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్నాడు. యశ్పాల్, వినయ్ ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. గురువారం ఉదయం యశ్పాల్, వినయ్ డ్యూటీకి వెళ్లగా యశ్వంత్, తల్లి రేణుక ఇంట్లోనే ఉన్నారు. ఉదయం 11.30 గంటల సమయంలో ఇంట్లోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు రేణుక, యశ్వంత్‌లపై కత్తులతో విచక్షణా రహితంగా దాడి చేసిన అనంతరం బయట తలుపులకు గడియపెట్టి వెళ్లిపోయారు. తీవ్రంగా గాయపడిన వారి కేకలు విన్న స్థానికులు తలుపులు తెరిచి చూడగా ఇద్దరూ రక్తపు మడుగులో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. రేణుక కడుపుపై రెండు, యశ్వంత్ కడుపుపై మూడు కత్తిపోట్లు ఉన్నాయి. రేణుక అపస్మారకస్థితిలో ఉండగా, యశ్వంత్ పరిస్థితి విషమంగా ఉందని, వారికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపారు. పథకం ప్రకారమే దాడి.. తాము ఇంట్లో లేని సమయం చూసి పథకం ప్రకారమే దుండగులు హత్యాయత్నానికి పాల్పడ్డారని రేణుక మూడో కుమారుడు వినయ్ తెలిపాడు. తమకు ఎవరితోనూ శతృత్వం లేదన్నాడు. ఎవరు ఎందుకు దాడి చేశారో తెలియడం లేదని, ఆరుగురు వ్యక్తులు దాడిలో పాల్గొన్నారని, నలుగురు ఇంట్లోకి చొరబడి దాడి చేయగా, ఇద్దరు బయటే ఉన్నట్లు తెలిపాడు. సవాల్‌గా తీసుకున్న పోలీసులు... హత్యాయత్నంపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య, చిలకలగూడ ఏసీపీ జైపాల్‌రెడ్డి, చిలకలగూడ ఇన్స్పెక్టర్ అనుదీప్, డీఐ రమేష్‌గౌడ్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్స్వాడ్ ఆధారాలు సేకరించారు. రక్తపు మరకలతో ఉన్న పదునైన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనలో దుండగులను ప్రత్యక్షంగా చూసిన వారు లేకపోవడం గమనార్హం. బాధితులు నోరు విప్పితేనే... గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు కోలుకుని నోరువిప్పితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్య, చిలకలగూడ ఏసీపీ జైపాల్‌రెడ్డి తెలిపారు. దుండగులను కేవలం బాధితులు మాత్రమే చూశాన్నారు. అన్ని కోణాల్లోను దర్యాప్తు చేపట్టామని, త్వరలోనే మిస్టరీని చేధిస్తామన్నారు. తల్లీకుమారుడిపై హత్యాయత్నం తీవ్రగాయాలతో గాంధీలో చికిత్స కుమారుడు యశ్వంత్ పరిస్థితి విషమం అపస్మారకస్థితిలో తల్లి రేణుక ఎవరు, ఎందుకు దాడి చేశారో తెలియని వైనం బాధితులు కోలుకుని నోరు విప్పితేనే వాస్తవాలు వెలుగులోకి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆధారాల సేకరణ -
బండిలో బాటిల్స్
గచ్చిబౌలి: రోడ్డుపై వ్యాపారం చేస్తున్న ఓ మహిళకు చెందిన తోపుడు బండిలో 92 విస్కీ క్వార్టర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్న సంఘటన గురువారం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జేవీజీహిల్స్‌లో ఫుట్‌పాత్‌పై ఉన్న డబ్బాలో మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు స్థానికులు శేరిలింగంపల్లి సర్కిల్ ఉప వైద్యాధికారి శ్రీకాంత్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి వెళ్లిన ఆయన తనిఖీలు చేయగా 10 క్వార్టర్ బాటిల్స్ లభించాయి. వాటిని ధ్వంసం చేసి డబ్బాను తొలగించారు. రాజరాజేశ్వరీ కాలనీలోనూ ఇదే తరహాలో ఉదయం నుంచి మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో అక్కడికి వెళ్లిన ఆయన సోదా చేయగా, తోపుడు బండిలో ఏకంగా వివిధ కంపెనీలకు చెందిన 92 క్వార్టర్ బాటిళ్లు గుర్తించి నివ్వెరపోయారు. అంతే కాకుండా పక్కనే ఉన్న గుడిసెలో పలువురు మద్యం సేవిస్తున్నట్లు గుర్తించి డయల్ 100, గచ్చిబౌలి పోలీసులకు సమాచారం అందించారు. మద్యం విక్రయిస్తున్న మహిళతో పాటు మద్యం బాటిళ్లను పోలీసులకు అప్పగించారు. బెల్ట్ షాప్ నిర్వహిస్తున్న మహిళపై కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ హబీబుల్లాఖాన్ తెలిపారు. గత కొన్ని నెలలుగా ఉదయం 6 గంటల నుంచే మద్యం అమ్మకాలు జరుగుతుండటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు పేర్కొన్నారు. తోపుడు బండిలో 92 విస్కీ క్వార్టర్ బాటిల్స్ ● కంగుతిన్న జీహెచ్‌సీ అధికారులు ● గచ్చిబౌలి పోలీసులకు అప్పగింత -
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
సైదాబాద్: ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి..ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, కర్నేల్గంజ్కు చెందిన మహ్మద్ సాదాబ్, మహ్మద్ దిల్షాద్ (21) సోదరులు నగరానికి వలస వచ్చి సైదాబాద్ రెడ్డిబస్తీలో ఉంటూ టైలరింగ్ పని చేస్తున్నారు. దిల్షాద్ యూపీలోని తమ గ్రామానికి చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకునే వారు. అయితే కొన్ని రోజులుగా వారు ఫోన్లో గొడవ పడుతున్నారు. మంగళవారం రాత్రి సాదాబ్ ఇంటికి తిరిగి వచ్చేసరికి దిల్షాద్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని కనిపించాడు. అతడి సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దిల్షాద్ మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రేమ విఫలమై తన సోదరుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని సాదాబ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి దారుణ హత్య చాంద్రాయణగుట్ట: క్షణికావేశంలో ముగ్గురు స్నేహితులు ఓ యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేసిన సంఘటన గురువారం బండ్లగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బండ్లగూడ, ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన షేక్ షాబాజ్ (23) డీసీఎం డ్రైవర్, లేబర్‌గా పని చేసేవాడు. అదే ప్రాంతానికి చెందిన ఆజం, ఆయూబ్, అమీర్ అతడి స్నేహితులు. వీరు నలుగురు ఇందిరానగర్‌లోని శ్మశాన వాటికలో కూర్చుని మద్యం తాగేవారు. గురువారం మధ్యాహ్నం మద్యం సేవిస్తుండగా ఆజం, షాబాజ్ల మధ్య గొడవ జరిగింది. దీంతో షాజాబ్ ఆజమ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విషయాన్ని ఆజమ్ తన స్నేహితులు ఆయూబ్, అమీర్‌లకు చెప్పాడు. వీరు ముగ్గురు కలిసి మరోసారి మద్యం తాగి ఇందిరానగర్ శ్మశాన వాటిక నుంచి వెళుతుండగా చిన్న సందులో నుంచి షాబాజ్ వస్తూ కనిపించడంతో ఆజం తన వద్ద ఉన్న కత్తితో షాబాజ్‌పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన షాబాజ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్ పాటిల్, చాంద్రాయణగుట్ట ఏసీపీ కె.మనోజ్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బండ్లగూడ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎలక్ట్రిక్ బైకులు దగ్ధం మణికొండ: షాపు ఎదుట నిలిపిన ఎలక్ట్రిక్ బైక్‌లు దగ్ధమైన సంఘటన మణికొండ మున్సిపాలిటీ అలకాపూర్ టౌన్షిప్లో గురువారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అలకాపూర్ రోడ్డు నెంబర్ 23లో డామినోస్ పిజ్జా షాప్ కొనసాగుతుంది. అందులో నుంచి పిజ్జాలు సరఫరా చేసే స్కూటీలను బుధవారం రాత్రి ఎప్పటి లాగే షాప్ ఎదుట పార్క్ చేశారు. గురువారం తెల్లవారు జామున ఓ బైక్‌కు నిప్పంటుకోవడంతో పక్కనే ఉన్న మరో నాలుగు వాహనాలకు వ్యాపించాయి. దీనిని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే అవి కాలి బూడిదయ్యాయి. -
ఇద్దరు సైబర్ నేరగాళ్లకు ఆరు నెలల జైలు
సాక్షి, సిటీబ్యూరో: ఓ మహిళ డీమ్యాట్ ఖాతాలోని షేర్లను తమ ఖాతాల్లోకి మార్చుకుని మోసం చేసిన ఇద్దరు సైబర్ నేరగాళ్లపై నేరం నిరూపణ అయింది. వీరికి న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష, రూ.10 వేల చొప్పున జరిమానా విఽధించినట్లు డీసీపీ దార కవిత గురువారం వెల్లడించారు. నగరానికి చెందిన ఓ మహిళకు డీ మ్యాట్ ఖాతాతో పాటు వివిధ కంపెనీల షేర్లు ఉన్నాయి. 2014లో ఆమెకు వారాసిగూడకు చెందని ఏఎల్ దీపక్ పరిచయం ఏర్పడింది. ఆమె తండ్రి పేరుతో ఉన్న షేర్లను ఆమె ఖాతాలోకి బదిలీ చేయిస్తానంటూ నమ్మబలికాడు. ఆమెతో ఆదిత్య బిర్లా మనీ లిమిటెడ్ సంస్థలో ట్రేడింగ్ ఖాతా తెరిపించారు. బాధితురాలికి తెలియకుండా ఆమె పేరుతో ఈ–మెయిల్ ఐడీ సృష్టించాడు. దీని ఆధారంగా ఆమె డీమ్యాట్ ఖాతాలో ఉన్న షేర్లను కాజేసి, విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. 2018లో ఈ విషయాన్ని గుర్తించిన బాధితురాలు నగర సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ దందాలో దీపక్‌కు తార్నాక వాసి ఆర్ శ్రవణ్‌కుమార్ సహకరించినట్లు తేలింది. దీంతో అధికారులు వారిని అరెస్టు చేసి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం ఇరువురు నిందితులను దోషులుగా తేల్చింది. ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. స్నేహితుడి భార్యను నిండా ముంచాడు... తన స్నేహితుడి భార్యను టార్గెట్‌గా చేసుకున్న ఓ కేటుగాడు మరో వ్యక్తితో కలిసి రూ.8.13 లక్షలు కాజేశాడు. దీనికోసం సోలార్ ప్రాజెక్ట్ కోసం 100 శాతం రణం ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. బాధితురాలి ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసుకున్న సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుజరాత్ రాష్ట్ర ఆర్థిక శాఖలోని ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాంలో (పీఎంఈజీపీ) పని చేసి, కన్నుమూసిన అధికారి భార్య నగరంలో స్థిరపడ్డారు. పదవీ విరమణ చేసిన ఆమె తన భర్త ఫోన్ నెంబర్‌నే వినియోగిస్తున్నారు. పీఎంఈజీపీలో అతడితో కలిసి పని చేసిన ఓ వ్యక్తి దీనిని ఆసరాగా చేసుకున్నాడు. కొన్నాళ్ల క్రితం ఆమెకు ఫోన్ చేసి మాట్లాడిన అతగాడు క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ (సీజీటీఎంఎస్ఈ) పథకం కింద సోలార్ ప్రాజెక్టులకు 100 శాతం రుణం ఇప్పిస్తానని చెప్పాడు. ఆమె ఆసక్తి చూపడంతో మరో వ్యక్తిని పరిచయం చేసిన అతగాడు దరఖాస్తు చేసుకునే విధానాన్ని వివరించడంతో పాటు సహకరిస్తాడని చెప్పాడు. ఆపై పత్రాల తయారీ, ఇతర ఖర్చుల పేరుతో కొంత, రిఫండబుల్ డిపాజిట్ అంటూ మరికొంత మొత్తం... ఇలా రూ.8.13 లక్షలు బదిలీ చేయించుకున్నారు. ఆపై రుణం మంజూరైందని, త్వరలోనే మీ ఖాతాలోకి వస్తుందని చెప్పారు. అయితే రోజులు గడుస్తున్నా తన ఖాతాలోకి నగదు రాకపోవడంతో తాను చెల్లించిన మొత్తం తిరిగి ఇవ్వాలని వారిని కోరింది. అయితే రుణం మంజూరుకు మరికొంత మొత్తం డిమాండ్ చేయడంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ.10 వేల చొప్పున జరిమానా -
ఆ సర్జన్ ఎవరు?
కిడ్నీ దాతలది తమిళనాడు.. స్వీకర్తలది కర్ణాటక సాక్షి, సిటీబ్యూరో: కొత్తపేటలోని అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి చికిత్సల్లో కీలకంగా వ్యవహరించిన నెఫ్రాలజిస్ట్, అనస్థీషియన్ ఎవరు? అనే కోణంలో వైద్యారోగ్యశాఖ విచారణ ప్రారంభించింది. మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు ఉస్మానియా ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ నేతృత్వంలో ఏర్పడిన త్రిసభ్య కమిటీ బుధవారం అలకనంద ఆస్పత్రిని పరిశీలించింది. అనంతం గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడుకు చెందిన కిడ్నీ దాతలు నసీ్త్రన్బేగం (35), ఫిర్దోస్బేగం (40) సహా కర్ణాటకకు చెందిన స్వీకర్తలు న్యాయవాది రాజశేఖర్ (68), సివిల్ ఇంజినీర్ భార్య, మాజీ స్టాఫ్‌నర్సు కృపాలత (45) ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎవరి ద్వారా ఇక్కడికి వచ్చారు? ఎలా వచ్చారు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ డాక్టర్‌ను సంప్రదించారు? ఎక్కడ వైద్య పరీక్షలు చేయించారు? సర్జరీ కోసం ఎంత చెల్లించారు? వంటి అంశాలపై ఆరా తీశారు. అయితే.. ఇప్పటికే సరూర్‌నగర్ పోలీసుల అదుపులో ఉన్న ఆస్పత్రి నిర్వాహకుడు సుమంత్ ఇప్పటికీ నోరు మెదపనట్లు తెలిసింది. ఆయన నోరు తెరిస్తే కానీ అసలు విషయం బయటికి వచ్చే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంటే.. కిడ్నీ రాకెట్‌కు పాల్పడిన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పలు ప్రజా సంఘాలు అలకనంద ఆస్పత్రి ఎదుట బుధవారం ఆందోళనకు దిగాయి. దాతలు, స్వీకర్తల కేస్ షీట్లు మాయం.. ● వైద్యులు ఏదైనా సర్జరీ చేసే ముందు రోగి ఊరు, పేరు, ఫోన్ నంబర్‌తో పాటు బీపీ, షుగర్ ఇతర ఆరోగ్య వివరాలు కేస్ షీట్లో నమోదు చేస్తారు. ప్రతి ఆరు గంటలకోసారి బీపీ, పల్స్‌రేట్‌ను మానిటరింగ్ చేస్తుంటారు. సర్జరీ చేసే వైద్యుడి పేరుతో పాటు మత్తుమందు ఇచ్చే వైద్యుడు సహా స్టాఫ్‌నర్సులు, ఇతర సిబ్బంది వివరాలను కూడా ఇందులో నమోదు చేస్తారు. కానీ.. అలకనంద ఆస్పత్రి యాజమాన్యం ఇవేవీ పట్టించుకోలేదు. ఎవరికీ అనుమానం రాకుండా దాతలు, స్వీకర్తలను ఇక్కడికి తీసుకురావడంతో పాటు సర్జరీ చేసిన వైద్య సిబ్బంది వివరాలను కేషీట్‌లో నమోదు చేయకుండా గోప్యంగా వ్యవహరించింది. ● సర్జరీలో పాల్గొన్న వైద్య సిబ్బంది ఆ సమయంలో తమ ముఖాన్ని రోగులు, వారివెంట వచ్చిన బంధువులు గుర్తించకుండా మాస్క్‌లు ధరించి, జాగ్రత్త పడినట్లు తెలిసింది. తనిఖీలకు వెళ్లిన వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు కేస్ షీట్ కూడా దొరకకుండా జాగ్రత్తపడింది. నిజానికి ఎవరైనా రోగులు సర్జరీ చేయించుకునే ముందు ఆస్పత్రి ఎక్కడ ఉంది? చికిత్స చేసే డాక్టర్ ఎవరు? ఆయనకున్న అనుభవం ఏమిటీ? ఇప్పటి వరకు ఆయన ఎన్ని సర్జరీలు చేశారు? సక్సెస్ రేటు ఎంత? వంటి అంశాలపై ఆరా తీస్తారు. ఆ తర్వాతే సర్జరీకి అంగీకరిస్తారు. కానీ.. ఇక్కడ స్వీకర్తలిద్దరూ ఇవేవీ పట్టించుకోలేదు. వారిద్దరూ ఉన్నత విద్యావంతులే అయినప్పటికీ.. కేవలం మధ్యవర్తులు చెప్పిన మాటలు నమ్మి, చికిత్స కోసం వచ్చినట్లు తెలిసింది. వేర్వేరు రాష్ట్రాలు.. వేర్వేరు మధ్యవర్తులు.. ● తమిళనాడులోని పేద కుటుంబాలకు చెందిన నసీ్త్రన్బేగం (35), ఫిర్దోస్బేగం (40)లు గత కొంత కాలంగా తీవ్రమైన ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. పైళ్లెన తర్వాత భర్తలు వదిలేయడంతో వీరు ఒంటరయ్యారు. రోజువారీ జీవనం దుర్భరంగా మారింది. వీరి బలహీనతను స్థానికంగా ఉన్న మధ్యవర్తి పూర్ణిమ అవకాశంగా తీసుకుంది. కిడ్నీ అమ్మకం ద్వారా సులభంగా డబ్బు సంపాదించ వచ్చని ఆశ చూపింది. ఆ మేరకు గతంలో తాను కూడా ఒక కిడ్నీ అమ్ముకున్నట్లు నమ్మబలికింది. ఆ మేరకు ఇద్దరు మహిళలను కిడ్నీ అమ్మకానికి ప్రేరేపించింది. అప్పటికే అలకనంద ఆస్పత్రి యజమానితో ఆమెకు పరిచయం ఉండటం, ఇదే అంశాన్ని ఆయన దృష్టికి తీసుకురావడంతో వారికి వైద్య పరీక్షలు చేయించారు. ● ఇదే సమయంలో కర్ణాటకకు చెందిన న్యాయవాది రాజశేఖర్, స్టాఫ్‌నర్సు కృపాలత కిడ్నీల పని తీరు దెబ్బతిని చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. కిడ్నీ దాతల కోసం ఎదురు చూస్తున్న సమయంలో వారికి మధ్యవర్తి పవన్ పరిచయమయ్యాడు. ఆయన ద్వారా వీరు నగరంలోని అలకనంద ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే దాతలు, స్వీకర్తల నుంచి రక్త నమూనాలు సేకరించి పరీక్షించారు. ఇరువురి బ్లడ్ గ్రూప్‌లు మ్యాచ్ అయ్యాయి. సర్జరీకి రూ.55 లక్షల వరకు ఖర్చు అవుతుందని స్పష్టం చేయడం, చెల్లించేందుకు వారు అంగీకరించడంతో గుట్టుగా వారిని నగరానికి తరలించారు. సర్జరీ సమయంలో వైద్యులు తమ ముఖాన్ని ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్‌లు ధరించి జాగ్రత్త పడటం విశేషం. ఇదే బృందం గతంలో విజయవాడ కేంద్రంగానూ పలువురికి కిడ్నీ మార్పిడి చికిత్సలు చేసినట్లు తెలిసింది. సరూర్‌నగర్ పోలీసులు ఆ మేరకు ఓ బృందాన్ని విజయవాడకు పంపినట్లు సమాచారం. అలకనంద ఆస్పత్రి ఎదుట ప్రజాసంఘాల ఆందోళననిందితులను కఠినంగా శిక్షించాలి: ఐఎంఏ సుల్తాన్‌బజార్: అమాయకుల కిడ్నీలను మార్పిడీ చేసే ముఠాలను కఠినంగా శిక్షించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రాష్ట్ర శాఖ అధ్యక్షుడు డాక్టర్ దువ్వూరు ద్వారకానాథరెడ్డి, కార్యదర్శి వి.అశోక్ డిమాండ్ చేశారు. బుధవారం కోఠిలోని ఐఎంఏ రాష్ట్ర కార్యాలయంలో వారు మాట్లాడారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘ టనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూర్ణిమ, పవన్ ఏజెంట్ల ద్వారా నగరానికి రాక భర్త లేని పేద మహిళలకు డబ్బు ఆశ చూపిన వైనం స్వీకర్తల్లో ఒకరు న్యాయవాది, మరొకరు సివిల్ ఇంజినీర్ భార్య గాంధీలో చికిత్స పొందుతున్న దాత, స్వీకర్తలను కలిసిన త్రిసభ్య కమిటీ కొత్తపేట అలకనంద ఆస్పత్రి ఎదుట ప్రజాసంఘాల ఆందోళన -
అక్కడికక్కడే వాహనాన్ని తిప్పేయడంతో...
సాధారణంగా సదరు ఎస్సైని తీసుకురావడానికి, దింపడానికి అధికారిక వాహనాన్ని డ్రైవర్ తీసుకువెళ్తుంటారు. ఆయన ఇంటి వద్దకు చేరుకున్న ప్రతిసారీ డ్రైవర్ కాస్తా ముందుకు వెళ్లి రోడ్డు డెడ్ ఎండ్ వద్ద రివర్స్ చేసుకుని మళ్లీ వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లేవారు. అఫ్జల్‌గంజ్‌లో ఫైరింగ్ జరిగిన గత గురువారం రాత్రి కూడా ఇలానే చేసి ఉంటే... ట్రాలీల్లో ఉన్న డబ్బును బ్యాగుల్లోకి మారుస్తున్న దుండగులపై ఆ వాహనం లైట్లు పడేవి. దీంతో వారు అక్కడే చిక్కే అవకాశం ఉండేది. అయితే ఆ రోజు ఎస్సై కంగారులో ఉండటంతో తాను లోపలకు వెళ్లి ఆయుధం తెచ్చుకునే లోపే... వాహనం వెనక్కు తిప్పి ఉంచాల్సిందిగా డ్రైవర్‌ను ఆదేశించారు. దీంతో సదరు డ్రైవర్ అపార్ట్మెంట్ పక్కన ఉన్న చిన్న సందును ఆధారంగా చేసుకుని, అక్కడే రివర్స్ చేసి సిద్ధంగా ఉంచారు. ఈ కారణంగా ఆ సమీపంలోనే ఉన్న దుండగులపై వీరి దృష్టి పడలేదు. -
వాహనాలు మారుస్తూ పరారీ...
నగదు సర్దుకోవడం పూర్తయిన తర్వాత ట్రాలీ బ్యాగుల్ని అక్కడే వదిలేసి కొంత దూరం వెళ్లిన దుండగులు చెట్ల చాటున తమ దుస్తులు సైతం మార్చుకున్నారు. అక్కడి నుంచి ప్రధాన రహదారి మీదుగా బోయిన్పల్లి వైపు వచ్చి... అక్కడ ఆటో మాట్లాడుకుని శామీర్‌పేట వెళ్లారు. అక్కడి నుంచి షేరింగ్ ఆటోలో గజ్వేల్‌కు, ఆపై లారీలో ఆదిలాబాద్‌కు చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ నుంచి రాష్ట్ర సరిహద్దులు దాటి మహారాష్ట్ర లేదా మధ్యప్రదేశ్ మీదుగా బీహార్‌కు వెళ్లినట్లు దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. తమ ఆచూకీ కనిపెట్టడం కష్టసాధ్యం చేయడానికి దుండగులు వాహనాలు మారినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే నగరంతో పాటు బీదర్‌కు చెందిన పోలీసులు మహారాష్ట్ర, బీహార్‌లకు చేరుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. -
నాంపల్లి చుట్టూ నరకమే!
ఈ పరిసర ప్రాంతాల్లోనే భారీగా ట్రాఫిక్ జాంలు సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నానాటికీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యలు అందరికీ విదితమే. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. రోజుకు 1,500 చొప్పున కొత్తగా వచ్చి చేరుతున్న వాహనాలు, గణనీయంగా పెరిగిపోయిన సెకండ్ హ్యాండ్ మార్కెట్, ఆక్రమణలకు గురవుతున్న రోడ్లు.. వెరసీ.. ‘జాం’జాటాలు తప్పట్లేదు. సిటీలోని ఇతర ప్రాంతాల కంటే నాంపల్లి చుట్టుపక్కల ఉన్న ఏరియాల్లోనే ట్రాఫిక్ జాంలు ఎక్కువగా ఉన్నాయని టామ్ టామ్ సంస్థ తేల్చింది. నెదర్లాండ్స్‌కు చెందిన ఈ టెక్నాలజీ సంస్థ 2024కు సంబంధించి స్లో మూవింగ్ ట్రాఫిక్ ఇండెక్స్ (14వ ఎడిషన్) పేరుతో ఇటీవల ఓ నివేదిక విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 500 నగరాల్లో సర్వే చేయగా..ట్రాఫిక్ జాంలకు సంబంధించి హైదరాబాద్ ప్రపంచంలో 18వ స్థానం, జాతీయ స్థాయిలో నాలుగో స్థానంలో నిలిచింది. 2023 కంటే 2024లో రెండు గంటలు అదనం హైదరాబాద్‌లో రద్దీ వేళల్లో 10 కిమీ ప్రయాణించడానికి 32 నిమిషాల సమయం పడుతోంది. సగటున ఒక్కో హైదరాబాదీ ఏడాదికి 85 గంటల చొప్పున బంపర్ టు బంపర్ ట్రాఫిక్ జామ్‌లో ఉంటున్నాడు. పోలీసులు తీసుకుంటున్న చర్యలతో ఎప్పటికప్పుడు పరిస్థితి మెరుగుపడాల్సి ఉంది. అయితే నగరవాసి మాత్రం 2023లో కంటే 2024 లో రెండు గంటల ఎక్కువ సేపు ట్రాఫిక్ జామ్‌లో గడిపాడని టామ్ టామ్ నిర్ధారించింది. హైటెక్ సిటీ, సాఫ్ట్వేర్ హబ్‌లు ఉన్న వెస్ట్రన్ హైదరాబాద్ కంటే సికింద్రాబాద్, పంజగుట్ట, లక్డీకాపూల్, అమీర్‌పేట, ఖైరతాబాద్ల్లోనే ఎక్కువ ట్రాఫి క్ జామ్స్ ఉన్నట్లు తేల్చింది. వీటితో పాటు నాంపల్లి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ప్రయాణించే వాహనాలకే ట్రావెల్ టైమ్ ఎక్కువ పడుతోందని గుర్తించింది. నాంపల్లి, కోఠి, అబిడ్స్‌తో పాటు అంబర్‌పేట (ఫ్లైఓవర్ నిర్మాణ పనుల వల్ల), చాదర్ఘాట్ల్లో ఇది ఎక్కువని టామ్ టామ్ స్పష్టం చేసింది. ‘రోప్’ చుట్టూ రాజకీయ నేతల క్రీనీడలు.. నగరంలో ఈ పరిస్థితులు మార్చడానికి పోలీసులు అనేక చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి వాటి లో ‘ఆపరేషన్ రోప్’ ఒకటి. దీనిపై ఓట్ బ్యాంక్ రా జకీయాల ప్రభావం, రాజకీయ క్రీనీడలు పడుతున్నాయి. అనేక ప్రాంతాల్లో రహదారి, ఫుట్‌పాత్ ఆక్రమణల్ని తొలగించకుండా స్థానిక నేతలు, ప్రజా ప్రతినిధులు అనునిత్యం అడ్డు తగులుతున్నారు. 10 కి.మీ ప్రయాణానికి ఏకంగా 32 నిమిషాలు నగరంలో సరాసరి వేగం గంటకు 19 కి.మీ టామ్ టామ్ సంస్థ– 2024 సర్వేలో వెల్లడి ఆక్రమణల తొలగింపులో రాజకీయ జోక్యాలు ‘రోప్’తో అయినా రూపుమారుతుందనే ఆశ టామ్ టామ్ నివేదిక ప్రకారం.. నగరంలోని వాహనాల యావరేజ్ స్పీడ్: పీక్ అవర్స్‌లో గంటలకు 17.8 కి.మీ, సాధారణ వేళ ల్లో 19 కి.మీ., సాయంత్రం వేళల్లో 15.6 కి.మీ. పది కి.మీ ప్రయాణించడానికి పట్టే సమయం: పీక్ అవర్స్‌లో 31 నిమిషాల 30 సెకన్లు, రద్దీ వేళ్లలో 33 నిమిషాల 41 సెకన్లు, సాయంత్రం వేళల్లో 33 నిమిషాల 24 సెకన్లు 2024లో మిగిలిన రోజుల కంటే సెప్టెంబర్ 21న వచ్చిన శనివారం రోజు నగర వాసి తీవ్ర ట్రాఫిక్ నరకం చవి చూశాడు. ఆ నెల మొత్తం ట్రాఫిక్ రద్దీ కొనసాగింది. తీవ్రమైన ట్రాఫిక్ జామ్స్ ఉండే ప్రాంతాలు: బేగంపేట, సోమాజిగూడ, పంజాగుట్ట, ఖైరతాబాద్, అమీర్‌పేట, బంజారాహిల్స్, హిమాయత్‌నగర్, మెహిదీపట్నం. -
హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్‌కు సర్వం సిద్ధం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ వేదికగా ఈ నెల 24 నుంచి 26 వరకు జరగనున్న ప్రతిష్టాత్మక ‘హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్’కు సర్వం సిద్ధమైంది. నగరంలోని టీ–హాబ్ (సత్వ నాలెడ్జ్ సిటీ)లో నిర్వహిస్తున్న ఈ సాహితీ పండుగకు భారత్‌తో పాటు విదేశాల నుంచి సాహితీ ప్రియులు, విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ ఫెస్టివల్లో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ప్లీనరీలు ఉంటాయని., మొదటి రోజు ప్లీనరీలో భాగంగా ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్‌దీప్ సర్దేశాయ్తో ఆయన రాసిన 2024: ‘ది ఎలక్షన్ దట్ సర్ప్రైజ్ ఇండియా’ పుస్తకంపై సాహితీ ప్రముఖులు సునీతా రెడ్డి చర్చించనున్నారు. ఈ 15వ ఎడిషన్ ఫెస్టివల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణపై చర్చలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రదర్శనలు, అంతరించిపోతున్న భారతీయ భాషలపై ప్రత్యేక సదస్సులు, కవిత్వానికి సంబంధించి ప్రత్యేకంగా కావ్యధార కార్యక్రమం ఉంటాయన్నారు. మీట్ మై బుక్ పేరుతో పుస్తక ఆవిష్కరణలు, మూవింగ్ ఇమేజెస్ టాకీస్ సినిమా ప్రదర్శనలు, సైన్స్ అండ్ సిటీ సెషన్స్, స్టేజ్ టాక్‌లు, స్టోరీ టెల్లింగ్, వర్క్‌షాప్స్, యంగిస్తాన్ యూత్ ఈవెంట్స్ తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సారి ఫెస్టివల్ ఆతిథ్య దేశంగా లూథియానా, దృష్టి సారించిన భాషగా సింధీ భాషను ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మూడు రోజుల కార్యక్రమాల్లో విభిన్న రంగాలకు చెందిన ప్రముఖులు షబానా అజ్మీ, అరుణా రాయ్, నందితా భవానీ,రీతా కొఠారీ,సునీతా కృష్ణన్, హుమా ఖురేషి, సినీనటుడు సిద్దార్థ్, దర్శకులు విద్యారావ్, సాహిత్య ప్రముఖులు రాజ్ మోహన్ గాంధీ, కల్పన కన్నబిరాన్ తదితరులు పాల్గొననున్నారు. -
కటకట.. ఎక్కడెక్కడ?
తాగునీటి కొరతపై జలమండలి క్షేత్రస్థాయి సర్వే సాక్షి, సిటీబ్యూరో: వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు జలమండలి సిద్ధమవుతోంది. గత వేసవి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పదిహేను రోజులుగా ముందస్తు ప్రణాళికల కోసం క్షేత్రస్థాయి సర్వే నిర్వహించింది. కోర్‌సిటీతో పాటు శివారులోని సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు పర్యటించి పరిస్థితులను అంచనా వేశారు. ఎక్కడ.. ఏ మేరకు నీటి ఎద్దడి ఉంటుందో.. లోప్రెషర్‌తో పాటు ట్యాంకర్ల తాకిడి అధికంగా అవకాశాలుండే ప్రాంతాలను గుర్తించారు. సెక్షన్‌కు ఒక యూనిట్‌గా తీసుకొని సర్వే నివేదికల ఆధారంగా వేసవి కంటే ముందే ఫిబ్రవరి 15 వరకు సమస్య పరిష్కారం దిశగా చర్యలకు ఉపక్రమించేందుకు జలమండలి సిద్ధమవుతోంది. ఆరు డివిజన్ల నుంచి ట్యాంకర్లకు డిమాండ్ నగరంలోని సుమారు ఆరు డివిజన్లలోనే ట్యాంకర్ల డిమాండ్ అధికంగా ఉంటుందని క్షేత్ర స్థాయి సర్వేలో వెల్లడైంది. మొత్తమ్మీద ఇప్పటికే 20 నుంచి 30 సెక్షన్లలో పరిధిలో భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో వేసవిలో ట్యాంకర్ల తాకిడి అధికంగా ఉంటుందని జలమండలి గుర్తించింది. సాధారణంగా మాదాపూర్, జూబ్లీహిల్స్, శేరిలింగంపల్లి, మణికొండ, హయత్‌నగర్, సరూర్‌నగర్, అత్తాపూర్ బంజారాహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, కేపీహెచ్‌బీ, ప్రగతినగర్, నిజాంపేట తదితర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల సరఫరాకు డిమాండ్ అధికంగా ఉండే అవకాశం ఉంటుందని సర్వేలో బహిర్గతమైంది. ఇప్పటికే ప్రగతి నగర్, వైశాలి నగర్, కొండాపూర్ తదితర ప్రాంతాలో ట్యాంకర్ల తాకిడి పెరిగింది. వేసవిలో భారీ స్థాయిలోనే.. ● సాధారణంగా వేసవిలో ట్యాంకర్ల డిమాండ్ భారీ స్థాయిలో ఉంటుంది. సగటున నెలవారీగా బుకింగ్‌ల సంఖ్య 1.50 లక్షల నుంచి 2.45 లక్షల వరకు చేరుతున్నాయి. ఈసారి కూడా అలాంటి సమస్య తలెత్తే ప్రమాదం ఉందని జలమండలి భావిస్తోంది. అవసరమైతే ఫిల్లింగ్ స్టేషన్లను పెంచడంతో పాటు ట్యాంకర్ల డెలివరీల్లో పెండెన్సీ లేకుండా సత్వర సరఫరా జరిగేలా తగిన ఏర్పాట్లకు చేయనుంది. ముఖ్యంగా వెయిటింగ్ పీరియడ్, పెండెన్సీ తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. గతేడాది భూగర్భ జలాలు అడుగంటడంతో ఫిబ్రవరిలో ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. ఏప్రిల్‌లో డిమాండ్ తారస్థాయికి చేరింది. దీంతో బుకింగ్.. సరఫరాకు మధ్య తీవ్ర కాలయాపన జరిగింది. ఈ సారి ఆ సమస్య తలెత్తకుండా.. తగిన ఏర్పాట్లు చేసేందుకు సంసిద్ధమవుతోంది. మరోవైపు గతంలో అధికంగా ట్యాంకర్లు బుక్ చేసిన వినియోగ దారులపై సర్వే నిర్వహించగా.. వారి ప్రాంగణాల్లో బోర్లు, భూగర్భ జలాలు ఎండిపోవడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్లు గుర్తించింది. ● ఉదాహరణకు ప్రస్తుతం తట్టిఖానా సెక్షన్లో 20 ట్యాంకర్లతో దాదాపు 150 ట్రిప్పుల వరకు ట్యాంకర్ల డెలివరీ జరుగుతోంది. ఇదే డిమాండ్ కొనసాగితే ఏప్రిల్ నాటికి రోజూ 400 ట్రిప్పులు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఫిల్లింగ్ స్టేషన్‌లోని ఫిల్లింగ్ పాయింట్స్ నిర్మాణ పద్ధతి వల్ల ఒక ట్యాంకర్ నింపడానికి 15 నిమిషాలు పడుతుంది. ఫిల్లింగ్ సమయాన్ని 5 నిమిషాలకు తగ్గించుకుంటే అనుకున్నదాని కంటే రెట్టింపు ట్రిప్పులు సరఫరా చేయవచ్చని జలమండలి భావిస్తోంది.. దీంతో వెయిటింగ్ పీరియడ్, పెండెన్సీ తగ్గడంతో పాటు నగరవాసులకు సకాలంలో నీరు సరఫరా చేయవచ్చనే భావన జలమండలిలో వ్యక్తమవుతోంది. ఎద్దడి ఉన్న బస్తీల గుర్తింపు లోప్రెషర్ సరఫరాపై స్పష్టత ట్యాంకర్ల తాకిడిపై దృష్టి ముందస్తు ప్రణాళికతో వేసవి నీటి ఎద్దడికి చెక్ -
మొదటికే మోక్షం లేదు!
సాక్షి, సిటీబ్యూరో: ‘చెప్పేవారికి వినేవారు లోకువ’ అనే నానుడి కొన్ని సందర్భాల్లో నిజమేననిపిస్తుంది. ఈ అంశం అందుకు ఉదాహరణగా నిలుస్తోంది. ప్రధాన రహదారుల మార్గాల్లో సమగ్ర రోడ్డు నిర్వహణ పథకం (సీఆర్ఎంపీ) కాంట్రాక్టు ఏజెన్సీల గడువు ముగిసిపోవడంతో తదుపరి చర్యల కోసం జీహెచ్ఎంసీ రోజుకో ఆలోచన చేస్తోంది. రోడ్లన్నీ బాగున్నందున ఇప్పటికిప్పుడు సీఆర్ఎంపీ అవసరం లేదని తొలుత భావించారు. జీహెచ్ఎంసీయే సాధారణ నిర్వహణ, గుంతల పూడ్చివేతల వంటి పనులు నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీఆర్ఎంపీ కింద చేపట్టిన పనులన్నీ పూర్తి కానిదే బిల్లులు చెల్లించవద్దని, అన్ని పనులూ పూర్తయిందీ లేనిదీ నివేదిక పంపాలని ఆదేశించినా పూర్తి చేయని పనులను పట్టించుకోలేదు. ఒప్పందం మేరకు ఫుట్‌పాత్‌లు, స్వీపింగ్, గ్రీనరీ తదితర పనులన్నీ చేయాల్సి ఉన్నా అవి పూర్తి కాలేదు. రీకార్పెటింగ్ తప్ప మిగతా పనులు నూరు శాతం పూర్తయిన దాఖలాల్లేవు. నిర్ణీత వ్యవధిలో పనులు చేయనందుకు ఏమేర పెనాల్టీలు విధించారో తెలియదు. గడువు ముగియ వస్తుండగా మార్కింగ్‌లు వంటివి చేపట్టారు. పూర్తి చేయని పనులేవో వెల్లడించి, పూర్తి చేయించాల్సి ఉండగా, వాటిని పట్టించుకోకుండా ఆర్నెల్ల నిర్వహణకు అని కొత్త టెండర్లు పిలిచారు. రెండు ప్రతిపాదనలు.. తాజాగా స్టాండింగ్ కమిటీ ఆమోదం కోసమంటూ మరో అయిదేళ్లు సీఆర్ఎంపీ రెండో దశకు అంటూ రెండు రకాల ప్రతిపాదనలు ఉంచారు. అందులో ఒకటి దాదాపుగా పాత రోడ్లనే తిరిగి మళ్లీ నిర్వహణకు ఇవ్వడం. రెండోది వాటితో పాటు కొత్త రోడ్లను అదనంగా చేర్చడం. పాత రోడ్లకే అయితే 744 కి.మీ. నిర్వహణకు అంచనా వ్యయం రూ.2491 కోట్లు కాగా, కొత్త రోడ్లు కూడా కలిపి 1142 కి.మీ. నిర్వహణకు రూ.అంచనా వ్యయం రూ.3825 కోట్లు. డీసిల్టింగ్ కూడా.. మొదటి దశలో స్వీపింగ్, ఫుట్‌ఫాత్‌లు, గ్రీనరీ పనులే చేయకపోగా రెండో దశ కింద అవసరమైన ప్రాంతాల్లో వరద కాల్వల నిర్మాణం, ఆధునికీకరణ పనులతో పాటు వాటి నిర్వహణ కూడా చేస్తాయని పేర్కొన్నారు. అంతేకాదు.. ఇప్పటికే ఉన్న వరద కాల్వల నిర్వహణతో పాటు పూడికతీత పనులు కూడా చేస్తాయన్నారు. ప్రత్యేంగా పూడికతీత టెండర్లు పొందిన ఏజెన్సీలే ఆ పనులు సవ్యంగా చేయడం లేదు. గడచిన అయిదేళ్లుగా సీఆర్ఎంపీ ఏజెన్సీలు స్వీపింగ్, ఫుట్‌ఫాత్‌ల పనులే చేయకపోగా కొత్తగా ఎంపికయ్యే ఏజెన్సీలు డీసిల్టింగ్ కూడా చేస్తాయనడం కేవలం అంచనా వ్యయం పెంచేందుకే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు ప్రతిపాదనల్లో ఏదో ఒకటి ఖరారు చేసి అవసరమైన నిధులకు పరిపాలన అనుమతుల కోసం ప్రభుత్వానికి నివేదించాల్సిందిగా గురువారం జరగనున్న స్టాండింగ్ కమిటీ ముందుంచనున్నారు. సీఆర్ఎంపీ మార్గాల్లో పూడిక కూడా తీస్తారట!! ఇప్పటికి గ్రీనరీ, స్వీపింగ్లకే దిక్కూ దివాణంలేదు గడువు ముగిసినవాటి నిర్వహణకు ఆర్నెల్లకు టెండర్లు -
అనైతిక వైద్యం!
అల్లోపతి డాక్టర్లుగా చలామణి అవుతున్న ఆయుర్వేద వైద్యులుసాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలోని పలు ప్రైవేటు ఆస్పత్రులు, రోగనిర్ధారణ కేంద్రాలు అడ్డదారులు తొక్కుతున్నాయి. గుట్టుగా లింగనిర్ధారణ పరీక్షలు చేయడంతో పాటు కనీస అనుభవం, అర్హత లేని వారితో చికిత్సలు చేయిస్తున్నాయి. ఆయుర్వేద వైద్యులు అల్లోపతి వైద్యులుగా చలామణి అవుతూ రోగులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. వనస్థలిపురం, హస్తినాపురం, తుర్కయాంజాల్, మీర్పేట్, బాలాపూర్, తుక్కుగూడ, శంషాబాద్, షాద్‌నగర్, చేవెళ్ల, ఆమనగల్లు కేంద్రంగా యథేచ్ఛగా ఈ దందా కొనసాగిస్తున్నాయి. ఇందుకోసం మార్కెటింగ్ ఏజెంట్లను నియమించుకోవడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే ఆర్ఎంపీలకు కమీషన్లు ఆశ చూపి అనైతిక వైద్యానికి పాల్పడుతున్నాయి. 2024 జులైలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి తొమ్మిది పడకల(జనరల్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగాలు) ఆస్పత్రి కోసం అనుమతి పొందిన కొత్తపేట అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి యాజమాన్యం ఏకంగా కిడ్నీ మార్పిడి చికిత్సలు చేయడం వివాదాస్పదమైంది. మాస్క్‌లు ధరించి, చికిత్సలు.. జిల్లాలో స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ, జనరల్ నర్సింగ్‌హోంలు, సాధారణ క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్స్ కలిపి సుమారు 2,300 వరకు ఉన్నట్లు అంచనా. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుంచి గుర్తింపు పొందినట్లు చెప్పుకొంటున్న మెజార్టీ ఆస్పత్రులకు ఫైర్ సేఫ్టీ లేదు. ఒకరి పేరుతో అనుమతి పొంది.. మరొకరితో చికిత్సలు చేయిస్తున్నారు. బోర్డుపై పేర్లు కనిపించే వైద్యులెవరూ ఇక్కడ అందుబాటులో ఉండటం లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా ఆస్పత్రికి వస్తే కాంపౌండర్లు, స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులే సీనియర్ వైద్యులుగా చలామణి అవుతున్నారు. రోగులు, వారి బంధువులు గుర్తించకుండా ముఖానికి మాస్క్‌లు ధరించి, సీనియర్ వైద్యుల ప్రిస్కిప్షన్ లెటర్లపై టెస్టులు, మందులు, ఇంజక్షన్లు రాస్తున్నారు. వనస్థలిపురం కాంప్లెక్స్ కేంద్రంగా పని చేస్తున్న ఓ ఆస్పత్రి ఏకంగా డిఫార్మసీ పూర్తి చేసిన ఇద్దరు వ్యక్తులతో పని చేస్తుండటం గమనార్హం. తుక్కుగూడ కేంద్రంగా పని చేస్తున్న ఓ డయాగ్నోస్టిక్ కేంద్రం ఏకంగా కడుపులో ఉన్నది ఆడ బిడ్డా.. మగ శిశువా చెప్పేస్తోంది. ఆర్ఎంపీలు, ఆశ వర్కర్లకు డబ్బుల ఆశచూపి, పెద్ద మొత్తంలో దోచుచుకోవడంతో పాటు చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారు. తనిఖీల పేరుతో వసూళ్లు.. పారదర్శకంగా పని చేయాల్సిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తనిఖీల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. ఆస్పత్రి గుర్తింపు కోసం రూ.లక్ష కుపైగా, అదే రెన్యూవల్ కోసం రూ.50 వేలకుపైగా వసూలు చేస్తున్నారు. అడిగినంత ఇస్తే సరి ఫైర్ సేఫ్టీ, భవన నిర్మాణ అనుమతి, డాక్టర్ సర్టిఫికెట్లతో పని లేకుండానే అనుమతులు ఇచ్చేస్తున్నారు. నిరాకరించిన వాళ్లకు చుక్కలు చూపిస్తున్నట్ల ఆరోపణలు ఉన్నాయి. తరచూ సర్జరీలు వికటిస్తున్నా.. అనేక రోగులు మృత్యువాతపడుతున్నా.. పట్టించుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యులు జిల్లాలోని పలు క్లినిక్‌లలో తనిఖీలు చేశారు. అర్హత లేని వైద్యులను గుర్తించి నోటీసులు జారీ చేశారు. ఆయా ఆస్పత్రులను సీజ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినా జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా కొత్తపేట అలకనంద ఆస్పత్రి ఘటనతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. అనుమతులు లేకుండా అడ్డగోలుగా క్లినిక్‌ల ఏర్పాటు యథేచ్ఛగా లింగనిర్ధారణ పరీక్షలు మీర్పేట్, బడంగ్పేట్, తుర్కయాంజాల్, తుక్కుగూడ కేంద్రంగా దందా అలకనంద ఆస్పత్రి ఉదంతంతోజిల్లా వైద్యశాఖ అప్రమత్తం -
మ్యాన్‌హోల్.. క్లీనింగ్ రోబో
మద్రాస్ ఐఐటీ రూపొందించిన ‘హోమ్సెప్ సీవర్’ కంటోన్మెంట్: సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఇకపై మ్యాన్‌హోళ్ల క్లీనింగ్‌ను రోబో సాయంతోనే చేయనున్నారు. ఐఐటీ మద్రాస్ సౌజన్యంతో రూపొందించిన ‘హోమ్సెప్ సీవర్’ రోబో ద్వారా మ్యాన్‌హోల్స్ క్లీనింగ్‌కు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఐఐటీ మద్రాస్‌కు చెందిన సోలినాస్ ఇంటెగ్రిటీ ప్రైవేట్ లిమిటెడ్, వెల్స్ ఫార్గో సంస్థలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద రూ.60 లక్షల విలువైన ఈ రోబోను సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు ఉచితంగా అందజేశారు. కంటోన్మెంట్ అధ్యక్షుడు బ్రిగేడియర్ ఎన్వీ నంజుండేశ్వర.. సీఈఓ మధుకర్ నాయక్, బోర్డు సభ్యుడు రామకృష్ణలతో కలిసి బుధవారం ప్రారంభించారు. అనంతరం సోలినాస్ సంస్థ ప్రతినిధులు ఈ రోబో పని తీరును కంటోన్మెంట్ సిబ్బందికి వివరించారు. కార్యక్రమంలో కంటోన్మెంట్ సూపరింటెండెంట్లు రాజ్‌కుమార్, దేవేందర్, మహేందర్, ఇంజినీర్లు పి. సావన్ కుమార్, సోలినాస్ సంస్థకు చెందిన నితీష్, విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకతలు ఇవీ.. ● వీల్స్, టైర్లతో కూడిన ఈ రోబోను సీవరేజీ వాహనాలకు అనుసంధానం చేసి మ్యాన్‌హోల్స్ ఉన్న ప్రాంతాలకు సులభంగా తీసుకెళ్లవచ్చు. ● బ్లేడ్, బకెట్ సక్షన్లతో కూడిన ఈ రోబో తానే స్వయంగా మ్యాన్‌హోల్ మూతలను తొలగించి అందులోకి ప్రవేశిస్తుంది. ● క్విక్ బ్లేడ్ బకెట్ సిస్టమ్, రొటేటింగ్ మోటార్లు, స్లయిడింగ్ యాక్చువేటర్స్ ద్వారా మ్యాన్‌హోల్ లోపల సులభంగా ప్రయాణిస్తుంది. ● జీపీఎస్ ఎనేబుల్డ్ సిస్టమ్ ద్వారా మ్యాన్‌హోల్ లోపల ఎంత లోతుకు, దూరం వెళ్లింది తెలుసుకోవచ్చు. ● ఈ రోబోలో మ్తొతం 4 ఇన్ఫ్రారెడ్ కెమెరాలు ఉన్నాయి. ఇందులో మూడు నైట్ విజన్‌తో పనిచేస్తాయి. 170 డిగ్రీల కోణంలో ఫొటోలు, వీడియోలు తీస్తాయి. మరొకటి అండర్ వాటర్ కెమెరా. ● రోబో కెమెరాల్లో నిక్షిప్తం చేసిన ఫొటోలు, వీడియోలను హై రిజల్యూషన్ కలిగిన డిస్ప్లే ద్వారా గమనించవచ్చు. ఆయా కెమెరాల్లో నిక్షిప్తమైన ఫుటేజీని నెల రోజుల వరకు స్టోర్ చేసుకునే వెసులుబాటు ఉంది. ● రిమోట్ కంట్రోల్ ద్వారా పనిచేసే రోబో మ్యాన్‌హోల్‌లోని చెత్తను సేకరించి, దానికి అనుసంధానం చేసిన స్టోరేజ్ బిన్లలోకి మారుస్తుంది. ● ఈ రోబోలో మరో ప్రత్యేకత ఏమిటంటే మ్యాన్‌హోల్ లోపల ఉన్న విషవాయువులను గుర్తిస్తుంది. మిథేన్, కార్బన్ మోనాకై ్సడ్, హైడ్రోజన్ సల్ఫైడ్, అమోనియా, నైట్రోజన్ డయాకై ్సడ్, ఈథెన్ వంటి వాయువుల గుర్తించడంతో పాటు గాఢతను సైతం బయట ఉన్న ఎల్సీడీ డిస్ప్లేలో చూపిస్తుంది. ● పెట్రోల్‌తో నడిచే ఈ రోబో నిరంతరాయంగా 8 గంటల పాటు పనిచేస్తుంది. సీఎస్ఆర్ కింద కంటోన్మెంట్‌కు అందజేత ప్రారంభించిన బోర్డు అధికారులు రాష్ట్రంలోనే ఇది తొలి రోబో.. దీని విలువ రూ.60 లక్షలు -
పద్మారావును పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు
బన్సీలాల్‌పేట్: సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్‌ను బుధవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సహా పలువురు నేతలు పరామర్శించారు. ఈ నెల 18న డెహ్రాడూన్ వెళ్లిన పద్మారావు మరుసటి రోజు గుండెపోటుకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆయన గుండెకు స్టెంట్ వేశారు. చికిత్స అనంతరం ఆయన మంగళవారం రాత్రి నగరానికి చేరుకున్నారు. మోండా మార్కెట్ డివిజన్ టకారబస్తీలోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న పద్మారావును బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పువ్వాడ అజయ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నాయకులు దానోజు శ్రావణ్, సలీమ్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు పరామర్శించారు. -
ఈతకు వెళ్లి బాలుడి మృతి
జగద్గిరిగుట్ట: కోనేరులో ఈతకు వెళ్లి గుర్తు తెలియని బాలుడు మృతి చెందిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మహాదేవపురం గుట్టపై ఉన్న శివాలయం కోనేరులో ఓ బాలుడు పడినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డీఆర్ఎఫ్ బృందంతో కలిసి గాలింపు చేపట్టారు. బుధవారం కోనేరులో నుంచి బాలుడి మృతదేహాన్ని వెలికి తీశారు. మిగతా ఇద్దరు ఎవరు?ఎక్కడ? పోలీసులు సంఘటనా స్థలంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా సదరు బాలుడితో పాటు మరో ఇద్దరు బాలలు కోనేరు వరకు వచ్చినట్లు గుర్తించారు. అనంతరం ముగ్గురూ ఈత కొట్టేందుకు కొలనులోకి దిగారని, ఈ తర్వాత ఓబాలుడు మునిగిపోతుండగా మిగతా ఇద్దరూ కేకలు వేశారని, స్థానికులు అక్కడికి చేరుకునేలోగా వారు ఇద్దరూ అక్కడినుంచి పారిపోయినట్లు ఆలయంలో పనిచేసే సబిత అనే మహిళ తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
రోడ్డును మింగేశారు..
బంజారాహిల్స్: ఇంటి ముందు ఖాళీ స్థలం కనిపిస్తే కాస్తా ముందుకు జరగడం పరిపాటి. అయితే తమ ఇళ్ల ముందు ఉన్న రోడ్డునే దిగమింగేసి ఎన్నో ఏళ్లుగా ఏమీ జరగనట్లు నటిస్తున్న వైనం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం కృషి చేయాల్సిన జీహెచ్ఎంసీ అధికారులు తమ కళ్ల ముందే ఆక్రమణలు జరుగుతున్నా పట్టించుకోకపోవడం గమనార్హం. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్–36 పోలీస్ స్టేషన్ వెనుక రెండు రోజుల క్రితం నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ స్వయంగా వెళ్లి సుమారు 1300 గజాల జీహెచ్ఎంసీ స్థలం ఆక్రమణకు గురైనట్లు గుర్తించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ చేపట్టాలని మేయర్ ఆదేశాలతో మరిన్ని అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. జూబ్లీహిల్స్ సొసైటీకి చెందిన లేఅవుట్లో రోడ్డునెంబర్–19 నుంచి 21 వైపు ఎల్ ఆకారంలో సుమారు 40 అడుగుల వెడల్పుతో సుమారు 550 అడుగుల పొడవు గల లింక్ రోడ్డు ఉన్నట్లు స్పష్టంగా మ్యాపుల్లో కనిపిస్తుంది. దీనిలో కొంతభాగం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వెనుక ఖాళీగా ఉంది. సదరు ఖాళీ స్థలంలో పోలీస్ స్టేషన్ పరిదిలో సీజ్ చేసిన వాహనాలను పార్క్ చేస్తున్నారు. దీంతో పాటు ప్లాట్‌నెంబర్ 457, 456, 455, 454,, 453 ప్లాట్ల వెనుక నుంచి రూట్స్ కాలేజ్ పక్క వరకూ లింక్ రోడ్డు ఉండేది. కాగా ప్లాట్ నెంబర్ 457 వెనుక ఉన్న సుమారు 1250 గజాల స్థలాన్ని సదరు ఇంటి యజమాని దర్జాగా ఆక్రమించుకుని భారీ ప్రహరీ నిర్మించాడు. తన ఇంటికి చెందిన ప్రహరీ నుంచి రోడ్డు స్థలాన్ని మొత్తం కూరగాయల తోటగా మార్చేశారు. ఇది బయట నుంచి పార్కు స్థలంగా కనిపించేలా కొన్నాళ్ల పాటు జీహెచ్ఎంసీ బోర్డు సైతం పెట్టాడు. ఎవరికీ అనుమానం రాకుండా రెండేళ్లుగా ఈ స్థలాన్ని ఆక్రమించడంతో పాటు ఏకంగా కూరగాయల తోటనే ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ స్థలం పక్క నుంచి ఉన్న రోడ్డు స్థలాన్ని సైతం మరి కొందరు భవన నిర్మాణ దారులు దర్జాగా ఆక్రమించుకున్నట్లు తాజాగా వెల్లడైంది. ప్లాట్ నెంబర్ 471, 472, 473, 474లతో పాటు 453 ప్లాట్ల యజమానులు సుమారు 1500 గజాల రోడ్డు స్థలాన్ని కబ్జా చేసినట్లు అధికారులు గుర్తించారు. బహిరంగ మార్కెట్లో ఈ స్థలం విలువ సుమారు రూ.60 కోట్లు పైగానే ఉంటుందని తెలుస్తోంది. మేయర్ పర్యటన అనంతరం ప్లాట్‌నెంబర్ 457 వెనుక కబ్జాకు గురైన 1250 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకుని ప్రహరీలను కూల్చివేసిన జీహెచ్ఎంసీ అధికారులు మిగిలిన 1500 గజాల స్థలాన్ని కూడా ఆక్రమణల భారీ నుంచి కాపాడేందుకు చర్యలు చేపట్టారు. కదులుతున్న ఆక్రమణల డొంక.. మేయర్ పర్యటనతో మరిన్ని కబ్జాలు వెలుగులోకి అధికారులపాత్రపై అనుమానాలు.. అధికారుల తీరుపై అనుమానాలు..? ఇదిలా ఉండగా నగర మేయర్ వచ్చి చూసే దాకా ఇంత ఖరీదైన స్థలాలు ఆక్రమణకు గురవుతుంటే స్థానిక టౌన్‌ప్లానింగ్, యూబీడీ, జీహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలుతలెత్తుతున్నాయి. పేదలు బతుకుదెరువు కోసం రోడ్డు పక్కన చిన్న డబ్బా పెట్టుకున్నా గద్దల్లా వాలిపోయే టౌన్‌ప్లానింగ్, హైడ్రా సిబ్బంది నగరలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఏకంగా రూ.100 కోట్ల విలువైన రోడ్డు స్థలాన్ని బడాబాబులు దర్జాగా ఆక్రమించుకుంటే ఏం చేస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గతంలోనే ఈ ఆక్రమణలపై సొసైటీ పెద్దలు సైతం జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినా స్థానిక టౌన్‌ప్లానింగ్ అధికారులు పట్టించుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ స్థలాన్ని ఇప్పటికై నా కాపాడి ప్రజలకు ఉపయోగపడేలా వినియోగించాలని కాలనీవాసులు కోరుతున్నారు. -
ప్ర‘పంచ’ సౌరభాలు!
సాక్షి, సిటీబ్యూరో: భాగ్యనగరికి చారిత్రక భవనాల మణిహారం దక్కింది. మూసీ నది పరిసర ప్రాంతాల్లోని అయిదు చారిత్రక భవనాలు ప్రపంచ స్మారక నిధి (వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్–డబ్ల్యూఎంఎఫ్)– 2025లో చోటు దక్కించుకున్నాయి. హైకోర్టు, సిటీ లైబ్రరీ, ఉస్మానియా ఆస్పత్రి, సిటీ కాలేజీ, బ్రిటిష్ రెసిడెన్సీ భవనాలకు ఈ గుర్తింపు దక్కడం గర్వకారణం. న్యూయార్క్ కేంద్రంగా పని చేస్తున్న లాభాపేక్షలేని సంస్థ డబ్ల్యూఎంఎఫ్ తాజా జాబితాను విడుదల చేసింది. నీటి సంక్షోభం, వాతావరణ మార్పుల కారణంగా ఆయా చారిత్రక భవనాలు ముప్పును ఎదుర్కొంటున్నాయని తెలిపింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం మూసీ నదీ పునరుజ్జీవానికి సంకల్పించిన నేపథ్యంలో డబ్ల్యూఎంఎఫ్లో చోటు దక్కడం ప్రాధాన్యం సంతరించుకుంది. గుర్తింపుతో ప్రయోజనమేమిటి? ప్రపంచవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ నామినేషన్లు రాగా.. హైదరాబాద్ నుంచి అయిదు చారిత్రక భవనాలు ఎంపికయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకం, సంఘర్షణ, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటున్న వారసత్వ, చారిత్రక భవనాలు, ప్రదేశాలను డబ్ల్యూఎంఎఫ్ గుర్తిస్తుంది. ఆయా కట్టడాలను సంరక్షించి, పునరుద్ధరిస్తే భావి తరాలకు అమూల్యమైన ఆస్తులుగా నిలపడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. పర్యావరణ క్షీణత, నిర్లక్ష్యం, ఆక్రమణలు, పట్టణ విస్తరణ కారణంగా ఆయా నిర్మాణాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రపంచ దృష్టికి తీసుకురావడమే ప్రధానోద్దేశం. విరాళాలు, నిధుల సమీకరణతో పాటు ప్రభుత్వ, ప్రజల భాగస్వామ్యంతో ఆయా వారసత్వ కట్టడాల పునరుద్ధరణ చేపడుతుంది. సిటీ కళాశాల: 1865లో ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ మదర్సా దార్–ఉల్–ఉలూమ్ పేరుతో మొదట సిటీ స్కూల్‌ను ప్రారంభించారు. తర్వాత ఏడో నిజాం ఉస్మాన్ అలీఖాన్ దీన్ని సిటీ హైస్కూల్‌గా మార్చారు. ఈ పాఠశాలనే 1921లో ప్రస్తుతం ఉన్న భవనంలోకి మార్చి, 1929లో సిటీ కాలేజీగా నామకరణం చేశారు. 16 ఎకరాల్లో ఉన్న ఈ భవనాన్ని ఇండో–సార్సెనిక్ శైలిలో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ విన్సెంట్ ఎస్చ్ నిర్మించారు. మూసీ పరిసర భవనాలకు ‘స్మారక’ గుర్తింపు నగరంలోని 5 చారిత్రక కట్టడాలకు డబ్ల్యూఎంఎఫ్ జాబితాలో చోటు హైకోర్టు, సిటీ లైబ్రరీ, ఉస్మానియా ఆస్పత్రి, సిటీ కాలేజీ, బ్రిటిష్ రెసిడెన్సీ నీటి సంక్షోభం, వాతావరణ మార్పులతో నిర్మాణాలకు ముప్పు పర్యావరణ పరిరక్షణ, భవనాలకు పునరుజ్జీవం అత్యవసరం వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్– 2025 నివేదిక విడుదల హైకోర్టు: ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అప్పటి హైదరాబాద్ దక్కన్ సంస్థానానికి హైదరాబాద్ హైకోర్టును స్థాపించారు. తర్వాత 1956 నవంబర్ 5న రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం దీన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా మార్చారు. ఏపీ విభజన సమయంలో 2018 డిసెంబర్ 26న భారత రాష్ట్రపతి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్‌లోని హైకోర్టును విభజిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మూసీ నది దక్షిణ ఒడ్డున ఉన్న హైకోర్టు భవనాన్ని ఎరుపు, తెలుపు రాళ్లతో సార్సెనిక్ శైలిలో నిర్మించారు. జైపూర్‌కు చెందిన శంకర్‌లాల్ హైకోర్టు నిర్మాణానికి ప్లాన్ రూపొందించగా.. స్థానిక ఇంజినీర్ మెహర్ అలీ ఫాజిల్ డిజైన్ చేశారు. 1915 ఏప్రిల్ 15న నిర్మాణ పనులు ప్రారంభం కాగా.. 1919 మార్చి 31న పూర్తయింది. 1920 ఏప్రిల్ 20న హైకోర్టు భవనాన్ని ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రారంభించారు. ఉస్మానియా ఆస్పత్రి: దేశంలోని పురాతన ఆస్పత్రుల్లో ఒకటి అఫ్జల్‌గంజ్‌లోని ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (ఓజీహెచ్). 1919లో హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ దీన్ని స్థాపించారు. రూ.2 కోట్ల వ్యయంతో బ్రిటిష్ ఆర్కిటెక్ట్ విన్సెంట్ జెరోమ్ ఎస్చ్, నవాబ్ ఖాన్ బహదూర్ మీర్జా అక్బర్ బేగ్‌లు ఇండో సార్సెనిక్ శైలిలో ఈ ఆస్పత్రిని నిర్మించారు. బ్రిటిష్ రెసిడెన్సీ: జేమ్స్ అకిలెస్ కిర్క్ పాట్రిక్ నిర్మించిన సంపన్న భవనమే బ్రిటిష్ రెసిడెన్సీ. కిర్క్ పాట్రిక్ 1798–1805 మధ్యకాలంలో హైదరాబాద్‌లో బ్రిటిష్ నివాసి. ప్రస్తుతం కోఠి మహిళా యూనివర్సిటీలోని భాగమే ఈ బ్రిటిష్ రెసిడెన్సీ. దీన్ని మ్యూజియంగా మార్చారు. ఈ భవనం ఒకప్పుడు హైదరాబాద్ నిజాం కోర్టుకు ఈస్ట్ ఇండియా కంపెనీ రాయభార కార్యాలయంగా ఉండేది. ఈ భవనం పల్లాడియన్ శైలిలో ఉంది. సెంట్రల్ లైబ్రరీ: 1891లో స్కాలర్ మౌల్వి సయ్యద్ హుస్సేన్ బిల్గ్రామి తన వ్యక్తిగత గ్రంథాలయంగా అబిడ్స్‌లో ప్రస్తుతం ఉన్న జనరల్ పోస్ట్ ఆఫీసు స్థలంలో దీన్ని ఏర్పాటు చేశారు. తర్వాత అసఫ్ జాహీ రాజవంశం గౌరవార్థం అసఫియా స్టేట్ లైబ్రరీగా పేరు మార్చారు. 1932లో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ అఫ్జల్‌గంజ్‌లో 2.97 ఎకరాల స్థలంలో రూ.5 లక్షల వ్యయంతో లైబ్రరీని నిర్మించారు. అప్పట్లో దీన్ని కుతుబ్ ఖానా అసఫియా అని పిలిచేవారు. ఇందులో 5 లక్షలకు పైగా పుస్తకాలు, మేగజైన్లు, అరుదైన తాళపత్ర గ్రంథాలున్నాయి. -
గుడిమల్కాపూర్ మార్కెట్‌కు సరికొత్త హంగులు
గోల్కొండ: గుడిమల్కాపూర్ వ్యవసాయ మార్కెట్‌కు సరికొత్త హంగులు చేకూర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ అన్నారు. శుక్రవారం గుడిమల్కాపూర్‌లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. గుడిమల్కాపూర్ మార్కెట్ చైర్మన్‌గా తలారి మల్లేష్ ముదిరాజ్ నియమితులు కావడం రైతులకు మేలు చేకూర్చే విషయమన్నారు. మార్కెట్ కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు ఎంతో అవసరమని స్పష్టం చేశారు. అంతేకాకుండా రాత్రి పూట వచ్చే రైతుల కోసం విశ్రాంత గదులు ఏర్పాటు చేయాలని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్‌గౌడ్ మాట్లాడుతూ.. కమీషన్ ఏజెంట్లు, మెండేదారులు రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని సూచించారు. మార్కెట్ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ.. చేవెళ్ల, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో 50 ఎకరాల భూమి సేకరించి గుడిమల్కాపూర్ మార్కెట్‌ను అక్కడికి తరలిస్తే మార్కెట్ మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. రైతులకూ దూరభారం తగ్గుతుందన్నారు. మార్కెట్ అభివృద్ధికి, రైతుల ప్రయోజనాల కాపాడేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకరయ్య, కాలె యాదయ్య, కౌసర్ మోహియుద్దీన్, మహ్మద్ మాజీద్ హుస్సేన్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, మండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్, మార్కెట్ కమిటీ కార్యదర్శి శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఫిరోజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మార్కెట్ కమిటీ పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం -
సరి చేయకుంటే.. సమస్యలెన్నో!
రేషన్ కార్డుల సర్వేలో పారదర్శకత పాటించాలి సాక్షి, సిటీబ్యూరో: రేషన్ కార్డుల జారీ కోసం ఇంటింటి సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మెహిదీపట్నం మండలం విజయనగర్ కాలనీ, హుమాయున్ నగర్ కాలనీలో ఇంటింటి సర్వేను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సర్వేలో తప్పులు లేకుండా బాధ్యతతో నిర్వహించాలని సూచించారు. అర్హులను ఎవరినీ మిస్ చేయవద్దని, రిమార్కులు సరిగా రాయాలన్నారు. కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి రమేష్ ఉన్నారు. సాక్షి, సిటీబ్యూరో: అఫ్జల్‌గంజ్‌లోని రోషన్ ట్రావెల్స్ వద్ద గురువారం రాత్రి చోటుచేసుకున్న కాల్పుల ఉదంతం పోలీసు విభాగంలో ఉన్న కొన్ని లోపాలు ఎత్తి చూపింది. వీటిని సరి చేయకుంటే భవిష్యత్‌లో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేస్తోంది. మొదటి సమస్య సీసీ కెమెరాలది కాగా... రెండోది ‘ఫ్రెండ్లీ’ పేరుతో ఆయుధాలకు దూరమైన పోలీసులకు సంబంధించింది. నేరగాళ్లు నానాటికీ అప్‌గ్రేడ్ అవుతూ, ఆధునిక ఆయుధాలను సమకూర్చుకుంటున్న ప్రస్తుత రోజుల్లో పోలీసు విభాగంలో ఉన్న లోపాలు సరి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ‘నేత్రాల’తో ఫలితం అంతంతే.. ఏ వేదికపై అవకాశం దొరికినా అధికారుల నుంచి నేతల వరకు అంతా రాజధానిలో ఉన్న సీసీ కెమెరాల అంశాన్ని ఊదరగొడతారు. లక్షల్లో కెమెరాలు ఉన్నాయని, ప్రపంచంలో ఆ స్థానం ఆక్రమించాం... దేశంలో ఈ స్థానంలో ఉన్నాం అంటూ గొప్పలు చెబుతుంటారు. వాస్తవ పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయి. 2015 నుంచి రాష్ట్రంలో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ జోరందుకుంది. వివిధ స్కీంల కింద కొన్నేళ్ల క్రితం నగరంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో ప్రస్తుతం అనేకం పని చేయట్లేదు. మరోపక్క పని చేస్తున్న కెమెరాలు సైతం నాసిరకంగా ఉన్నాయి. ఈ కారణంగానే రాత్రి వేళల్లో, లైట్ల వెలుతురులో వాహనాల నంబర్లను ఇవి గుర్తించలేకపోతున్నాయి. ఈ కారణంగానే అఫ్జల్‌గంజ్ నుంచి సికింద్రాబాద్‌కు దుండగుల్ని తీసుకువెళ్లిన ఆటోను గుర్తించడానికి పోలీసులు దాదాపు పది గంటలు శ్రమించాల్సి వచ్చింది. ఈలోపు దుండగులు నగరం నుంచి ఉడాయించారు. ఆ సాంకేతికత ఉన్నట్లా.. లేనట్టా? బంజారాహిల్స్ రోడ్ నెం.12 రూ.వందల కోట్ల ప్రజాధనం వెచ్చించి తెలంగాణ స్టేట్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మించారు. ఈ అద్దాల భవనం ప్రతిపాదన, శంకుస్థాపన, ప్రారంభోత్సవాల సమయంలో అత్యాధునిక టెక్నాలజీకి కేరాఫ్ అడ్రస్ అంటూ ప్రచారం చేశారు. నగరంలోకి అడుగుపెట్టిన నేరగాళ్లు నేరం చేయకముందే చిక్కుతారని, ఓ వాహనం ఏ సమయంలో, ఏ ప్రాంతంలో, ఎన్నిసార్లు తిరిగిందో కేవలం కొన్ని నిమిషాల్లోనే కనిపెట్టేస్తామని.. ఇలాంటి అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువస్తున్నామని చెప్పారు. సీన్ కట్ చేస్తే.. ‘అఫ్జల్‌గంజ్ ఆటో’ను కనిపెట్టడానికి దాదాపు పది గంటల సమయం పట్టింది. ఈ ఏడాది సీసీ కెమెరాలకు మరమ్మతులు, కొత్త కెమెరాల ఏర్పాటు, అనుసంధానానికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు అధికారులు గతంలో ప్రకటించారు. దీంతో పాటు టెక్నాలజీ అంశాన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయుధం ఉంటే ‘ఫ్రెండ్’ కాదా? నగర పోలీసులే కాదు... రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని విభాగాలు కొన్నేళ్లుగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ముసుగు వేసుకుని పని చేస్తున్నారు. ఓపక్క జరగాల్సిన దారుణాలన్నీ జరిగిపోతున్నా... తాము మాత్రం ప్రజలతో సత్సంబంధాల కోసం స్నేహపూర్వక పోలీసింగ్ చేస్తున్నామని అంటున్నారు. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే పోలీసులు ఎవరూ తమ వద్ద తుపాకులు ఉంచుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. అందరి వద్దా ఉన్న ఆయుధాలను హఠాత్తుగా దాచేశారు. ఇప్పుడు శాంతిభద్రతల విభాగం మాట అటుంచితే.. చివరకు టాస్క్‌ఫోర్స్ బృందాల వద్దా అవసరమైన ఆధాయుధాలు ఉండట్లేదు. ఓపక్క సిటీలో గన్ కల్చర్ పెరుగుతుండటం, మరోపక్క గతంలో ‘సూర్యాపేట’, తాజాగా ‘అఫ్జల్‌గంజ్’ ఉదంతాల నేపథ్యంలో కనీసం ప్రత్యేక బలగాలైనా ఆయుధాలు ధరించకపోతే ప్రజల మాట అటుంచి పోలీసులకే రక్షణ లేకుండాపోయే ప్రమాదం కనిపిస్తోంది. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఉన్న వాటిలోనూ నాణ్యత లేని ఫీడ్ రికార్డు ‘ఫ్రెండ్లీ’ పేరుతో తుపాకులకూ దూరంగా.. మారకపోతే భవిష్యత్‌లో పెను సవాళ్లే ఎంజీబీఎస్ మార్గం దుండగులు ఈ మార్గం నుంచే ఆటోలో రోషన్ ట్రావెల్స్ వద్దకు వచ్చారుహక్కులకు విలువ ఇచ్చే దేశాల్లోనూ.. ప్రజలు ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులతో స్నేహపూర్వకంగా ఉండటానికి, మానవ హక్కులకు భంగం కలగకూడదనే ఆయుధాలను దూరంగా ఉంచుతున్నామని కొందరు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఇక్కడ వీళ్లు గమనించాల్సిన కీలకాంశం ఏమిటంటే... అనేక పాశ్చాత్య దేశాల్లో మానవ హక్కులు, నిబంధనలు, మానవ జీవితాలకు ఎంతో విలువ ఇస్తారు. అలాంటి చోట్ల కూడా క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే పోలీసులు తమ వెంట కచ్చితంగా ఆయుధాలు ఉంచుకుంటారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులతో పాటు స్వీయరక్షణ కోసమూ తుపాకులు వినియోగిస్తుంటారు. ఆయా దేశాల్లో సత్వర న్యాయం, కఠిన చట్టాలు అమలులో ఉన్నా పోలీసులు తుపాకులతో తిరుగుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు దూరంగా ఉంచారన్నది అంతుచిక్కని విషయమే. ఈ లోపాలను ఉన్నతాధికారులు వీలైనంత త్వరగా సరి చేసుకోకుంటే భవిష్యత్‌లో పెను సవాళ్లు ఉత్పన్నమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
కొత్త రేషన్ కార్డులు కొందరికే!
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి పంపిణీ చేయనున్న కొత్త రేషన్ కార్డులు కొందరికే అందనున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే కోసం ఇటీవల నిర్వహించిన ఇంటింటి (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల) సర్వే వివరాల ఆధారంగా రేషన్ కార్డుల్లేని కుటుంబాలు గ్రేటర్ పరిధిలో 83,285 మాత్రమే ఉన్నట్లు అధికారులు లెక్కలు తీశారు. ఆ లెక్క మేరకే క్షేత్రస్థాయి సర్వే జరుపుతున్నారు. క్షేత్రస్థాయిలోనూ అర్హులుగా గుర్తించిన వారికే కొత్త రేషన్ కార్డులివ్వనున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించేది 83 వేల దరఖాస్తులే.. పాతబస్తీలో ఎక్కువ ఇంటింటి సర్వే మేరకు పాతబస్తీలోనే రేషన్‌కార్డుల్లేని కుటుంబాలు అధికంగా ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోని ఆరు జోన్లలో చార్మినార్ జోన్లో, 30 సర్కిళ్లలో కార్వాన్ సర్కిల్లో అత్యధికంగా ఉన్నాయి. సమగ్ర కుటుంబ సర్వే వివరాలతోనే.. ‘ప్రజాపాలన’లో అర్జీ పెట్టుకున్న 5.43 లక్షల కుటుంబాలకు నిరాశేనా? ఇదీ షెడ్యూలు.. ఈ నెల 16 నుంచి 20 వరకు క్షేత్రస్థాయి సర్వే 21 నుంచి 24 వరకు వార్డు సభల్లో లబ్ధిదారుల వివరాల వెల్లడి 21 నుంచి 25 వరకు అర్హుల డేటా ఎంట్రీ 26 (రిపబ్లిక్ డే) నుంచి రేషన్ కార్డుల జారీ జోన్ల వారీగా ఇలా.. జోన్ సర్వే జరగనున్న కుటుంబాలు ఎల్బీనగర్ 11,528 చార్మినార్ 21,257 ఖైరతాబాద్ 14,967 శేరిలింగంపల్లి 8,520 కూకట్పల్లి 12,580 సికింద్రాబాద్ 12,959 కంటోన్మెంట్ 1,474 మొత్తం 83,285 సర్కిళ్ల వారీగా అత్యధికంగా కార్వాన్ సర్కిల్లో 7,254 కుటుంబాలు, ఆ తర్వాత చాంద్రాయణగుట్టలో 6,275 కుటుంబాలున్నాయి. అత్యల్పంగా అల్వాల్ సర్కిల్లో 1,047 కుటుంబాలున్నాయి. ఎదురు చూస్తున్న వారెందరో? నిజానికి గ్రేటర్ పరిధిలోని నాలుగు జిల్లాల పరిధిలో దాదాపు పది లక్షల మంది రేషన్ కార్డుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. గత సంవత్సరం ఆరు గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణకు నిర్వహించిన ‘ప్రజాపాలన’ కార్యక్రమాల్లో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు కూడా దాదాపు 5.43 లక్షలున్నారు. మిగతావారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోలేదు. ఇంటింటి సర్వే సైతం నూరు శాతం జరగలేదు. కొందరు సర్వేను వ్యతిరేకించారు. వారిలో రేషన్‌కార్డుల్లేని వారికి సైతం ఇప్పుడు అవి అందే పరిస్థితి లేకుండాపోయింది. కుటుంబ సర్వే మేరకు రేషన్‌కార్డుల్లేని కుటుంబాలను పరిశీలించి వారికి మాత్రమే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పాత మార్గదర్శకాలే 2014లో అప్పటి ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు ఇటీవల జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రేషన్‌కార్డులు లేనివారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, వాటిని కూడా పరిశీలించి కార్డులు జారీ చేస్తామన్నారు. అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కానీ.. ప్రజాపాలనలో అందిన దరఖాస్తులను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో అంతుచిక్కడంలేదు. – క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం అర్హుల జాబితాను వార్డుసభలో వెల్లడించి చర్చించాకే ఆమోదిస్తారని ప్రభుత్వం పేర్కొంది. అలా ఎంపికై న వారి జాబితాను జీహెచ్ఎంసీ పరిధిలో కమిషనర్ లాగిన్‌కు పంపుతారు. వాటిని పరిశీలించి కమిషనర్ పౌరసరఫాల శాఖ కమిషనర్ లాగిన్‌కు పంపుతారు. పరిశీలించి కొత్త కార్డులు జారీ చేస్తారు. అర్హత కలిగిన వ్యక్తి పేరు ఒక్క రేషన్‌కార్డులో మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఒకే వ్యక్తి పేరు ఒకటికి మించి కార్డుల్లో ఉండటానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సభ్యుల చేర్పులు, తొలగింపులు సైతం చేయనున్నట్లు పేర్కొంది. -
ఎగ్జిబిషన్ సందర్శకులకు అందుబాటులో వైద్య సేవలు
అబిడ్స్: ఎగ్జిబిషన్ సొసైటీ ఏటా నుమాయిష్‌లో సందర్శకులకు ఉచితంగా వైద్య సేవలు అందించడం అభినందనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాత్రి ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన హెల్త్‌సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ...... ఈ కేంద్రంలో ఉచితంగా పలు సేవలు అందిస్తున్నారన్నారు. ఏటా వేలాది మంది సందర్శకులకు వైద్య కేంద్రం ఉపయోగపడుతుందన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఎగ్జిబిషన్ హెల్త్ సెంటర్లో వైద్య సేవలతో పాటు వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారన్నారు. కార్యక్రమంలో యశోధ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ లింగయ్య, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షులు నిరంజన్, కార్యదర్శి సురేందర్‌రెడ్డి, సీనియర్ సభ్యులు డాక్టర్ వంశీ తిలక్, ఎగ్జిబిషన్ సొసైటీ హెల్త్ సెంటర్ కన్వినర్ డాక్టర్ సంజీవ్‌కుమార్, అడ్వైజర్ డాక్టర్ జి.శ్రీనివాస్, జాయింట్ కన్వినర్ డాక్టర్ వెంకటప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
హెచ్ఎండీఏ భూసేకరణ షురూ
సాక్షి, సిటీబ్యూరో: భూముల అమ్మకాల ద్వారా గతంలో పెద్ద ఎత్తున ఆదాయాన్ని ఆర్జించిన హెచ్ఎండీఏ మరోసారి అదే తరహాలో భూ వేలానికి రంగం సిద్ధం చేసింది. అబ్దుల్లాపూర్‌మెట్, తిమ్మాయిగూడ ప్రాంతంలో సుమారు 156.02 ఎకరాల భూమి సేకరణకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో రైతుల నుంచి భూములను సేకరించి భారీ లేఅవుట్లను అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. అదేవిధంగా అబ్దుల్లాపూర్‌మెట్‌లోనూ భారీ లేఅవుట్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు. రైతుల నుంచి సేకరించనున్న భూములపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా 30 రోజుల్లో తెలియజేయాలని తాజా నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. గతంలో హెచ్ఎండీఏ భూములతో పాటు, రైతుల నుంచి సేకరించిన భూముల్లోనూ లే అవుట్లను వేసి ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా విక్రయించారు. బుద్వేల్, కోకాపేట్, మోకిలా, బాచుపల్లి, ఉప్పల్ భగాయత్, బోడుప్పల్, తొర్రూర్, హయత్‌నగర్, తదితర ప్రాంతాల్లో ఆన్లైన్ బిడ్డింగ్‌కు కొనుగోలుదార్ల నుంచి అనూహ్య స్పందన లభించిది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు భూసేకరణ ముందుకు సాగలేదు. పైగా ఆన్లైన్ బిడ్డింగ్పైన కూడా అధికారులు వెనుకంజ వేశారు. రియల్ఎస్టేట్ రంగంలో నెలకొన్న స్తబ్దత దృష్ట్యా భూముల వేలం ప్రతిపాదనను విరమించుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో సేకరణకు చర్యలు చేపట్టడం గమనార్హం. రైతుల నుంచి సేకరించనున్న భూముల్లో రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ, తదితర మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసి రైతులకు 60 శాతం భూములను తిరిగి ఇవ్వనున్నారు.మిగతా 40 శాతం భూములను హెచ్ఎండీఏ విక్రయించనుంది. అబ్దుల్లాపూర్‌మెట్ అనంతరం దశలవారీగా మిగతా ప్రాంతాల్లోనూ భూముల అభివృద్ధికి చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. అబ్దుల్లాపూర్‌మెట్‌లో 156.02 ఎకరాలకు నోటిఫికేషన్ భారీ లేఅవుట్‌కు సన్నాహాలు గతంలో ఆన్లైన్ బిడ్డింగ్ ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం -
షేక్‌పేట్ ఆకాశ్ ఇనిస్టిట్యూట్‌లో అగ్ని ప్రమాదం
గోల్కొండ: షేక్‌పేట్, డ్యిక్స్ ఎవెన్యూ భవనంలో కొనసాగుతున్న ఆకాశ్ ఇనిస్టిట్యూట్‌లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రత్యక్ష సాక్షులు, అగ్నిమాపక సిబ్బంది కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. శుక్రవారం తెల్లవారు జామున ఇనిస్టిట్యూట్ కిటికీల్లో నుంచి దట్టమైన పొగలు రావడాన్ని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులు, ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లిహిల్స్, మాదాపూర్, లంగర్‌హౌస్ ఫైర్ స్టేషన్లకు చెందిన అగ్నిమాపక యంత్రాలు మంటలను అదుపులోకి తెచ్చాయి. అప్పటికే గ్రౌండ్ ఫ్లోర్లో కొనసాగుతున్న రిలయన్స్ ట్రెండ్స్‌లోకి కూడా మంటలు వ్యాపించాయి. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ భవనం లోనుంచి మంటలు రావడంతో ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో ఆకాశ్ ఇనిస్టిట్యూట్‌లోని ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిబూడిదయ్యాయి. -
గ్లోబల్ టెండర్లకు స్పందన కరువు!
సాక్షి, సిటీబ్యూరో: కొత్తగా నిర్మించతలపెట్టిన ఇండోర్/ అవుట్ డోర్ సబ్స్టేషన్ల టెండర్ల కేటాయింపు ప్రక్రియను పాత పద్ధతిలోనే చేపట్టాలని డిస్కం నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ మాస్టర్ ప్లాన్ విభాగం హైదరాబాద్, రంగారెడ్డి జోన్ల పరిధిలో సుమారు రూ.175 కోట్ల అంచనాతో నిర్మించతలపెట్టిన 35 కొత్త సబ్స్టేషన్లకు నవంబర్ 28న గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. నిజానికి టెండర్ దాఖలు గడువు డిసె ంబర్ 20తో ముగిసింది. టెండర్ వేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గడువును జనవరి 23 వరకు పొడిగించారు. ఇప్పటికే రెండు సార్లు గడువు పెంచినా బడా కాంట్రాక్ట్ సంస్థల నుంచి ఆశించిన స్పందన లభించక పోవడంతో యాజమాన్యం పునరాలోచనలో పడినట్లు తెలిసింది. పాత పద్ధతిలోనే కాంట్రాక్టులు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. డివిజన్, సర్కిళ్ల వారీగా పనులను విభజించి టెండర్లు పిలవాలని భావిస్తున్నట్లు తెలిసింది. అనుభవం, ఆసక్తిని బట్టి ఒక్కో కాంట్రాక్టర్‌కు ఒకటి లేదా రెండు సబ్స్టేషన్లు అప్పగించి, నిర్మాణ పనులను వేగవంతం చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. సబ్స్టేషన్ల నిర్మాణానికి గ్లోబల్ టెండర్లను ఆహ్వానించడం ద్వారా పని లో నాణ్యత లభిస్తుందని ప్రభుత్వం ఆశించింది. పాత పద్ధతిలోనే కొత్త విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం చేపట్టే యోచన -
అంతర్రాష్ట్ర డ్రగ్స్ సరఫరా ముఠా అరెస్ట్
అల్వాల్: మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి భారీగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాచకొండ కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమిషనర్ జి.సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. రాజస్థాన్ రాష్ట్రం, జోధ్‌పూర్‌కు చెందిన మహేష్ నేరేడ్మెట్ ప్రాంతంలో ఉంటూ చెందిన గ్యాస్ రిపేరీ పనులు చేసేవాడు. అతడికి జోధ్‌పూర్‌కు చెందిన డ్రగ్స్ వ్యాపారి షంసుద్ధీన్తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో అతను ఈ నెల 10న రూ. లక్ష చెల్లించి 200 గ్రాముల హెరాయిన్ కొనుగోలు చేసి రైలులో నగరానికి తీసుకొని వచ్చాడు. సరుకును ఆర్‌కెపురంలోని తన స్నేహితుడు మహిపాల్ నివాసంలో దాచిన అతను స్నేహితుల ద్వారా తెలిసిన వారికి విక్రయిస్తున్నాడు. వినియోగదారుల నుంచి ఫోన్ పే ద్వారా డబ్బులు తీసుకుని ర్యాపిడో తదితర యాప్‌ల ద్వారా సరఫరా చేస్తున్నాడు. దీనిపై సమాచారం అందడంతో ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు, నేరేడ్మెట్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 190 గ్రాముల హెరాయిన్, ఒక బైక్, రెండు మొబైల్ ఫోన్లు, ఒక సిమ్‌కార్డు, తూకం వేసే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
సినిమా ఛాన్స్ ఇప్పిస్తానని..
బంజారాహిల్స్: సినిమా ఛాన్స్ ఇప్పిస్తానని ఓ మహిళను హోటల్‌కు పిలిచి లైంగిక దాడికి పాల్పడిన సహాయ దర్శకుడిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు..ఏపీకి చెందిన మహిళ ( 32) భర్తతో విడిపోయి నగరానికి వలస వచ్చింది. మణికొండలో ఉంటూ హౌస్ కీపింగ్ పని చేసేది. 15 రోజుల క్రితం ఆమె అమీర్‌పేట్‌లోని ఓ హాస్టల్ లో చేరింది. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్‌గా పని చేసేందుకు కృష్ణానగర్ ప్రాంతంలో తెలిసిన వారిని వాకబు చేస్తుండగా సినిమాల్లో డైరెక్షన్ విభాగంలో పనిచేస్తున్న కాటేకొండ రాజుతో పరిచయం ఏర్పడింది. మూడు రోజుల క్రితం అతను ఆడిషన్స్ ఉన్నాయంటూ కృష్ణానగర్‌లోని హెవెన్ హోటల్‌కు ఆమెను పిలిపించాడు. మొదటి రోజు ఫొటోషూట్ చేసి మర్నాడు రావాలని చెప్పాడు. రెండో రోజు గదికి వెళ్లగా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలు శుక్రవారం ఉదయం జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ● మహిళపై లైంగికదాడి ● సహాయ దర్శకుడిపై కేసు నమోదు -
ఏసీబీ వలలో అవినీతి అధికారులు
కల్యాణ లక్ష్మి చెక్కు కోసం రూ.10 వేలు డిమాండ్.. హస్తినాపురం: కల్యాణలక్ష్మి చెక్కు మంజూరు చేసేందుకు డబ్బులు డిమాండ్ చేసిన నల్లగొండ జిల్లా, డిండి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్యామ్ నాయక్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అధికారుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. డిండీ మండలం, పడమటి తండాకు చెందిన పాండునాయక్ ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవల అతను తన కుమార్తె పెళ్లికి సంబందించి కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అతను ఆర్ఐ శ్యాంనాయక్‌ను కలిసి కల్యాణ లక్ష్మి నిధులు మంజూరు చేయించాలని కోరాడు. అయితే అందుకు ఆర్ఐ రూ. 10 వేలు డిమాండ్ చేశాడు. ఒప్పందం ప్రకారం రూ.5 వేలు అడ్వాన్స్‌గా ఇచ్చాడు. మిగతా మొత్తం ఇస్తేనే చెక్కు మంజూరు చేయిస్తానని ఆర్ఐ చెప్పడంతో అతను నల్లగొండ జిల్లా, ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. నల్లగొండ ఏసీబీ డీఎస్పీ జగదీష్‌చందర్ సూచన మేరకు పాండునాయక్ శుక్రవారం హస్తినాపురం, ఊర్మిళానగర్‌లోని ఆర్ఐ శ్యాంనాయక్ ఇంట్లో అతడికి నగదు అందజేస్తుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు అతని ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. తనిఖీలకు సంబందించిన వివరాలు వెల్లడించేందుకు డీఎస్పీ నిరాకరించారు. ఒకే రోజు ఇద్దరు ఉద్యోగుల పట్టివేత ఏసీబీ అధికారులు శుక్రవారం ఒకే రోజు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు కల్యాణ లక్ష్మి చెక్కు మంజూరు చేసేందుకు రూ. 10 డిమాండ్ చేసి పట్టుబడగా, మరొకరు రిటైర్ ఉద్యోగి బెనిఫిట్స్ అందజేసేందుకు రూ. 17 డిమాండ్ చేసి ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. వివరాల్లోకి వెళితే.. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించేందుకు రూ.17 వేలు వసూలు సుల్తాన్‌బజార్: రూ. 3 వేలు లంచం తీసుకుంటూ కోఠి ఈఎన్టీ ఆసుపత్రి సీనియర్ అసిస్టెంట్ ఆర్.సంతోష్ తివారీ ఏసీబీకి పట్టుబడ్డాడు. పదవీ విరమణ పొందిన ఓ ఉద్యోగి బెన్ఫిట్స్ కోసం సంతోష్ తివారి రూ.20 వేలు డిమాండ్ చేశాడు. రూ.17 వేలకు ఒప్పందం కుదుర్చుకున్న అతను శుక్రవారం రూ.3 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడు సంతోష్ తివారిని అరెస్ట్ చేసి నాంపల్లి ప్రత్యేక కోర్టులో హాజరు పరిచారు. -
చిన్నారుల పరిరక్షణే ధ్యేయంగా
చిన్నారుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలి ● పిల్లల హక్కులు, చట్టాల పరిరక్షణకు పటిష్ట చర్యలు ● స్ట్రీట్ వెండర్స్ పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి ● నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలు ● జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సాక్షి,సిటీబ్యూరో: జిల్లాలో బాల్యం నుంచి పక్కదారి పట్టిన పిల్లలను ఆపరేషన్ స్మైల్‌లో గుర్తించి వారి పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. వారి తల్లిదండ్రులకు హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి ‘కన్వర్జెన్స్ ఆన్ ఆపరేషన్ స్మైల్ గీఐ’ సమావేశంలో అయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పిల్లల హక్కులు, చట్టాలపై నిరంతరం అవగాహన కల్పిస్తూ పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో భిక్షాటన చేస్తున్న పిల్లలు, బాల కార్మికులు, వీధి బాలలకు విద్య అందించడంతో పాటు వారి సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. వారి పరిస్థితి ఇలా మారడానికి కారణాలేమిటో పరిశీలించాలని సూచించారు. హాట్ స్పాట్ ఏరియాల్లో గస్తీ ఏర్పాటు చేసి రోడ్లపైకి వచ్చే పిల్లలను గుర్తించాలని, వారి ఆధార్, ఇతర డాక్యుమెంట్లు సేకరించాలన్నారు. బాల్య వివాహాలను అరికట్టాలని, 14 నుంచి 18 ఏళ్ల లోపు బాల కార్మికులను రక్షించి సంబంధిత యాజమాన్యాలపై కేసులు నమోదు చేసి, పిల్లలకు నష్టపరిహారం అందించాలని ఆదేశించారు. జిల్లాను 28 జోన్లుగా విభజించి ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాల ద్వారా పిల్లల రక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. స్ట్రీట్ వెండర్లు తమ పిల్లలతో వ్యాపారం చేయించడం నేరమని, ఇందులో భాగంగా వారి తల్లిదండ్రులతో బాలల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నందున పనుల్లో ఉన్న పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్య, ఆహారం అందించాలని సూచించారు. సమావేశంలో సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ శైలజ, డీసీపీ లావణ్య, ఐసీడీఎస్ పీడీ అక్కేశ్వరరావు, జిల్లా కార్మిక శాఖ అధికారి జాన్సన్, ఆర్డీవో రామకృష్ణ, తహసీల్దార్లు, పోలీస్ అధికారులు, అనుబంధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
ఎక్కడైనా అంతే.. ఆరోగ్యం గల్లంతే!
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో చిన్న హోటళ్లలోనే కాదు, బడా స్టార్ హోటళ్లలోనూ ప్రజలకు వడ్డించే ఆహారంపై గ్యారంటీ లేదు. ఇటీవలి కాలంలో రాష్ట్ర ఫుడ్‌సేఫ్టీ విభాగం నిర్వహించిన తనిఖీల్లో ఎంతో పేరెన్నికగన్న ఫైవ్‌స్టార్ హోటళ్లలోనూ వంటగదుల బండారం బట్టబయలైంది. నిల్వ ఉంచిన ఆహారం, కనీస జాగ్రత్తలు లేకపోవడం కూడా వెలుగు చూడటం తెలిసిందే. హైదరాబాద్ బిర్యానీతో పాటు ఇతరత్రా ఆహారాలకు ఎంతో పేరున్నప్పటికీ, ఫుడ్ సేఫ్టీ లేకపోవడం కూడా అదే స్థాయిలో ఉంది. అందుకే ఫుడ్ సేఫ్టీఅండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) దేశవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ర్యాంకుల్లోనూ తెలంగాణకు దక్కింది అధమ స్థానమే. అయినా నగరంలో హోటల్ నిర్వాహకుల తీరు మారలేదు. మిగతా ప్రాంతాల్లో ఎలా ఉన్నప్పటికీ, ప్రభుత్వరంగ సంస్థల్లోని హోటళ్లలో ఆహారం కల్తీ కాదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటారని చాలామంది భావిస్తారు. కానీ.. అది కూడా నిజం కాదని, అన్ని హోటళ్ల మాదిరిగానే అక్కడా ప్రజారోగ్యంపై శ్రద్ధ లేదని వెల్లడైంది. నీళ్లు నమిలిన మేనేజర్లు.. నగరంలోని ప్రజాభవన్‌కు సమీపంలోనే ఉన్న టూరిజం కార్పొరేషన్‌కు చెందిన ప్లాజాలోని ‘మినర్వా’లోని పప్పు కర్రీలో ఓ వినియోగదారుకు బొద్దింక కనిపించింది. దీంతో హతాశుడైన అతను ఇదేమని మేనేజర్లను ప్రశ్నిస్తే.. నీళ్లు నమిలారు. పొరపాటైందని అన్నారు. మీరు తరచూ వస్తుంటారుగా సార్.. ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా కాలేదుగా అన్నారు. తనకు ఎదురైన అనుభవాన్ని పేర్కొంటూ.. వీడియోలు సహా అతను సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం వైరల్‌గా మారింది. ఇలాంటి ఆహార వడ్డనతో ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం జరుగుతుందని, తనిఖీలు నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రెగ్యులర్ తనిఖీలు నిర్వహించాలన్నారు. ఫిర్యాదు అందగానే జీహెచ్ఎంసీ అధికారులు మినర్వాలో తనిఖీలు చేసి శాంపిల్స్ సేకరించారు. లోపాలు వెలుగులోకి వస్తున్నా.. నగరంలో కొంత కాలంగా ఎక్కడ తనిఖీలు నిర్వహించినా ప్రమాణాలు పాటించకపోవడం, ఫుడ్‌సేఫ్టీ లేకపోవడం బట్టబయలవుతూనే ఉన్నాయి. అయినా.. ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. లోపాలు వెల్లడవుతున్నప్పటికీ, నిర్వాహకులపై తగిన చర్యలు లేకపోవడం వల్లే పరిస్థితిలో మార్పు రావడం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. టూరిజం ప్లాజాలో గదులు దొరకడం అందరికీ సాధ్యం కాదు. వాటికి ఎంతో డిమాండ్ ఉంది. దేశ, విదేశీ పర్యాటకులెందరో విడిది చేసే టూరిజం ప్లాజాలోని హోటల్లోనే పరిస్థితి ఇలా ఉండటాన్ని చూసి ప్రజలు బయట ఎక్కడ తినాలన్నా భయపడాల్సి వస్తోంది. పప్పులో కనిపిస్తున్న బొద్దింకప్రైవేట్ హోటళ్లే కాదు.. ప్రభుత్వ సంస్థల్లోనూ అదే తీరు టూరిజం ప్లాజాలోని ‘మినర్వా’ ఆహారంలో బొద్దింక వినియోగదారుడి ఫిర్యాదుతో వెలుగు చూసిన ఘటన -
విద్యకు మొదటి ప్రాధాన్యం
మంత్రి సీతక్క చైతన్యపురి: రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపునకు తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యమిస్తోందని మంత్రి సీతక్క అన్నారు. గురువారం కొత్తపేటలోని సరూర్‌నగర్ సంక్షేమ గురుకులాల కళాశాలలో సంక్షేమ గురుకుల విద్యాలయాలు, డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్ శిక్షణ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. గురుకులాల్లో ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు. విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని ఆమె చెప్పారు. తోటమాలి మొక్కలను ఎలా జాగ్రత్తగా సంరక్షిస్తారో అదే రకంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని పండిట్ జవహర్ లాల్ చెప్పేవారని గుర్తు చేశారు. తరగతి గదిలోనే దేశ భవిష్యత్ నిర్మితమవుతుందని, ఆ భవిష్యత్ టీచర్లు, ప్రిన్సిపాల్స్ చేతుల్లో ఉంటుందన్నారు. టీచర్లు నిత్య విద్యార్థుల్లా ఉండాలని సూచించారు. తాను హాస్టల్లో ఉండి చదుకువున్నానని, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం, పీహెచ్డీ చేసి ఇప్పుడు మరో పీజీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. హాస్టల్ జీవితం ఆనందదాయకంగా ఉండాలని, అందించే ఆహారం సొంత కుటుంబాన్ని గుర్తు చేసుకునేలా ఉండాలని మంత్రి సీతక్క సూచించారు. -
ట్రాఫిక్ సెన్స్ ఎంతో అవసరం
అబిడ్స్: ట్రాఫిక్ అవగాహన, ట్రాఫిక్ సెన్స్ వాహనదారులకు మెండుగా ఉంటే ఎలాంటి ప్రమాదాలు జరగవని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. గురువారం సాయంత్రం నుమాయిష్‌లో పోలీస్ స్టాల్‌ను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో సీపీ మాట్లాడుతూ.. నుమాయిష్ ద్వారా వచ్చే ఆదాయంతో విద్యారంగ వ్యాప్తికి నిర్వాహకులు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. తన చిన్నప్పటి నుంచి నుమాయిష్‌ను సందర్శించి ఎంతో ఉల్లాసంగా గడిపేవాడినని జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. నగర ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ విశ్వప్రసాద్ మాట్లాడుతూ..... చిన్నప్పటి నుంచే విద్యార్థులకు ట్రాఫిక్ పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఈ సందర్శంగా చుక్ చుక్ రైల్లో సీపీ సీవీ ఆనంద్‌తో పాటు ఇతర పోలీసు ఉన్నతాధికారులు, ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతినిధులు ప్రయాణించారు. కార్యక్రమంలో డీసీపీలు రాహుల్ హెగ్డే, వెంకటేశ్వర్లు, కవిత, అశోక్‌కుమార్, డీసీపీ రామ్‌దాస్ తేజ, ఏసీపీలు చంద్రశేఖర్, ధనలక్ష్మి, ఇన్స్పెక్టర్లు విజయ్‌కుమార్, బాలాజీ, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు నిరంజన్, కార్యదర్శి సురేందర్ రెడ్డి, ప్రతినిధులు ఆర్.సుకేష్ రెడ్డి, హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు. నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నుమాయిష్‌లో పోలీస్ స్టాల్ ప్రారంభం -
కలర్.. కమాల్!
వాహన అద్దాల ‘రంగు’ ముదురుతోంది!! సాక్షి, సిటీబ్యూరో: ‘కార్లు ఇతర వాహనాల అద్దాలపై రంగు ఫిల్మ్‌లు తదితరాలు ఉండకూడదు. ఆయా వాహనాల్లోని లోపలి భాగం స్పష్టంగా బయటికి కనిపించేలా ఉండాలి’ అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గతంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలివి. వీటి అమలు నగరంలో క్రమక్రమంగా మసకబారుతోంది. అనేక వాహనాల అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వేసుకుని సంచరిస్తున్నా పోలీసుల చర్యలు మాత్రం నామమాత్రంగా మారాయి. 70.. 50 శాతం కాంతి ప్రసారం కచ్చితం.. వాహనాల్లో జరుగుతున్న నేరాలు, ప్రమాదాలు ఎక్కువవుతున్న నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం 2012లో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని అమలు చేయాల్సిన బాధ్యతను రాష్ట్రాల డీజీపీలు, కమిషనరేట్ల కమిషనర్ల ద్వారా ఆయా ట్రాఫిక్ విభాగాలకు అప్పగించింది. న్యాయస్థానం ఆదేశాల ప్రకారం వాహనాల ముందు వెనుక అద్దాలు 70 శాతం, పక్క తలుపులకు ఉన్న అద్దాలు 50 శాతం కాంతి ప్రసారకాలుగా (విజువల్ లైట్ ట్రాన్స్మిషన్) ఉండాల్సిందే. ప్రస్తుతం అనేక వాహనాలకు ఇది కేవలం 30, 10 శాతంగానే ఉంటోంది. ఫిల్మ్‌లతో పాటు ఇతర ఏ విధమైనవీ అద్దాలపై నిర్ణీత ప్రమాణాలకు మించి ఉండకూడదు. కార్లను తయారు చేసే కంపెనీలు కచ్చితమైన ప్రమాణాలతో అద్దాలను రూపొందిస్తాయి. వీటినే కొనసాగిస్తే ఉత్తమమని రవాణా రంగ నిపుణులు చెబుతున్నారు. అయితే.. అనేక మంది ఆ అద్దాలపై ఫిల్మ్‌లు వేసుకుంటున్నట్లు వివరిస్తున్నారు. ఆ రెండు కేటగిరీలకే మినహాయింపు.. బ్లాక్ ఫిల్మ్‌తో కూడిన అద్దాల వాహనాలు వినియోగిస్తున్న వారిలో సామాన్యులే కాదు.. రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు సైతం ఉంటున్నారు. సెలబ్రెటీలు కూడా తమకు పబ్లిక్ ప్లేసుల్లో అభిమానులతో అనవసర ఇబ్బందులు వస్తాయనే సాకుతో వినియోగిస్తున్నారు. ప్రజాప్రతినిధులైతే ఏకంగా భద్రతా కారణాలు చెబుతున్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం బ్లాక్ ఫిల్మ్ నిబంధన నుంచి కేవలం జెడ్, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉండే అత్యంత ప్రముఖులకు మాత్రమే మినహాయింపు ఉంది. అదీ కేవలం అధీకృత వాహనాలు, భద్రతాపరమైన అంశాల్లో మాత్రమే. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో అత్యున్నత అధికారుల వాహనాలకు సైతం ఫిల్మ్ లేని అద్దాలతో కూడిన వాహనాలనే వినియోగించాల్సి ఉంది. మినహాయింపు పొందటం ప్రహసనమే... ఓ ప్రముఖుడు లేదా వ్యక్తికి భద్రత కల్పించాలన్నా, గన్మెన్లను ఏర్పాటు చేయాలన్నా దానికి సెక్యూరిటీ రివ్యూ కమిటీ (ఎస్సార్సీ) సిఫార్సులు తప్పనిసరి. అలాగే ఈ బ్లాక్ ఫిల్మ్ నిబంధన నుంచి జెడ్, జెడ్ ప్లస్ కేటగిరీల్లో ఉన్న వారు కాకుండా ఇతరులు మినహాయింపు పొందాలంటే దానికి పెద్ద ప్రహసనమే ఉంది. రాష్ట్ర స్థాయిలో హోమ్ సెక్రటరీ నేతృత్వంలో డీజీపీ తదితరులతో ఏర్పాటయ్యే అత్యున్నత స్థాయి ప్రత్యేక కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. ఈ కమిటీ దరఖాస్తుతో పాటు దరఖాస్తుదారుడి పూర్వాపరాలను పరిశీలించి, వివిధ కోణాల్లో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కమిటీ కేవలం భద్రతాపరమైన అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని మినహాయింపులు ఇవ్వాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ‘సుప్రీం’ తీర్పులో ప్రస్తావన లేనందున వాహనాల వెనుక, పక్క అద్దాలకు లోప లి వైపు నుంచి కర్టెన్లు వేసుకుంటే ఎలాంటి అభ్యంతరం ఉండదని అధికారులు చెబుతున్నారు.లోపలి భాగం స్పష్టంగా కనిపించకుండా ఏర్పాటు సుప్రీం కోర్టు ఆదేశాలూ బేఖాతర్ సామాన్యులతో పాటు ప్రజాప్రతినిధులదీ ఇదే పంథా నామమాత్రంగా చర్యలు తీసుకుంటున్న పోలీసులు అప్పట్లో పక్కాగా అమలు.. ప్రస్తుతం నగర పోలీసు కమిషనర్‌గా ఉన్న సీవీ ఆనంద్ గతంలో సిటీ ట్రాఫిక్ విభాగం చీఫ్‌గా వ్యవహరించారు. అప్పట్లోనే సుప్రీం కోర్టు తీర్పు కూడా రావడంతో పక్కాగా అమలు చేశారు. ఉల్లంఘనులకు జరిమానాలు విధించడానికి ముందు కొన్ని రోజుల పాటు ప్రచారం చేశారు. ఆపై ప్రత్యేక డ్రైవ్స్ ప్రారంభించారు. మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 100 కింద తొలుత రూ.500 చొప్పున, ఆపై రూ.వెయ్యి చొప్పున జరిమానాలు విధించారు. సుప్రీం కోర్టు ఆదేశాలు దేశ వ్యాప్తంగా అందరికీ శిరోధార్యం కావడంతో జిల్లాల నుంచి నగరానికి వచ్చే వాహనాలకూ వర్తింపజేశారు. కొన్ని ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఫిల్మ్‌లు కలిగి ఉన్న వాహనాలను ఆపి, రోడ్లపైనే తొలగించారు. వాహనాల అద్దాలపై ఉన్న ఫిల్మ్ పరిమాణాన్ని కొలవడానికి టిల్టో మీటర్ల కూడా వినియోగించారు. ఫిల్మ్ వినియోగం వద్దని మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలంటూ సాధారణ పరిపాలన శాఖ, పోలీసు వాహనాలకు సంబంధించి పోలీసు రవాణా విభాగం, కమిషనరేట్లలోని సంబంధిత విభాగాలు, హైకోర్టు రిజిస్ట్రార్లతో పాటు అన్ని విభాగాల అధిపతులకు (హెచ్ఓడీ) లేఖలు సైతం రాశారు. -
ట్రేడ్ లైసెన్స్ లేకుంటే 100 శాతం పెనాల్టీ
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేసేవారికి లైసెన్స్ ఫీజుతో పాటు 100 శాతం పెనాల్టీ విధించనున్నట్లు అధికారులు హెచ్చరించారు. లైసెన్స్ పొందేంత వరకు నెలకు 10 శాతం ఫైన్ కూడా అదనంగా విధించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు కమిషనర్ ఇలంబర్తి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటికే ట్రేడ్ లైసెన్సులున్న వారు పెనాల్టీలు లేకుండా ఉండేందుకు ఈ నెలలోగా రెన్యువల్ చేసుకోవాలని సూచించారు. లేని పక్షంలో ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు 25 శాతం పెనాల్టీ, ఏప్రిల్ 1 నుంచి 50 శాతం పెనాల్టీ పడుతుందని పేర్కొన్నారు. పెనాల్టీలు పడకుండా ఉండేందుకు మీసేవ కేంద్రాలు, జీహెచ్ఎంసీ పౌరసేవ కేంద్రల్లో సంప్రదించి రెన్యువల్ చేయించుకోవచ్చని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు లైసెన్సులు పొందనివారు ఆన్లైన్ ద్వారా కానీ.. మీసేవ కేంద్రాల ద్వారా కానీ తాజాగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు జీహెచ్ఎంసీ వెబ్‌సైట్‌ను (www. ghmc.gov.in) చూడాలని ఇలంబర్తి సూచించారు. -
రా‘బంధు’లెవరో?
సాక్షి, సిటీబ్యూరో: అసెంబ్లీ ఎన్నికలకు ముందు మంజూరు చేసిన బీసీ, మైనారిటీ బంధు యూనిట్లపై అధికార యంత్రాంగం ఆరా తీస్తోంది. వంద శాతం సబ్సిడీతో రూ. లక్షల విలువైన యూనిట్లను మంజూరు చేసింది. అప్పట్లో లబ్ధిదారుల ఎంపిక నుంచి చెక్కుల పంపిణీ వరకు వ్యవహారమంతా స్థానిక ఎమ్మెల్యే కనుసన్నల్లోనే సాగింది. తాజాగా సంక్షేమ శాఖల నుంచి లబ్ధిదారులు ఫోన్ల తాకిడి పెరిగింది. ‘యూనిట్ల పరిశీలనకు వస్తున్నాం.. షాపు చిరునామా చెప్పండి’ అంటూ ఫోన్లు వస్తుండటంతో లబ్ధిదారులు ఆందోళనకు గురవుతున్నారు. వాస్తవంగా బీసీ, మైనారిటీ బంధు కింద రూ.లక్ష లబ్ధి పొందిన వారిలో సగానికిపైగా యూనిట్లను నెలకొల్పనట్లు తెలుస్తోంది. రుణ మంజూరుకు సిఫారసులు చేసిన వారికి కొంత ముట్టజెప్పి మిగితాది తమ అవసరాలకు ఖర్చు చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా యూనిట్లపై విచారణ ప్రారంభం కావడంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. గ్రేటర్లో 7,200 యూనిట్లు.. గ్రేటర్ పరిధిలో సుమారు 7,200 యూనిట్లు మంజూరైనట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో బీసీ బంధు కింద మొదటి విడతగా నియోజకవర్గానికి 300 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వృత్తి, చిరు వ్యాపారాల కోసం రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించారు. వాస్తవంగా గ్రేటర్ పరిధిలో సుమారు 65 వేల మందికి పైగా చేతి, కులవృత్తిదారులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో హైదరాబాద్ జిల్లా పరిధిలో 20,724, మేడ్చల్‌లో 22 వేల 87 మంది, రంగారెడ్డి జిల్లాలో సుమారు 20 వేలకుపైగా దరఖాస్తులు అందినట్లు బీసీ సంక్షేమ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. మొదటి విడత పంపిణీ తర్వాత రెండో విడతలో మిగిలిన అర్హులైన వారికి అందిస్తామని ప్రకటించినప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడంతో వాటి ప్రస్తావనే లేకుండా పోయింది. ఎన్నికల సమయంలో.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు వంద శాతం సబ్సిడీతో బీసీ, మైనారిటీ బంధు పథకాలను అమలు చేసింది. నిజానికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం ప్రతీ యేటా సబ్సిడీతో కూడిన బ్యాంక్ లింకేజీ ఆర్థిక చేయూత కోసం దరఖాస్తులను స్వీకరిస్తూ వచ్చింది. అందులో కేవలం 80 శాతం సబ్సిడీతో కూడిన బ్యాంక్ లింకేజీ కింద రూ.లక్ష రుణం మాత్రమే మంజూరు చేసి మిగతా సబ్సిడీ రుణాలను పెండింగ్‌లో పెడుతూ వచ్చింది. అయితే.. రూ. లక్ష రుణం కోసం కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులను రావడంతో అర్హులను గుర్తించి లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను గుర్తించినా నిధుల విడుదల కాకపోవడంతో ఆర్థిక సాయం మంజూరు పెండింగ్‌లో పడిపోతూ వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం బీసీ, మైనారిటీ బంధు పథకం ప్రకటించి వంద శాతం సబ్సిడీని వర్తింపజేసింది. అయితే.. రుణ సహాయం పొందిన వారిలో సగానికి పైగా యూనిట్లు ఏర్పాటు చేయకపోవడంతో అసలు తలనొప్పి ప్రారంభమైంది. అసెంబ్లీ ఎన్నికల ముందు రుణ వితరణలు బీసీలు, మైనారిటీలకు రూ.లక్ష చొప్పున అప్పు ప్రస్తుతం యూనిట్లపై ఆరా తీస్తున్న అధికారులు అయోమయానికి గురవుతున్న లబ్ధిదారులు మనుగడలో లేని సగానికి పైగా యూనిట్లు -
నగదు ఇస్తానని..
మలక్‌పేట: నగదు ఇస్తానని చెప్పి గుర్తుతెలియని వ్యక్తి ఓ వ్యాపారి నుంచి రూ. 75 వేలు గూగుల్‌పేకు ట్రాన్స్ఫర్ చేయించుకుని పరారైన సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బాధితుడు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అక్బర్‌బాగ్ డివిజన్, ఆంధ్రాకాలనీకి చెందిన తిప్పన జనార్దన్‌రెడ్డి మలక్‌పేట సూపర్బజార్లో జిరాక్స్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. గురువారం సాయంత్రం యాక్టీవాపై అక్కడికి వచ్చిన గుర్తు తెలియని జనార్దన్‌రెడ్డిని మాటల్లో పెట్టాడు. అత్యవసర పరిస్థితి ఉన్నందున రూ.75 వేలు గూగుల్ పే చేయాలని, నగదు ఇస్తానని కోరాడు. అతడి మాటలు నమ్మిన జనార్దన్‌రెడ్డి నగదు బదిలీ చేశాడు. నగదు బైక్ డిక్కీలో ఉందని తీసుకొస్తానని బయటికి వచ్చిన అతను అక్కడి నుంచి పరారయ్యాడు. తాను మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు స్థానిక యూకే బ్యాంక్‌లో తన అకౌంట్ ఫ్రీజ్ చేయించాడు. కాగా అగంతకుడు అప్పటికే అందులో నుంచి రూ.50 వేలు డ్రా చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు. ● వృద్ధుడికి టోకరా ● రూ.75వేలు బదిలీ చేయించుకుని పరారీ -
జంట హత్యల కేసు.. 36 గంటల్లో పట్టేశారు
మణికొండ: పుప్పాలగూడలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో మిస్టరీ వీడింది. 36 గంటల్లో కేసును ఛేదించిన నార్సింగి పోలీసులు నిందితులను మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో గురువారం అరెస్టు చేశారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బిందు(25) అనే యువతి సెక్స్‌వర్కర్‌గా పని చేసేది. ఈ నేపథ్యంలో ఆమెకు రాహుల్‌కుమార్ సాకేత్ అనే యువకుడితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రాహుల్ కుమార్ సాకేత్ వీడియో తీసేందుకు యత్నించాడు. అందుకు అభ్యంతరం చెప్పిన బింధు అతడితో గొడవ పడి అక్కడినుంచి వచ్చేసింది. ఈ విషయాన్ని అంకిత్ సాకేత్(27)కు చెప్పింది. దీంతో ఆగ్రహానికి లోనైన అంకిత్, రాహుల్‌ను మందలించాడు. ఈ కారణంగా వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనను మందలించాడనే కోపంతో రాహుల్, అంకిత్ సాకేత్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయంలో తనకు సహాయం చేయాలని తన మిత్రులు రాజ్‌కుమార్ సాకేత్, సుఖేంద్ర కుమార్ సాకేత్‌లను కోరాడు. పథకం ప్రకారం ఈనెల 11న రాహుల్‌కుమార్ సాకేత్, అంకిత్‌తో పాటు తన స్నేహితులతో కలిసి మరోమారు బింధును తీసుకుని ఆటోలో పుప్పాలగూడలోని అనంత పద్మనాభస్వామి దేవాలయం గుట్టలపైకి వచ్చారు. సుఖేంద్రకుమార్ సాకేత్ బిందుతో కలిసి ఉండగా రాహుల్‌కుమార్, రాజ్‌కుమార్, అంకిత్ సాకేత్‌ను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లి కత్తితో పొడిచి, బండ రాయితో మోది దారుణంగా హత్య చేశారు. ఈ సందర్భంగా అంకిత్ ఎదురుతిరగడంతో వారిద్దరికీ గాయాలయ్యాయి. అనంతరం ముగ్గురూ కలిసి బింధు వద్దకు వచ్చి ఆమెను తలపై బండరాయితో మోది హత్య చేశారు.మధ్యప్రదేశ్‌కు పరార్హత్య అనంతరం నిందితులు ముగ్గురూ మృతుల వద్ద ఉన్న సెల్ఫోన్లను తీసుకుని 12న తెల్లవారుజామున తమ స్వస్థలమైన మధ్యప్రదేశ్‌కు పారిపోయారు. 14న ఉదయం గుట్టపై మృతదేహాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. నిందితుల వద్ద ఉన్న మృతుల సెల్ఫోన్ల ఆధారంగా వారు మధ్యప్రదేశ్‌లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లిన ప్రత్యేక బృందం గురువారం వారిని అదుపులోకి తీసుకుంది. వారి నుంచి మృతుల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వారిని స్థానిక కోర్టులో హాజరుపరచి ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. -
పాత నేరస్తుడి పనే..
బంజారాహిల్: బంజారాహిల్స్ రోడ్డునెంబర్–2లోని ఇందిరానగర్‌లో జరిగిన భారీ చోరీ కేసు బంజారాహిల్స్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఇందిరానగర్‌కు చెందిన లోవకుమారి, వీరవెంకటరమణ దంపతులు సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఈ నెల 12న ఇంటికి తాళం వేసి రాజమండ్రికి వెళ్లారు. ఇంటి భద్రతను ఇంట్లో కిరాయికి ఉండే తిరుమలరెడ్డికి అప్పగించారు. అయితే సినిమా షూటింగ్లలో హెల్పర్‌గా పనిచేసే తిరుమలరెడ్డికి నాలుగు రోజుల క్రితం ఫేస్బుక్లో బోరబండ కార్మికనగర్‌కు చెందిన దాసరి రక్షక్‌రాజ్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ మూడు రోజులుగా ఫోన్లో మాట్లాడుకుంటున్నారు. ఈ నెల 13న రాత్రి తిరుమలరెడ్డి ఆహ్వానం మేరకు రక్షక్‌రాజ్ అతడి ఇంటికి వచ్చాడు. ఇద్దరూ కలిసి మద్యం తాగారు. పీకలదాకా మద్యం తాగిన తిరుమలరెడ్డి నిద్రపోయాడు. అదే అదునుగా అంతకముందే సదరు ఇంటి యజమానుల వివరాలు ఆరా తీసిన రక్షక్‌రాజ్ వారు లేరని తెలుసుకున్నాడు. బండరాయితో ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించి బీరువాలో ఉన్న రూ.25 లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలతో తన స్కూటీపై ఉడాయించాడు. రంగంలోకి దిగిన బంజారాహిల్స్ క్రైమ్ పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించగా బైక్‌పై ఇద్దరు వచ్చిన దృశ్యాలు, వెళ్లేటప్పుడు ఒక్కడే వెళ్తున్న దృశ్యాలను గుర్తించారు. తిరుమలరెడ్డితో వచ్చిన వ్యక్తి ఎవరని ఆరా తీయగా తనకు మూడు రోజుల క్రితమే పరిచయం ఏర్పడిందని చెప్పాడు. దీంతో పోలీసులు రక్షక్‌రాజ్ ఫోన్ నెంబర్ ఆధారంగా గురువారం ఉదయం అతడిని కార్మికనగర్లోని అతడి ఇంట్లో అదుపులోకి తీసుకున్నారు. బీరువాలో దాచిన నోట్ల కట్టలు, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. 2020లో జూబ్లీహిల్స్‌లో ఓ చోరీ కేసులో జైలుకు వెళ్లి వచ్చినట్లుగా గుర్తించారు. ఎనిమిది నెలల క్రితం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలోనే చోరీకి యత్నించి పోలీసులకు చిక్కినట్లుగా విచారణలో వెల్లడైంది. కిరాయిదారు తిరుమలరెడ్డికి రక్షక్‌రాజ్ ఫేస్బుక్లో పరిచయమైనట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. చోరీ సొత్తు పూర్తిగా పట్టుబడడంతో అటు బాధితులు, ఇటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. నిందితుడిని బంజారాహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ● భారీ చోరీ కేసులో నిందితుడి అరెస్టు ● 24 గంటల్లోనే కేసును ఛేదించి సొత్తు రికవరీ చేసిన పోలీసులు -
మద్యం మత్తులో..
మణికొండ: మద్యం మత్తు రెండు కార్ల ప్రమాదానికి కారణమైన సంఘటన మణికొండ మున్సిపాలిటీ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని భాగ్యలక్ష్మి కాలనీకి చెందిన వెంకట సుబ్బయ్య తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఫుల్లుగా మద్యం సేవించి ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో రాయదుర్గం ప్రాంతానికి చెందిన చిన్నగౌడ్ తన స్కార్పియోలో మర్రిచెట్టు సర్కిల్ వైపు వెళుతున్నాడు. అదే సమయంలో మర్రిచెట్టు సర్కిల్ నుంచి ఓయూ కాలనీ వైపు వస్తున్న శాంత్రో కారులో వస్తున్న వెంకటసుబ్బయ్య ఎస్బీఐ బ్యాంకు ముందుకు రాగానే ఎదురుగా వస్తున్న స్కార్పియోను వేగంగా ఢీ కొట్టాడు. ఈ ఘటనలో స్కార్పియో ముందు టైరు విరిగిపోగా, శాంత్రో కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. శాంత్రో కారులో బెలూన్ ఓపెన్ కావడంతో ఎవరికీ గాయాలు కాలేదు. వెంకట సుబ్బయ్య అతిగా మద్యం తాగటం, డ్రైవింగ్ లైసెన్స్ సైతం లేకుండా అతి వేగంగా కారు నడపటంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో ముగ్గురు యువకులు పారిపోగా, డ్రైవింగ్ చేస్తున్న వెంకట సుబ్బయ్యను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రాత్రి 8 గంటల సమయంలో ప్రమాదం జరగటంతో రోడ్డుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రాయదుర్గం పోలీసులు వాహనాలు తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. ఎదురెదురుగా రెండు కార్లు ఢీ మణికొండలో భారీగా నిలిచిపోయిన వాహనాలు -
తుక్కు కోసం వెళ్తే ట్రాలీ కూడా దొరికింది!
జీడిమెట్ల: పాతబస్తీ ప్రాంతానికి చెందిన నలుగురు దొంగలు జీడిమెట్ల పరిధిలో ఉన్న ఓ స్క్రాప్ గోదాంను టార్గెట్ చేశారు. అందులో ఉన్న తుక్కు చోరీ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ నెల తొమ్మిదో తేదీ రాత్రి తాళాలు పగులకొట్టి గోదాంలోకి వెళ్లిన వారికి తుక్కుతో పాటు టాటా ఏస్ ట్రాలీ కూడా కనిపింది. దాని తాళాలు సైతం అందుబాటులో ఉండటంతో దొంగిలించిన స్క్రాప్‌ను అందులోనే వేసుకుని ఉడాయించారు. వివిధ సీసీ కెమెరాల్లో రికార్డైన ఫీడ్ ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నట్లు బాలానగర్ డీసీపీ సురేష్‌కుమార్ తెలిపారు. జీడిమెట్ల ఠాణాలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గోపిరెడ్డి బాలకృష్ణ అనే వ్యక్తి జీడిమెట్ల పరిధిలోని రాంరెడ్డినగర్‌లో స్క్రాప్ గోదాం నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో గోదాం, గేటుకు తాళాలు వేసి ఇంటికి వెళ్లాడు. రాగి వైరుతో సహా అనేక వస్తువులు ఉంటాయని ఈ గోదాంపై కన్నేసిన పాతబస్తీలోని కాలపత్తర్ వాసులు సయ్యద్ ఫెరోజ్, మహ్మద్ అలం, అస్లాం ఖాన్న్, రాజేంద్రనగర్‌కు చెందిన మహ్మద్ గఫూర్, సోహైల్ అదే రోజు రాత్రి తాళాలు పగులకొట్టి గోదాంలోకి ప్రవేశించారు. వారికి అక్కడ రాగి వైరు, సామానుతో పాటు ఓ ట్రాలీ కూడా కనిపించింది. ఆ సమీపంలోనే దాని తాళాలు సైతం ఉండటంతో చోరీ చేసిన సొత్తు అందులోనే వేసుకుని ఉడాయించాలని నిర్ణయించుకున్నారు. దీంతో రెండు వేల కేజీల రాగి వైరుతో పాటు గోదాంలో ఉన్న ఇతర లోహ వస్తువులను ట్రాలీలో వేసుకుని పరారయ్యారు. మర్నాడు ఉదయం తన గోదాంకు వచ్చిన బాలకృష్ణ చోరీ జరిగినట్లు గుర్తించి జీడిమెట్ల ఠాణాలో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చోరీ జరిగిన గోదాం, దానికి దారి తీసే మార్గాలతో పాటు ఇతర ప్రాంతాల్లో ఉన్న 150 సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను పరిశీలించారు. వాటిలో కనిపించిన దృశ్యాల ఆధారంగా పాత నేరగాళ్లయి సయ్యద్ ఫెరోజ్, ఆలంలను గుర్తించారు. ఫెరోజ్‌పై 2011లో పంజగుట్ట, ఆలంపై 2023లో హయత్‌నగర్ ఠాణాల్లో చోరీ కేసులు నమోదయ్యాయి. వారి కదలికలపై పోలీసులు నిఘా ఉంచిన పోలీసులు గురువారం ఉదయం గాజులరామారం చౌరస్తాలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఫెరోజ్, ఆలం, అస్లాం ఖాన్, గఫూర్లను అదుపులోకి తీసుకున్నారు. వీరిచ్చిన సమాచారంతో రూ.7.64 లక్షల నగదు, ట్రాలీ, వెయ్యి కేజీల కాపర్ వైర్ స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న సోహైల్ కోసం గాలిస్తున్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించిన ఏసీపీ హన్మంత్‌రావు, జీడిమెట్ల ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేష్, డీఐ కనకయ్య, సీసీఎస్ ఇన్స్పెక్టర్ రాజులను డీసీపీ అభినందించారు. స్క్రాప్ చోరీ కోసం గోదాంలోకి నలుగురు దొంగలు అక్కడ ఉన్న వాహనంతో సహా సరుకు చోరీ సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల అరెస్ట్ -
మహిళల చేతికి సోలార్ పవర్
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పేద, మధ్య తరగతి మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఆలోచనలో భాగంగా ప్రభుత్వ, దేవాదాయ శాఖ భూముల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. తద్వార విలువైన దేవుడి మాన్యాలు కబ్జాకాకుండా కాపాడటంతో పాటు మహిళలకు ఆర్థిక భరోసా ఇవ్వొచ్చని భావిస్తోంది. ఇందుకోసం రెవెన్యూ అధికారులు ప్రాణాళిక రూపొందించారు. ఏ దేవుడి పేరున? ఏ గ్రామంలో? ఎంత భూమి ఉందో? గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించనున్నారు. ఇప్పటికే ఉన్నతాధికారులు బ్యాంకర్లతో చర్చలు కూడా జరిపారు. సోలార్ ప్లాంట్ల ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి, డిస్కం గ్రిడ్లకు అనుసంధానం చేయనున్నారు. వచ్చే డబ్బులతో బ్యాంకు రుణాలను తీర్చడంతో పాటు మహిళల ఆర్థిక పురోగతికి బాటలు వేయనున్నారు. 24 ఏళ్ల పాటు విద్యుత్ ఉత్పత్తి జిల్లాలో 21 మండల మహిళా సమాఖ్యలు, 788 గ్రామ మహిళా సంఘాలు, 19,209 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో మొత్తం 2,06,116 మంది సభ్యులు ఉన్నారు. వివిధ బ్యాంకులు వీరికి ఏటా రూ.వెయ్యి కోట్ల వరకు రుణాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం విద్యుత్ కోసం పూర్తిగా థర్మల్, హైడల్ పవర్‌పైనే ఆధారపడాల్సి వస్తోంది. డిమాండ్ మేరకు వనరులు లేకపోవడంతో సరఫరాలో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. అదే ఒక్కసారి సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తే.. 24 ఏళ్లు పాటు విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. ఒక మెగావాట్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలంటే కనీసం నాలుగెకరాల భూమి అవసరమవుతోంది. అదే ఖాళీ గా ఉన్న ప్రభుత్వ, దేవాదాయ శాఖ భూముల్లో వీటిని ఏర్పా టు చేయడం ద్వారా స్థానిక అవసరాలు తీర్చడంతో పాటు మిగిలిన విద్యుత్‌ను డిస్కంలకు అమ్ముకుని సొమ్ము చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. జిల్లాలోని దేవుడి భూములివే.. ● మాడ్గుల మండలం అర్కపల్లిలోనిశ్రీఆంజనేయస్వామి దేవాలయం పేరున 34 ఎకరాలు. ● ఇంజాపూర్‌లోని శ్రీబాలాజీ వేంకటేశ్వరస్వామి దేవాలయం పేరున 74.15 ఎకరాలు. ● యాచారం మండలంలోని ఓంకారేశ్వరాలయానికి 1,450 ఎకరాలు. ● పెండ్యాల లక్ష్మీనరసింహ్మస్వామి దేవాలయానికి 360 ఎకరాలు. ● అమ్మపల్లిలోని శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయానికి 222 ఎకరాలు. ● మామిడిపల్లి బాలాజీ వేంకటేశ్వ రస్వామి దేవాలయానికి 33.12 ఎకరాలు. ● జెన్నాయిగూడలోని క్షేత్రగిరి లక్ష్మీనరసింహ్మస్వామి దేవాలయానికి 800 ఎకరాలు. ● కడ్తాల్‌లోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయానికి 41.29 ఎకరాలు ఉన్నట్లు సమాచారం. ● ఈ స్థలాల్లో సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దేవుడి మాన్యాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు మహిళా సమాఖ్యల ఆర్థిక అభ్యున్నతి దిశగా అడుగులు ఆలయ భూములను గుర్తించే పనిలో రెవెన్యూ యంత్రాంగం మెగావాట్ సోలార్ ప్లాంట్ ఏర్పాటుకు నాలుగెకరాల భూమి అవసరం -
గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి
అమీర్‌పేట: విధి నిర్వహణలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ గుండె పోటుతో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే..బాపట్లకు చెందిన వినయ్ భాస్కర్ (53) ఎస్ఆర్నగర్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో డ్యూటీకి వచ్చాడు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో గుండె పోటు రావడంతో సిబ్బంది అతడిని అమీర్‌పేటలోని వెల్నెస్ ఆసుపత్రికి తరలించారు. సీపీఆర్ చేయడంతో సాధారణ స్థితికి వచ్చాడు. ఆసుపత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తుండగా అర్థరాత్రి రెండో సారి గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వినయ్ భాస్కర్‌కు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, డీఐ గోపాల్ సిబ్బందితో కలిసి బోయిన్ పల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు.కో–ఆపరేటివ్ సొసైటీ నుంచి రూ.50 వేలు, శాఖ తరఫున రూ.30 వేలు ఆర్థికసాయం అందజేసినట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. -
వైభవంగా జేపీదర్గా గంధోత్సవం
కొత్తూరు: మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే గంధోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇన్ముల్‌నర్వ గ్రామం హజ్రత్ జహంగీర్ పీర్ దర్గా ఉర్సు ఉత్సవాలు గురువారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, వక్ఫ్‌బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుస్సేనీలు బాబాకు గంధం సమర్పించి, ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ... జేపీ దర్గాకు దేశ వ్యాప్తంగా ఖ్యాతి ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో బాబా దర్శనం కోసం వస్తారని తెలిపారు. గత ప్రభుత్వాలు దర్గా అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దర్గా దర్శనం కోసం వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు, వసతులు కల్పనకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా బస్టాండ్, తాగునీరు, వసతి, మరుగుదొడ్లతో పాటు పలు వసతులను కల్పించనున్నట్లు వివరించారు. ఉత్సవాల నేపథ్యంలో శంషాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు నేతృత్వంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌రెడ్డి, నాయకులు శివవంకర్గౌడ్, హరినాథ్‌రెడ్డి, ఖాజా, ఖాలేద్, సిరాజ్, తస్లీమ్, రషీద్, షౌకత్, కృష్ణ, ఆగీరు రవికుమార్‌గుప్త, శేఖర్‌గుప్త తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్న భక్తజనం బాబాకు గంధం సమర్పించిన ఎమ్మెల్యే, వక్ఫ్‌బోర్డు చైర్మన్