
పెంపుడు కుక్కను చెడగొడుతున్నాయని..
అల్వాల్: తన పెంపుడు కుక్కను వీధి కుక్కలు చెడగొడుతున్నాయని ఆగ్రహానికి లోనైన ఓ వ్యక్తి వీధి కుక్కలను గోడకేసి కొట్టి కాలితో తొక్కి చంపేసిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఇంటీరియర్ డెకరేటర్‌గా పనిచేసే ఆశీష్ కుటుంబంతో కలిసి బొల్లారంలోని వీబీసిటి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నాడు. పూర్తిగా శాఖాహారి అయిన అశీష్ రెండు కుక్కలను పెంచుకుంటూ వాటికి శాఖాహారమే అలవాటు చేశాడు. ఈ క్రమంలో అపార్టుమెంట్ పరిసరాల్లో వీధికుక్కలు మాంసాహారం తింటూ తరుచూ తన పెంపుడు కుక్కల వద్దకు రావడం, వాటిపై దాడి చేస్తుండటంతో అతను విసుగెత్తిపోయాడు. ఈ నెల 14న సాయంత్రం అతను కుక్కను తీసుకొని అపార్టుమెంట్ సెల్లార్‌లోకి వెళ్లగా వీధి కుక్క పిల్లలతో సహా అక్కడికి వచ్చింది. దీంతో ఒక్కసారిగా విచక్షణ కోల్పోయిన అశీష్ నాలుగు కుక్కపిల్లలను గోడకేసి కొట్టి కాలితో తొక్కి చంపేశాడు. జంతు ప్రేమికులు బుధవారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వీధి కుక్కలను చంపిన యజమాని
జంతు ప్రేమికుల ఫిర్యాదు
కేసు నమోదు