
రుతుపవనాల ప్రవేశానికి అనుకూలంగా వాతావరణం
27 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం
అండమాన్‌లో ఇప్పటికే మొదలైన భారీ వర్షాలు
నేడు రాష్ట్రంలో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు
వాతావరణ శాఖ అంచనాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలపై వాతావరణ శాఖ తాజా అంచనాలను విడుదల చేసింది. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నందున మంగళవారం (13వ తేదీ) సాయంత్రానికి అండమాన్–నికోబార్ దీవుల్లోని కొంత భాగంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అండమాన్–నికోబార్ దీవుల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రస్తుతం అండమాన్–నికోబార్ దీవుల్లో వర్షాలు కురుస్తున్నాయని, రానున్న 24 గంటల్లో అక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అండమాన్‌లోకి ప్రవేశించిన తర్వాత నైరుతి రుతుపవనాలు క్రమంగా ముందుకు కదిలి కేరళను తాకుతాయని, ఇందుకు కనీసం రెండు వారాల సమయం పడుతుందని వెల్లడించింది. ఈ నెల 27 నాటికి రుతుపవనాలు కేరళను తాకవచ్చని అంచనా వేసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి మూడురోజులు ముందుగా రుతుపవనాలు కేరళను తాకనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో రెండు రోజులు తేలికపాటి వర్షాలు
తెలంగాణలో రానున్న రెండు రోజులు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రధానంగా దక్షిణ ప్రాంత జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరాఠ్వాడా నుంచి అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి బలహీన పడింది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి.

ఖమ్మంలో అత్యధికంగా 41.8 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 23.3 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డయ్యింది. రానున్న రెండురోజులు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. సోమవారం వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, రంగారెడ్డి, ఆసిఫాబాద్ జిల్లాల్లోని కొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి.