Meteorological Department (IMD)
-
మళ్లీ విజృంభించనున్న కార్చిచ్చు
లాస్ ఏంజెలెస్: అమెరికాలోని లాస్ ఏంజెలెస్ అటవీ ప్రాంతాలను బూడిదచేస్తున్న కార్చిచ్చు మళ్లీ కన్నెర్రజేయనుందని వాతావరణ శాఖ తాజాగా హెచ్చరించింది. పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతంలోని దావాగ్నిని ఇప్పటిదాకా కేవలం 14 శాతం మాత్రమే అదుపులోకి తెచ్చిన నేపథ్యంలో వాతావరణ విభాగ నివేదికలు స్థానికుల్లో భయాందోళనలను మరింత పెంచాయి. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని, దీంతో అడవిలో కార్చిచ్చు మరింత విస్తరించే ప్రమాదముందని అమెరికా నేషనల్ వెదర్ సర్వీస్ సోమవారం ప్రకటించింది. మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు వీయనున్న శాంటా అనా పెనుగాలులతో ప్రమాదం పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బుధవారం సాయంత్రం దాకా ‘రెడ్ ఫ్లాగ్’ వార్నింగ్ అమల్లో ఉంటుంది. మరోవైపు అటవీప్రాంతాల్లో అగ్నికీలల సంబంధ అగ్నిప్రమాద ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య తాజాగా 24కు పెరిగింది. ఇంకా డజన్ల మంది జాడ తెలియాల్సిఉంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే ఒక్క లాస్ ఏంజెలెస్ సిటీ, కౌంటీ పరిధుల్లో లక్ష మందిని సురక్షిత ప్రాంతాలకువెళ్లాలని సూచించగా, మిగతా చోట్ల కలిపి మరో 87,000 మందికి సురక్షిత స్థలాలకు వెళ్లాలని స్థానికయంత్రాంగం హెచ్చరికలుచేసింది. ఆరు చోట్ల కార్చిచ్చు వ్యాపించగా పసిఫిక్ పాలిసేడ్స్, ఏటోన్ ప్రాంతాల్లోని దావాగ్ని మాత్రమే ఇంకా అత్యంత ప్రమాదకరస్థాయిలో కొనసాగుతు న్నాయి. ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో 60 శాతం విస్తీర్ణానికి సమానమైన అటవీభూములను పాలిసేడ్స్, ఏటోన్, హర్స్ట్ కార్చిచ్చులు బూడిదకుప్పలుగా మార్చేశాయి. మొత్తంగా అన్ని కార్చిచ్చుల కారణంగా 40,000కుపైగా ఎకరాల్లో అటవీప్రాంతం పూర్తిగా కాలిపోయింది. 12,000కు పైగా ఇళ్లు, దుకాణాలు, పాఠశాలలు తగలబడ్డాయి. అయితే దుప్పటిలా కమ్మేసిన పొగ, దుమ్ము చాలా వరకు తగ్గడంతో కొన్ని ప్రాంతాల్లో పాఠశాలలు తెరిచారు.బాణాసంచా వల్లే: వాషింగ్టన్ పోస్ట్నూతన సంవత్సర వేడుకల్లో జనం కాల్చిన బాణాసంచా కారణంగానే పసిఫిక్ పాలిసేడ్స్‌లో అగ్గిరాజుకుందని వాషింగ్టన్ పోస్ట్ వార్తాసంస్థ ఒక కథనంలో పేర్కొంది. రేడియో సంప్రదింపులు, ఆ ప్రాంతంలో బాణాసంచా కాల్చడానికి ముందు, ఆ తర్వాత తీసిన ఉపగ్రహ ఛాయా చిత్రాలు, స్థానికుల ఇంటర్వ్యూలతో ఈ విషయాన్ని నిర్ధారించుకున్నట్లు తన కథనంలో పేర్కొంది. పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చిన ప్రదేశంలో అగ్గిరవ్వలు అడవిలో పడి దావాగ్ని మొదలైందని, అయితే వెంటనే దానిని ఆర్పేశారు. కానీ దావాగ్ని తాలూకు నిప్పుకణికలు కొన్ని అలాగే ఉండిపోయి భీకరగాలుల సాయంతో నెమ్మదిగా మళ్లీ దావాగ్నికి ఆజ్యంపోశాయని వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది. గత మంగళవారం తొలుత పసిఫిక్ పాలిసేడ్స్‌లో మంటలు అంటుకున్నప్పుడు స్థానికులు ఫిర్యాదుచేసినా అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా రావడంతో మంటలు అదుపుతప్పి చివరకు లాస్ ఏంజెలెస్ చరిత్రలోనే మరో అతిపెద్ద దావాగ్నిలా ఎదిగాయని ఆరోపణలున్నాయి. ‘‘ ఆరోజు మేం వెంటనే ఫోన్లుచేశాం. కానీ లాస్ఏంజెలెస్ ఫైర్ డిపార్ట్మెంట్(ఎల్ఏఎఫ్డీ) నుంచి స్పందన రాలేదు. 45 నిమిషాలతర్వాత ఒక హెలికాప్టర్ వచ్చి నీళ్లు పోసి వెళ్లిపోయింది. మంటలు మాత్రం ఆరలేదు’’ అని స్థానికులు మైఖేల్ వాలంటైన్ దంపతులు చెప్పారు.ప్రైవేట్ నీటిట్యాంక్లకు గిరాకీతమ ప్రాంతంలో చెలరేగుతున్న మంటల నుంచి తమ ఇళ్లను కాపాడుకునేందుకు స్థానికులు ఆపసోపాలు పడుతున్నారు. దీంతో ప్రైవేట్ నీటిట్యాంక్లకు గిరాకీ అమాంతం పెరిగింది. ఇదే అదనుగా ప్రైవేట్ వాటర్‌ట్యాంక్ సంస్థలుచార్జీలు మోతమో గిస్తున్నాయి. లాస్ ఏంజెలెస్‌లోని సంపన్నులు ప్రభుత్వ అగ్నిమాపక సిబ్బంది వచ్చేదాకా ఆగకుండా ప్రైవేట్ ఫైర్ఫైటర్లను రప్పిస్తున్నారు. అయితే ఆ సేవలందించే సంస్థలు గంటకు 2,000 డాలర్లు అంటే రూ.1,73,000 చార్జ్ చేస్తున్నాయి. రియల్ ఎస్టేట్ దిగ్గజాలు రిక్ కరుసో, కీత్ వాసర్మ్యాన్ సహా చాలా మంది ఇదే బాటపట్టారు. ‘‘ నా ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది. సంస్థ మొదలైననాటి నుంచి హాలీవుడ్లో ఇంతస్థాయి డిమాండ్ ఎప్పుడూ లేదు’’ అని కవర్డ్6 ఫైర్‌ఫైటింగ్ సేవల సంస్థ యజమాని క్రిస్ డన్ చెప్పారు. ‘‘ నగరపాలకులను నమ్మలేమని ఈవారం ఘటనతో తేలిపోయింది. నా దగ్గర డబ్బుంది. అయితేమాత్రం ఏం లాభం. ఇళ్లు తగలబడ్డాయి’’ అని ఒక హాలీవుడ్ ప్రముఖుడు వాపోయాడు. -
మానవాళికి ప్రకృతి శాపం!
‘వాతావరణం కూడా ప్రభుత్వాల వంటిదే. అదెప్పుడూ చెడ్డగానే ఉంటుంది’ అంటాడు బ్రిటిష్ వ్యంగ్య రచయిత జెరోమ్ కె. జెరోమ్. అది ముమ్మాటికీ నిజం. దేశంలో గత 123 ఏళ్లలో కనీవినీ ఎరగనంత స్థాయి ఉష్ణోగ్రతలు నిరుడు నమోదయ్యాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) చేసిన ప్రకటన హడలెత్తిస్తోంది. అంతేకాదు... వచ్చే ఏడాది సైతం రికార్డులు బద్దలయ్యే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తోంది. మనదేశం మాత్రమే కాదు... ప్రపంచవ్యాప్తంగా కూడా నిరుటి ఉష్ణో గ్రతలు అధికంగానే ఉన్నాయని వివిధ దేశాల వాతావరణ విభాగాల ప్రకటనలు చూస్తే అర్థమవుతుంది. మన పొరుగునున్న చైనాలో 1961 నుంచీ పోల్చిచూస్తే గత నాలుగేళ్ల ఉష్ణోగ్రతలు చాలా చాలా ఎక్కువని అక్కడి వాతావరణ విభాగం తెలియజేసింది. నిజానికి 2024లో ప్రపంచ ఉష్ణో గ్రతల స్థితిగతులపై ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) ఇంకా అధికారిక నివేదిక విడుదల చేయలేదు. అందుకు మార్చి వరకూ సమయం ఉంది. కానీ ఈలోగా కొన్ని కొన్ని అంశాల్లో వెల్లడైన వాతావరణ వైపరీత్యాలను అది ఏకరువు పెట్టింది. అవి చాలు... మనం ఆందోళన పడటానికి! వాటి ప్రకారం– నిరుడు జనవరి నుంచి సెప్టెంబర్ నెలలమధ్య ప్రపంచ ఉష్ణోగ్రతలు పారిశ్రామికీకరణకు ముందు కాలం నాటికంటే సగటున 1.54 డిగ్రీల సెల్సియస్ అధికం. అలాగే అంటార్కిటిక్ సముద్రంలో మంచు పలకలు మునుపటితో పోలిస్తే అధికంగా కరుగుతున్నాయి. ఉగ్రరూపం దాల్చిన వాతావరణం వల్ల నిరుడు మరణాలు, ఆర్థిక నష్టాలు కూడా బాగా పెరిగాయి. సాగర జలాల ఉష్ణోగ్రతలు అధికమయ్యాయి. సముద్ర మట్టాలు ఉన్నకొద్దీ పెరుగుతున్నాయి. నిరుడు ప్రపంచవ్యాప్తంగా రికార్డయిన 29 వాతావరణ ఘటనలను విశ్లేషిస్తే అందులో 26 కేవలం వాతావరణ మార్పులవల్ల జరిగినవేనని తేలిందని డబ్ల్యూఎంఓ తెలిపింది. ఈ ఉదంతాల్లో 3,700 మంది మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని వివరించింది.స్వర్గనరకాలు మరెక్కడో లేవు... మన ప్రవర్తన కారణంగా ఆ రెండూ ఇక్కడే నిర్మితమవుతా యంటారు. వాతావరణం విషయంలో ఇది ముమ్మాటికీ వాస్తవం. మానవ కార్యకలాపాలే వాతా వరణ వైపరీత్యాలకు మూలకారణం. నూతన సంవత్సర సందేశంలో గత దశాబ్దకాలపు వార్షిక ఉష్ణోగ్రతలన్నీ రికార్డు స్థాయివేనని సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రకటించారు. ఈ వినాశకర దోవ విడనాడాలని పిలుపునిచ్చారు. విజ్ఞాన శాస్త్రం విస్తరిస్తోంది. వినూత్న ఆవిష్కర ణలు అందుబాటులోకొస్తున్నాయి. కానీ వీటిని చూసి విర్రవీగి, ప్రకృతి చేస్తున్న హెచ్చరికలను పెడ చెవిన పెట్టిన పర్యవసానంగా అది ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రకృతి చెప్పినట్టు వింటూ అది విధించిన పరిమితులను శిరసావహించాలి తప్ప దాన్ని నిర్లక్ష్యం చేస్తే వినాశనం తప్పదని ఏటా వెలువడే నివేదికలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. కానీ వినేదెవరు? లాభార్జనే తప్ప మరేమీ పట్టని పరిశ్రమలు, అభివృద్ధి పేరిట ఎడాపెడా అనుమతులు మంజూరు చేస్తున్న పాలకులు, వాతావరణం నాశనమవు తున్నదని గ్రహించే చైతన్యం లోపించిన ప్రజలు పర్యావరణ క్షీణతకు దోహదపడుతున్నారు. అయి దేళ్లకోసారి వచ్చే ఎన్నికల్లో పర్యావరణ పరిరక్షణ అంశం ఏనాడూ ప్రస్తావనకు రాదు. మన దేశంలోనే కాదు... ప్రపంచంలో వాతావరణ శిఖరాగ్ర సదస్సుల వంటివి నిర్వహించినప్పుడు తప్ప మరెక్కడా పర్యావరణం గురించి చర్చ జరగటం లేదు. ఇది ప్రకృతి విధ్వంసానికి పాల్పడే పారిశ్రామికవేత్తలకూ, పాలకులకూ చక్కగా ఉపయోగపడుతోంది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా అభివృద్ధి జరగాల్సిందే. అందుకవసరమైన చర్యలు తీసుకోవాల్సిందే. కానీ అభివృద్ధి అవసరాల కోసం పర్యావరణాన్ని బలిపెట్టే విధానాలు మొత్తంగా మానవాళికే ప్రమాదకరం. పర్యావరణ ముప్పు ముంచుకొస్తున్నదనే విషయంలో ఎవరూ పెద్దగా విభేదించటం లేదు. కానీ దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలే నత్తనడకన ఉంటున్నాయి. ప్రపంచంలో కర్బన ఉద్గా రాల తగ్గింపునకు 2015 పారిస్ శిఖరాగ్ర సదస్సు నిర్దేశించిన లక్ష్యాలను అందుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. చెప్పాలంటే ఆ దిశగా ఎంతోకొంత అడుగులేస్తున్నది మనమే. ఆ శిఖరాగ్ర సదస్సు 2050 నాటికి భూతాపం పెరుగుదలను 2 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ నిలువరించాలన్న సంకల్పాన్ని ప్రకటించింది. అయితే దాన్ని చేరుకోవటానికి వివిధ దేశాలు ఇచ్చిన హామీలు ఏమాత్రం సరిపోవన్నది శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. వాతావరణానికి తూట్లు పొడవటంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సంపన్న రాజ్యాలు బడుగు దేశాలకు హరిత ఇంధన సాంకే తికతలను అందించటంలో, అందుకవసరమైన నిధులు సమకూర్చటంలో ముఖం చాటేస్తున్నాయి. వాతావరణ మార్పుపై చెప్తున్నదంతా బోగస్ అనీ, పారిస్ ఒడంబడిక నుంచి తాము వైదొలగు తున్నామనీ అమెరికాలో క్రితంసారి అధికారంలోకొచ్చినప్పుడే ప్రకటించిన ట్రంప్... ఈసారి కూడా ఆ పనే చేస్తారు. ప్రపంచ దేశాల మాటెలావున్నా ఈ ఏడాది సైతం ఉష్ణోగ్రతలు భారీగా నమోదుకావొచ్చన్న సమాచారాన్ని పరిగణనలోకి తీసుకుని రిజర్వ్ బ్యాంక్ మొదలుకొని అన్ని ప్రభుత్వ శాఖలూ, విభాగాలూ అట్టడుగు స్థాయివరకూ తగిన వ్యూహాలు రూపొందించుకోవాలి. మండే ఎండలు మాత్రమే కాదు... జనావాసాలను ముంచెత్తే వరదలు కూడా ఎక్కువే ఉంటాయి. ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాలను గరిష్ట స్థాయిలో ఉంచటానికి అవసరమైన కార్యాచరణను ఖరారు చేసుకోవాలి. బాధిత ప్రజానీకానికి సాయం అందించటానికి అవసరమైన వనరులను సమీకరించుకోవాలి. -
వర్షాలకు సెలవు!
సాక్షి, విశాఖపట్నం: శీతాకాలంలోనూ అల్పపీడనం, వాయుగుండం, ఫెంగల్ తుపాన్‌తో విలవిల్లాడిన రాష్ట్రానికి ఊరట లభించే వార్తను వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇకపై వచ్చే వేసవి కాలం వరకూ మోస్తరు వర్షాలు, భారీ వర్షాలు, అల్పపీడనాలు ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు. నైరుతి బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల శుక్రవారం వానలు పడే సూచనలున్నాయన్నారు. ఈ ఏడాదికి ఇవే చివరి వానలనీ..వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ భారీ వర్షాలేవీ ఉండవని తెలిపారు. నెలాఖరు నుంచి చలిగాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉందనీ.. జనవరి 2వ వారం వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందన్నారు. -
బలపడిన అల్పపీడనం..
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం : దక్షిణకోస్తా, ఉత్తర తమిళనాడు తీరాలకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడింది. ఇది పశ్చిమ–నైరుతి దిశగా కదులుతూ వచ్చే 24 గంటల్లో క్రమంగా బలహీనపడే అవకాశం ఉందని, ఈ ప్రక్రియ మొత్తం సముద్రంలోనే జరుగుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీనికి అనుబంధంగా నైరుతి బంగాళాఖాతంలో సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అల్పపీడన ప్రభావం మరో 3 రోజుల పాటు రాష్ట్రంపై ఉంటుందని, రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని అధికారులు తెలిపారు. 26 నుంచి 28వ తేదీ వరకు దక్షిణ కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పారు. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో చలితీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ తగ్గే సూచనలున్నాయని వెల్లడించారు. వ్యవసాయ పనుల్లో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు. ఎగసి పడుతున్న అలలు వాకాడు: బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా మంగళవారం తిరుపతి జిల్లా సముద్ర తీరంలో అలలు ఎగసి పడుతున్నాయి. వాకాడు మండలం తూపిలిపాళెం తీరంలో అలలు 5 మీటర్ల ఎత్తుకు ఎగసి పడుతున్నాయి. -
బలహీనపడిన వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం/బొల్లాపల్లి: వాయుగుండం బలహీనపడి.. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది. ఇది పశ్చిమ–నైరుతి దిశగా కదులుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్ వైపుగా వచ్చి అల్పపీడనంగా బలహీనపడనుంది. మంగళవారం నాటికి దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాల వైపు ప్రయాణిస్తూ నైరుతి బంగాళాఖాతం వద్ద మరింత బలహీనపడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో నేడు, రేపు అక్కడక్కడా వానలు, ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల నుంచి గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి గాలులు వీస్తాయని..ఈ నేపథ్యంలో 25 వరకు దక్షిణ కోస్తా తీరం వైపు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.అకాల వర్షం ముంచేసింది..పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలంలో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు 4 గంటలపాటు భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు పొంగిపొర్లాయి. రైతులకు అపార నష్టం వాటిల్లింది. కోత కోసి పొలాల్లో ఉంచిన వరి ఓదెలు నీట మునిగాయి. పలుచోట్ల ఆరబెట్టిన ధాన్యం కూడా తడిచిపోయింది. ధాన్యం విక్రయించే సమయంలో కురిసిన అకాల వర్షం తమను నిండా ముంచేసిందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పలుకూరు, కనుమలచెరువు, పేరూరుపాడు, వెల్లటూరు గ్రామాల్లో వందలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. -
వాయుగుండం అస్తవ్యస్త ప్రయాణం
సాక్షి, విశాఖపట్నం: సాధారణంగా వాయుగుండం ఏర్పడితే ఈదురు గాలులు, భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడతారు. కానీ.. ఈసారి వాయుగుండమే అస్తవ్యస్తమవుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం దారి తప్పినట్టుగా మారి.. అటూఇటూ తిరుగుతూ ప్రస్తుతం చెన్నైకి 480 కి.మీ., విశాఖపటా్ననికి 430 కి.మీ., గోపాల్‌పూర్‌కి 590 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. వారం రోజులపాటు అల్పపీడనంగానూ, తర్వాత వాయుగుండంగా బలపడిన సమయంలో గాలిలో తేమనంతటినీ లాగేసుకుంది. దీంతో సముద్రంలో మొత్తంగా పొడిగాలుల వాతావరణం ఏర్పడింది. తేమ గాలులు లేకపోవడంతో వాయుగుండం దిక్కుతోచని స్థితిలో పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు చెప్పారు. ఇది తూర్పు ఈశాన్య దిశగా నెమ్మదిగా కదులుతూ సముద్రంలోనే శనివారం రాత్రి బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నాటికి మరింత బలహీనపడుతుందని, దీనిప్రభావం రాష్ట్రంపై ఇక ఉండబోదని అధికారులు స్పష్టం చేశారు. కేవలం నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఆదివారం మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. రెండు రోజులపాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపారు. ఈ నెల 24, 25 తేదీల్లో దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా తేలికపాటి వానలు పడే సూచనలున్నాయని వెల్లడించారు. -
స్థిరంగా కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం
మహారాణిపేట: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. రానున్న 24 గంటల్లో ఇది వాయవ్యంగా ఉత్తర తమిళనాడు, దక్షణ ఆంధ్రా దిశగా ఏపీ తీరానికి ఆనుకుని ప్రయాణిస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం వల్ల బుధవారం కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది. చాలా ప్రాంతాల్లో శీతల వాతావరణం నెలకొంది. గురువారం కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో సాధారణ వర్షాలు, అనకాపల్లి, కాకినాడ, విశాఖ, అల్లూరి జిల్లా, విజయనగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. -
ఆదిలాబాద్ @ 4.7 డిగ్రీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పతనమయ్యాయి. చాలాచోట్ల సాధారణం కంటే సగటున 2 డిగ్రీ సెల్సియస్ నుంచి 4 డిగ్రీ సెల్సియస్ తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం రాష్ట్రంలో అత్యంత తక్కువగా ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత 4.7డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ఇక్కడ ఈ సమయంలో నమోదు కావాల్సిన సాధారణ ఉష్ణోగ్రత కంటే 8.1 డిగ్రీలు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం.పటాన్చెరు, హకీంపేట్, హనుమకొండ, మెదక్, నిజామాబాద్, రామగుండం, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో సాధారణం కంటే 4డిగ్రీ సెల్సియస్‌కు పైబడి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒక్కసారిగా నెలకొన్న వాతావరణ పరిస్థితులతో ఉష్ణోగ్రతలు పతనమైనట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సైతం సాధారణం కంటే తక్కువగానే నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రానికి ఈశాన్య దిశనుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయి. రానున్న రెండ్రోజులు ఉదయం పూట పొగమంచు ఏర్పడుతుందని, దీంతో జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచించింది.రానున్న మూడురోజులు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటె 4డిగ్రీల వరకు తక్కువగా నమోదు కావొచ్చని వాతావరణ శాఖ సూచించింది. అత్యంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదై ప్రాంతాలు ఆదిలాబాద్ : 4.7 డిగ్రీలు, అర్లి : 6.3డిగ్రీలు, తండ్ర: 6.6 డిగ్రీలు, తిర్యాణి: 6.7 డిగ్రీలు, కొహిర్: 6.8డిగ్రీలు, జుక్కల్: 7.6డిగ్రీలు, కొట్గిరి: 7.7 డిగ్రీలు, శివంపేట్: 8 డిగ్రీలు, మల్లాపూర్: 8 డిగ్రీలు, మోమీన్‌పేట్: 8.2 డిగ్రీ సెల్సియస్ చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
నేడు అల్పపీడనం!
సాక్షి, విశాఖపట్నం/సాక్షి, చెన్నై: అండమాన్ సముద్రంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర అల్పపీడనంగా బలపడే సూచనలు ఉన్నాయని వెల్లడించారు. అనంతరం తమిళనాడు ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్, యానాంలో ఈశాన్య, తూర్పు గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. అల్పపీడన ప్రభావంతో కోసాంధ్ర జిల్లాల్లో ఈ నెల 17 తరువాత అక్కడక్కడా మోస్తరు వానలు పడే సూచనలున్నాయని తెలిపారు. తమిళనాడులో భారీ వర్షాలు తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్కాశి జిల్లాలను వర్షం ముంచెత్తడంలో జనజీవనం స్తంభించింది. ఈశాన్య రుతుపవనాల సీజన్లో తమిళనాడులో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజుల క్రితం బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం తీరాన్ని తాకినప్పటి నుంచి తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్కాశి జిల్లాలో వర్షాలు ముంచెత్తుతున్నాయి. లక్షలకు పైగా క్యూసెక్కుల నీరు తామర భరణి నదిలో ప్రవహిస్తుండటంతో తీరగ్రామాల ప్రజల్లో ఆందోళన ఉధృతమైంది. విరుదునగర్ జిల్లా శివకాశీ సమీపంలోని ప్రమాదవశాత్తూ నీటి గుంటలో పడి రాజేశ్వరి (32), ఆమె కుమారుడు దర్శన్ (5) మరణించారు. -
17 నుంచి కోస్తాంధ్ర జిల్లాలకు వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ అండమాన్ సముద్రంపై శనివారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే సూచనలున్నాయని.. దీని ఫలితంగా రాష్ట్రంపై మళ్లీ వర్ష ప్రభావం ఉండబోతోందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 17 తర్వాత అల్పపీడన ప్రాంతాలు ఏర్పడేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయని, ఇవి కోస్తాపై ప్రభావం చూపిస్తాయని.. 17వ తేదీ రాత్రి నుంచి ఏపీ తీరప్రాంత జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. -
వాయు‘గండం’ లేనట్లే.!
సాక్షి, విశాఖపట్నం: ఇటీవల ఫెంగల్ తుపాన్‌తో వణికిన దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలు.. మరోసారి అదే వైపుగా అల్పపీడనం వస్తుండటంతో ఆందోళనకు గురవుతుండగా.. ఆ భయం వద్దని వాతావరణశాఖ ధైర్యం చెప్పింది. దీని ప్రభావం రాష్ట్రంపై అంతగా ఉండదని స్పష్టం చేసింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది వాయుగుండంగా బలపడిన తర్వాత.. శ్రీలంక, తమిళనాడు తీరాలవైపుగా పయనించి అక్కడే తీరం దాటే సూచనలున్నాయని వెల్లడించారు. ఈ తీవ్ర అల్పపీడనం ప్రభావంతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. గురువారం కోస్తా జిల్లాల్లో వాతావరణం మేఘావృతంగా ఉంటుందని పేర్కొన్నారు. -
చలికాలంలోనూ ‘ఎండలు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చలికాలం కొనసాగుతున్నప్పటికీ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే స్వల్పంగా పెరిగాయి. ఇటీవలి తుపానుతోపాటు బంగాళాఖాతంలో నెలకొన్న పరిస్థితుల ప్రభావంతో రాష్ట్ర వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. వాతావరణంలో తేమ శాతం కూడా వేగంగా పెరిగింది. దీంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలోని చాలా చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఖమ్మంలో అత్యధికంగా 33.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైంది. ఇది సాధారణం కంటే 4.5 డిగ్రీలు అధికం. అలాగే భద్రాచలం, హనుమకొండ, హైదరాబాద్, నిజామాబాద్‌లలో రెండు డిగ్రీల సెల్సియస్ చొప్పున ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఇక కనిష్ట ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే రామగుండం, మెదక్, దుండిగల్లలో సాధారణం కంటే 7 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవడం గమనార్హం. మిగిలిన చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల నుంచి 7 డిగ్రీల వరకు అధికంగా నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. మరో మూడు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. -
బంగాళాఖాతంలో అల్పపీడనం
సాక్షి, అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రం మీదుగా ఉన్న ఆవర్తనం ప్రభావంతో శనివారం అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా కొనసాగుతూ 11వ తేదీ నాటికి శ్రీలంక–తమిళనాడు తీరాల సమీపానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో ఆదివారం ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయగోదావరి, ఏలూరు, కృష్ణాజిల్లాల్లో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. -
సర్కారు నిర్వాకంతో తడిసిముద్దయిన ధాన్యం రాశులు.. అన్నదాత అగచాట్లు
బస్తాల్లో ధాన్యం తడిసి ముద్దయ్యింది.. ఎకరం 50 సెంట్లలో వరి సాగుచేశా. ఎకరాకు 54 బస్తాల దిగుబడి వచి్చంది. తేమ శాతం ఎక్కువగా ఉందని ఆరబెట్టమన్నారు. రోడ్లపై ఆరబెట్టాను. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే అమ్ముదామని అనుకున్నా. మిల్లర్లకు చేరవేస్తే క్వింటాకు రూ.1,500 ఇస్తామంటున్నారు. ఇప్పుడు బస్తాల్లోకి ఎక్కించిన ధాన్యం కాస్తా ఇలా తడిసి ముద్దయింది. ధర ఎంతొస్తుందో తెలియని పరిస్థితి దాపురించింది. – అంగరాల రాంబాబు, చిట్టిగూడెం, గూడూరు మండలం, కృష్ణాజిల్లాసాక్షి, అమరావతి: ఫెంగల్ తుపాను వస్తుందని నాలుగైదురోజుల క్రితమే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. కోతలు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో బాధ్యతగల ఏ ప్రభుత్వమైనా ఏం చేస్తుంది.. ముందుగా కోసిన పంటను ఆఘమేఘాల మీద కొనుగోలు చేసి రైతులను ఆదుకునేలా చర్యలు చేపడుతుంది. కానీ, నిత్యం సొంత డబ్బా కొట్టుకునే టీడీపీ కూటమి ప్రభుత్వం చేతగానితనంవల్ల కళ్లెదుటే తమ కష్టార్జితం తడిసిముద్దవడంతో అన్నదాతల వేదన అంతాఇంతా కాదు. ఇప్పటికే రెక్కలు ముక్కలు చేసుకుని ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీస మద్దతు ధరలేక రైతులు అల్లాడిపోతుంటే.. ఫెంగల్ తుపాను ప్రభావంతో వారి పరిస్థితి ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయింది. అలాగే, ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చేతులెత్తేయడం.. తమ కష్టార్జితాన్ని దళారీలు సొమ్ము చేసుకుంటుండడంతో వారు క్వింటాకు రూ.500కు పైగా నష్టపోతున్నారు. ఇదిలా ఉంటే.. తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు కళ్లాల మీద ఉన్న వరిచేలు నేలకొరుగుతుంటే.. కోసిన పంట తడిసి ముద్దవుతోంది. కనీసం నష్టానికి తెగనమ్ముకుందామన్నా కూడా కొనే నాథుడు కన్పిచక రైతులు అన్నిరకాలుగా దగాకు గురవుతున్నారు. ఫెంగల్ కలవరంతో రైతులు పడరాని పాట్లు.. ప్రస్తుతం పంట చేతికొచ్చే సమయంలో విరుచుకుపడుతున్న ఫెంగల్ తుపాను రైతులను మరింత కలవరపెడుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో మాత్రమే 60–70 శాతం కోతలు పూర్తయ్యాయి. కొన్ని జిల్లాల్లో 20–40 శాతం కోతలు పూర్తికాగా, మెజార్టీ జిల్లాల్లో 15–20 శాతం మాత్రమే కోతలు పూర్తయ్యాయి. కోసిన పంటను కనీసం 3–4 రోజులపాటు ఆరబెడితేగాని తేమ శాతం తగ్గే అవకాశం ఉండదు. దీనికితోడు.. కూలీల కొరత, మరోవైపు సంచుల కొరత తీవ్రంగా ఉంది. అలాగే, తూకం వేయకుండా సంచుల్లో నింపిన ధాన్యాన్ని తరలించే దారిలేక రోడ్ల మీద, పంట పొలాల మీదే ఉంచేసారు. ఈ నేపథ్యంలో.. శనివారం కురిసిన వర్షాలకు ఈ ధాన్యం కాస్తా తడిసి ముద్దవడంతో తేమశాతం పెరగడమే కాక రంగుమారి పోయే పరిస్థితి నెలకొంది. ఈ తేమ శాతం తగ్గితేగానీ కొనుగోలు కేంద్రాల్లో అమ్మే పరిస్థితిలేదు. ఇదే వంకతో గడిచిన మూడ్రోజులుగా ప్రైవేటు వ్యాపారులు సైతం ధాన్యం కొనేందుకు ముందుకు రావడంలేదు. అయినాసరే.. ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లుగా ఉంది. ముఖ్యంగా.. ఉభయ గోదావరి, కాకినాడ, కోనసీమ, కృష్ణా జిల్లాల్లో ఎక్కడికెళ్లినా కోసిన పంట రోడ్లపైన, కళ్లాల్లోనే కన్పిస్తోంది. ఆరబోత కోసం రోడ్లపై వేసిన ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకునేందుకు.. కోసిన ధాన్యంలో తేమ శాతాన్ని తగ్గించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు.. అధిక శాతం పంట ఇంకా కళ్లాలు, పొలాల్లోనే ఉండడంతో కోసిన పంటను అక్కడే ఆదరాబాదరాగా కుప్పలు పెడుతున్నారు. ఇవి కనీసం నాలుగైదు రోజులు పనల మీదే ఎండాల్సి ఉంది. వాతావరణ మార్పులతో ధాన్యం రంగుమారే ప్రమాదం ఉందని రైతులు బెంబేలెత్తిపోతున్నారు. పీడిస్తున్న టార్పాలిన్ల కొరత.. ఇక టార్పాలిన్ల కొరత కూడా రైతులను పట్టిపీడిస్తోంది. అద్దెకు తెచ్చుకుని కప్పుకుంటున్నారు. అవి కూడా అరకొరగానే దొరుకుతున్నాయి. ఎకరం విస్తీర్ణంలో పండిన ధాన్యానికి కనీసం మూడ్రోజులపాటు ఆరబెట్టుకునేందుకు రూ.వెయ్యి నుంచి రెండువేల వరకు డిమాండ్ చేస్తున్నారు. వర్షాలు మరో నాలుగైదు రోజులు కొనసాగితే అద్దె భారం తడిసి మోపెడవక తప్పని పరిస్థితి. అమ్ముకోవాలంటే మండపేటకు వెళ్లండిఇదిలా ఉంటే.. కృష్ణాజిల్లాలో రైసుమిల్లుల వద్ద ధాన్యం లోడులతో వందలాది లారీలు బారులుతీరాయి. దీంతో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడంలేదు. పైగా.. అమ్ముకోవాలంటే మండపేట మిల్లులకు తరలించుకోవాలని రైతులకు ఉచిత సలహా ఇస్తున్నారు. కృష్ణాజిల్లా నుంచి మండపేట తరలించాలంటే రైతులకు రవాణా చార్జీలు తడిసిమోపెడవుతాయి. ఒకవేళ వ్యయప్రయాసలకోర్చి తరలించినా మండపేట మిల్లుల వద్ద కూడా 3–4 రోజుల పాటు పడిగాపులు పడాల్సిన పరిస్థితులున్నాయని చెబుతున్నారు. జీఎల్టీ చెల్లింపుల ఊసులేదు.. వైఎస్ జగన్ హయాంలో హమాలీల చార్జీలు భరించడంతో పాటు రవాణా సౌకర్యాలను ప్రభుత్వమే సమకూర్చేది. ఒకవేళ రైతే సొంతంగా తరలించుకుంటే గన్నీ, లేబర్, ట్రాన్స్‌పోర్టు (జీఎల్టీ) చార్జీలు నేరుగా రైతుల ఖాతాలో జమచేసేది. కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వంలో హామీల చార్జీలు చెల్లించడంగానీ, రవాణా సౌకర్యాలు కల్పించడంగానీ ఎక్కడా జరగడంలేదు. మంత్రి నాదెండ్ల ప్రచారార్భాటం.. విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారిపై 60 కిలోమీటర్ల పొడవునా ఇరువైపులా సర్వీవస్ రోడ్లలో ధాన్యం రాశులే కన్పిస్తున్నాయి. తుపాను హెచ్చరికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం రాసులు శనివారం కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యాయి. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ వారం జిల్లా పర్యటనలో ప్రచారార్భాటానికి ఇచ్చిన ప్రాధాన్యత ధాన్యం కొనుగోళ్లపై పెట్టలేదని సాక్షాత్తు రైతులే ఆరోపించారు. నిజానికి.. రోడ్లపై ఆరబడిన ధాన్యాన్ని 48 గంటల్లోనే మిల్లులకు తరలిస్తామని మంత్రి ఆర్భాటంగా ప్రకటన చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎక్కడా ఆ పరిస్థితిలేదు. కృష్ణా జిల్లా కంకిపాడు సమీపంలో తడిసిపోయిన వరి పనలు జిల్లాల్లో ఇదీ పరిస్థితి..⇒ ఉత్తరాంధ్రలో విశాఖ, శ్రీకాకుళం, మన్యం జిల్లాల్లో 50–60 శాతం కోతలు పూర్తికాగా, అనకాపల్లి జిల్లాలలో కేవలం 12 శాతం మాత్రమే కోతలు పూర్తయ్యాయి. ఈ జిల్లాల్లో తుపాన్ ప్రభావం పెద్దగా ఉండదని అంచనా వేస్తున్నారు. అయితే, ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిస్తే ధాన్యం రంగుమారి రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందంటున్నారు. ⇒ పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల్లో 60–70 శాతం కోతలు పూర్తయ్యాయి. కళ్లాల్లో లక్ష టన్నులకు పైగా ధాన్యం రాసులు పోసి ఉన్నాయి. దాదాపు లక్ష ఎకరాల పంట పక్వానికి వచ్చి కోతకు సిద్ధంగా ఉంది. ఈ దశలో వర్షాలు కురిస్తే కళ్లాల్లో ఉన్న ధాన్యం రంగుమారడమే కాదు.. వర్షపు నీరు పొలాల్లో చేరి కనీసం 2–3 రోజులుంటే పక్వానికి వచ్చిన పంటకు కూడా తీవ్రనష్టం తప్పదంటున్నారు. ⇒ ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 30–40 నూరి్పడి చేసిన ధాన్యాన్ని రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పోసి ఆరబెట్టుకుంటున్నారు. ఈ డెల్టా పరిధిలో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కోతకు వచి్చన వరి పంట నేలవాలింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు మొలకలొచ్చే పరిస్థితులు కని్పస్తున్నాయి. పొలాల్లో వర్షపు నీరుచేరితే నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. ⇒ గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో వరి పంట కోతకు సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు కేవలం 15 శాతానికి మించి కోతలు పూర్తికాలేదు. కోత కోసి ఓదె మీద ఉన్నప్పుడు వర్షం వస్తే నష్టం ఎక్కువగా ఉంటుందనే ఆలోచనతో యంత్రాలతోనే నూర్పిడికి మొగ్గు చూపుతున్నారు. ఆది, సోమవారాల్లో భారీ వర్షాలు పడితే తాము నిండా మునిగిపోతామని రైతులు కలవరపడుతున్నారు. ఈ జిల్లాల్లో తీతకు సిద్ధంగా ఉన్న పత్తి, వాగుల వెంబడి ఉన్నా మిరప పంటలు దెబ్బతినే అవకాశం కన్పిస్తోంది. ⇒ నెల్లూరు జిల్లాలో రైతులు ముందస్తు రబీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. జలాశయాల్లో నీరు సమృద్ధిగా ఉండడంతో ఈ జిల్లాల్లో వరి సాగుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. పెన్నా డెల్టా, కనుపూరు కాలువల కింద వరి నారుమడుల కోసం విత్తనాలు జల్లారు. మరికొన్నిచోట్ల నారుమడులు సిద్ధంచేసుకుంటున్నారు. ఈ దశలో 2–3 రోజులు వర్షాలు కురిసి, పొలాల్లో నీరుచేరితే నష్టపోతామని రైతులు చెబుతున్నారు. ⇒ తిరుపతి, ప్రకాశం జిల్లాల్లో పంట 45–60 రోజుల దశలో ఉంది. ఈ జిల్లాల్లో కూడా ఎడతెరిపిలేకుండా వర్షాలు కురిసి చేలల్లో చేరిన నీరు నిలిస్తే మాత్రం నష్టతీవ్రత ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. -
తిరుపతి, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్
సాక్షి, అమరావతి/విశాఖపట్నం/నెట్వర్క్: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను నెమ్మదిగా కదులుతోంది. శనివారం రాత్రికి గంటకు 7కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మహాబలిపురానికి 50 కిలోమీటర్లు, పుదుచ్చేరికి 80 కిలోమీటర్లు, చెన్నైకి 90 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. శనివారం రాత్రికి తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే తమిళనాడు–పుదుచ్చేరి తీరాల వద్ద కారైకాల్, మహాబలిపురం మధ్య పుదుచ్చేరి దగ్గర తీరం దాటే ప్రక్రియ మొదలైనట్టు పేర్కొంది.తీరం దాటే సమయంలో ఇంకా నెమ్మదిగా కదులుతున్నట్టు తెలిపింది. తుపాను చెన్నైకి సమీపంలో తీరం దాటేందుకు వచ్చినట్టే వచ్చి దాదాపు 6 గంటల వరకూ సముద్రంలోనే స్థిరంగా నిలిచిపోయింది. అనంతరం.. పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ పుదుచ్చేరి తీరం వైపు పయనించింది. తుపాను తీరం దాటిన తర్వాత తీవ్ర వాయుగుండంగా బలహీనపడనుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే తుపాను ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తుండగా.. కోస్తాంధ్ర జిల్లాల్లో తీరం వెంబడి తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడుతున్నాయి.భారీ నుంచి అతి భారీ వర్షాలు డిసెంబర్ 2 వరకూ కొనసాగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. తిరుపతి, నెల్లూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని.. ఆయా జిల్లాల్లోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులు 3వ తేదీ వరకూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. తుపాను తీవ్రత దృష్ట్యా తిరుపతి, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో అత్యంత తీవ్రంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తూ∙ఆరెంజ్ అలర్ట్, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో ఎల్లో అలర్ట్ ప్రకటించారు.రెండు జిల్లాల్లో కుండపోతశ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం, వైఎస్సార్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెగని వర్షాలకు తిరుపతి జిల్లా అంతా తడిసి ముద్దయింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నెల్లూరు జిల్లాలోనూ వర్షాల తీవ్రతకు అనేక ప్రాంతాల్లోని రోడ్లపై నీరు చేరింది. కోస్తా జిల్లాల అంతటా వర్షాలు పడుతుండటంతో కళ్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయి పనికిరాకుండా పోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో ఆకస్మిక అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారుహెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి.ఈదురుగాలులు ఎక్కువగా ఉండటంతో చలి తీవ్రంగా ఉంది. జనమంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. వాకాడు, కోట, చిట్టమూరు, చిల్లకూరు, సూళ్లూరుపేట, తడ మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదయ్యపాళెం నుంచి∙సంతవేలూరుకు వెళ్లే మార్గంలో సీఎల్‌ఎన్‌పల్లి వద్ద పాముల కాలువ, అంబూరు సమీపంలో మార్ల మడుగు కాలువలు ఉధృతంగా ప్రవహించడంతో ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 10 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పెద్ద పాండూరు సమీపంలో రాళ్ల కాలువ వద్ద నీటి ఉధృతి పెరగడంతో మరో 7 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోవంతో విద్యుత్‌కు అంతరాయం కలిగింది.తిరుమలలో భారీ వర్షంతిరుమలలో శనివారం ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చలి తీవ్రత పెరిగింది. చంటి పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అద్దె గదులు దొరకని భక్తులు షెడ్ల కింద వర్షానికి, చలికి వణికిపోతున్నారు. వ్యాపార సంస్థలు ఉదయం నుంచి మూతపడ్డాయి. తిరుమల శిలాతోరణం నుంచి శ్రీవారి పాదాల వద్దకు వెళ్లే మార్గంతోపాటు, ఆకాశ గంగ, పాపవినాశనం మార్గాలను తాతాల్కింగా మూసివేశారు. విమాన సర్వీస్‌లు రద్దువిజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమాన సరీ్వస్‌లను శనివారం రద్దు చేశారు. చెన్నై విమానాశ్రయాన్ని మూసివేయడంతో అక్కడి నుంచి గన్నవరం వచ్చి వెళ్లాల్సిన రెండు ఇండిగో విమానాలు రద్దయ్యాయి. తిరుపతి, షిర్డీ విమాన సర్వీస్‌లు కూడా రద్దయ్యాయి. చెన్నై, షిర్డీ, తిరుపతి వెళ్లాల్సిన ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. కాగా.. తిరుపతి (రేణిగుంట) విమానాశ్రయంలోని రన్‌వేపై నీళ్లు చేరడంతో ఏడు విమాన సరీ్వస్‌లు రద్దయ్యాయి. భీములవారిపాలెంలో అత్యధికంగా 13.1సెంటీ మీటర్లుశనివారం తిరుపతి జిల్లా భీములవారిపాలెంలో అత్యధికంగా 13.1సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా మన్నార్పోలూర్లో 13.0, పుత్తూరులో 12.3, సూళ్లూరుపేటలో 11.8, పూలతోటలో 11.5, తడలో 10.8, మల్లంలో 10.3, చిత్తూరు జిల్లా నగరిలో 9.4, నిండ్రలో 8.8 సెంటీమీటర్లు చొప్పున వర్షపాతం నమోదైంది.సముద్రం అల్లకల్లోలంవిశాఖ సముద్ర తీరం భారీ కెరటాలతో అల్లకల్లోలంగా మారింది. మూడు అడుగుల కంటే ఎత్తుగా కెరటాలు ఎగసి పడుతున్నాయి. విశాఖలోని వైఎంసీఏ నుంచి విక్టరీ ఎట్ సీ వరకు గల తీరం భారీగా కోతకు గురయింది. నాలుగు అడుగులకుపైగా ఎత్తున ఇసుక పూర్తిగా కోతకు గురైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో శనివారం ఉదయం నుంచి జల్లులు పడటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కాకినాడ, తూర్పు గోదావరి, కోనసీమ జిల్లాల్లో జల్లులు కురిశాయి. విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలో అక్కడడక్కడా జల్లులు పడ్డాయి.కృష్ణా జిల్లా వ్యాప్తంగా శనివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వర్షం కురవడంతో రోడ్ల వెంబడి ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. కోతలు కోసి పనలపై ఉన్న ధాన్యం తడిసిపోయింది. హంసలదీవి వద్ద సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. పల్నాడు జిల్లాలో అక్కడక్కడా జల్లులు పడుతున్నాయి. బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాలలో విడతలవారీగా ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. సుమారు 3వేల ఎకరాలకుపైగా వరిపంట నేలకొరిగింది.తుపానుపై సీఎం సమీక్ష సాక్షి, అమరావతి: ఫెంగల్ తుపాను నేపథ్యంలో అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తుపాను పరిస్థితులపై శనివారం జిల్లా కలెక్టర్లు, సీఎంవో, రియల్ టైమ్ గవర్నెన్స్ అధికారులతో సమీక్షించారు. ఆర్టీజీ ద్వారా నిరంతర పర్యవేక్షణతో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట నివారణకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు.సహాయ, పునరావాస కార్యక్రమాలకు సమాయత్తం కావాలని కలెక్టర్లను ఆదేశించారు. తుపాను విషయంలో రైతులు ఆందోళనగా ఉన్నారని, నిరి్ధష్టమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలని సూచించారు. కాగా, ఫెంగల్ తుపాను దృష్ట్యా భారీ వర్షాలు కురిసి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడితే పునరుద్ధరణ చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉండాలని విద్యుత్ సంస్థలను ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ శనివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సూచించారు. -
వణికిస్తున్న చలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రివేళ చలి పెరిగిపోతోంది. కనిష్ట ఉష్ణోగ్రతల్లో భారీగా తగ్గుదల చోటు చేసుకుంటోంది. ప్రస్తుత సమయంలో సాధారణంగా నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతల కంటే తక్కువగా నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దిగువన ఉన్న రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతుండడంతో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరోవైపు గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా తగ్గుతున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు సగటున 2 డిగ్రీల సెల్సియస్ తక్కువగా, కనిష్ట ఉష్ణోగ్రత 6.5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు కావడం గమనార్హం. మరో మూడు రోజుల పాటు సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. గరిష్టం నిజామాబాద్ ః 32.4 శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత నిజామాబాద్‌లో 32.4 డిగ్రీ సెల్సీయస్, కనిష్ట అదిలాబాద్‌లో 8.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.రాష్ట్రంలోని దాదా పు 30 ప్రాంతాల్లో 13 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ నమోదు అయ్యింది. ఆదిలాబాద్‌లో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 6.5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు కాగా, మెదక్, హనుమకొండల్లో 3 డిగ్రీ సెల్సీయస్ తక్కువగా నమోదైంది. అక్కడక్కడా తేలికపాటి వర్షాలు తాజా పరిస్థితుల్లో కుమ్రుంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో శీతలగాలులు వీస్తాయని వాతావరణ శాఖ సూచించింది. శని, ఆదివారాల్లో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఉత్తర ప్రాంత జిల్లాల్లో ఉదయం పూట పొగమంచుకు అవకాశం ఉంటుందని సూచించింది. -
మళ్లీ తుపానుగా బలపడిన వాయుగుండం
సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: బలపడటం.. బలహీనపడటం.. మళ్లీ బలపడటం.. ఇలా నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రోజుకో రకంగా రూపాంతరం చెంది, శుక్రవారానికి తుపానుగా మారింది. తీవ్ర వాయుగుండం గమనాన్ని బట్టి మొదట తుపానుగా మారుతుందని అంచనా వేసినా, గురువారానికి బలహీనపడింది. కానీ, మళ్లీ పుంజుకొని గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతూ శుక్రవారం మ«ద్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఫెంగల్ తుపానుగా బలపడింది. వ్యతిరేక దిశలో ఉన్న షీర్ జోన్ బలహీనపడటం వల్లే వాయుగుండం మళ్లీ బలపడినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇది ప్రస్తుతం ట్రింకోమలికి 310 కిలోమీటర్లు, పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయ దిశగా 270 కిలోమీటర్లు, చెన్నైకి ఆగ్నేయంగా 300 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ శనివారం మధ్యాహ్నం లేదా సాయంత్రానికి పుదుచ్చేరికి సమీపంలోని కారైకల్, మహాబలిపురం మధ్య తీరాన్ని దాటే అవకాశాలున్నాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. తీరాన్ని దాటే సమయంలో గంటకు 70 నుంచి 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పారు. శనివారం అర్ధరాత్రి బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని తెలిపారు. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా అత్యంత భారీ వర్షాలు, కడప, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.వేటకు వెళ్లొద్దు..తుపాను ప్రభావంతో దక్షిణ కోస్తాలో తీరం వెంబడి గంటకు 60 నుంచి 80 కిమీ, ఉత్తర కోస్తాలో 40 నుంచి 60 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అధికారులు తెలిపారు. మత్స్యకారులు డిసెంబర్ 1 వరకూ వేటకు వెళ్లొద్దని సూచించారు. ఉత్తర కోస్తా జిల్లాల్లో సాధారణం కంటే 1.5 మీటర్లు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో 2.7 నుంచి 3.3 మీటర్ల వరకూ ఎగసి పడుతూ అలలు అల్లకల్లోలం సృష్టిస్తాయని తెలిపారు. సందర్శకులు కూడా సముద్ర తీరానికి వెళ్లవద్దని సూచించారు.పోర్టులకు హెచ్చరికలుఫెంగల్ తుపాను కారణంగా కృష్ణపట్నం పోర్టులో డేంజర్ సిగ్నల్ నం–6 జారీ చేశారు. విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో డిస్టెన్స్ వార్నింగ్ సిగ్నల్–2 జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం, వాడరేవు పోర్టుల్లోనూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. -
వాయుగుండం ముప్పు ఏపీకి తక్కువే..
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో దూసుకొస్తున్న వాయుగుండం ముప్పు ఏపీకి ఉండే అవకాశాలు చాలా తక్కువని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దక్షిణ అండమాన్ సముద్రం వరకూ విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో శుక్రవారం ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది క్రమంగా బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ 25 నాటికి దక్షిణ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుందని విశాఖ తుపాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావం ఏపీపై తక్కువగా ఉంటుందని, దక్షిణ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపుగా కదిలే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. వాయుగుండం మరింత బలపడి తుపానుగా కూడా మారే సూచనలూ కనిపిస్తున్నాయని, దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలోని నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో 26, 27 తేదీల్లో పలుచోట్ల మోస్తరు వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. -
25న వాయుగుండం
సాక్షి, విశాఖపట్నం: ఓవైపు చలిగాలులు ప్రారంభమైన తరుణంలో... భారీ వర్షాలు మరోసారి విరుచుకుపడనున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల మీదుగా గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో 23 నాటికి అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అనంతరం.. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ, 25 నాటికి మరింత బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా మారుతుందని వెల్లడించారు. క్రమంగా.. ఇది దక్షిణకోస్తా మీదుగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందనీ.. లేదంటే.. దక్షిణ కోస్తాంధ్రలోనే తీరం దాటే సూచనలు కూడా ఉన్నాయని వివరించారు. దీని ప్రభావంతో 25 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. 23 నుంచి తీరం అల్లకల్లోలంగా ఉంటుందని, తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిమీ వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. మత్స్యకారులు 23 నుంచి 27 వరకూ వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
రాష్ట్రానికి తుపాను ముప్పు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి మళ్లీ తుపాను ముప్పు పొంచి ఉంది. ఈ నెల చివరి వారంలో రాష్ట్రాన్ని తుపాను తాకనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ బంగాళాఖాతంలోని అండమాన్ సముద్రంలో ఈ నెల 23వ తేదీన అల్పపీడనం ఏర్పడుతుందని పేర్కొంది. 27వ తేదీ నాటికి అది తుపానుగా బలపడి 28వ తేదీలోపు చెన్నై, నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో 24వ తేదీ నుంచి రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. -
నేడు, రేపు వానలు
సాక్షి, విశాఖపట్నం: దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుంచి ఒడిశా వైపు కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణాంధ్రప్రదేశ్ తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల మధ్య విస్తరించి కొనసాగుతోంది.దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని విశాఖలోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించారు. -
బలహీనపడిన ‘దానా’ తుపాను
సాక్షి, అమరావతి: తీవ్రమైన తుపాను ‘దానా’ బలహీనపడింది. గురువారం రాత్రి 1:30 నుంచి తెల్లవారుజాము 3:30 గంటల మధ్య ఒడిశాలోని హబాలిఖతి నేచర్ క్యాంప్ (భిత్తర్కనిక), ధమ్రాకు సమీపంలో తీరం దాటింది. ఇది 10 కి.మీ వేగంతో ఉత్తర–వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర కోస్తా ఒడిశా మీదుగా ఒడిశాలోని భద్రక్‌కు 30 కి.మీ, ధమ్రాకు 50 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను కేంద్రం చుట్టూ గరిష్ట స్థిరమైన గాలులు గంటకు 80–90 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఉత్తర ఒడిశా వద్ద వాయువ్య దిశగా కదులుతూ కొద్దిగంటల్లో ఇది తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. -
రాష్ట్రంలో రెండ్రోజులు వర్షాలు!
సాక్షి, హైదరాబాద్: తూర్పు– మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతూ బుధవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో తుపానుగా మారింది. ఇది పారదీప్ (ఒడిశా)కు ఆగ్నేయ దిశగా సుమారు 560 కిలోమీటర్ల దూరంలో కొనసాగుతోంది. వాయువ్య దిశగా కదులుతూ గురువారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం 25న తెల్లవారుజాము కల్లా ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో పూరి, సాగర్ దీవుల మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలుచోట్ల తేలికపాటి వర్షాలు, కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఉత్తర ప్రాంత జిల్లాల్లోని ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించారు. తగ్గుతున్న ఉష్ణోగ్రతలు: ప్రస్తుతం రాష్ట్రానికి ఉత్తర, ఈశాన్య దిశల నుండి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. ఈశాన్య రుతుపవనాల సీజన్లో రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నాటికి 7.48 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా. 6.02 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు 81.35 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, బుధవారం నాటికి 102.28 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సాధారణ వర్షపాతం కంటే 26 శాతం అధిక వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవన సీజన్ నుంచి ఈశాన్య రుతుపవనాల సీజన్ వరకు రాష్ట్రవ్యాప్తంగా 5 జిల్లాల్లో అత్యధికం, 16 జిల్లాల్లో అధికం, 12 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. బుధవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న రెండ్రోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది. -
23న పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో తుపాను
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో ఈనెల 23న తుపాను ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్పింది. ప్రస్తుతం ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో ఎగువ గాలులతో ఏర్పడిన చక్రవాతపు ఆవర్తనం ప్రభావం వల్ల సోమవారం ఉదయానికి తూర్పు–మధ్య బంగాళాఖాతం, పరిసర ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ఇది పశ్చిమ–వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడి ఈ నెల 22వ తేదీ ఉదయం కల్లా వాయుగుండంగా మార్పు చెందుతుందని వెల్లడించింది. ఆ తర్వాత వాయుగుండం బలపడి ఈనెల 23న పశ్చిమ–మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వివరించింది. ఇది వాయవ్య దిశగా కదులుతూ ఈ నెల 24వ తేదీ ఉదయం కల్లా ఒడిశా–పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. మరోవైపు ఉత్తర తమిళనాడు తీరానికి ఆనుకుని నైరుతి, పరిసర పశి్చమ మధ్య బంగాళాఖాతంలో మరో చక్రవాతపు ఆవర్తనం కొనసాగుతోంది. ఇది బలపడి అల్పపీడనం, ఆ తర్వాత వాయుగుండంగా మార్పు చెందే క్రమంలో రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రుంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగుడెం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, ఒకట్రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. రానున్న రెండు రోజులు రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ వివరించింది. -
రాష్ట్రంలో మళ్లీ వర్షాలు
సాక్షి, అమరావతి/విశాఖపట్నం: ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాల ప్రభావంతో ఆదివారం నుంచి 5 రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం అండమాన్ సముద్రంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ నెల 21 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఇది ఉత్తర వాయువ్య దిశగా పయనించి 23వ తేదీ నాటికి వాయుగుండంగా, ఆ తర్వాత తుపానుగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.ఈ వాయుగుండం పశ్చిమ బెంగాల్ లేదా ఒడిశా లేదా ఉత్తరాంధ్రలో తీరం దాటే సూచనలు సమానంగా ఉన్నాయనీ.. 21 తర్వాత ఎక్కడ తీరం దాటుతుందనే దానిపై స్పష్టత వస్తుందని సీడబ్ల్యూసీ హెడ్ భారతి ఎస్ సబడే తెలిపారు. ఎక్కువగా ఒడిశా లేదా ఉత్తరాంధ్రలో ఈ నెల 24 నుంచి 26 మధ్యలో తీరం దాటేందుకు అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం అధికారి స్టెల్లా పేర్కొన్నారు. కాగా.. వారం క్రితం మన రాష్ట్రంలో బలహీనపడిన వాయుగుండం ప్రస్తుతం అరేబియా సముద్రం–దక్షిణ కర్ణాటక, రాయలసీమ ప్రాంతంలో అల్పపీడనంగా ఉంది. వీటన్నింటి ప్రభావంతో వచ్చే 5 రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వివరించింది. ప్రధానంగా రాయలసీమ, దక్షిణాంధ్ర జిల్లాల్లో వర్షాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ఒడిశా వైపు కదిలే అవకాశం ఉండటంతో 23వ తేదీ తర్వాత ఉత్తరాంధ్రలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఈ నెల 29న ఒకటి, వచ్చే నెల 3న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. అల్పపీడనం ఏర్పడే సూచనలు మొదలైన నేపథ్యంలో సముద్రంలో అలజడి మొదలైందనీ.. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మత్స్యకారులెవరూ ఆదివారం నుంచి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.