
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
సాధారణంకంటే 2, 3 డిగ్రీలు ఎక్కువ
ఈ వేసవిలో ఎండ తాకిడి ఎక్కువేనంటున్న వాతావరణ శాఖ
సాక్షి, అమరావతి: వేసవి తొలి రోజుల్లోనే రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రోజురోజుకి ఎండల తీవ్రత పెరుగుతోంది. గురువారం పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువ ఉంటోంది. నిన్నటి వరకు రెండు, మూడు చోట్ల మాత్రమే 40 డిగ్రీలు దాటిన ఎండ.. గురువారం చాలా మండలాల్లో 40 డిగ్రీలు దాటిపోయింది. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాలలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
అనకాపల్లి జిల్లా నాతవరం, ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయిపాలెంలో 42.1 డిగ్రీలు నమోదైంది. ఇవి సాధారణంకంటే రెండు, మూడు డిగ్రీలు ఎక్కువేనని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తరాంధ్రలోని అనకాపల్లి, పార్వతీపురం మన్యం, ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు, నంద్యాల, పల్నాడు జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది.
ఈ ఉష్ణోగ్రతలు ఏప్రిల్ రెండో వారానికల్లా మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో గాలిలో తేమ శాతం ఎక్కువగానే ఉండడం వల్ల ఉక్కపోత ఉండడంలేదు. అయితే ఎలినినో పరిస్థితుల కారణంగా సముద్ర ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో మున్ముందు ఎండ, వడగాలుల తీవ్రత కూడా పెరుగుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment