Maximum temperatures
-
నిప్పులు కక్కుతున్న సూరీడు
సాక్షి, హైదరాబాద్: సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయిలో నమోదవుతున్నాయి. ఆదివారం రాష్ట్రంలో చాలాచోట్ల సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం ఎక్కువగానే నమోదవుతున్నాయి. ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. భద్రాచలంలో గరిష్టంగా 43.8 డిగ్రీల సెల్సియస్, మెదక్‌లో 24.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 41.5 డిగ్రీల సెల్సియస్‌కు మించి నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 4.6 డిగ్రీల సెల్సియస్, భద్రాచలంలో 3.7 డిగ్రీల సెల్సియస్ అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా, మిగతా ప్రాంతాల్లో 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ వరకు అధికంగా నమోదయ్యాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రజలు బయటకు రాకపోవడమే మంచిదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సూచనలు జారీ చేసింది. రాష్ట్రంలో రానున్న రెండురోజులు పలుచోట్ల వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట్లకు ఈనెల 29 నుంచి మే 1వ తేదీ వరకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఆయా జిల్లాల్లోని పలుప్రాంతాల్లో వడగాల్పులు తీవ్రస్థాయిలో ఉంటాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రణాళికా శాఖ ప్రకారం 45 డిగ్రీలపైనే.. ప్రణాళికా శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని చాలాచోట్ల ఉష్ణోగ్రతలు అత్యధికంగానే నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లిలో 45.4, ములుగు జిల్లా మంగపేటలో 45.3, భద్రాద్రి కొత్తగుడెం జిల్లా అశ్వాపురంలో 45.2 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
వేడి నుంచి కాస్త ఊరట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు కాస్త తగ్గాయి. ఆకాశం మేఘావృతం కావడంతో ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వాతావరణంలో తేమశాతం ఎక్కువగా ఉండడంతో ఉక్కపోత మాత్రం అధికంగానే ఉంది. శనివారం రాష్ట్రంలో నమోదైన గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 38.3 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 20.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ప్రస్తుతం మరఠ్వాడ నుంచి అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా కోమరిన్ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రానికి తక్కువ ఎత్తు నుంచి దక్షిణ, ఆగ్నేయ దిశల వైపుగా గాలులు వీస్తున్నాయి. వాతావరణంలో నెలకొన్న మార్పులతో రానున్న మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు నమోదు కావొచ్చని వాతావరణ శాఖ సూచించింది. వానలతో పాటు వడగండ్లు కూడా పడతాయని హెచ్చరించింది. సాధారణం కంటే తక్కువగా... శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సగటున 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేర గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గినట్లు వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. భద్రాచలం, హనుమకొండ, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్ జిల్లా కేంద్రాల్లో సాధారణ ఉష్ణోగ్రత కంటే 3 డిగ్రీలు తక్కువగా నమోదైంది. ఇక రామగుండంలో 3 డిగ్రీల కంటే తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. కనిష్ట ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణ స్థితిలోనే నమోదయ్యాయి. -
పగలు భగభగ.. రాత్రి గజగజ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. గతవారం వరకు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా... ఇప్పుడు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గాయి. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ పూర్తి కావడంతో వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం తోడుకావడం, రాష్ట్రానికి ఈశాన్య దిశ నుంచి చల్లని గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు పతనం కావడంతో పాటు ఈశాన్య దిశల నుంచి వస్తున్న గాలుల ప్రభావంతో చలి పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర ప్రాంత జిల్లాల్లో తక్కువగా.. సెప్టెంబర్ నెలాఖరుతో వానాకాలం ముగిసినప్పటికీ... అక్టోబర్ రెండో వారం వరకు నైరుతి ప్రభావం ఉంటుంది. తాజాగా నాలుగో వారం వరకు చలి తీవ్రత పెద్దగా లేకపోగా... రెండ్రోజులుగా వాతావరణంలో వేగంగా మార్పులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర ప్రాంత జిల్లాల్లో కని ష్ట ఉష్ణోగ్రతల్లో భారీగా తగ్గుదల నమోదవుతోంది. మెదక్, వరంగల్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మధ్యన నమోదయ్యాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2 డిగ్రీ సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే దక్షిణ ప్రాంత జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా... ఉత్తర ప్రాంతంలో మాత్రం సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 35.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 15 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది. -
ఢిల్లీలో తీవ్ర ఉక్కబోత!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతోంది. చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీ సెల్సియస్‌కుపైగా నమోదవుతుండటంతో జనం ఉక్కపోతతో ఉడికిపోతున్నారు. పొరుగున ఉన్న పంజాబ్, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతల ప్రభావంతో తీవ్రమైన వడగాలుల కారణంగా ఢిల్లీలో వేడి భయంకరంగా ఎక్కువైంది. బుధవారం ఢిల్లీలో 42 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదుకాగా, అవి ఈ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయని వాతావరణ విభాగం చెబుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న అధిక ఉష్ణోగ్రత కారణంగా ఢిల్లీలో విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. జూన్ ఒకటో తేదీన 4,390 మెగావాట్లుగా నమోదైన విద్యుత్ డిమాండ్ బుధవారానికి 7,190 మెగావాట్లకు ఎగసింది. -
హే.. సూర్య ‘భగ’వాన్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈనెల 6, 7 తేదీల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. సాధారణ ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదవుతుందని చెప్పింది. ఈ నేపథ్యంలో జాగ్రత్తలు పాటించాలని సూచించింది. మంగళవారం మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో మినహా మిగతా చోట్ల సాధారణ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 43.3 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 24.6 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది. ప్రస్తుతం తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా ఇంటీరియర్ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇది సముద్రమట్టం నుంచి 0.9 కి.మీ. ఎత్తు వరకు ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో నేడు, రేపు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. -
రాష్ట్రంలో నేడు పొడి వాతావరణం
సాక్షి, హైదరాబాద్: హిందూ మహాసముద్రం, అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు పొడి వాతావరణం నెలకొంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి నాలుగు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి రాజారావు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రి, ఉదయం సమయాల్లో పొగమంచు ఏర్పడే అవకాశముందన్నారు. 24 గంటల్లో రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఆదిలాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రత ఏకంగా 7 డిగ్రీలకు పడిపోయింది. రామగుండంలో 12, హకీంపేట, హన్మకొండ, హైదరాబాద్, మెదక్, నిజామాబాద్‌లలో 13 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మహబూబ్‌నగర్‌లో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే ఏకంగా 9 డిగ్రీలు తక్కువగా 23 డిగ్రీలు నమోదైంది. ఏడు డిగ్రీలు తక్కువగా భద్రాచలంలో 25, హన్మకొండలో 24, హైదరాబాద్‌లో 23 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
రాష్ట్రం.. గజగజ
సాక్షి, అమరావతి, సాక్షి, విశాఖపట్నం: చలి.. చలి! చిన్నా పెద్దా ఒకటే వణుకు... ఉష్ణోగ్రతల్లో పెద్దగా వ్యత్యాసం లేకపోవడంతో పగలు, రాత్రి అనే తేడా తెలియడం లేదు. భానుడి కిరణాలు సోకక ఎటు చూసినా, ఎప్పుడు చూసినా మసక మసకగానే కనిపిస్తోంది. చలి పులి పట్టపగలే అందరినీ గజగజలాడిస్తోంది. శీతల గాలుల ప్రభావానికి రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజుల వ్యవధిలో 45 మంది మృత్యువాత పడటం గమనార్హం. ఇక నోరులేని మూగజీవాల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. హఠాత్తుగా ఉష్ణోగ్రతలు పడిపోవడం, పెథాయ్ తుపాను ప్రభావంతో అతి శీతలమైన ఈదురు గాలులు ఈడ్చి కొడుతుండటంతో రాష్ట్రం మరీ ముఖ్యంగా కోస్తాంధ్ర చలితో వణికిపోతోంది. రాత్రి ఉష్ణోగ్రతలే కాకుండా పగటి ఉష్ణోగ్రతలు కూడా పడిపోయాయి. దీంతో పగటిపూట కూడా చలిగా ఉంటోంది. ఒక్కసారిగా పెరిగిన చలి జనం ప్రాణాలు తీస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వీస్తున్న శీతల పవనాలకు తట్టుకోలేక సోమవారం 26 మంది ప్రాణాలు కోల్పోగా మంగళవారం 19 మంది చనిపోయారు. రాష్ట్రంలో వడగాడ్పు మరణాలు భారీగా నమోదైనా చలిగాలులకు ఇంత పెద్ద ఎత్తున మృత్యువాత పడటం అరుదని పేర్కొంటున్నారు. వణికిస్తున్న ఉత్తరాది గాలులు బంగాళాఖాతంలో అల్పపీడనం/వాయుగుండం/తుపాన్లు ఏర్పడినప్పుడు మేఘాలు ఆవరించి ఉంటాయి. దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల చలి తీవ్రత అంతగా ఉండదు. అయితే నిన్నటిదాకా కొనసాగిన పెథాయ్ తుపాను అల్పపీడనంగా బలహీనపడడంతో చలికి రెక్కలొచ్చి నట్టయింది. శనివారం నుంచే వణికించడం మొదలైంది. అల్పపీడనం ప్రస్తుతం వాయవ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ప్రస్తుతం ఉత్తర భారతదేశం నుంచి కోస్తా వైపు చల్ల గాలులు బలంగా వీస్తున్నాయి. దీంతో పగలు, రాత్రి చలి తీవ్రత పెరుగుతోంది. ఇళ్లలోనే గడుపుతున్నా ఇబ్బంది పెడుతోంది. డిసెంబర్ 22వతేదీ నుంచి సూర్యుడు ఉత్తరార్థగోళం వైపు పయనించడం వల్ల భూమికి దూరమవుతాడు. ఫలితంగా సూర్యకిరణాలు వాలుగా పడుతూ ఎండ తీవ్రత తగ్గి రాత్రి ఉష్ణోగ్రతలు క్షీణిస్తాయని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర కోస్తాలో కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా (సాధారణం కంటే 3–10 డిగ్రీలు) తక్కువగా నమోదవుతున్నాయి. ఇది క్రమంగా మరింత తగ్గి చలి విజృంభిస్తుందని, అదే సమయంలో పొగమంచు కూడా పెరుగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. పడిపోయిన గరిష్ట ఉష్ణోగ్రతలు.. రాష్ట్రంలో చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే బాగా పడిపోయాయి. కృష్ణా జిల్లా నందిగామలో సాధారణ ఉష్ణోగ్రత కంటే ఏకంగా 10 డిగ్రీల సెల్సియస్ తక్కువగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మంగళవారం సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు విజయవాడలో 9, మచిలీపట్నంలో 8, తునిలో 7, నరసాపురంలో 7, జంగమేశ్వరపురంలో 6 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో నమోదైన పగటి, రాత్రి ఉష్ణోగ్రతల మధ్య వ్యత్యాసం స్పల్పంగా మాత్రమే ఉండటం గమనార్హం. చలి భారీగా పెరగడంతో ఉదయం 9 గంటలకు కూడా ట్యాప్ తిప్పితే నీళ్లు షాక్ కొడుతున్నాయి. మంచు దట్టంగా కురుస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో తెల్లవారుజామునే చలిమంటలు వేస్తున్నారు. పంటలకు కాపలాగా పొలాల్లో పడుకునే వారు దుంగలు రాజేసి చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. చలికి శరీరం గడ్డ కట్టుకుపోయేలా ఉందని వృద్ధులు పేర్కొంటున్నారు. ఉదయం 9 గంటలకు కూడా చలిగా ఉండటంతో బయటకు వెళ్లినవారు వణుకుతున్నారు. ద్విచక్ర వాహనదారుల అవస్థలు వర్ణణాతీతంగా మారాయి. తెల్లవారుజామునే ఉదయం నడక కోసం వెళ్లేవారు ఈ చలితో సమయాన్ని మార్చుకుని 8 –9 గంటల మధ్య వెళుతున్నారు. పొలం పనులకు వెళ్లే కూలీలు వణికిపోతున్నారు. సూర్యరశ్మి లేకపోవటంతో అరటి, బొప్పాయి ఆకులపై కురిసిన మంచు నీటి బిందువుల్లా ఉండిపోతోంది. ఊపిరితిత్తుల సమస్య ఉన్న వారు చలి తీవ్రత వల్ల నరకయాతన అనుభవిస్తున్నారు. చలి నేపథ్యంలో స్వెట్టర్లు, ఉన్ని దుస్తులకు బాగా గిరాకీ పెరిగింది. వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఏజెన్సీలో రాకపోకలకు ఇబ్బందులు ఏజెన్సీ ప్రాంతంలో రాత్రిపూట పొగమంచు దట్టంగా కమ్ముకోవడంతో రాత్రిపూట వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అరకులో పర్యాటకుల కోసం రిసార్టు నిర్వాహకులు రాత్రిపూట చలిమంటలు ఏర్పాటు చేస్తున్నారు. గాజు కిటికీలకు బయట భాగంలో మంచు దట్టంగా ఆవరిస్తోంది. జనవరిలో మరింత ఉధృతం... విశాఖపట్నం, తూర్పు గోదావరి, శ్రీకాకుళం ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికంగా ఉన్నా ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా పూర్తిస్థాయిలో పడిపోలేదు. విశాఖ జిల్లా లంబసింగిలో కనిష్ట ఉష్ణోగ్రత డిసెంబరు చివరికి సున్నా డిగ్రీలకు చేరిన సందర్భాలున్నాయి. ప్రస్తుతం ఇక్కడ 7 – 8 డిగ్రీల సెల్సియస్ దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 5 డిగ్రీల సెల్సియస్ కంటే తగ్గినప్పుడే ఇక్కడి వారు ఇబ్బంది ఎదుర్కొంటారు. ఏజెన్సీలో ఉష్ణోగ్రతలు పడిపోతే ఇళ్ల ఎదుట చలిమంటలు వేసి నిద్రిస్తారు. దీంతో కొంతవరకూ చలి నుంచి ఊరట లభిస్తుంది. చింతపల్లి, పాడేరు, నర్సీపట్నం, అరకు, మారేడుమిల్లి, సీతంపేట ఏజెన్సీల్లో జనవరిలో చలి తీవ్రరూపం దాల్చుతుంది. రాష్ట్రవ్యాప్తంగా కూడా చలి ముదురుతుంది. రక్తనాళాలు పూడుకుపోయే ప్రమాదం.. చలి బాగా పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, పిల్లలు, గుండె, ఊపిరితిత్తులు తదితర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ పీఎల్ఎన్ కపర్థి సూచించారు. ‘చలికి శరీరంలో రక్తానికి గడ్డ కట్టే స్వభావం ఉంటుంది. దీనివల్ల గుండె రక్తనాళాలు పూడుకుపోతాయి. అందువల్ల హృద్రోగ సమస్యలు ఎదుర్కొంటున్నవారు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, బలహీనులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని పేర్కొన్నారు. చలి నుంచి కాపాడుకోవాలి ఇలా.... – చలి నుంచి రక్షణ కోసం ఉన్ని దుస్తులు ధరించాలి. చెవులకు చల్ల గాలి తగలకుండా ఉన్ని మఫ్లర్, టోపీ ధరించాలి. – ఇళ్లలోకి చల్ల గాలి రాకుండా కిటికీలు మూసివేయాలి. – అవకాశం ఉన్నవారు గది వాతావరణం పడిపోకుండా ఎయిర్ కండిషనర్లు వాడుకోవచ్చు. – ద్విచక్ర వాహనాలపై రాత్రిపూట, తెల్లవారుజామున వెళ్లాల్సి వస్తే ముక్కు, చెవులకు చల్ల గాలి తగలకుండా ఉన్ని టోపీ ధరించాలి.స్వెట్టర్లు వాడాలి. – ఉదయం నడక అలవాటు ఉన్నవారు సూర్యోదయమైన తర్వాత వెళ్లడం మంచిది. -
నేడు కోస్తాలో పిడుగులు పడే అవకాశం
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఒకపక్క గరిష్ట ఉష్ణోగ్రతలు కొనసాగుతుండగా మరోవైపు అకాల వర్షాలకు దారితీసే పరిస్థితులేర్పడ్డాయి. సోమవారం కోస్తాంధ్రలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశమున్నట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఆదివారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. అలాగే రానున్న మూడు రోజులు కోస్తాంధ్రలో కొన్నిచోట్ల, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు గాని, వర్షం గాని కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రాష్ట్రంలో ఆదివారం అత్యధికంగా రెంటచింతలలో 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా తిరుపతి, నందిగామల్లో 41, విజయవాడ, కర్నూలు, అనంతపురం, నెల్లూరుల్లో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. -
మండే ఎండలు మొదలు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎండల తీవ్రత పెరిగింది. మార్చి ప్రారంభం కావడంతో రానురాను ఎండలు మండిపోతాయని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది. ఏప్రిల్ నుంచి వడగాడ్పులు మొదలవుతాయని.. ఈ సారి వడగాల్పులు ఎక్కువ రోజులు నమోదవుతాయని స్పష్టం చేసింది. దీంతో వేసవి ప్రణాళికపై ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసింది. గత 24 గంటల్లో సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల వరకు అధికంగా పలుచోట్ల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండం, నిజామాబాద్, మెదక్, మహబూబ్‌నగర్‌లలో సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా 38 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. భద్రాచలంలోనూ 2 డిగ్రీలు అధికంగా 38 డిగ్రీలు నమోదైంది. ఖమ్మం, హన్మకొండల్లోనూ 3 డిగ్రీలు అధికంగా 37 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా 36 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాత్రి ఉష్ణోగ్రతలు అక్కడక్కడ సాధారణం కంటే కొద్దిగా ఎక్కువగా నమోదయ్యాయి. ఖమ్మంలో సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువగా 25 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నల్లగొండలో 23, నిజామాబాద్, భద్రాచలంలలో 21 డిగ్రీల చొప్పున రికార్డయ్యాయి. హన్మకొండలో సాధారణం కంటే 2 డిగ్రీలు తక్కువగా 19 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. -
ఎండలు@ 44
-
ఎండలు@ 44
మంచిర్యాలలో అత్యధిక ఉష్ణోగ్రత హాజిపూర్ (మంచిర్యాల), హైదరాబాద్: రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. సోమవారం మంచిర్యాల జిల్లాలో 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వారం రోజులుగా 42 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండడం గమనార్హం. సోమవారం ఏకంగా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు పలు వాతావరణ వెబ్సైట్లు పేర్కొనగా.. అధికారులు మాత్రం 41 డిగ్రీల మేర నమోదైనట్లు వెల్లడించారు. మంచిర్యాల జిల్లాలో సింగరేణి బొగ్గు గనులు, విద్యుత్ ప్రాజెక్టులు, ఇతర పరిశ్రమలు ఎక్కువగా ఉండటంతో గరిష్ట ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లోనూ గరిష్ట ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు కాస్త అటూఇటుగా నమోదవుతున్నాయి. ఇంకా మే రాక ముందే ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో జనం లబోదిబోమంటున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల 40 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవు తున్నాయి. ఉదయం 9 గంటల నుంచే ఎండలు మండుతున్నాయి. అక్కడక్కడా వడగాడ్పులు వీస్తున్నాయి. దాంతో పగటిపూట బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. చాలా చోట్ల మధ్యాహ్నం పూట కర్ఫ్యూ తరహా వాతావరణం కనిపిస్తోంది. వాతావరణంలో తేమ శాతం కూడా ఎక్కువగా ఉంటుండటంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మరోవైపు వడదెబ్బకు సోమవారం వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మృతి చెందారు. నల్లగొండ జిల్లా పీఏపల్లి మండలం భీమనపల్లి గ్రామానికి చెందిన పశువుల కాపరి మారుపాక కృష్ణయ్య(55), యాదాద్రి భువనగిరి జిల్లా లక్ష్మీదేవిగూడెంకు చెందిన ఉల్లెంతల బిచ్చయ్య(70), సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం బద్దిపడగకు చెందిన పండపాక రాజేందర్, కవిత దంపతుల కూతురు భానుజ (16 నెలలు)లు మృతి చెందారు. -
ఏపిలో భానుడి భగ భగ!
-
తెలంగాణలో 'సూర్య' ప్రతాపం
-
న‘గరం’
ప్రతాపం చూపిస్తున్న సూర్యుడు రాజధానిలో పెరిగిన ఉష్ణోగ్రతలు బుధవారానికి 43 డిగ్రీలకు చేరుకున్న గరిష్ట ఉష్ణోగ్రత జాగ్రత్తలు తప్పనిసరని హెచ్చరిస్తున్న వైద్యులు సాక్షి, న్యూఢిల్లీ: రాజధానిలో భానుడి భగభగలు మొదలయ్యాయి. రోజురోజుకి సూర్యుడు తన ప్రతాపాన్ని పెంచుతున్నాడు. ఉదయం పది గం టలకే ఎండ తీవ్రత అధికమవుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతుండడంతో నగరవాసులు సతమతమవుతున్నారు. ఈ వారాంతానికి ఉష్ణోగ్రతలు మరింత పెరగనున్నాయని వాతావారణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. బుధవారం గరిష్ట ఉష్ణోగ్రత 43 డిగ్రీలకు చేరుకోగా, కనిష్ట ఉష్ణోగ్రత 27 డిగ్రీలుగా నమోదైంది. కాగా బుధవారం నమోదైన 43 డిగ్రీలు ఈ సీజన్లోనే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతగా వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఎండవేడిమికి తోడు వడగాలులు వీస్తుండడంతో నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. మధ్యాహ్న సమయంలో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఈ ఏడాది కాస్త ఆల స్యం గా మొదలైన వేసవి, కొద్ది రోజుల్లోనే తీవ్రరూపం దాల్చింది. అత్యవసర పనులు ఉన్నవారు మినహా మధ్యాహ్న సమయంలో బయటికి వచ్చేందుకు జనం ఇష్టపపడడం లేదు. ఎండల తీవ్రత పెరుగుతున్నందున ప్రత్యేకించి వస్త్రధారణ, ఆహారపు అల వాట్లలో మార్పులు చేసుకోవాలని వైద్యులు సూచి స్తున్నారు. ద్విచక్రవాహనాలను వాడేవారు మధ్యా హ్న సమయంలో వీలైనంత తక్కువగా ప్రయాణించేలా చూసుకోవాలంటున్నారు. ఎండలో బయటికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరిగా వెంట ఒక మంచి నీళ్ల సీసా పెట్టుకోవాలని వారు సూచిస్తున్నారు. వేసవితాపం తాళలేక... వేసవి తాపం నుంచి బయటపడేందుకు నగరవాసులు చల్లని పళ్లరసాలు, ఐస్‌క్రీమ్‌లు తింటూ గడుపుతున్నారు. పుచ్చకాయలు, చలవనిచ్చే పళ్లు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. దీంతో చిరు వ్యాపారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాల్లో పళ్లరసాలు, ఐస్‌క్రీమ్‌లు విక్రయించే చిన్నచిన్న వ్యాపారులకు గిరాకీ ఒక్కసారిగా పెరిగింది. ఎండ వేడిమి తట్టుకునేందుకు ఏసీలు, కూలర్లను ఆశ్రయిస్తున్నారు. వచ్చే వారం రోజులు సన్‌స్ట్రోక్ తప్పదు: వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వేడిగాలుల తీవ్రత అధికమైంది. రాత్రి వేళల్లోనూ వేడిగాలులు వీస్తుండడంతో నగరవాసులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇంకో వారం రోజుల్లో ఎండల తీవ్రత మరింత అధికం అవుతుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. వచ్చే వారం రోజుల్లో ఎండల తీవ్రత ఇలా ఉండవచ్చని వారు పేర్కొన్నారు. నీటి, విద్యుత్ సమస్యలపై దృష్టి సారించండి: ఎల్జీ న్యూఢిల్లీ: వేసవికాలంలో ప్రజల ఇబ్బందులు కలగకుండా వివిధ ప్రభుత్వ సంస్థలను డిప్యూటీ కమిషనర్లు సమన్వయం చేయాలని లెఫ్ట్‌నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ఆదేశించారు. నగరంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని, ప్రజలకు అవసరమైన తాగునీటి, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. జిల్లాలోని పౌర సమస్యలపై రోజువారీ నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయన మున్సిపల్ డిప్యూటీ కమిషనర్లతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజల తో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఎప్పటికప్పుడు వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కిందిస్థాయి ప్రభుత్వ అధికారులు ఇచ్చిన నివేదికలను ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు ఎల్జీ కార్యాలయానికి పంపాలన్నారు. వీటిపై రాజ్ నివాస్‌లో సమావేశాలు ఉంటాయని తెలిపారు. అలాగే నగరవాసులకు ఇబ్బంది కలిగిస్తున్న ట్రాఫిక్‌తో పాటు ఇతర సమస్యలపైనే దృష్టి కేంద్రీకరించాలని డిప్యూటీ కమిషనర్లను ఆదేశించారు. ఈ సమావేశం తర్వాత జంగ్ ముందు ఢిల్లీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజంటేషన్ ఇచ్చింది. -
ఉడికిపోతున్న జనం భగ్గుమంటున్న ఎండలు
విజయనగరం వ్యవసాయం, న్యూస్‌లైన్: ‘‘ఒరేయ్ శ్రీను ఏటిరా ఈ ఎండలు, ఉదయం 9 గంటలకే నెత్తి సుర్రుమంటోంది. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చే నెలలో ఎలా ఉం టుందోరా’’ అంటూ మండే ఎండల గురించి జనం చర్చించుకుంటూ వగరుస్తున్నారు. ఓవైపు సెగలుకక్కుతున్న ఎండలు, మరోవైపు విద్యుత్‌కోతతో అల్లాడిపోతున్నారు. ఎండవేడిమి ఎక్కువగా ఉండడంతో బయటకు రావడానికి భయపడుతున్నారు. రోడ్లన్నీ ఉదయం తొమ్మిది గంటల తర్వాత నిర్మూనుష్యమవుతున్నాయి. మే,జూన్ నెలలను తలపించే ఎండలతో బెంబేలెత్తిపోతున్నారు. వేడి గాలులు కూడా తోడవడంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, రోగులు, గర్భిణులు, శస్త్రచికిత్సలు చేసుకున్నవారు, బాలింతలు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అగ్నిప్రమాదాలకు గురై, చికిత్స పొందతున్న వారిక పరిస్థితి మరీ దారుణంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 37 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. రెక్కాడితే గాని డొక్కాడని భవన నిర్మాణ కార్మికులు, ఫుట్‌పాత్ వ్యాపారులు, రిక్షా కార్మికులు, కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గొడుగులు, టోపీలు ధరించకుండా బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఉపాధి కూలీలు అయితే 10 గంటలకే పనిముగించేసుకుంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో ఇప్పటికే పలువురు వడదెబ్బకు గురై మృత్యువాత పడ్డారు. శీతలపానీయాలను ఆశ్రయిస్తున్న జనం: ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు జనం శీతలపానీయాలను ఆశ్రయిస్తున్నారు. పళ్లరసాలు, కూల్‌డ్రింక్స్, కొబ్బరి బొండాలు, ఫ్రూట్ సలాడ్ వంటి వి తీసుకుంటున్నారు. దీంతో వీటి విక్రయాలు బాగా పెరిగాయి. అప్రమత్తంగా ఉండాలి ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమైయితే తప్ప బయటకు వెళ్లకూడదు. గొడుగు లేదా టోపీ, కళ్లద్దాలు ధరించి వెళ్లాలి. చర్మవ్యాధిగ్రస్తులు, పిల్లలు, వృద్ధులు ఎండలోకి వెళ్లరాదు. - బి.వెంకటేష్, పిల్లలు వైద్యుడు, కేంద్రాస్పత్రి 2012 తేదీ గరిష్టం కనిష్టం 15 33 25 16 35 27 17 37 29 18 39 30 19 36 29 2013 15 35 27 16 34 30 17 38 30 18 38 30 19 37 28 2014 15 37 28 16 37 27 17 37 29 18 36 20 19 37 29 -
వడదెబ్బ నుంచి రక్షణ ఇలా..
కడప రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో వేసవి సెగలు బుసగొడుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదు కావడంతో ఎండలు మండుతున్నాయి. ఫలితంగా ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు. వృద్దులు, పిల్లల పరిస్థితి మరీ దారుణం. వడదెబ్బ గురించి అవగాహన పెంచుకొని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్.ప్రభుదాస్ గురువారం సూచించారు. వడదెబ్బ ఎలా తగులుతుందంటే: ఎండలో ఎక్కువగా తిరిగినా, పని చేసినా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. లక్షణాలు తీవ్రమైన తలనొప్పి, తీవ్ర జ్వరం (105 డిగ్రీ నుంచి 110 డిగ్రీల వరకు) కండరాల నొప్పులు అపసార్మక స్థితిలోకి వెళ్లడం మరణం కూడా సంభవించవచ్చు ప్రథమ చికిత్స వడదెబ్బ తగిలిందనే అనుమానం కలిగిన వెంటనే ఆ వ్యక్తిని మంచి గాలి, వెలుతురు, నీడ ఉన్న ప్రదేశానికి తక్షణం తరలించాలి. దుస్తులను వదులు చేయాలి. చల్లటి గాలి తగిలేటట్లు ఏర్పాటు చూడాలి శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో తడిసిన గుడ్డతో శరీరం మొత్తం తుడుస్తూ ఉండాలి. క్రమం తప్పకుండా చల్లని నీరు తాపుతూ ఉండాలి. జాగ్రత్తలు ఎండ తీవ్రంగా ఉండే సమయంలో బయటికి వెళ్లడం గానీ, పని చేయడం గానీ చేయరాదు. వదులుగా ఉండే తెల్లటి నూలు దుస్తులను ధరించాలి. చల్లని నీరు ఎక్కువగా తీసుకోవాలి. తప్పని పరిస్థితుల్లో ఎండలో వెళ్లాల్సి వస్తే కళ్లకు కూలింగ్ అద్దాలు, తలపై టోపీ లేక గొడుగు వాడాలి. పనులు చేసేవారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో కాకుండా తక్కువగా ఉన్న సమయంలో చేసుకోవడం మంచిది. జాగ్రత్తలు తీసుకున్నా శరీర ఉష్ణోగ్రత తగ్గకుంటే తక్షణం వైద్య చికిత్స కోసం దగ్గరలోని వైద్యులను సంప్రదించాలి.