జిల్లాలో వేసవి సెగలు బుసగొడుతున్నాయి
కడప రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలో వేసవి సెగలు బుసగొడుతున్నాయి. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకు పైగా నమోదు కావడంతో ఎండలు మండుతున్నాయి. ఫలితంగా ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు. వృద్దులు, పిల్లల పరిస్థితి మరీ దారుణం. వడదెబ్బ గురించి అవగాహన పెంచుకొని ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ ఎస్.ప్రభుదాస్ గురువారం సూచించారు. వడదెబ్బ ఎలా తగులుతుందంటే: ఎండలో ఎక్కువగా తిరిగినా, పని చేసినా వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది.
లక్షణాలు
తీవ్రమైన తలనొప్పి, తీవ్ర జ్వరం (105 డిగ్రీ నుంచి 110 డిగ్రీల వరకు)
కండరాల నొప్పులు
అపసార్మక స్థితిలోకి వెళ్లడం
మరణం కూడా సంభవించవచ్చు
ప్రథమ చికిత్స
వడదెబ్బ తగిలిందనే అనుమానం కలిగిన వెంటనే ఆ వ్యక్తిని మంచి గాలి, వెలుతురు, నీడ ఉన్న ప్రదేశానికి తక్షణం తరలించాలి.
దుస్తులను వదులు చేయాలి.
చల్లటి గాలి తగిలేటట్లు ఏర్పాటు చూడాలి
శరీర ఉష్ణోగ్రతను తగ్గించేందుకు చల్లని నీటిలో తడిసిన గుడ్డతో శరీరం మొత్తం తుడుస్తూ ఉండాలి.
క్రమం తప్పకుండా చల్లని నీరు తాపుతూ ఉండాలి.
జాగ్రత్తలు
ఎండ తీవ్రంగా ఉండే సమయంలో బయటికి వెళ్లడం గానీ, పని చేయడం గానీ చేయరాదు.
వదులుగా ఉండే తెల్లటి నూలు దుస్తులను ధరించాలి.
చల్లని నీరు ఎక్కువగా తీసుకోవాలి.
తప్పని పరిస్థితుల్లో ఎండలో వెళ్లాల్సి వస్తే కళ్లకు కూలింగ్ అద్దాలు, తలపై టోపీ లేక గొడుగు వాడాలి.
పనులు చేసేవారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో కాకుండా తక్కువగా ఉన్న సమయంలో చేసుకోవడం మంచిది.
జాగ్రత్తలు తీసుకున్నా శరీర ఉష్ణోగ్రత తగ్గకుంటే తక్షణం వైద్య చికిత్స కోసం దగ్గరలోని వైద్యులను సంప్రదించాలి.