
భార్య, ఇద్దరు పిల్లలను గొంతు పిసికి చంపిన భర్త
ఉరివేసుకొని తానూ ఆత్మహత్య
విద్యుత్ శాఖ ఉద్యోగి ఘాతుకం
కలబురిగిలో ఘటన
యశవంతపుర: కుటుంబ కలహాలకు ఓ కుటుంబమే కడతేరింది. ప్రభుత్వ ఉద్యోగి తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసి, అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కలబురగి పట్టణం జీవర్గి రోడ్డులోని కెహెచ్‌బీకాలనీ అపార్ట్‌మెంట్‌లో బుధవారం జరిగింది.
సంతోష్ కోరళ్లి(45) అనే వ్యక్తికి బీదర్‌కు చెందిన శృతి(32)తో పదేళ్ల క్రితం వివాహమైంది. ఈయన జెస్కాంలో ఉద్యోగం చేస్తున్నాడు. వీరికి మునిశ్(9), మూడు నెలల అనిశ్ అనే సంతానం ఉన్నారు. శృతి పుట్టింటికి వెళ్లే విషయంలో బుధవారం దంపతుల మధ్య గొడవ జరిగింది. ఇదే విషయాన్నిసంతోష్ తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. కాగా తనను పుట్టింటికి పంపకపోతే చావో రేవో తేల్చుకుంటానని శృతి పేర్కొంది.
విచక్షణ కోల్పోయి భార్య, ఇద్దరు పిల్లలను గొంతుపిసికి హత్య చేశాడు. అనంతరం సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కలబురగి నగర కమిషనర్ డాక్టర్ శరణప్ప ఘటన స్థలాన్ని పరిశీలించారు. స్టేషన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకోని విచారణ చేస్తున్నారు. మానసిక సమస్యలతో సంతోష్ ఈ అకృత్యానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కలబురగి ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టుం నిర్వహించి కుటుంబసభ్యులకు అందజేశారు.