వేసవిలో కిచెన్‌ క్లాసెస్‌: అప్పుడే చిన్నారులు ఆహార నిర్భర్‌గా.. | Summer kitchen classes: Teach your Child About Cooking | Sakshi
Sakshi News home page

Summer kitchen classes: అప్పుడే చిన్నారులు ఆహార నిర్భర్‌గా..

Published Tue, May 6 2025 9:30 AM | Last Updated on Tue, May 6 2025 9:30 AM

Summer kitchen classes: Teach your Child About Cooking

పిల్లలకు ట్రంప్, మస్క్, జుకర్‌బర్గ్‌ ఎవరో తెలుసు. ఆవాలు, గసగసాలు, మిరియాలు కూడా తెలియాలి. అబ్బాయిలు, అమ్మాయిలు వంట గదిలోకి రాకుండా చదువుకోవాలని భావించడం మంచిదేకాని ఉప్పుకూ చక్కెరకూ తేడా తెలియకపోతే కష్టం.12 ఏళ్లు వచ్చే సరికి తల్లికి వంటలో సాయం చేయడమే కాదు వంట గది రాజ్యాంగం పిల్లలకు పరిచయం కావాలి. పదహారేళ్లకు రొట్టెలు, అన్నం, రెండు రకాలకూరలు చేయడం వస్తే పిల్లలు ఎక్కడైనా ఆహార నిర్భర్‌గా ఉండగలరు.

ఈ వేసవిలో కిచెన్‌ క్లాసెస్‌ మొదలుపెట్టండి. ‘కన్నా... ఫ్రిజ్‌లో నుంచి ఎగ్స్‌ తీసుకురా’ అన్నప్పటి నుంచి పాఠం మొదలవుతుంది. ఎగ్స్‌ను ఫ్రిజ్‌ నుంచి తెచ్చి పగలకుండా కిచెన్‌ ఫ్లాట్‌ఫామ్‌ మీద పెడితే పరీక్ష పాసైనట్టే. ‘రవ్వ ఏ డబ్బాలో ఉందో చూడు’ అన్నప్పుడు చిన్న స్టూల్‌ వేసుకుని కప్‌బోర్డ్‌ తెరిచి అన్ని డబ్బాలు పరీక్షించాల్సిందే. ఒకదానిలో తెల్లగా పొడి ఉంటుంది. 

అది గోధుమ పిండి. ఒకదానిలో లేత పసుపురంగు పొడి ఉంటుంది. అది శనగపిండి. ఒకటి తెరవగానే అమ్మో.. అది కారప్పొడి. చివరకు రవ్వ దొరుకుతుంది. బరకగా ఉండే ఆ రవ్వతో ఏం చేస్తారో పిల్లలకు తెలుసు. ఎలా చేయాలో తెలియాలంటే ఈ వేసవిలో అప్పుడప్పుడు కిచెన్‌లో గడపనివ్వండి.

‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నారు ఎన్ని ర్యాంకులు తెచ్చినా డొనేషన్‌ లేని సీట్లు తెచ్చినా క్యాంపస్‌ సెలక్షన్‌ భారీ జీతానికి కుదిరినా అంతిమంగా తినాల్సింది అన్నమే. అది వండుకోవడం రావాలి ఫస్టు. ఎసట్లో అన్నం వండటానికి ఓపిక లేనప్పుడు రైస్‌ కుక్కర్‌లో ఎంత బియ్యం, ఎన్ని నీళ్లతో ఎలా పెట్టాలో తెలిస్తే చాలు జీవితాంతం సగం చింత తీరినట్టే. మిగిలిన సగం.. బయట నుంచి కర్రీ తెచ్చుకోవచ్చుగా.  

పెద్దలు ఏం చెబుతారంటే రెండు కూరలు చేయడం నేర్చుకుంటే చాలు నిశ్చింతగా బతకొచ్చు అని. నిజం. వంట తెలిసిన వారు ఆకలైతే ఇంట్లో ఉంటారు. లేదంటే బజార్లో పడతారు. బజారు తిండి తింటారు. వంట కూడా ఒక శాస్త్రమా? అవును వంటంతా మేథమెటిక్సే. ఎన్ని గ్లాసుల బియ్యం, ఎన్ని చెమ్చాల నూనె, ఎంతమందికి ఎన్ని వంకాయలు కోయాలి, ఎన్ని బెండకాయలు సిద్ధం చేసుకోవాలి, ఎన్ని పదార్థాలు వండితే కడుపు నిండుతుంది... లెక్కలే లెక్కలు. ‘ఉప్పు తగినంత’... అనే మాట ‘పై’ను డిఫైన్‌ చేయడంతో సమానం. ‘తగినంత ఉప్పు’ వేయడం తెలిస్తే మొత్తం గణితాన్ని జయించినట్టే.

వంట చేయడం పిల్లలకు నేర్పిస్తే వంట వారికి ఓర్పు నేర్పిస్తుంది. వైనం నేర్పిస్తుంది. వొండిన వంట ఎంత కష్టపడితే తినడానికి రెడీ అవుతుందో తెలిసి అన్నం, కూరలు వృధా చేయరు. ఎదుటివారు వండిన దానికి వంకలు పట్టరు. వంటలో బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్సు ఉంటాయి. నిలువు కోతలు, అడ్డుకోతలు తెలుస్తాయి. విడగొట్టి కలపడమూ అందుకు కేటలిస్టులను వాడడమూ తెలుస్తుంది. వంట ఏకాగ్రతను నేర్పిస్తుంది. మంట హై ఎప్పుడు పెట్టాలి, లో ఎప్పుడు పెట్టాలి... ఇవి తెలిస్తే నిజ జీవితంలో ఉద్వేగాలు కూడా హై, లో తెలుస్తాయి. 

పిల్లలు వంట నేర్చే సమయంలో పెద్దలు కచ్చితంగా ఉండాలి. వారు చేస్తూ ఉండగా మాటసాయం అందిస్తూ ఉండాలి. వంట చేస్తూ కబుర్లాడుకుంటే పిల్లల గురించి పెద్దలకు పెద్దల గురించి పిల్లలకు తెలుస్తుంది. బంధంలో రుచి వస్తుంది. జీవితం రుచి తెలుస్తుంది. వేసవి సెలవులు వచ్చేది పిల్లల అరుపులు, కేరింతలకే కాదు... వారి చేతి గరిట చప్పుళ్ల కోసం కూడా. నలబాలపాకం ఇవాళ రెడీ చేసుకుని తినండి.
– కె 

(చదవండి: World Asthma Day: శ్వాసకు ఊపిరి పోద్దాం..! ఆస్తమాను అదుపులో ఉంచుదాం..!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement