
అప్రమత్తతే శ్రీరామరక్ష
మొదలైన వేసవి కాలం చంటి పిల్లలతో జాగ్రత్త
వేసవి కాలం ప్రారంభమైతే చాలు చికెన్ ఫాక్స్(ఆటలమ్మ), గవద బిళ్లలు వంటి సమస్య పిల్లల్లో అధికంగా కనిపిస్తాయి. ప్రస్తుతం పలు గ్రామాల్లో ఈ సమస్యలతో చిన్నపిల్లలు బాధపడుతున్నారు. చాలా మంది తమ పిల్లల్ని ఆస్పత్రులకు తీసుకువస్తుంటే.. కొంతమంది పూర్వకాలం పద్ధతుల్లో నాటు వైద్యం చేయిస్తున్నారు. అన్ని వయసుల వారికి ఈ వ్యాధులు సోకే అవకాశం ఉన్నా చిన్నారులకు త్వరగా సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ వ్యాధుల బారిన పడిన వారికి జలుబు, జ్వరం, శరీరంపై పొక్కులు, దవడలకు ఇరువైపులా బిళ్లలు, నొప్పి వంటి సమస్యలు తీవ్రంగా బాధిస్తాయి. ముందు జాగ్రత్తతోనే ఈ ప్రమాదకర అంటువ్యాధుల బారిన పడకుండా ఉండవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు, 15 ఏళ్లలోపు బాలబాలికలపై మరింత శ్రద్ధ వహించాలంటున్నారు.
జాగ్రత్త వహించాలి
రామచంద్రపురం నియోజకవర్గంలోని ఐదేళ్లలోపు చిన్నారులు కాజులూరు మండలంలో 3887 మంది, కె.గంగవరం మండలంలో 4922 మంది, రామచంద్రపురం మండలంలో 3890 మంది మొత్తం 12,699 మంది చిన్నారులు ఉన్నారు. ఈ వేసవిలో వారిపట్ల మరింత శ్రద్ధ చూపాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్యలు ఎక్కువగా వస్తాయని అంటున్నారు. ఈ వ్యాధులు ప్రాణాంతకం కాకపోయినా వ్యాధి సోకిన వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. ఆకలి లేకపోవడంతో ఆహారం సరిగ్గా తీసుకోలేక బాగా నీరసించిపోతారు. చర్మంపై నీటి పొక్కులు, దురదలు వంటి లక్షణాలు వారం నుంచి పదిహేను రోజులకు పైగా బాధిస్తాయి. తొలుత జలుబుతో ప్రారంభమయ్యే ఈ వ్యాధులు క్రమంగా వాటి ప్రభావం చూపుతాయి. శరీరంపై నీటి పొక్కులు, జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే ఆటలమ్మగా గుర్తించి తక్షణం వైద్యులను సంప్రదించాలి. నాటు వైద్యం వైపు వెళ్లరాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి యాంటీ వైరల్, యాంటీ బయాటిక్ మందులు వాడాల్సి ఉంటుంది. తద్వారా వ్యాధి తీవ్రతను తగ్గించడమే కాకుండా, వేగంగా నయం కావడానికి అవకాశం ఉంటుంది.
ఆటలమ్మ... జాగ్రత్తలు
సాధారణంగా ఈ వ్యాధి వారం నుంచి పది రోజుల వరకు ఉంటుంది. ఆటలమ్మ అంటువ్యాధి కావడం వల్ల వ్యాధి సోకిన వారిని మిగిలిన వారికి దూరంగా ఉంచాలి. వ్యాధి సోకిన పిల్లలను పాఠశాలకు పంపకూడదు. ప్రతి రోజూ స్నానం చేయవచ్చు. జ్వరం ఉంటే వేడి నీటితో శరీరాన్ని శుభ్రం చేయాలి. దురద రాకుండా పరిశుభ్రత పాటించాలి. చిన్నారులకు చేతి గోళ్లు తీసివేయడం మంచిది. మంచి పౌష్టికాహారం అందించాలి. ఆటలమ్మ వచ్చిన వారు కోరినవన్నీ ఇవ్వాలన్న అపోహతో అన్ని రకాల తినుబండారాలను ఇవ్వడం మంచిది కాదు. తేలికగా జీర్ణమయ్యే మంచి పౌష్టికాహారాన్ని అందించాలి.
గవదబిళ్లలు... జాగ్రత్తలు
గవదబిళ్లల వ్యాధిలో తీవ్రంగా గొంతునొప్పి ఉంటుంది. నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. తరచూ ద్రవ పదార్థాలను ఆహారంగా తీసుకోవాలి. నీరసం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. శరీరంలో ద్రవాల శాతం తగ్గుతుంది. కాబట్టి ఓఆర్‌ఎస్ వంటివి తీసుకోవడం మంచిది.
నాటువైద్యం ప్రమాదకరం
చికెన్‌పాక్స్, గవద బిళ్లలు వచ్చిన వారి విషయంలో ప్రజలు అపోహలు, మూఢనమ్మకాలు పెట్టుకోకుండా వైద్యులను సంప్రదించాలి. చాలామంది మూఢనమ్మకాలతో వైద్య సహాయం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు. వైద్యుని సలహా తీసుకుని అవసరమైన మందులకు క్రమం తప్పకుండా వాడాలి. వ్యాధి ఎక్కువగా ఉంటే మెదడు, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. గర్భిణులపై ఈ సమస్య తీవ్ర ప్రభావం చూపుతుంది. నాటువైద్యాన్ని ఆశ్రయిస్తే ప్రమాదానికి దారి తీస్తుంది.
వైద్యులను సంప్రదించాలి
అటలమ్మ, గవద బిళ్లలు వంటి వ్యాధులను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. ప్రస్తుతం చిన్న పిల్లలు ఎక్కువగా ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే అందుబాటులో వైద్యులను సంప్రదించాలి. వారి సూచనల మేరకు మందులు వాడాలి.
– ఎన్.ప్రశాంతి, డివిజనల్ వైద్యాధికారి, రామచంద్రపురం
Comments
Please login to add a commentAdd a comment